Wednesday, May 23, 2012

చీలకుండా అడ్డు



హత్యకేసులో నిందితుడు
జైలుకెళ్ళకుండా
నిద్రాహారాలు మాని
నిరంతర కృషి చేసి
స్పీకరు కుర్చీ సాధించిన వ్యక్తి

నేడు ముఖ్యమంత్రి కాగానే
అదే వ్యక్తి
తెరాసతో కుమ్మక్కై
రాష్ట్రాన్ని చీలుస్తున్న
భావన కలిగింది
ఎంతైనా కుర్చీ మహిమ!

తెలంగాణా గడ్డపై
నిలుచున్నప్పుడు
తటస్థ రాగాలు తీస్తూ
అంతా అమ్మ చేతిలో వుంది
నేను నిమిత్తమాత్రున్ని
విభజనకు వ్యతిరేకిని కాదు
అంటూ ఇకిలిస్తూ
మాట్లాడే ఈయనకు

ఆంధ్రాకు వెళ్ళగానే
ఎవరో రాష్ట్రాన్ని
కావాలని చీల్చినట్టు
కనిపిస్తుంది
చీలకుండా తాను
అడ్డుపడుతున్నట్టు
చెప్పుకోవాలనిపిస్తుంది!



Tuesday, May 22, 2012

పరకాలలో బిజెపి, టీఅర్ఎస్ ల పోటీ ఎటు దారి తీస్తుంది?




ఇప్పటి వరకు తెలంగాణా పోరాటం విషయంలో ఏకైక పోటీదారుగా వున్న టీఅర్ఎస్‌కు ఇప్పుడు బిజేపీ రూపంలో పోటీ ఎదురైంది.

గతంలో తాము కూడా తెలంగాణాకోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణా ప్రాంత తిడిపి, కాంగ్రెసు పార్టీ నాయకులు అనేక మార్లు ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా తమ తమ సీమాంధ్ర నాయకులపై గల భక్తిని చాటుకుంటూ, యధాశక్తి ఉద్యమానికి ద్రోహం చేసిన కారణంగా, ప్రజలకు వారిపై నమ్మకం పూర్తిగా సమసి పోయింది. అటువంటి తరుణంలో టీఅర్ఎస్ పార్టీ ఎన్నికల పోరాటాలలో దిగ్విజయంగా గెలుస్తూ వస్తుంది.

కాని ఎన్నికల్లో జయకేతనాలు ఎగరేసిన ప్రతిసారీ, ఉద్యమం పట్ల నిర్లిప్తత వహించి పార్టీ అభివృద్ధి పట్ల మాత్రమే దృష్టి సారించడం తీఅర్ఎస్ పార్టీకి మొదటినుండీ వున్న అవలక్షణం. అదే విధానాన్ని మరోసారి కొనసాగిస్తూ తన మార్కు రాజకీయాలలో తలమునకలై వున్న కేసీఆర్‌కు, మహబూబ్‌నగర్ ఓటమి ఒక హెచ్చరికగా మారింది.

ఆ ఓటమి నుండి కోలుకోక ముందే పరకాల రూపంలో మరో ఎన్నిక వచ్చి పడింది. ఈ ఎన్నికలో కూడా బిజెపి పోటీ చేస్తానని ప్రకటించడంతో కెసియార్ గంగవెర్రులెత్తాడు. బిజెపీపై, దానితో పాటు జెయేసీ పై కూడా దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టాడు.

కాని ఇక్కడ కేసియార్ కొన్ని నిజాలు తెలుసుకోవడం మంచిది. ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రతిసారీ ఆయన అది తన గొప్పదనమో లేక తన పార్టీ బలుపో అని భావించడం మాని వేయాలి. అది తన ఉద్యమ నిబద్ధతకు ప్రజలిచ్చిన గుర్తింపుగా భావించి మరింత నిబద్ధతతో ఉద్యమ నిర్మాణానికి పునరంకితం కావాలి. కాని గత పదేళ్ళ టీఆరెస్ చరిత్ర చూసిన వారికి మాత్రం ఎప్పుడూ అలా జరిగినట్టు కనిపించదు.

తమ తెలంగాణా వ్యతిరేక ప్రవ్రృత్తిని చాటుకున్న TDP కాంగ్రెస్‌లను మట్టి కరిపించిన తెలంగాణా ప్రజలు, తెలంగాణా ఉద్యమాన్ని పక్కకు పెట్టి పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలితే, TRSకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పగలరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మహబూబ్‌నగర్ ఎన్నిక.

కాబట్టి ఇప్పటికైనా KCR బిజెపి పైనా, JAC పైనా అలగడం మానివేసి, ఉద్యమం మీద దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఉద్యమంతొ ఎంత మమేకం చెందితే, అన్ని సీట్లు వాటంతట అవే వస్తాయి. ఈ విషయం ఆయన ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

అభివృద్ధిని కోరుతున్రట!




తెలంగాణా ప్రజలు
అభివృద్ధిని కోరుతున్రట!

నిజమే!

కిరణ్ నిజమే చెప్తుండు!!

తెలంగాణా ప్రజలు అభివృద్ధినే కోరుతున్రు!

కానీ,

తెలంగాణా ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది మరి!

రాజశేఖర్రెడ్డి
చంద్రబాబు నాయుడు
కిరణ్ కుమార్రెడ్డి
జగన్మొహన్రెడ్డి

వీళ్ళు అభివృద్ధి చేస్తరంటే
రాబందులు కూడా
సిగ్గు పడుతయని!

