Monday, December 31, 2012

నిత్య అసత్యవాది


డిసెంబరు 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాపై స్పష్టత ఇచ్చామని చంద్రబాబు, తెలంగాణా తమ్ముళ్ళు జబ్బలు చరుచు కుంటున్నారు. వీరు చెప్పే మాటల్లో నిజమెంతో పరిశీలిద్దాం.

అసలు ఈ అఖిలపక్ష తంతు మొదలైంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ నుంచే. తెలంగాణలో 'వస్తున్నా మీకోసం' కొనసాగాలంటే ఆ పార్టీకి తెలంగాణా ఏర్పాటు పై లేఖ ఇవ్వాల్సిన అవసరం ఎదురైంది. దానికి అనుగుణంగానే బాబు తెలంగాణలో అడుగు పెట్టే లోగా తెలంగాణా ఏర్పాటును బలపరుస్తూ కేంద్రానికి లేఖ రాస్తారని తెలంగాణాకు చేనిడిన ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. 

తీరా లేఖ ఇచ్చేనాటికి అది కాస్తా తెలంగాణా ఏర్పాటును బలపరిచేదిగా కాక, 'అఖిలపక్షం ఏర్పాటు చేయండి, స్పష్టత ఇస్తాం' అని చెప్పటంతో సరిపెట్టారు. ఈ మాత్రం దానికి లేఖ ఎందుకు? అని అప్పుడే అంతా ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం వారు మాత్రం 'అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణా తుట్టెను కదిలించే ధైర్యం కాంగ్రెస్ కు ఎలాగూ లేదు, దాన్ని మనం కాష్ చేసుకుని తెలంగాణా పాదయాత్ర పబ్బం గడుపుకోవచ్చు' అని భావించారు. కాని, FDI ల పుణ్యమా అని కాంగ్రెస్ ఎంపీలు బెట్టు చేయడం, వారిని బుజ్జగించడానికి కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్షం ఏర్పాటు చేయడం వెంట వెంటనే జరిగి పోయాయి. దీంతో తెలుగు దేశానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

దీన్నుంచి బయట పడడానికి, అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలా అని నిర్ణయించడానికి రెండు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపాడు బాబు. అఖిలపక్షం ఏర్పాటు చేయమని డిమాండు చేస్తూ అప్పుడు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తామని చెప్పినప్పుడు, మరొకసారి తమ నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం ఏంటి? అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి వుండాలి కదా?

ఆ సమావేశానికి పరమాందయ్య శిష్యుల్లాగా బాబు సీల్డ్ కవర్ను ఇద్దరు నాయకులు మోసుకు వెళ్లారట! కొండంత రాగం తీసి పిల్లికూతలు పాడినట్టు, ఆ ఉత్తరంలో బాబు వీరు చెప్పిందేమిటి? 2008లో ప్రణభ్ ముఖర్జీకి ఇచ్చిన ఉత్తరాన్ని వెన్నక్కు తీసుకోలేదట! 

ఆ ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని ఎవరికీ తెలువదా? టెక్నికల్ గా వెనక్కి తీసుకోక పోవచ్చు, కాని డిసెంబరు 2009లో అసెంబ్లీలో, అఖిలపక్షంలో  తెలంగాణా ఏర్పాటుకు మద్దతు ప్రకటించి, 2009 డిసెంబరు 9న ప్రకటన రాగానే 10నాడు ప్లేటు ఫిరాయించిన కారణంగానే గదా మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది? అప్పుడు సమైక్య వాదాన్ని సమర్ధించి, చావుదెబ్బ తిన్న తర్వాత తిరిగి 2011 మహానాడులో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రవచించిన విషయం వాస్తవం కాదా? మరి అటువంటప్పుడు తాము ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరం వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎవరిని మోసపుచ్చాలని?
     
అసలు ఎప్పుడో ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎందుకు? నిజాయితీ ఉంటే తెఅలంగానా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నామని స్పష్టం గా చెప్పవచ్చుగా? అలా సమర్థిస్తున్న BJP, CPI లాంటి పార్టీలు ఎలా చెపుతున్నాయి? మరి తెలుగుదేశం పార్టీ ఉత్తరంలో అంత డొంక తిరుగుడు ఎందుకు? మోసపూరిత ఉద్దేశాలు లేకపోతే?  

నిజంగా తెలంగాణా ఏర్పాటుపై వారికి సుముఖత ఉంటే అదే విషయం స్పష్టంగా చెప్పి ఉండవచ్చు. తీరా రేప్పొద్దున కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే, 'మేం ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదన్నాం తప్ప, ఇప్పుడు సమర్థిస్తున్నామని చెప్పామా?' అని మరో సారి ఫిరాయించడానికి వెసులుబాటు కల్పించు కోవడం కాదా ఇది? అసలు స్పష్టంగా ఉత్తరం ఇచ్చినప్పుడే మాట తప్పగా లేనిది, ఇంతటి డొంక తిరుగుడు మాటలు చెప్తుంటే మాట నిలబెట్టుకుంటారని నమ్మేదేట్లా? 
 
చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తే, మాట తప్పి మడమ తిప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని ఇట్టే అర్థమవుతుంది. సబ్సిడీలు వద్దని, తర్వాత అన్నీ ఫ్రీగా ఇస్తానని, బెల్టు షాపులు తానే పెట్టి, ఇప్పుడు తీసేస్తానని, తెలంగాణా వద్దని, మళ్ళీ కావాలని, మళ్ళీ సమైక్యత అని, రెండుకళ్ళు అని... ఉదాహరణలు ఎన్నో. ఇంతటి నిత్య అసత్యవాది ఇప్పుడు తెలంగాణాకు సపోర్టు చేస్తాడని ఎవరూ అనుకోవడం లేదు.  ఆ మాటలతో తెలంగాణా ప్రజలను మరొకసారి మోసగిస్తామని భావిస్తే అంతకు మించిన తెలివితక్కువ తనం మరొకటి వుండదు.       

Saturday, December 22, 2012

దళితవాదమా? సమైక్యతా రాగమా?




కొండా సురేఖ, మోత్కుపల్లి నర్సింలు, తూర్పు జయప్రకాష్ రెడ్డి లాంటోల్లు పైకి తామే నిఖార్సైన తెలంగాణా వాదులమని చెప్పుకుంటూ, KCRని TRSని రోజుకు పది సార్లు దుమ్మెత్తి పొస్తుంటరు. వాళ్ళు పక్కా రాజకీయ అవకాశ వాదులు. వారి వారి సీమాంధ్రకు చెందిన నాయకుల చేతిలోని కీలు బొమ్మలు. TRSనో, KCRనో తిడితే తప్ప వారి పార్టీలో వారికి గుర్తింపు ఉండదు. కాబట్టి వాళ్ళ మాటలను గాలికి వదిలెయ్యొచ్చు.

స్వయంగా ప్రొఫెసర్ అయివుండి, స్వయం ప్రకటిత దళితవాది అయిన కంచె అయిలయ్య లాంటి వాళ్ళు రాజకీయ బ్రోకర్లకన్నా హీనంగా అమ్మనా బూతులు తిడుతుంటే పట్టించుకోకుండా వుండడం సాధ్యం కాదు. పేరుకు తెలంగాణా వాద సంస్థ నొకదాన్ని పెట్టుకొని తెలంగాణా కోసం ఏమాత్రం పాటుపడని ఒకానొక గజ్జెల కాంతం అనే అనబడే ఆయన పెట్టిన సమావేశానికి ఈ మధ్య ఐలయ్యగారు వెళ్ళారట. ఆయన తెలంగాణా సాధనకోసం సూచనలు సలాహాలు ఏమీ ఇయ్యలేదు కానీ, TRSను, KCRను తిట్టెటందుకు మాత్రం తన ఉపన్యాసాన్ని వాడుకున్నడు.

తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి KCR 50000ల కోట్లు సంపాయించుకున్నడట! మరి అంతటి రహస్యం ఆయనకే తెలిసినప్పుడు dis-proportionate assets క్రింద కోర్టులో కేసు వేయొచ్చుగా? ఆధారాలు లేని మాటలు చెప్పి ప్రచారం పొందే అణా కానీ రాజకీయ నాయకునికి, ఈ మేధావి(?)కీ గల తేడా ఏమిటి? మహామహులైన ములాయం, మాయావతి, మన రాష్ట్రంలో జగన్ లాంటి వారిని CBI కేసుల్లో ఇరికించి ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్, ఒక్క రూపాయి కేసులో ఇరుక్కున్నా KCRని ఊరికే వదిలి పెడుతుందా?

ఇకపోతే KCR ఇంట్లో ఎవరూ ఎందుకు ఆత్మ హత్యలు చేసుకోవడం లేదని అడగడం ఆయన దిగజారుడు తనానికి మరో నిదర్శనం. ఆత్మ హత్యలు ఎవరు చేసుకుంటారు? బలహీన మైన మనస్తత్వం గలవారు తెలంగాణా రాదేమోనన్న తీవ్రమైన నిరాశా నిస్ప్రుహలకు గురైనప్పుడు, లేదా ధైర్యవంతులైనా, సమాజానికి ఒక బలమైన message ఇవ్వాలె ననుకున్నప్పుడు ఆత్మ హత్యలకు ఒడిగడుతున్నారు. వారు ఏవిధంగా ఆత్మహత్య చేసుకున్నా తెలంగాణా వాదులు వాటిని సమర్థించడం లేదు. పైగా "ఆత్మహత్యలు వద్దు, నిలబడి పోరాడండి" అన్న పిలుపు నిస్తున్నారు. కాని దానికి విరుద్ధంగా వున్న ప్రొఫెసరు మాటల్లోని ఔచిత్యమేంటో చెప్పడానికి PhDలు అవసరం లేదు, తెలంగాణాలోని స్కూలు పిల్లవాడు చాలు.

ఇక పోతె ఆయన ముఖ్యమైన ఆరోపణ తెలంగాణ వస్తే వెలమ కులం బలపడుతది అనేది. కంచె ఐలయ్యో, గజ్జెల కాంతమో తప్ప సిసలైన తెలంగాణా వాదులెవరూ ఇప్పుడు తెలంగాణాల కులాల గురించి ఎవ్వరూ ఆలోచిస్త లేరు. అందరి మనసులల్ల తెలంగాణా ఎట్ల వస్తది అన్న ఆలోచన మాత్రమే వున్నది. ఇంక ఈయన ఆరోపణలల్ల నిజమెంతో చూద్దాం.

తెలంగాణాల రెడ్లకంటే బలమైన కులమేమీ కాదు వెలమ. తెలంగాణా రెడ్లు కూడా రాయలసీమ రెడ్ల వంటి బలవంతులూ, ఫ్యాక్షనిస్టులూ కారు. ఇక పోతే మూడో అగ్రకులమైన కమ్మ తెలంగాణాలో నామమాత్రం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తెలంగాణా రాష్త్రం వస్తే అగ్ర కులాలు కాకుండా BC, SC, STలు బలపడే అవకాశం వుందని కదా? ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజలసీమ రెడ్డి, ఆంధ్ర కమ్మ కులాల గుప్పిట్లో వుంది. తెలంగాణా గనుక విడిపోతే, ఇతర కులాల జనాభా ఎక్కువ కాబట్టి వారికి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఒకవేళ రాష్ట్రం ఇప్పుడు ఏ దళిత బహుజనుల చేతిలోనో వుండి వుంటే, రేపు తెలంగాణా వస్తే వెలమల చేతిలోకి వెలుతుందేమో, ఎలా? అని ఆలోచించడంలో అర్థం వుంది. కాని రాష్ట్రం ఏర్పడ్డ యాభయ్యేడు సంవత్సరాల్లో ఏనాడూ రాజకీయంగా వారి ఆధిక్యత కనపడలేదు. ఈ రాష్ట్రం ఇలాగే వుంటే మరో యాభై ఏళ్ళ తర్వాత నైనా ఆంధ్రా కమ్మ, రాయలసీమ ఫ్యాక్షన్ రెడ్ల హస్తాల నుండి బయట పడుతుందన్న నమ్మకం అసలే లేదు.

KCR అగ్రకులంలో పుట్టడం ఆయన తప్పు కాదు. కంచె ఐలయ్య కేవలం దళిత కులంలో పుట్టినందుకే దళితవాది అయ్యాడా, లేక దళితులపై జరుగుతున్న అత్యాచారాలను సహించలేక దళితవాది అయ్యాడా అన్నది ఆయన ఆలోచించు కోవాలి. దళితులపైన జరుగుతున్న అత్యాచారలపై స్పందించి పోరాడడానికి దళితుడే కానవసరం లేదు.

అలాగే తెలంగాణా పోరాటం కూడా తెలంగాణాపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా, తెలంగాణా అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటం. ఈ రెండు పోరాటాలు ఒకదాన్ని ఒకటి పరస్పరం గౌరవించుకుంటూ జరుగ వలసిన పోరాటాలు. రెండింటి లక్ష్యం ఒక్కటే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీని వ్యతిరేకించి పోరాడడం. నిజమైన దళిత వాది తెలంగాణా వాది కాకుండా వుండలేడు, అలాగే నిజమైన తెలంగాణా వాది దళితవాది కాకుండా వుండలేడు.

ఐలయ్య లాంటి వాళ్ళు పనిగట్టుకొని KCRని విమర్శించడం వల్ల బలపడేది దళిత వాదం కాదు, సమైక్యవాదమే అని గుర్తించాలి. KCR నాయకత్వం వల్ల వెలమల అధికారం ఏ రూపం తీసుకుందనేది ప్రస్థుతం ఊహాజనితమైన విషయం. కాని ప్రస్థుతం నడుస్తున్న కమ్మ, ఫ్యాక్షనిస్టు రెడ్ల పాలనలో కనిపిస్తున్న చుండూరు, కారం చేడు, లక్షింపేటల విముక్తి గురించి ముందు ఆలోచించాలి. తెలంగాణా ఏర్పడితే నిశ్చయంగా అది దళిత బహుజనుల రాజకీయాధిఅకానికి దోహద పడుతుంది. తద్వారా సోదర ఆంధ్రా ప్రజలకు కూడా ప్రేరణ కల్పిస్తుంది. ఆ విషయం ఆంధ్రాలోని దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి, ఐలయ్య లాంటి జడ వాదులు తప్ప.

Saturday, December 15, 2012

కాంగ్రెస్ తెలంగాణా వ్యతిరేకతకు కారణం ఏమిటి?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేలి పోయింది. ఇప్పటిదాకా రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెపుతున్నా, వచ్చే ఎన్నికల లోపు కాంగ్రెస్ ఏదో ఓక నిర్ణయం తీసుకుంటుందని ఏమూలో ఒక చిన్న ఆశ. దానికి కారణాలు లేక పోలేదు. సీమాంధ్ర లో రోజు రోజుకి దిగజారుతున్న దాని పరిస్థితి, ఒక వేళ తెలంగాణాపై నిర్ణయం తీసుకుంటే కనీసం ఆ ప్రాంతంలో నిలదొక్కుకునే అవకాశం. కాని, మొన్న కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్ష సమావేశానికి పిలుస్తూ ఇచ్చిన లేఖని చూసిన తర్వాత కూడా ఎవరైనా ఆ పార్టీ తెలంగాణాను ఇస్తుందని నమ్మితే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.

కాంగ్రెస్ తెలంగాణాను ఇలా వెన్నుపోట్లు పొడవడం ఇది మొదటిసారి కాదు. గొప్ప ప్రజా చైతన్యంతో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం జరిగి, నిజాంని మట్టి కరిపించే తరుణంలో పోలీస్ యాక్షన్ ప్రకటించి, అదే నిజాంని 'రాజ బహద్దూర్' చేసి, భరణం ఇచ్చి సాగానంపినప్పుడే నెహ్రూ, పటేల్ తెలంగాణా వెన్నులో మొదటి గునపాన్ని దింపారు. అది మొదలుగా కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపర కొనసాగుతూనే వుంది.

