Friday, November 28, 2014

భాషకు సంబంధించిన చర్చ భాషావేత్తలే చేయాలా?


ఈ విషయంపై శ్యామలీయం గారి అభిప్రాయం చూశాక ఈ పోస్టు రాయాలనిపించింది. వారి వ్యాసాన్ని, వ్యాఖ్యలను ఇక్కడ చదవొచ్చు. అందులో వారు 'భాషా సంబంధిత చర్చలు భాషావేత్తలు మాత్రమే చర్చించాలి' అని సిద్దాంతీకరించారు.

ఆ విషయం చెపుతూ వారొక దృష్టాంతాన్ని సెలవిచ్చారు. రోగికి చికిత్స చేసే విషయంలో కేవలం డాక్టర్లు మాత్రమే చర్చించాలి, ఇతరులు కనీసం ఆ వైపుకు కూడా రాకూడదు అని. మరి డాక్టర్లంటే కేవలం స్పెషలిస్ట్ లేనా, ఇతరులు కూడానా అన్న విషయం వారు వాకృచ్చ లేదు. సరే, వారూ వీరూ కూడా అనుకుందాం. ఈ విషయం బోధించారంటే వారొక పెద్ద వైద్య నిపుణులు కూడా అయి వుండాలి!

నేను వైద్యుడిని కాదు. కనీసం వైద్య సహాయకుడిని కూడా కాదు. కాకపొతే పేషెంటుగా బోలెడంత అనుభవం ఉన్న వాడినే. ఆ అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలు ప్రస్తావిస్తాను. వైద్య చికిత్సకు రకరకాల మార్గాలుంటాయి. ఆ విషయం వారే చెప్పారు. చికిత్స కేవలం డాక్టర్లే చెయ్యరు, ఫిజియోలు, నర్సులు కూడా అందులో భాగస్వాములే. వాటికి సంబంధించిన ఏయే సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయో చెప్పగలిగేది వారే. అలాగే డయాగ్నొస్టిక్స్ విషయం సరేసరి. ఇక పొతే అందించ వలసిన పరిశుభ్రత, ఉంచ వలసిన ప్రదేశం, ఇవ్వవలసిన ఆహారం... ఇల్లా అన్నీ పరిగణనలోనికి తీసుకొవలసిన అంశాలే. వీటన్నిటికి మించి వైద్యానికి కర్చు ఎంత అవుతుంది? అది పేషెంటు కుటుంబానికి అందుబాటులో ఉందా లేదా అన్న విషయం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయించ గలిగే విషయం. ఇవన్నీ వదిలేసి కేవలం నిపుణులే చర్చించుకుని అలవికాని పద్ధతిని ప్రిస్క్రైబ్ చేస్తే ఎలా వుంటుంది?

ఇక భాష విషయం లోకి వద్దాం. భాషను భాషావేత్తలు తయారు చెయ్యలేదు, చేసింది ప్రజలే. కాకపొతే భాషావేత్తలు వాటికి నియమ నిబంధనలు సృష్టించి ఉండవచ్చు. అంత మాత్రాన భాషావేత్తలు అలవికాని కొన్ని నియమాలు పెట్టి జనం మీదకి వదిలేసి, "మేం ఈ నిబంధనలు పెట్టాం, కాబట్టి చచ్చినట్టు ఫాలో చెయ్యండి" అంటే ఎలా వుంటుంది? ఎవరు ఏ నిబంధనలు పెట్టినా చివరకు పాటించ వలసినది ప్రజలే కదా! ప్రజలకు తాము ఏమి కోరుకుంటున్నారో, తాము వాడే భాష ఎలా వుండాలో కూడా చెప్పుకునే హక్కు లేదా? భాష ఏ విధంగా వుంటే అది మరింత ప్రజల్లోకి వెళ్లి వృద్ధి చెందగలుగుతుందనే విషయం ప్రజలకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? 'నీవు నిష్ణాతుడివి కాకుంటే చర్చించడానికి కూడా పనికిరావు' అన్నది ఏవిధమైన న్యాయం? 

