Friday, November 11, 2011

తెలంగాణా కావాలంటున్నారు, మరి కాశ్మీర్ విడిపోతానంటే సమర్థిస్తారా?


తరచుగా సమైక్యవాదులు వేసే ప్రశ్నల్లో ఇది ఒకటి. ఇలాంటి ప్రశ్నలు వింటుంటే వీరి అవగాహనా రాహిత్యానికి నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. కాని వీరి ప్రశ్నలకు జవాబు చెప్పక తప్పదు, లేకపోతే తాము తమ మిడిమిడి జ్ఞానంతో ఆలోచించిందే నిజమని వీరు భావించుకుంటారు. 

అసలు ఈ రెండు సమస్యలకు సారూప్యతే లేదు. ఒకటేమో దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి వేరే దేశం కోరే విషయం. రెండోది దేశ రాజ్యాంగసూత్రాలకు లోబడి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే, నాలుక్కోట్ల జనాభా కలిగిన ఒక ప్రాంతం దేశంలో తమకు ప్రత్యేకరాష్ట్రం కావాలని కోరడం.

ఇక కాశ్మీర్ విడిపోతానంటే ఒప్పుకుంటారా అని వారు వేసే ప్రశ్న. దానికి ఇప్పటికే ఎంతో మంది అరుంధతీ రాయ్, ప్రశాంత్ భూషణ్ వంటి మేధావులు తమ మనసులో మాట చెప్పారు, తన్నులు కూడా తిన్నారు. కాశ్మీరు గురించి మాట్లాడడానికి నాకు అంత పరిజ్ఞానమూ లేదు, మాట్లాడాలనే కోరికా లేదు. అయితే దీన్ని తెలంగాణావాదంతో ముడిపెట్టారు కాబట్టి నేను చెప్పవలసింది చెప్తాను.

న్యాయంగా ఆలోచించినప్పుడు ఏ ప్రాంతం భవిష్యత్తు నిర్ణయించ గలిగేదైనా ఆ ప్రాంతపు ప్రజలే. ఒక ప్రాంతం ఏదేశంలోనైనా కలవాలన్నా, స్వతంత్రంగా వుండాలని నిర్ణయం తీసుకోవాలన్నా వారి ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి వుండాలి. ఆ ప్రాంత ప్రజలు కూడా, అలా నిర్ణయించుకునే ముందు తాము ఒక దేశం నుండి విడిపోతే ఎదురయ్యే సవాళ్ళను, ఎదుర్కోవలసిన సమస్యలను గురించి తప్పక ఆలోచిస్తారు.

విడిపోతే తాము ఎదుర్కోబోయే సమస్యల కన్నా ఇప్పుడు ఉన్న దేశంలో వారు ఎదుర్కొనే సమస్యలే ఎక్కువగా ఉన్నట్టయితే వారు దేశం నుండి విడిపోవడానికే మొగ్గు చూపే అవకాశం వుంది. ప్రజలు అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే, అది తప్పకుండా పాలకుల తప్పే. అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రజలను ఆపే హక్కు పాలకులు నైతికంగా కోల్పోతారు.

ఇదంతా చెప్పేటప్పుడు కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. దానికి వోటింగో, రిఫరెండమో ఏదో ఒకటి పెడితే తప్ప ప్రజాభిప్రాయం తెలిసే అవకాశం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య యుతమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా ఆ పద్ధతులను అనుసరించి ప్రజాభిప్రాయం సేకరించి తగిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు.

ఇక పోతే తెలంగాణా విషయం. తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుంది, దేశాన్ని కాదు. ఇలా కోరుకోవడం ఇది మొదటి సారి కాదు, ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావడాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడడాలు కూడా జరిగాయి. దానికి పొరుగున ఉన్న ఆంధ్రులే ఆద్యులుగా వున్నారు. వారే మాకు స్ఫూర్తి. పైగా ఇలా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి మన దేశ రాజ్యాంగం పూర్తిగా అనుకూలం.  

తెలంగాణా ఏమైనా రాష్ట్రంగా మనగలగ లేనంత చిన్న ప్రాంతమా? రాష్ట్రంగా మనగలగలేక పోయినా గొంతెమ్మ కోరిక కోరుతుందా అని ఆలోచించి చూద్దాం. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయితే అది ఇప్పుడు దేశంలో వున్న పదహారు రాష్ట్రాల కన్నా పెద్దదిగా వుంటుంది. కాబట్టి మనలేక పోవడమో, చిన్న రాష్ట్రమని చిన్నచూపు చూడడమో చేయవలసిన అవసరమే లేదు.

ఇక పోతే తెలంగాణా రాష్ట్రం ఏదో ఇప్పటివరకూ అసలేలేని కొత్తరాష్ట్రం కాదు. 1956 వరకూ ఇది హైదరాబాదు రాష్ట్రం రూపంలో వుంది. కాకపోతే కొన్ని మరాఠా, కన్నడ జిల్లాలు అదనంగా ఉండేవి. ఫజల్ అలీ కమీషన్ తెలంగాణా పై మొదటి SRCలో చర్చిస్తూ, దీనిపై తొందర పడకుండా 1962 వరకూ ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలనీ, 1962 లో ఒకవేళ మూడింట రెండొంతుల మంది తెలంగాణా శాసనసభ్యులు ఆంధ్రాతో విలీనానికి అంగీకరిస్తేనే విలీనం చేయాలని స్పష్టంగా తీర్పు చెప్పింది.