1956లో విశాలాంధ్ర ఏర్పాటు చేసినప్పుడూ అదే తంతు. ఆ తర్వాత మోసాలూ, ఒప్పందాల ఉల్లంఘనలూ, 1969లో తెలంగాణా ఉద్యమం అణచివేత, మొన్నటికి మొన్న 2009లో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడం... ఇలా ఒకటేమిటి? తెలంగాణాకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలు చెప్పితే తరిగేవి కాదు. కాంగ్రెస్ చేసిన ఈ ఘనకార్యాలకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ భూస్థాపితం కాకుండా తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం, అధికారంలో ఉండగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడం.

కాని దానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదని కొత్తగా ఇచ్చిన లేఖతో బయట పడింది. ఎంపీలు కోరారు కాబట్టి సమావేశం ఏర్పాటు చేస్తుందట. చర్చలను తిరిగి పునరుద్ధరిస్తుందట! తెలంగాణా ప్రజలను ఆ పార్టీ ఎంత చులకనగా చూస్తుందో  ఈ రెండు వాక్యాలు చూస్తే చాలు, తెలిసి పోతుంది.

తెలంగాణా ఇవ్వడం వల్ల తెలంగాణలో బలపడుతానని తెలుసు, ఆంధ్రాలో చెప్పుకోదగ్గ తేడా రాదనీ తెలుసు. బయటికేం చెపుతున్నా, తెలంగాణా ఇచ్చినా.., ఇవ్వకపోయినా దేశ వ్యాప్తంగా జరిగే మార్పులేమీ ఉండవని కూడా తెలుసు. భారత దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా తెలంగాలో ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. మరి ఏ నష్టం లేనప్పుడు, పైగా ఏంతో  కొంత లాభమే ఉన్నప్పుడు, ఆ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు ఏందుకు సుముఖత చూపడం లేదు? ఇది  ప్రతి తెలంగాణా పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న.

అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న వారికి అది సులభంగానే అర్థమౌతుంది. ఇందిరాగాంధీ మరణం వరకూ కాంగ్రెస్ అమెరికానూ, మార్కెట్ విధానాలనూ ఎదిరించేదిగా పేరు తెచ్చుకుంది. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది తన దిశను మార్చుకొని, వరల్డ్ బ్యాంకు, అమెరికాల అడుగులకు మడుగులొత్తడం మొదలు పెట్టింది.

ఆ కారణంగానే దేశం మొత్తం వద్దని మొత్తుకున్నా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో వున్నా, అణు ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకుంది. దానికోసం కోట్లు కుమ్మరించి  ఎంపీలను కొనడానికి కూడా వెనుకాడలేదు. అలాగే వాల్ మార్టు వ్యవహారం కూడా. అదే సమయంలో మహిళా బిల్లు, జన లోక్ పాల్ బిల్లుల కోసం దేశ వ్యాప్తంగా ఎంత వత్తిడి వచ్చినా పట్టించు కోలేదు. ఇక తెలంగాణా సంగతి సరే సరి.

దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అమెరికాకు, అంబానీలకు మాత్రమే జవాబుదారీ తప్ప, ఈ దేశ ప్రజలకు కాదని అర్థం కావడం లేదూ? మార్కెట్ శక్తులు ఆజ్ఞాపిస్తే కాంగ్రెస్ నిముషాల్లో తెలంగాణా ఇస్తుంది. కానీ అలా జరగడం లేదు... కారణం ఏమిటి?

తెలంగాణా రైతాంగ పోరాటం నుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రజలు మార్కెట్ భావ జాలానికి వ్యతిరేకం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే స్వభావం అసలే కాదు. మరి ఇలాంటి ప్రజల చేతుల్లో ప్రపంచ ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటైన హైదరాబాదును ఎలా పెడతారు? చూస్తూ చూస్తూ అంత పెద్ద మార్కెట్ ను శాసించే అవకాశాన్ని మార్కెట్ శక్తులు వదులుకుంటాయా?

కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణా రాదని స్పష్టమైంది. అదే విధంగా రేపు మరో కూటమి కేంద్రంలో అధికారం లోకి వచ్చినా, అది కూడా మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే అవకాశం వుంది. అలాంటి పార్టీలు ఇప్పుడు ఏమి చెప్పినా, తర్వాత ఇచ్చిన వాగ్దానాలను అవే మార్కెట్ శక్తుల ఆదేశాల మేరకు తుంగలో తొక్కవని అనుకోలేం.

ఉద్యమాలతో తెలంగాణా సాధించాలని కొందరి వాదన. ఉద్యమాలతో తెలంగాణా వచ్చే అవకాశమే వుంటే అది ఇప్పటికే వచ్చి వుండాలి. ఒక్క సాయుధ పోరాటం తప్ప తెలంగాణా ప్రజలు ఇప్పటికే అన్ని రకాల ఉద్యమ రీతులను ఇంతక ముందు దేశంలో ఎక్కడా కనీ, వినీ ఎరుగని రీతిలో చేసి వున్నారు. ఇప్పుడు మరి కొన్ని ఉద్యమాలు చేసినా అవి బలమైన శత్రువు ముందు ఏమాత్రం పనిచేయవని లోక్ పాల్, వగైరా ఉదంతాలు ఈ పాటికే తేట తెల్లం చేశాయి. ప్రజలు ఉద్యమాలు చేసిన కొద్దీ, ప్రభుత్వం మరిన్ని అధునాతన ఆయుధాలు దిగుమతి చేసుకొని మరింత నైపుణ్యంగా వాటిని అణచి వేస్తుందే తప్ప, ప్రజల కోరిక నేరవేర్చుదామనే ఆలోచన చేయదు.

కాబట్టి  రాష్ట్ర సాధన కోసం తెలంగాణా ప్రజలు ముందు రాజకీయంగా బలపడాలి. నిఖార్సైన తెలంగాణా వాదులను అత్యధికంగా పార్లమెంటుకి, అసెంబ్లీకి  గెలిపించడం ద్వారా, రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించ గలిగినప్పుడే ఆ అనివార్యత సాధ్యం అవుతుంది. ఎదురు నిలిచి పోరాడే వాడికి కట్టెనిచ్చి, పారిపోయే వాడికి కత్తి నివ్వడం వలన ఉపయోగం లేదు. కాబట్టి పన్నెండేళ్ళుగా నిబద్ధతతో తెలంగాణా ఏర్పాటుకోసం ఉద్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకున్న కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితిని అత్యధిక సీట్లలో గెలిపించడం ఒకటే ఇప్పుడు తెలంగాణా ప్రజల ముందున్న మార్గం. అంతకు మించిన మార్గం లేదు.








Tuesday, December 11, 2012

అవ్వా, బువ్వా రెండూ దక్కవు


తెలంగాణా అంశం దిల్లీలో ఊపందుకున్న ప్రతిసారీ ల్యాంకో హిల్సులో ఫ్లాట్లమ్ముకునే వ్యక్తికి గుండె దడ పెరుగుడు మొదలైతడి.  ఏ హోం మంత్రో, ప్రధాన నేతో, తెలంగాణా పై ఒక విధాన ప్రకటన చేయంగనే ఫ్లాట్ల రేటు తగ్గుతదేమోనని గాయినకు ఎక్కడ లేని భయమైతది. హుటాహుటిన ఫ్లైట్లల్ల సూటు కేసులు మారుతై. ఏం జరుగ లేదన్నట్టు ఒక డిల్లీ గులాం తొండి మాటలు మాట్లాడుడు శురూ జేస్తడు.

మూడేండ్ల నుండి ఇదే కథ నడుస్తుంది. తెలంగాణా పోరాట శక్తుల పట్టుదలో, తె.కాంగ్రెస్  ఎంపీల బెట్టుదలో, మొన్న FDI ల పుణ్యమా అని అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు హోమ్ మంత్రి ద్వారా ప్రకటన వచ్చింది. అంతలోనే దాన్ని నీరు గార్చుడు మొదలైంది. గులాం గులాంగిరీ, ముఖ్యమంత్రి వాయిదా అభ్యర్ధన, హోం మంత్రి ఎంతమందయినా రావచ్చు... అనుకుంట ప్రకటనల శర పరంపర మొదలైంది.

ఈ మాత్రం దానికే స్వర్గాన్ని భూమ్మీదకు దించినట్టు ఉబ్బి తబ్బిబ్బవుతున్న తెలంగాణా కాంగ్రెస్ ఏమ్పీల్లారా, గత ఎనిమిదేళ్లుగా అణుశక్తి బిల్లు, అవిశ్వాస తీర్మానం, లోకపాల్ లాంటి అవకాశాలను సద్వినియోగ పరచుకొంటే, ఈపాటికి తెలంగాణా వచ్చేసుండేది.

కనీసం ఇప్పటికైనా మీరు బెట్టు దిగకుండా సక్రమంగా అఖిలపక్షం జరిగేటట్టు చూడండి. ఇప్పటికే షిండే సమావేశానికి ఒక్కరైనా రావచ్చు, ఎందరైనా రావచ్చు అని మొండి మాటలు మాట్లాడుతున్నడు. పార్టీకి ఒకరు మాత్రమె వచ్చి ఒకే అభిప్రాయం ఇచ్చేటట్టు మీరు జాగ్రత్త పడకుంటే, జనానికి మీ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా సడలుద్ది. అధిష్టానం ఆడే డ్రామాల మీ పాత్ర ఉన్నదా, లేదా అనేది మాకు అనవసరం. మీ నిష్క్రియాపరత్వం చూస్తున్న వాళ్లకు మీరు కూడా పాత్రధారులే నాన్న నమ్మకం కలుగక మానదు.

అట్లా జరుగొద్దనుకుంటే, మీ చిత్తశుద్ధి ప్రజలకు నిరూపించాల్నంటే, మీరు తీసుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకు నడవడమే మీకున్న మార్గం. మధ్యలో వదిలేస్తిరా, మీకు అవ్వా, బువ్వా రెండూ దక్కవు.  

Wednesday, December 5, 2012

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు


ఇప్పుడున్న పరిస్తితులల్ల 2014 లోపు తెలంగాణా రావాలె నంటే ఒకటే మార్గం. అది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాళ్ళ అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుక రావడం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలను పట్టించుకుంట లేదు. ప్రజల ఆకాంక్షల కన్నా సీట్ల లెక్కలే దానికి ముఖ్యమై పోయినై. అసుమంటి పార్టీకి అదే తరీకల బుద్ధి చెప్పాలే. సీట్ల లెక్కలు చేసుకొనే పార్టీకి గా సీట్ల లెక్కలే తారుమారు చెయ్యాలే. అది 2014 ల ఎట్ల నైనా చేస్తం, తెలంగాణా ఇయ్యక పొతె. కాని గాపని ఇప్పుడే కావాలె నంటె మాత్రం అది కాంగ్రేస్ పార్టీ నాయకుల తోనే సాధ్యం.

తెలంగాణా వాదులమని చెప్పుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా ప్రజలని మభ్య పెట్టుడు మానేయ్యాలే. వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా... అమ్మ పలుకుతది... అనుకుంట కాలం వెళ్లదీస్తున్నరు. అయితే గీ శీతాకాల సమావేశాలు అయిపోతే, ఇంక తెలంగాణా మాట వచ్చుడు కష్టం. ఒకవేళ ఇద్దామనుకున్నా వచ్చే ఎన్నికల లోపల అది అసాధ్యం.  కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఒక మూలకు నెట్టి వేయ బడ్డరు. ఇంక అక్కడి నుండి వాళ్లకు తెలంగాణా తెచ్చుడు తప్ప వేరే దారి లేదు.

కాబట్టి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే తమ పార్టీ అధిష్టానం మీద గట్టి వత్తిడి తీసుక రావాలె. రాజీనామాలకు కూడా  సిద్ధపడి రాజీలేని పోరాటం చేస్తే తప్ప అలాటి వత్తిడి పనిచెయ్యదు. సోనియా ముందట చేతులు కట్టుకొని మోకరిల్లితే అది సాధ్యం కాదు. అమ్మ మెప్పుకోసం వాళ్ళు తెలంగాణనే పణంగ పెడుతరా అంటే అది వాళ్ళ ఇష్టం. అట్ల గనుక జరిగితే వాళ్ళను బొంద పెట్టేతందుకు ప్రజలు సిద్ధంగ ఉన్నరు. ఇక నిర్ణయించు కొనుడు వాళ్ళ వంతే.

ఇంక కొంతమంది జగన్ పార్టీ దిక్కు చూస్తున్నరట.గట్ల చూసే నాయకుల చరిత్రలు మనకు తెలువనియి కావు. వాల్లకు రాజకీయమంటే డబ్బు, డబ్బంటే రాజకీయం. జగన్ ఇచ్చే పైసలతోని ఎన్నికలల్ల గెలుస్తమని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అది కేవలం వాళ్ళ భ్రమ. మూడేండ్ల కిందనే కోట్ల రూపాయలు మంచినీళ్ళ లెక్క కర్చు పెట్టిన డి. శ్రీనివాస్ కి ఏ గతి పట్టిందో వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలె.

ఇప్పుడు ఇక్కడి ప్రజలకు తెలంగాణా ఆకాంక్ష ఒక్కటే తప్ప ఇతర ప్రలోభాలు ఎన్ని చేసినా అవి ప్రభావం చూపవు. తెలంగాణా మేమే ఇస్తామని చెప్పి ఇన్నొద్దులు సుద్దులు చెప్పుకుంట పబ్బం గడుపుకున్నరు అన్ని పార్టీ లోల్లు. కాని ఇంకా గయ్యే మాటలు చెప్తమంటే మటుకు జనం నమ్మే పరిస్తితిల లేరు. చెంద్రబాబు కళ్ళు పోసి బీడీ ముట్టిచ్చినా, విజయమ్మ దొంగేడుపు లేడ్చినా, శర్మిలమ్మ నంగి మాటలు చెప్పినా... ప్రయోజనం శూన్యం.

అయితే ప్రజల కోరికలు ఎట్లున్నా, సీమాంధ్ర పెట్టుబడిదారీ, దోపిడీ, ఫ్యాక్షన్ శక్తులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రాంగ, అధికార గణం, సీమాంధ్ర మీడియా  వగైరాలు అభిమన్యుడిని దొంగ దెబ్బ తీసిన కురవుల్లా, తెలంగాణాను చావుదెబ్బ తీయడానికి పొంచి వున్నాయి. ఇట్లాంటి శక్తుల కుయుక్తులను ఎదుర్కునే టందుకు ప్రతి ఒక్క తెలంగాణా యోధుడు అనుక్షణం అప్రమత్తంగ ఉండాలె.

