Friday, April 29, 2011

అన్యాయపు మాటలు


బ్రహ్మయ్య గారూ, మీరు మీ వ్యాసం ('సామాన్యుల మాట ఏం టి?' ఆంద్ర జ్యోతి ఏప్రిల్ 26)లో సామాన్యులమీద జాలి చూపించి, మొసలి కన్నీరు కార్చారు. గణాంకాలతో పాటు మీరు ప్రస్తావించిన అన్ని విషయాలు ఎంత సత్యదూరాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని ఒక్క వారం రోజులు ప్రత్యక్షంగా పరిశీలిస్తే, మీరు వాస్తవాలను ఎంత వక్రీకరించారో, ఉద్యమాన్ని ఎంత చులకన చేసి చూపదలుచుకున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి మీ వ్యాసానికి బదులివ్వడం అనవసరం.

ఎవ్వరు చెప్పకుండానే ఒక సామాన్య పాఠకుడు కూడా మీరు చెప్పినవన్నీ అసత్యాలేనని చెప్పగలడు. ఎవరూ మీ వక్రీకరణను ఖండించక పోతే, కొన్ని రోజులకు మీ అసత్య ప్రచారాలనే నిజాలనుకునే ప్రమాదముంది. అటువంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ ప్రతిస్పందన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2011 జనాభా లెక్కల్లో హైదరాబాద్ జనాభా ఎంతో మీకు తెలియదు అనుకోవడం కష్టం. కాబట్టి కావాలనే తప్పుడు లెక్కలు చూపించారని అనుకొనేందుకు అవకాశం ఉంది.

మొత్తం హైదరాబాద్ జిల్లా జనాభా 40,10,238. అలాగే రంగారెడ్డి జిల్లా జనాభా 52,96,386 (రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, కాప్రా, అల్వాల్, ఉప్పల్, ఎల్‌బి నగర్, రాజేంద్రనగర్ లాంటి మునిసిపాలిటీలను కలుపుకొనే ఈ సంఖ్య). హైదరాబాద్ జిల్లాను చాలా విస్తరించి గ్రేటర్‌హైదరాబాద్‌గా చెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని కలిపితే హైదరాబాద్ జనాభా 70-75 లక్షలకు మించదు. హైదరాబాద్ పాత సిటీలో కనీసం వెయ్యిమంది కూడా సీమాంధ్రులు ఉండరు. అక్కడ నూటికి నూరుశాతం తెలంగాణ ముస్లింలు, హిందువులే ఉన్నారు.

అలాగే ఎల్‌బి నగర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్ మొదలైన ప్రాంతాల్లో కొంత శాతం మంది కూలీలు, మధ్యతరగతి సీమాంధ్రులూ ఉన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి గత ఇరవై, ముప్పై ఏళ్లుగా తెలంగాణ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున వలస వచ్చిన వ్యవసాయ కూలీలు లక్ష ల సంఖ్యలో ఉన్నారు. వీరు జగద్గిరిగుట్ట, బోరబండ, అడ్డగుట్ట, కుత్బు ల్లాపూర్, ఇంకా నగరంలో విస్తృతంగా ఉన్నటువంటి మురికివాడలలో నివశిస్తున్నారు. హైదరాబాద్ నగర పూర్వీకులు పాతనగరంతో పాటు కవాడి గూడ, నారాయణ గూడ, హియాయత్ నగర్ లాంటి కాలనీల్లో నివశిస్తున్నారు. వీరిలో మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ.

బ్రహ్మయ్యగారు చెప్పిన సామాన్యులు కాని సీమాంధ్రులు 1000, 1500, 2000 చదరపు గజాలలో విశాలమైన భవంతులు కట్టుకున్నవారు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాలలో చాలామందే ఉన్నా రు. ఈ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఉండే మొత్తం సీమాంధ్రుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు మించదు. కానీ మీ వ్యాసాల్లో సీమాంధ్రులు 40 లక్షల వరకు ఉన్నట్టు లెక్కలు చెప్పారు.

ఈ కాకి లెక్కల సంఖ్య ఎందుకు చెప్పారో మీకే తెలియాలి. అంటే హైదరాబాద్ నగరంలో 70-75 లక్షల జనాభా ఉంటే వారిలో 40 లక్షల మంది సీమాంధ్రులేనా? లేక హైదరాబాద్‌లో తెలంగాణ వారు మైనార్టీ సంఖ్యలో ఉన్నారని చెప్పే ప్రయత్నమా? ఎవరైనా వాస్తవ గణాంకాలను పరిశీలించి దానికి అనుగుణంగా ఏమైనా చెబుతారు. కాని మీరు మాత్రం మీరు చెప్పదల్చుకున్న దానికి అనుగుణం గా గణాంకాలను మార్చారు. ఇది సీమాంధ్రుల తరహా పద్ధతే అనుకోండి.

మీరు చెప్పిన 40 లక్షల సీమాంధ్రుల లెక్క ఐటి., ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్లలో పనిచేసే అత్యధిక సీమాంధ్రులను చూసి చెప్పారేమో! అధిక ధనవంతులు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ సీమాంధ్రులే కదా? అంతే కాదు, హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, సికిందరాబాద్ పార్లమెంట్ స్థానా లు పూర్తిగాను, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో కొంత భాగం ఉన్నాయి. అదే ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నగరాల్లో సుమారు కోటి జనాభా ఉన్నచోట ఒకొక్క దగ్గర 6 లేదా 7 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ రకంగా చూసినా మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పే కదా.

మీరు మీ వ్యాసంలో ఒక దగ్గర సామాన్యుల మీద దాడులు జరిగాయని చెప్పారు. మరో దగ్గర భౌతిక దాడి కాదు మానసిక దాడి అన్నారు. ఏ సామాన్యుడి మీద దాడి జరిగిందో చెబితే బాగుండును. తెలంగాణ ఉద్యమం ప్రజల్లో లేదు అని పరాకాష్ఠ (బాయిలింగ్) స్థాయికి చేరుకున్నది అనేది మీడియా ద్వారా తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రచారమని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో మీడియా అంతా సీమాంధ్రులదేనని చెప్పారు. మరి సీమ్రాంధ్ర మీడియా తెలంగాణను సమర్థిస్తుందా? వాళ్లు ఎంతో తక్కువ చేసి చూపెడుతున్నారు.

