Tuesday, November 1, 2011

ముమ్మాటికి విద్రోహ దినమే




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1నవంబరు, 1956న ఏర్పాటైన సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున తెలంగాణ ప్రజలు విద్రోహ దినంగా పాటిస్తారు. ఈ భావన పట్ల సీమాంధ్ర మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొందరి విద్రోహం వలన ఏర్పడింది కాదని వారి ఉద్దేశం. హెదరాబాద్ రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని వారి వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ముమ్మాటికి విద్రోహ రాజకీయాల ఫలితంగా ఏర్పడిందన్నది ఇవ్వాళ తెలంగాణ ప్రజలు నమ్ముతున్న వాస్తవం. ఫజల్ అలీ కమిషన్ ముందు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ నాయకులు, ప్రజాసంఘాలు తమ అనుమానాలను, భయాందోళనలను వివరిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. కమిషన్ చాలా నిజాయితీగా వాటన్నింటిని రికార్డు చేయడమే కాక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిగా కొనసాగాలని విస్పష్టమైన సిఫారసులను చేసింది.

హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి కమిషన్ రెండు సిఫారసులను చేసింది. మొదటిది-హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి మరాఠి మాట్లాడే మరాట్వాడా జిల్లాలను మహారాష్ట్రలో (అప్పటికి ఇంకా బొంబాయి రాష్ట్ర మే), కన్నడ మాట్లాడే జిల్లాలను కర్ణాటక రాష్ట్రంలో కలపాలి. రెండోది- మిగిలిన తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలను హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించాలి. 1961 లోనో ఆ తర్వాతనో జరిగే సార్వవూతిక ఎన్నికల అనంతరం ఏర్పడే హైదరాబాద్ శాసనసభలో (ఇక్కడ కమిషన్ Residuary Hyderabad State అన్న పదాన్ని వాడిందన్న సంగతిని గమనించాలి.) మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుంటే విలీ నం చెయ్యాలని, లేకుంటే ఆంధ్ర, తెలంగాణ విడిగా కొనసాగాలని కమిషన్ సిఫారసు చేసింది. ఫజల్ అలీ కమిషన్ చేసిన ఈ సిఫారసు విజ్ఞతతో చేసినదని చెప్పాలి. ఎందుకంటే పాత హైదరాబాద్ శాసనసభలో మరాట్వాడా, కర్ణాటక శాసన సభ్యులు హైదరాబా ద్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండేవారు.

పాత హైదరాబాద్ శాసనసభ ప్రకటించే అభివూపాయం తెలంగాణ ప్రజల అభివూపాయం కాజాలదు. కాబట్టి 1961లో తెలంగాణ జిల్లాలతో మాత్రమే ఏర్పడే శాసనసభ తీర్మానం ద్వారానే విలీనం జరగాలన్నది వారి అభిమతం. అది మాత్రమే తెలంగాణ ప్రజల మనోభావాలను వెల్లడిస్తుందని వారి అభిప్రాయంగా కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలు విలీనానికి అనుకూలంగా ఉండి ఉంటే అది 1961లోనూ వెల్లడి అయ్యేది. మరి ఆంధ్రులు అప్పటి దాకా ఆగకుండా 1956 లోనే విలీనాన్ని ఎందుకు చేశారు ? తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర నాయకులకు అవిశ్వాసం ఎంతటిదో ఫజల్ అలీ నివేదికపై వారి వ్యాఖ్యానాలే నిదర్శనంగా ఉన్నాయి. నాటి ఆంధ్రపవూతిక ఈ వ్యాఖ్యానాలను రికార్డు చేసింది. ఆంధ్ర నాయకులు విలీనానికి ఎందుకు ఆతృత పడినారో ఆంధ్ర అసెంబ్లీలో వారి ప్రసంగాల్లో స్పష్టమైంది.

విలీనం వాయిదా పడితే ఇక విశాలాంధ్ర ఎన్నటికీ రాదు. ఆరేళ్ళు ఆగడం చాలా ప్రమాదకరం.1961 నాటికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఇంకా బలపడుతుంది. విశాలాంధ్రకు అప్పుడు ఒప్పుకోరు. 2/3 మెజారిటీ విశాలాంధ్రకు వచ్చుట కష్టం. (అయ్యదేవర కాళేశ్వరరావు) విశాలాంధ్ర ఇప్పుడు తప్పితే ఇక రాదు. (నీలం సంజీవడ్డి) విశాలాంధ్ర ఈనాడు ఎర్పడకపోతే అసంభవం కావచ్చునేమో (వావిలాల గోపాలకృష్ణయ్య). 1961దాకా ఆగితే అప్పటికే బలంగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాం క్ష మరింత బలపడుతుందన్న ఆలోచనతో వారు ఢిల్లీకి పరుగులు తీసి కేంద్ర నాయకత్వంతో తమకు ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేసి విశాలాంధ్రను వ్యతిరేకించిన ప్రధాని నెహ్రూ ను లొంగదీసుకోగలిగినారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును ప్రలోభాలకు గురి చేసి విశాలాంధ్ర వాదిగా మార్చివేసినారుపత్యేక రాష్ట్రవాదులుగా ఉన్న కొండా వెంకట రంగాడ్డి, మర్రి చెన్నాడ్డి తదితరులను తెలంగాణకు రక్షణలు కల్పిస్తామని హామీ ఇచ్చి లొంగదీసుకున్నారు.