Saturday, December 1, 2012

ప్రజాసమస్యలు పట్టని పాదయాత్రలు



ఇది పాదయాత్రల సీజన్. ప్రతి నాయకుడు, నాయకురాళ్ళు అనుకునేవాళ్ళు యాత్ర లు చేపడుతూనే ఉన్నారు. ఆ మొన్న ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామం నుంచి ఒక ట్రైబల్ జాదవ్ విలాస్ నాయక్ యువ నాయకుడు జోడేఘాట్ దగ్గర నుంచి బతికుండి తెలంగాణ కోసం పోరాడాలి, బలిదానాలు సరికాదని ఆత్మహత్యలకు వ్యతిరేకం గా తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఆయన గురించి ఎవరూ రాయరు. రాసినా ఎవరు చదవరు. ఆయన వెనుక ఒక పార్టీ కాని, అతని తండ్రి, అన్న, మామ ఎవరూ కూడా అతి పెద్ద పదవులు అనుభవించిన వారుకాదు. వారి గురించి అక్కడా ఇక్కడా రెండు ముక్కలు జిల్లా పేజీల్లోనో వేస్తే తప్పా తెలిసే అవకా శం లేదు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఒక ప్రభుత్వ టీచర్, ఎరుకల కులస్థుడు, సురపరశురాం తెలంగాణ వచ్చేదాకా పండుగలు చేసుకోవద్దనిపతి పండుగకి భార్య, కుమారునితో ఊరి చౌరస్తాలో దీక్ష చేస్తున్నడు. ఆయన గురించి ఎంతమందికి తెలుసు? కొంతమంది జిల్లా వారికి మాత్రమే తెలిసి ఉండవచ్చు.

ఇదే పరిస్థితి కాలువగట్టు మల్లన్న ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ బస్సు యాత్రకు అడుగడుగునా పోలీసువారు అడ్డుకున్నారు. నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. అలాగే ముస్లిం సమస్యలపై అనేక సదస్సులు జరుగుతాయి. అవికూడా వార్తల్లోకి ఎక్కవు. ఇంకావిద్యార్థులు తెలంగాణ మంట ప్రజల గుం డెల్లో చల్లారకుండా ఉండడానికి బస్సుయాత్రో, పాదయాత్రో చేస్తుంటారు. అవి పెద్ద వార్తలు కావు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక రోజు జలదీక్ష చేస్తే ఎన్ని పత్రికలు ప్రచురించాయి? కానీ షర్మిలా, చంద్రబాబు పాదయాత్రలు పతాక శీర్షిక వార్తలు అవుతుంటాయి. పవర్ యాత్రలా మజాకా! తెలంగాణ వాళ్ళయితే లెక్క వేరేవిధంగా ఉంటది. 

రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు చేయని పోరాటం లేదు. ఆఖరికి ప్రాణాలు తీసుకున్నారు. ఏఒక్క నాయకుడైనా స్పందించక పోతారా అని అన్ని ప్రయత్నాలు చేశారు. ఏలిన వారు నేను కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు అని కుప్పిగంతులు వేస్తున్నారు. ఇప్పుడు జరిగే యాత్రలను చూస్తుంటే ఓటు రాజకీయాల కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూస్తుంటే వీళ్లనేనా మనం నాయకులుగా ఎన్నుకున్నది అనిపిస్తుంది. తండ్రి పోయాడని జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి, వారి తండ్రి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరెస్టై జైలులో ఉన్నాడు. దీంతో జగన్ మార్క్ రాజకీయాలు ఆకాశం నుంచి ఒక్కసారి కిందికి దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తరువాత జగన్ తల్లి విజయమ్మతో యాత్రలు చేయించారు. జగన్ అనుకున్న పాచికలు పార తెలుసుకున్నారు వారి వెనుక ఉన్న వందిమాగధులు. వెంటనే మరో పాత్రను ప్రవేశపెట్టారు.వారి పేరు షర్మిల. ’జగనన్న కోసమే నేను, అన్న కోసమే నా యాత్ర’ (పదవి కోసమే మా కుటుంబ పాట్లు అని చదువుకోవాలి) మనం. దాని పేరు ‘మరో మహాప్రస్థానం’.

యాత్ర మొదలైంది తండ్రి సమాధి ఇడుపులపాయ నుంచి. అక్కడి నుంచే సెంటిమెంట్, ఎమోషన్ పూర్తిగా దట్టించి ప్రజలను తన యాత్రకి సిద్ధం చేశారు. జగనన్న కోసం యాత్ర చేపట్టిన చెల్లిని చూసి కరిగిపోయిన జనం కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాయలసీమ యాసలో షర్మిల తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతుంటే ఎంతమంది ప్రజలకు అర్థమవుతున్నదో వారే చెప్పాలి.

మీడియా ప్రచారం చూస్తుంటే చాలా వరకు వివిధ పార్టీలకు అనుగుణంగా పని చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నాయా? మూడేళ్లుగా ప్రాణాల కు తెగించి పోరాడుతున్న తెలంగాణ సమస్యను పక్కనపెట్టి మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తున్నై. హర్యానాలో రెండు నెలల కిందట 20 మంది దళిత మహిళలపై రేప్‌లు, గాంగ్ రేప్‌లు జరిగాయి. ఒక తండ్రి, ఒక అమ్మాయి ఆత్మహత్యలు చేసుకున్నరు. ఒక రాష్ట్రంలో ఒక కులం మహిళలపైనే ఎందుకు జరుగుతున్నాయి అన్నది వార్త కాదు. ఎన్నోసార్లు దళిత మహిళలు సర్పంచ్‌గా ఉన్నందుకు బట్టలూడదీసి, పరేడ్ చేయించి నానా హింసలు పెట్టిన సంఘటనలు కోకొల్లలు, ఈమహిళలు దొరసానులు కారు, వారి వార్తలు ఎవరూ రాయరు, కనీసం పట్టించుకోరు. రాజకీయాలు అంటే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం అని ఎవరైనా పొరపడి ఉంటే ఇప్పుడు జరుగుతున్న దేశ, రాష్ట్ర రాజకీయాలను చూసి మీఅవగాహనను మార్చుకొని పుస్తకాలలో కూడా మార్పులు తేవడానికి ప్రయత్నించగలరు. ఇవి రాచరికాలు. అగ్రకుల కుటుంబ రాజకీయాలు, వారసత్వ, పదవి పోరాటాలు అని చదువుకోవాలి.

చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్‌ని సైబర్‌ప్రదేశ్‌గా మార్చారు. ఇపుడు ఎటూ తేల్చుకోలేక, ఏ నిర్ణయం తీసుకోలేక అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా సతమతమవుతున్నారు. వీరి వెనుక ఉన్న తెలంగాణ తెలుగుదేశం వారికి ఇక ప్రైవేట్ సైన్యం తప్ప మరొక దిక్కులేదు. ఈసారి ఎలాగైనా పదవి చేపట్టాలని వారు పాదయాత్ర మొదలుపెట్టారు. వారు పదవి కోసం పడే పాట్లు చూస్తుంటే జనాలకు కడుపు తరుక్కుపోతున్నది. ఈ పాదయాత్రల వల్ల ఒరిగేది ఏమిటో కాస్త చదువు రాని అమాయకులకి చెబితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడి యాత్రలో రాయలసీమ గూండాలతో వచ్చి కనపడ్డ ఉద్యమకారులపైన దాడులు చేయించారు.అదేవిధంగా విజయమ్మ సిరిసిల్ల యాత్రలో ఉద్యమకారురాలు రహీమున్నిసాపై జరిపిన దౌర్జన్యకాండ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తమకంటూ సొంత రక్షణ లేకుండా సీమాంధ్ర నేతపూరైనా తెలంగాణలో యాత్ర చేసే ధైర్యముందా అని ఇక్కడి ప్రజలు సవాలు విసురుతున్నారు.

కోదండరాం చంద్రబాబు నువ్వెట్ల వస్తావో చూస్తామని ఒక సవాల్ విసిరిన్రు. అనుకున్నట్లుగానే అడ్డుపడ్డరు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పమని తెలంగాణ సంఘాలు, ప్రజలు అమాయకంగా అడుగుతుంటారు. ఎక్కడైనా జామచెట్టుకి మామిడి కాయలు కాస్తాయా? ఈ ఆంధ్రా లాబీ రాజకీయాలు తెలంగాణ తెస్తాయా? తెలంగాణ అన్న పదం వినపడకుండా ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం ఎన్ని కుట్రలు పన్నింది? ఎన్ని చట్టాలు పకడ్బందీగా చేసింది? అవన్ని ప్రజలు మర్చిపోయారా? 1972 జై ఆంధ్ర ఉద్యమంలో బాబు గారు విద్యార్థి నాయకుడు, ముల్కీరూల్స్‌ని నిర్వీర్యం చేయడానికి అవతరించిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి.

మామను వెన్నుపోటు పొడిచినట్టు సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. ఆతరువాత వచ్చిన రాజశేఖర్‌డ్డి కేంద్రాన్ని తన గుప్పి ట్లో పట్టుకొని ప్రత్యేకఆర్థిక మండళ్లు కొడుక్కి, బొగ్గునిక్షేపాలు అల్లుడికి ఆస్తిగా కట్నంగా రాసి ఇచ్చారు. ఉద్యమకారుల గొంతుల్ని నొక్కలేదా? ఇవన్నీ మరిచిపోయి మనం మీరు తెలంగాణకు అనుకూలమా కాదా చెప్పండి అనడం విడ్డూరంగాఉంది. ఇన్ని చావులు, ఇన్ని ఉద్యమరూపాలు చూసి కదలని వారు ఇప్పుడు కదిలితే దాని అర్థం ఏమిటి? ఎవరికి కావాలి వీరి సానుభూతి? ఇంతకి తెలంగాణకు అనుకూలమని చెప్పి సాధించేది ఏమిటి? పోయిన ప్రాణాలు తిరిగి ఇస్తారా? పోయిన ఉద్యోగాలు, భూములు, వనరులు వస్తాయా?

కాంగ్రెస్‌లోని కొంతమంది కొత్త వేషంగట్టి తెలంగాణ కోసం పార్లమెంట్ ముందు నినాదాలిస్తున్నారు. సోనియాగాంధీ ఇంకా కరుణిస్త లేరు. కొందరు ఎంపీలు పార్లమెంట్ గుమ్మం లో భిక్షాందేహి అంటే తెలంగాణ వచ్చును. నోట్ దిస్ పాయింట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. మీరు అనవసరంగా మీ ప్రాణాలని అర్పించకండ్రి మీ కాల్మొక్తం. కాంగ్రెస్ అనగానే ఒక జాతి, ఒక కులం అనుకునేరు. పార్టీల్లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ నాయకులు వేరయా! ఎంపీలు ఢిల్లీలో ఉండు ను మరి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడు జగన్ పార్టీలో దూకుదామా అని లెక్కలు వేసుకోనును, బహు ముచ్చటగా దొరికినంతా దోచుకొని మళ్లీ ఎన్నికలకు సిద్ధమగును. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఛలోక్తులు! ఇవి ఇక్కడ తెలంగాణ పాలి‘ట్రిక్స్’!

ఆ మధ్య కాంగ్రెస్‌వారు ఫ్లోరైడ్ బాధితుల కోసం ఒక యాత్ర చేపట్టి 200 కోట్ల దానం ప్రకటించారు. ఇంతవరకు దాని చడీచప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో తెలంగాణ నెటిజెన్స్ ఫోరం యువత ఫ్లోరైడ్ సమస్యపై ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టింది. అప్పుడు మేము ఇక్కడి రాజకీయ పార్టీలకు, పెద్ద పెద్ద సంఘాలకు ఒక సవాల్ విసిరాము. మా జీతభత్యాలతోని, మా యవ్వన జీవితాన్ని తెలంగాణకు, ఇక్కడి సమస్యలకు కేటాయిస్తున్నాం మీరు ఏం చేస్తున్నారని? ఇన్నేళ్లుగా పదవులు అనుభవిస్తూ కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవుల ను చేపట్టిన నాయకుల దగ్గరి నుంచి నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు ఆ ప్రాంతానికి చేసింది ఏమిటి? ఈ రాజకీయ స్వార్థ యాత్రలపై, తెలంగాణ ప్రజలు ధిక్కారగళాన్ని వినిపిస్తున్నారు. మీ యాత్రల వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదు. నిజంగా మీరు సమస్యలపై యాత్రలు చేస్తుంటే.. ఇక్క డ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై, ప్రజల జీవితాలతోని ఆడుకుంటున్న ప్రభుత్వ విధానాలపై మాట్లాడండి. లక్షింపేట, బాక్సైట్, పోలవరం, సెజ్‌లు, పోర్టుల వంటి సమస్యలపై మాట్లాడండి, పోరాటం చేయం డి. ప్రజలకు న్యాయం అందించండి. మేము తెలంగాణకు అడ్డంకాదు అంటూనే ఈ సమస్యను చాకచక్యంగా పక్కన పెడుతున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మీ వెంట వచ్చేవాళ్లంతా మీకు ఓట్లు వేస్తారని భ్రమపడవద్దు. ఇవ్వాళ తెలంగాణలో జిల్లాకు ఒక సమస్యతో సతమతమవుతున్నది. దాని మీద నోర్లు విప్పండి. ఓపెన్‌కాస్ట్, గ్రానైట్ మైనింగ్‌ల తవ్వకాలపై మీ వైఖరి చెప్పండి. నీటిని, భూమిని పేదలకు పంచి, వనరుల రక్షణ బాధ్యత పేదలకు ఇస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? ఒకవేళ ఉంటే ఇన్ని పాదయావూతల అవసరాలు రాక పోవచ్చు.

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Re-published from Namasthe Telangana

Wednesday, November 28, 2012

ఒకనిది వికటాట్టహాసం, ఇంకోనిది చిరుదరహాసం.


ఆయన అసెంబ్లీల వికటాట్ట హాసాలు చేసేటోడు. అవును, ప్రతిపక్ష నాయకులు ఆయన చేస్తున్న దోపిడీలు చూసి కడుపు మండి కోపం తోటి, ఆవేశంగ చేసే విమర్శలు చూసుకుంట వెకిలి వికటాట్ట హాసాలు చేస్తుండేటోడు. ఎవనికైనా తనను  విమర్శిస్తూ తిడుతుంటే, పౌరుషం పెరుగుతది, కోపం వస్తది. లేక నిజంగా తాను చేస్తున్నది తప్పే అని అనిపిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలేనా అనిపిస్తది. కాని ఆ రాజన్నకు అట్ల ఎన్నడూ అనిపిచ్చినట్టు కనపడలేదు. తనను ప్రతిపక్ష నాయకులు విమర్శించినంత సేపూ వెర్రి నవ్వులు నవ్వడం రాజన్నకు సర్వ సాధారణం. ఆ నవ్వుల కారణం స్థూలంగా అర్థమైనా అసలు కారణం మాత్రం అస్పష్టమే.

"వెర్రి నాయనలారా! మీరెన్ని తిట్టినా నేను చేసేది చేస్తూనే ఉంటా. మీరు ఏమీ పీకలేరు."

"పిచ్చోల్లారా మీరు లేవనెత్తి తిడుతున్నా విషయాలు చాలా చిన్నవి, నేను లక్షల కొట్లలో తింటే, మీరు ఒకట్లకు, పదులకు ఆవేశ పడుతున్నారు. అసలు విషయం తెలిస్తే ఇంకేమవుటారో!"

"మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను తిన్నదాంట్లో పావు భాగం కూడా తినలేక పోయారు. ఎందుకు మీ బతుకు? నన్ను చూడండి... ఎలా తింటున్నానో!"

ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే స్థూలంగా వీటన్నిటి అర్థంఒక్కటే... తాను చేస్తున్న అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా విర్రవీగడం.


ఇక పోతే ఆయన పుత్రరత్నం సంగతి మరీ విచిత్రం. ఎవడైనా దొంగ ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో ఇరుక్కుని నెలలకు నెలలు జిల్లాలో మగ్గుతుంటే, ఇసుమంతైనా సిగ్గూ, శరం ముసురుకుంటది. కెమెరాలకు, చూసే జనానికి మొకం చాటెయ్యాలని అనిపిస్తది. కాని లక్ష కోట్లు భోంచేసిన ఈ నయా (వి)నాయకుని రూటే వేరు. చంచల్ గూడా జైలు గేటులోంచి వస్తూ, పోతూ ఒకటే దండాలు దరహాసాలు! ఏదో స్వతంత్ర పోరాటంలోనో, ఇతర ప్రజా పోరాటాల్లోనో పాల్గొని అరెస్టయినట్టు బిల్డప్పు! తండ్రి నవ్వుకు కారణం కనిపెట్ట వచ్చేమో కాని, ఈ కొడుకు నవ్వుకు కారణం కనిపెట్టడం మరీ కష్టం.