అయినా మీరు ఇంత ఉలిక్కి పడుతున్నారు అంటేనే ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో మీరే చెప్పకనే చెప్పారు. అయినా ఒక వారం రోజులు తెలంగాణలో ఎక్కడ తిరిగినా, ఎవ్వరిని పలకరించినా తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో కండ్లు మూసుకొని చూసే వాళ్ళకు, చెవులు మూసుకొని వినేవాళ్ళకు తప్ప ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ ఉద్యమ నాయకులు పదే పదే చెబుతున్నారు- 'మా ఉద్యమం పొట్ట కొట్టే వాళ్ళకు వ్యతిరేకంగానే కానీ పొట్ట చేత పట్టుకొని వచ్చినవాళ్ళకు వ్యతిరేకం కాదని'.

అయినా మీరు ఇలాంటి అబద్ధాలను మీకు చేతనైనంత స్థాయిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పిన ఆ అసామాన్య సీమాంధ్రులకు ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయే, ఎలా వచ్చాయో,హైదరాబాద్‌కి మొదటగా వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చెబితే ఇంకా బాగుండేది. రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలో చెప్పుకొచ్చారు. కాని రాజ్యాంగంలోని అధికరణ 3-ఎ లో రాష్ట్ర విభజనలు జరిగితే ఎలా జరగాలో స్పష్టంగా చెప్పారు.

అంతే కాదు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు 38 కోట్లు ఉన్న దేశ జనాభా 120 కోట్లకు చేరుకున్నప్పుడు రాష్ట్ర విభజన ఎంత అవసరమో డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ప్రత్యేక తెలంగాణను మొండిగా వ్యతిరేకించే క్రమంలో కనీసం అంబేద్కర్ లాంటి మహనీయుడిని అవమానం చేసే ప్రయత్నం చేయకండి.

- బి.వినోద్‌కుమార్
మాజీ ఎంపి; టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు
(Andhra Jyothi Friday, April 29th, 2011 Editorial page)

Thursday, April 28, 2011

భాష, యాస

ప్రజలు మాట్లాడేది భాష అయితది. ఆ భాష నించి వ్యాకరణం పుడుతది. అంతే గని వ్యాకరణం నించి భాష పుట్టదు. వ్యాకరణం నుంచి భాష పుట్టించుడు అంటె జలపాతాన్ని వెనుకకు మలిపేటందుకు ప్రయత్నించుడే.

ఇది తెల్వక ఒక ప్రాంతంలోని కొంత మంది దురభిమానులు మాదే అసలు యాస అనుడు మొదలు బెట్టిన్రు. యాస నించి భాష వచ్చినప్పుడు అసలు యాస ఏంది? నకిలీ యాస ఏంది?

నిజానికి మాది అసలు యాస అనేటోల్లకు అచ్చతెలుగు ఎట్లుంటదో తెలువదు.

తిక్కన, నన్నయ రాసిన పద్యాలల్ల ఎక్కడా 'వచ్చారు', 'వెళ్ళారు' అని ఉండదు. వచ్చిరి, వెళ్ళిరి అనే ఉంటది. దీన్ని ఒక ప్రాంతం వాళ్ళు వచ్చిన్రు, వెళ్లిన్రు అంటె, ఇంకొక ప్రాంత్రం వారు వచ్చినారు, వెళ్ళినారు అంటున్నారు. అయ్యన్ని కాదు, 'వచ్చారు', 'వెళ్ళారు' మాత్రమే కరెక్టు అనుడు కేవలం ఒక ప్రాంతపు ఆధిపత్య ధోరణి తప్ప ఇంకోటి కాదు. 

ఎక్కడ ఎవరు అట్లా అనలేదు. మేం మీ యాసను చాల బాగ గౌరవిస్తున్నం అనే వాళ్ళు లేరని కాదు. మరి ఎందుకు పుస్తకాలల్ల, పేపర్లల్ల, టీవీల్ల, సినిమాల్ల ఒక యాస తప్ప వేరే యాస జాడ లేకుంట పొయ్యింది?

ఒక్క తెలంగాణా వాడే కాదు, ఒక రాయల సీమ వాడు, ఒక ఉత్తరాంధ్ర వాడు కృత్రిమంగా రెండున్నర జిల్లాల కోస్తాంధ్ర మాండలికాన్ని ఈనాడు బలవంతంగా పలుకడానికి ప్రయత్నిస్తున్నరు. ఇంట్ల మాట్లాడుడు ఒకటి, బయట మాట్లాడుడు ఒకటి. ఇట్ల మాతృభాషనే రెండు రకాల మాట్లాడే టందుకు పడే మానసిక సంఘర్షణ పడేటోనికే అర్థమైతది కని ఇంకొకనికి కాదు.    

ఇంకా పొతే బహువచనాలు. ఆ బ్రిటీషు వాడు వచ్చి you అని అంటిచ్చి పోయిండు. రాజును సైతం 'హే రాజా' అని సంభోధించిన దేశం మనది. ఇప్పుడు ఏ అమెరికాలనో 'మిష్టర్ ప్రెసిడెంట్' అని పిలుస్తరట -  అని గుడ్లప్పగిచ్చి చెప్పుకుంటం మనం. గౌరవం మనసుల లేకుండ 'గారు', 'వారు' అనుకుంట ఈ కుహనా గౌరవ విభక్తి మనకు అవసరమా? 

Wednesday, April 27, 2011

తెలుగు జాతి వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న జాతా?

కుహనా సమైక్యవాదులు చేసే మరో మోసపు వాదన ఏందంటే తెలుగు జాతి వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న జాతి అని, ఇప్పుడు విడదీయడం పెద్ద అపరాధమనీ.

రాష్ట్రాలు పాలనా అవసరాల ప్రకారం, ప్రజల ఇష్టాయిష్టాల ప్రకారం ఏర్పాటు చేయ బడుతయి. అంతే గని అపరాధాలు, పాపాలు పుణ్యాల ప్రకారం మాత్రం కాదు.     

వాళ్ళ వాదన ప్రకారం చూసినా ఇప్పుడున్న ఇరవై మూడు జిల్లాలతో ఒక రాజ్యం గాని, ఒక రాజ్య విభాగం కాని చరిత్రల ఎప్పుడూ లేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఇప్పటి ఆంద్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యం కింద ఉన్నా, దీంతో పాటు మరి కొన్ని ఇతర భాషల ప్రాంతాలు కూడా కలిసే దేశంగా ఉండేవి తప్ప కేవలం తెలుగు వారితో మాత్రమే కూడిన రాజ్యం ఎప్పుడు గూడ లేదు. 

తెలుగుభాష ఉచ్ఛ దశలో ఉన్న కృష్ణదేవరాయల కాలంలో గూడా తెలుగు వాళ్ళందరూ ఒక్క దేశంల లేరు. కృష్ణ దేవరాయల దేశంల తెలుగు వాళ్ళు, తమిళులు, కన్నడులు ఉండేటోల్లు. ఇప్పటి తెలంగాణా బహామనీల కింద ఉండేది. ఉత్తరాంధ్ర గజపతుల కింద ఉండేది.