Friday, May 18, 2012

వాడే మన శత్రువు




వాడు
భూసంస్కరణలను అడ్డుకున్నడు
పేదోళ్ళ భూముమలను ఆక్రమించిండు

ప్రాజెక్టుల నీళ్ళను కొల్లగొట్టి
పెత్తందారు వేషం కట్టిండు

వాడు
కాంట్రాక్టరైండు
ఎమ్మేల్యే అయిండు
ఎంపీ అయిండు

వానికి
నీ, నా తేడా లేదు

వానికి
నీ సొంపేటా, వాన్‌పిక్
నా బయ్యారం, లాంకో హిల్స్
రెండూ ఒకటే
కబళించే పులికి కబళం మాదిరి

కానీ...
మనిద్దరికీ
తేడా ఒకటే

నువ్వు వాని
కొమ్ము కాస్తున్నవు
నేను వాని
దుమ్ము లేపుతున్నను

నేను వానిపై
చేస్తున్న పోరాటాన్ని
మనిద్దరి కొట్లాటగ మార్చి...
వాడు
చోద్యం చూస్తున్నడు!!
 
  

Tuesday, May 1, 2012

పుస్తకాల బూజు దులిపి చరిత్ర తిరగేస్తున్నారు



తమ దోపిడీ భాగోతాలు తెలంగాణా ప్రజలు తెలుసుకొని ఒక్కొక్క ఎన్నికల్లో తమని మట్టి కరిపిస్తూ వుంటే, సమెక్కుడు వాదులకు దిక్కు తోచడం లేదు. పక్కవాడి ముద్ద లాగితే గాని ముద్దదిగని దద్దమ్మలకు ఇది నిజంగా ఘోరమైన విషయమే.

అందుకే పుస్తకాల బూజు దులిపి చరిత్ర తిరగేస్తున్నారు. ఇక్ష్వాకుల కాలం నాటి చరిత్రలు ఇప్పుడు వల్లె వేస్తున్నారు. 

ఇంతకీ వీరు చెప్పే విషయం... మనమంతా తెలుగు వాళ్ళమే. ఆ.. కాదు కాదు, మనమంతా తెలంగాణా వాళ్ళమే. ఎప్పుడో తెలివాహ నది తీరాన జనాలు నివసించారు. వారే తెలంగాణా వారు. వారు తర్వాత్తర్వాత రాష్ట్రమంతా విస్తరించారు. తెలివాహ నది పేరు తెలంగాణాగా మారింది. కాబట్టి మనమంతా తెలంగాణా వారమే. మొదట మీ తెలంగాణాలో వున్నాం కాబట్టి మేం తెలంగాణా వారిమే. కాబట్టి మనమంతా కలిసే ఉందాం. ఇదీ వీరి వరస.

ప్రపంచ చరిత్రలో భాగంగా మారి పలు ఇతర దేశాల్లో కూడా అధ్యయనం చేయబడ్డ తెలంగాణా సాయుధ పోరాటం తో సహా తెలంగాణాకి సంబంధించిన ఏ చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసిన శక్తులే నేడు సిగ్గు లేకుండా  మీరు, మేం ఒకటే నంటూ చరిత్ర పాఠాలు వల్లె వేస్తున్నాయి!

తాము ఎదురు లేకుండా రాజ్యాధికారం చేసిన నాడు 'తెలంగాణా' అన్న పదమే బూతు పదంగా మార్చి, అసెంబ్లీతో సహా ఎక్కడా వినపడకుండా చేసిన ఘనులకు, ఈరోజు తాము కూడా తెలంగాణా వారిమేనన్న జ్ఞానోదయం కలుగుతున్నదట! విడ్డూరంగా లేదూ?

ఓ సమైక్యవాదీ! నీ మాటలు వింటుంటే నీకు తెలంగాణా ప్రజల ఆత్మ గురించి ఏమాత్రం తెలిసినట్టు లేదని అర్థమౌతుంది.

నువ్వు తెలంగాణా ప్రజల మనస్సు గెలుచుకోవాలంటే తెలంగాణా వాన్నని చెప్పుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆర్తిగా చేయి చాచి మైత్రి కోరేవారిని ఏ ప్రాంతం వారినైనా ఆదరించే నేల ఇది. అది ఆంధ్రా వారే కావచ్చు, ఇతర ప్రాంతాల వారే కావచ్చు. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే నని నువ్వు ఆడిన దొంగ నాటకమే నువ్వు ఈ రోజు చీకొట్టబడడానికి ముఖ్య కారణం. నువ్వు ఎన్నటికీ మాలో ఒకడివి కాలేవు. 

నీలాంటి సమెక్కుడు బుద్ధులు లేని నీ వాళ్ళు ఎప్పుడో మాతో మమేకమై మా ప్రాంతంలో నివసిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని మనసారా ఆకాంక్షిస్తున్నారు. నువ్వు మాత్రం మమ్మల్ని ఇంకా మా జాతిని నీ బానిసలుగా కొనసాగించాలని విశ్వప్రయత్నాలు చేస్తూ నీ దోపిడీ బుద్ధులు బయటపెట్టు కుంటున్నావు.

చివరగా నీకు చెప్పదలచు కొన్నది ఇదీ. యాభయ్యేళ్లుగా నువ్వు మోసాలతో తూట్లు పొడిచిన బంధం ఇప్పుడు నీ పై పై మోసపు మాటలతో గట్టి పడుతుందని భావించడం కేవలం నీ భ్రమ. ఇకపై నీదారి నీది, నాదారి నాది.