Thursday, April 28, 2011

భాష, యాస

ప్రజలు మాట్లాడేది భాష అయితది. ఆ భాష నించి వ్యాకరణం పుడుతది. అంతే గని వ్యాకరణం నించి భాష పుట్టదు. వ్యాకరణం నుంచి భాష పుట్టించుడు అంటె జలపాతాన్ని వెనుకకు మలిపేటందుకు ప్రయత్నించుడే.

ఇది తెల్వక ఒక ప్రాంతంలోని కొంత మంది దురభిమానులు మాదే అసలు యాస అనుడు మొదలు బెట్టిన్రు. యాస నించి భాష వచ్చినప్పుడు అసలు యాస ఏంది? నకిలీ యాస ఏంది?

నిజానికి మాది అసలు యాస అనేటోల్లకు అచ్చతెలుగు ఎట్లుంటదో తెలువదు.

తిక్కన, నన్నయ రాసిన పద్యాలల్ల ఎక్కడా 'వచ్చారు', 'వెళ్ళారు' అని ఉండదు. వచ్చిరి, వెళ్ళిరి అనే ఉంటది. దీన్ని ఒక ప్రాంతం వాళ్ళు వచ్చిన్రు, వెళ్లిన్రు అంటె, ఇంకొక ప్రాంత్రం వారు వచ్చినారు, వెళ్ళినారు అంటున్నారు. అయ్యన్ని కాదు, 'వచ్చారు', 'వెళ్ళారు' మాత్రమే కరెక్టు అనుడు కేవలం ఒక ప్రాంతపు ఆధిపత్య ధోరణి తప్ప ఇంకోటి కాదు. 

ఎక్కడ ఎవరు అట్లా అనలేదు. మేం మీ యాసను చాల బాగ గౌరవిస్తున్నం అనే వాళ్ళు లేరని కాదు. మరి ఎందుకు పుస్తకాలల్ల, పేపర్లల్ల, టీవీల్ల, సినిమాల్ల ఒక యాస తప్ప వేరే యాస జాడ లేకుంట పొయ్యింది?

ఒక్క తెలంగాణా వాడే కాదు, ఒక రాయల సీమ వాడు, ఒక ఉత్తరాంధ్ర వాడు కృత్రిమంగా రెండున్నర జిల్లాల కోస్తాంధ్ర మాండలికాన్ని ఈనాడు బలవంతంగా పలుకడానికి ప్రయత్నిస్తున్నరు. ఇంట్ల మాట్లాడుడు ఒకటి, బయట మాట్లాడుడు ఒకటి. ఇట్ల మాతృభాషనే రెండు రకాల మాట్లాడే టందుకు పడే మానసిక సంఘర్షణ పడేటోనికే అర్థమైతది కని ఇంకొకనికి కాదు.    

ఇంకా పొతే బహువచనాలు. ఆ బ్రిటీషు వాడు వచ్చి you అని అంటిచ్చి పోయిండు. రాజును సైతం 'హే రాజా' అని సంభోధించిన దేశం మనది. ఇప్పుడు ఏ అమెరికాలనో 'మిష్టర్ ప్రెసిడెంట్' అని పిలుస్తరట -  అని గుడ్లప్పగిచ్చి చెప్పుకుంటం మనం. గౌరవం మనసుల లేకుండ 'గారు', 'వారు' అనుకుంట ఈ కుహనా గౌరవ విభక్తి మనకు అవసరమా? 

2 comments:

  1. ఔ అన్నా

    ఆఫీసుల్లో గూడా ఈ కృతక భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయలేక అసలు తెలుగులోనే రాయడం బందు జేస్తుర్రు మనోళ్ళు. వారీ మన అమ్మ అయ్యలు నేర్పిన భాషలో నిర్మొహమాటంగా రాయండని చెబుతుంటాను. యెవనికైనా గంతే. యెవని అమ్మ అయ్య నేర్పిన భాషలో వాళ్ళు మాట్లాడడమే గౌరవం, ఆత్మ గౌరవం.

    ReplyDelete
  2. సంతోషమన్నా,

    మన భాష గొప్పదనం మనం తెలుసుకోక పోతె బయటోడు ఎట్ల తెలుసుకుంటడు?

    పొద్దున ఒక బ్లాగుల తెలంగాణా వాడే భాష మార్చుకొమ్మని తన భార్యను హింసిస్తున్నడని తెలిసి చాల బాధ అనిపిచ్చింది.

    ReplyDelete