ఒక వేళ చరిత్రల ఎప్పుడన్నా ఒకసారి ఈ ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఇదివరకు ఒక దేశంగా ఉందనే అనుకుందాం. అంట మాత్రాన ఇప్పుడు గూడ ఒక రాష్ట్రంగా ఉండాలే అనేది ఏం లాజికో అడిగితె వీళ్ళు చెప్ప లేరు. మొఘల్ రాజుల కాలంల ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే దేశంగా ఉంది. మరి ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే రాష్ట్రం చేద్దామా అని అడిగితె సమాధానం ఉండదు. 

ఈ కుహనా సమైక్యవాదులకు  నిజాలు తెలువక కాదు. ఏదో ఒక మాయ మాట చెప్పి తెలంగాణా ప్రజలని మోసపుచ్చాలనే యావ తప్ప వీళ్ళ వాదనలకు మరొక్క కారణం కనిపించదు. 

చారిత్రక పటాలు చెప్తున్న చేదు నిజాలు

ఒకాయన ఏవో రెండు పటాలు గూగుల్ నుండి పట్టుకొచ్చి, తెలంగాణా, ఆంధ్రా భూమి పుట్టినప్పటి నుండి కలిసే ఉన్నయన్నట్టు మాట్లాడు తున్నడు. ఆయనకు సమాధానం చెప్పుదామని గూగుల్ వెతికిన. ఈ పటాలు చూసినంక తెలంగాణా, ఆంద్ర ఎన్ని రోజులు కలిసి ఉన్నయో మీరే చెప్పున్రి.


క్రీ.శ. 1

    క్రీ. శ. 200    

క్రీ. శ. 500 

క్రీ. శ. 1030 

   క్రీ. శ. 1200 

క్రీ. శ. 1560 

     
క్రీ. శ 1700         

క్రీ. శ. 1805 నుండి 1858 వరకు   

క్రీ. శ. 1860 

క్రీ. శ. 1934   

   1956 ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు.

పై పటాలు చూసి చిన్న పిల్లవాడు కూడా తెలుసుకొనేది ఏమిటంటే, తెలంగాణా, ఆంధ్రా పూర్తిగా ఎప్పుడు కూడా కలిసి ఒక దేశంగనో ఒక రాష్ట్రంగనో లేవు. ఒక వేళ ఎప్పుడన్నా కలిసి ఉన్నా, వేరే ప్రాంతాలు కూడా వాటితో కలిసి ఉన్నయి. ఉదాహరణకి కన్నడ ప్రాంతాలో, మరాఠీ ప్రాంతాలో, ఒరిస్సా ప్రాంతాలో, తమిళ ప్రాంతాలో కూడా మనతోటి కలిసి ఉన్నయి. అంతేగాని ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది ఇంతకు ముందు ఎన్నడు గూడ ఏర్పడి ఉండలేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది అని కుహనా సమైక్య వాదులు ఎన్ని కతలు చెప్పినా చరిత్ర మాత్రం అబద్ధం చెప్పదు. 

(సీమలో పుట్టి తెలంగాణా వేదనను అర్థం చేసుకుని, సంఘీభావం తెలిపిన సదరు బ్లాగరికి వందనాలు.)

Tuesday, April 26, 2011

ప్రజలను విడదీయడం పాపమా?

ప్రజలను విడదీయడం పాపమని ఒకాయన అన్నడట! అంటే పక్కోడు పాపాలు చేస్తున్నా కూడా, వాని పాపాలు ఎదుర్కునే టందుకు విడిపోవడం తప్ప మార్గం లేకున్నా కూడ విడిపోవద్దన్న మాట.

అవును మరి, వానికి మెజారిటీ ఉంది. మెజారిటీ తోటి మైనారిటీ నోరు మూయిస్తడు. నోరు ముయ్యని ఒకరిద్దరు నాయకులను కొనేస్తడు. ఇంకెవరైన మిగిలితే బెదిరిస్తడు. ఫాక్షనిస్టుల పురమాయిస్తడు. చావుకు భయపడేటట్టు చేస్తడు. అప్పుడు కూడ కలిసే ఉండాలె. విడి పొతే పాపమట!  

మరి 1953 ల మద్రాసు నుండి విడిపొయ్యి నప్పుడో? అంటె వేరే భాష వానితోటి విడిపోవచ్చన్న మాట. వాడు గూడ మన దేశంల మనిషైనా సరే. వాడు తమిళుడంటం. తెలుగోనికి వేరే రాష్ట్రం గావాలంటం. జాతీయ వాదాన్నివొదిలి భాషావాదాన్ని నిర్లజ్జగా తలకెక్కించు కుంటం.  

మన భాష మాట్లాడేటోళ్ళు మాత్రం విడిపోతే పాపం. మనం వాళ్ళ భాషని, యాసని ఎంత గేలి చేసినా సరే. విడిపోవద్దు.అట్లనే అణిగి మణిగి ఉండాలె, వాళ్ళ కాళ్ళ కింది చెప్పుల్లెక్క. అది మన సమైక్య వాదుల నీతి.  

ప్రాతం పేరున విడిపోవడం పాపమైతే, భాష పేరుమీద విడిపోవడం పాపం కాదా? ఆ లెక్కన 1953 లనే పాపిష్టులుగా మారినోల్ల తోటి మేమెందుకు కలిసుండాలే? సమైక్య వాదులారా, మీ పాపాలను నిజంగ కడుక్కోవాలె నని మీకుంటే మాకు అడ్డం రాకున్రి. పూర్తిగ కడుక్కోవాలెనంటె పొయ్యి తమిళనాడుల కలువున్రి, వాళ్ళు కలుపుకుంటే.

మీరు మోకాలడ్డం పెట్టినా, మొత్తంగా అడ్డం పండుకున్నా, మిమ్మల్ని దాటి రాష్ట్రం ఎట్ల తెచ్చుకోవాలనో మాకు బాగనే తెలుసు.