మరాట్వాడా, కన్నడ ప్రాంత శాసనసభ్యుల మద్దతుతో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదింపచేసుకోవడంతో (ఇటువంటి తీర్మానం ఏదీ జరుగలేదని, కేవలం శాసనసభలో చర్చ మాత్రమే జరిందని ప్రొ.జయశంకర్ ఈ వ్యాస రచయితతో చెప్పారు. నిజానిజాలు తేల్చడానికి హైదరాబాద్ రాష్ర్ట శాసనసభలో జరిగిన చర్చల రికార్డులు దొరకని పరిస్థితి) వారు నెరిపిన విద్రోహ రాజకీయాలు సఫలమైనాయి. ఈ విద్రోహ రాజకీయాలకు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న గోసాయి స్వామీ రామానంద తీర్థ ప్రోత్సాహాన్నిచ్చారు. హైదరాబాద్ రాష్ట్రం విభజన అయితేనే మరాట్వాడా, కన్నడ జిల్లాలు తమతమ మాతృ భాషా ప్రాంతాలతో విలీనానికి అవకాశం ఏర్పడుతుందని భావించి హైదరాబాద్ రాష్ట్ర విభజనకు మద్దతునిస్తూనే విశాలాంధ్ర ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం అందించాడు.

హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో హైదరాబాద్ రాష్ట్ర విభజనకు, విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించడంలో ఈ గోసాయిదే కీలక పాత్ర. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, ఫజల్ అలీ సిఫారసులకు భిన్నంగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడడం విద్రోహం కాక మరేమవుతుంది ? విశాలాంధ్ర ఏర్పాటుకు వారు ఎందుకు ఎట్లా ఆతృతపడినారో విశ్లేషించుకోవాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్రరాష్ట్రం తెలంగాణ వనరులు లేకుం డా మనుగడ సాగించలేదని వారికి ముందునుంచే తెలుసు. తెలంగాణని కలుపుకోకుండా గోదావరి, కృష్ణా నీళ్ళపై ఆధిపత్యం సాధ్యపడదు. పారిక్షిశామిక ప్రగతికి, విద్యు త్ ఉత్పత్తికి కావలసిన బొగ్గుగనులు తెలంగాణలోనే ఉన్నాయి. సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మాణమై ఉన్న హైదరాబాద్ నగరం తమ చేతికి చిక్కాలంటే తెలంగాణని కలుపుకోవాలి.

పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్రానికి బదిలీ అయిన లక్షలాది ఎకరాల నిజాం సర్ఫేఖాస్ భూములు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మిగులు నిధులు, విస్తారమైన ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ తమ అధిపత్యంలోకి రావాలంటే విశాలాంధ్ర ఏర్పాటు ఒక్కటే మార్గం. విశాలాంధ్ర నినాదం వెనుక ఈ విస్తర ణ కాంక్ష ఉన్నదని ప్రధాని నెహ్రూకు ఆనాడే తెలుసు. కనుకనే ‘విశాలాంధ్ర నినా దం వెనుక రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న సామ్రాజ్యవాద భావాలున్నాయి’ అని స్పష్టంగానే ప్రకటించాడు.

ఆంధ్రోద్యమంతో పాటు 1936 నుంచే విశాలాంధ్ర భావ ప్రచారం ప్రారంభం అయిందని తెలుసుకుంటే విస్తుపోతాం. విశాలాంధ్ర భావన తెలంగాణలో ఎన్నడూ లేదు. ఇది ప్రధానంగా సర్కారు జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్. 1936లో ఆంధ్రా కాంగ్రెస్, స్వరాజ్యపార్టీలు తెలంగాణని కలుపుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశాయి. మామిడిపూడి వెంకట రంగయ్య 1937లో తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలిపి ఒకే ప్రదేశంగా ఏర్పాటు చెయ్యాలనే భావనని వ్యాప్తి చేసినాడు. ఆ తర్వత కడప కోటిడ్డి వారి సరసన చేరినాడు. ఆ తర్వాత 1946లో పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర భావనను సిద్ధాంతీకరించి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకాన్ని ప్రచురించాడు. అప్పటికే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటం జరుగుతున్నందున తెలంగాణలోని కమ్యూనిస్టులు కూడా సుందరయ్య సిద్ధాంతాన్ని సమర్థించారు.

