Monday, November 28, 2011

పరకాలకు హక్కులు కావలెను


అయ్యా! పరకాల గారి హక్కులకు భంగం కలిగిందట!

కాదు కాదు, పరకాల గారి హక్కులకు తెలంగాణావాదులు భంగం కలిగిస్తున్నారట!

మీటింగులు పెట్టుకోవడానికి వారికి అనుమతులు రాకపోతే మేమేం చేయాలి అంటారా? అలా అంటే ఎలాగండీ? నిజాం కాలేజీలో జనం ఆకాంక్షలకు మద్దతు పలుకుతూ మీటింగు పెట్టుకోవడానికి సాక్షాత్తూ దేశ ప్రతిపక్ష నాయకురాలికే హక్కు లేకపోవచ్చు గాక. అలాంటి హక్కు ఉందొ లేదో తేల్చుకోవడానికి కోర్టు గడప ఎక్కవలసి రావొచ్చుగాక!

రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులూ అనుమతులివ్వక పోతే మాత్రం ఏమిటి? జనం కోరుకోక పోతే మాత్రం ఏమిటి? తెలంగాణా వాదులు వారిని ఊరూరా ఊరేగించి తీసుకెళ్ళి షామియానాలు వేసి, రంగస్థలాలు కట్టి వారి సభలు నిర్వహించొద్దూ? లేకపోతే తెలంగాణా వాదానికే అది మాయనిమచ్చ కాదూ?

ఏం? గతంలో వారు చిరుజీవికి నీడలా వేళ్ళాడుతూ "సామాజిక తెలంగాణా ఏర్పాటే నా ధ్యేయం" అంటూ బాకా ఊది చెపుతుంటే వీనులవిందుగా విన్నది మీరు కాదూ? ఇప్పుడెందుకు ఆయన మీటింగులు వినడానికి మీకు అభ్యంతరం?

కాబట్టి మీరు వెంటనే మీమీ వూళ్ళల్లో వారి సభలు ఏర్పాటు చేసి, కాలో చెయ్యో పట్టుకుని ప్రజల్ని పోగేయ్యండి. ఆ తర్వాత పరకాల గారిని సాదరంగా వాహనం ఎక్కించి సదరు సభాస్థలానికి భద్రంగా చేరవేయుడి.

అక్కడ వారు తదేక దీక్షతో తెలంగాణా వైతాళికులని, తెలంగాణా వాదులని మోసగాళ్ళు, అబద్ధాల కోర్లు, పుండాకోర్లు అంటూ దీవెనలు మొదలు పెట్టెదరు. అయినా ఎవ్వరూ కిక్కురుమనొద్దు. ఎవడో తెలియని కుర్ర సన్నాసులు వారి మాటల్లోని అంతరార్ధం గ్రహించలేక ఏ చెప్పో, బూటో విసిరినా, మీ తెలంగాణా వాదులంతా మానవ వలయంగా ఏర్పడి వారి హక్కులకు రక్షణ కల్పించవలెను. లేకపోతే ఇంకేమైనా ఉందా? తెలంగాణా వాదం భ్రష్టుపట్టి పోదూ?

అప్పుడు వారు నిర్విఘ్నంగా తమ ప్రసంగాన్ని ముగించెదరు. "చూశారా ఎనభై శాతం మంది సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు. చూశారుగా నా సమావేశం ఆసాంతం ఎంత చక్కగా విన్నారో?" అని చిద్విలాసంతో సింహనాదం చేసెదరు. విని కేవలం తలకాయలు మాత్రమే ఊపండి. ఎనభైశాతం ఆయన మద్దతుదారుల మధ్యనుండి ఆయనకు రక్షణ వలయం కల్పిస్తూ తిరిగి రాజధానికి తీసుకురండి.

ఇదంతా మాకెందుకంటారా? అబ్బే! మీరు నిఖార్సైన తెలంగాణా వాదులమని నిరూపించు కోవాలంటే ఆమాత్రం కష్టపడాలి గదండీ. ఆయన హక్కులను ఆయన ఉపయోగించుకునే చిన్న ఏర్పాటు చేయలేని మీరు తెలంగాణా ఏం సాధిస్తారు? సాధించలేరు గాక సాధించలేరు.

కాబట్టి నేను చెప్పొచ్చేదేమంటే, మీరంతా మీ తెలంగాణా ఉద్యమాలను కాసేపు పక్కన బెట్టి, పరకాలను, ఆయన మిత్ర బృందాన్ని ఇరవై శాతం మంది నుండి రక్షణ కల్పిస్తూ రాష్ట్రం మొత్తం భద్రంగా ఊరేగించే ఏర్పాట్లు చూడవలసిందని నా ప్రార్ధన. అప్పుడాయన ఎనభై శాతం మంది తనవైపే వున్నారని నిరూపించెదరు.
  

Thursday, November 17, 2011

లగడపాటి రాజగోపాల్ యూపీలో ఉద్యమం చేయాలి


లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు బద్ధ వ్యతిరేకి. హైదరాబాదులో వున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన బలంగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని సమైక్యవాదులకు కూడా తెలుసు. కాకపొతే ఆయన ఆ విషయం ఒప్పుకోడు.

తనకు హైదరాబాదుపై గానీ, హైదరాబాదులోని బిజినేసులపై గానీ ఎలాంటి భయం లేదనీ, ఆమాటకొస్తే హైదరాబాదులోనే కాక ఇంకా పదహారు రాష్ట్రాల్లో ఆయన బిజినెసులు ఉన్నాయనీ నిన్న ఆయనే స్వయంగా ప్రకటించాడు.

మరి ఆయన బాధ దేనికి? ఆయన మాటల్లోనే చెప్పాలంటే, చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకి భంగకరం. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. వగైరా వగైరా. తనకున్న దేశ భక్తిని చాటుకోవడానికి ఆయన భుజానికో త్రివర్ణపతాకం కూడా తగిలించుకొని తిరుగుతుంటాడు.

అయితే ఇప్పుడు తన దేశభక్తి (?) ని చాటుకోవడానికి ఆయనకో సువర్ణావకాశం లభించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నినాలుగ్గా విభజించడానికి మాయావతి కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాకర్లోపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతానంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ వేసి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఇంకో పక్కన ముందుకు వెళుతుంది.

మరి ఒక్క ఆంద్రప్రదేశ్ విడిపోతేనే విపరీతంగా బాధపడి పోయే రాజగోపాల్ కి సహజంగా ఇవి విద్యుదాఘాతం లాంటి వార్తలే కదా? అసలే ఆయన దేశభక్తిలో దేశముదురు కూడాను! ఇప్పుడాయన ఏదో ఒకటి చేయక పోతే జనం ఆయన దేశభక్తిని శంకించే ప్రమాదం వుంది.

అందుకే వెంటనే ఆయన యూపీ వెళ్లి, భుజానికో జెండా తగిలించుకొని, మాయా ఇంటిముందు దీక్ష మొదలు పెట్టాలి. సీమాంధ్రలో చేసినట్టు దొంగ ఉద్యమాలు లేవదీస్తే ఇంకా బెటరు! ఇవన్నీ చేయడానికి చేదోడువాదోడు కావాలంటే నన్నపనేని ఎలాగూ ఖాళీగానే వుంది, ఆవిణ్ణి కూడా తీసుకెళ్ల వచ్చు. చేతిలో డబ్బు ఎలానూ ఉండనే వుంది. లగడపాటీ, నీకు చక్కని అవకాశం! ఇంకేం,  వెంటనే వెళ్లి ఉత్తరప్రదేశ్ లో సమైక్యఉద్యమం మొదలుపెట్టు!
  

Monday, November 14, 2011

పరకాలకు ప్రచారమొచ్చిందోచ్!


పరకాల ప్రభాకర్ అనే పెద్దమనిషి తెలంగాణా మొత్తం సమైక్య వాదాన్నే సమర్దిస్తున్నారని, తనకు అవకాశం ఇస్తే దాన్ని నిరూపిస్తానని చంద్రశేఖర్ అనే TRS పెద్దమనిషితో సవాలు విసిరాడట. ఆయన సవాలు విని, వికారాబాద్ లో మాట్లాడడానికి తాను అవకాశామిస్తానని, అక్కడ నిరూపించవలసిందని ప్రతి సవాల్ చేశాడట. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఇద్దరూ ABN ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వచ్చారట. పరకాల ఒంటరిగా రాకుండా మందీ మార్బలంతో వచ్చాడట. ఈ చంద్రశేఖర్ కూడా ఒంటరిగా రాకుండా తన మనుషులతో వచ్చాడట.

పరకాలకు సంబంధించిన మనిషి నోటిదూలతో ఏదో అన్నాడట. వీళ్ళకు నోటిదూల ఉండడం, తెలంగాణా వైతాళికులని తిట్టడం అలవాటే గా! అది ఎలా వుంటుందో చూసి తరించాలంటే ఇక్కడ నొక్కండి. చిర్రెత్తుకొచ్చిన తెలంగాణా వాదులు టీవీ స్టూడియో సాక్షిగా నాలుగు తన్నారట. ఇకనేం, పరకాలకు కావలసింది జరిగింది. తన్నులు తింటే గగ్గోలు పెట్టొచ్చు. లబోదిబోమని మొత్తుకుంటూ సానుభూతికోసం దేబిరించొచ్చు. ఇకనేం, అన్ని సీమాంధ్ర చానెళ్ళ లోనూ మార్చి మార్చి ఇతన్ని తన్నుతున్న సీన్లు.

పైగా వీరికి భావ వ్యక్తీకరణ స్వేచ్చ కావాలట. ఏమిటి వీరి దృష్టిలో భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే? తెలంగాణా ప్రజలు అభిమానించే వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు తిట్టడమా? తెలంగాణా వారు ఆంధ్రాకు వెళ్లి పొట్టిశ్రీరాములు మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకుంటారా? అసలు ఆంధ్రాలోనే కొందరు నాయకులు ప్రత్యేకాంధ్ర కోసం సదస్సు నిర్వహించుకోవాలని ప్రయత్నిస్తే ఎవరు వారి మీటింగ్ హాల్లోకి వెళ్లి చావ చితగ్గొట్టి తరిమారో జనం అప్పుడే మరిచిపోయారనుకుంటే ఎలా? ఇలాంటివారు భావ ప్రకటన గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చదివినట్టు కాదూ?

అసలు చంద్రశేఖర్ అనేటాయనకు ఉండాలి బుద్ధి! ఆయన మెతక మనిషే కావచ్చు, కాని ఈ పరకాల అనే పరమాణువు అడగ్గానే ఒప్పుకోవడమేమిటి? ఇంట్లో భార్యనే సమైక్యాంధ్రకు ఒప్పించలేనివాడు తెలంగాణా ప్రజలను ఒప్పిస్తానని చెపితే, దానికో విలువ నివ్వడమేమిటి? అందుకు ఈయన రక్షణ కల్పిస్తాననడమేమిటి? అసలు తెలంగాణలో అంతా సమైక్యవాదులే ఉన్నారని ఆయన అంటూంటే ఆయనకు తెలంగాణలో తిరగడానికి ఈయన ప్రత్యేకంగా రక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంటుందని నమ్మడమేమిటి? ఆయన రక్షణకు ఈయన గ్యారంటీ ఇవ్వడమేమిటి? విచిత్రంగా లేదూ?

ప్రచారంలేని పరకాలకు తెలంగాణావాదుల చేత తన్నించుకోవడమే కావలసింది. ఎన్ని తన్నులు తింటే అంత ప్రచారం. దానికోసం తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టడం అనే చిన్న పెట్టుబడి పెడితే చాలు. రోగి కోరిందే డాక్టరు ఇచ్చినట్టు ఆయనకు కావలసినట్టుగానే వీళ్ళు తన్నారు. ఇన్నాళ్ళూ టీవీలో కనపడడానికి మొహం వాచిపోయినాయనకు ముందే ఊహించినట్టుగానే అంతో ఇంతో ప్రచారం లభించింది. ఇంకో నాలుగు తన్నులు, ఒకటో రెండో బాండేజీలు ఎక్కువెందుకు పడలేదా, మరో నాలుగు రోజులు ఎక్కువ ప్రచారం వచ్చేదే అని ఆయన  బాధపడిపోయి ఉంటాడు పాపం. ఏంచేస్తాం పరకాల గారూ, మావాళ్ళకు అంతకన్నా ఎక్కువ చేతకాదు మరి! ఈ సారి మరింత బాగా రెచ్చగొట్టి చూడండి మరి! మీరెలాగూ మాటలతో తెలంగాణా ప్రజలని మెప్పించలేరు, తన్నులు తిని సానుభూతి అయినా పొందడానికి ప్రయత్నించండి.

Friday, November 11, 2011

దోపిడీదారులమని అన్నారు కాబట్టి...



మమ్మల్ని దోపిడీదారులు అన్నారు కాబట్టి తెలంగాణా వదలం. 
మమ్మల్ని జాగో భాగో అన్నారు కాబట్టి తెలంగాణా వదలం.

ఇవీ కొంతమంది సమైక్యవాదులు చెప్పే మాటలు.  వీరు అంతర్గత అర్థం వచ్చేలానో, లేక బహిరంగంగానేనో క్రింది విధంగా వాదన చేస్తారు.

అసలు రాష్ట్రం అంటూ విడిపోతే మా ఆంధ్రా వారికే లాభం. మేం బాగా కష్టపడి (మేమేలాగూ కష్టపడే వాళ్లమేగా) మా రాష్ట్రాన్ని దేశంలోనే, కాకపోతే ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తయారు చేస్తాం. అయినా కూడా మేం విడిపోవాలనుకోవడం లేదు. ఎందుకంటారా! మిమ్మల్ని (తెలంగాణా ప్రజల్ని) ఇబ్బంది పెట్టడానికి. ఎందుకంటే మీరు మమ్మల్ని దుర్భాషలాడారుగా! అందుకని మేం మిమ్మల్ని వదలం. మీరు అరిచి గిజుకున్నా సరే మేం ఇక్కడే వుండి మీకు కావలసినంత అపకారం చేస్తుంటాం. దానివల్ల మాక్కూడా అపకారం జరిగినా సరే. (మరి ప్రపంచంలో గొప్ప రాష్ట్రం కావలసిన ప్రాంతం అలా కాకుండా పోతుందంటే అపకారం జరుగుతున్నట్టేగా). అయినా సరే, మాకు జరిగే అపకారమైనా మాకు సమ్మతమే కానీ మీకు మాత్రం ఉపకారం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని తిట్టారుగా!

ఇదీ వరస.

దీంట్లో రెండుమూడు అంశాలున్నాయి.

ఒకటి, తెలంగాణా వారు సీమాంధ్ర వారిని తిట్టడం.
రెండు, సీమాంధ్ర రాష్ట్రం విడిపోతే దేశంలోకెళ్ళానో, ప్రపంచంలోకెళ్ళానో గొప్ప రాష్ట్రంగా వర్ధిల్లడం.
మూడు, తెలంగాణా వారు తిట్టారు కాబట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడానికి సమైక్యంగా వుండడం.

ఇప్పుడు సమస్య విషయం పూర్తిగా దేనికదిగా విడిపోయింది గదా! ఇప్పుడు ఇది ఎంత చెత్త వాదనో వేరే చెప్పవలసిన అవసరం లేకుండానే చదువరులు అర్థం చేసుకోగలరు. కాకపోతే ఇలాంటి వాదనలు కొంత మంది లబ్దప్రతిష్టులైన బ్లాగర్లు  కూడా చేయడమే ఆశ్చర్యకరమైన విషయం.

దీన్ని మరింత విశ్లేషిద్దాం.

వారి అభియోగం తెలంగాణా వారు సీమాంధ్రులని తిట్టారని. దీనిలో ఎంతవరకు వాస్తవం వుంది? తెలంగాణా వారంతా కట్టగట్టుకుని  సీమాంధ్రులని తిట్టడం సాధ్యమేనా? కొందరు తిడితే అందరినీ బాధ్యులను చేయడం ఎంతవరకూ సబబు? ఆ తిట్టినా కొందరు కూడా తాము తిట్టింది కొందరు సీమాంధ్రకు కొందరిని మాత్రమే అని పదే పదే వివరణ ఇచ్చారు కూడా. ఇక్కడ కొందరిని ఉద్దేశించి అన్న మాటలు అందరికీ అన్వయించుకొని బాధపడడం (నిజంగా పడ్డట్టయితే) ఒక ఎత్తైతే, ఆ తిట్లకు తెలంగాణా ప్రజలంతా కారకులే అన్నట్టు మాట్లాడడం ఒక ఎత్తు.

