Saturday, December 22, 2012

దళితవాదమా? సమైక్యతా రాగమా?




కొండా సురేఖ, మోత్కుపల్లి నర్సింలు, తూర్పు జయప్రకాష్ రెడ్డి లాంటోల్లు పైకి తామే నిఖార్సైన తెలంగాణా వాదులమని చెప్పుకుంటూ, KCRని TRSని రోజుకు పది సార్లు దుమ్మెత్తి పొస్తుంటరు. వాళ్ళు పక్కా రాజకీయ అవకాశ వాదులు. వారి వారి సీమాంధ్రకు చెందిన నాయకుల చేతిలోని కీలు బొమ్మలు. TRSనో, KCRనో తిడితే తప్ప వారి పార్టీలో వారికి గుర్తింపు ఉండదు. కాబట్టి వాళ్ళ మాటలను గాలికి వదిలెయ్యొచ్చు.

స్వయంగా ప్రొఫెసర్ అయివుండి, స్వయం ప్రకటిత దళితవాది అయిన కంచె అయిలయ్య లాంటి వాళ్ళు రాజకీయ బ్రోకర్లకన్నా హీనంగా అమ్మనా బూతులు తిడుతుంటే పట్టించుకోకుండా వుండడం సాధ్యం కాదు. పేరుకు తెలంగాణా వాద సంస్థ నొకదాన్ని పెట్టుకొని తెలంగాణా కోసం ఏమాత్రం పాటుపడని ఒకానొక గజ్జెల కాంతం అనే అనబడే ఆయన పెట్టిన సమావేశానికి ఈ మధ్య ఐలయ్యగారు వెళ్ళారట. ఆయన తెలంగాణా సాధనకోసం సూచనలు సలాహాలు ఏమీ ఇయ్యలేదు కానీ, TRSను, KCRను తిట్టెటందుకు మాత్రం తన ఉపన్యాసాన్ని వాడుకున్నడు.

తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి KCR 50000ల కోట్లు సంపాయించుకున్నడట! మరి అంతటి రహస్యం ఆయనకే తెలిసినప్పుడు dis-proportionate assets క్రింద కోర్టులో కేసు వేయొచ్చుగా? ఆధారాలు లేని మాటలు చెప్పి ప్రచారం పొందే అణా కానీ రాజకీయ నాయకునికి, ఈ మేధావి(?)కీ గల తేడా ఏమిటి? మహామహులైన ములాయం, మాయావతి, మన రాష్ట్రంలో జగన్ లాంటి వారిని CBI కేసుల్లో ఇరికించి ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్, ఒక్క రూపాయి కేసులో ఇరుక్కున్నా KCRని ఊరికే వదిలి పెడుతుందా?

ఇకపోతే KCR ఇంట్లో ఎవరూ ఎందుకు ఆత్మ హత్యలు చేసుకోవడం లేదని అడగడం ఆయన దిగజారుడు తనానికి మరో నిదర్శనం. ఆత్మ హత్యలు ఎవరు చేసుకుంటారు? బలహీన మైన మనస్తత్వం గలవారు తెలంగాణా రాదేమోనన్న తీవ్రమైన నిరాశా నిస్ప్రుహలకు గురైనప్పుడు, లేదా ధైర్యవంతులైనా, సమాజానికి ఒక బలమైన message ఇవ్వాలె ననుకున్నప్పుడు ఆత్మ హత్యలకు ఒడిగడుతున్నారు. వారు ఏవిధంగా ఆత్మహత్య చేసుకున్నా తెలంగాణా వాదులు వాటిని సమర్థించడం లేదు. పైగా "ఆత్మహత్యలు వద్దు, నిలబడి పోరాడండి" అన్న పిలుపు నిస్తున్నారు. కాని దానికి విరుద్ధంగా వున్న ప్రొఫెసరు మాటల్లోని ఔచిత్యమేంటో చెప్పడానికి PhDలు అవసరం లేదు, తెలంగాణాలోని స్కూలు పిల్లవాడు చాలు.

ఇక పోతె ఆయన ముఖ్యమైన ఆరోపణ తెలంగాణ వస్తే వెలమ కులం బలపడుతది అనేది. కంచె ఐలయ్యో, గజ్జెల కాంతమో తప్ప సిసలైన తెలంగాణా వాదులెవరూ ఇప్పుడు తెలంగాణాల కులాల గురించి ఎవ్వరూ ఆలోచిస్త లేరు. అందరి మనసులల్ల తెలంగాణా ఎట్ల వస్తది అన్న ఆలోచన మాత్రమే వున్నది. ఇంక ఈయన ఆరోపణలల్ల నిజమెంతో చూద్దాం.