"పిచ్చి సిబిఐ! మీరెన్ని కేసులు పెట్టినా నన్ను ఏమీ పీకలేరు. అమ్మగారి అసలు గుట్టుమట్లు నాదగ్గర ఉన్నయ్. అవి నా దగ్గరున్నంత వరకు, మీరు నా వెంట్రుక కూడా కదపలేరు."

"ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా నా అవినీతి బయట పెట్టినా నాయకులందరూ నా జైలు చుట్టే తిరుగుతున్నారు. జనాలు నా చెల్లెలి యాత్రలకే వస్తున్నారు. అలాటి జనం ఉన్నంత వారకు మీరు నన్నేం చేయగలరు?"

"మీరు నన్ను జైల్లో పెట్టాననుకుంటున్నారు. కాని ఇక్కడ జైలరుతో సహా అంతా నావాళ్ళే! నాకు రోజుకో మొలఖాత్, పూటకో బిర్యానీ, గంటకో మర్యాద! నా పార్టీ ఆఫీసులో కూడా ఇంట సౌకర్యంగా వుండదు."

ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. తాను చేసిన అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా మురిసి పోవడం.
 

Sunday, November 25, 2012

తెలంగాణా సమరభేరి

సూర్యాపేటలో తెలంగాణా సమరభేరి దద్దరిల్లింది. గత కొన్ని నెలలుగా స్తబ్దంగా వున్నా తెరాస క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తినట్టు స్పష్టంగా కనిపించింది.

ఈ సభ ముఖ్య అజెండా... నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ, తెలంగాణా ఉద్యమానికి వెన్ను పోట్లు పొడుస్తూ, ఇంకోవైపు జగన్ పార్టీ వైపు మోరలేత్తే విధానాలను ఎండగట్టడం. అలాగే పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ తెలంగాణా ప్రజలను మభ్యపెట్టే వైకాపా, తెదేపాల ఎత్తులను చిత్తు చేయడం.

దేశపతి శ్రీనివాస్, స్వామీ గౌడ్ ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. యధా ప్రకారం కెసిఆర్ ఉపన్యాసం సభికులను ఉద్యోన్ముఖులుగా ఉత్సాహ పరుస్తూ, ప్రత్యర్థుల కుట్రలపై ప్రజలకు సులభ శైలిలో అవగాహన కలిగించింది. తనకే సాధ్యమైన రీతిలో ఆయన జనాన్ని ఆకట్టుకున్నారు.

ఒకాయిన చంద్రన్న రాజ్యం రావాలె అంటడు... ఇంకొకాయన రాజన్న రాజ్యం కావాలంటడు. మనకు ఏ రాజ్యం రావాలే? మనకు కావాలె తెలంగాణా రాజ్యం. తెలంగాణా రాజ్యం కావాలన్నోల్లు చేతులెత్తండి.

(అందరూ చెయ్యెత్తారు)

చంద్రబాబు విశ్వాసనీయత ఉండాలే అంటున్నడు. ఎన్నికల ముందు తెలంగాణా ఇస్తనని వాగ్దానం చేసి, తీరా అది ప్రకటించగానే అడ్డుకోవడం విశ్వసనీయతా? చంద్రబాబుకు విశ్వసనీయత అంటే అర్థం తెలువదు. సింగపూర్ లోనో, హెరిటేజ్ మాల్ లోనో కొంటే వచ్చేది కాదు విశ్వసనీయత.  

ఇలా సాగింది ఆయన ఉపన్యాసం.

ఇంకా దేశపతి శ్రీనివాస్ జగన్ ఫాలోవర్లను 'జఫా'లు గా వర్ణించడం జనాన్ని ఆకట్టుకుంది.


   

ద్రోహ పర్వం



ఒక వైపు తెలంగాణా ప్రజలు భగభగ మండుతుంటే వాళ్ళు హంద్రీ-నీవా విజయ యాత్రలు చేసుకుంటున్నరు  తెలంగాణకు రావలసిన నికర జలాలపై కట్టవలసిన ప్రాజెక్టులకు ఎగనామం పెట్టి, వరదనీరు వాడుకునే పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు కట్టుకున్నరు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కృష్ణా జలాలు ఇవ్వకుండా, దీనికి నలబై TMCల నీళ్ళు వదిలిన్రు. తెలంగాణా నీళ్ళను దోపిడీ చేసి తమవైపుకు తిప్పుకుని దర్జాగా వాడుకునుడు వాళ్ళ దృష్టిలో ఒక విజయ యాత్ర. కాని ఆ యాత్రల పొన్నాల, సునీత, అరుణ పాల్గొనుడు తెలంగాణా రొమ్ము మీద తన్నుడుతోటి సమానం. తెలంగాణా ప్రజలారా, వీళ్ళు చేస్తున్న నమ్మక ద్రోహాలను ఎన్నటికీ మరువొద్దు.

ఒక వైపు కాంగ్రేసు విజయ యాత్ర ఇట్ల వుంటే, ఇంకో వైపునుండి చంద్రబాబు దండయాత్ర చేయ బట్టిండు. గాయిన అదికారంల ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు తోటి హాట్ లైన్ పెట్టుకొని, వాళ్ళు చెప్పినట్టు ఆడిండు, సబ్సిడీలు దండుగ అని చెప్పి పుస్తకాలు కూడా రాసిండు. ఇప్పుడేమో అప్పుడు చేసిన పనులకు విరుద్ధంగా అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నడు.  KG నుండి PG వరకు ఫ్రీగా చదువు చెప్పిస్త నంటున్నడు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తూ, రుణాల మాఫీ, ఉచిత వైద్యం, నేరుగా డబ్బులు, నిరుద్యోగ భ్రుతులు... ఒకటేమిటి, అన్నీ చేస్త నంటుండు.

2004ల సాధ్యం కాని పనులు ఇప్పుడ గూడ సాధ్యం కావని ఆయనకు తెలుసు. మరి ఆయినా గట్ల ఎందుకు చెప్తున్నడు? అధికారం కోసం. అధికారం కోసం ఎన్ని అబద్దాలైన చెప్పడం ఆయనకు పాత అలవాటే. మరి గిన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇస్తనని ఇంకొక అబద్ధం ఎందుకు చెప్తలేడు? ఇన్ని అబద్దాలతోని ఇంకొక్కటి ఎక్కువ చెప్తే ఏంది, చెప్పలేడా... అని మనకు అనిపించ వచ్చు. కాని గా మాట చెప్తే సీమాంధ్రల కథ అడ్డం తిరుగుతది అని ఆయన భయం. అందుకే చెప్పడు. మరి సీమాంధ్ర జనానికి వ్యతిరేకంగ ఒక మాట చెప్పడానికే దడుసుకునే వానికి ఊడిగం చేసుడు లోని ఔచితత్యం ఏందో తెలంగాణా లోని తెలుగు తమ్ముళ్ళు ఆలోచించు కోవాలె. లేక పొతే వాళ్ళు గూడ చంద్రబాబు లెక్క చరిత్ర హీనులు అవుతరు.

చంద్రబాబు పని ఇట్లా వుంటే మందకృష్ణ లాంటి దళిత నేతలు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ బాడుగ మాటల్ని నిజం చేస్తున్నరు. వీళ్ళ మనసులు మార్చేతందుకు చంద్రబాబు అంత గొప్ప దేవదూత ఎప్పుడైండో ఎవరికీ అర్థంగాని విషయం గాదు. ఆయినా అధికారం లోనికి వస్తే, SCకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అనలేదు, పోనీ ఇప్పుడన్నా ఇంకేదైనా ముఖ్యమైన పదవి ఇస్తానని చెప్పలేదు. మరి అందరూ ఒప్పుకున్నా ABCDలు ఆయన ఒప్పుకున్నందుకే అంతటి చంద్ర మర్యాదలా? దీని వెనుక ఉన్న బాడుగలు ఏంటివో పెరుమాండ్ల కెరుక.     

ఇంక పొతే  ఇంకొకామె రాయలసీమ గూండాలను వెంట తెచ్చుకొని మరొక ప్రస్థానం చేస్తుంది. తెలంగాణా ఏర్పడితే వీసాలు తెచ్చుకోవాలి అని ప్రచారం చేసిన మనిషి, తెలంగాణాకు వ్యతిరెంకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకొని పరుగెత్తిన మనిషి తెలంగాణా ఆత్మా బంధువులని విషప్రచారం చేస్తుంది. ఈ రాజన్న, చంద్రన్న అసలు రూపాలు తెలంగాణా ప్రజలు ఇంకా మరిచి పోలేదు. ఒకడు తెలంగాణా పాలిత సైంధవ పాత్ర వహిస్తే, ఇంకొకడు శకుని పాత్ర వహించిన విధానం ఇంకా తెలంగాణా ప్రజల మదులల్ల మెదులుతనే వుంది.

Saturday, November 17, 2012

తల్లిని పొగిడితే పిల్ల గునిసిందట


ఒక నాయకుడు:
ఆయన కరడు గట్టిన సమైక్యవాది. కాని ప్రజలు చెంప చెల్లు మనిపించి గద్దె దింపిన తర్వాత వోట్లకోసం జై తెలంగాణా అంటడు. తెలంగాణా వస్తున్న తరుణంల తెప్ప తగలేస్తడు... రెండుకళ్ళ సిద్దాంతం తోటి రెండు నాలుకల జపం చేస్తడు. ఉత్తరం ఇస్తానంటడు... ఉత్తుత్తి నాటకం ఆడుతడు. అయితే ఎన్నికలు దగ్గెర పడుతుంటయి. వోట్లు అడిగే టందుకు జనం కాడికి రావలసి వస్తది. జనం మధ్యన పాదయాత్రలు చేయవలసి వస్తది. అయితే జనం తన్ని, తరిమి కొడుతరేమోననే భయం మొదలైతది. అందుకోసం కుట్రలు పన్నుడు శురూ జేస్తడు.

ఒక దళిత ఉద్యమ కారుడు:
ఆవేశంగ ఉపన్యాసాలిస్తడు. తనకన్నా గొప్ప తెలంగాణా వాది  లేడని చెప్తుంటడు. ఎప్పుడు చూసినా ఉద్యమానికి వెన్నుపోటే పొడుస్తుంటడు. ABCD ఇప్పిస్త అనంగానే అసలు ఆయన గెలుస్తడా ఓడుతడా అని చూడకుండ, తన మనుషులతోటి సమైక్యవాద నాయకునికి రెండంచెల వలయాన్ని కల్పించి తెలంగాణా మొత్తం తిప్పిస్తడు. ఆ నాయకునికి ఇంకా తృప్తి కలగక పోతే, తెలంగాణా పోరాట యోదులకు కులం రంగు పూసి, వారి ఇళ్ళ మీదకు తన చెంచాలను పంపిస్తాడు, దాడులు చేయిస్తడు. అట్రాసిటీ కేసులు పెట్టిస్తడు.

ఒక పాత్రికేయుడు:
పగటి వేషగాడి పాదయాత్రకు ఒక పచ్చ కామెర్ల పాత్రికేయుడు 'చంద్రయాన్' అని పేరు పెడుతడు. పార్టీ కరపత్రంకన్న అధ్వాన్నంగ తన పత్రికను మార్చి తరించి పోతడు. అరచేతి మీద స్వర్గాన్ని చూపెట్టినట్టు, పేపరు మీద ప్రభంజనాన్ని సృష్టిస్తడు. నాలుగు సంవత్సరాల క్రితం ఏ దళిత ఉద్యమ కారులచేత శృంగ భంగం పొందిండో, వారినే తెలంగాణా ఉద్యమం మీదకు ఉసికోల్పే ప్రయత్నాలు చేస్తడు.

ఒక ఆమాత్యురాలు:
పుట్టిన జాతి మీద ఏనాడూ ప్రేమ చూపెట్టిన దాఖలాలు లేవు, కోట్లు కూడపెట్టుకునే యావ తప్ప. కులాన్ని వదిలేసి రెడ్డిగా మారి దశాబ్దాలు గడిచినా, అవసరార్థం మాత్రం కులం గుర్తుకు వస్తది. తెలంగాణా కోసం తల్లి చూపెట్టిన తెగువలో ఒక శాతమైనా జన్మలో ఎప్పుడూ చూపక పోయినా, ఆ మాట ఎవరన్న అంటే, అది తన కులాన్ని తిట్టినట్టు కలరింగు. ఇలాంటి వారిని దళితులంటే అది దళితులకే అవమానం.

Thursday, November 15, 2012

జల వివక్ష యజ్ఞం


-సీమ ప్రాజెక్టులకు ఒక న్యాయం.. తెలంగాణ ప్రాజెక్టుకు మరో న్యాయం
-సోమశిలకు అడ్డురాని నిధుల కొరత..యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా 
-పంప్‌హౌజ్‌లు తయారైనా ప్రారంభంకాని భీమా-2
-అప్రోచ్ చానల్ లేక ముందుకు సాగని భీమా-1 లిఫ్ట్
-కల్వకుర్తి ఫేజ్-2లో తట్ట సిమెంట్ పనీ మొదలుకాలేదు
-నీటి లభ్యత సాకుతో పాలమూరు-రంగాడ్డి లిఫ్టుకు కొర్రి 


హైదరాబాద్, నవంబర్ 14 (టీ మీడియా):సీమాంధ్ర ప్రాజెక్టులంటే.. ఎంత కొరత ఉన్నా.. నిధులు పెల్లుబికి వస్తాయి. అదే తెలంగాణ ప్రాజెక్టులంటే పైసా కూడా రాలదు! సీమాంధ్ర ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు మాత్రం.. ఎక్కడేసిన గొంగళి అక్కడేనన్నట్టు మూలుగుతుంటాయి! ఒకే తరహా అన్యాయం.. పదే పదే! నెల్లూరు జిల్లాలో రూ.800 కోట్లతో చేపట్టనున్న సోమశిల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరతను తోసిరాజని ప్రభుత్వం ఇటీవలే రూ.150 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు అనంతపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను రాత్రింబవళ్లు యుద్ధవూపాతిపదికన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయి ఏడాదిదాటినా భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1కు లింక్ చానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఈ పథకం నిరుపయోగంగా మారింది.

అలాగే ప్రధాన రిజర్వాయర్ నుంచి పంపింగ్ స్టేషన్ వరకు అప్రోచ్ చానల్ పనులు పూర్తికాకపోవడంతో మిగిలిన పనులన్నీ అయిపోయినా భీమా-1 ఎత్తిపోతలకు మోక్షం కలగడం లేదు. కల్వకుర్తిలో కేవలం మొదటి దశ పనులు మాత్రమే పూర్తి కాగా 2.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల ఫేజ్-2, ఫేజ్-3 గురించి పట్టించకున్న నాథుడే లేడంటే తెలంగాణ ప్రాజెక్టులపై పాలకులకు ఉన్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1 పనులన్నీ పూర్తయ్యాయి. అయితే జూరాల నుంచి రామనపాడు వరకు 17 కిలోమీటర్ల లింక్ చానల్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి దశ పూర్తయి, 13 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ పథకం ఎక్కువ శాతం ఉపయోగపడేది ఫేజ్-2, ఫేజ్-3లోనే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫేజ్-2లో ఇంత వరకు తట్ట సిమెంట్ పని కూడా జరగలేదు. ఇక్కడ రెండో దశ పనులు పూర్తయితే తప్ప మొత్తం 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.