తెలుగులో పదాలు తయారు చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి సంస్కృతం పైనే ఆధార పడదామా? లేక తెలుగులో కూడా అలాంటి వెసులుబాటు ఏర్పాటు చేసుకుందామా? అటువంటి వెసులుబాటు చేసుకోవడానికి వీలేలేదని తీర్పు చెప్పేవారు ఏవిధమైన సాధికారతతో చెప్తున్నారు? ప్రస్తుత భాషలో కొత్త పదాలు తయారు చేసే సుళువు లేదని ఒప్పుకుంటూనే, దిగుమతి చేసుకున్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా ఉన్నాయంటూనే, అటువంటి సుళువు కోసం తెలుగుభాషలో ప్రయత్నం కూడా చేయకూడదని శాసించడం ఏమిటో? ప్రయత్నమంటూ చేయకుండానే అసలు వీలే కాదని ఎలా తీర్మానం చేయగలరు?

బ్రాహ్మి లిపిలోని పత్రాలను పరిశోధించాలంటే బ్రాహ్మి లిపి కూడా నేర్చుకోవాలి కాని ఆ అక్షరాలను కూడా తెలుగులో చేరుస్తామంటే ఎలా వుంటుంది? అలాగే కొన్ని లుప్తమైన అక్షరాలు పాతకాలం తెలుగులో ఉంటే ఉండొచ్చు కాక, ఇప్పటి అవసరాలకు పనికి రాకపోయినా అందరికీ వాటిని ఒకటో క్లాసు నుండే నేర్పాల్సిన అవసరం ఏమిటి? పలకడానికి అలవికాని అక్షరాలను మొదటినుండి ఉన్నాయి కాబట్టి కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? ఎన్ని సార్లు పలికినా వాటి మధ్య తేడా కనపడని అక్షరాలను రెండింటికి బదులు ఒకటే వాడితే వచ్చె నష్టమేమిటి? 

ప్రజల్లోనుండి భాష పుడుతుంది. కాని భాషావేత్తల వల్ల దానికి నియమాలు ఏర్పడతాయి. ఆ నియమాలకు వీలైనంత సార్వజనీనత ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు భాషావేత్తలు. లేకపోతె అది మరొక మృతభాషగా మారే ప్రమాదం వుంటుంది. ప్రజలు కాక పండితులే రాసిన వ్యాకరణాన్ని ప్రజల అవసరాలకోసం అదే పండితులు మరింత సరళతరం చేసి రాయడం ఎందుకు సాధ్యం కాదు? అదే సమయంలో కొత్త పదాలు తయారు చేయడానికి  సంస్కృత భాషలో, లేదా ఆంగ్ల భాషలో ఉన్న వెసులు బాట్లను పరిశీలించి, తగు మార్పులను తెలుగులొ కూడా ఎందుకు చేయలేక పోతున్నాం? తమిళం, ఆంగ్లం ఇంకా అనేక భాషలు తమ పదాలు తామే చేసుకుంటున్నప్పుడు, మన భాషలు ఆ శక్తి లేదని ఒప్పుకుని మనం పక్కకు తప్పుకోవాలా?

ఇటువంటి ధోరణి అవలంబించే వేల సంవత్సరాలపాటు మన దేశంలో భాషను, సారస్వతాన్ని తొంబై శాతం ప్రజలకు అందకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. దాని ఫలితంగానే అనేక విషయాల్లో పాశ్చాత్యుల కన్నా మనం వెనుకపడి పోవడమూ జరిగింది.  ప్రజాస్వామ్యం వచ్చి అరవై ఏళ్లైనా ఇప్పటికీ కొందరు ఇంకా అటువంటి భావజాలాన్నే ప్రదర్శించడం శోచనీయమైన విషయం. 


95 comments:

  1. ముఖ్యంగా తెలుగు భాష గురించి గత రెండు మూడు రోజులుగా కొందరు బ్లాగర్లు జరుపుతున్నచర్చసంబంధంగా మీరిక్కడ రాసిన విషయాలతో అజ్ఞాతగానైనప్పటికీ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. The bitter truth is expressed well in the last paragraph. Well done!

    ReplyDelete
    Replies
    1. నా వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలండీ అఙ్ఞాత గారు.

