Wednesday, June 8, 2011

రాష్ట్రం విడిపోతే ఏమి నష్టం?

రాష్ట్రం విడిపోకూడదని వాదిస్తూ గత టపాలో వచ్చిన ఒక వ్యాఖ్య దానికి నా సమాధానం. అందరూ చదువుకోవడానికి వీలుగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.


Anonymous said...
శ్రీకాంత్‌గారూ (ఇది మీ అసలుపేరు అవునో కాదో తెలియదు,. కాకపోతే మన్నించండి) నేను ఇక్కడ మొదట వ్యాఖ్య వ్రాసిన అనానిమస్‌ని ! మీతో వాదించడం కొరకు నేనిది వ్రాయడం లేదు, నా మనసులో మాట చెబుదామని వ్రాస్తున్నానంతే.

మీరు చెప్పిన అంతర్జాతీయ న్యాయసూత్రాలు బావున్నాయి. కానీ రాజధాని నగరం నెలకొని ఉన్న ప్రాంతం వాళ్ళు విడిపోతామనడం ఇప్పటి వఱకు చరిత్రలో ఎప్పుడూ ఏ దేశంలోనూ జఱగని ఒక అపూర్వ, అద్భుత అరుదైన విషయం. ఈ విడ్డూరపు సిచ్యువేషన్ ని ఆ అంతర్జాతీయ న్యాయసూత్రాల రూపకర్తలే ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టి అందుచేత అవి మన కేసుకు వర్తించవు.

ఇహపోతే ఇండియా - చైనా అంటున్నారు. మన మధ్య అంత తేడాలుంటే తప్పకుండా విడిపోవాల్సిందే. కానీ మనం ఒకే భాష, ఒకే మతం ఒకే కులాలూ, ఒకే రకమైన గోత్రాలూ గల అన్నదమ్ములం. కనీసం ఇరుగుపొరుగు జిల్లాలవాళ్ళం. ఒక రెండుగంటలు ప్రయాణం చేస్తే ఇటు హైదరాబాదో, అటు విజయవాడో చేరుకునేంత దగ్గరివాళ్ళం. మనం ఉండాల్సినంత పోలికతో లేని మాట నిజమే, కానీ విడిపోవాల్సినంత లేదా కొట్టుకుచావాల్సినంత తేడాలు కూడా మన మధ్య ఏమీ లేవు. తెలంగాణ సమస్యలు సమైక్యరాష్టంలో పరిష్కరించడం నిండా సాధ్యమే అని నమ్మేవాళ్ళల్లో నేనొకణ్ణి. అందుచేత ఒకవేళ మనం విడిపోతే మనకేమీ అనిపించకపోవచ్చు గానీ నాన్-తెలుగు జనానికి అదొక భేదించలేని చారిత్రిక మిస్టరీ అయి కూర్చుంటుంది.

మరోపక్క తెలుగువాళ్ళం బలహీనులం అనేక రకాలుగా ! హిందీ తతిమ్మా పెద్ద జాతులకున్నంత వసతీ, భూమీ, జనాభా, బలం మనకు లేవు. మన నాయకులు దేశంలో అందరికంటే వరస్ట్. బలహీనులకు కొట్టుకు చచ్చే హక్కు ఆటోమేటిగ్గా రద్దవుతుంది. మనకంత లగ్జరీ లేదేమో ననిపిస్తోంది. తెలంగాణవాదులు అర్థం చేసుకోగలిగితే - వాస్తవానికి మనం ఇతర రాష్ట్రాల చేతుల్లో అడుగడుగునా దోపిడికి గుఱవుతున్నాం. మనం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతరులతో హోరాహోరీ పోరాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం.
హైదరాబాదులో కొంత అభివృద్ధి జరగి ఉండొచ్చు. కాని అది అన్ని ప్రధాన నగరాల్లో ఎట్ల జరిగిందో ఇక్కడ కూడ అట్లనే జరిగింది. హైదరాబాదు మొదటినుండీ దేశంల అయిదో పెద్ద నగరమే అన్నది మరువకండి.

