Monday, April 18, 2011

హైదరాబాదుపై అత్యాశ

మాట్లాడితె హైదరాబాదును మేం అభివృద్ధి చేసినం అంటరు కొందరు సమైక్య వాదులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అభివృద్ధి  చెందడం తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిందేం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడి వాతావరణం, సహజ వనరుల కారణంగానే జరిగింది.

బెంగుళూరు తర్వాత ఉత్తమమైన సమశీతోష్ణ వాతావరణం ఉండే నగరం హైదరాబాదు. ఈ మధ్య పొల్యూషన్ వల్ల వేడి ఎక్కువైంది కానీ, ఎండాకాలం కూడా చెమట ఎరుగని ప్రదేశం హైదరాబాదు. అందుకనే ఆంధ్రా వాళ్ళైనా, వేరే వాళ్ళైనా ఇక్కడి కొచ్చి సెటిల్ కావాలెనని ఉవ్విల్లూరుతరు. సెటిల్ కావాలె నని ఉవ్విల్లూరితే ఫరవాలేదు. ఇక్కడి ఆస్తులను అక్రమంగా కబ్జా జేసుడు, ఇక్కడి ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొల్ల గొట్టుడు, బినామీ పేర్లు బెట్టి అర్బన్ సీలింగ్ యాక్టులకు విరుద్ధంగా వందల ఎకరాలు ఆక్రమించు కునుడు మొదలు బెట్టిన్రు.

వందల సంవత్సరాల నుండి హైదరాబాదుకు దేశ విదేశాల నుండి ఎంతో మంది వచ్చి హైదరాబాదుల సెటిల్ అయ్యిన్రు. ఇక్కడి వ్యాపారాలల్ల పాలు పంచుకున్నరు. వారు ఇరానీలు కావచ్చు, అఫ్గన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, పంజాబీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్తానీలు, సింధీలు, బంగ్లాదేశీయులు, బీహారీలు, నేపాలీలు ఇలా ఒకరని ఏమిటి దేశం మొత్తం హైదరాబాదుల కనిపిస్తది. ప్రతి ఒక్కరు ఇక్కడి అభివృద్ధిల పాలు పంచుకుంటున్నరు, దానితో పాటు వాళ్ళు కూడ అభివృద్ధి చెందుతున్నరు. కాని ఎవ్వరు కూడ హైదరాబాదును మేమే అభివృద్ధి చేసినం అని చెప్పలే. 

తమ అధికారం తోని, ఆశ్రిత పక్ష పాతం తోని ఇక్కడి భూములవల్ల, జాగలవల్ల, అక్రమంగా సంపాదించిన ఉద్యోగాల వల్ల ఎవరు అందరికన్న ఎక్కువ లాభపడ్డరో, వాళ్ళు ఇయ్యాల మేం హైదరాబాదుని డెవలప్ చేసిన మంటున్రు. అదే ఆంధ్రా వ్యాపార/రాజకీయ దోపిడీదార్ల నీతి!

ఇదెట్ల ఉందంటే, ఇల్లు లేక నీ ఇంటికి వచ్చినోడు, ఇల్లంత ఆక్రమించి, ఇంట్ల నిన్నొక మూలకు నెట్టి, నీకు కొంచెం రొట్టె ముక్క పడేసి, నిన్నే అభివృద్ధి చేస్తున్న అని చెప్పినట్టు ఉంది.

హైదరాబాదు అసలు ఎప్పుడు డెవలప్ అయ్యింది? నిజాం నవాబు నిజాం రాజ్యం మొత్తం పీల్చి పిప్పి చేసినా, ఆ డబ్బులు పెట్టి హైదరాబాదు మాత్రం బాగానే డెవెలప్ చేసిండు. ఆ రోజుల్లనే ఫీవర్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, ఆర్తోపెడిక్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ వంటి స్పెషాలిటీ దావఖానల తోడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడ కట్టిచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీని అత్యంత వైభవంగ కట్టించిండు.

ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. ఆంధ్రల ఉన్న ఏ నగరంల లేని విధంగ ఇక్కడ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది.     
      
స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాదు ఐదో పెద్ద నగరం. ఈ సమైక్య వాదుల పాలన పుణ్యమా అని ఇప్పుడు ఐదో స్థానాన్ని బెంగుళూరుకి సమర్పించుకో వలసి వస్తుంది. ఇదీ వీళ్ళు చేసిన డెవెలప్ మెంటు!

హైదరాబాదు తెలంగాణల అంతర్భాగం. ఇది తెలంగాణ నుండి వేరు చేసుడు ఎవ్వని తరంగాదు. తాహతు లేకున్నా ఒకప్పుడు మద్రాసు కొరకు పోరాడినోల్లు, అదే రకమైన అత్యాశతో ఇప్పుడు హైదరాబాదు పైన కన్నేసిండ్రు. అప్పడు ఏవిధంగ శృంగభంగం చెందిన్రో, ఇప్పుడు కూడా అలాంటి శ్రుంగభంగం తప్పదు వీరికి. అత్యాశ కొంపకు చేటుగదా మరి!

7 comments:

  1. శ్రీకాంతచారి గారూ,

    హైదరాబాదు మీద మీకున్న ప్రేమ బావుంది. అంత మాత్రాన నిజామే మొత్తం అభివృద్ధి చేశాడనడం కూడా సరికాదు. నాకు తెలిసి మెట్రో రైల్, హై టెక్ సిటీ, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ లాంటివి నిజాం కట్టించలేదు.

    "ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. ఆంధ్రల ఉన్న ఏ నగరంల లేని విధంగ ఇక్కడ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది."

    ఎవడి రాజధానిని వాడు అభివృద్ధి చేసుకుంటాడు. అది సహజం. అది తెలంగాణా ప్రజల మీద ప్రేమతో కాదని గుర్తిస్తే మంచిది. ఆ లెక్కన మిగిలిన తెలంగాణా ప్రాంతం కూడా అలాగే ఉండాలిగా? మరి ఎందుకు లేదు. సమాధానం ఉందా మీదగ్గర?

    ఇక హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగం కాదని ఎవరన్నారు? అలాగే తెలంగాణా కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమే. ఇది ఎవరూ కాదనరు.

    ఈ ఆవేశం మీరు ఇన్నాళ్ళుగా ఓట్లేసి గెలిపించిన నాయకులు గాజులు తొడుక్కుని కూర్చున్నప్పుడు వాళ్ళ కాలరు పట్ట్టుకుని నిలదీసి చూపాల్సింది. వాళ్ళు అభివృద్ధి చేయకుండా తమ వాటా తిన్నప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు తమ చేతకానితనాన్ని వేరొకరి దోపిడీగా చిత్రిస్తూ మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరూ అమాయకంగా వారి మాటల్ని నమ్మి ఆవేశపడటం హాస్యాస్పదం. ఎవరండీ దోచుకుంటోంది? అక్కడికేదో ఆంధ్ర ప్రాంత ప్రజలంతా కబ్జా దారులుగా, దోపిడీదారులుగా చెబుతున్నారు? గుడిసెల వెంకటస్వామి గాంధీ వారసుడా? కే.సి.ఆర్ మండేలా మనవడా? వీళ్ళు చేసిన, చేస్తున్నా దోపిడీ మీకు కనబడదా?

    ReplyDelete
  2. @శంకర్

    >>>ఆ లెక్కన మిగిలిన తెలంగాణా ప్రాంతం కూడా అలాగే ఉండాలిగా?

    నిజాం మీద ఎవ్వనికి ప్రేమ లేదు. పైన నేను వ్రాసిన "నిజాం నవాబు నిజాం రాజ్యం మొత్తం పీల్చి పిప్పి చేసినా, ఆ డబ్బులు పెట్టి..." అనే వాక్యం చదువున్రి. హైదరాబాదు ఆనాడే నిజాం డెవలప్ చేసిండన్నదే ఇక్కడ పాయింటు.