      Delete
  2. మీరేమీ అనుకోనంటే శ్యామలీయగారిపై అంత ఆక్రోశం అవసరం లేదు. భాష కు సంబంధించి దానిని ఎవరు ఎలా చర్చించాలి? ఎలా మార్చాలి? ఎలా అభివృద్ధి చేయాలి? అనేదానిపీ చాలావర్కు మీతో ఏకీభవిస్తాను. మీరాయన చెప్పినదానిలో అభ్యంతరాలను ఇంత ఘాటుగా కాకుండా కూడా వ్యాఖ్యానించవచ్చు. చిన్న గీతను చెరపకుండా పెద్ద గీత గీయవచ్చు. మీరు అసహనం ఆక్రోషం తగ్గించుకుంటే మీరు బాగా వాదించగలరు కూడా. మీరు చెపితే నేను కే.సీ.ఆర్ పై వాదనా పద్ధతిలో చాలా మార్పు తెచుచుకున్నాను గుర్తుందా? ఆ చనువుతో మాత్రమే చెప్పాను. లేదంటే మీ ఇష్టం. అన్యధా భావించవద్దు. నాకు శ్యామలీయం గారిపై గౌరవం ఉన్నది. అదే సందర్భంలో ఆయన అభిప్రాయాలన్నింటినీ సమర్ధించనని ఆయనకూ మీకు కూడా తెలుసు. మనమెవరమూ శతృవులం కాదు. ఓసారి మీ వ్యాసంలో ముఖ్యమైన పాయింట్లు ఉంచి ఆయనపై వ్యాఖ్యానాల్ని తొలగించి పునర్ముద్రించాలని వినతి.

    ReplyDelete
    Replies
    1. కొండలరావు గారు,

      మీరు చెప్పిన తర్వాత మరోసారి పరిశీలించి శ్యామలీయం గారిపై వ్యక్తిగత విమర్శలకు సంబంధించిన వాక్యాలను తొలగించాను. కాని వాటి వాస్తవికత పై ఇప్పటికీ కట్టుబడి వున్నాను. మీ సలహాకు ధన్యవాదాలు.

      Delete

    2. ధన్యవాదములు శ్రీకాంత్ చారి గారు. వాటి వాస్తవికతపై నేను అభ్యంతరం చెప్పలేదు కూడా. మాష్టారికి తెలుగుపై ఉన్న మమకారం మనకు తెలిసిందే. ఆయన స్వభావమూ తెలిసిందే కదా. భాషపై చర్చ విషయంలో నేను శ్యామలీయంగారి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన బ్లాగులోనూ పర్సనల్ గానూ చెప్పాను. ఇకపై కూడా ఇలాగే సమ్యమనంగా చర్చలు నడవాలని తెలుగు భాషాభివృద్ధికి మనవంతు కృషి కొనసాగాలని కోరుకుంటున్నాను. భాషను సృష్టించేది సామాన్యులే అందులో నియమాలు రూపొందించేది పండితులు. ఆ నియమాలు వాడుకలో బాగోకపోతే మళ్ళీ మార్చాల్సినదీ పండితులే. అంటే సామాన్యులూ పండితులూ ఇరువురూ తమ పాత్ర పోషించకపోతే భాషాభివృద్ధి జరగదు. ఒకప్పుడు పండితుల పద్య రచనలతో మాత్రమే భాషా ప్రావీణ్యమని విర్రవీగితే గురజాడ వంటి వారి వచన కవిత్వంతో భాషకు ప్రయోజనం జరిగింది. కనుక భాషను గురించి ఎవరైనా చర్చించాలి. నియమాలు మాత్రం వాటిపై పట్టు ఉన్నవారు చేస్తే మంచిది. అవి మళ్లీ జన సామాన్యంలో ఉపయోగపడేవై ఉండాల్సిందే. ఇది నిరంతరం జరిగే ప్రాసెస్.

      Delete

  3. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.ఒక విషయాన్ని(ఉదా;;భాష)గురించి అందులో నిష్ణాతులు చర్చిస్తే మంచిదే.వారికి అందులో మిగతా వారికన్నా పరిజ్ఞానం ఎక్కువగ ఉంటుందికనక.అలా అని ఇతరులెవరూ చర్చించ కూడదనడం పొరబాటే.ఉదా;;వైద్యం,విద్య,చట్టం,శాంతిభద్రతలు,మొదలైన అనేక విషయాల్లో అందరికీ ఆసక్తి,అవసరం,అంతోఇంతో గ్రహింపూ ఉంటాయి కాబట్టి.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      Delete
    2. కమనీయం గారు చక్కగా చెప్పారు సర్.