నిజానికి తెలంగాణాలోని ప్రతీ ఊర్లోనూ కనీసం ఒక్కటైనా ఆంధ్రా వారికి చెందినా కుటుంబం వుంటుంది. వారంతా కలిసి మెలిసే వుంటున్నారు. గత పది సంవత్సరాలనుంచీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా వీరి మధ్య ఎక్కడా ఒక్క చిన్న గొడవైనా జరిగినట్టు కనీసం ఆంధ్రా పక్షపాత మీడియా కూడా చూపించలేక పోయింది.

సరే, తిట్టారే అనుకుందాం. మరి మనం స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వారిని దోపిడీ దారులని తిట్టామే! దానర్థం బ్రిటన్ లో వున్నా ప్రతీ సామాన్య పౌరుడూ దోపిడీ దొంగేనా? కాదుగదా? ఉదాహరణకు క్రింది పద్యం చూడండి.

భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి. 

     -చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు

దీని అర్థం ఏమిటి? మొత్తం తెల్లవారంతా దొంగలేనా? బ్రిటన్ మన దేశాన్ని పాలించినప్పుడు కూడా అక్కడ బీద బ్రిటిష్ ప్రజలు ఉండేవారు. బిచ్చగాళ్ళు కూడా ఉండే వాళ్ళు. మరి మన సొమ్ము దోపిడీ చేసి వాళ్ళు బిచ్చగాళ్ళుగా వున్నారా? కాదనేగా అర్థం. అంటే పై పద్యం దోపిడీ దార్లను ఉద్దేశించి రాసిందే కాని మొత్తం బ్రిటిష్ వారిని ఉద్దేశించి రాసింది కాదు. కాకపోతే అలా రాసిన ప్రతీచోటా disclaimers ఇవ్వాలంటే ఎలా?

కానీ బ్రిటిష్ ప్రజలు అలా అనుకోలేదు. వారు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ఎంతో మంది గాంధీజీకి శిష్యులుగా కూడా వున్నారు. అంతే కాదు, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేటప్పుడు వారు స్వాగతించారే కానీ ఎదురు చెప్పలేదు.

మరి మన సోదరులు అలా అనుకోవడం లేదంటే వారికి ఇవన్నీ తెలియడం లేదనుకోవాలా? ఎంతమాత్రం కాదు. వారికి ఇవన్నీ తెలుసు. అంతేకాదు తెలంగాణాపై ప్రాంతీయ దోపిడీ ఎలా జరుగుతుందో కూడా తెలుసు. కళ్ళముందే తూములు పగులగొట్టి నీళ్ళు దండుకోవడాలూ, శ్రీశైలం ఎడమ కాలువ ఎండగట్టి, కుడివైపు కాలువల కదంబాలు చేపట్టడాలూ, చేవెళ్ల-ప్రాణహిత పక్కకు నెట్టి పోలవరం ఆఘమేఘాల మీద కట్టడాలూ లాంటి విషయాలు రోజూ కనపడుతుంటే తెలియకుండా ఎలా వుంటాయి? తెలంగాణా భూములను పందేరం పెట్టి ఎకాఎకి లక్షల కోట్లు మూతలు కట్టుకున్న వారిని ఎలా విస్మరించగలరు?

గుర్తించారు కాబట్టే చాలామంది సహృదయులైన ఆధ్రులు తెలంగాణా ఉద్యమానికి స్వచ్చందంగా మద్దతు పలుకుతున్నారు. మరికొంత మంది తటస్థంగా వుంటున్నారు. కాని కొంతమంది మాత్రం పైన చెప్పుకున్నట్టుగా మాటల యుద్ధం చేస్తుంటారు.ఎందుకంటే ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగడం వారికి ఇష్టం. విడిపోతే వారు అభివృద్ధి చెందినా సరే, విడిపోకుండా వుండి ప్రాంతీయ దోపిడీవ్యవస్థ ఇలా నిరాటంకంగా కొనసాగడమే వారికి ఇష్టం. మరి దోపిడీవ్యవస్థను బలపరిచే వారు కూడా దోపిడీదారులు కాకుండా ఇంకేమౌతారు?

ఇక మిగతా అంశాల గురించి చర్చించడం అవసరమా?

తెలంగాణా కావాలంటున్నారు, మరి కాశ్మీర్ విడిపోతానంటే సమర్థిస్తారా?


తరచుగా సమైక్యవాదులు వేసే ప్రశ్నల్లో ఇది ఒకటి. ఇలాంటి ప్రశ్నలు వింటుంటే వీరి అవగాహనా రాహిత్యానికి నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. కాని వీరి ప్రశ్నలకు జవాబు చెప్పక తప్పదు, లేకపోతే తాము తమ మిడిమిడి జ్ఞానంతో ఆలోచించిందే నిజమని వీరు భావించుకుంటారు. 

అసలు ఈ రెండు సమస్యలకు సారూప్యతే లేదు. ఒకటేమో దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి వేరే దేశం కోరే విషయం. రెండోది దేశ రాజ్యాంగసూత్రాలకు లోబడి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే, నాలుక్కోట్ల జనాభా కలిగిన ఒక ప్రాంతం దేశంలో తమకు ప్రత్యేకరాష్ట్రం కావాలని కోరడం.

ఇక కాశ్మీర్ విడిపోతానంటే ఒప్పుకుంటారా అని వారు వేసే ప్రశ్న. దానికి ఇప్పటికే ఎంతో మంది అరుంధతీ రాయ్, ప్రశాంత్ భూషణ్ వంటి మేధావులు తమ మనసులో మాట చెప్పారు, తన్నులు కూడా తిన్నారు. కాశ్మీరు గురించి మాట్లాడడానికి నాకు అంత పరిజ్ఞానమూ లేదు, మాట్లాడాలనే కోరికా లేదు. అయితే దీన్ని తెలంగాణావాదంతో ముడిపెట్టారు కాబట్టి నేను చెప్పవలసింది చెప్తాను.

న్యాయంగా ఆలోచించినప్పుడు ఏ ప్రాంతం భవిష్యత్తు నిర్ణయించ గలిగేదైనా ఆ ప్రాంతపు ప్రజలే. ఒక ప్రాంతం ఏదేశంలోనైనా కలవాలన్నా, స్వతంత్రంగా వుండాలని నిర్ణయం తీసుకోవాలన్నా వారి ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి వుండాలి. ఆ ప్రాంత ప్రజలు కూడా, అలా నిర్ణయించుకునే ముందు తాము ఒక దేశం నుండి విడిపోతే ఎదురయ్యే సవాళ్ళను, ఎదుర్కోవలసిన సమస్యలను గురించి తప్పక ఆలోచిస్తారు.

విడిపోతే తాము ఎదుర్కోబోయే సమస్యల కన్నా ఇప్పుడు ఉన్న దేశంలో వారు ఎదుర్కొనే సమస్యలే ఎక్కువగా ఉన్నట్టయితే వారు దేశం నుండి విడిపోవడానికే మొగ్గు చూపే అవకాశం వుంది. ప్రజలు అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే, అది తప్పకుండా పాలకుల తప్పే. అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రజలను ఆపే హక్కు పాలకులు నైతికంగా కోల్పోతారు.

ఇదంతా చెప్పేటప్పుడు కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. దానికి వోటింగో, రిఫరెండమో ఏదో ఒకటి పెడితే తప్ప ప్రజాభిప్రాయం తెలిసే అవకాశం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య యుతమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా ఆ పద్ధతులను అనుసరించి ప్రజాభిప్రాయం సేకరించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు.

ఇక పోతే తెలంగాణా విషయం. తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుంది, దేశాన్ని కాదు. ఇలా కోరుకోవడం ఇది మొదటి సారి కాదు, ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావడాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడడాలు కూడా జరిగాయి. దానికి పొరుగున ఉన్న ఆంధ్రులే ఆద్యులుగా వున్నారు. వారే మాకు స్ఫూర్తి. పైగా ఇలా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి మన దేశ రాజ్యాంగం పూర్తిగా అనుకూలం.  

తెలంగాణా ఏమైనా రాష్ట్రంగా మనగలగ లేనంత చిన్న ప్రాంతమా? రాష్ట్రంగా మనగలగలేక పోయినా గొంతెమ్మ కోరిక కోరుతుందా అని ఆలోచించి చూద్దాం. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయితే అది ఇప్పుడు దేశంలో వున్న పదహారు రాష్ట్రాల కన్నా పెద్దదిగా వుంటుంది. కాబట్టి మనలేక పోవడమో, చిన్న రాష్ట్రమని చిన్నచూపు చూడడమో చేయవలసిన అవసరమే లేదు.

ఇక పోతే తెలంగాణా రాష్ట్రం ఏదో ఇప్పటివరకూ అసలేలేని కొత్తరాష్ట్రం కాదు. 1956 వరకూ ఇది హైదరాబాదు రాష్ట్రం రూపంలో వుంది. కాకపోతే కొన్ని మరాఠా, కన్నడ జిల్లాలు అదనంగా ఉండేవి. ఫజల్ అలీ కమీషన్ తెలంగాణా పై మొదటి SRCలో చర్చిస్తూ, దీనిపై తొందర పడకుండా 1962 వరకూ ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలనీ, 1962 లో ఒకవేళ మూడింట రెండొంతుల మంది తెలంగాణా శాసనసభ్యులు ఆంధ్రాతో విలీనానికి అంగీకరిస్తేనే విలీనం చేయాలని స్పష్టంగా తీర్పు చెప్పింది.


కానీ కొంత మంది తెలంగాణా, ఆంధ్రాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, మొదటి SRC స్ఫూర్తికి విరుద్ధంగా పెద్దమనుషుల ఒప్పందం అని ఒకటి కుదుర్చుకొని ఒక బలవంతపు రాష్ట్రాన్ని తెలంగాణా ప్రజలపై రుద్దారు. కనీసం ఆ ఒప్పందమైనా సరిగ్గా అమలైందా అంటే, రాష్ట్రం ఏర్పడ్డరోజు నుంచే దానికి తూట్లు పొడవడం మొదలు పెట్టారు. అలా మొదలైన ఒప్పందాల వమ్ము ఇంకా కొనసాగుతూనే వుంది. తర్వాత దానికి రిపేర్లు చేద్దామని 610 లాంటి ఎన్ని జీవోలు తీసినా చివరికి అవి కూడా వమ్మయ్యాయే కానీ, ఏదీ సరిగ్గా అమలు జరగలేదు.       

అటువంటి పరిస్థితిలో తెలంగాణా ప్రజలు ఈ సమైక్యరాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా నమ్మడం మానివేశారు. మానివేసారనే కన్నా అవే విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పితే బాగుంటుంది. ప్రభుత్వం ఎంతగా దిగజారి పోయిందంటే, తెలంగాణా శాసన సభ్యులు రాజీనామాలు చేసి, ప్రభుత్వం మైనారిటీలో పడిన సందర్భంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒక ఆంధ్రా లాబీగా మారి అవిశ్వాసం అన్న మాట రాకుండా ప్రభుత్వాన్ని నడుపుకునే నాటకానికి తెరలేచింది. ఎన్నికలోస్తే తెలంగాణా ప్రజలు తమను వెలివేస్తారేమో ననే భయంతో ప్రభుత్వాన్ని కూలకుండా నడుపుకుంటూ ప్రజాస్వామ్య విధానానికే విఘాతం కలిగించే దుస్సాహసాలకు తెగించడం జరిగింది.

ప్రతిపక్షం, ప్రధానపక్షం కుమ్మక్కై  రాజకీయం నడుపుతున్న ఈ పరిస్థితి చూసినప్పుడు, తెలంగాణాకు ఇకముందైనా న్యాయం జరుగుతుందని ఎలా నమ్మకం కలుగుతుంది? పార్టీలకతీతంగా రాజకీయులు ప్రాంతీయకోణంలో చీలినప్పుడే తెలంగాణాకు ఇక న్యాయం జరగదనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే ఒక ప్రాంతం వారే సంఖ్యా బలంలో ఎప్పుడూ మిన్నగా వుంటారు కాబట్టి. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల మధ్యన నెలకొన్న ఈ అక్రమ సంబంధం ప్రాంతాల మధ్యన అన్యాయమైన పోటీగా మారింది. ఈ అన్యాయమైన పోటీలో మరింతకాలం పాల్గొంటూ, తన జవసత్వాలను వృధా చేసుకొనే అవసరం గాని, ఓపిక  గానీ తెలంగాణా ప్రజలకు లేదు. కాబట్టి ఈ అసమానతను నివారించడానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదు.

Thursday, November 10, 2011

సమైక్యవాదుల కబుర్లు


కొంతమంది మనుషులను చూస్తుంటాం. వారు వారికి కొన్ని కోరికలుంటాయి. కాని వాటిని బలంగా చెప్పలేరు. వారి వాదనలను బలంగా వినిపించ లేరు. వారి కోరిక ఎందుకు సమంజసమైందో తార్కికంగా వివరణ ఇవ్వలేరు. 

అలాంటి వారు వారి కోరికలను సాధించుకోవడానికి వేరే రకాలైన మార్గాలను ఎన్నుకుంటుంటారు. ఉదాహరణకి ఒక కుటుంబం సినిమాకి వెళ్లాలని అనున్నారనుకుందాం. భర్త ఒక సినిమా పేరు చెప్తాడు. భార్యకు ఆ సినిమా చూడడం ఇష్టం వుండదు, వేరే సినిమా చూడాలని వుంటుంది. కాని తనకు ఇష్టమైన సినిమాఏ మంచిది అని చెప్పి నెగ్గలేదు. ఎందుకంటే తర్కిస్తే భర్త చెప్పిందే మంచి సినిమా అని రుజువై పోతుంది. దానికే ఒప్పుకోవాల్సి వస్తుంది.  అటువంటి సమయంలో ఆ భార్య వేరే పధ్ధతి లో నరుక్కు వస్తుంది.

"చిన్నమ్మాయికి ఆ సినిమా ఇష్టం లేదు".

చిన్నమ్మాయి అంటే ఇంట్లో అందరికీ గారం. దానికి ఇష్టం లేకపోతే ఎవరూ కాదన లేరు. మరి చిన్నమ్మాయి... తల్లి మాట కాదనలేదు. అందరి ఎదురుగా తల్లిని ధిక్కరించి తనకు ఆ సినిమా ఇష్టమే నని చెప్పలేదు. ఆ విధంగా తల్లి పంతం నెగ్గుతుంది.

తర్కం తమకు సహకరించనప్పుడు పనులు సాధించుకోవడానికి ఇలాంటి పద్ధతులను వాడడం మనం ప్రతిరోజూ చూస్తుంటాం. సరిగ్గా మన సమైక్యాంధ్ర వాదులు చేసేది కూడా ఇదే. 

తెలంగాణా ప్రజల ప్రేత్యేక రాష్ట్ర ఆకాన్స్ఖ రాజ్యాంగ బద్ధమైనది. అది ప్రజల యొక్క బలమైన కోరికేనని, నాయకుల కోరిక కాదని ఇప్పటికే నిర్ద్వంద్వంగా రుజువైంది. ప్రజాస్వామ్యంలో నాలుక్కోట్ల ప్రజల భవితవ్యాన్ని వారి ఇష్టాలకు విరుద్ధంగా నిర్ణయించడం జరిగే పని కాదు. కాబట్టి రాష్ట్ర ఏర్పాటు అనివార్యతని సమైక్యవాడులమని చెప్పుకునే వారు కూడా గుర్తించారు.

అయితే వారి అవసరాల దృష్ట్యా రాష్ట్రం ఆ విధంగా విడిపోవడం అస్సలు ఇష్టం లేని సంగతి. కాని అడ్డు ఎలా చెప్పాలి? అదిగో అక్కడే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఇల్లాలి పాత్ర రంగంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ క్రింద పలు సందర్భాలలో సమైక్యాంధ్ర వాదులు మాట్లాడిన మాటలు చూడండి.

