Wednesday, June 22, 2011

వంటావార్పు, నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు


హైదరాబాదుల వంటావార్పు కార్యక్రమం గొప్పగ విజయవంతం అయ్యింది. ఆడ, మగ, పిల్లలు అని తేడా లేకుండా హైదరాబాదు జనం బయటికి వచ్చి హైదరాబాదు మాది అని చాటి చెప్పిన్రు. పోద్దటి నించి గుమి గూడిన ప్రజలు సాయంత్రం వరకు రోడ్లమీడనే ఉన్నరు. ఆడుకున్నారు, పాడుకున్నరు, ముచ్చట్లు చెప్పుకున్నారు, వంటలు చేసుకున్నరు, తిన్నరు. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందంటే ఎప్పుడూ నొసటితో వెక్కిరించే సీమాంధ్ర మీడియా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయిన తీరుపై ఏమీ మాట్లాడలేక పొయ్యింది.


వంటావార్పు కార్యక్రమం రూపొందించేటప్పుడు తెలంగాణా JAC బాగనే కసరత్ జేసింది. ఈ సారి పోలీసులను పర్మీషన్లు అడుగలేదు. వాళ్ళు ఇయ్యలేదు. కాబట్టి ఉభయతారకంగా ఇది ఎవరికీ ఇబ్బంది లేకుంట జరిగింది. ఇదివరకు ప్రతి సారి ఉద్యమకారులు ముందుగ పర్మిషన్లు అడుగుడు, వాళ్ళు ఇవ్వకపోవుడు మామూలై పొయ్యింది. పర్మిషన్ లేకుండ కార్యక్రమం జేస్తే 'మేం పర్మిషన్ ఇయ్యలేదు గద' అనుకుంట లాఠీచార్జీలు జేసుడు. ఇప్పుడు గియ్యన్ని ఏమీ లేవు. పోలీసులు వచ్చిన్రు, పక్కకు నిలబడిన్రు. మేం ఇచ్చిన టిఫిన్లు కాఫీలు తాగిన్రు. కాబట్టి ఇంకముందు  ఉద్యమంల భాగంగ ఏ కార్యక్రమం జేసినా పర్మిషన్లు అడుగుడు బంద్. 

ఈసారి జరిగిన కార్యక్రమంల చాలా ప్రత్యేకతలు ఉన్నయ్. తెలంగాణా వాళ్ళతోటి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన హైదరాబాదీలు కూడ సంతోషంగ వంటావార్పుల పాల్గొన్నరు. మనకు సంఘీభావం తెల్పిన్రు.


అంతేగాదు ఈకార్యక్రమంల ఆబాల గోపాలంగా పిల్లా పాపలతోటి కుటుంబాలు కుటుంబాలే బయటికి వచ్చినై. ఆడవాళ్ళు, పిల్లలు, కేరింతల తోటి హైదరాబాదు మొత్తం కళకళ లాడింది. వీళ్ళని చూస్తుంటే తెలంగాణా మొత్తం గొప్ప, పేద అని అభిజాత్యాలు వదిలి రాష్ట్రం కోసం రోడ్లమీడికి వచ్చే రోజు ఎంతోదూరంల లేదు అని అనిపించింది.

హైటెక్ సిటీ కార్యక్రమానికి సినీనటుడు సుమన్ రావడం అందరినీ ఆకర్షించింది. ఆయన వచ్చి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బహిరంగంగా సంఘీభావం తెలిపిన్రు. తానూ ఎన్నో ప్రాంతాలు తిరిగిన్నని, తెలంగాణాను మించిన ప్రాంతం కందపదలేదని అందుకే ఇక్కడే స్థిరపడ్డనని చెప్పిండు. తనను ఇక్కడ ఉంటున్నందుకు ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదని, రేపు తెలంగాణా వచ్చినంక గూడ ఇక్కడనే ఉంటానని చెప్పిండు. ఆయనకు తెలంగాణా ఉద్యమ వందనాలు.


వంటావార్పూ కార్యక్రమం విజయవంతం కావడం తో ఉద్యమకారులు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. డబ్బులు కుమ్మరించి నిముషాల మీద విధ్వంసం సృష్టించే సమైక్యాంద్ర వంటి బూటకపు ఉద్యమాలు మనకొద్దు. మనకు ప్రజాబలం ఉంది. ప్రజలను ఎక్కువగా ఉద్యమాలలో మమేకం చేద్దాం. ప్రశాంతంగ, పటిష్టంగ మన నిరసనలు తెలుపుదాం. తెలంగాణా రాష్ట్రం దానంతట అదే వచ్చి తీరుతది.   

1 comment:

  1. హింసాయుతం కాకుండా సాగినందుకు మెచ్చుకోవలె......

    ReplyDelete