కానీ కొంత మంది తెలంగాణా, ఆంధ్రాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, మొదటి SRC స్ఫూర్తికి విరుద్ధంగా పెద్దమనుషుల ఒప్పందం అని ఒకటి కుదుర్చుకొని ఒక బలవంతపు రాష్ట్రాన్ని తెలంగాణా ప్రజలపై రుద్దారు. కనీసం ఆ ఒప్పందమైనా సరిగ్గా అమలైందా అంటే, రాష్ట్రం ఏర్పడ్డరోజు నుంచే దానికి తూట్లు పొడవడం మొదలు పెట్టారు. అలా మొదలైన ఒప్పందాల వమ్ము ఇంకా కొనసాగుతూనే వుంది. తర్వాత దానికి రిపేర్లు చేద్దామని 610 లాంటి ఎన్ని జీవోలు తీసినా చివరికి అవి కూడా వమ్మయ్యాయే కానీ, ఏదీ సరిగ్గా అమలు జరగలేదు.       

అటువంటి పరిస్థితిలో తెలంగాణా ప్రజలు ఈ సమైక్యరాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా నమ్మడం మానివేశారు. మానివేసారనే కన్నా అవే విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పితే బాగుంటుంది. ప్రభుత్వం ఎంతగా దిగజారి పోయిందంటే, తెలంగాణా శాసన సభ్యులు రాజీనామాలు చేసి, ప్రభుత్వం మైనారిటీలో పడిన సందర్భంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒక ఆంధ్రా లాబీగా మారి అవిశ్వాసం అన్న మాట రాకుండా ప్రభుత్వాన్ని నడుపుకునే నాటకానికి తెరలేచింది. ఎన్నికలోస్తే తెలంగాణా ప్రజలు తమను వెలివేస్తారేమో ననే భయంతో ప్రభుత్వాన్ని కూలకుండా నడుపుకుంటూ ప్రజాస్వామ్య విధానానికే విఘాతం కలిగించే దుస్సాహసాలకు తెగించడం జరిగింది.

ప్రతిపక్షం, ప్రధానపక్షం కుమ్మక్కై  రాజకీయం నడుపుతున్న ఈ పరిస్థితి చూసినప్పుడు, తెలంగాణాకు ఇకముందైనా న్యాయం జరుగుతుందని ఎలా నమ్మకం కలుగుతుంది? పార్టీలకతీతంగా రాజకీయులు ప్రాంతీయకోణంలో చీలినప్పుడే తెలంగాణాకు ఇక న్యాయం జరగదనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే ఒక ప్రాంతం వారే సంఖ్యా బలంలో ఎప్పుడూ మిన్నగా వుంటారు కాబట్టి. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల మధ్యన నెలకొన్న ఈ అక్రమ సంబంధం ప్రాంతాల మధ్యన అన్యాయమైన పోటీగా మారింది. ఈ అన్యాయమైన పోటీలో మరింతకాలం పాల్గొంటూ, తన జవసత్వాలను వృధా చేసుకొనే అవసరం గాని, ఓపిక  గానీ తెలంగాణా ప్రజలకు లేదు. కాబట్టి ఈ అసమానతను నివారించడానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదు.

6 comments:

  1. Already we were crossed that stage to explain other people why we need Telangana.
    ( thak gaia ) We want telnagana that's it . if They want they can stay in Telangana otherwise they can go...

    ReplyDelete
  2. సార్‌ మీరు ఏమి అనుకోకుండా కూడలి లో కూడా పెడతారా మీ బ్లాగుని. మీ బ్లాగు కేవలం మాలికలో వస్తోంది, మాలిక అంతా కెలుకుడు బ్లాగుల మయం అయిపోవడం మూలంగా చూడడం తగ్గించేశాం, ఎప్పుడోగాని మీ బ్లాగు కళ్ళపడడం లేదు.

    ReplyDelete
  3. కూడలిలో కూడా వస్తుందండీ. హారంలో అయితే 'వీరతెలంగాణా' పేరుతో వస్తుంది.

    ReplyDelete
  4. అజ్ఞాత గారు ఈ బ్లాగ్ సంకలిని లో కూడా వస్తోంది
    >>> మాలిక అంతా కెలుకుడు బ్లాగుల మయం
    ఇప్పుడు ఎవరూ కేలుక్కోవడం లేదు కదా

    ReplyDelete
  5. >>ఇదంతా చెప్పేటప్పుడు కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. దానికి వోటింగో, రిఫరెండమో ఏదో ఒకటి పెడితే తప్ప ప్రజాభిప్రాయం తెలిసే అవకాశం లేదు
    yes on telangana issue also either voting or referendum must happen
    and that to telanganavadulu must agree that to visalandravadulu to say their side not like try to hit visalandrasabha today.

    ReplyDelete
  6. Mr Krishna

    Telangana is ready for voting or Referendum. Does the so called Democratic
    Government of India or Samikhyandhra(Only Hyderabad but not other Districts of telangana) Governmenet Has the Guts to go for it

    ReplyDelete