సాగర్‌ను పక్కనపెట్టి...
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీమ సర్కార్, సీమాంధ్ర ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు వాస్తవంగా కర్నూలు జిల్లాలో హంద్రి నది, చిత్తూరు జిల్లాలోని నీవా నది ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టు. అయితే పేరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న నదుల పేరు పెట్టుకుని నీళ్లు మాత్రం శ్రీశైలం నుంచి తీసుకెళ్లనున్నారు. అలాగే కర్నూ లు జిల్లాలో గాలేరు, చిత్తూరు జిల్లాలోని నగరి నదుల పేరుతో ప్రాజెక్టు నిర్మించుకుంటూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నీళ్లు తరలించుకుపోయేందుకు సీమ సర్కార్ వ్యూహరచన చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు వరద నీటిని ఉపయోగించుకోవడం ద్వారా డిజైన్ చేసినవి. అయితే సర్కార్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం కింద ఉన్న సాగర్ ఆయకట్టును గాలికి వదిలేసి, వరద నీటితో సంబంధం లేకుండా సీమలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు తెర కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలోని నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు పట్టించుకోకుండా, వరద నీటితో డిజైన్ చేసిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణపై ప్రాజెక్టులపై వివక్ష...
కరువు జిల్లా మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్కార్ రకరకాల కొర్రీలతో కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే కనీసం సర్వేకు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి డీకే అరుణ నేతృత్వంలో ఆగస్టు నెలలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా సమావేశమై ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆయన కచ్చితమైన హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. అయితే మూడు నెలలు పూర్తికావస్తున్నా ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండాపోయింది. పైగా దీనిని తొక్కిపెట్టేందుకు సీమాంధ్ర పాలకులు తీవ్రస్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టులే పూర్తికాకపోతే, మరొ కొత్త ప్రాజెక్టు ఎందుకు అని ఒకసారి, అసలు ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడిదని మరొకసారి అభ్యంతరాలు చెబుతూ ప్రాజెక్టు ఫైలుని అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత అంతంత మాత్రగానే ఉన్నప్పటికీ అక్కడ రూ.800 కోట్లతో నిర్మించనున్న సోమశిల ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా తొలి విడత కోసం రూ.150 కోట్లు సైతం విడుదల చేసింది. అదే తెలంగాణలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న పాలమూరు-రంగారెడ్డి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.

Thursday, November 1, 2012

అధికారంలో కోస్తే...


అధికారంలో కోస్తే
నేరుగా డబ్బు
మీ చేతుల్లోకి
క్యాష్ ట్రాన్స్ ఫర్!

అధికారం లోకొస్తే
విద్యార్థులకు
ఎల్ కేజీ నుంచి పీజీ దాకా
అంతా ఉచితమే!

అధికారం లోకొస్తే
రైతుల అప్పులు
సర్వం మాఫీ

అధికారం లోకొస్తే
వ్యవసాయానికి
తొమ్మిది గంటలు కరెంటు!
వో భీ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ!

బీసీలకు పదివేల కోట్లు
వంద సీట్లు
ఎస్సీలకు ఎస్టీలకు
ఎన్నో... ఎన్నో...

అంతా బాగానే వుంది సారూ...
అధికారం లోకి వస్తే
మరి తెలంగాణా సంగతి
ఏం జేస్తరు?

కాంగ్రెసుతో కుమ్మక్కై
మీరంతా నామీద
కుట్ర పన్నుతున్నారు!
లేక పోతే మరేమిటి?
అధికారంలో వున్న
కాంగ్రెసును చెప్పాలి కాని
ఆ విషయం నేనెలా చెప్తాను?

&*^~%$^#*&*%!!!

సీమాంధ్ర బ్రాహ్మణులారా, మేల్కోండి


తాజాగా విడుదలైన మంచు విష్ణు సినిమా, దానిలో బ్రాహ్మణ కులాన్ని కించ పరచిన విధానం, దరిమిలా బ్రాహ్మణులపై మోహన్ బాబు గూండాలచే జరపబడిన దాడి, అవి కేవలం యాధృచ్చికమైన విషయాలు కావు.

ఈ సమైక్యరాష్ట్రం సీమాంధ్రకు చెందిన రెండు అగ్ర కులాల వారికి ఆడ్డాగా మారింది. అధికారాన్ని, ప్రాంతీయ, కుల తత్త్వాలను, ధనాన్ని జోడించి ఈ వర్గాలు మరింత బలంగా వేళ్ళూను కుంటున్నాయి. వీరికి కాంట్రాక్టులు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు రావు. వీరు పదవులు, ప్రమోషన్లు ఇవ్వడానికి రూల్సు అడ్డు రావు. వీరి అడ్డగోలు సినిమాలకి సెన్సార్లు అడ్డురావు. పైగా ఇదేమని అడిగిన వాడికి లాఠీ దెబ్బలతో వీపు వాచి పోతుంది.

ఇక్కడ వీరి రాతే చట్టం, వీరు చేసేదే ఆలోచన, వీరి మాటే వేదవాక్కు. దశాబ్దాలుగా అధికారం కొందరి చేతుల్లో కెంద్రీకరింప బడడం వల్ల జరిగిన పర్యవసానం ఇది.

ఇంత పెద్ద రాష్ట్రంలో వీరు తప్ప ఇతర బలహీన వర్గాలు ఎన్నటికైనా అధికారంలోకి రావడమనేది కలలోని మాట. ఇక్కడ బలహీన వర్గాలంటే మరికొంత ఎక్కువ వివరించాలి. పైన చెప్పిన సీమాంధ్ర ఆధిక్య వర్గాలతో పోల్చినప్పుడు, తెలంగాణా అగ్రకులాల వారిని, బ్రాహ్మణులు మొదలైన ఇతర అగ్ర కులాల వారిని కూడా బలహీన వర్గాలు గానే పరిగణించాలి. ఎందుకంటే ఈ 'ప్రత్యేక ఆధిక్య వర్గాలతో' పోటీ పడి మిగతా వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరు.రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలుగా కేవలం రెండు కులాల పరిపాలనలోనే ఉండడమే అందుకు నిదర్శనం.

తెలంగాణా ఉద్యమం జరుగుతున్నది కూడా ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల పైనే అని గుర్తించాలి. ఆ విషయం మొదటినుండి తెలంగాణా వాదులు చెప్తూనే వస్తున్నారు. రాష్ట్ర విభజన మాత్రమే వీరి అధికారానికి గండి కొట్టగలదని తెలంగాణా వాదులు భావించారు. తెలంగాణా వాదాన్ని బలంగా అడ్డుకుంటున్నది కూడా ఈ ఆధిపత్య వర్గాలే అన్న విషయం కూడా గుర్తించ వలసి ఉన్నది.

ఇక విషయానికి వస్తే, ఈ ఆధిపత్య వర్గాలు తమకు లభిచిన ఆధిక్యతతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించడం మొదలు పెట్టాయి. తాము ఏది చెప్పితే, అదే చట్టం, తాము ఏది చేస్తే అదే న్యాయం అన్న ధోరణి అవలంబించ సాగాయి. చుండూరు, కారంచేడులలో మానవ హననాలైనా, ప్రజలకు ఇష్టంలేని యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకుని తెలంగాణా వీరు చేస్తున్న వీరంగాలైనా ఈ కోవలోకే వస్తాయి.

ఇప్పుడు తాజాగా వచ్చిన బ్రాహ్మణ వివాదం కూడా కొత్తదేమీ కాదు. ఈ వర్గాల వారు చేసే సాంస్కృతిక దాడులలో ఇది ఒకటి. బలహీన వర్గాలను, తెలంగాణా వారిని, బ్రాహ్మణులను వీరి సినిమాలలో నవ్వులాట వస్తువులుగా మార్చుకోవడం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మంత్రాలకు బదులు బ్రాహ్మణులు బూతులు చెప్పినట్టు చూపిస్తారు. సీమాంధ్ర కళాకారులతో కృతకమైన తెలంగాణా భాష మాట్లాడిస్తూ ఇదే తెలంగాణా సంస్కృతి అని భ్రమింప జేస్తూ కామెడీ చేయిస్తారు. కమెడియన్లు ఎప్పుడూ బ్రహ్మణులో, లేదా నిమ్న కులాల వారో మాత్రమే ఉంటారు. ఇక తెలంగాణాకు చెందినా బీసీలే వారి సినిమాలలో రౌడీ షీటర్లు, నిజాలు ఎలా వున్నా.

ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల వల్ల ప్రస్తుతం తెలంగాణా ప్రజలు ఎక్కువ నష్ట పోతున్నప్పటికీ, వీరిని ఇలాగే వదిలేస్తే రేపు సీమాంధ్ర లోని మిగతా వర్గాలను కూడా అదే పద్ధతిన కబలించ గలరనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఎవరో పెద్దాయన చెప్పినట్టు, దాడి చేయబడ్డది పోరుగువాడి పైనే అని ఉపేక్షిస్తే, రేపు ఆ దాడి మనమీదే కావొచ్చు. అందుకే, సీమాంధ్ర పాలిత వర్గాలు త్వరగా మేల్కొవాల్సిన అవసరం వుంది.


ఇప్పటికే సీమాంధ్రకు చెందిన ST, SC, BC లు రాష్ట్ర విభజనకు బహిరంగ మద్దతు ఇస్తున్నారు. మిగతా అగ్రవర్గాలు, బ్రాహ్మణులు కూడా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే, దోపిడీ శక్తులకు ఊతం కల్పించిన వారే అవుతారు. ఈ దాడి మంచు మోహాన్ బాబు బ్రాహ్మణులపై చేసిన దాడి కాదు, ఆంధ్రప్రదేశ్ పాలక వర్గాలు పాలితులపై చేసిన దాడి.

Tuesday, October 30, 2012

చంద్రబాబే ఎందుకు పెద్ద శత్రువు?


తెలంగాణా ఏర్పాటుకు మొదటినుండి బద్ధ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు. తాను ముఖ్య మంత్రిగా ఉన్నన్నాళ్ళూ తెలంగాణా పేరు కూడా వినపడ నీయలేదు చంద్రబాబు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూడా అంతకన్నా ఎక్కువే చేశాడన్న మాట నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా వుంది. అదేమంటే, రాజశేఖర్ రెడ్డి అధికారం కేవలం ఈ రాష్ట్రం వరకే ఉండేది. కేంద్రాన్ని కొంతవరకు ప్రభావితం చేయగలిగినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నకేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఎప్పుడూ చూప లేదు. నిజానికి ఆ సమయంలోనే రాష్ట్రపతి ప్రసంగం, ప్రధాని హామీ, ప్రణబ్ కమిటీ మొదలైన పరిణామాలు వచ్చాయి.

కాని చంద్రబాబు విషయం అలా కాదు. చంద్రబాబే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు. కాబట్టి తెలంగాణా అయినా మరోటయినా చంద్రబాబు ఆలోచనలమీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. మరి ఈ చంద్రబాబు ఆలోచనా సరళి గత దశాబ్ద కాలంగా ఎలా వుందో చూద్దాం.

తన హయాంలో తన పార్టీ ఎమ్మెల్యేలు రాజోలిబండ తూములు పగుల గోడితే నిమ్మకు నీరెత్తిన వ్యక్తి చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర పేరుతో అదే రాజోలిబండ వద్ద తెలంగాణాలో ప్రవేశించి, తనకు సిగ్గూ శరం లాంటి పదాలకు అర్థాలు తెలియవని మరొక్క సారి నిరూపించుకున్నాడు చంద్రబాబు.

NTR హయాంలో వచ్చిన 610 GO అమలు కాకుండా తూట్లు పొడిచిన చంద్రబాబు. తాను నిజంగా తలుచుకుని వుంటే ఆ GO ను పూర్తిగా అమలు చేయగల సమర్థుడే ఆయన. కానీ అలా చేయలేదు. కారణం, ప్రాంతీయ దుర్విచక్షణ, పక్షపాతం మాత్రమే.

అలాగే తెలంగాణా ప్రాజెక్టులకు నిదులివ్వక, ఉన్న చెరువులను, కుంటలను కూడా నిర్లక్ష్యం చేసి తెలంగాణాను ఎడారిగా మార్చాడు. పైగా బోర్లు వేసుకుని వ్యవసాయం చేసే రైతులపై అధికమైన కరెంటు బిల్లులు వేసి వారి ఆత్మహత్యలకు కారణ మయ్యాడు.

అతని హాయాంలో వ్యాపారానికి భూమి కావాలని అడగని ఆంధ్రా ప్రాంతపు ఫలానా కులంవాడు పాపాత్ముడు. అంతగా కొమ్ము కాశాడు ఒక సామాజిక వర్గానికి. వారే ఇప్పుడు కుహనా సమైక్యవాదాన్ని కరెన్సీ నోట్లమీద ప్రాణ ప్రతిష్ట చేయడం కాకతాళీయం కాదేమో!

ఇతని కాలంలో తెలంగాణలో అభివృద్ధి చెందినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి జూబ్లీహిల్సు, బంజారా హిల్సు, హైటెక్ సిటీలు మాత్రమే. అక్కడ వుండేదేవరో వేరే చెప్ప నవసరం లేదు.

కరడుగట్టిన సమైక్యవాది అయి కూడా 2009లో వోట్లకోసం తెరాస పార్టీతో జత కట్టాడు. తెలంగాణా వస్తే అది తనవల్లే అని ప్రజలను నమ్మ బలికాడు. ఆంధ్రా ప్రాంతం కన్నా ఎక్కువ దామాషాలో తెలంగాణాలో సీట్లు గెలుచుకున్నాడు. కాని ఆంధ్రాలో తక్కువ సీట్లు రావడం వలన అందికారంలోనికి రాలేక పోయాడు.

నిజమైన నాయకుడైతే అధికారంలోనికి రాలేక పోయినా ఏంచేయాలి? ప్రజల కిచ్చిన వాగ్దానాల అమలు కోసం అసెంబ్లీలో బయటా పోరాటాలు చేయాలి. కాని ఎన్నికల తర్వాత తెలంగాణాకోసం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అయితే KCR నిరశన దీక్ష ఫలితంగా డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే, తన ఎన్నికల వాగ్దానాలను, పదిహేను నెలల పాటు రాష్ట్రమంతా కమిటీని కలియదిప్పి తెలంగాణా ఏర్పాటుపై చేసుకున్న  పాలసీని తుంగలో తొక్కాడు. కుహనా ఉద్యమాన్ని నారూ, నీరు అంతా నారావారే అన్న రీతిలో నడిపించాడు. ఆ సంగతి ఆయన పాత భ్రుత్యులే ఇప్పుడు గుట్టు విప్పుతున్నారు.

మొన్నటి ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో చావుదెబ్బ తిన్న తరుణంలో ఆయనకీ మరొకసారి తెలంగాణా గుర్తుకొచ్చింది. నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాణి ఉత్తరాన్నొక దాన్ని అతి జాగ్రత్తగా తయారు చేసి ప్రధానికి పంపించాడు. ఆ ఉత్తరంలో ఆయన తెలంగాణా శాతమెంతో ఆ పార్టీ లోని తెలంగాణా వాదులే చెప్పలేక పోతున్నారు. ఇక బయటి వాళ్ళయితే మండి  పడుతున్నారు.   

