Monday, December 31, 2012

నిత్య అసత్యవాది


డిసెంబరు 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాపై స్పష్టత ఇచ్చామని చంద్రబాబు, తెలంగాణా తమ్ముళ్ళు జబ్బలు చరుచు కుంటున్నారు. వీరు చెప్పే మాటల్లో నిజమెంతో పరిశీలిద్దాం.

అసలు ఈ అఖిలపక్ష తంతు మొదలైంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ నుంచే. తెలంగాణలో 'వస్తున్నా మీకోసం' కొనసాగాలంటే ఆ పార్టీకి తెలంగాణా ఏర్పాటు పై లేఖ ఇవ్వాల్సిన అవసరం ఎదురైంది. దానికి అనుగుణంగానే బాబు తెలంగాణలో అడుగు పెట్టే లోగా తెలంగాణా ఏర్పాటును బలపరుస్తూ కేంద్రానికి లేఖ రాస్తారని తెలంగాణాకు చేనిడిన ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. 

తీరా లేఖ ఇచ్చేనాటికి అది కాస్తా తెలంగాణా ఏర్పాటును బలపరిచేదిగా కాక, 'అఖిలపక్షం ఏర్పాటు చేయండి, స్పష్టత ఇస్తాం' అని చెప్పటంతో సరిపెట్టారు. ఈ మాత్రం దానికి లేఖ ఎందుకు? అని అప్పుడే అంతా ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం వారు మాత్రం 'అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణా తుట్టెను కదిలించే ధైర్యం కాంగ్రెస్ కు ఎలాగూ లేదు, దాన్ని మనం కాష్ చేసుకుని తెలంగాణా పాదయాత్ర పబ్బం గడుపుకోవచ్చు' అని భావించారు. కాని, FDI ల పుణ్యమా అని కాంగ్రెస్ ఎంపీలు బెట్టు చేయడం, వారిని బుజ్జగించడానికి కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్షం ఏర్పాటు చేయడం వెంట వెంటనే జరిగి పోయాయి. దీంతో తెలుగు దేశానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

దీన్నుంచి బయట పడడానికి, అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలా అని నిర్ణయించడానికి రెండు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపాడు బాబు. అఖిలపక్షం ఏర్పాటు చేయమని డిమాండు చేస్తూ అప్పుడు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తామని చెప్పినప్పుడు, మరొకసారి తమ నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం ఏంటి? అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి వుండాలి కదా?

ఆ సమావేశానికి పరమాందయ్య శిష్యుల్లాగా బాబు సీల్డ్ కవర్ను ఇద్దరు నాయకులు మోసుకు వెళ్లారట! కొండంత రాగం తీసి పిల్లికూతలు పాడినట్టు, ఆ ఉత్తరంలో బాబు వీరు చెప్పిందేమిటి? 2008లో ప్రణభ్ ముఖర్జీకి ఇచ్చిన ఉత్తరాన్ని వెన్నక్కు తీసుకోలేదట! 

ఆ ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని ఎవరికీ తెలువదా? టెక్నికల్ గా వెనక్కి తీసుకోక పోవచ్చు, కాని డిసెంబరు 2009లో అసెంబ్లీలో, అఖిలపక్షంలో  తెలంగాణా ఏర్పాటుకు మద్దతు ప్రకటించి, 2009 డిసెంబరు 9న ప్రకటన రాగానే 10నాడు ప్లేటు ఫిరాయించిన కారణంగానే గదా మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది? అప్పుడు సమైక్య వాదాన్ని సమర్ధించి, చావుదెబ్బ తిన్న తర్వాత తిరిగి 2011 మహానాడులో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రవచించిన విషయం వాస్తవం కాదా? మరి అటువంటప్పుడు తాము ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరం వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎవరిని మోసపుచ్చాలని?
     
అసలు ఎప్పుడో ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎందుకు? నిజాయితీ ఉంటే తెఅలంగానా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నామని స్పష్టం గా చెప్పవచ్చుగా? అలా సమర్థిస్తున్న BJP, CPI లాంటి పార్టీలు ఎలా చెపుతున్నాయి? మరి తెలుగుదేశం పార్టీ ఉత్తరంలో అంత డొంక తిరుగుడు ఎందుకు? మోసపూరిత ఉద్దేశాలు లేకపోతే?  

నిజంగా తెలంగాణా ఏర్పాటుపై వారికి సుముఖత ఉంటే అదే విషయం స్పష్టంగా చెప్పి ఉండవచ్చు. తీరా రేప్పొద్దున కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే, 'మేం ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదన్నాం తప్ప, ఇప్పుడు సమర్థిస్తున్నామని చెప్పామా?' అని మరో సారి ఫిరాయించడానికి వెసులుబాటు కల్పించు కోవడం కాదా ఇది? అసలు స్పష్టంగా ఉత్తరం ఇచ్చినప్పుడే మాట తప్పగా లేనిది, ఇంతటి డొంక తిరుగుడు మాటలు చెప్తుంటే మాట నిలబెట్టుకుంటారని నమ్మేదేట్లా? 
 
చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తే, మాట తప్పి మడమ తిప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని ఇట్టే అర్థమవుతుంది. సబ్సిడీలు వద్దని, తర్వాత అన్నీ ఫ్రీగా ఇస్తానని, బెల్టు షాపులు తానే పెట్టి, ఇప్పుడు తీసేస్తానని, తెలంగాణా వద్దని, మళ్ళీ కావాలని, మళ్ళీ సమైక్యత అని, రెండుకళ్ళు అని... ఉదాహరణలు ఎన్నో. ఇంతటి నిత్య అసత్యవాది ఇప్పుడు తెలంగాణాకు సపోర్టు చేస్తాడని ఎవరూ అనుకోవడం లేదు.  ఆ మాటలతో తెలంగాణా ప్రజలను మరొకసారి మోసగిస్తామని భావిస్తే అంతకు మించిన తెలివితక్కువ తనం మరొకటి వుండదు.       

No comments:

Post a Comment