కుహనా సమైక్యవాదులు చేసే మరో మోసపు వాదన ఏందంటే తెలుగు జాతి వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న జాతి అని, ఇప్పుడు విడదీయడం పెద్ద అపరాధమనీ.
రాష్ట్రాలు పాలనా అవసరాల ప్రకారం, ప్రజల ఇష్టాయిష్టాల ప్రకారం ఏర్పాటు చేయ బడుతయి. అంతే గని అపరాధాలు, పాపాలు పుణ్యాల ప్రకారం మాత్రం కాదు.
వాళ్ళ వాదన ప్రకారం చూసినా ఇప్పుడున్న ఇరవై మూడు జిల్లాలతో ఒక రాజ్యం గాని, ఒక రాజ్య విభాగం కాని చరిత్రల ఎప్పుడూ లేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఇప్పటి ఆంద్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యం కింద ఉన్నా, దీంతో పాటు మరి కొన్ని ఇతర భాషల ప్రాంతాలు కూడా కలిసే దేశంగా ఉండేవి తప్ప కేవలం తెలుగు వారితో మాత్రమే కూడిన రాజ్యం ఎప్పుడు గూడ లేదు.
తెలుగుభాష ఉచ్ఛ దశలో ఉన్న కృష్ణదేవరాయల కాలంలో గూడా తెలుగు వాళ్ళందరూ ఒక్క దేశంల లేరు. కృష్ణ దేవరాయల దేశంల తెలుగు వాళ్ళు, తమిళులు, కన్నడులు ఉండేటోల్లు. ఇప్పటి తెలంగాణా బహామనీల కింద ఉండేది. ఉత్తరాంధ్ర గజపతుల కింద ఉండేది.
ఒక వేళ చరిత్రల ఎప్పుడన్నా ఒకసారి ఈ ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఇదివరకు ఒక దేశంగా ఉందనే అనుకుందాం. అంట మాత్రాన ఇప్పుడు గూడ ఒక రాష్ట్రంగా ఉండాలే అనేది ఏం లాజికో అడిగితె వీళ్ళు చెప్ప లేరు. మొఘల్ రాజుల కాలంల ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే దేశంగా ఉంది. మరి ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే రాష్ట్రం చేద్దామా అని అడిగితె సమాధానం ఉండదు.
ఈ కుహనా సమైక్యవాదులకు నిజాలు తెలువక కాదు. ఏదో ఒక మాయ మాట చెప్పి తెలంగాణా ప్రజలని మోసపుచ్చాలనే యావ తప్ప వీళ్ళ వాదనలకు మరొక్క కారణం కనిపించదు.
No comments:
Post a Comment