తెలంగాణా ఏర్పాటు చేస్తే ఇలాంటి రాష్ట్రాల డిమాండ్లు మరెన్నో పుట్టుకొస్తాయి. అలా దేశం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది. అది దేశ సమగ్రతకే భంగం. 

దీనికన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు. స్వాతంత్ర్యం వచ్చింతర్వాత మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండు మొదలు పెట్టిందే వారు. పైగా దాన్ని ఎంతో ఉదాత్తమమమైన ఉద్యమంగా అభివర్నించు కుంటారు. అప్పుడు రాష్ట్ర విభజన దేశ సమగ్రతకి భంగం కలిగించేది కానప్పుడు ఇప్పుడెలా అవుతుంది? 

తెలంగాణా ఏర్పాటు చేస్తే ముస్లిం తీవ్రవాదం, నక్సలిజం ఇక్కడ పెరిగి పోతాయి. అది దేశ సమగ్రతకి భంగం కలిగిస్తుంది.

ఇది మరో అసహ్యకరమైన వాదన. ఇప్పుడు హైదరాబాదులో కానీ, దేశమంతటా కానీ ముస్లిం తీవ్రవాదం లేదా? ఈ సమైక్య హైదరాబాదులోనే కాదా లుంబినీ పార్కులో, గోకుల్ చాటులో బాంబులు పేలితే ఇప్పటివరకూ ఆతీ గతీ లేనిది? ఇంతకన్నా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పలుమార్లు బాంబులు, ఉగ్రవాదవాద దాడులు ఎందుకు జరిగాయి?  అసలు చిన్నా, పెద్ద రాష్ట్రాలకు ఉగ్రవాదానికి ఏమిటి లింకు? చిన్న రాష్ట్రాలన్నిటిలో ఉగ్రవాదులు వున్నారా? 

ఇక నక్సలిజానికి వస్తే గత ముప్పై సంవత్సరాలుగా నక్సలిజంతో ఆంధ్రప్రదేశ్ ఎంతగా అట్టుడికి పోయిందో మనకు తెలుసు. మరి పెద్దరాష్ట్రాలు నక్సలిజానికి రక్షణ కవచాలయితే, మన రసహ్త్రంలో ఇలా ఎందుకు జరిగినట్టు? మనకన్నా చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం నక్సలిజం ఎందుకు అడుగుపెట్ట లేక పోయినట్టు? ఇంత పెద్ద రాజ్యంలో నక్సలిజం ఒక్కటేనా? రౌడీయిజం, గూండాయిజం, ఫాక్షనిజం అని ఒకటేమిటి, ఎన్నో రుగ్మతలు ఇప్పటికే చూస్తున్నాం. రేప్పొద్దున అంతకన్నా ముప్పు ఉంటుందనేది కేవలం ఊహా జనితం మాత్రమే. పైగా చిన్న రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకోవడం, అమలు జరపడం వేగంగా జరుగుతుంది, span చిన్నది కాబట్టి. ఆవిధంగా చూస్తే చిన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి వాటిని అరికట్టే అవకాశం ఎక్కువ.

ఇలా వీరు చెప్పే ఇల్లాలి ముచ్చట్లు చాలానే వుంటాయి. మరికొన్ని ఇతర టపాల్లో.  

Wednesday, November 9, 2011

ఉద్యమాన్ని నీరుగార్చకండి


కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష మొదలు పెట్టాడు, పూర్తి చేశాడు. ఎందుకు మొదలు పెట్టాడో, ఎందుకు ఆపి వేశాడో ఆయనకే తెలియాలి. 

ఆయన దీక్ష మొదలు పెట్టేటప్పుడు తెలంగాణా ఏర్పాటు ప్రకటన వచ్చేవారకూ కొనసాగుతుందని చెప్పాడు. మరి ఇప్పుడే ప్రకటన వచ్చిందని ఆపేసినట్టు? పైగా దీక్ష మొదలు పెట్టేటప్పుడు  తనకన్నా పెద్ద తెలంగాణా వాడి లేదన్నట్టుగా మాట్లాడాడు. 

ఈయన ఇదివరకే ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటన చేస్తూ తెలంగాణా రాష్ట్రంలోనే తిరిగి పదవులు చేపడతా అన్ని ప్రకటన చేశాడు. అది జరిగిన రెండు సంవత్సరాల వరకూ పదవులు అనుభవించి మొన్న రాజీనామా చేశాడు. తర్వాత వెంటనే దీక్షకు కూచున్నాడు. మరి ఇతని గత చరిత్ర చూసిన వాళ్ళెవరికీ ఇతనికి తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ధి వున్నట్టు అనిపించడం లేదు. మరీ అంత కష్టంగా వుంటే ఆరోగ్యం పాడు చేసుకొని మరీ దీక్షలు చేయమనో, చావమనో ఎవరూ చెప్పరు. కాని దీక్ష తర్వాత ఇతను చేసే కార్యక్రమాలు ఏవనే దానిపైనే ఇతనిపై ప్రజలు ఒక అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం వుంది.

తెలంగాణా ఏర్పాటుకోసం పరితపిస్తున్న ప్రజలు ఎవరు తెలంగాణా పేరు చెప్పి ఎవరు ఏం చేసినా ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకుంటున్నారు. ఆ క్రమంలో మంచివాళ్ళూ, చీడపురుగులూ అని లేకుండా అందరూ ఆ స్రవంతిలో కలిసి ప్రజాదరణ పొందుతున్నారు. అంత మాత్రాన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మాత్రమే లక్ష్యంగా కృషి చేయలేని వారిని తాత్కాలికంగా ఆదరించినా, నిజం తెలుసుకున్న తర్వాత ప్రజలు తిరస్కరించడం ఖాయం.

కొండాలక్ష్మన్ బాపూజీ దేశ రాజధానిలో వారం రోజుల దీక్ష చేశారు. ఇక్కడ తెలంగాణా ప్రజల వద్దకు వెళ్ళే మొఖం లేని తెలుగుదేశం నాయకులు ఆ వేదికపై నుండి తెరాసను, JACని విమర్శించారు. ఇలా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ తెలంగాణా మొత్తంగా ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు. 

దీక్ష తరవాత బాపూజీ గారు కూడా తెరాసపై విమర్శలు ఎక్కుపెట్టినట్టు తెలుస్తుంది. తెరాసలో లోపాలు ఉండవచ్చు. కాని రాజకీయకోణం లేకపోతే ఉద్యమాలను ఇన్ని రోజులు నడపడం సాధ్యమయ్యే విషయం కాదు. ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం తెరాసయే నన్నది సమైక్యవాదులు కూడా ఒప్పుకునే సత్యం. అలాంటి ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకు వెళ్ళుతున్న పార్టీని విమర్శించి సాధించేది ఏమీ వుండదు, ఉద్యమాన్ని నీరు దెబ్బతీయడం తప్ప. వారి ఉద్దేశ్యం అది కాదని ఆశిద్దాం. అలాగే తెరాస కూడా భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయో సమీక్షించుకొని ముందుకు వెళ్ళాలి.

ఉద్యమానికి సమాంతరంగా ఎన్నికలు జరుగుతూనే వుంటాయి. పోటీ చెయ్యొద్దంటే ఎలా? వీరు చేయక పోతే ఇంకో కాంగ్రెస్ వాడు పోటీ చేసి గెలిచి తీరతాడు. అంతే కాని ఎన్నిక ఆగదుగా? అలాగే రాజకీయ నాయకులు వచ్చి చేరుతూనే వుంటారు. వారు చేరితే అంతో కొంత ఉద్యమం బలపడుతుందే తప్ప బలహీనం కాదు. రాజీనామాలు చేయడం, తిరిగి ఎన్నికల్లో పాల్గోవడం రాజకీయ ఎత్తుగడల ననుసరించి జరుగుతూనే వుంటాయి. అలాంటి ఎన్నో సంఘటనల పరిణామమే ఈనాటి తీవ్రతరమైన ఉద్యమ రూపం.

బాపూజీగారి వేదిక మీదికి సమైక్యవాది అయిన చంద్రబాబు భజన చేసే తెలుగుదేశం నాయకులను ఎందుకు ఆహ్వానించినట్టు? ఉద్యమంలో అందరినీ చేర్చుకొని పోవాలనే ఉద్ద్యేశం తోనే గదా? మరి అదే స్పూర్తిని ప్రదర్శించి తెరాస పై విమర్శలు గుప్పించే ముందు ఆయన గానీ, మిగతా తెలంగాణా పోరాట సంస్థలు గానీ సంయమనం పాటిస్తే మంచిది. లేక పోతే ఈ అనైక్యతను ఆధారం చేసుకొని సమైక్యవాదులు లబ్ది పొందే అవకాశం వుంటుంది.

Tuesday, November 8, 2011

ప్రాంతీయ పక్షపాత పాలకులు


ఆంధ్రా రాజకీయులు తెలంగాణాతో పొట్టు కలిసిందే ఇక్కడి వనరులను, ఇక్కడి జలాలను, ఇక్కడ అప్పటికే బాగా అభివృద్ధి చెంది, దేశంలోనే గొప్ప నగరంగా అంబేద్కర్ చేత కీర్తించబడ్డ హైదరాబాదు నగరం కోసం. ఇప్పుడు వీరు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తుంది కూడా సరిగ్గా ఇదే కారణాలతో. ఆ విషయంలో వారు ఇప్పటికే నగ్నంగా బయట పడ్డారు కూడా.

వీరి అసలు ఉద్దేశం తెలుగుజాతి కాదని, తెలంగాణాపై ఆధిపత్యం చెలాయించి తమ పబ్బాలు గడుపుకోవడమేనని బయట పడ్డ తర్వాత ఇక పార్టీలు, పాలసీలు అన్నీ పక్కకు పెట్టి బహిరంగానే తమ దుష్ట బుద్ధి ప్రదర్శించు కుంటున్నారు. 

ఆనాడు పార్టీల కతీతంగా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఆలింగానాలు చేసుకొని, ముద్దులు కురిపించుకొని, దొంగ ఉద్యమాలు నడిపించి సాకారమౌతున్న తెలంగాణాను అడ్డుకుంటే, నేడు అదే విషయం మైనారిటీలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో మరోసారి బయట పడింది.

తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో మొదలైంది. రాష్ట్రంలో దానికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వాన్ని తొలగించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తెలుగుదేశం వదులుకో కూడదు. పైగా ప్రతీ రోజూ రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, పాలన లేదని అంటూ జనానికి ఊదర గొడుతూ వుంది. మరి ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మైనారిటీలో పడ్డప్పుడు ఆ పార్టీ ఏం చేయాలి? వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలి. అసెంబ్లీ నడవక పోతే, గవర్నరుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్న విషయం గవర్నరుకు నోటీసు ద్వారా తెలియజేస్తూ, అసెంబ్లీ సమావేశం ఏర్పాటును కోరాలి. కాని వాస్తవంగా అలా జరగడం లేదు.

పైగా నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు కొనసాగుతుందనీ, ఆ తర్వాత మాత్రం తమకే వోటు వెయ్యాలనీ వాకృచ్చారు. మరి పనిచేయని ప్రభుత్వం రెండున్నరేళ్ళు కొనసాగడం ఎందుకు?

ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణా రాష్ట్ర సమితి బలంగా వుంది. ఎన్నికలు వస్తే ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశానికి శృంగభంగం తప్పదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తెరాసతో పొట్టు కూడాల్సిన, రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడాల్సిన పరిస్థితి. పైకి ఎంత తటస్థులం అని చెప్పుకున్నా వారి అంతరంగం ఏంటో జగద్విదితం. అందుకే తమ శత్రు పార్టీని కూడా ఆంపశయ్య మీద బ్రతికించడం. 

వీటన్నిటిని బట్టి తెలిసేది ఏమంటే, పార్టీల కతీతంగా ఆంధ్రా రాజకీయ నాయకులంతా ఒక్కటే. వారు కావాలంటే ఆంధ్రాపక్షపాత ప్రభుత్వాన్ని మైనారిటీలో పడ్డా కొనసాగించ గలరు. ప్రభుత్వం గనక ఆంధ్రా పెట్టుబడిదారుల, భూస్వాముల కొమ్ము కాయక, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తే మాత్రం, తరతమ విభేదం లేకుండా దాన్ని దించి వేయగలరు. 

ఎలాగూ అసెంబ్లీ లో మందబలం వాళ్ళదే వుంటుంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా అది అస్మదీయులకు మేలు చేస్తేనే నిలబడుతుంది, లేక పోతే కూలిపోతుంది. అందుకు పీవీ ప్రభుత్వమే ఉదాహరణ. ఆయన దేశాన్ని ఐదేళ్ళు పరిపాలించ గలిగాడు కాని రాష్ట్రాన్ని మాత్రం ఏడాది కూడా పరిపాలించ లేక పోయాడు.

ఇలాంటి ప్రాంతీయ పక్షపాత పాలకులు మెజారిటీగా వున్న రాష్ట్రంలో ఇంకా కలిసి వుండడం అవసరమా?

తెలంగాణ ఏర్పాటుకు హైదరాబాద్ అడ్డమా?


ఇటీవల కొద్ది కాలం నుండి కొంత మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ ఒక్కటే అడ్డం అంటున్నారు. ఇదే విషయాన్ని పత్రికలూ రాస్తున్నాయి. సీమాంధ్ర నాయకుల నోటి నుంచి వచ్చే మరొక మాట ‘మేము హైదరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు గుమ్మరించినాము ఇప్పుడు హైదరాబాద్ ను ఎలా వదులు కుంటాము’ అని.ఇవి పూర్తిగా అసమంజసమైన, సత్య దూరమైన మోస పూరిత మాటలు.తెలంగాణ సమస్యను సాగదీయడానికి వాడుకుంటున్న నెపం మాత్రమే. కొంత మంది పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో ప్రభుత్వం నుండి భూమి, విద్యుత్ శక్తి, పన్నులలో రాయితీలు పొంది వ్యాపారాలు పరిక్షిశమలను అభివృద్ధి చేసుకొని ఇప్పుడు హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశామని దబాయిస్తున్నారు.మరి కొందరు భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ మాదని బెదిరిస్తున్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే!

హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయిన తర్వాతనే అభివృద్ధి చెందినదని మరొక సీమాంధ్ర ప్రచారం. నిజానికి రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రానికి అప్పటికే అన్ని విధాల అభివృద్ధి చెంది ఉన్న హైదరాబాద్‌ను బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. ఆ తర్వాత ఏమి అభివృద్ధి చెందినా అది దేశంలో ఇతర నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో అలాగే హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కాక మునుపే హైదరాబాద్ దేశంలోని ఐదవ పెద్ద నగరంగా పేరు పొందినది.ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత వాస్తవానికి విశాఖపట్నం, హైదరాబాద్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినది. వందల సంవత్సరాలనుంచి రాజధానిగా ఉంటూ తెలంగాణ పది జిల్లాల నడుమ ఉన్న హైదరాబాద్ తెలంగాణకు దక్కుతుందా లేదా హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ తమను తాము అభివృద్ధి చేసుకొన్న సీమాంధ్రులకు దక్కుతుందా? కనీస మానవీయత ఉన్న మనిషికెవరికైనా అర్థమయ్యే విషయమే. హైదరాబాద్ సమస్యను లేవనెత్తింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జటిలం చేయటానికే. ఇది శ్రీ కృష్ణ కమిటీ కావాలని సృష్టించిన సమస్య.

ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అతి పెద్ద, అత్యంత ధనిక సంస్థానం. సెప్టెంబర్ 17, 1948 న నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం చెందినప్పుడు దాని ఆదాయం 900 లక్షల పౌండులు.హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేక బ్యాంకు, హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ఉన్నాయి.నిజానికి హైదరాబాద్ అభివృద్ధి చెందినది నిజాం పరిపాలనలోనే.19వ శతాబ్దం తొలి దశకంలో మూసీ నది వరదల కారణంగా అప్పటి నిజాం ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు రప్పించి హైదరాబాద్‌లో నీటి వనరులు, డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేశారు. హైదరాబాద్ సంస్థానంలో రైల్వే స్టేషన్‌లను నిర్మించింది నిజామే. హైదరాబాద్‌లో బడులు, మహిళా కళాశాలలు , మదరసాలను, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైకోర్ట్ భవనము, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, జూబ్లీ హాల్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి,అసెంబ్లీ భవనాన్ని, మోండా మార్కెట్, మోజంజాహి మార్కెట్, అబిడ్స్ మార్కెట్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ను, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి జలాశయాలను నిర్మించింది నిజామే.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో విశాలమైన రోడ్లను చక్కటి ఉద్యానవనాలను నిర్మించింది కూడా నిజామే. నాగార్జున సాగర్ నిర్మాణానికి సర్వే ప్రారంభించినది నిజాం కాలంలోనే. జనవరి 26, 1950 న భారత రాజ్యాంగము అమలు కాగా, హైదరాబాద్ రాష్ట్రం 1956 వరకు కొనసాగింది. 1955లో హైదరాబాద్ లోని వసతులను చూసిన అంబేద్కర్ దీనిని భారత దేశానికి రెండవ రాజధానిగా చేయాలని భావించారు. ఎన్నో విషయాలలో ఢిల్లీ కంటే మెరుగైన నగరంగా పేర్కొన్నారు. అటువంటి హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేయడం వలన అప్పటి నిజాం హయాంలోని చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అందులో ఆజంజాహి మిల్లు, సిర్పూర్ సిల్క్ మిల్లు, అంతగ్రాం స్పిన్నింగ్ మిల్లు, నిజాం షుగర్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇదీ సీమాంధ్ర ప్రభుత్వాలు సీమాంధ్రులు చేసిన హైదరాబాద్ అభివృద్ధి!

పురాతన హైదరాబాద్ అందాన్ని మరుగు పరచేవి పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కావు.అవి హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనాలూ కావు. అందరూ చెప్పే హైటెక్ సిటీ హైదరాబాద్ శివార్లలో ఉన్నది. అది హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనం కాదు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్, మోటోరోల లాంటి బహుళ జాతి కంపెనీల పెట్టుబడి, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెట్టుబడి సీమాంధ్రుల పెట్టుబడి కాదు. సత్యం కంప్యూటర్స్ పెట్టుబడి మాత్రం సీమాంధ్రుల పెట్టుబడి. దాని వెనుక ఎన్ని మోసాలు జరిగాయో సీమాంధ్రులు ఏవిధంగా మోసాలకు పాల్పడుతారో చెప్పడానికి అది ఓ మంచి ఉదాహరణ.ఆంధ్రా నుంచి వచ్చి కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కాలనీలు నిర్మించుకున్నారు.

ఇదా సీమాంధ్రులు చేసిన హైదరాబాద్ అభివృద్ధి ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొంది హైదరాబాద్‌లో స్థాపించిన సినీ పరిక్షిశమ వల్ల లాభపడింది ఆంధ్రా వాళ్ళే.అలాగే తెలంగాణను ఆంధ్రాలో కలపటం వలన అధికారంలో ఉన్నవారి అండతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, వక్ఫ్ భూములను ఏవిధంగా కబ్జా చేయవచ్చునో ఆ ధనంతో ఏవిధంగా కేంద్రంలోని నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకోవచ్చునో, ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అడ్డుకోవచ్చునో సీమాంధ్ర పెట్టుబడిదారులు రుజువు చేసి చూపించారు. హైదరాబాద్ ను అడ్డంగా పెట్టుకున్నది ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము అక్రమంగా సంపాదించిన ఆస్తులు కోల్పోవలసి వస్తుందనో అని వారి భయం. అందుకే సమైక్యాంధ్ర నినాదాన్ని కేంద్రం ముందుకు తెచ్చి తెలంగాణను అడ్డుకుంటున్నారు.

55 సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని సీమాంధ్రకు తరలించడం ఇక ముందు సాధ్యపడదని వారి భయం. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం, మిగతా తెలంగాణ నుంచి కాని లేదా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ. ఉదాహరణకు 2003 ఏప్రిల్, 2007 జనవరి మధ్యలో సీమాంధ్ర ఆదాయం 17270 కోట్ల రూపాయలు.అదే కాలంలో హైదరాబాదేతర తెలంగాణ ఆదాయం 22318 కోట్ల రూపాయలు. హైదరాబాద్ ఆదాయం 32432 కోట్ల రూపాయలు.అంటే హైదరాబాదేతర తెలంగాణ ఆదాయం సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ. హైదరాబాద్ ఆదాయం సీమాంధ్ర ఆదాయం కంటే రెట్టింపు. ఈవిధంగా బంగారు గుడ్లు పెడుతున్న హైదరాబాద్‌ను, తెలంగాణను సీమాంధ్రులుఎలా వదులుకుంటారు? ఈ వివరాలు ఎవరో తెలంగాణ వాది చెప్పినవి కాదు.

అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య మార్చి 2007లో శాసన సభలో స్వయంగా చెప్పారు. హైదరాబాద్‌కు సీమాంధ్రుల వల్ల గత 40 సంవత్సరాలలో ఎంతో నష్టం జరిగింది. హుస్సేన్‌సాగర్, వక్ఫ్ భూములు మూసీ నది ఆక్రమణకు గురైంది. ఉర్దూ భాష అంతరించి పోతున్నది. మత కలహాలు పెరిగాయి. హైదరాబాద్ చుట్టూ 60 కిలోమీటర్లలో రింగ్ రోడ్లను ఏర్పాటు చేసి దోపిడీకి ద్వారాలు తెరిచింది సీమాంధ్ర ప్రభుత్వం. ఇలాంటి ఘోరాల నుంచి హైదరాబాద్‌ను కాపాడాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకం. కొత్తగా ఏర్పడే తెలంగాణకు రాజధాని హైదరాబాద్ ఉండాలి. ఇది తెలంగాణ ప్రజల హక్కు కూడా.అలాగే ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా హైదరాబాద్‌ను తెలంగాణ ప్రజలు ఒప్పుకునేది లేదు.చారివూతాత్మకంగా చూసినా,బౌగోళికంగా, ఆర్ధిక పరంగా చూసినా హైదరాబాద్ తెలంగాణది.

సీమాంధ్ర ప్రాంతం వారికి హైదరాబాద్‌లో నివాసం, వ్యాపారం ఉద్యోగం చేసుకోవడానికే తప్ప హైదరాబాద్‌ను ఆంధ్రకు రాజధానిగా అడిగే ఎలాంటి హక్కు లేదు. 1952లో పొట్టి శ్రీరాములు మద్రాస్‌ను నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చేయాలని మొండిగా 58 రోజులు నిరాహార దీక్ష చేసినా మద్రాస్‌ను ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చేయలేదు. మరి ఇప్పుడు హైదరాబాద్‌ను ఎలా వారికి కావాలని సీమాంధ్రులు అడుగుతున్నారు? కొత్తగా ఏర్పడే తెలంగాణ , హైదరాబాద్ తెలంగాణకు రాజధాని కావడం వలన కానీ సీమాంధ్ర ప్రజలు విద్యార్థులు భయపడనవసరం లేదు. తెలంగాణ వారిని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళమనడం లేదు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్నాయి.ఐటీ లాంటి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సీమాంధ్రులతో సహా భారతీయులు ఎవ్వరైనా హైదరాబాద్ లో చేసుకోవచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతర మెందుకు?


డాక్టర్ ఖలీల్ రహ్మాన్
ఉప సంచాలకులు పశు సంవర్ధక శాఖ, కరీంనగర్

Monday, November 7, 2011

కాంగ్రెస్ జిత్తులకు మాయావతి పైయెత్తు

2004 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆశగా చూపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 లో కూడా తెలంగాణాలో ఎన్నికలు ముగిసే వరకూ అదేపాట పాడి, ఎన్నికలు పూర్తైన మరుక్షణం వైయెస్ రూపంలో తొండి చేసింది.

ఇక వీలైనంత కాలం సమస్యను నానపెట్టి, వీలుకానప్పుడల్లా కమిటీలు కాకరకాయలూ అంటూ చేయవలసినంత తాత్సారం చేసింది. అన్ని కమిటీలు దాటి అమ్మ గారిదక్కరికి సమస్య వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇది చాలా క్లిష్యమైన సమస్య అనీ, దీంట్లో వేలు పెడితే ఇంకా పదో పరకో రాష్ట్రాల డిమాండ్లు వస్తాయంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టింది. మరి ఈ విషయాలు 2004 లోనో, 2009 లోనో ఎందుకు గుర్తుకు రాలేదంటే సమాధానం వుండదు.

ఇదిలా వుండగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి కంచుకోటను పగలగొట్టడానికి ఎత్తులు వేస్తూ బుందేల్ ఖండ్ పాట పాడసాగింది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో వుండికూడా గత ఏడు సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్న పార్టీ ఇప్పుడు బుందేల్ ఖండ్ విషయంలో ఏదో చేస్తుందనేది హాస్యాస్పదమే అయినా అధికారం కోసం ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. 

కాకపోతే ఇక్కడే ఆ పార్టీ మాయావతి తెలివితేటలను తక్కువగా అంచనా వేసింది. హటాత్తుగా ఇప్పుడు నవంబర్ 21 నాడు ఉత్తరప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా విభజించే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది కాంగ్రెస్ పరిస్థితి.


రాష్ట్ర విభజన అస్త్రంతో మాయావతిని ఇబ్బందులకు గురి చేయాలని కాంగ్రెస్ తలపోసింది. కాని రాష్ట్ర విభజన గురించి ప్రకటించడం ద్వారా, అది తనకే లాభమని మాయావతి ప్రకటించినట్టయింది. రాష్ట్ర విభజన వల్ల BSP నాలుగు రాష్ట్రాల్లో నలుగురు ముఖ్యమంత్రులను తయారు చేసుకోగలదు. పదవుల ఎరతో ఎక్కువమంది నాయకులను సంతృప్తి పరచగలదు. తద్వారా పార్టీని ఎక్కువగా బలోపేతం చేసుకోగలదు. పైగా చిన్న రాష్ట్రాలు దళితులకు అనుకూలం అన్న అంబేద్కర్ సూత్రం ఎలాగూ ఉండనే వుంది.

ఇదివరకే బక్రీద్ పండగ తర్వాత తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కాంగ్రెస్ కేంద్ర కమిటీ హామీ ఇచ్చింది. మారిన పరిస్థితులలో తన ప్రకటన ఎలా ఉండాలన్న విషయం మీద ఆ పార్టీ పునరాలోచించుకోక తప్పదు. ఒక వేళ తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటన ఇస్తే, అది ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాక ఆ పార్టీ క్రెడిబులిటీ పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుంది.

Sunday, November 6, 2011

ఆవిడ జై తెలంగాణా, ఆయనేమో జై విశాలాంధ్ర


  

తెలంగాణా ఏర్పాటును ఎవరు వ్యతిరేకిస్తున్నారు?



కొందరు సీమాంధ్రకు చెందిన బడా వ్యాపారులు 

వీరికి రాష్ట్రంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులున్నాయి. వాటి వివరాలు గతంలోనే చర్చించాం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇవి, ఇక ముందు రాబోయే మరిన్ని కాంట్రాక్టులు కోల్పోతామేమోనని వీరి భయం. పైగా అధికార గణాన్ని అడ్డం పెట్టుకొని ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెంచివేసి, పనులు చేయకుండా, ఒకవేళ చేసినా అత్యంత నాసిరకంగా చేస్తూ అందినకాడికి డబ్బులు దోచేస్తున్నారు. 

ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వీరికి వత్తాసు పలికే ప్రభుత్వాలు రాకపోవచ్చు. అప్పుడు వీరి అక్రమాల నన్నిటినీ తిరగదోడి, మూకుమ్మడిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే అవకాశం వుంది. ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పక్షపాతవాద, దోపిడీవాద వ్యవస్థ నడుస్తున్నప్పుడే ఓ రామలింగరాజు, ఓ కోనేరు ప్రసాద్ లాంటివారు ఊచల్లెక్కబెట్టవలసి వచ్చింది. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేపోమాపో అన్నట్టు లైన్లో వున్నారు. ఇక ఈ వ్యవస్థ మారితే పడే తలలు ఎన్నుంటాయో, రాష్ట్రాన్ని వ్యతిరేకించే వ్యాపా-రాజకీయుల్ని చూస్తే సులభంగానే అర్థం అవుతుంది.

ఇక్కడ ప్రభుత్వం అనకుండా 'వ్యవస్థ' అని ఎందుకంటున్నానంటే, ఈ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం అనేదానికి అంత ప్రాధాన్యత లేదు. గత ముప్పై ఏళ్ళ రాష్ట్ర చరిత్ర చూస్తే, ప్రభుత్వం ఏదున్నా, అధికారంలో ఏ పార్టీ వున్నా పెత్తనం మాత్రం ఒక ప్రాంతందే నని, ఆ ప్రభుత్వం ఆశయం మాత్రం అక్కడి పెట్టుబడి దారులకు రాష్ట్రాన్ని దోచిపెట్టడమేనని రుజువైపోయింది. 

మరో విధంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వాలతో పనిలేకుండా ఒక సీమాంధ్ర దోపిదార్ల సిండికేట్ అనబడే ఒక వ్యవస్థ గట్టిగా వేళ్ళూనుకుంది. అధికారంలో తెలుగుదేశం వున్నా, కాంగ్రెస్ వున్నా నడిచేది మాత్రం ఇదే వ్యవస్థ. లబ్ది పొందేది ఈ వ్యవస్థలోని సభ్యులు మాత్రమే. బలంగా వున్న ఈ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ఒక్కటే మార్గం. అప్పుడు మాత్రమే రెండువైపులా ఉండే సామాన్యులకు మేలు కలుగుతుంది.

కొందరు సీమాంధ్రకు చెందిన బడా భూస్వాములు 

పెట్టుబడిదారుల విషయంలో పైన చెప్పుకున్న కారణాలు చాలావరకు వీరికి కూడా వర్తిస్తాయి. వాస్తవానికి పెట్టుబడి దారులకు వెనుక వున్న చోదకశక్తి ఈ భూస్వాములే. అయితే వీరికి అదనంగా ఇంకో భయం వుంది. అదే  నీళ్ళు. రాష్ట్రప్రభుత్వ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొన్న వీరు తెలంగాణాలో వున్న పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికాకుండా చేయగలరు. అలాగే పైకి తెలంగాణా పేరు చెప్పుతూ, వారికి మాత్రమే ప్రయోజనం కలిగే పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులను, అదనపు జలాల పేరుతో పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను ఆఘమేఘాల మీద పూర్తి చేయించుకోనూ గలరు. తెలంగాణాకి మేలుచేస్తున్న రాజోలిబండ లాంటి ఏ చిన్న ప్రాజెక్టు కూడా పనిచేయకుండా దాని తూములను బాంబులు పెట్టి ధ్వంసం చేయగలరు. అలా చేసి శిక్షా లేకుండా బయటపడనూ గలరు. 

తెలంగాణా ప్రాంతంలో 1952 లో మొదలైన భూసంస్కరణలు 1970 కల్లా చాలావరకు అమలు జరిగాయి. కాని సీమాంధ్రలో మాత్రం అవి ఇప్పటి వరకు అమలు జరగలేదు. అలా అమలు జరక్కుండా ప్రభుత్వాలకు ముకుతాడు వేసి ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న చరిత్ర ఈ భూస్వాములది. 1972 లో కూడా పీవీ నరసింహారావు ఆంధ్రాలో భూసంస్కరణలు అమలు జరపడానికి పూనుకొని, సదరు భూస్వాముల ఆగ్రహానికి గురై పదవీచ్యుతుడైన సంగతి విదితమే. ఫలితంగా సీమాంధ్రలో దాదాపు 85 శాతం భూమి భూస్వామ్య శక్తుల చేతిలోనే కెంద్రీకరింపబడి వుంది. నిజంగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్న నిజమైన రైతులు మాత్రం నామమాత్రం కౌలుకు పంటలు పండిస్తూ, అరకొర ప్రతిఫలంతో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు.