తెలంగాణాల రెడ్లకంటే బలమైన కులమేమీ కాదు వెలమ. తెలంగాణా రెడ్లు కూడా రాయలసీమ రెడ్ల వంటి బలవంతులూ, ఫ్యాక్షనిస్టులూ కారు. ఇక పోతే మూడో అగ్రకులమైన కమ్మ తెలంగాణాలో నామమాత్రం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తెలంగాణా రాష్త్రం వస్తే అగ్ర కులాలు కాకుండా BC, SC, STలు బలపడే అవకాశం వుందని కదా? ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజలసీమ రెడ్డి, ఆంధ్ర కమ్మ కులాల గుప్పిట్లో వుంది. తెలంగాణా గనుక విడిపోతే, ఇతర కులాల జనాభా ఎక్కువ కాబట్టి వారికి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఒకవేళ రాష్ట్రం ఇప్పుడు ఏ దళిత బహుజనుల చేతిలోనో వుండి వుంటే, రేపు తెలంగాణా వస్తే వెలమల చేతిలోకి వెలుతుందేమో, ఎలా? అని ఆలోచించడంలో అర్థం వుంది. కాని రాష్ట్రం ఏర్పడ్డ యాభయ్యేడు సంవత్సరాల్లో ఏనాడూ రాజకీయంగా వారి ఆధిక్యత కనపడలేదు. ఈ రాష్ట్రం ఇలాగే వుంటే మరో యాభై ఏళ్ళ తర్వాత నైనా ఆంధ్రా కమ్మ, రాయలసీమ ఫ్యాక్షన్ రెడ్ల హస్తాల నుండి బయట పడుతుందన్న నమ్మకం అసలే లేదు.

KCR అగ్రకులంలో పుట్టడం ఆయన తప్పు కాదు. కంచె ఐలయ్య కేవలం దళిత కులంలో పుట్టినందుకే దళితవాది అయ్యాడా, లేక దళితులపై జరుగుతున్న అత్యాచారాలను సహించలేక దళితవాది అయ్యాడా అన్నది ఆయన ఆలోచించు కోవాలి. దళితులపైన జరుగుతున్న అత్యాచారలపై స్పందించి పోరాడడానికి దళితుడే కానవసరం లేదు.

అలాగే తెలంగాణా పోరాటం కూడా తెలంగాణాపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా, తెలంగాణా అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటం. ఈ రెండు పోరాటాలు ఒకదాన్ని ఒకటి పరస్పరం గౌరవించుకుంటూ జరుగ వలసిన పోరాటాలు. రెండింటి లక్ష్యం ఒక్కటే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీని వ్యతిరేకించి పోరాడడం. నిజమైన దళిత వాది తెలంగాణా వాది కాకుండా వుండలేడు, అలాగే నిజమైన తెలంగాణా వాది దళితవాది కాకుండా వుండలేడు.

ఐలయ్య లాంటి వాళ్ళు పనిగట్టుకొని KCRని విమర్శించడం వల్ల బలపడేది దళిత వాదం కాదు, సమైక్యవాదమే అని గుర్తించాలి. KCR నాయకత్వం వల్ల వెలమల అధికారం ఏ రూపం తీసుకుందనేది ప్రస్థుతం ఊహాజనితమైన విషయం. కాని ప్రస్థుతం నడుస్తున్న కమ్మ, ఫ్యాక్షనిస్టు రెడ్ల పాలనలో కనిపిస్తున్న చుండూరు, కారం చేడు, లక్షింపేటల విముక్తి గురించి ముందు ఆలోచించాలి. తెలంగాణా ఏర్పడితే నిశ్చయంగా అది దళిత బహుజనుల రాజకీయాధిఅకానికి దోహద పడుతుంది. తద్వారా సోదర ఆంధ్రా ప్రజలకు కూడా ప్రేరణ కల్పిస్తుంది. ఆ విషయం ఆంధ్రాలోని దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి, ఐలయ్య లాంటి జడ వాదులు తప్ప.

No comments:

Post a Comment