ఉద్యమ కారులల్ల రెండు రకాల వాళ్ళు ఉంటరు. ఒకటి, ఉద్యమం మీద కమిట్ మెంట్ ఉండి, ప్రతిక్షణం ఉద్యమం కోసం పాటు పడేటోల్లు. రెండు, ఉద్యమం తీవ్రతరమైనపుడు తమ రాజకీయలబ్ది కోసం ఆ మంటల చలి కాసుకునేటోల్లు. మన తెలంగాణా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఈ రెండో కేటగిరీకి వస్తరు. ఉద్యమ ఉధృతి కనపడంగనే వీళ్ళు మాకన్న గొప్ప ఉద్యమకారులు లేరన్నట్టు మాట్లాడుతరు. అందరికన్న గట్టిగ అరుస్తరు. శవాల దగ్గర ప్రతిజ్ఞలు చేస్తరు.
జర ఉద్యమం చల్లబడ్డట్టు అనిపిచ్చిందా? ఇంక పత్తా ఉండరు. మన రాజకీయ నాయకులంత వ్యాపారస్తులే అనేది అందరికి తెలిసిన రహస్యమే. వీళ్ళకి ప్రతిదీ సప్లై, డిమాండు సూత్రం లెక్కనే కనిపిస్తది. ప్రజల్ల ఉద్యమానికి డిమాండు ఉంటె వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నట్టు నటిస్తరు. ఆ విధంగా ప్రజలను ఆకట్టు కుంటందుకు ప్రయత్నం జేస్తరు.
గీ సూత్రాన్ని అనుసరించే జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చెయ్య బట్టిండు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీ జండాను కింద పారేసి ఉద్యమం జేస్త నంటున్నడు. ఇంక ఎరబెల్లి, ఇంక కొంత మంది తెలుగు దేశం జండాకు వేలాడు కుంటనే, రెండుకళ్ళ చంద్రబాబు కాళ్ళు మొక్కు కుంటనే తెలంగాణా ఉద్యమం చేస్తమంటున్నరు.
దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? తెలంగాణా ఉద్యమం ఇప్పుడు బలంగా ఉన్నదనే కదా? ఇప్పుడు ప్రజల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు డిమాండు ఉన్నది. అందుకనే ప్రజలను ఆకట్టుకోవాలె నంటే ఉద్యమాలు చేస్తున్నట్టు నటిచుడు తప్పదు ఎవరికైనా.
అయితే ఆంధ్రల మాత్రం ప్రజలల్ల సమైక్యతా గురించి ఎటువంటి డిమాండు లేదు. అటువంటి డిమాండు ఉంటే బొత్స సత్యనారాయణ, హర్ష కుమార్, దివాకర్ రెడ్డి లాంటోల్లు తెలంగాణాకు అనుకూలంగ మాట్లాడిన్రు. మిగిలిన నాయకులల్ల చాలా మంది గూడ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటం అని చెప్తున్నరు. దీన్ని బట్టి ఆంధ్ర ప్రజలల్ల తెలంగాణా కి వ్యతిరేకంగ ఎటువంటి డిమాండు లేదని అర్థమైతుంది.
ఐతే కొంతమంది పదవులను అడ్డం పెట్టుకొని తమ కబ్జా వ్యాపారాలు, అక్రమ లావాదేవీలు కొనసాగించే నయా రాజకీయ బ్రోకర్లు మాత్రం తెలంగాణాను అడ్డుకునేటందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నరు అనేది వాస్తవం. వీళ్ళ ప్రయోజనాలు సమైక్య రాష్ట్రం తోటి ముడివడి ఉన్నయి.
రాష్ట్రం ఎంతపెద్దగ ఉంటె అంతపెద్ద కాంట్రాక్టులు వస్తయి. ఎంత పెద్ద కాంట్రాక్టులు వస్తే అంత ఎక్కువ పైసలు దండుకోవచ్చు. సీమాంధ్ర పక్షపాతంతో కూడి ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు హైదరాబాదుల భూములను కబ్జా చెయ్యొచ్చు.
హైదరాబాదు తప్ప తెలంగాణాతో కలిసి ఉండుడు పైన ఎటువంటి మోజు లేదని వీళ్ళు ఇప్పటికే బయటపడి పోయిన్రు. వీళ్ళు ఇప్పటిదాంక చెప్పిన అన్నదమ్ములు, ఒక్క జాతి అనేటి కథలు తప్పని వీళ్ళే ఒప్పుకున్నరు. అయితే ఈ హైదరాబాదు పైన మోజు ఎవరికి?
ఆంధ్రాల ఉన్న సామాన్య పౌరునికి హైదరాబాదు మీద ఏమాత్రం మోజూ లేదు, హైదరాబాదు తోని పనిలేదు. ఇంక వాళ్లకు దగ్గెర్ల ఇంకొక రాజధాని ఉంటెనే మరింత సౌకర్యంగ ఉంటది. ఆ సంగతి ఆంధ్ర ప్రజలకు బాగనే తెలుసు. అందుకనే అక్కడి ప్రజలల్ల ఎటువంటి ఉద్యమం లేదు, పైసలిచ్చి ఉద్యమాలు నడిపించే రాజకీయ నాయకులల్ల దప్ప. అందుకనే సమైక్య గర్జన సభ జరిపితే 2000ల మంది కూడ రాలేదు.
ఓ సీమాంధ్ర సోదరులారా, రాష్ట్రం విడిపోవుడు తప్పదు గాక తప్పదు. విడిపోయినంక మాత్రం ఈ రాజకీయ బ్రోకర్లు, భూబకాసురులు, లక్షల కోట్ల సామ్రాజ్యాలు కూడ పెట్టేటొల్లకు మళ్ళా పట్టంగట్టకండి. వీళ్ళకు మా, మీ తేడా లేదు. వీళ్ళకు అధికారం ఇస్తే మిమ్ములను సర్వనాశనం బట్టిస్తరు.
No comments:
Post a Comment