భూస్వామ్యం, వ్యాపారం, రాజకీయం కలగలిపితే వచ్చే డబ్బుతో, అధికారంతో వీరు దళిత బహుజనులని అణగదొక్కుతూ కాలం గడుపుతూ వున్నారు. ఎప్పుడైనా నిమ్న వర్గాల వారు చైతన్యవంతం అవుతున్నారని తెలిస్తే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితి. అయితే రాష్ట్రం విభజన అంటూ జరిగితే అది వీరి ఆర్ధిక మూలాలను బలంగా దెబ్బ తీస్తుంది. తద్వారా దళిత బహుజనులు తిరిగి చైతన్యవంతులయ్యే అవకాశం, అధికారాన్ని ఫ్యూడల్ శక్తులనుండి ఊడలాక్కునే అవకాశం పొంచివుంది. అది ఈ వర్గాలకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం.

కొందరు తెలంగాణాకు చెందిన రాజకీయ గణం

కొందరు తెలంగాణలో వున్న రాజకీయ నాయకులు ప్రజల ఆగ్రహానికి భయపడి, ఒకవైపు 'జై తెలంగాణా' అంటూనే మరోవైపు తెలంగాణా వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తూ, వారు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడుతూ తమ ప్రజలకే ద్రోహం చేస్తున్నారు. ద్రోహం అని ఎందుకంటున్నానంటే, వారికి సమైక్యతే ఇష్టం అయితే ఆ విషయం బహిరంగంగానే ప్రకటించవచ్చు. అంతే కానీ ఒకవైపు మేం తెలంగాణా వాదులమే అని చెప్పుకుంటూ మరోవైపు నుండి ఉద్యమానికి తూట్లు పొడవడం నిస్సందేహంగా ద్రోహమే.

నిన్నటిదాకా తెలంగాణా స్టీరింగ్ కమిటీ అంటూ ఊదర గొడుతూ, దానికి నాయకత్వం వహిస్తూ, డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన జానారెడ్డి నేడు హటాత్తుగా ప్లేటు ఫిరాయించి తన అసలు రంగు బయట  పెట్టుకుంటూ తాను సమైక్యాంధ్రకు అనుకూలమేనని చెప్పడం తాజా ఉదాహరణ.

ఇలాంటివాళ్ళ స్వభావాలు తెలుసుకోవాలంటే వీరి గత చరిత్రలు చూడాలి. వీరు భూస్వాముల, దొరల వారసత్వం కలిగిన వారు. కొంతమంది కొత్తగా వచ్చిన డబ్బు అధికారంతో అలాంటి భూస్వామ్య స్వభావాన్ని కొత్తగా పుణికి పుచ్చుకున్న వారు కూడా ఉండవచ్చు. అలాంటి స్వభావాన్ని వదిలేసిన వారూ కొంతమంది ఉండవచ్చు. వారు ఏ స్వభావంతో ఉన్నారన్న విషయం వారు వ్యవహరిస్తున్న తీరును బట్టి వుంటుంది.

ఈ భూస్వామ్య గణాలు ఇదివరలో నిజాం నవాబుకు తొత్తులుగా వ్యవహరిస్తూ, తెలంగాణా ప్రజల మాన, ప్రాణ భక్షణకు కారకులైన నేరస్తులు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం నేపధ్యంలో వారు తమ ప్రాణాలరచేతిలో పెట్టుకొని హైదరాబాదు పారిపోయి నిజాం ఛత్రం కింద ప్రాణాలు దక్కించుకున్నారు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత ఇవే తెలంగాణా విద్రోహ భూస్వామ్య శక్తులు తలకు గాంధీటోపీ పెట్టుకొని, పోలీసుల రక్షణతో తిరిగి ఊళ్లలో అడుగు పెట్టారు. భూస్వాములుగా పోగొట్టుకున్న అధికారాన్ని నాయకులుగా తిరిగి దక్కించుకున్నారు. వీరి తర్వాత వీరి వారసులే రెండో తరం నాయకులుగా మారారు.

ఆ రెండో తరానికి చెందిన వారసులే ఇప్పటి నాయకులు. ప్రజాద్రోహం ఈ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఒకప్పుడు తమ ప్రజలకు ద్రోహం చేస్తూ నిజాంకి తొత్తులుగా వ్యవహరించిన వారు, ఇప్పుడు సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ మరోసారి ఇక్కడి ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు.

ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేని ఇలాంటి నాయకులు గెలవాలంటే సీమాంధ్ర పెట్టుబడి దార్లు సరఫరా చేసే డబ్బు, మందు, బిర్యాని ప్యాకెట్లు కావాలి. అవి కావాలంటే వారికి తొత్తులుగా వ్యవహరించాలి. అయితే ఈ నాయకులు ఇప్పటికీ గ్రహించలేక పోతున్న విషయం ఏమంటే, ఈనాటి తెలంగాణా ప్రజలు అలాంటి ప్రలోభాలకు ఇకపై ఏమాత్రం లోనయ్యే పరిస్థితిలో లేరన్న విషయం. ఇటీవల జరిగిన పన్నెండు ఉపఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం.  

కొందరు బ్లాగర్లు, కార్పోరేట్ ఉద్యోగులు, విద్యార్థులు 

వీరి గురించి మాట్లాడే ముందు వీరి నేపథ్యం పరిశీలించాలి. వీరు తమ జీవితంలో కష్టమన్నది ఎరుగరు. వీరి జీవితంలో స్కూలు ఫీజు కట్టలేనందుకో, పుస్తకాలు కొనలేనందుకో ఎప్పుడూ బెంచీపై నిలబడి వుండరు. తమ తండ్రులు సంపాదించిన డబ్బులతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని గొప్పగొప్ప స్కూళ్ళు, కాలేజీలలో చదువులు చదివారు. ఆ చదువులతో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని కొందరు, చదువు సరిపోక మరింత డబ్బు వెచ్చించి ఖరీదైన శిక్షణా తరగతులు, ప్లేస్మెంట్స్ ఇప్పించే సంస్థల సహకారంతో కొందరు ఉద్యోగాలను సంపాదించుకొని వుంటారు. కొందరు ఇంకా చదివే దశలోనే ఉండొచ్చు.

వీరికి తమపై తమకు విశ్వాసం చాలా ఎక్కువ.  తమ సమర్థత వల్ల తాము ఉన్నత స్థానాన్ని అధిరోహించామని, మిగతావారు ఆ సమర్థత లేక పోవడం వల్ల, అలా క్రిందనే ఉండిపోయారని అనుక్షణం నమ్ముతుంటారు. తమ కింది వారికి, తమకు అవకాశాల మధ్య వున్న అంతరం గ్రహించగలిగిన విద్య దురదృష్ట వశాత్తూ (ఒక విధంగా ఉద్దేశ పూర్వకంగానే) వీరికి నేర్పించబడలేదు. కాలేజీలో నేర్చుకున్న సైన్సు, మాథ్సు ఫార్ములాలు తప్ప మరోటి ఆలోచించడం వీరికి చేతకాదు.

ఇలాంటివారు 'దమ్ముంటే మీరు కూడా మాతో పోటీ పడండి, అంతేకాని చేతకాని దద్దమ్మల్లా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అడుగుతున్నారు?' అని ప్రశ్నించడం ప్రతిరోజూ మనం చూస్తుంటాం.  వీరి దృష్టిలో ప్రజలంటే దమ్మున్న వారు, దద్దమ్మలతో కూడిన సమూహాలు. దమ్మున్న వారు దద్దమ్మలపై గెలవడానికి, అధికారం చెలాయించడానికి పూర్తి హక్కుంటుంది. అలాంటి హక్కుకు వ్యతిరేకంగా పోరాడే వారు దేశద్రోహులు.

డబ్బు, అధికారం కలిగిన వాడు సమూహంపై పెత్తనం చేస్తే, తిరిగి ఆ సమూహం గదిలో బంధించిన పిల్లిలా ఆ పెత్తందారులపై పోరాటం చేసే హక్కు కూడా కలిగి ఉంటుందనేది వీరికి అర్థంకాని విషయం.

Friday, November 4, 2011

చంద్రబాబు నోట చరిత్ర మాట!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నోట చరిత్ర అనే మాట వెలువడడమా? ఎంత అపచారం! నవంబర్ 1న ఎన్‌టిఆర్ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ పతాకావిష్కరణ తర్వాత ఆయన చరిత్ర చెప్పడానికి ప్రయత్నించారట. మూడు వేల సంవత్సరాల తెలుగు వారి చరిత్రలో తెలుగు ప్రజలు విడిపోయి ఉన్నది 150 ఏళ్లేనని అన్నారట. తెలుగువారి ఐక్యత కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు పదవీత్యాగం చేశారని అన్నారట. అసలు చరిత్రే అక్కర లేదన్న ఘనచరిత్ర గల మహానేత! ఈ చరిత్ర పాఠాలు ఏ పాఠశాలలో నేర్చుకున్నారో తెలియదు.

సరిగ్గా పన్నెండు సంవత్సరాల కింద 1999 నవంబర్‌లో హైదరాబాద్ జరిగిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పటి డిగ్రీ కాలేజీల దుస్థితి గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించే ప్రసక్తే లేదని, చరిత్ర, అర్థశాస్త్రం, ఆర్ట్ కోర్సులకు కాలం చెల్లిందని, ఆ డిగ్రీలన్నీ వృథా అని, కంప్యూటర్లు, వైద్యం, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యలు చాలునని అన్నారు. అప్పుడు పత్రికలన్నిటిలో ఆ వార్త హోరెత్తింది. చరిత్ర అధ్యాపకులు నిరసన ప్రకటనలు కూడా చేశారు.

(అప్పుడు ఆంధ్రవూపభలో రాస్తుండిన వారం వారం శీర్షికలో నవంబర్ 30న ప్రపంచ బ్యాంకు పాఠాలు చాలు, చరిత్ర ఎందుకు? అనే వ్యాసంలో ఆ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ రాశాను.) ఆ తర్వాత కూడ ఆయన ఆ అభిప్రాయాన్ని ఎన్నోసార్లు పునరుద్ఘాటించారు. చరిత్ర అక్కరలేదని అనుకునేవారు తప్పుడు చరిత్రను చెప్పడంలో, తమ ఇష్టారాజ్యంగా చరిత్రను వక్రీకరించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారు, చరిత్ర కావాలనుకునేవారు నిజాయితీగా నిజమైన చరిత్రను తెలుసుకోవలసి ఉంటుంది.

చంద్రబాబు చేసిన రెండు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. చరివూతలో జరగని, చరిత్రతో సంబంధంలేని విషయాలు. మూడు వేల ఏళ్ల తెలుగువారి చరిత్రలో తెలుగు ప్రజలు కలిసి ఉన్నది ఎక్కువలో ఎక్కువ నాలుగువందల యాభై సంవత్సరాలు మాత్రమే. చంద్రబాబు చెప్పినట్టు విడిపోయి ఉన్నది 150 ఏళ్లు కాదు, రెండువేల ఐదువందల సంవత్సరాలకు పైగా. తెలుగువారి చరిత్ర గురించి ఏ ప్రామాణిక గ్రంథం చూసినా ఈ వాస్తవం తెలుస్తుంది. కళింగ, వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు, సబ్బినాడు మొదలై న నాడులేర్పడి ప్రతి నాడులోను స్వతంత్ర రాజ్యం వెలసి రాజకీయైక్యానికి భంగం వాటిల్లింది. రాజకీయంగానేగాక, ప్రతివర్ణం లోను నాడీభేదం ఏర్పడి సాంఘిక అనైక్యానికి కారణమై జాతీయభావం దుర్బలమయింది. రేనాడు, తెలంగాణ ప్రాంతాలు చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనలోనే ఉండ డం జరిగింది. సుదీర్ఘమైన తమ చరిత్రలో ఆంధ్రులు అత్యల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగినారు అని స్వయం గా గుంటూరు జిల్లాకు చెందిన, నాగార్జున విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసిన బి.ఎస్.ఎల్ హనుమంతరావు రాశారు.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రాంతం మొత్తంగా గాని, తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాలు అన్నీగాని 1956కు ముందు ఒకే పాలనలో ఎప్పుడూ లేవు. ఈ భూభాగంలో అతి ఎక్కువ ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిప త్యం కింద పాలించిన రాజవంశాలు శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు మాత్రమే. క్రీ.పూ. మూడో శతాబ్దం మధ్య నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం తొలిరోజుల దాకా నాలుగు శతాబ్దాల పాటు పాలించిన శాతవాహనులు ఎక్కువగా ఇవాళ్టి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి పాలించారు. వారు ఆ నాలుగు శతాబ్దాల కాలంలో తూర్పు సముద్రాన్ని చేరిన ఆధారాలున్నాయి గనుక కోస్తాంధ్రలో కొంతభాగం వారి ఏలుబడిలోకి వచ్చిందని అనుకోవచ్చుగాని మిగిలిన తెలుగు ప్రాంతాలు వారి పాలనకు బైటనే ఉండిపోయాయి.

శాతవాహనుల తర్వాత కాకతీయుల వరకు తెలుగు వారు వేరువేరు చిన్న రాజ్యాల పాలనలలోనే ఉన్నారు. ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, కళింగ రాజ్యాలు, విష్ణుకుండినులు, పల్లవులు, రేనాటి చోడులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, హైహయులు, వగైరా ఎన్నో వంశాలకు చెందిన రాజులు ఈ ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో తెలుగువారిని పాలించారు. వీరిలో అతి పెద్ద భూభాగాన్ని పాలించినవారు కూడా ఇవాళ్టి నాలుగు జిల్లాలకు మించి పాలించలేదు. పైగా ఈ రాజుల మధ్య, వారి సామంతుల మధ్య నిత్యం యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి గనుక, ఆనాటి రవాణా సంబంధాలు అత్యల్పం గనుక ఆయా ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఐక్యత ఉండిందని కూడ చెప్పడానికి వీలులేదు. ఆతర్వాత 950 నుంచి 1323 వరకు నాలుగు వందల సంవత్సరాలు హనుమకొండ, వరంగల్లు రాజధానులుగా పాలన నడిపిన కాకతీయుల కాలంలో, ముఖ్యంగా 1199 నుంచి 1262 వరకు పాలించిన గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అలా చూసినా మొత్తంమీద కాకతీయుల కాలంలో తెలుగువారందరూ ఒకేపాలనలో ఉన్న కాలం నూటయాభై ఏళ్లకు మించదు.

కాకతీయుల పతనం నుంచి కుతుబ్ షాహీల పాలన మొదలయ్యేదాకా, పదహారో శతాబ్ది మధ్య దాకా, మళ్లీ తెలుగు ప్రజలు వేరువేరు పాలనల కింద నే కొనసాగారు. ఎక్కడికక్కడ రెడ్డి రాజులు, నాయక రాజులు తలెత్తి ప్రస్తుత జిల్లా కన్నా తక్కువ భాగాన్ని మాత్రమే పాలించారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం విశాలమైనదే గాని, మహాఘనత వహించిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడ ఆ పాలన కృష్ణానదిని దాటి తెలంగాణలో అడుగుపెట్టలేదు. తెలుగు ప్రజలను ఏకం చేయలేదు. రాచకొండ, ఖమ్మం, కొండపల్లి వంటి దుర్గాల మీద శ్రీకృష్ణదేవరాయల దాడి ఆ దుర్గాలను దోచుకోవడానికే గాని తెలుగు ప్రజలను ఏకం చేయడానికి కాదు!

