Wednesday, December 5, 2012

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు


ఇప్పుడున్న పరిస్తితులల్ల 2014 లోపు తెలంగాణా రావాలె నంటే ఒకటే మార్గం. అది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాళ్ళ అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుక రావడం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలను పట్టించుకుంట లేదు. ప్రజల ఆకాంక్షల కన్నా సీట్ల లెక్కలే దానికి ముఖ్యమై పోయినై. అసుమంటి పార్టీకి అదే తరీకల బుద్ధి చెప్పాలే. సీట్ల లెక్కలు చేసుకొనే పార్టీకి గా సీట్ల లెక్కలే తారుమారు చెయ్యాలే. అది 2014 ల ఎట్ల నైనా చేస్తం, తెలంగాణా ఇయ్యక పొతె. కాని గాపని ఇప్పుడే కావాలె నంటె మాత్రం అది కాంగ్రేస్ పార్టీ నాయకుల తోనే సాధ్యం.

తెలంగాణా వాదులమని చెప్పుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా ప్రజలని మభ్య పెట్టుడు మానేయ్యాలే. వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా... అమ్మ పలుకుతది... అనుకుంట కాలం వెళ్లదీస్తున్నరు. అయితే గీ శీతాకాల సమావేశాలు అయిపోతే, ఇంక తెలంగాణా మాట వచ్చుడు కష్టం. ఒకవేళ ఇద్దామనుకున్నా వచ్చే ఎన్నికల లోపల అది అసాధ్యం.  కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఒక మూలకు నెట్టి వేయ బడ్డరు. ఇంక అక్కడి నుండి వాళ్లకు తెలంగాణా తెచ్చుడు తప్ప వేరే దారి లేదు.

కాబట్టి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే తమ పార్టీ అధిష్టానం మీద గట్టి వత్తిడి తీసుక రావాలె. రాజీనామాలకు కూడా  సిద్ధపడి రాజీలేని పోరాటం చేస్తే తప్ప అలాటి వత్తిడి పనిచెయ్యదు. సోనియా ముందట చేతులు కట్టుకొని మోకరిల్లితే అది సాధ్యం కాదు. అమ్మ మెప్పుకోసం వాళ్ళు తెలంగాణనే పణంగ పెడుతరా అంటే అది వాళ్ళ ఇష్టం. అట్ల గనుక జరిగితే వాళ్ళను బొంద పెట్టేతందుకు ప్రజలు సిద్ధంగ ఉన్నరు. ఇక నిర్ణయించు కొనుడు వాళ్ళ వంతే.

ఇంక కొంతమంది జగన్ పార్టీ దిక్కు చూస్తున్నరట.గట్ల చూసే నాయకుల చరిత్రలు మనకు తెలువనియి కావు. వాల్లకు రాజకీయమంటే డబ్బు, డబ్బంటే రాజకీయం. జగన్ ఇచ్చే పైసలతోని ఎన్నికలల్ల గెలుస్తమని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అది కేవలం వాళ్ళ భ్రమ. మూడేండ్ల కిందనే కోట్ల రూపాయలు మంచినీళ్ళ లెక్క కర్చు పెట్టిన డి. శ్రీనివాస్ కి ఏ గతి పట్టిందో వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలె.

ఇప్పుడు ఇక్కడి ప్రజలకు తెలంగాణా ఆకాంక్ష ఒక్కటే తప్ప ఇతర ప్రలోభాలు ఎన్ని చేసినా అవి ప్రభావం చూపవు. తెలంగాణా మేమే ఇస్తామని చెప్పి ఇన్నొద్దులు సుద్దులు చెప్పుకుంట పబ్బం గడుపుకున్నరు అన్ని పార్టీ లోల్లు. కాని ఇంకా గయ్యే మాటలు చెప్తమంటే మటుకు జనం నమ్మే పరిస్తితిల లేరు. చెంద్రబాబు కళ్ళు పోసి బీడీ ముట్టిచ్చినా, విజయమ్మ దొంగేడుపు లేడ్చినా, శర్మిలమ్మ నంగి మాటలు చెప్పినా... ప్రయోజనం శూన్యం.

అయితే ప్రజల కోరికలు ఎట్లున్నా, సీమాంధ్ర పెట్టుబడిదారీ, దోపిడీ, ఫ్యాక్షన్ శక్తులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రాంగ, అధికార గణం, సీమాంధ్ర మీడియా  వగైరాలు అభిమన్యుడిని దొంగ దెబ్బ తీసిన కురవుల్లా, తెలంగాణాను చావుదెబ్బ తీయడానికి పొంచి వున్నాయి. ఇట్లాంటి శక్తుల కుయుక్తులను ఎదుర్కునే టందుకు ప్రతి ఒక్క తెలంగాణా యోధుడు అనుక్షణం అప్రమత్తంగ ఉండాలె.

No comments:

Post a Comment