ఇప్పుడు అక్కడా ఇక్కడా అరువుతెచ్చుకున్న మనుషులతో పాదయాత్ర తూతూ మంత్రిస్తూ, నంగి నంగి మాటలతో దొంగ కబుర్లు చెప్తున్నాడు. తెలంగాణలో తనకింకా పలుకుబడి తగ్గలేదని జనానికి భ్రమ కల్పించే పనిలో ఉన్నాడు. ఆయన తెలంగాణాకు వ్యతిరేకం కాదట! మరి అనుకూలమా? అది మాత్రం చెప్పడట అధికారం లోకి వచ్చే వరకూ! మరి నమ్ముదామా?



Sunday, October 28, 2012

నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు



బాబు పాదయాత్రలకు అడ్డు రాకుండా తెలంగాణా వాదులని అరెస్టులు చేస్తూ ప్రభుత్వం ఇతోధికంగా ఆయన యాత్రకు మద్దతు తెలుపుతున్నా వెళ్ళిన ప్రతి చోటా తెలంగాణా పైన ఆయన అభిప్రాయం తెలపాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల వద్దకు వచ్చాక తప్పుతుందా? తప్పదు కాబట్టి 'రాష్ట్రం ఇవ్వాల్సింది కాంగ్రేసు, నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అని చెప్పి తప్పించు కుంటున్నారు.

'నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అన్న ఒక్క మాట విన్న ప్రజలు ఆనందంగా ఆయన చెప్పే మిగతా ఊక దంపుడు భరిస్తున్నారు. ఆ మాటలు ఒక్క సారి పరిశీలిస్తే ప్రజలను మభ్య పెట్టడంలో ఈయన ఎంతగా అరి తేరాడో ఇట్టే అర్థం అవుతుంది.

ఎంతసేపూ తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్తాడు తప్ప, 'తెలంగాణాకు అనుకూలం' అనే మాట మాత్రం ఆయన నోటివెంట రాదు. మరి అనుకూలం కానప్పుడు వ్యతిరేకం కాదా? తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతున్నారు. దానికి అనుకూలం కాదు అంటే అర్థ మేమిటి? వ్యతిరేక మనేగా? కాని చంద్రబాబు ఆమాట తెలివిగా దాటేస్తున్నాడు. తన మనసులో ఉన్న అసలు మాట దాచి వేసి, విషానికి మిఠాయి పూసినట్టుగా, సొల్లు మాటలు చెప్తున్నాడు.

సరే, ఆయన మాటల సారాశం 'అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదు' అనుకుందాం. అంటే తటస్తమన్న మాట. అదే ఆయన డిసెంబరు తొమ్మిది తర్వాత చెప్తూ వస్తున్న రెండుకళ్ళ సిద్ధాంతం! మరి ఆయనలో వచ్చిన మార్పేంటీ? కొత్త లేఖతో అదనంగా ఇచ్చిన క్లారిటీ ఏంటి? గజం మిధ్య, పలాయనం మిధ్య అన్నట్టుగా లేదూ?

ఎంతసేపు అడిగినా తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకం కాడంటాడే కానీ అనుకూలం అవునో కాదో చెప్పడు. 'అశ్వత్థామ హతః కుంజరః' అన్నట్టన్న మాట.

స్థూలంగా బాబు పథకం ఇదీ! తెలంగాణాకి వ్యతిరేకం కాదని తెలంగాణా పర్యటన మొత్తం బాకా ఊది తెలంగాణా వోట్లు కొల్ల గొట్టాలి. రేపు గెలిస్తే, 'నేను కాంగ్రేసు తెలంగాణా ఇస్తే వ్యతిరేకం కాదు అని మాత్రమే చెప్పాను, అనుకూలం అని ఎక్కడ చెప్పానూ?' అంటూ దీర్ఘాలు తియ్యొచ్చు. ఒక వేళ ఇప్పుడే కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి పూనుకున్నా, 'మహారాష్ట్ర షిండే ఎవడూ, కేరళ వాయలార్ ఎవడు, ఇటలీ సోనియా ఎవతీ, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదీ?' అనే మొండి కూతలు ఆయన దగ్గర ఎప్పుడూ రడీ గానే ఉంటాయి కదా?


Wednesday, October 24, 2012

ఆంధ్ర బాబూ, నీ దగ్గెర మాటల్లేవు


చచ్చిన రెడ్డి కానుండి
ఉద్దెరకు తెచ్చుకున్న
పొల్లు మాటలు
ఉచితాలు
వాగ్దానాలు

గద్దెమీది రెడ్డి కానుంచి
అడిగి తెచ్చుకున్న
పొలీసు మంద
తుపాకులు
గన్ మెన్లు

పక్క ప్రాంతం నించి
పట్టుకొచ్చు కున్న
మందీ మార్బలం
గూండాలు
రౌడీలు

ప్రజల కానించి
పట్టుకొచ్చిన
నమాజు టోపీలు
తలపాగాలు

కుల సంఘాల
రైతు సంఘాల
దగ్గెర నించి
అద్దెకు తెచ్చిన
కండువాలు

అన్నీ
బాగనే ఉన్నై
కానీ...

తెలంగాణా
ఏర్పాటు గురించి
ఒక్క ముచ్చెట
చెప్పనీకి మాత్రం
నీ దగ్గెర
మాటల్లేవు

ఆంధ్ర బాబూ
గిదీ
నీ
పాదయాత్ర

కింద పడ్డా నేనే మిర్రు... గిదీ, సమైక్య వాదం.

ఆంధ్రోళ్ల దాష్టీకం తెలంగాణ బాక్సర్లపై దాడి 



- నలుగురు క్రీడాకారులకు గాయాలు
- అంతర్ జిల్లా చాంపియన్‌షిప్‌లో ఘటన
హైదరాబాద్, టీ మీడియా ఖేల్ ప్రతినిధి: క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాల్సిన క్రీడాకారులు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ప్రాంతీయ తత్వంతో రెచ్చిపోయి దాడులకు దిగారు. తోటి క్రీడాకారులను విచక్షణా రహితంగా చావబాది గాయపరిచారు. ఇది జరిగింది విశాఖపట్నంలో. దాడి చేసింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాక్సర్లు కాగా, దాడికి గురైన బాధితులు తెలంగాణకు చెందినవారు. వివరాల్లోకెళితే విశాఖ మురళీనగరంలోని వైశాఖి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 19న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల క్వార్టర్‌ఫైనల్స్‌లో ఆంధ్ర బాక్సర్‌పై హైదరాబాద్ బాక్సర్ విజయం సాధించాడు.

దీంతో ఓటమిని భరించలేకపోయిన ఆంధ్ర బాక్సర్లు స్టేడియంలోనే అంతా చూస్తుండగానే తెలంగాణ బాక్సర్లపై గూండాల్లా విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో హైదరాబాద్ చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన విక్టోరియా ప్లే గ్రౌండ్ బాక్సర్ ఆదిత్య తల పగలగా, మహేష్‌చారి, లోకేష్, నరేష్, విక్రమ్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొం దుతున్నారు. అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడు స్టేడియంలోనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించగా, ఏపీ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు మౌనం దాల్చడం గమనార్హం.

చావబాదారు
‘లైట్ ఫ్లై వెయిట్ విభాగం బౌట్‌లో పాయింట్లపరంగా హైదరాబాద్ బాక్సర్ సిద్దార్థ్ ముందంజలో నిలిచినా, ప్రత్యర్థి, స్థానిక బాక్సర్ ఎల్లారి గెలిచినట్లుగా రిఫరీ ప్రకటించారు. దీంతో ఇదెక్కడి న్యాయమంటూ మేం ప్రశ్నించడం వాళ్లకు నచ్చలేదు. అంతే ఒక్కసారిగా అక్కడున్న లోకల్ బాక్సర్లంతా గుమికూడి మాపై మూకుమ్మడిగా దాడి చేశారు. రౌడీల్లా ప్రవర్తించి రక్తం చిందేట్లు చావగొట్టారు. ఈ సమయంలో వాళ్లను వారించాల్సిన నిర్వాహకులు చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప, ఏమీ చేయలేకపోయారు. దీంతో మేం టోర్నీని బాయ్‌కాట్ చేసి హైదరాబాద్ వచ్చేశాం. కానీ వాళ్లు మాత్రం హైదరాబాద్ జట్టు వాకోవర్ ప్రకటించిందంటూ ప్రత్యర్థులను తర్వాతి రౌండ్లకు పంపించారు’.


Tuesday, October 23, 2012

రాంబాబుని మించిన బాబులు



వలస వాదుల బలహీనత ఎట్ల వుంటదో రాంబాబు సినిమా తోటి బయట పడ్డది. ఇదే రాంబాబు సీనిమాల సీన్లను కట్ చేయించుడు కోసం తెలంగాణా బందు చేసినా, సకల జనుల సమ్మె చేసినా, ఇంకో మిలియన్ మార్చి చేసినా, మల్లొక సకలజనుల సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం గాని, సినిమా యాజమాన్యం గాని దిగోచ్చేవి కావు. బందులు చేస్తే, సమ్మెలు చేస్తే వాళ్ళ కడుపులే మాడుతయి, ఇదీ మన సమేక్కుడు ప్రభుత్వాలా ఆలోచన.

వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడు మనం ప్రజాస్వామ్య యుతంగ ఎన్ని నిరసనలు తెలిపినా, అది చెవులకు సంగీతం వినిపించినట్టే వుంటది. వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్నంటే రాంబాబు మార్కు ట్రీట్ మెంటే సరైనది. ఒక్క రోజు థియేటర్లకు తాళం పడంగనే దెబ్బకు దయ్యం దిగోచ్చినట్టయింది. ఒక్కొక్కడు అడుగక ముందే క్షమాపణలు చెప్పుడు శురూ చేసిన్రు. వాళ్ళంతా వాళ్ళే సినిమాను సెన్సారు చేసుడు మొదలు వెట్టిన్రు. కుంభకర్ణుని లెక్క నిద్ర బొయ్యే రాష్ట్ర ప్రభుత్వం దిగ్గున లేచి APSFTDC తోటి కమిటీ ఏసి మరో మూడు నాలుగు కోతలు పెట్టింది.

గిదంత చూస్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళకు మాటలతోటి కాదు, చేతల తోటి సమాదానమియ్యలె అనిపిస్త లేదూ? సంగీతానికి చింతకాయలు రాలనట్టే, మెక్కుడు మరిగిన వలసవాదులు ఉత్తగనే పోరు. తేరగ తినేటోన్ని, 'రేపన్నించి కష్టపడి పనిచెయ్యర బాబు' అంటే ఇంటడా? సెగ తగిలిస్తే గని పొయ్యిల కూసున్న పిల్లి బయటికి లేవదు. ఒక్క పూరీ జగన్నాధ్ సినిమా తోనే అయిపోలేదు. పూరీని మించిన మహమ్మద్ ఘోరీలు ఇక్కడనే ఉన్నరు. మన నెత్తిమీది కెక్కి ఊరేగు తున్నరు.


ఏ సెగ తగులకుంటే, తెలంగాణా వనరులను తినుకుంట ఇరుగ బలిసిన లగడపాటికి ఉస్మానియా యూనివర్సిటీని మూసెయ్యాల్నని అనిపిస్తది. అందుకే సెగ తగిలిస్తానే ఉండాలే. ఉస్మానియా మూయించాలే ననుకుంట అవాకులు పేలిన లగడపాటి కబ్జా ఆస్తులను ఎందుకు మూయించ కూడదు? సెగ ఎక్కువై ఒక్కొక్క బందిపోటు తెలంగాణా పొలిమేరలు దాటి పారి పోయ్యేదాంక కాక తగులుతనే ఉండాలే. మనం రూపొందించే ఉద్యమరూపాలు కూడా అట్లనే ఉండాలే. గాంధీ లాంటోడే దోపిడీ దారుల ఆధిపత్యాన్ని దెబ్బతీసే టందుకు విదేశీ బహిష్కరణ చేసిండు. ఇప్పుడు మనం స్వదేశీ దోపిడీ దారుల ఆస్తులను ముట్టడిస్తే చాలు, తట్ట బుట్ట వాళ్ళే సర్దుకుంటరు.

ఒక లాంకో హిల్స్, ఒక రామోజీ సిటీ... ఇట్లా ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకున్తున్నడో మొత్తం బయటకు తియ్యాలే. దీనికోసం Right to information act ను కూడా ఉపయోగించు కోవాలె. ఒకవైపు సమాచారం, రెండొక వైపు ప్రచారం, మూడొక వైపు ప్రత్యక్ష కార్యాచరణ... ఈ త్రిసూత్ర ప్రణాళిక అమలు పరచాలె. పొలాన్ని కబళిస్తున్న పంది కొక్కులను తరుమాల్నంటే ఊపిరాడ కుండ పొగబెట్టి నట్టు, ఈ సీమాంధ్ర దోపిడీ దారులకు కాళ్ళు చేతులు ఆడకుండా చేస్తే చాలు, తెలంగాణా దానంతట అదే ఉరుకోస్తది.



Tuesday, October 16, 2012

సాటుంగ సాటుంగ...

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రధానికి, కాప్ సదస్సుకు పోనీకి దొంగలెక్క దొడ్డిదారి కావలిసి వచ్చింది. దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చి ఒక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే టందుకు సాటుంగ సాటుంగ రావలసి వస్తుందంటే అంతకన్నా అవమాన మేముంటది? దీన్ని బట్టి తెలుస్త లేదూ, తెలంగాణా ప్రజల ఆగ్రహ, ఆవేశా లెట్లున్నయో? తెలంగాణా మనిషి అనేటోన్ని, చివరికి ప్రెస్ వాళ్ళను కూడా అక్కడ ఉండనియ్యకుండ తరిమేసినరంటే, ఇక్కడ ఉన్నది నిజాం లని మించిన నాజీల రాజ్యం లెక్క అనిపిస్త లేదూ? రాజ్యం చేస్తున్న దోపిడీ వర్గాలు తెలంగాణా ప్రజల కోపాగ్నిని చూసి ఎట్ల గజగజ వణుకుతున్నయో కళ్ళకు కట్టినట్టు కనపడుత లేదూ?

తుపాకులు ధరించిన మిలిటరీ మధ్య దాసుకొని ఎన్నాళ్ళు ప్రజలను అణచివెయ్య గలుగతరో వాళ్ళే ఆలోచించు కోవాలె. ప్రజల కోపం చూసి గుండె గుభేలు మంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పూటకో మాట మాట్లాడుకుంట, ఒకని మీద ఒకడు చాడీలు చెప్పుకుంట బాగనే నాటకాలు వేస్తున్నరు. వీళ్ళ నాటకాలను నమ్మి ప్రజలు వోట్లేసే రోజులు పోయినయి. మీరు సక్కగ ఉంటె ఎప్పుడో తెలంగాణ వచ్చేదని అందరికి అర్థమైంది.

ఇంక పోతే గులాం, వాయలార్లు గంటకోటి, పొంటెకోటి పొంతన లేని మాటలు మాట్లాడుతుంటరు. జీతం కోసం తెలంగాణా మాట, గీతం కోసం ఆంధ్ర మాట అన్నట్టు వుంటది వాళ్ళ మాటల తీరు! అవును మరి! తెలంగాణా రాదు అని చెప్తే ఏ లాంకో హిల్సు లోనో నాలుగు ప్లాట్లమ్ముడు పోతయి. ఏంతో కొంత కమీషన్ రాకపోతదా అన్న తపన వాళ్ళది. తెలంగాణా వస్తది అని చెప్తే వచ్చేది ఏమన్నా ఉన్నదా వాళ్ళకు, బూడిద తప్ప? ఎప్పుడో తెలంగాణా మీద ఇరుకున పడ్డప్పుడు అమ్మ గదమాయిస్తే  తప్ప తెలంగాణ పాట పాడే అవసరమేంది వాళ్లకు? పైస రాలని పాట పాడితే ఎంత, పాడక పొతే ఎంత?