విజయనగర పతనానంతరం గోల్కొండ రాజధానిగా తలెత్తిన కుతుబ్ షాహీల కాలంలో, దాదాపు 1670 ప్రాంతంలో దాదాపు ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే పాలన కిందికి వచ్చింది. కానీ అప్పుడు కూడ కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని గణనీయమైన భాగాలు ఆ పాలనలో భాగం కాలేదు. మొఘల్ చక్రవర్తుల సామంతులుగా ఉండి 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అసఫ్ జాహీలు దాదాపు కుతుబ్ షాహి రాజ్యాన్నే పాలించారు కాని 1766 నుంచి 1802 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలను బ్రిటిష్ పాలకులకు ఇచ్చేశారు. మొత్తంగా తేలేదేమంటే, చంద్రబాబు తెలుసుకోవలసినదేమంటే, తెలుగువారు ఒకే పాలన కింద ఉన్న సమయాలు శాతవాహనుల పాలనలో దాదాపు 200 సంవత్సరాలు, కాకతీయుల కాలంలో దాదాపు150 సంవత్సరాలు, కుతుబ్ షాహి అసఫ్ జాహీ పాలనలో దాదాపు వంద సంవత్సరాలు, వెరసి మొత్తం 450 సంవత్సరాలు మాత్రమే.ఇంతకూ ఎంతకాలం కలిసి ఉన్నారు, లేదా విడిగా ఉన్నారు అనేది ప్రశ్న కాదు, ఒకరితో ఒకరు ఎట్లా ఉన్నారు అనేది ప్రశ్న. మొత్తానికి మొత్తం మూడువేల ఏళ్లూ కలిసే ఉన్నప్పటికీ కూడా,జరిగిన అన్యాయాలు, వివక్ష, ద్రోహాలు, వాగ్దానాల ఉల్లంఘనల తర్వాత విడిపోక తప్పని స్థితి ఏర్పడింది. విడిపోవాలనే కోరిక సమంజసమైనదే, న్యాయమైనదే. ఆ కోరికను తప్పుడు చరిత్ర సాయంతో కాదనడం అవివేకం, అజ్ఞానం, అన్యాయం, అమానవీయం.

ఇక పొట్టి శ్రీరాములు తెలుగువారి ఐక్యత కోసం ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు నోట పలికిన రెండో అబద్ధం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాషా ప్రాంతాలను వేరు చేసి రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాత్రమే, కొత్త రాష్ట్రానికి రాజధాని గా మద్రాసు ఉండాలని మాత్రమే. నిరాహారదీక్ష సాగుతుండగానే 1952 డిసెంబర్ 8న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని, కాని ఆంధ్ర రాష్ట్రవాదులు అడుగుతున్నట్టుగా వారికి మద్రాసు ఇవ్వడం కుదరదని ప్రధాని నెహ్రూ అన్నారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత కూడ శ్రీరాములు నిరాహారదీక్ష విరమించలేదు, ఆ తర్వాత వారానికి మరణించారు. అంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా, మద్రాసును ఆంధ్రకు ఇవ్వడమే ప్రధానమైందన్నమాట. అప్పటికే కొందరి మనసుల్లో విశాలాంధ్ర భావన ఉండవచ్చుగానీ పొట్టి శ్రీరాములు ప్రకటించిన డిమాండ్లలో మాత్రం ఆ ప్రస్తావన లేదు. ఆయన కోరని డిమాండ్‌ను ఆయన నోట పెట్టడం చంద్రబాబు వంటి చరిత్ర వద్దనే వారికి మాత్రమే చెల్లుతుంది.
అబద్ధాలతో, వక్రీకరణలతో పాలన సాగించవచ్చుగాని, చరివూతను పునర్నిర్మించలేమని, ప్రజా ఉద్యమాల మీద బురద చల్లలేమని చంద్రబాబుకు తెలిస్తే బాగుండును!

Thursday, November 3, 2011

పాపం అమరజీవి - 4


మూలం: ఆంధ్రప్రభ డిసెంబరు 15 1952 

పాపం అమరజీవి - 3

అది 1952 డిసెంబరు 14 . అమరజీవి అంపశయ్య పై కొట్టుమిట్టాడుతున్నాడు. కేంద్రం ఆంద్ర రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది.  అప్పుడు నాయకమ్మన్యుల మాటలు చూడండి. ఎవరు చచ్చినా మద్రాసు మాత్రం కావాలట! అరవం మాట్లాడినా అరవలు కారట!


మూలం: ఆంధ్రప్రభ - డిసెంబరు 15 1952

Wednesday, November 2, 2011

పాపం అమరజీవి - 2



పాపం అమరజీవి - 1


ఆంధ్రా ప్రాంతం యావత్తూ మద్రాసు లేని ఆంధ్రా రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధంగా వుండగా కొంతమంది అత్యాశా పరులైన రాజకీయులు మాత్రం చేన్నపురికోసం పొట్టి శ్రీరాములును అడ్డం పెట్టుకొని వెళ్ళాడడానికి చిత్రరూపమే పై కార్టూన్. 

కాకతాళీయమే అయినా ఈ కార్టూన్ పొట్టిశ్రీరాములు చనిపోయిన రోజే అచ్చయింది. 

మూలం: ఆంధ్రప్రభ 16 డిసెంబరు 1952

అబద్ధాలబాబు తాజా అబద్ధం



ఒక వైపు తెలంగాణా వారు 'మా చరిత్ర వక్రీకరిస్తున్నారు మొర్రో' అంటే 'అబ్బే ఎక్కడా?' అని అమాయకంగా అడుగుతారు సమైక్యవాదులు. ఎక్కడో ఎందుకు? ప్రతి రోజూ, ప్రతి క్షణం దృష్టాంతాలు కనబడుతుంటే!

చూసారుగా చంద్రబాబు నాయుడుగారి స్పీచు! తెలుగుజాతి సమైక్యత కోసం పొట్టిశ్రీరాములు ప్రాణాలర్పించారట! ఇంతకన్నా ఈ శతాబ్దంలో పెద్ద అబద్ధం ఇంకేమైనా ఉందా? ఈ పెద్దమనిషి 2009లో వోట్లు దండుకోవడానికి తెలంగాణా తెచ్చేది నేనేనని, నా మాటంటే మాటేనని, కాంగ్రెస్ లాగా కాదని ఊదరగొట్టాడు. అదే సంవత్సరం డిసెంబరు నాటికే మాట మార్చి తెలంగాణా ప్రకటన అర్ధరాత్రి ఎలా చేస్తారంటూ తన సమైక్యవాద విషకోరలను బయట పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉప ఎన్నికల్లో తెలంగాణా ప్రజల వోట్లు గుర్తొచ్చి తనది రెండుకళ్ళ సిద్ధాంతమంటూ దేబిరించాడు. మొన్నటికిమొన్న నేను తటస్థ వాదినంటూ ఊకదంచాడు.

ఇప్పుడు తాజాగా కొత్త అబద్ధాల కూర్పుతో సమైక్యవాద సిద్ధాంతాలు మొదలు పెట్టాడు. పెద్ద చరిత్రకారుడిలా తెలుగు జాతి మొత్తం 150  సంవత్సరాలు తప్ప మూడువేల సంవత్సరాల నుంచీ కలిసే వుందట! ఇలాంటి వెర్రి మొర్రి వాదాలని తెలంగాణా ప్రజలు ఎప్పుడో తిప్పికొట్టిన సంగతి (చూ: http://telangaanaa.blogspot.com/2011/04/blog-post_27.html) ఈయన కింకా తెలియదేమో పాపం! 

ఇక ఈ పెద్దమనిషి చెప్పిన మహా అబద్ధం వక్రీకరించిన పొట్టిశ్రీరాములు చరిత్ర. పొట్టిశ్రీరాములు దీక్షకు దిగింది ఆంద్ర రాష్ట్రం కోసం కాదట సమైక్య తెలుగు రాష్ట్రం కోసమట! ఆంద్రపత్రిక డిసెంబరు పదో తారీఖు పేపరు చూస్తే విషయం అర్థం అవుతుంది.

పై పత్రికలో వార్త ఏం చెపుతుంది? ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు తమిళులకి ఏమాత్రం అభ్యంతరం లేనట్టూ, తమిళ భూభాగంలో అంతర్భాగమైన మద్రాసుకోసమే పొట్టిశ్రీరాములు దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలియడం లేదూ? 

ఇప్పడు తమ భూభాగంలో అంతర్భాగం కానటువంటి హైదరాబాదును కోరుతున్న (కుహనా) సమైక్యవాదుల్లాగానే అప్పుడు కూడా పొట్టి శ్రీరాములు మద్రాసుపై గొంతెమ్మ కోరికతో పరమపదించారని పై వార్త చదివితే తెలుగు తెలిసిన వారందరికీ అర్థమౌతుంది. మరి పొట్టిశ్రీరాములు సమైక్య తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించాడని చంద్రబాబుకి ఎలా జ్ఞానోదయమైందో ఆయనకే తెలియాలి. 

Tuesday, November 1, 2011

మా తెలుగు తల్లికి...


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో వేరొకటి కనుచూపులో వొకటి,
చిరునవ్వుతో సిరులు దాటించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
ఆంధ్రలో ముత్యాలు దొరులుతాయి.

ఆ రాజగోపాలు అపురూప నగరాలు  
కావూరి హిల్సులో ఘనమైన భవనాలు
తిక్కవరపుని యింట తిరుదేవుని సిరులు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రాజన్న కుయుక్తి రోషన్న బేమాని 
రాజకుమారీ లగడ రాసలీలల శక్తి 
చంద్రన్న మోసాల వెన్నుపోటుల యుక్తి 
మా చెవులు ఖంగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

సొంత బిడ్డలని అన్నల దాష్టీకానికి వదిలేసిన తెలుగుతల్లి వంచనకు నిరసిస్తూ...

ముమ్మాటికి విద్రోహ దినమే




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1నవంబరు, 1956న ఏర్పాటైన సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున తెలంగాణ ప్రజలు విద్రోహ దినంగా పాటిస్తారు. ఈ భావన పట్ల సీమాంధ్ర మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొందరి విద్రోహం వలన ఏర్పడింది కాదని వారి ఉద్దేశం. హెదరాబాద్ రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని వారి వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ముమ్మాటికి విద్రోహ రాజకీయాల ఫలితంగా ఏర్పడిందన్నది ఇవ్వాళ తెలంగాణ ప్రజలు నమ్ముతున్న వాస్తవం. ఫజల్ అలీ కమిషన్ ముందు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ నాయకులు, ప్రజాసంఘాలు తమ అనుమానాలను, భయాందోళనలను వివరిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. కమిషన్ చాలా నిజాయితీగా వాటన్నింటిని రికార్డు చేయడమే కాక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిగా కొనసాగాలని విస్పష్టమైన సిఫారసులను చేసింది.

హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి కమిషన్ రెండు సిఫారసులను చేసింది. మొదటిది-హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి మరాఠి మాట్లాడే మరాట్వాడా జిల్లాలను మహారాష్ట్రలో (అప్పటికి ఇంకా బొంబాయి రాష్ట్ర మే), కన్నడ మాట్లాడే జిల్లాలను కర్ణాటక రాష్ట్రంలో కలపాలి. రెండోది- మిగిలిన తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించాలి. 1961 లోనో ఆ తర్వాతనో జరిగే సార్వవూతిక ఎన్నికల అనంతరం ఏర్పడే హైదరాబాద్ శాసనసభలో (ఇక్కడ కమిషన్ Residuary Hyderabad State అన్న పదాన్ని వాడిందన్న సంగతిని గమనించాలి.) మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుంటే విలీ నం చెయ్యాలని, లేకుంటే ఆంధ్ర, తెలంగాణ విడిగా కొనసాగాలని కమిషన్ సిఫారసు చేసింది. ఫజల్ అలీ కమిషన్ చేసిన ఈ సిఫారసు విజ్ఞతతో చేసినదని చెప్పాలి. ఎందుకంటే పాత హైదరాబాద్ శాసనసభలో మరాట్వాడా, కర్ణాటక శాసన సభ్యులు హైదరాబా ద్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండేవారు.

పాత హైదరాబాద్ శాసనసభ ప్రకటించే అభివూపాయం తెలంగాణ ప్రజల అభివూపాయం కాజాలదు. కాబట్టి 1961లో తెలంగాణ జిల్లాలతో మాత్రమే ఏర్పడే శాసనసభ తీర్మానం ద్వారానే విలీనం జరగాలన్నది వారి అభిమతం. అది మాత్రమే తెలంగాణ ప్రజల మనోభావాలను వెల్లడిస్తుందని వారి అభిప్రాయంగా కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు విలీనానికి అనుకూలంగా ఉండి ఉంటే అది 1961లోనూ వెల్లడి అయ్యేది. మరి ఆంధ్రులు అప్పటి దాకా ఆగకుండా 1956 లోనే విలీనాన్ని ఎందుకు చేశారు ? తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర నాయకులకు అవిశ్వాసం ఎంతటిదో ఫజల్ అలీ నివేదికపై వారి వ్యాఖ్యానాలే నిదర్శనంగా ఉన్నాయి. నాటి ఆంధ్రపవూతిక ఈ వ్యాఖ్యానాలను రికార్డు చేసింది. ఆంధ్ర నాయకులు విలీనానికి ఎందుకు ఆతృత పడినారో ఆంధ్ర అసెంబ్లీలో వారి ప్రసంగాల్లో స్పష్టమైంది.

విలీనం వాయిదా పడితే ఇక విశాలాంధ్ర ఎన్నటికీ రాదు. ఆరేళ్ళు ఆగడం చాలా ప్రమాదకరం.1961 నాటికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఇంకా బలపడుతుంది. విశాలాంధ్రకు అప్పుడు ఒప్పుకోరు. 2/3 మెజారిటీ విశాలాంధ్రకు వచ్చుట కష్టం. (అయ్యదేవర కాళేశ్వరరావు) విశాలాంధ్ర ఇప్పుడు తప్పితే ఇక రాదు. (నీలం సంజీవడ్డి) విశాలాంధ్ర ఈనాడు ఎర్పడకపోతే అసంభవం కావచ్చునేమో (వావిలాల గోపాలకృష్ణయ్య). 1961దాకా ఆగితే అప్పటికే బలంగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాం క్ష మరింత బలపడుతుందన్న ఆలోచనతో వారు ఢిల్లీకి పరుగులు తీసి కేంద్ర నాయకత్వంతో తమకు ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేసి విశాలాంధ్రను వ్యతిరేకించిన ప్రధాని నెహ్రూ ను లొంగదీసుకోగలిగినారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును ప్రలోభాలకు గురి చేసి విశాలాంధ్ర వాదిగా మార్చివేసినారుపత్యేక రాష్ట్రవాదులుగా ఉన్న కొండా వెంకట రంగాడ్డి, మర్రి చెన్నాడ్డి తదితరులను తెలంగాణకు రక్షణలు కల్పిస్తామని హామీ ఇచ్చి లొంగదీసుకున్నారు.

మరాట్వాడా, కన్నడ ప్రాంత శాసనసభ్యుల మద్దతుతో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదింపచేసుకోవడంతో (ఇటువంటి తీర్మానం ఏదీ జరుగలేదని, కేవలం శాసనసభలో చర్చ మాత్రమే జరిందని ప్రొ.జయశంకర్ ఈ వ్యాస రచయితతో చెప్పారు. నిజానిజాలు తేల్చడానికి హైదరాబాద్ రాష్ర్ట శాసనసభలో జరిగిన చర్చల రికార్డులు దొరకని పరిస్థితి) వారు నెరిపిన విద్రోహ రాజకీయాలు సఫలమైనాయి. ఈ విద్రోహ రాజకీయాలకు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న గోసాయి స్వామీ రామానంద తీర్థ ప్రోత్సాహాన్నిచ్చారు. హైదరాబాద్ రాష్ట్రం విభజన అయితేనే మరాట్వాడా, కన్నడ జిల్లాలు తమతమ మాతృ భాషా ప్రాంతాలతో విలీనానికి అవకాశం ఏర్పడుతుందని భావించి హైదరాబాద్ రాష్ట్ర విభజనకు మద్దతునిస్తూనే విశాలాంధ్ర ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం అందించాడు.

హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో హైదరాబాద్ రాష్ట్ర విభజనకు, విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించడంలో ఈ గోసాయిదే కీలక పాత్ర. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, ఫజల్ అలీ సిఫారసులకు భిన్నంగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడడం విద్రోహం కాక మరేమవుతుంది ? విశాలాంధ్ర ఏర్పాటుకు వారు ఎందుకు ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్రరాష్ట్రం తెలంగాణ వనరులు లేకుం డా మనుగడ సాగించలేదని వారికి ముందునుంచే తెలుసు. తెలంగాణని కలుపుకోకుండా గోదావరి, కృష్ణా నీళ్ళపై ఆధిపత్యం సాధ్యపడదు. పారిక్షిశామిక ప్రగతికి, విద్యు త్ ఉత్పత్తికి కావలసిన బొగ్గుగనులు తెలంగాణలోనే ఉన్నాయి. సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మాణమై ఉన్న హైదరాబాద్ నగరం తమ చేతికి చిక్కాలంటే తెలంగాణని కలుపుకోవాలి.

పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్రానికి బదిలీ అయిన లక్షలాది ఎకరాల నిజాం సర్ఫేఖాస్ భూములు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మిగులు నిధులు, విస్తారమైన ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ తమ అధిపత్యంలోకి రావాలంటే విశాలాంధ్ర ఏర్పాటు ఒక్కటే మార్గం. విశాలాంధ్ర నినాదం వెనుక ఈ విస్తర ణ కాంక్ష ఉన్నదని ప్రధాని నెహ్రూకు ఆనాడే తెలుసు. కనుకనే ‘విశాలాంధ్ర నినా దం వెనుక రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న సామ్రాజ్యవాద భావాలున్నాయి’ అని స్పష్టంగానే ప్రకటించాడు.

ఆంధ్రోద్యమంతో పాటు 1936 నుంచే విశాలాంధ్ర భావ ప్రచారం ప్రారంభం అయిందని తెలుసుకుంటే విస్తుపోతాం. విశాలాంధ్ర భావన తెలంగాణలో ఎన్నడూ లేదు. ఇది ప్రధానంగా సర్కారు జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్. 1936లో ఆంధ్రా కాంగ్రెస్, స్వరాజ్యపార్టీలు తెలంగాణని కలుపుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశాయి. మామిడిపూడి వెంకట రంగయ్య 1937లో తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలిపి ఒకే ప్రదేశంగా ఏర్పాటు చెయ్యాలనే భావనని వ్యాప్తి చేసినాడు. ఆ తర్వత కడప కోటిడ్డి వారి సరసన చేరినాడు. ఆ తర్వాత 1946లో పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర భావనను సిద్ధాంతీకరించి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకాన్ని ప్రచురించాడు. అప్పటికే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటం జరుగుతున్నందున తెలంగాణలోని కమ్యూనిస్టులు కూడా సుందరయ్య సిద్ధాంతాన్ని సమర్థించారు.

1949లో అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటై అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో విశాలాంధ్ర ప్రచారం చేయసాగింది.. ఈ రకంగా సర్కారు జిల్లాలలో పుట్టిన విశాలాంధ్ర భావన మెల్లమెల్లగా తెలంగాణలో ప్రవేశించింది. అయితే విస్తృత ప్రజామోదం మాత్రం పొందలేకపోయింది. విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్‌లో జరిపిన సమావేశాలు జనం లేక ప్రజా ప్రతినిధుల హాజరు లేక వెలవెల బోతే  బడి పిల్లల ను కూచుండబెట్టి మమ అనిపించుకున్నారని బి.ఎన్ శాస్త్రి 1955లో ‘రెండు తెలుగు రాజ్యాలెందుకు’ ? అన్న పుస్తకంలో రాశారు. ఈ రకంగా సమావేశాలు జరపడం దండగ అని ఆంధ్ర నాయకులు అనుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 1952లో ఉధృతంగా కొనసాగిన ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ఉద్యమమే అందుకు సాక్ష్యం.

1948 నుంచి 1952 దాకా హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగాలలోకి ముల్కీ రూల్సు కు విరుద్ధంగా చొరబడిన నాన్ ముల్కీలను తరిమివేసేందుకు నాన్ ముల్కీ ఉద్యమం బద్దలైంది. 13 మంది విద్యార్థులు అమరులైనారు. అయినా కూడా నాన్ ముల్కీలు మాత్రం తెలంగాణ ఉద్యోగాల్లో తిష్టవేసినారు.

1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినదేమిటో అందరికీ తెలుసు.. నెహ్రూ చెప్పినట్లు ఆంధ్రుల సామ్రాజ్య విస్తరణ, వనరుల దోపిడీ నిరాఘాటంగా కొనసాగినాయి. ఫజల్ అలీ కమిషన్ పేర్కొన్నట్లు తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతం గా మారిపోయింది. అంతేకాదు తన ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. ఇవ్వన్ని జరిగినయి కనుకనే నవంబరు 1 తెలంగాణకు విద్రోహ దినం. తెలంగాణకు ద్రోహులు ఎవరు ? తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం మొదటి ద్రోహి. 60 ఏండ్ల సుదీర్ఘ పొరాటం జరుగుతున్నా, తన తప్పును సవరించుకుందామన్న ఇంగితాన్ని మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం. సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు ఉన్న అన్ని ప్రాతిపదికలని ధ్వంసం చేసిన, తెలంగాణ వనరులను కొల్లగొట్టుకుపోతున్న సీమాంధ్ర పాలక వర్గాలు రెండో ద్రోహులు.

తెలంగాణ వనరులపై, హైదరాబాద్ నగరం పై తమ భల్లూకపు పట్టును వదలిపెట్టడానికి ఇష్టపడని సీమాంధ్ర సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు ‘కలసి ఉంటే కలదు సుఖ’మని అంటున్నారు. తెలంగాణ కు స్వయంపాలనని నిరాకరిస్తున్నారు. దోపిడీకి అలవాటుపడిన వీరు తమ దోపిడీ సొమ్ముతో కేంద్రనాయకులను లోబర్చుకొని తెలంగాణ ఏర్పాటుని అడ్డుకొంటున్నారు. ఇక మరో రకం ద్రోహులు ఎవరంటే.. తెలంగాణ ఇంటి దొంగలు. తెలంగాణ మంత్రు లు, ప్రజావూపతినిధులు. సీమాంధ్రుల మోచేతి నీళ్ళు తాగడనికి అలవాటుపడి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నారు. ప్రజలు ఎంత ఛీత్కరించినా, ఎంత అవమానించినా చూరుకు వేలాడే గబ్బిలాల లెక్క పదవులను పట్టుకు వేలాడుతున్నారే తప్ప తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటాలతో మమేకం కావటం లేదు. ఈ ముగ్గురు తెలంగాణ ద్రోహుల విద్రోహ రాజకీయాలు విజయం పొందిన రోజు కనుకనే నవంబరు 1 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విద్రోహ దినమే.

Monday, October 31, 2011

తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర


సమైక్యవాదనల డొల్లతనం

సమైక్య వాదులు చేసే వాదనలు చాలా విచిత్రంగా వుంటాయి. ఏదో చిన్న పాయింటు దొరగ్గానే దాని పట్టుకుని వేళ్ళాడడం, అది చివరకంటా నిలబడక పోయే సరికి పలాయనం చిత్తగించడం లేదా, ఇంకో పాయింటు వెతకడం వారికి పరిపాటి. ఇలాంటి వారికి సమాధానాలు చెప్పడం కూడా సమయం వృధా చేసుకోవడం తప్ప మరో ప్రయోజనం లేదు. కాని ఈ వితండవాదులు కనపడ్డ ప్రతి చోటా ఇలాంటి వ్యాఖ్యలు కుమ్మరించడంతో అమాయకులైన జనాలు కూడా మోసపోయే అవకాశం వుంది. వారికోసమే ఈ వివరణ.

గత పది సంవత్సరాలుగా అడపా దడపాగా, గత రెండు సంవత్సరాలుగా మాత్రం వీరు విరివిగా చేసే వాదన ఇది. అదేమంటే కెసిఆర్ కి తెలంగాణా రావడం ఇష్టం లేదు. ఆయనదంతా రాజకీయంతో పబ్బం గడుపుకోవడానికి ఆడే నాటకం. అసలు కేంద్రం తెలంగాణా ఇస్తానన్నా కూడా కెసిఆర్ ఇవ్వనివ్వడు. ఎందుకంటే అది ఇస్తే ఇక ఆయనకు పని ఆదాయం లేకుండా పోతుంది. ఇలాంటివి.

కెసిఆర్ తెలంగాణా రానివ్వక పొతే వీళ్ళకు బాధెందుకు? వీల్లకేమైనా తెలంగాణా రావాలనే కోరిక ఏమైనా ఉందా? మరి తెలంగాణా రాక వీరికీ బాధలేదు, కెసిఆర్ కీ బాధలేదు. మరి వీరికేందుకు కెసిఆర్ మీద కోపం? ఈ ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానం వుండదు.

సరే తెలంగాణా ప్రజలు మోసపోతున్నారు అని వీరి బాధ అనుకుందాం. యాభై ఏళ్ళ చరిత్ర చూసినవాడెవ్వడూ వీళ్ళకి అలాంటి బాధ ఉంటుందని అనుకోడు. సరే, మాటవరసకు వుందే అనుకుందాం. మరి తెలుగుదేశం, కాంగ్రెస్ తెలంగాణా సాధించేది మేమే అని మానిఫెస్టోలలో పెట్టి జనాన్ని ఊదరగొట్టి వోట్లు దండుకున్నప్పుడు వారికి ప్రజలను మోసం చేస్తున్నారన్న స్పృహ కలుగలేదేం? అంటే వారు మోసం చేయడం లేదు, నిజమే చెప్తున్నారని వీరి ఉద్దేశ్యమా? ఒకవేళ నిజమే చెప్తున్నారు అని వీరనుకొన్నారు అనుకుందాం. మరి అప్పుడు రాష్ట్రాన్ని విడగోడుతున్నందుకు వీరికీ ఏ బాధా కలుగలేదే? కలుగలేదనే దానికి ప్రబల సాక్ష్యం ఎన్నికల ఫలితాలే. 

ప్రత్యేకరాష్ట్రం హామీ ఇచ్చిన పార్టీలన్నిటికీ అక్కడా సీట్లు వచ్చాయి. అంటే జనం వీరు చెప్పే విషయాలు నమ్మలేదని అయినా అనుకోవాలి. లేదా అక్కడి జనానికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం పట్ల అభ్యంతరం లేదనైనా అనుకోవాలి. కాబట్టి వారిది తెలంగాణా పై సానుభూతి కాదనో, లేక వారి ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం పట్ల వ్యతిరేకత లేదనో రెండింటిలో ఒకటి నిజమని ఒప్పుకోక తప్పదు.

వారిది సానుభూతి కాదని ఒప్పుకున్నట్టైతే మరి కెసిఆర్ తెలంగాణా వారిని ఏదో మోసం చేస్తున్నాడని కురిపించే జాలి క్రుత్రిమమైనదే నని కూడా ఒప్పుకోవలసి వస్తుంది. అంటే తెలంగాణా కోసం పోరాడే వారిని ఏదో ఒకటి చెప్పి బురద చల్లదమే వారి ధ్యేయమని కూడా ఒప్పుకోవలసి వస్తుంది.

ఇక కెసిఆర్ పై వీరి ఆరోపణల విషయానికి వస్తే, తెలంగాణా ప్రజలు మునుపటిలా అమాయకులు ఎంతమాత్రం కారు. ఒక వేళ కెసిఆర్ తెలంగాణావాదం విడిచి ఒక అంగుళం పక్కకు జరిగాడని తెలంగాణా ప్రజలకు ఏమాత్రం అనిపించినా ఆయన్ని చెత్తకుండీలో వేసి ముందుకు పోగల సామర్థ్యం వుంది. దానికి నాయకత్వం వహించడానికి ఇప్పటికే అనేక సంస్థలు ముందుకు నడుస్తున్నాయి. ఇప్పుడు కెసిఆర్ అయినా, గద్దరైనా, బీజేపీ అయినా ప్రజలు నిర్దేశించిన బాటలో వెళ్ళ వలసిందే తప్ప, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు విరుద్ధంగా చెప్పినా వినే పరిస్థితిలో వారు లేరు. ఆ విషయంలో మన గౌరవనీయ సమైక్యవాద మేధావులు బాధపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. 

నవంబర్ ఒకటి: తెలంగాణ విద్రోహదినం

రెండు దృశ్యాలు:
ఒకటి: ఏటా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఉత్సవాలు జరుపుతున్నది. ముఖ్యమంత్రి, ప్రముఖులు ఆ రోజు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన త్యాగనిరతిని కీర్తిస్తుంటారు. సమైక్యరాష్ట్రం అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే సాధ్యమైందని తమ ప్రసంగాల్లో చెప్తుంటారు.

రెండు: తెలంగాణా వాదులం నవంబర్ ఒకటిని ప్రతి యేటా విద్రోహ దినంగా జరుపుకుంటున్నాం. నల్ల బ్యాడ్జీలు, నల్ల జండాలు ధరించి తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద నిరసన దీక్షలు చేస్తుంటాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా దోపిడీకి గురైందో వివరిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటాం.

ఎందుకీ భిన్నత్వం?
నవంబర్ ఒకటి ఎందుకింత భిన్నంగా కనిపిస్తూన్నది, వివాదాస్పదమైంది? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని తెలంగాణ ప్రజలం ఎందుకు విద్రోహదినంగా పరిగణిస్తున్నం? అసలు పొట్టి శ్రీరాములు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేసారు? ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు పూర్వం ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల చారిత్రక నేపథ్యం ఏమిటి?

కథా ప్రారంభం:
ఆంధ్ర ప్రాంత చారిత్రక నేపథ్యం బ్రిటిష్ పాలనలో మదరాసు రాష్ట్రంలో భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలుండేవి. పూర్వం చంద్రగిరి రాజుల పాలనలో స్థాపితమైన ఆంధ్ర పట్టణం చెన్నపురి బ్రిటిష్ పాలనలో మదరాసుగా విస్తరించబడి రాజధాని నగరంగా ఏర్పడింది. తమిళులు నివసించే ప్రస్తుత తమిళ జిల్లాలతో, తెలుగు మాట్లాడే ఆంధ్ర జిల్లాలతో కలిపి మదరాసు ప్రెసిడెన్సీ ఉండేది.

1911లో గుంటూరు పట్టణంలోని ఒక న్యాయస్థానంలో అరవ(తమిళ) వ్యక్తి జడ్జీగా ఉండేవారు. ఆ కోర్టులో ఒక చప్రాసీ (ఆంద్ర్హ భాషలో బంట్రోతు) ఉద్యోగం ఖాళీ ఉంటే తన ప్రాంతీయుడైన అరవ వ్యక్తిని జడ్జీగారు నియమించారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆంధ్ర ప్రాంతీయులు మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేయాలని ఆందోళన ప్రారంభించారు.

1936లో దేశంలో మొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. దీనితో ఉమ్మడి మదరాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు మరింత ప్రోత్సాహం లభించినట్లయింది.

అనంతపురంలో పెట్టాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించారనే కోపం రాయలసీమ ప్రజలకు కోస్తా ప్రాంత ఆంధ్రులపై వున్నందున సీమ ప్రాంతం మదరాసు రాష్ట్రంలోనే వుంటుందని ఆ ప్రాంత నేతలు కోస్తాంధ్రులతో విభేదించారు. వారిని శాంతింప చేయడానికి 16 నవంబర్ 1937న ఇరు ప్రాంతాల పెద్దలు కూర్చొని ‘శ్రీభాగ్’ ఒప్పందం చేసుకున్నారు.
కాగా, 1937లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభ ఆంధ్ర రాష్ట్రానికై సిఫార్సు చేసింది. దీన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించారు. ‘ఆటవిక కోర్కె’గా రాజాజీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు.

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ నియమించిన ధార్ కమిటీ (లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమీషన్) భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆమోదం తెలపలేదు.