    >>>ఇక హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగం కాదని ఎవరన్నారు? అలాగే తెలంగాణా కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమే.

    అవును. కని విడిపోతె అది తెలంగాణ అంతర్భాగ మైతది.

    >>>అక్కడికేదో ఆంధ్ర ప్రాంత ప్రజలంతా కబ్జా దారులుగా, దోపిడీదారులుగా చెబుతున్నారు?

    కబ్జా దారుడెవడైనా కబ్జాదారుడే. కొంతమంది దోపిడీ సమైక్యాంధ్ర శక్తుల ప్రభావంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వీల్లకు కొమ్ము కాస్తుంది. ఆ ప్రభుత్వానికి ఆంధ్రా వాల్లు కొమ్ము కాస్తున్నరు. మెజారిటీ లేదు కాబట్టి మేం ఎన్నడూ ఈ సమైక్యాంధ్రల ప్రభుత్వాలను నిర్ణయించలేం. అందుకనే విడిపోదలిచినం. దీనిపై వివరంగ మరో టపా రాయడానికి ప్రయత్నిస్త.

    ReplyDelete
  3. "ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. "

    KCR చెప్పినదాని గురించి కాపీ కొట్టారా ఏమిటి? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. నిజాం మీరు డప్పు కొట్టినంత విధంగా ఏమి చేసినా అది బ్రిటిష్ దేశస్థుల సాంకేతిక సహాయాన్ని తీసుకునే కదా? మరి అటువంటిది వారి పాలనా లో ఉన్న ప్రెసిడెన్సి లో జనాలకు కరెంటు తెలియదా? మీరు చెప్పిన దాని నుండి ఎంత కరెంటు ఉత్పత్తి అయ్యేది ఎన్ని ఇండ్లకు సరఫరా జరిగేది (నిజాం భవనాలు మినహాయించి)?

    From state electricity board's administrative report under rule no 59 APSEB supply rules 1958

    Electrified cities/towns and villages as on 31-3-1956

    Mahbubnagar 0
    Medak 1
    Nizamabad 0
    Adilabad 0
    Karimnagar 2
    Warangal 0
    Nalgonda 1
    Hyderabad 2
    Khammam 4
    Srikakulam 37
    Visakhapatnam 45
    East Godavari 107
    West Godavari 73
    Krishna 77
    Guntur 33
    Nellore 26
    Chittor 63
    Kadapa 16
    Anatapur 39
    Kurnool 29

    ReplyDelete
  4. లెక్కలు బాగనే పట్టుకొచ్చినవన్న!

    తెలంగానా మొత్తం డెవలప్ అయిందని ఎవరన్నరు? కాకనే గద ఈ బాధంత?

    మీలాంటొల్లు హైదరాబాద్ మొత్తం మేమేదో పొడిచేసినం అంటె, హైదరాబాదుల ముందటినుండే అభివృద్ధి ఉందని చెప్తున్నం. డెవలప్ అయిన దాన్ని మేమే డెవలప్ చేసినమని చెప్పుడు, కానిదాన్ని మొదట్నుండి అట్లనే ఉందని చెప్పుడు, మీకు మాత్రమే తెలిసిన విద్య.

    ReplyDelete
  5. బాగా చెప్పినావు అన్నా... రేపు తెలంగాణా వచ్చినాక పాతబస్తి వాళ్ళు హైదరాబాద్ మాది, మీరు వచ్చి గబ్బు చేసినారు అంటే అప్పుడు తెలుస్తది మీకు..

    ReplyDelete
  6. ఇప్పటి సంగతి వదిలేసి అప్పటి సంగతి ఎందుకే అన్న! అంటే ఇప్పుడు మీరు గబ్బు చేసిన్రన్నది కరక్టే నని ఒప్పుకుంటున్న వన్నమాట!

    ReplyDelete
  7. బాగు అయ్యిందా గబ్బు అయ్యిందా నీకే తెలుసు అన్నా

    ReplyDelete