      Delete
  4. Claps
    Telangana zindabad

    ReplyDelete
  5. ఎన్ని సార్లు పలికినా వాటి మధ్య తేడా కనపడని అక్షరాలను రెండింటికి బదులు ఒకటే వాడితే వచ్చె నష్టమేమిటి?
    >>
    కొంచెం వుదాహరించి చెప్తే బాగుందేది. "ళ" సంస్కృతంలో తప్ప మిగాతా భాషల్లో యెక్కడయినా వుందా?నాకు కంబదలేదు!
    అది మనది కాదుగా "ల" కు దగ్గిరగా వుంది గదా అని దాన్ని తీసీస్తే కళ్ళు కాస్తా కల్లు అవుతుంది మరి!.

    ReplyDelete
    Replies
    1. "ళ" (retroflex variety of "L") is also used in Punjabi, Marathi and Odia. It is not used in Hindi and many other Indian languages.

      Delete
  6. హరిబాబు గారు,

    అందుకే "తేడా కనపడని" అన్నానండీ. ఒకవేళ కళ్ళు, కల్లు పలకడంలో మధ్య తేడా లేకపోతే (గుర్తించలేనంత స్వల్ప తేడా ఉన్నా కూడా) రెండోది అనవసరమని ఇప్పటికీ నా అభిప్రాయం.


    తెలంగాణాలో కళ్ళు అన్న పదాన్ని కండ్లు అనే వాడతారు. ప్రాచీన గ్రాంధికంలో కూడా అలాగే వుందనుకుంటాను.

    ఇక పోతే ఒకే పదంతో నానార్థాలు రావడం సర్వసాధారణమే.

    కల్లు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
    ----------
    యు. దే. వి.
    1. కన్ను;
    "సీ. ఏవేల్పుతలఁపంగ నినచంద్రులను బండికండ్లుగాఁ గండ్లుగా ఘనతఁజేసె." భల్లా. ౧, ఆ. (ఈయర్థమున నీ ప్రయోగ మొక్కండ కానఁబడియెడి.)
    2. బండికన్ను;
    "వ. దాపటికల్లు క్రుంగినం దేరు ఘూర్ణిల్లె." భార. కర్ణ. ౩, ఆ.
    3. ఱాయి.
    "గీ. గగన హరినీలశైలశృంగమున నుండి, డొల్లిపడెం బ్రొద్దు జేగుఱుఁగల్లువోలె." నై. ౮, ఆ.
    వై.
    1. మద్యము;
    "ఉ. ఉత్పలగంధి నన్ను డిగి యొడ్లను బంపుము కల్లుతేర." భార. విరా. ౨, ఆ.
    2. మద్య విశేషము* .
    "ద్వి. సారాయి యొక యేఱుసరవినిబాఱెఁ, బారెఁగల్లును నొక్కపావన తటిని" రా. అ, కాం.

    చూశారా. ఇలా కల్లు అన్న శబ్దానికి ఇన్ని అర్థాలున్నాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించడం అన్ని భాషల్లోనూ సర్వ సాధారణమే. వీటితోపాటు కండ్లు అనే అర్థాన్ని కూడా తీసుకుంటే నష్టం లేదు. సుదూర ప్రయాణం చేసేటపుడు అనవసర బరువులు ఎలా తగ్గించుకుంటామో, అలాగే మన భాషను సుదూర గమ్యాలకు చేర్చాలంటే కొంత సరళతరం చేసుకుంటే తప్పులేదని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. కుళ్ళు వాడాలంటే ళ ఉండాల్సిందే శ్రీకాంత్ చారి గారు.

      Delete
    2. Marathi speakers distinguish dental "l" and retroflex "l". What about those Telugu speakers who learn Marathi? If retroflex "l" is phased out from Telugu, it would lead them find difficulty in pronouncing "ळ" in Mararthi.

