వీరి అసలు ఉద్దేశం తెలుగుజాతి కాదని, తెలంగాణాపై ఆధిపత్యం చెలాయించి తమ పబ్బాలు గడుపుకోవడమేనని బయట పడ్డ తర్వాత ఇక పార్టీలు, పాలసీలు అన్నీ పక్కకు పెట్టి బహిరంగానే తమ దుష్ట బుద్ధి ప్రదర్శించు కుంటున్నారు.
ఆనాడు పార్టీల కతీతంగా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఆలింగానాలు చేసుకొని, ముద్దులు కురిపించుకొని, దొంగ ఉద్యమాలు నడిపించి సాకారమౌతున్న తెలంగాణాను అడ్డుకుంటే, నేడు అదే విషయం మైనారిటీలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో మరోసారి బయట పడింది.
తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో మొదలైంది. రాష్ట్రంలో దానికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వాన్ని తొలగించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తెలుగుదేశం వదులుకో కూడదు. పైగా ప్రతీ రోజూ రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, పాలన లేదని అంటూ జనానికి ఊదర గొడుతూ వుంది. మరి ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మైనారిటీలో పడ్డప్పుడు ఆ పార్టీ ఏం చేయాలి? వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలి. అసెంబ్లీ నడవక పోతే, గవర్నరుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్న విషయం గవర్నరుకు నోటీసు ద్వారా తెలియజేస్తూ, అసెంబ్లీ సమావేశం ఏర్పాటును కోరాలి. కాని వాస్తవంగా అలా జరగడం లేదు.
పైగా నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు కొనసాగుతుందనీ, ఆ తర్వాత మాత్రం తమకే వోటు వెయ్యాలనీ వాకృచ్చారు. మరి పనిచేయని ప్రభుత్వం రెండున్నరేళ్ళు కొనసాగడం ఎందుకు?
ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణా రాష్ట్ర సమితి బలంగా వుంది. ఎన్నికలు వస్తే ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశానికి శృంగభంగం తప్పదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తెరాసతో పొట్టు కూడాల్సిన, రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడాల్సిన పరిస్థితి. పైకి ఎంత తటస్థులం అని చెప్పుకున్నా వారి అంతరంగం ఏంటో జగద్విదితం. అందుకే తమ శత్రు పార్టీని కూడా ఆంపశయ్య మీద బ్రతికించడం.
వీటన్నిటిని బట్టి తెలిసేది ఏమంటే, పార్టీల కతీతంగా ఆంధ్రా రాజకీయ నాయకులంతా ఒక్కటే. వారు కావాలంటే ఆంధ్రాపక్షపాత ప్రభుత్వాన్ని మైనారిటీలో పడ్డా కొనసాగించ గలరు. ప్రభుత్వం గనక ఆంధ్రా పెట్టుబడిదారుల, భూస్వాముల కొమ్ము కాయక, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తే మాత్రం, తరతమ విభేదం లేకుండా దాన్ని దించి వేయగలరు.
ఎలాగూ అసెంబ్లీ లో మందబలం వాళ్ళదే వుంటుంది కాబట్టి ఏ ప్రభుత్వమైనా అది అస్మదీయులకు మేలు చేస్తేనే నిలబడుతుంది, లేక పోతే కూలిపోతుంది. అందుకు పీవీ ప్రభుత్వమే ఉదాహరణ. ఆయన దేశాన్ని ఐదేళ్ళు పరిపాలించ గలిగాడు కాని రాష్ట్రాన్ని మాత్రం ఏడాది కూడా పరిపాలించ లేక పోయాడు.
ఇలాంటి ప్రాంతీయ పక్షపాత పాలకులు మెజారిటీగా వున్న రాష్ట్రంలో ఇంకా కలిసి వుండడం అవసరమా?
No comments:
Post a Comment