హైదరాబాదుకు సమైక్య రాష్ట్ర్మ్ పెట్టిండేం లేదు. పైగా సమైక్య రాష్ట్రాన్నికి హైదరాబాదే మొదటినుంచీ ఇంతో అంతో పెడుతుంది. హైదరాబాదు రెవెన్యూని రాష్ట్రం వాడుకుందే తప్ప రాష్ట్రం రెవెన్యూని హైదరాబాదు ఎప్పుడూ వాడలేదు. అందులో కూడ హైదరాబాదు వళ్ళ ఎక్కువ లాభ పడింది ఆంధ్ర ప్రాంతమే. అయితే ఇప్పటిదాకా జరిగింది కాబట్టి కలకాలం ఇలాగే సాగాలంటే కుదరదు.

పోనీ మీమాట ప్రకారం హైదరాబాదు ఒక్కటే మీరు వ్యతిరేకతకు కారణమనుకుంటె అదే విషయం మీ మేధావులు, నాయకులు నిజాయితీగ చెప్పితె బాగుంటది. అప్పుడు దానికి ఒక సహేతుకమైన పరిష్కారం లభించొచ్చు.

ఈ రాష్ట్రం ఒక ఒప్పందం మేరకు ఏర్పరచబడ్డది. ఆ ఒప్పందం సరిగ్గ అమలు జరుపాలని మా తెలంగాణా వాల్లం గత 55 ఏళ్ళల్లో అనేక సార్లు రక రకాల రూపాల్లో ఉద్యమాలు చేసినం. ఫలితంగా రకరాకాల GOలు వచ్చినై. కానీ ఏవీ అమలుకు నోచలేదు. పైగా మరిన్ని విషయల్లో తెలంగాణాపై వంచన కొనసాగుతనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ సమస్యకు సమైక్యాంధ్రల పరిష్కారం లభించడం కల్ల. విభజనే దీనికి కలిగిన ఏకైక పరిష్కారం.

మనం విడిపోవడం వల్ల భూమి, ఆకాశం ఏకం కావు. మీ ఆంధ్రులు మాకంటే తెలివైన వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతది. మీ ప్రాంతంల ఒక గొప్ప రాజధాని ఏర్పడుతది. మీవాళ్ళు చెప్పుకుంటున్నట్టు తెలంగాణా అబివృద్ధి కోసం మీరు త్యాగాలు చెయ్య నవసరం లే.

ఇంక పోతే మా అవసరాలేంటివో, మా ప్రాధాన్యత లేంటివో మీకన్నా మాకు బాగా తెలుసు. మా పాంతాన్ని మేం బాగు చేసుకుంటమనే విశ్వాసం మాకుంది. కాబట్టి కలసి కలహించుకునే కన్నా విడిపోయి ఇద్దరం సుఖంగా ఉందాం.

రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన సంబంధాలు, బాంధవ్యాలు మారి పోవు. అవి కొనసాగుతనే ఉంటయి. ఇప్పుడు కూడ ఉత్తర తెలంగాణ వారికి మహారాష్ట్ర తోటి, అనంతపూర్ వాళ్ళకు కర్నాటక తోటి, చిత్తూరు వాళ్ళకు తమిళనాడు తోటి, ఉత్తరాంధ్ర వాళ్ళకు ఒరిస్సా తోటి సంబంధాలున్నయి. రేపు కూడ అట్లనే ఉంటయి. రాష్ట్రాల ఏర్పాటు సంబంధ బాంధవ్యాలకు అడ్డు కాదు.

విడిపోతే మనం బలహీనమయితం అన్నది పసలేని వాదన. విడిపోతే మనకు ఇద్దరు CMలు ఉంటరు. ఇద్దరిల కనీసం ఒక్కరైనా కేంద్రంల అధికార పార్టీల ఉంటరు. ఆ విధంగ తెలుగు జాతికి అంతొ ఇంతొ మేలే జరుగుతది. ఇప్పుడు కలిసి ఉండి కూడా రెండు మార్లు కేంద్రంల అధికారంల ఉన్న పార్టీని 33 సీట్లిచ్చి గెలిపించి కూడ మనకు ఏం ఒరిగిందో తెల్వనిది కాదు.

చివరిగా ఇంకో విషయం. జరుగబొయే ఊహాజనిత భయాల గురించి మీరు వాదిస్తున్నరు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి మేం మాట్లాడుతున్నం. తేడా గ్రహించండి.

No comments:

Post a Comment