Thursday, April 21, 2011

ఐకమత్యం అంటే ఏమిటి

ఐకమత్యం అంటే ఏమిటి
ఒకే ఇంట్లో కలిసుండడమా
మనసు మనసు కాగా ఒక్కటి
ఒక్క మాటై పలికే ప్రేమా

నమ్మకాలవి వమ్మై నప్పుడు
కలసి ఉండుడు కలయే కాదా
ఎదుటి వాడి హృదయపు చప్పుడు 
వినగ నొప్పని వాదం నీదా

ఉద్యోగస్తులు రాష్ట్రమంతటా
రెండు గుంపులు పెట్టు కొంటిరి
చదువుకునే పోరలు కూడా 
ఒకరి నొకరు సహించ మంటిరి 

కులము కులము రెండుగ చీలెను
ప్రాంత మంతా ఒకటై పోయెను
మతము మతము వేరై పోయెను 
ప్రాంత వాదన మతమై పోయెను

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
పార్లమెంటు ఎంపీ లందరూ
ప్రాంత ప్రాంతము వేరు గుంపులు
చూడనట్టు నటిస్తరు కొందరు 
  
కలిసి ఉండి కలెబడ వలెనా
విడిగ ఉండుడు ఉత్తము కాదా
రాజధానులు విడిగా ఉన్నా 
రాక పోకల మార్గం లేదా? 

Wednesday, April 20, 2011

విభజన ఇక అనివార్యం, కడపే దానికి ఆద్యం

విసుగెత్తిరి ప్రజలంతా
వినలేక సమైక్య వంత
తప్పదు విడిపోద మనిరి
దళితులు మేధావులంత

దోపిడినే బలుపంటూ
తొండిగ మాట్లాడువారు
చీకటినే వెలుగంటూ
ఎవరిని నమ్మించ గలరు?

ఊకదంపుడును దంచే
నైపుణ్యం నీ పెన్నిధి
దాయాదుల కబళించే
సంకల్పం నీకున్నది

దోపిడీ దారులకది
మహా పెద్ద సిండికేటు
ఐకమత్యమే పునాది
డబ్బే తన కనికట్టు

జనమంతా గమనించిరి
మీ ముద్దులు కౌగిళ్ళు
ఇకనైనా మారకుంటె
హూనం జేస్తరు ఒళ్ళు

విశాలాంధ్ర మాట ఇంక
పనికి రాని చిల్ల పెంక
జగమెరిగెను ఈ సత్యం
విభజన ఇక అనివార్యం
కడపే దానికి ఆద్యం
కాగల గంధర్వ కార్యం

బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

తెలంగాణాల బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

ఇవి ఒక విశాలాంధ్ర సమైక్యంగా ఉండాలెనని సుద్దులు జెప్పే పెద్దమనిషి మాటలు. ఈయన లెక్కల తెలంగాణా రైతులు బోర్ వెల్ తోవ్వుకొని మంచిగ సాగుజేసు కుంటున్నరు కాబట్టి వాళ్లకు ప్రాజెక్టులు అవసరం లేదట! తెలంగాణాల లిఫ్టు ఇర్రిగేషను ప్రాజెక్ట్లులు కడితే కరెంటు కర్సు ఎక్కువైతదట. వాళ్ళు బోర్ వెల్ బాయిలు తొవ్వుకొన్నరు కాబట్టి వాటి మీదనే బతకాలె నట. ఇది ఆ పెద్దమనిషి తీరు.

ఆంధ్రాల ప్రాజెక్టులు కట్టుకొని, కాలువలు తోవ్వుకోని ఆరాంగ సాలుకు మూడు కార్లు పండించు కోవాలె. తెలంగాణకి లిఫ్టు ఏ ఇర్రిగేషను ప్రాజెక్టులో పెట్టినా గూడ నష్టమే. అప్పో సప్పో జేస్తి బోర్ల మీద బోర్లు వేసుకోవాలే. వాటిల గూడ నీళ్ళు పడక పొతే భూమి ఏ ఆంద్ర ఫాక్టరీకో అమ్ముకొని హైదరాబాదుకు పొయ్యి రిక్షా తొక్కు కోవాలె. 

తప్పి జారి నీళ్ళు పడితె మోటార్లు పెట్టుకోవాలే. అయ్యి కాలి పోతుంటే వైరింగులు జేపిచ్చు కోవాలె. కొత్త మోటార్లు కొనుక్కోవలె. కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పొద్దు మాపు ఇల్లు సంసారం ఒదిలేసి పొలంలనే పండుకోవలె. ఇన్ని జేసిన తర్వాత, లో వోల్టేజీలు, ట్రాన్స్ఫార్మర్లు పేలి పోవుడులు. దాని తోటి పోలాలెండిపొతే ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాలె.

అదీ ఈ విశాలాంధ్ర సమైక్యవాది చెప్పే సమైక్య నీతి.

బోర్ల మీది పంపుసెట్ల సాగు కంటే లిఫ్టు ఇర్రిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా మెరుగో తెలుసుకోవల్నంటే ఈ ఏది సత్యం? టపా చదువున్రి.             

పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే

అసలు సమైక్య వాదం అనేదే ప్రపంచంల ఎక్కడ వినబడని కుటిల వాదన. సమైక్య వాదం అంటే జర్మనీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతరు. జర్మనీ సామ్రాజ్య వాదుల చేర బలవంతంగ రెండు దేశాలుగ విడదియ్య బడ్డది. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాల వాళ్ళు కలవాలె నని అనుకున్నరు, కలిసి పోయ్యిన్రు. ఇప్పుడు కలిసిన జర్మనీల గూడ 15 రాష్ట్రాలున్నయి. ఆ ముచ్చెట మాట్లాడంగనే సమైక్యా వాదులకు ముచ్చెమటలు పోస్తై. వీళ్ళకి దేశం వేరు, రాష్ట్రం వేరు అన్న ఇంగితం తెలువక గాదు, ఏదో గుడ్డి వాదన చేయాలె, కింద బడ్డా నాకాలే మిర్రని చెప్పాలె.

ఏ వాదన చేతగాని సమైక్య వాదులు ప్రత్యేక తెలంగాణా వాదులని వేర్పాటు వాదులని పిలుసుడు మొదలు పెట్టిన్రు. వెనుకట ఖలిస్తాన్ దేశం కొరకు పోరాటం చేసినోల్లను, ఇప్పుడు కాశ్మీర్ ప్రత్యేక దేశం కొరకు పోరాటం చేసేటోల్లను తెలుగుల వేర్పాటు వాదులని చెప్పుడు మామూలు. వాళ్ళతోటి కలిపి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణా వారిని కూడా వేర్పాటు వాదులు అని పిలవడం వీళ్ళ కుట్రబాజీ మనస్తత్వాన్ని బయట పెడుతుంది.

కొంతమంది మరింత ముందుకు పొయ్యి తెలంగాణా వాళ్ళను తెలబాన్లంటున్నరు. అంటే అన్యాపదేశంగ ఆఫ్గన్ తాలిబాన్లతోటి పోల్చడం అన్న మాట. రాజ్యాంగ బద్ధంగ ప్రత్యేక రాష్ట్రం కోరుడు తాలిబానిజం ఎట్లయితది అని అడిగితె దానికి సమాధానం ఉండదు.

