Friday, May 27, 2011

చంద్రబాబూ, నీ పరపతి తగ్గకుండ ఆపుకో

చంద్రబాబు రెండువేల ఎనిమిది వరకు సమైక్య వాదం వినిపించిండు. ఆయన వాదం, ఆయనిష్టం. దానికి ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. 

రెండువేల ఎనిమిదిల తెలంగాణా పై స్టడీ చేసేటందుకు ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ రాష్ట్రం మొత్తం తిరిగి, అందరి దగ్గర మంచి చెడులు అరుసుకొని రాష్ట్రం రెండుగ విడిపోవాలె అని నివేదిక ఇచ్చింది. దీన్ని పార్టీ పాలసీగ మార్చి మహానాదుల ప్రకటన చేసిండు. 

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును సమర్తిస్తున్నం అని, మేం కాగ్రెస్ మాదిరిగ మాట మార్చే వాళ్ళం కాదు అని రెండువేల తొమ్మిది ఎన్నికల్ల పోటీ చేసిండు. తెలంగాణల ఆ పేరు మీద 36 సీట్లు గెలిచిన్రు.

2009 డిసెంబరు 7 నాడు తెలంగాణా తీర్మానం ప్రవేశ పెడితే సమర్థిస్తం అని అసెంబ్లీల ప్రకటించిండు. డిసెంబర్ 9 నాడు అకిలపక్షం సమావేశంల తెలుగుదేశం తరఫున హాజరైన అశోకగణపతి రాజు తమ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమని స్పష్టంగ చెప్పిండు. 

కాని డిసెంబర్ 9 అర్థరాత్రి చిదంబరం ప్రకటన చెయ్యంగనే పరిస్థితి మొత్తం మారి పొయ్యింది. పదోతారీకు ఉదయం పది గంటలకే సీమాంధ్ర ప్రజలల్ల పెద్ద ఉద్యమం బయలుదేరిందని పయ్యావుల కేశవ్, తదితరులకు కల వచ్చిందట! వరుసగా రాజీనామాల పర్వం మొదలైంది.

పార్టీ నిర్ణయాన్ని నాయకునిగా నొక్కి చెప్పా వలసిన అవసరం చంద్రబాబుకి ఉండింది. కాని ఆయాన ఆ పని చెయ్యలేదు. పై పెచ్చు తెలంగాణా ప్రక్రియ మొదలైందని ప్రకటించిన చిడంబరాన్నే తప్పు పట్టిండు. ఆ విధంగా రెండు నాల్కల ధోరణి అవలంబించిండు.

చంద్రబాబు సమర్థన చూసి సీమాంధ్ర నాయకులంతా రెచ్చి పోయిన్రు. ఏన్టీయార్ ట్రస్టు భవన్ ల జిరాక్సు తీసిన రాజీనామాలు (అవి దొంగ ప్రొఫార్మావి, ఎలాగూ అప్రూవ్ కావు) అందరికీ పంచి పెట్టు కున్నరు. ఇది అంతా చంద్రబాబు దర్శకత్వంలనే జరిగిందనే ఆరోపణ కూడా ఉన్నది. 

ఇటువంటి డ్రామాలాడించి మొత్తానికి వచ్చే తెలంగాణా రాకుండ చేసిండు చంద్రబాబు నాయుడు. తెలంగాణా ప్రక్రియ ఆగి పోయింది. కాని ఆయినకు తెలంగాణా వోట్లు కావాలె. అందుకని మల్లొకసారి మాట మార్చిండు. ఇప్పుడు ప్రపంచంల ఎక్కడ లేని రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టిండు.

ఈయనకు రెండు కళ్ళు ఉన్నా చూపు మాత్రం ఆంధ్రా దిక్కే అని అందరికీ అర్థమైంది. మచ్చుకు చెప్పాలంటే ఈయనకు తెలంగాణా ఆత్మహత్యలు కనపడవు, తెలంగాణా ఉద్యమం పై పోలీసుల ఉక్కుపాదం, పోలీసుఅల కాల్పులు, గాయపడ్డ మనుషులు కనపడరు. ఈయన ఏ కన్ను కూడా తెలంగాణా వైపు చూడదు, ఓట్లు అవసర పడ్డప్పుడు తప్ప.

రెండు కళ్ళ సిద్ధాంతం వెలవెలబొయ్యేసరికి, ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అయినప్పుడు మేమెందుకు చెప్పాలే అని కొత్త వాదం లేవదీసిండు చంద్రబాబు. అంటే కాంగ్రెస్ ఇస్తమని చెప్పితే ఆంద్రాల గొడవ లేపాలె. ఇవ్వమని చెప్పితే తెలంగాణాల ఉసిగోల్పాలే. తాను మాత్రం గోడమీది పిల్లి లెక్క నక్కి ఉండాలే. అదీ చంద్రబాబు ఆలోచన.

అయ్యా చంద్రబాబూ, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునివై ఉంది నువ్వు నీ బాధ్యతా నుండి తప్పించు కోలేవు. నువ్వు ఏదో ఒకటి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయ్యాలనైనా చెప్పు. ఒద్దనైనా చెప్పు. అంతే గని ఈ గోడమీది పిల్లి వేషాలు వేస్తే రెండికి చెడ్డ రేవదివయ్యేది మాత్రం ఖాయం. ఇప్పటికే నీకు తెలంగాణాల పన్నెండు డిపాజిట్లు, ఆంద్రాల రెండు డిపాజిట్లు గాయబై పొయినై. నువ్వు గనుక గిట్లనే చేస్తే రేపు వచ్చే జనరల్ ఎన్నికలల్ల మొత్తం   294 అసెంబ్లీ 42 పార్లమెంటు సీట్ల డిపాజిట్లు గల్లంతైతై. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా ఒక లీడర్లెక్క నిర్ణయాలు తీసుకో. జనంల నీ పరపతి తగ్గకుండ ఆపుకో.       


1 comment:

  1. Srikanth, I don't blame illiterate people like Payyavula & co. who can't read their own resolutions & manifestos. I also don't blame slaves like Erraballi.

    The villian of this tegulu movie is andhra babu.

    ReplyDelete