1948లో ఏర్పాటైన జె.వి.పి (జవహర్‌లాల్, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి) కమిటీ మాత్రం దేశంలో కొత్త రాష్ట్రాలు అవసరం లేదంటూనే కేవలం (మదరాసు మినహా) ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 1949 ఏప్రిల్‌లోనే ఆమోదం తెలిపింది. అయితే, దీనికి రాయలసీమ నేతలు అడ్డుపడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వెంటనే సాధ్యపడలేదు. మదరాసును తమకే వదిలేయాలని ఆంధ్రులు పట్టుబట్టడంతో ‘‘ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి ఉద్యమం అవసరం లేదని, ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలనే దానికి తాను బద్ధుడనై ఉన్నానని, కానీ మదరాసు సంగతే ముందు తేల్చుకోవాలని’’ నెహ్రూ అన్నారు.

ఇక విషయానికి వస్తే, మదరాసు లేని ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నెహ్రూ ప్రకటించిన తర్వాత పొట్టి శ్రీరాములుకు ఆమరణ దీక్ష అవసరమేమొచ్చింది?

పొట్టి శ్రీరాములు ఎందుకోసం దీక్ష చేపట్టారు?ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని నెహ్రూ ప్రకటించినా సంతృప్తి చెందని కొందరు పెద్దలు మదరాసును ఆంధ్రకు రాజధానిగా చేసుకోవాలనే దుర్బుద్ధితో పొట్టి శ్రీరాములుచేత 19 అక్టోబర్ 1952 నుండి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష చేయించారు. అదీ మదరాసు నగరంలోనే. ఆయన ఏకైక డిమాండ్ ‘మదరాసు’ కోసమే.

పొట్టి శ్రీరాములు ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకున్న నెహ్రూ 1952 డిసెంబర్ 9న మదరాసు లేని ఆంధ్రరాష్ట్రాన్నివ్వడానికి తాము సిద్ధమేనని పార్లమెంట్‌లో మరోసారి స్పష్టం చేసారు. అయినా ఆంధ్ర పెద్ద మనుషులు పొట్టి శ్రీరాములుచే దీక్షను విరమింపజేయలేదు. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకుపోలేదు. ఆయనకు నెత్తురు వాంతులయినా, మాట పడిపోతున్నా పట్టించుకోలేదు. చివరికి కోమాలోకి పోయినా వారికి చీమ కుట్టినట్లయినా కాలేదు. ఆనాటి మదరాసు రాష్ట్ర కమ్యూనిస్టు లెజిస్లేచర్ పార్టీ నాయకులు తరిమెల నాగిడ్డి కూడా దీక్ష విరమించాలని పొట్టి శ్రీరాములును కోరినారు. మదరాసు లేకుండానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే చాలునన్నారు. ఎవరిమాటను శ్రీరాములు చుట్టూ వున్న పెద్దలు విన్పించుకోలేదు. అంతా కలిసి శ్రీరాములు చావు కోసం ఎదిరి చూసారే గానీ ఆయనను బతికించుకునే ఏ ప్రయత్నమూ చేయలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, మదరాసు కావాలనే మొండి వాదనతో, పంతానికి పోయి పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆంధ్ర నేతలది. 1952 డిసెంబర్ 15 నాటి రాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. అయినా మదరాసు ఆంధ్రకు దక్కలేదు. ఆయన అమరత్వం వల్ల ఆంధ్రులకు ఏ ప్రయోజనమూ కలగలేదు. నిష్ఫల త్యాగమే పొట్టి శ్రీరాములు చేసింది. ఆయన దీక్ష చేయకున్నా, మధ్యలో వదిలేసినా ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఉండేదే (నెహ్రూ మాటల్లోనే అది స్పష్టమైంది). ఇప్పుడేమో సమైక్య రాష్ట్రం పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమని ఆంధ్ర నేతలు, పాలకులు చరివూతను వక్రీకరిస్తున్నారు.

పొట్టి శ్రీరాములుకు తెలంగాణకు ఏమిటి సంబంధం?
తమకేమీ కాని పొట్టి శ్రీరాములు పట్ల తెలంగాణ ప్రజలకేవిధమైన వ్యతిరేకతా లేదు. ఆయనంటే జాలి, సానుభూతి తప్ప. చిత్రమేమిటంటే, తెలంగాణకేమి చేసారని ఆయన విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం? అసలు నవంబర్ ఒకటికి 
పొట్టి శ్రీరాములుకు ఏమిటి సంబంధం? పొట్టి శ్రీరాములు మరణానంతరం కనీ వినీ ఎరుగనంతటి విధ్వంసాన్ని ఆంధ్రనేతలు సృష్టించినా వారికి మదరాసును రాజధానిగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మదరాసు లేకుండానే కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ ఒకటిన ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏ పార్టీకి చెందని ప్రకాశం పంతులు బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బులేని ఆర్థిక దుస్థితి. వందేళ్ళ క్రితం నిర్మించిన ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలు శిథిలమై ఉండటం, వీటి పునర్నిర్మాణానికీ డబ్బుల్లేకపోవడం... ఏం చేయాలో అర్థం కాని గడ్డు పరిస్థితి!

తెలంగాణను కబ్జా చేయడానికి ‘విశాలాంధ్ర’ నినాదం
ఆంధ్రలో ఆనాటికే అమల్లో వున్న మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేయాలని రామ్మూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను ప్రకాశం పంతులు అంగీకరించలేదు. దీనితో పాలకులలో విభేదాలు మొదలై ప్రభుత్వం రద్దయి రాష్ట్రపతి పాలన ఏర్పడింది. రెండు నెలల తర్వాత బెజవాడ గోపాలడ్డి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవడ్డి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కర్నూలులో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవు. గుడారాల కింద ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసారు. అప్పటికే అన్ని హంగులతో దేశంలోనే ఐదవ పెద్ద పట్టణంగా ఉన్న హైదరాబాద్‌పై ఆంధ్ర పాలకుల కన్ను పడింది.

హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాల సర్కారు భూమి ఉన్నది. పాకిస్తాన్ పారిపోయిన కాందిశీకుల భూములున్నవి. తెలంగాణ నుండే ప్రవహించే కృష్ణా, గోదావరి నదులున్నయి. రాజధానికి సరిపోయే విశాలమైన భవనాలున్నాయి. అప్పటికే హైదరాబాద్ సర్కారు వద్ద మిగులు బడ్జెట్ ఉన్నది. తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలు ఉన్నవి. పెద్ద పరిక్షిశమలున్నవి. వీటిపై కన్నేసిన ఆంధ్ర నేతలు తెలంగాణను కబ్జా చేయడానికి తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలంటూ ‘విశాలాంధ్ర’ నినాదం ముందుకు తెచ్చారు . తమ అవసరం కోసం కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమం నిర్వహించారు.

తెలంగాణ ప్రాంత చారిత్రక నేపథ్యం
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. 224 ఏళ్ళు నిజాం నవాబుల పాలన కొనసాగింది. తెలంగాణలోని 8 జిల్లాలు, మరట్వాడాలోని 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలోని 3 జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి. 

1948 సెప్టెంబర్ 12న స్వంతంత్ర దేశమైన హైదరాబాద్ సంస్థానం పైకి భారత ప్రభుత్వం తన సైన్యాన్ని పంపి, 17న విలీనం చేసుకున్నది. ఆ తర్వాత జనరల్ చౌదరి నేతృత్వంలో మిలిటరీ పాలన కొనసాగింది. 

1949లో సివిల్ సర్వీసెస్‌కు చెందిన వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952లో ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలనే కుట్రలు ‘విశాలాంధ్ర’ నినాదం రూపంలో మొదలయ్యాయి. తెలంగాణ ప్రజలు ఆంధ్రతో విలీనానికి అంగీకరించలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం నెహ్రూకు ఇష్టం లేదు. ఆయన అభిప్రాయం ఇలా ఉండింది: ‘‘విశాలాంధ్ర డిమాండ్ కళంకిత సామ్రాజ్యవాదానికి సంబంధించింది. ఖచ్చితంగా సామ్రాజ్యవాదమని కాదు, దాని వెనుక గల ప్రియమైన మనఃప్రవృత్తికి చెందింది అది.’’ (సెపూక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ, 6వ సంపుటం: పేజీ, పేరా 68)తెలంగాణ ప్రాంతంలోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ‘విశాలాంధ్ర’ నినాదాన్ని వ్యతిరేకించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్.ఆర్.సి) ఇరు ప్రాంతాల వాదనలు విన్నది. చివరికి తమ నివేదికలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే 1961 దాకా కొనసాగించాలని, అప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో గెల్చిన శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలని తీర్మానిస్తే అప్పుడు సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని ఎస్.ఆర్.సి. స్పష్టంచేసింది.

పెద్ద మనుషుల ఒప్పందం-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎస్.ఆర్.సి. పై ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణ విడిగా ఉండాలన్న సిఫారసు మింగుడు పడలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. నెహ్రూ చుట్టూ ఉన్న జాతీయ నేతల్లో కొందరిని డబ్బుతో కొన్నారు. మరి కొందరితో స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి తమకున్న సాన్నిహిత్యాన్ని వాడుకున్నరు. తెలంగాణ విడిగా ఉంటే ప్రమాదమని కొత్త వాదనలు ముందుకు తెచ్చారు. 1948 సెప్టెంబర్ 13న ఐక్యరాజ్యసమితిలో అప్పటి హైదరాబాద్ ప్రధాని ‘లాయక్ అలీ’ ప్రభుత్వం తరఫున ఒక పిటిషన్‌ను దాఖలు చేయించాడు. భారతదేశం తమ హైదరాబాద్ రాజ్యంపై దురాక్రమణ చేసిందని, హైదరాబాద్ సంస్థానాన్ని స్వంతంత్ర దేశంగానే కొనసాగనివ్వాలని, భారత దురాక్రమణను నివారించాలన్నది ఆ పిటీషన్ సారాంశం.

1956 నాటికి కూడా ఆ పిటీషన్ ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్నది. 1978లో ఆ పిటీషన్ కొట్టివేయబడింది. హైదరాబాద్‌తో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిస్తే ఎప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని ఒక స్వతంత్ర దేశపు హోదా తెలంగాణకిచ్చే ప్రమాదం పొంచి వుంటుందని అనుమానాలు రేకెత్తించారు. ఏ పాచిక పారిందో ఏమో చివరికి కేంద్ర ప్రభుత్వం ఎస్.ఆర్.సి.సిఫార్సులను పక్కన పెట్టి సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపింది. తెలంగాణ కోరుతున్న నేతలను (బూర్గుల, కె.వి.రంగాడ్డి, చెన్నాడ్డి) ఢిల్లీ పిలిచి ఒత్తిడి పెంచింది. ఇరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది నేతలతో ఒక ‘పెద్ద మనుషుల ఒప్పందం’ పై 20 ఫిబ్రవరి 1956న సంతకాలు పెట్టించింది కాంగ్రెస్ అధిష్టానం. 

నిధులు, వనరులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, మంత్రివర్గ హోదాలు, వ్యవసాయం తదితర అంశాలతో ఉన్న ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు అనేక హక్కులు కల్పించబడినాయి. ఈ హక్కుల అమలుకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

ఈ ఒప్పందం, హామీల వల్ల తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలుగలేదు. ఇటువంటి హామీల వల్ల, ప్రాంతీయ సంఘాల వల్ల తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చడం సాధ్యం కాదని ఫజల్ అలీ కమీషన్ (ఎస్.ఆర్.సి) తన నివేదికలోనే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని 21 ఏప్రిల్ 1954న ‘ఆంధ్ర పత్రిక’ కూడా ఇలా స్పష్టం చేసింది: ‘‘హామీలివ్వ గలవారు, ఇచ్చిన హామీలను చెల్లింప శక్తి గలవారు తెలంగాణ వారు మాత్రమే కాని ఆంధ్రరాష్ట్ర నాయకులు ఎన్నటికీ కారు. తెలంగాణ వారి ఆహ్వానం, ఆదరణ లేకుండా, వారి ఒడంబడికల ద్వారా సాధించగలమని భావించే వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మన ప్రవర్తన ముఖ్యం కాని, ప్రకటనలు కావు.’’

ఏక పక్షంగా, ఆంధ్రనేతల ఒత్తిళ్ళకు లొంగి నెహ్రూ తనకే మాత్రం ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ను 1 నవంబర్ 1956న ఏర్పాటు చేసారు. అదీ జరిగిన అసలు కథ.

అదే రోజు హైదరాబాద్‌లో కొత్త రాష్ట్రాన్ని ప్రారంభిస్తూ నెహ్రూ ఇలా వ్యాఖ్యానించారు: ‘‘ఈ రోజు నుంచి ఆంధ్రులకు తెలంగాణ వారితో వ్యవహరించే పద్ధతికి పరీక్ష ప్రారంభమైంది. ఒకవేళ తెలంగాణ వారిని గనుక వారు నిరాదరణకు గురిచేస్తే, తిరిగి వారికి వేరుపడే హక్కు ఉంది.’’ (దక్కన్ క్రానికల్, 2-11-1956)

ఈ మాటలు అక్షరసత్యాలే అయ్యాయి. తెలంగాణను నిరాదరణకు గురిచేయడమే కాదు, సమైక్య రాష్ట్రంలో ఉన్న ఖర్మానికి తెలంగాణ ప్రజలు తమ సొంత గడ్డపైనే రెండవ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఏ హామీ అమలు కాలేదు. ఆ హామీల అమలు కోసం ఏర్పడ్డ ప్రాంతీయ సంఘమూ రద్దయింది. గత యాభై ఏళ్ళుగా తెలంగాణలో చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల ఫలితంగా చేసిన రాజ్యాంగ సవరణలు, కల్పించిన రక్షణలు, విడుదలైన జీవోలు, ఆదేశాలు ఏవీ కూడా అమల్లోకి రాలేదు. 55 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 49 ఏళ్ళు సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు పాలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రులైన వారంతా కలిసి పాలించింది కేవలం ఆరేళ్ళే. పి.వి, అంజయ్య, చెన్నాడ్డి.. వీరిలో ఏ ఒక్కరినీ రెండేళ్ళయినా పదవిలో ఉండనివ్వలేదు.

షరతుల ఉల్లంఘనసమైక్య రాష్ట్రంలో సీమాంధ్రుల దోపిడీకి అడ్డూ అదుపూ లేదు. వనరుల దోపిడీ నిరాటంకంగా నేటికీ (ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నా) జరుగుతూనే ఉన్నది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మంట గలిసింది. ప్రతి రంగంలో తెలంగాణ బిడ్డలు ఆంధ్రుల వల్ల నిత్యం అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణా భాషా, సంస్కృతి, సంప్రదాయాలు ఆంధ్రులచే అవహేళన చేయబడుతున్నవి. ఈ అవమానాలు, అవహేళనలు, అహంభావపు మాటలను తట్టుకోలేక వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని కన్న తల్లిదంవూడులకు, తెలంగాణ వాదులకు శోకాన్ని కలిగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది ఒక షరతులతో కూడిన ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఒప్పందంలోని ఏ ఒక్క షరతు అమలు కాకున్నా చట్టరీత్యా ఆ ఒప్పందం చెల్లదు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అన్ని షరతులూ ఉల్లంఘించబడినపుడు ఇక ఈ రాష్ట్రం ఎలా కొనసాగుతుంది? ఒప్పందానికి ముందున్న స్థితిని తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలకు కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.

అందుకే 55 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యమాలు సాగిస్తున్నరు. 1969లో 369 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. చరిత్రలో అంతటి గొప్ప ఉద్యమం లేదు. ఇప్పటి సకలజనుల సమ్మె ఈ ఉద్యమాలకు పరాకాష్ట. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఇంతటి ఐక్యత మున్నెన్నడూ కానరాలేదు. అంతటి చారిత్రక ఉద్యమ సందర్భంలో మనం ఉన్నం.

భిన్న దృశ్యాలు అందుకే...
సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నేతలు, సంపన్నులు తెలంగాణను నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నరు. తెలంగాణ ప్రజలు ఆంధ్రులచే అడుగడుగునా మోసగింపబడి ఆకలి చావులతో, ఆత్మహత్యలతో తమ జీవితాలను అంతం చేసుకుంటున్నరు. లక్షలాదిగా సుదూర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయి అనేక కష్టాలు పడుతున్నరు. ఈ గోసకంతా కారణం సమైక్య రాష్ట్రమే. సకల వనరులున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వుంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా విరాజిల్లుతుంది.