మరి 1952 ల మద్రాసు రాష్ట్రం నుండి విడిపోతమని పోరాటం చేసిన విషయం ఎవ్వరికి గుర్తు లేదు అనుకునుడు, పిల్లి కండ్లు మూసుక పాలు తాగుకుంట ఎవ్వరు చూస్తలేరు అనుకున్నట్టు ఉంటది. అది మరిచి పొయ్యినా 1972 ల జై ఆంధ్ర ఉద్యమం చేసిన విషయం గూడ జనం మరిచి పోతరని అనుకునుడు వీరి మాయ మాటలు చెప్పే నైజాన్ని మాత్రమె బయట పెడుతది.
              
అవును, పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే. పొట్టి శ్రీరాములు తాలిబానైతే నేనూ తాలిబాన్నే. ప్రాంతీయ విచక్షణకు వ్యతిరేకంగ అధ్బుతమైన పోరాటం చేసి మీరే మాకు మార్గ దర్శకంగా ఉన్నరు. మీ అడుగు జాడలల్లనే మేం గూడ పోరాటం చేస్తం, ప్రత్యేకరాష్ట్రం సాధించుకుంటం.

జై తెలంగాణా.

Tuesday, April 19, 2011

రేపు "జై ఉత్తర తెలంగాణ" అంటే ఏంచేస్తరు?

ఏ వాదన దొరుకని సమైక్యవాదులు చేసే పిచ్చి వాదనలల్ల ఇది ఒకటి. ఉన్న విషయాల మీద సమాధానాలు చెప్ప చాతకాక, లేని విషయాలను కల్పించి ఏదో మైలేజీ సాధిద్దం అనుకోవడమే ఇట్లాంటి అర్థం లేని వాదనలకు కారణం. 

అసలు "జై ఉత్తర తెలంగాణ" నినాదం ఎందుకు వస్తది? నిధులో, నీళ్ళో కొల్లగొడితేనే కదా? మరి నిధులు, నీళ్ళు కొల్లగోట్టినప్పుడు ఎవడైనా ఏం జేస్తడు? 1952 ల ఆంధ్రావాడు ఏం జేసిండో గదే జేస్తడు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలనంటే సమన్యాయం చూపెట్టాలె. అది చాతగానప్పుడు విడి పోతమంటే గమ్మునుండాలె. 

ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగు తుంటె, ప్రతి రోజు వివక్ష గురించి అన్ని వేదికల మీద వాదోప వాదాలు జరుగుతుంటెనే మొన్నటికి మొన్న, నాబార్డు నిధులల్ల 110 కోట్లు ఆంధ్రల కేటాయిస్తే, 10 కోట్లు తెలంగాణాల కేటాయిస్తరు. బీబీనగర్ నిమ్సు కడప రిమ్సు ఒకే సారి మొదలు పెట్టినరు. రిమ్సు కట్టడం పూర్తైతే, నిమ్సు మాత్రం మూలకు బడె. ఇదే మన సమైక్యాంధ్రల సమ న్యాయం. పైనించి ఇప్పుడు నిమ్సు కట్టుడు చేతగాదని కామినేని కిస్తరట!

తెలంగాణ యూనివర్సిటి, కడప యూనివర్సిటి ఒకే సారి మొదలు పెట్టిన్రు. కడప యూనివర్సిటీకి 350 కొట్లిస్తే, తెలంగాణ యూనివర్సిటీకి 27 కొట్లిచ్చిన్రు. ఇట్ల ప్రతి దాన్ల పక్షపాతం చూపిస్తా వుంటే ప్రత్యేక ఉద్యమాలు రాకపోతే ఏం వస్తయి? 

రేపు ఉత్తర తెలంగాణకి న్యాయం జరగక పొతే ఉద్యమం తప్పకుండ వస్తది. అప్పుడు ఉత్తర తెలంగాణ గూడ ఇయ్య వలసి రావచ్చు. అంటే కాదు ఉత్తరాంధ్రల ఉద్యమం వచ్చినా రాయల సీమల ఉద్యమం వచ్చినా అదే పరిష్కారం తప్పదు. 
 

విగ్రహాలు కూల్చినా బుద్ధి రాని ప్రభుత్వం

రాష్ట్రంల ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలు రూపొందించేటందుకు ప్రభుత్వం అయిదుగురుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందట. దానికి ఛైర్మన్‌గా వట్టి వసంత్‌కుమార్, సభ్యులుగా జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు నియమిచబడ్డరు.

కమిటీల నలుగురేమో సీమాంధ్ర మంత్రులట! చైర్మన్ గూడ ఆంధ్రా వాడే. ఏదో మొఖమాటానికి ఒక తెలంగాణా మంత్రిని పెట్టిన్రు. ఆయన్ను గూడ ఎందుకు పెట్టిన్రో మరి? మొత్తం వాళ్ళే ఉంటే పోయె గదా?  

ఇప్పుడు ఒకవైపు నుండి విగ్రహాలు పెట్టడంల అన్యాయం జరుగుతుందని గొడవ జరుగుతనే ఉన్నది. ప్రజలు దానికి నిరసన తెలుపుకుంట మొన్ననే ట్యాంకుబండు మీద విగ్రహాలు కూలదోసి తమ ఆగ్రహాన్ని తెలియ జేసినరు. ఇంత చేసినా ఈ సీమాంధ్ర పక్షపాత బుద్ధి మారలేదని ప్రభుత్వం తాజా నిర్ణయం తోటి తెలుస్తున్నది.

ఇట్లాంటి పక్షపాత కమిటీ తీసుకొనే నిర్ణయాలు ఎట్ల ఉంటయో ముందుగనే చెప్పొచ్చు. మల్ల కొన్ని వందల సీమాంధ్రుల విగ్రహాలు తెలంగాణా గడ్డ మీద మొలుస్తయన్న మాట!

ఇంతటి ఉద్యమం జరుగుంటేనే ఎక్కడి కక్కడ నియామకాల్లో, నిర్ణయాలలో చేతి వాటం చూపెట్టే సమైక్యాంధ్ర పాలకులు, తెలంగాణా కేదో ఉద్దరిస్తరనేది కలలో మాట.

ఇది వీళ్ళకు కొత్తకాదు. ఉద్యమం జరుగు తున్నప్పుడే నాబార్డు నిధుల్ల 92% నిధులు ఆంధ్రాకు పంపకం జెయ్యడం చూసినం. ఉద్యమం జరుగుతున్నప్పుడే సిగ్గు లేకుండ అక్రమంగా పోలీసు నియామకాలు జరపడం చూసినం. నీతి నియమం లేని ఈ సమైక్య ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తదనే దానికి ఇది తాజా ఉదాహరణ.    

రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు



ఇది 1972-73 లలో సినీ నటుడు కృష్ణ వేయించిన కరపత్రం.  (Curtesy సాహిత్య అభిమాని గారి బ్లాగు). దీంట్ల ఏం రాసి వుందో ఒక్కసారి చూడున్రి. ముల్కీ రూల్సుని సమర్థించుకుంట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన్రు. 

సుప్రీం కోర్టు తీర్పును గౌరవించని వాల్లు ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పుతున్నరు. ముల్కీ రూల్సు కూడా ఓర్వని వాల్లు ఇప్పుడు ఐకమత్యపు నీతులు చెప్పుతున్నరు.  అప్పుడు ఆంద్ర ప్రజానీకం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు అంటా ఆధ్రులమే అంటున్రు.

ఆ శ్రీకృష్ణ పిచ్చోడి లెక్క ఆరో సిఫార్సు ఇచ్చిండు గని, ముల్కీ రూల్సుకే ఓర్వని వాల్లు తెలంగాణాకు ప్రత్యేక రక్షణలు పెట్టాల్నంటే ఓరుస్తరా? పెట్టి చూడున్రి, రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు!     

Monday, April 18, 2011

హైదరాబాదుపై అత్యాశ

మాట్లాడితె హైదరాబాదును మేం అభివృద్ధి చేసినం అంటరు కొందరు సమైక్య వాదులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అభివృద్ధి  చెందడం తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిందేం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడి వాతావరణం, సహజ వనరుల కారణంగానే జరిగింది.

బెంగుళూరు తర్వాత ఉత్తమమైన సమశీతోష్ణ వాతావరణం ఉండే నగరం హైదరాబాదు. ఈ మధ్య పొల్యూషన్ వల్ల వేడి ఎక్కువైంది కానీ, ఎండాకాలం కూడా చెమట ఎరుగని ప్రదేశం హైదరాబాదు. అందుకనే ఆంధ్రా వాళ్ళైనా, వేరే వాళ్ళైనా ఇక్కడి కొచ్చి సెటిల్ కావాలెనని ఉవ్విల్లూరుతరు. సెటిల్ కావాలె నని ఉవ్విల్లూరితే ఫరవాలేదు. ఇక్కడి ఆస్తులను అక్రమంగా కబ్జా జేసుడు, ఇక్కడి ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొల్ల గొట్టుడు, బినామీ పేర్లు బెట్టి అర్బన్ సీలింగ్ యాక్టులకు విరుద్ధంగా వందల ఎకరాలు ఆక్రమించు కునుడు మొదలు బెట్టిన్రు.

వందల సంవత్సరాల నుండి హైదరాబాదుకు దేశ విదేశాల నుండి ఎంతో మంది వచ్చి హైదరాబాదుల సెటిల్ అయ్యిన్రు. ఇక్కడి వ్యాపారాలల్ల పాలు పంచుకున్నరు. వారు ఇరానీలు కావచ్చు, అఫ్గన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, పంజాబీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్తానీలు, సింధీలు, బంగ్లాదేశీయులు, బీహారీలు, నేపాలీలు ఇలా ఒకరని ఏమిటి దేశం మొత్తం హైదరాబాదుల కనిపిస్తది. ప్రతి ఒక్కరు ఇక్కడి అభివృద్ధిల పాలు పంచుకుంటున్నరు, దానితో పాటు వాళ్ళు కూడ అభివృద్ధి చెందుతున్నరు. కాని ఎవ్వరు కూడ హైదరాబాదును మేమే అభివృద్ధి చేసినం అని చెప్పలే. 

తమ అధికారం తోని, ఆశ్రిత పక్ష పాతం తోని ఇక్కడి భూములవల్ల, జాగలవల్ల, అక్రమంగా సంపాదించిన ఉద్యోగాల వల్ల ఎవరు అందరికన్న ఎక్కువ లాభపడ్డరో, వాళ్ళు ఇయ్యాల మేం హైదరాబాదుని డెవలప్ చేసిన మంటున్రు. అదే ఆంధ్రా వ్యాపార/రాజకీయ దోపిడీదార్ల నీతి!

ఇదెట్ల ఉందంటే, ఇల్లు లేక నీ ఇంటికి వచ్చినోడు, ఇల్లంత ఆక్రమించి, ఇంట్ల నిన్నొక మూలకు నెట్టి, నీకు కొంచెం రొట్టె ముక్క పడేసి, నిన్నే అభివృద్ధి చేస్తున్న అని చెప్పినట్టు ఉంది.

హైదరాబాదు అసలు ఎప్పుడు డెవలప్ అయ్యింది? నిజాం నవాబు నిజాం రాజ్యం మొత్తం పీల్చి పిప్పి చేసినా, ఆ డబ్బులు పెట్టి హైదరాబాదు మాత్రం బాగానే డెవెలప్ చేసిండు. ఆ రోజుల్లనే ఫీవర్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, ఆర్తోపెడిక్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ వంటి స్పెషాలిటీ దావఖానల తోడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడ కట్టిచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీని అత్యంత వైభవంగ కట్టించిండు.

ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. ఆంధ్రల ఉన్న ఏ నగరంల లేని విధంగ ఇక్కడ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది.     
      
స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాదు ఐదో పెద్ద నగరం. ఈ సమైక్య వాదుల పాలన పుణ్యమా అని ఇప్పుడు ఐదో స్థానాన్ని బెంగుళూరుకి సమర్పించుకో వలసి వస్తుంది. ఇదీ వీళ్ళు చేసిన డెవెలప్ మెంటు!

హైదరాబాదు తెలంగాణల అంతర్భాగం. ఇది తెలంగాణ నుండి వేరు చేసుడు ఎవ్వని తరంగాదు. తాహతు లేకున్నా ఒకప్పుడు మద్రాసు కొరకు పోరాడినోల్లు, అదే రకమైన అత్యాశతో ఇప్పుడు హైదరాబాదు పైన కన్నేసిండ్రు. అప్పడు ఏవిధంగ శృంగభంగం చెందిన్రో, ఇప్పుడు కూడా అలాంటి శ్రుంగభంగం తప్పదు వీరికి. అత్యాశ కొంపకు చేటుగదా మరి!

తెలుగు జాతి ఐక్యత గురించి మాట్లాడే వానికి హైదరాబాద్ ఎందుకు?