1949లో అయ్యదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటై అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో విశాలాంధ్ర ప్రచారం చేయసాగింది.. ఈ రకంగా సర్కారు జిల్లాలలో పుట్టిన విశాలాంధ్ర భావన మెల్లమెల్లగా తెలంగాణలో ప్రవేశించింది. అయితే విస్తృత ప్రజామోదం మాత్రం పొందలేకపోయింది. విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్‌లో జరిపిన సమావేశాలు జనం లేక ప్రజా ప్రతినిధుల హాజరు లేక వెలవెల బోతే  బడి పిల్లల ను కూచుండబెట్టి మమ అనిపించుకున్నారని బి.ఎన్ శాస్త్రి 1955లో ‘రెండు తెలుగు రాజ్యాలెందుకు’ ? అన్న పుస్తకంలో రాశారు. ఈ రకంగా సమావేశాలు జరపడం దండగ అని ఆంధ్ర నాయకులు అనుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 1952లో ఉధృతంగా కొనసాగిన ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ఉద్యమమే అందుకు సాక్ష్యం.

1948 నుంచి 1952 దాకా హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగాలలోకి ముల్కీ రూల్సు కు విరుద్ధంగా చొరబడిన నాన్ ముల్కీలను తరిమివేసేందుకు నాన్ ముల్కీ ఉద్యమం బద్దలైంది. 13 మంది విద్యార్థులు అమరులైనారు. అయినా కూడా నాన్ ముల్కీలు మాత్రం తెలంగాణ ఉద్యోగాల్లో తిష్టవేసినారు.

1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినదేమిటో అందరికీ తెలుసు.. నెహ్రూ చెప్పినట్లు ఆంధ్రుల సామ్రాజ్య విస్తరణ, వనరుల దోపిడీ నిరాఘాటంగా కొనసాగినాయి. ఫజల్ అలీ కమిషన్ పేర్కొన్నట్లు తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతం గా మారిపోయింది. అంతేకాదు తన ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. ఇవ్వన్ని జరిగినయి కనుకనే నవంబరు 1 తెలంగాణకు విద్రోహ దినం. తెలంగాణకు ద్రోహులు ఎవరు ? తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం మొదటి ద్రోహి. 60 ఏండ్ల సుదీర్ఘ పొరాటం జరుగుతున్నా, తన తప్పును సవరించుకుందామన్న ఇంగితాన్ని మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం. సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు ఉన్న అన్ని ప్రాతిపదికలని ధ్వంసం చేసిన, తెలంగాణ వనరులను కొల్లగొట్టుకుపోతున్న సీమాంధ్ర పాలక వర్గాలు రెండో ద్రోహులు.

తెలంగాణ వనరులపై, హైదరాబాద్ నగరం పై తమ భల్లూకపు పట్టును వదలిపెట్టడానికి ఇష్టపడని సీమాంధ్ర సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు ‘కలసి ఉంటే కలదు సుఖ’మని అంటున్నారు. తెలంగాణ కు స్వయంపాలనని నిరాకరిస్తున్నారు. దోపిడీకి అలవాటుపడిన వీరు తమ దోపిడీ సొమ్ముతో కేంద్రనాయకులను లోబర్చుకొని తెలంగాణ ఏర్పాటుని అడ్డుకొంటున్నారు. ఇక మరో రకం ద్రోహులు ఎవరంటే.. తెలంగాణ ఇంటి దొంగలు. తెలంగాణ మంత్రు లు, ప్రజావూపతినిధులు. సీమాంధ్రుల మోచేతి నీళ్ళు తాగడనికి అలవాటుపడి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నారు. ప్రజలు ఎంత ఛీత్కరించినా, ఎంత అవమానించినా చూరుకు వేలాడే గబ్బిలాల లెక్క పదవులను పట్టుకు వేలాడుతున్నారే తప్ప తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటాలతో మమేకం కావటం లేదు. ఈ ముగ్గురు తెలంగాణ ద్రోహుల విద్రోహ రాజకీయాలు విజయం పొందిన రోజు కనుకనే నవంబరు 1 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విద్రోహ దినమే.

3 comments:

  1. హైదరాబాద్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినా దానిపై వోటింగ్ జరగలేదు. 1955 నవంబర్ 25 నుండి డిసెంబర్ 3 వరకు జరిగిన ప్రత్యెక సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

    The fact that the session specially convened for the resolution was abandoned is suspicious to say the least.

    ReplyDelete
  2. Srikanth,I appreciate your Great Analysis and reverting back to history to disclose the worst facts.

    Plz. continue to update.

    Sridhar

    ReplyDelete
  3. Please see http://edisatyam.blogspot.com/2011/11/1.html for an excellent satire on how the unemployed politicians conspired to form Andhra state in 1953

    ReplyDelete