వ్యాపారి ఎవ్వడైనా తన ఉత్పత్తి గొప్పదనాన్ని చెప్పుకొని సరుకు అమ్ముకోవాల్నని అనుకుంటడు. కాని కొంతమంది వ్యాపారులుగా మారిన బ్రోకర్లు మాత్రం సమైక్య వాదం ఉందని నమ్మించి పబ్బం గడుపుకోవాల్నని చూస్తరు. వాళ్లకు వ్యాపారం అంటే కులం, వర్గం, ప్రాంతం, అది కాకపొతే అవినీతి రాజకీయం! ఆ స్థాయిని మించని అరడజను దద్దమ్మలకు, వారి మోచేతి నీళ్ళకు ఆశపడే కొందరు రాజకీయ శిఖండులకు తప్ప ఎవ్వరికీ సమైక్యవాదం యొక్క అవసరం ఉన్నట్టు కనిపిస్త లేదు. ప్రత్యేక రాయలసీమ వాదంతోని బైరెడ్డి దూసుక పోగలిగినా, TRS తో చేయి కలిపిండని ప్రచారం చేసిన జగన్ ఒంటి చేత్తో కాంగ్రెస్, TDP లను మట్టి కరిపించినా, కోస్తాలో జై ఆంధ్రా ఉద్యమం ఊపందు కుంటున్నా అవి ఆంధ్రా ప్రాంతపు సామాన్యులు తెలంగాణా ప్రజలకు ప్రకటిస్తున్న సంఘీభావం తప్ప వేరే కాదు.


కోర్టు మొట్టికాయలు తినుకుంట కబ్జా భూముల్ల ఇండ్లు కట్టుకొనే లగడపాటి, తెలంగాణా మార్చి పైన నోరు చేసుకుంటున్నడు అంటే, అది తెలంగాణా ప్రజల మెతకదనం కాక ఇంకేంది? గిసుమంటోల్లకు బుద్ధి చెప్పాలంటే ఈసారి మార్చి ట్యాంకుబండు మీద గాదు, ల్యాంకో హిల్సుకు చెయ్యాలె. వీళ్ళు కూడ బెట్టిన దోపిడీ ఆస్తులు కాపాడుకునే టందుకు వీళ్ళకు నిద్రలు పట్టకుండ చెయ్యాలె. గప్పుడు తెలంగాణా దానంతట అదే వస్తది.   

Tuesday, October 9, 2012

నిజాం మంచోడా చెడ్డోడా?

నిజాం మంచోడా చెడ్డోడా?


కొంతమంది నిజాం మంచోడంటరు, కేసీయార్ లాగా. మరికొంతమంది చెడ్దోడంటరు కమ్యూనిస్టుల్లాగా, స్వయం సేవకుల్లాగా!

మంచోడా చెడ్దోడా అని ఆలోచించే ముందు ఒక్క ముచ్చెట చెప్పుకోవాలె. మంచోడు, చేద్దోడు అని మనుషుల్ల ఎవడూ ఉండదు. వాడు చేసిన పనులే మంచి చెడ్డలు నిర్ణయిస్తయి.

మరి నిజాం  అన్ని చెడ్డ పనులే చేసిండా? కొన్ని మంచి పనులు గూడ చేసిండు. దవాఖానాలు కట్టించిండు. కాలేజీలు కట్టిచ్చిండు. దేశంల మొట్ట మొదటి సారి ప్రభుత్వ బస్సు రవాణా ప్రవేశ పెట్టిండు. రైలు మార్గాలు నిర్మించి రైళ్ళు తిప్పిండు. ప్రాజెక్టులు కట్టిచ్చిండు. హైదరాబాదు నగరాన్ని అద్దం లెక్క పెట్టిండు.


ఇక పోతే చెడ్డపనుల గురించి చెప్పుకుందాం. పన్నులు వేసి ప్రజల్ని పీడించిండు. ఉర్దూను బలంగ రుద్దిండు, అణచివేతకు గురి చేసిండు. చివరి రోజులల్ల రజాకార్లను ఉసిగొల్పిండు.

నిజమే, నిజాం కాలంల తెలంగాణా ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు. కాని దానికి కారణం ఎవరు? నిజామా? నిజానికి నిజాం పరిపాలించిన నేల ఎంత? హైదరాబాదు దాటితే ఎక్కడ నిజాం ప్రత్యక్ష పాలన సాగింది? మిగతా భూములన్నీ జమీందారులు, జాగీర్దారులు, దొరలూ, దేశముఖుల కిందనే గదా ఉన్నది? నిజాం పదిపైసల వంతు పీడిస్తే వీళ్ళు తొంభై పైసలు పీడించిన్రు. ప్రజల రక్త మాంసాలు పీక్కుతిన్న వీళ్ళు నిజాం కన్నా క్రూరులు. ఒక విధంగా నిజాం ఇలాంటి వారినుండి ప్రజలను రక్షించలేని అసమర్థుడు.

ఇంక పన్నుల విషయానికి వస్తే, ఆ రోజులల్ల పన్నులు వెయ్యని రాజెవ్వడు? హిందూ ముస్లిం, నిజాం, సుల్తాన్ అని లేకుండా ప్రతి ఒక్కడు పన్నులు వసూలు చేసినోడే... బ్రిటిషోడికి కప్పాలు కట్టినోడే. ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి ఒక్కడూ ఆ తానులోని ముక్కే. స్థన్యానికి టాక్సు కట్టిన ట్రావన్కోరు మహారాజు ఏంతో, నిజామూ అంతే.

నిజాం ఉర్దూ రుద్దిండన్నది నిజమే. మరి బ్రిటిషోడు ఏం జేసిండు? ఇంగ్లీషు రుద్దలేదా? ఇప్పుడు ఆంధ్రోడు భాషే కాదు, సంస్కృతీ బలవంతంగా రుద్దడానికి, తెలంగాణా సంస్కృతి నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్త లేడా? ప్రజాస్వామ్యం లనే గిట్ల జరుగుతుంటే, నియంతలాంటి రాజు అదే పని చేస్తే ఆశ్చర్యమేముంది?

నిజాం తిరుగు బాట్లను అణచి వేసిండు. కాని ఇప్పటి ప్రభుత్వాలు ఏంజేస్తున్నయి? తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నయా? ఒక మీటింగు పెట్టుకోవడానికి, ఒక మార్చి చేసుకోవడానికి అనుమతి దొరకని పరిస్థితి. చివరికి బతుకమ్మ ఆడుకోవడానికి కూడా హైకోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకొనే దుస్థితి!


నిజాం రజాకారులను అచ్చోసిన ఆంబోతుల్లెక్క దేశం మీదికి వదులుడు మాత్రం క్షమించరాని నేరం, అది ఎలాంటి పరిస్తితుల్ల చేసినప్పటికీ! కాని ఆ రజాకారులు ఎవరు? వారి పార్టీ MIM ఇప్పుడు సమైక్యరాగం ఆలపించడం యాదృచ్చికమా? కానే కాదు. అలాగే ఆ కాలంల నిజాంకు తొత్తులుగా వుండి ప్రజలను పీడించిన వారి సంతానమైన ఇప్పటి పాలక వర్గం, పైకి తెలంగాణా మంత్రం జపిస్తూ, లోలోన తెలంగాణ ఏర్పాటుకు శల్య సారధ్యం వహించడం కూడా యాదృచ్చికం కాదు.

అందరు రాజుల మంచి పనులను మెచ్చుకోన్నట్టే నిజాం చేసిన పనులనూ మెచ్చుకోవచ్చు. అట్లనే నిజాం లాంటి దుర్మార్గాలు చేసిన అందరు రాజుల్నీ తెగనాడ వలసిందే.

ఈ నాటి తెలంగాణా బిడ్డ, తరతరాల సంఘర్షణల అగ్ని కీలలల్ల చరిపించ బడ్డ బాకు లాటివాడు. వాడికి ఎవడు ఎలాంటోడు అనే విషయంల పూర్తి అవగాహన వుంది.

Sunday, October 7, 2012

దారులు ఏవైనా గమ్యమొక్కటే


తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో నెలరోజులపాటు బైటాయించి తనదైన శైలిలో లాబీయింగ్ చేయడం, మరోవైపు, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగరహారం చోటుచేసుకోవడం ఆ మలుపులో కీలక ఘట్టాలు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న, లాబీయింగ్ జరుపుతున్న నేతల మాటేమో కానీ, ప్రజల మాట మాత్రం ఒకటే! వారికి కావలసిందల్లా తమ రాష్ట్రం తమకు కావాలి అంతే! ఈ నేపథ్యంలోనే లాబీయింగైనా, సాగరహారమైనా విశ్లేషించుకోవాలి.

ఐతే, సాగరహారానికి ఎదురైన అడ్డంకులు ఇన్నీ అన్నీ కావు. ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను,వ్యక్తులను, ఉద్యమకారులను కలుపుకుపోవడానికి ఐకాస నాయకులు చేసిన కృషి అభినందనీయం. నిర్వహణ మరో వారం రోజులుందనగా ప్రభు త్వం రకరకాల పద్ధతులతో తనదైన శైలిలో మోకాలడ్డడం ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సు ఆరంభానికి, వినాయక నిమజ్జనానికి మధ్యన, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారాన్ని వాయిదా వేసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్న ప్రచారాన్నీ లేవదీసింది. శాంతి-భద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానాన్నీ బయట పెట్టింది. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాస నాయకులకు నచ్చచెప్పే బాధ్యతను తెలంగాణ ప్రాంత మంత్రుల పై పెట్టాడు ముఖ్యమంత్రి. ససేమిరా అన్న ఐకాస నాయకులు సాగరహారం నిర్వహణకే కట్టుబడి ఉన్నారు. పోలీస్ కమిషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసి మార్చ్ నిర్వహణకు అనుమతి కోసం ప్రయత్నం చేశారు. అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు పెద్దలు, తమదైన శైలిలో ఒక అనుమానాన్ని కూడా బయటపెట్టారు. నగరంలోని సీమాంధ్రుల ఆస్తులపై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ మంత్రులను తెర పైకి తెచ్చారు ఐకాస నాయకులు. అనుమతి ఇప్పించే బాధ్యతను వారికి అప్పజెప్పారు.

ఏదేమైతేనేం....మంత్రుల కృషి ఫలించింది. పోలీసు అధికారులు సాగర హారానికి అనుమతి ఇచ్చారు. అది షరతులతో కూడిన అనుమతి. కాని.. చివరకు జరిగిందేమిటి? ఆంధ్రప్రదేశ్ చరివూతలో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల అరాచకం చోటు చేసుకున్నది. నిర్బంధకాండ రాజ్యమేలింది.


ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు వెలిశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో యుద్ధకాండ చోటుచేసుకున్నది. సాగరహారం జరిగే చోటుకు ర్యాలీగా వెళ్లకూడదన్న ఆంక్షలు విధించిన పోలీసులు, ఎక్కడివారిని అక్కడే నిలిపివేశారు. ఒక్కరొక్కరే సాగరహారం నిర్వహించే స్థలానికి చేరుకోవాలన్న అసంబద్ధ నిబంధనను విధించి దారుణంగా ప్రవర్తించారు. మార్చ్ జరపాల్సిన స్థలాన్ని జలియన్ వాలాబాగ్ చేశారు. అన్ని వైపుల నుంచీ అక్కడకు చేరే మార్గాలను మూసేశారు. ఐనప్పటికీ, పోలీసు కంచెలను ఛేదించుకుం టూ, బారికేడ్లను అధిగమించుకుంటూ వేలసంఖ్యలో తెలంగాణవాదులు, ఉద్యమకారులు సాగర తీరానికి చేరుకున్నారు. లక్షలాది మంది సమక్షంలో మార్చ్ విజయవంతంగా నిర్వహించబడింది. చివరకు పోలీసుల భాష్పవాయువు ప్రయోగం, లాఠీ చార్జ్ సాగరహార స్థలానికి కూడా చేరుకునే దాకా పరిస్థితి వచ్చింది. నేతల ఉపన్యాసాల అనంతరం, రాత్రిపొద్దుపోయిన తర్వాత మార్చ్ ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.


మొత్తం మీద ఐకాస నాయకుల పరంగా శాంతియుతంగాను, పోలీసులపరంగా అశాంతియుతంగాను సాగరహారం సమాప్తమైంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతంగా నిర్వహించిన మార్చ్ లాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాగర హారం పిలుపు ఇచ్చినప్పటి నుంచి ఆరోజున ఏదో జరగబోతోందన్న ఆశ చాలామంది తెలంగాణవాదులలో మొలకెత్తింది. తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మార్చ్ మొదపూట్టకముందే వెలువడుతుందన్న ఆశ కలిగింది. కానీ ఇవేవీ జరగలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యమకారులు పీవీ ఘాట్ వద్ద గుమికూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. కానీ ఎడతెగకుండా కురిసిన భారీ వర్షం, భాష్పవాయు ప్రయోగాలు, లాఠీచార్జీలో వందలాదిగా గాయపడిన ఉద్యమకారుల పరిస్థితి కారణంగా..వ్యూహం మార్చుకున్న ఐకాస నాయకులు అర్ధరాత్రి సమయానికి మార్చ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కథ సుఖాంతమయ్యేటప్పటికి నిర్వాహకులతో సహా, పోలీసు వర్గాల వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతే లభించకపోయినట్లయితే, పరిస్థితి మరోవిధంగా వుండే అవకాశాలుండేవి. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు మార్చ్ ప్రశాంతంగానే ముగిసిందనాలి. పోలీసులు తెలంగాణ వాదుల మీద కనబర్చిన అతి ఉత్సాహం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది.



హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఢిల్లీలో వున్న చంద్రశేఖరరావు కాలికి బలపం కట్టుకుని తన లాబీయింగ్ కొనసాగించాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో లాబీయింగ్ చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడులు తేవడం సహజం. అదే పని చంద్రశేఖరరావు చేస్తే తప్పేంటి? వాస్తవానికి చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటి నుంచీ లాబీయింగ్ చేస్తూనే వున్నారు.

ఒకవైపు పన్నెండేళ్లు ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో నడుపుతూనే, మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో రకరకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయస్థాయిలోని అత్యధిక రాజకీయ పార్టీల మద్దతును రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడగట్టగలిగారు.ఆ మాటకొస్తే భారతీయ జనతాపార్టీ కాని, భారత కమ్యూనిస్ట్‌పార్టీ కాని ఈ రోజున పూర్తిస్థాయిలో తెలంగాణ ఉద్యమంలో దూకిందంటే అది కేసీఆర్ లాబీయింగే అనాలి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2004లో కాంగ్రెస్ పార్టీతోను, 2009లో టీడీపీ తోను ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కాని, టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే లు కాని తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారంటే అది కేసీఆర్ పన్నిన ఎత్తుగడల ఫలితంగానే అనాలి. ఆ లాబీయింగ్‌లో భాగంగానే ఆయన వయలార్ రవిని, ఆజాద్ ను, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసి ఉండాలి.

ఈ నేపథ్యంలో ఒక్కసారి గతం నెమరేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను, తమ ప్రాంత ప్రజలను తెలంగాణేతరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల తెలుగువారు ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు(ఆనాడే) అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ప్రాంతవాసులందరికి విడిపోయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ముల్లాగా మెలిగితే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. నాటి నుంచి నేటికీ తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదం లాగా రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.