నేల విడిచి సాము చేసే సమైక్యవాదులకు ఉద్యమం ఉధృతి పెరుగుతున్న కొద్ది గుండెలలో గుబులై పోతుంది. ఇంక తెలంగాణా ఏర్పాటు తప్పదని నిర్ణయించు కున్నంక కొత్త రాగం పాడుడు మొదలు పెట్టిన్రు. హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలెనట!

ఇనాళ్ళు సమైక్య వాదం, తెలుగుజాతి అని చెప్పింది అన్ని ఉట్టి మాటలేనని వాళ్ళంత వాళ్ళే బట్ట బయలు చేసుకున్రు. అంటే హైదరాబాదు వస్తే 'తెలుగుజాతి, గిలుగు జాతి జాన్తానై' అన్న మాట!

మొదటినుండి వీరి కన్ను హైదరాబాదు మీదనే ఉన్నది. 1956 ల వీళ్ళు తెలంగాణా తోటి కలిసింది కూడా హైదరాబాదు మీద మోజు తోటి గాని మరొకటి గాదు. ఆ విషయం 1953 లనే ఆంధ్రా అసెంబ్లీల నీలం సంజీవ రెడ్డి స్పష్టంగనే చెప్పిండు.   

ఎవడైనా విడిపోతున్నప్పుడు తన వాటా సంగతి చూసు కుంటడు. నీళ్ళో నిప్పులో సరిగ్గ పంచమని బేరమాడుతడు. విడిపోతే తన ప్రాంతం వాళ్ళు పడే కష్ట నష్టాల గురించి ఏమన్నా ఉంటె చెప్పు కుంటడు. అది తన ప్రాంతపు ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేసే పని. 

ప్రజలెక్కడ పోతే మాకేంది? మా వ్యాపారాలు, మా రియల్ ఎస్టేట్లు, మా కబ్జాలు సల్లగుండాలె  అనుకునేటోడు ఏంజేస్తడు? హైదరాబాదు మీద కన్ను బెడుతడు. నా ప్రాంతం గాదు, నాకు హైదరాబాదే ముఖ్యం అంటడు. ఊళ్లు అభివృద్ధి చేయ్యలేనోడు హైదరాబాదు అభివృద్ధి చెస్తడట! వీళ్ళు చేసేది హైదరాబాదు అభివృద్ధి కాదు, హైదరాబాదుల వీళ్ళ అభివృద్ధి అని ఆంధ్రా జనం తెలుసుకుని మేలుకుంటె ఇప్పటికయినా మంచిది. గట్ల తెలుసుకొకుండ, గా నాయకులనే నమ్మితిరా, వాళ్ళు తడిగుడ్డ తోటి  గొంతు కొయడానికయినా వెనుకాడని రకాలు! జర జాగ్రత్తగ ఉండున్రి.

దళితులూ, ప్రజా సంఘాలు, కవులు, మేధావులు ఇప్పటికే మేలుకున్నరు. సమైక్య వాదం జపించే దొంగ నాయకుల కుట్రలను పసిగట్టిన్రు.  మిగిలిన వాళ్ళు కూడ తెలుసుకుని 'జై ఆంధ్ర, జై తెలంగాణా' అని నినదించే రోజు దగ్గరలనే ఉంది.

అన్న దమ్ముల్లాగా విడిపోదాం, అన్న దమ్ముల్లాగా ప్రేమగ మెలుగుదాం.

Sunday, April 17, 2011

విగహాల ధ్వంసానికి ఆద్యులు ఎవరు?

ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం మహా అపచారం అనుకుంట మొసలి కన్నీళ్లు కార్చిన ఆంధ్రా వాల్లు 1966 లో చేసిన నిర్వాకం చూడండి.


స్టీలు ప్లాంటు కోసమే ఒక్క విగ్రహం కూలితే, రాష్ట్ర ఏర్పాటు కోసం మరెన్ని విగ్రహాలు కూలాలో!

   

సమైక్యవాదులారా ఆలోచించండి.

సమైక్యవాదులారా కొద్దిసేపైనా మీ మెదళ్ళకు పని పెట్టండి.

మీరు సమైక్యంగా ఉండడానికి చెప్పే కారణాలేంటివి? తెలుగుజాతి అంటరు. అవును తెలుగు జాతి అయితెనేం?  రెండు రాష్ట్రాలు ఉండ కూడదా? హిందీ మాట్లాడే వారికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నయి? అవన్నీ ఒక్కటి చేయాలంటరా? బెంగాలీ మాట్లాడే వారు రెండు దేశాల్లో ఉన్నరు. వారందరినీ ఒక్క రాష్ట్రం చేద్దమా?  

ప్రపంచంలో ఎక్కడా భాషను మాతగా పెట్టి పూజించే పధ్ధతి లేదు. కేవలం వారి దేశాన్నో, రాష్ట్రాన్నో మాతగా భావించి పూజించు కుంటరు. తెలుగు వారంతా ఒక్క రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే మాతను పూజించొచ్చు. రెండు రాష్ట్రాలు గా విడిపోయినప్పుడు తెలుగు తల్లి, ఆంధ్రా మాత ఇద్దరూ ఉంటరు. ఈ తల్లులు మన భావనల్ల నించి వచ్చినప్పుడు ఎంత మంది మాతలు ఉంటె మాత్రం ఏంది?

భాష పేరు మీద జాతిని నిర్మించడం ప్రపంచంల ఎక్కడ కూడ సాధ్యం కాలేదు, కాదు గూడ. భాష పేరుమీద మాత పెట్టుకోవాలె నంటె, బెంగాలీలకు, బంగ్లాదేశ్ కు ఒక్కటే మాత ఉండాలె. గూర్ఖాలకు, నేపాలీలకు ఒక్కటే మాత ఉండాలె. పాకిస్తానీయులకు, హైదరాబాదు పాతనగరం వారికి ఒక్కటే మాత ఉండాలె. ఇది సాధ్యమా? ఆలోచించండి.

ఒకవైపు మనందరం తెలుగు వాల్లమంటరు, అన్నదమ్ముల మంటరు. కలిసుంద మంటరు. మల్ల వెంటనే మేం తెలబాన్ల మంటరు. వేర్పాటు వాదుల మంటరు. తెలివి తక్కువ వాల్లమంటరు. తాగుబోతుల మంటరు. నిజంగా కలిసుంద మనే వాల్లు అయితే ఈ విధమైన భాష ఎట్లా ఉపయోగిస్తరు? కాబట్టి మీ అసలు ఉద్దేశం కలిసుండడం కాదని అర్థమై పోతుంది. మీ అసలు ఉద్దేశాలు వేరే. 