రాష్ట్రం కావాలని కేవలం భావించడం మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్టరీత్యా కలిగించ డం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజల్‌అలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాల ద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన కొందరు తెలంగాణేతరులు పరోక్ష దోపిడీ విధానాన్ని ప్రత్యక్ష దోపిడీ విధానంగా మార్చడం మొదలయిందో,అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో దోపిడీకి ఎదురు తిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పు చెందింది. మర్రి చెన్నాడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి పేరుతో బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. నాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించబడుతున్నా, అధికసంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కోసం ఎదురుచూశారు.

కె. చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ను స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకునిపోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పథాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుం టూ, ఒక రకంగా ఏకాభివూపాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ ఎవరూ సాధించని విజయాన్ని సాధించారు. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో కాంగ్రె స్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ,అటు పార్లమెంటులోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగారు. టీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తేగలిగారు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేశారు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్నిసార్లు అయినా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. బహుశా ఈ నేపథ్యంలో ఒకవైపు కేసీఆర్ లాబీయింగ్, మరోవైపు ఐకాస లాంటి ప్రజా సంఘాల ప్రత్యక్ష ఉద్యమాలు రాష్ట్ర సాధనకు దోహదపడతాయని భావించవచ్చు. వేరీజ్ తెలంగాణ అనే వారికి ఇదే సమాధానం! హియర్ ఈజ్ తెలంగాణ!

-వనం జ్వాలా నరసింహారావు
Re-posted from Namaste Telangana

Saturday, October 6, 2012

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఏంపని చేసింది?

ట్యాంకు బండు మీద విగ్రహాలు పెట్టింది.

ఎవరివి?

గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి, అన్నమాచార్య, ఆర్థర్ కాటన్.

మరిదొంగల్లెక్క అర్థరాత్రెందుకు? పట్టపగలే పెట్టొచ్చుగా?

వాళ్ళు మహనీయులే. పెట్టే పనే దొంగ పని. పట్టపగలు పెడితే వారి ప్రాంతీయ వివక్ష మరోసారి బయట పడుతది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటది. రాత్రికి రాత్రి వాటిని నిలబెట్టినంక అంత ప్రభావం ఉండదు కదా?

ఒక ప్రాంతం వారివే ఎందుకు పెడుతరు?

ఎందుకంటే ఒక ప్రాంతాన్ని తర తరాలుగ దోచుకోవాలంటే ఆ పంతం వారి సంస్కృతీ చరిత్రా నాశనం చేయాలి. అందులో భాగమే తెలంగాణా వైతాలికులు తరగతి పుస్తకాల్ల్లో కనుమరుగు కావడం. మహత్తరమైన తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మన పిలగాల్లకు అస్సలే తెలియక పోవడం. కనీసం హైదరాబాదు మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామక్రిష్ణారావని కూడా వారికి తెలియక పోవడం. ఫలితంగా ఆంధ్రా ప్రాంతానికి ఇక్కడి ప్రజలు శాశ్వతంగ బానిసలుగా పడి  వుండడం.

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన 
అలా జరుగుతుందా?







ఇప్పటికే అలా జరుగుతుంది. ముఖ్యమంత్రి, PCC ప్రెసిడెంటు, ప్రతిపక్ష నేత, DGP, స్పీకరు, హైదరాబాదు పోలీసు కమీషనరు ఇలా అడుగడుగునా వాళ్ళే ఉంటరు. తెలంగాణా ప్రాంతం వారు తమ చరిత్ర, సంస్కృతి ఎరిగి వుండి, ఆత్మా విశ్వాసం కలిగిన వారైతే తప్పక ఎదురు తిరుగుతరు. న్యాయం అడుగుతరు. అది వారికి ఇష్టం ఉండదు. తెలంగాణా వారు ఆత్మన్యూనతతో అణగి మణగి ఉన్నట్టైతే, యధేచ్చగా అన్ని రంగాల్లో తమ దోపిడీ కొనసాగించ వచ్చు.


మరి తెలంగాణా వాదులు ఊరుకున్నరా?

ఊరుకోలేదు. తీవ్రమైన నిరసనలు వెలువడ్డ నేపథ్యంలో శుక్రవారం పగలు కొమురం భీం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. పాపం ఆ మహానుభావులేం పాపం చేశారో కాని, ఈ మహానుభావుల పాపాల వల్ల అర్థరాత్రులు ప్రత్రిష్టించుకోవలసిన గతి పట్టింది. అదే కొమురం భీం పట్టపగలు ప్రత్రిష్టించ బడ్డ కొమురం భీం విగ్రహం గర్వంగా నవ్వుతూ నిలుచుంది!


తెలంగాణకు తిరుగులేని సంతకం



ఢిల్లీ యాత్ర ముగించుకొని వచ్చిన కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసమే కనిపించింది. మొదటి విడుత చర్చలు సఫలమయ్యాయన్నారు. మరో విడుత చర్చలతో తెలంగాణ వచ్చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రయత్నాలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది ప్రశ్న కాదు. ముందు కూడా సఫలమవుతాయా లేదా అనేది కూడా పక్కన పెడితే... తెలంగాణ వంటి ఒక మైనారిటీ ప్రాంతానికి ద్విముఖ వ్యూహం అవసరమని గుర్తించి ఆ దిశగా పనిచేస్తున్న కేసీఆర్... వ్యూహాత్మకంగానైనా, లేదా స్వీయ అస్తిత్వ బలంతోనైనా తెలంగాణ ను సాధించిపెడతారనే నమ్మకం సగటు తెలంగాణవాదికి వుందనడంలో అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమపార్టీ అధినేత పట్ల అపోహలు, అపార్థాలు సృష్టించి ప్రజల్ని పక్కదారి పట్టించే సీమాంధ్ర కోవర్టు పార్టీల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతాయనుకోలేం.

బక్కపలుచని మనిషి. కానీ మానసిక బలవంతుడు. 12 ఏళ్లుగా బరువైన బాధ్యత మోస్తున్నాడు. ఎగుడు దిగుడులు చూసినోడు. మనోధైర్యం చెదరని వాడు. సహనం, నిబ్బరం, నిబాయింపు, తెగింపు కలగలసిన మనిషి. ఎప్పుడో 1970లో ఇక రాదులే అనుకొని నిరాశలో కూరుకుపోయిన తెలంగాణ సమాజాన్ని 30 ఏళ్ల తర్వాత తట్టి లేపగలిగిన అసలు సిసలైన ఉద్యమ అధినేత ఆయన. అంతా అయిపోయిందనే నిరాశ ఆయన జీవన డైరీలో ఎక్కడా కనిపించదు. నేటి ఓటమిని రేపటి విజయంగా మలుచుకోగల వ్యూహ సంపన్నుడు.

కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టిననాడు ఆయన వెంట పట్టెడుమంది లేరు. ఇవాళ పుట్టె డు మందయ్యారు. జై తెలంగాణ నినాదం పలకని ఊరుగానీ, వాడగానీ, మనిషిగానీ వున్నాడా? నేను తెలంగాణ ప్రాంతం వాడినని చెప్పుకుంటే బతకలేనేనేమోననే ఆత్మన్యూనతా భావ స్థితి నుంచి, నేను తెలంగాణ వాడినేనని సగర్వంగా తలెత్తుకొని బతికే స్థాయికి తెలంగాణ సమాజాన్ని చేర్చగలిగిన అరుదైన నాయకుడాయన. తెలంగాణ పదం నిషేధింపబడ్డ అసెంబ్లీలో సగర్వంగా చట్టబద్ధంగా తెలంగాణ పదాన్ని పలికించిన తెలంగాణ మొదటి ముద్దుబిడ్డ ఆయన. ఇంటా బయటా తెలంగాణకు ఆత్మగౌరవాన్ని ఇప్పటికే సాధించిపెట్టాడు. ఆయన మాటా-బాటా తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరిస్తాయి. ఏమో.. కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడా అనే అనుమానాలు అప్పుడూ ఇప్పుడూ వున్నాయి. కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా, ఆయన ఉపన్యాసం విన్నా.. అప్పటిదాకా అనుమానంలో వున్నవాడికి సైతం నమ్మకం ఏర్పడాల్సిందే! ఆయన ప్రసంగాలు విన్న ప్రతి తెలంగాణవాడికి కేసీఆర్ తన వాడు, తన ఇంటివాడనే స్ఫురణ తప్పక కలిగిస్తుంది. అందుకే తెలంగాణ ఆత్మకు కేసీఆర్ ప్రతి రూపంగా కనిపిస్తాడు.

కేసీఆర్‌ను పొగిడే వారి సంగతి పక్కన పెడదాం. తెగిడే వారు సైతం అయనలో తెలంగాణ ఆత్మను చూసి గర్వపడతారనడంలో అనుమానం లేదు. ఆయ న భౌతిక స్వరూపం, వ్యవహారిక హావభావాలు, ఆత్మీయ పలకరింపులు, మీడియా తో మాట్లాడే తీరు, ఉపన్యాసాలు.. ఇలా ఆయన యాస, భాషా అన్నీ ప్రజల గుండె ల్లో తెలంగాణకు ప్రతీకలుగా చెరగని ముద్రను వేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణ ఏర్పాటును ఆయన ఎప్పుడో అనివార్యం చేయగలిగారు. అది ఇప్పుడా, ఎప్పుడా అనేది మాత్రమే తేలాల్సివుంది. అందరిలాగా ఆయన ఆగమాగం ఎప్పుడూ కాడు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇప్పటిదాకా ఉద్యమాన్ని నడుపుకొస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం వుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టి ఒక రకంగా మోసపోయారు, మరోకంగా ఆ పార్టీల చేత జై తెలంగాణ అని అనిపించాడు. ఇవాళ ఆ రెండు పార్టీల ద్వంద్వ నీతిని ప్రజా కోర్టులో నిలబెట్టగలిగా డు. వ్యూహం ఉన్నవాడు ఎన్నటికీ చెడిపోడంటే ఇదే కావచ్చు! అంతేకాదు రాష్ట్రంలో బలమున్న పార్టీలను, బలంలేని పార్టీలను అన్నిటికీ తెలంగాణ అనివార్యతను సృష్టించగలిగాడు. అంతటి చాణక్యనీతి తెలిసిన ఉత్తమ రాజకీయవేత్త ఢిల్లీకి ఉత్తిత్తిగా పోలేదని సీమాంధ్ర నేతలు గ్రహించారు. ఆయన ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించారనడంలో అనుమానం లేదు. కేసీఆర్ తెస్తారనుకున్న తెలంగాణకు తాత్కాలిక ఆటంకం ఏర్పడి వుంటుందని సగటు తెలంగాణవాదికి అర్థం కానిది కాదు. ఒకవేళ ఢిల్లీ పాలకులు మోసం చేస్తే మరుక్షణమే కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారని కూడా ప్రజలకు తెలుసు.

తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఎంత అవసరమో, వ్యూహాత్మకత కూడా అంతే అవసరం. అవసరాన్ని బట్టి రెండింటిని వాడుతూ ముందుకు సాగితేగానీ తెలంగాణ లక్ష్యం నెరవేరదు. అట్లా నడవగలిగిన సమర్థ నాయకుణ్ణి ఇవాళ తెలంగాణ కలిగివుంది. వ్యూహాత్మక ప్రయత్నం చేయడానికి 2012 లోపు వరకు అవకాశం వుంది. అప్పటికీ తేలకపోతే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తదుపరి సాధించుకునే అవకాశం ఎలాగూవుంది. 2012లోపు సాధించే అవకాశాల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. 2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడితే సాధించడం సాధ్యం కాదని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆలోపు తన వ్యూహాత్మక శక్తితో సాధించాలని అనుకుంటున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం కొందరికి అర్థం కాకపోవచ్చు, తెలంగాణ సాధారణ ప్రజలకు మాత్రం అర్థమవుతున్నదనడంలో అనుమానం లేదు. కేసీఆర్ ఢిల్లీ ప్రయత్నాలను ఒక ప్రయత్నంగా స్వీకరించాలే తప్ప, అవి తెలంగాణను తేలేవనే అపశకునం అక్కర లేదు!

ఉద్యమాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే సాధనాలు. అయినా రాజకీయ ప్రక్రియ అనివార్యం. నేటి అవకాశవాద రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారి అవసరాలను సొమ్ము చేసుకొని లక్ష్యాన్ని సాధించడం కూడా రాజకీయ ప్రక్రియలో ఒక భాగమే. కేసీఆర్ 12 ఏళ్లు అలాంటి ప్రయత్నాలు చేశారు. అంతమాత్రాన వాటిని విఫల ప్రయత్నాలుగా తేల్చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మైనారిటీ ప్రాంతం. చట్టసభల్లో సీమాంధ్ర పైచేయిలో వుంది. దేశంలో అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మైనారిటీ ప్రాంత ఆకాంక్షలను కాలరాసి కేంద్రం మెజారిటీ ప్రాంతానికి కొమ్ముకాస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాంటపుడు మైనారిటీ ప్రాంత నాయకుడికి వ్యూహాత్మకత అవసరం. సమయాన్ని బట్టి ప్రయత్నం చేయాలన్నా, కుదరకపోతే వాతలు పెట్టాలన్నా.. తెలంగాణ వంటి మైనారిటీ ప్రాంత నేతకు అదును చూసి చేయాల్సిన పనులు పనులవి! కేసీఆర్ ఆదిశగానే పని చేస్తున్నారనడంలో సందేహంలేదు.

64 ఏళ్ల నుంచి తెలంగాణలో బతుకుతూ వస్తున్న రాజకీయ పార్టీలు ఈ ప్రాంతానికి న్యాయం చేసే వుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనగలిగేదేనా? ఏర్పడినా.. ఉల్లంఘనలు, అన్యాయాలు జరుగుతుంటే ఊరుకునేవేనా? అందుకే కదా మంటికైనా ఇంటోడు కావాలన్నట్లు తెలంగాణకు టీఆర్‌ఎస్ రూపంలో ఓ ఇంటిపార్టీ పుట్టక తప్పింది కాదు. మంచైనా చెడైనా తెలంగాణకు ఓ ఇంటిపార్టీ వుందనే భరోసా ప్రజల్లో ఏర్పడ్డది. దానికి సమర్థుడైన వ్యూహాత్మక నాయకుడున్నాడు. రాష్ట్రంలో మైనారిటీ ప్రాంత నేతగా తెలంగాణ సాధించడానికి అనేక అవరోధాలు తప్పవు. వాటిని మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న నాయకుడి అవసరం అనివార్యం. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డారని వార్త. నిజమే 56 ఏళ్ల నిర్బంధ తెలంగాణ కు విముక్తి కల్పించేందుకు తన పార్టీని కూడా త్యాగం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని చెప్పొచ్చు. అది తన ప్రాంతం కోసం కేసీఆర్‌లోని రాజకీయ త్యాగశీలతను చాటిచెపుతోంది. మనం ఏరంకంగా చూసినా కేసీఆర్ తెలంగాణకు ఒక ఐకాన్! కంప్యూటర్‌లో ఐకాన్ నొక్కనిదే ఏదీ ఓపెన్ కాదు! అలాగే కేసీఆర్ లేని తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా జై తెలంగాణ అంటుందని మనం ఆశించగలమా? ఎన్ని పార్టీలు జైతెలంగాణ అన్నా, అవి కేసీఆర్ అనేవాడు ఒకడున్నాడు అనే భయంతో మాత్రమే అనగలుగుతున్నాయనడంలో ఎంత నిజముందో... తెలంగాణ ఎప్పుడు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలాంటి కేసీఆర్ వ్యూహ సమర్థతతోనైనా రావాలి లేదా ఆయన నాయకత్వంలోనే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తర్వాతనైనా రావాలి అనడంలో కూడా అంతే నిజం వుంది. ఇంకా చెప్పాలంటే ఆయన తెలంగాణకు తిరుగులేని సంతకం.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి
Taken from Namaste Telangana