మీ అసలు ఉద్దేశం హైదరాబాదు మీద ఆధిపత్యం చెయ్యాలెనని కోరిక. ఇక్కడి నీళ్ళు కొల్లగొట్టుక పోవాలెనని కోరిక. వీటికోసం మీరు ఎంతకైనా తెగిస్తరు. ఎన్ని వేషాలయిన వేస్తరు. ఎన్ని కుట్రలైన చేస్తరు. అయితె సమస్య ఏందంటే మీ కుట్రలను వేషాలను ఇంకా తెలంగాణ జనం నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వేషాలేయ్యాలెనని నని చూసిన్రా, తెలంగాణ ప్రజల దగ్గెర మరింత చులకనై పోతారు. 

అందుకే మీ గౌరవం నిలబెట్టుకొండి. గౌరవంగ విడిపొండి.       

Saturday, April 16, 2011

సమైక్య వాదపు కల్లోలం చూడు

సమైక్య వాదపు కల్లోలం చూడు
బలి పోతున్న పసి ప్రాణాలు చూడు.

రౌడీయిజం తెలియని నా హైదరాబాదుల 
బెజవాడ రౌడీల వీరంగం చూడు
జూబిలీ హిల్సులో ఫిల్ము నగరులో 
మసిబారు తున్నట్టి మానవత్వం చూడు

నాజీల మించిన నయా కామందుల 
నైచ్యాల నెదిరించ నక్సలైట్లుగా మారి
ప్రాణాల నొడ్డిన పడుచు వీరుల చూడు 

మత ఘర్షణలు లేని మా తెలంగాణలో 
పర పాలకుల వలన పడలేని కష్టాలు 
గోకుల్ చాటులో కొత్తగా బాంబులు 

అతిలేని గతిలేని మతిలేని దర్యాప్తు 
ఎన్నేళ్ళు సాగేను ఎప్పటికి ముగిసేను
తినుడు యావే తప్ప ధీరత్వమేలేని 
చవట దద్దమ్మలే రాష్ట్రాన్నిఏలంగ!

ఇంక సాగబోవు దోపిడీ రాజ్యాలు 
కుట్ర బాజీ గాళ్ళ కుహనా సమైక్యాలు 
జనం కదిలి వచ్చె సంద్రమ్ము మాదిరి 
దోపిడీ దొంగల పీచ మణుగు తుంది 
ప్రజా గర్జన విని పగుతుంది గుండె

తెలుగుమాత

అయ్యా సమైక్యవాది గారూ,

మాకు తెలిసింది తెలంగాణామాత, భారత మాత, ధరిత్రీ మాత. ఈ మాతలు మాకు చాలు. తెలుగు వారు ప్రపంచంలో పద్నాలుక్కోట్ల మంది ఉన్నారు. ఏ దేశంలో ఉన్నవారు, ఏ రాష్ట్రంలో నివసించే వారు ఆయా మాతల్నే పూజిస్తారు. తెలుగును అభిమానిస్తారు. అంటే కానీ మాది తెలుగుమాత, ఈదేశ మాతతో మాకు సంబంధం లేదని చెప్పరు. ఇంగ్లీషుకు మాత లేదు, హిందీకి మాత లేదు, భాష పేరిట మాతను నిలబెట్టి జనాన్ని మోసం చేయడం మీకే చెల్లింది.

తెలుగు తెలుగు అంటూ భాషా దురభిమానం పెంచి, దాన్ని సామ్రాజ్యవాదంగా మార్చారు. మీ సామ్రాజ్య వాదపు కుట్రలు బట్ట బయలై ఇప్పుడు ప్రజల ముందు నగ్నంగా నిలబడున్నారు. ఇంకా మేం దేవతా వస్త్రాలు కట్టుకున్నాం చూడండీ అంటే నమ్మడానికి జనం మీ అంత తెలివి తక్కువవారు కాదు.

తమరికి తెలియదేమూ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ బీహారు కంటే దరిద్రంగా ఉంది. మీరు ఇంకా ఇక్కడ ఉంది డెవలప్పు చేయవలసిన అవసరం లేదు. తమరు ఎంత తొందరగా విడిపోతే ఇద్దరికీ అంత మంచిది. 

తెలంగాణా దాటి ఇరవై వేల కిలోమీటర్లు వెళ్ళినా, ముప్పైవేల కిలో మీటర్లు వెళ్ళినా అక్కడి ప్రభుత్వానికి లోబడి ఉద్యోగాలు చేసుకుంటారు గాని, మీలాగా తిన్నింటి వాసాలు లెక్క బెట్టరు. ఆ ఘనత మాత్రం మీకే సొంతం. 

సమైక్య వాదులకు మూడు ఆప్షన్లు.

ఇక్కడ వ్రాసిన ప్రేలాపనకు నా సమాధానం.

మీరు ఎన్ని కుట్రలు, వంచనలు చేసినా, ఎన్ని డబ్బు సంచులు డిల్లీలో పంచినా తెలంగాణా ఏర్పాటు కాక తప్పదు. ఒక వేళ 2011 ల కాకపోతే 2014 ల రాక తప్పదు. అప్పటిదాకా మొకాలడ్డుకుంట నిలబడి చెడ్డ పేరు తెచ్చుకోకండి. విడిపోయినాక తెలంగాణా పై మీరు ఆధార పడాలే గాని తెలంగాణా మీ పై ఆధార పడదు. అందుకే మీరు బుద్ధిగా రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే మీకే మంచిది.

కాబట్టి మీకు మూడు ఆప్షన్లు ఇస్తున్నాం.

1 తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వప్పుకుంటాం. పోలవరం ఏర్పాటుకు అడ్డు చెప్ప కండి. నీటి అర్హత లేకున్నా కూడా రాయల సీమకు మేం తోవ్వుకున్న కాలువలు మూసి వేయకండి. కనీసం అనంత పురానికి తాగు నీరు వదలండి.

2తెలంగాణా ఏర్పాటు వప్పుకుంటాం. మాకు రాజధాని నగరం లేదు. కాస్త మా రాజధాని నగరం కట్టుకునే దాకా హైదరాబాదులోని భవనాలను ఓ ఐదేళ్ళ పాటు ఉపయోగించుకోనివ్వండి.

3తెలంగాణా ఏర్పాటుకు వప్పుకుంటాం. మాదారిన మేం పోతాం, కాని, మా పెత్తందార్లు అక్రమంగా ఆక్రమించిన భూములు, జాగాలు వారికే వదలండి. ఏదో, బతుకు తారు.

ఒప్పుకోరా, సరే, మీ ఇష్టం. అప్పుడు రాజాజీ వెళ్ళగొడితే కట్టుబట్టలతో వెళ్లి పోయినట్టుగా ఇప్పుడు కూడా హైదరాబాదు, తెలంగాణా వదిలేసి వెళ్ళ వలసి వస్తుంది.