      Delete
    3. కొండలరావు గారు,

      ఇప్పటిదాకా అమలులో వున్న పధ్ధతులని యదతథంగా కొనసాగించాలని అంటే అన్నీ వుండాలనే అనిపిస్తుంది. మార్పు కోరితే మాత్రం కొత్తగా ఆలోచిస్తే తప్ప సాధ్యం కాదు. మార్పు వద్దనుకుంటే ఇక సమస్యే లేదు. మన పూర్వీకులు మార్పు కోరి వుండక పోతే తెలుగు నన్నయ కాలం దాటి బయటికి వచ్చి వుండేది కాదేమో! ఒక విధంగా మనకాన్నా పూర్వీకులే నయం అనిపిస్తోంది!

      >>> కుళ్ళు వాడాలంటే ళ ఉండాల్సిందే శ్రీకాంత్ చారి గారు.

      ఊరు కళగా వుందాలంటే మునసబు, కరణాలు వుండాల్సిందే కొండలరావు గారు అని నేనంటే మీకేమనిపించింది? ళ ఎందుకుండాలి అని ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకునే ముందు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పక్కకు పెట్టండి. అప్పుడూ తెలుస్తుంది.

      అలాగే మీరు ఇంకొదగ్గర మహా + ఋషి = మహర్షి అని చెప్పారు. సంధి కలిసినపుడు ఋ ర గా మారిందంటే, అవి రెందూ ఒకటనేగదా? అటువంటప్పుడు రుషి అనే పలకొచ్చుగా (మహా + రుషి + మహర్షి)? ఆలోచించండి. మూసలోనుండి బయటికి వస్తే కాని వీటికి సమాధానాలు రావు.

      Delete
    4. ప్రవీణ్ గారు,

      మనకు అవసరమా లేదా అని అలోచించుకోవాలి కాని, మరాఠీ నేర్చుకోవడానికి "ळ" కావాలి కాబట్టి మనం ళ పెట్టుకోవాలి అనడం ఏమిటి? ఇంగ్లీష్ లో F వుంది కాబట్టి మరి దానికి సమానమైన అక్షరం తెలుగులో లేదే? అలాగే రష్యన్‌లో "ж" అనే అక్షరం వుంది, దానిక్కూడా తెలుగులో సమానమైన అక్షరం లేదు.

      Delete
    5. కళ కు కల కు ఉచ్చారణలో స్పష్టమైన తేడా ఉన్నది కనుకనే ళ ల రెండు అక్షరాలు ఉండాల్సినదే. మార్పు అనివార్యం ఎందులోనైనా ఎవరాపినా బాధపడ్డా భావోద్వేగాలకు గురయినా పండితులయినా పామరులైనా ఎన్ని రణాలు ఆక్రోషనలు జరిగినా భాష కూడా పురోగమనం వైపే పయనిస్తుంది. అయితే అక్షరాలు తగ్గడం ఎక్కడం అనేది దానికి బేస్ కాదు. అవి అవసరమా? ఉచ్చారణలో తేడాలను సూచిస్తున్నాయా? అనేదానిని బట్టి ఉంటుంది. మారనిది మార్పు ఒక్కటే. మహర్షి గురించి మీరు పొరపడుతున్నారు. మహ+ఋషి=మహర్షి లో అర్ అనే శబ్ధం ఏకాదేశమై గుణసంధి కార్యం జరిగిందక్కడ. అంటే ఋ ఉచ్చారణ ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఋణము రైటు రునము లేదా రుణమూ తప్పు. కనుక ఇక్కడ ఋ ణ అనేవి రు లేదా న లకు బదులుగా వాడలేము. వాడకూడదు. వాటికి ఉచ్చారణ రీత్యా తేడా స్పష్టంగా ఉన్నది కనుక. అలా తేడా లేకుండా ఒకే ఉచ్చారణ కు అనవసరంగా రెండు అక్షరాలు వాడుతుంటే అలాంటివి తగ్గించవచ్చు. ఇవి మనం చర్చించవచ్చు. భాషా పండితులు సరిచేయవచ్చు. అసలు చర్చలే వద్దు మార్పులే వద్దనుకోవడం పొరపాటు. గతంలో ఏ మార్పూ జరగకుండానే ఈ స్తితి వచ్చిందా ? లేదే? ఇప్పటి స్తితి కూడా మరింత మెరుగైన రూపాన్ని సంతరించుకుంటుంది. అది అక్షరాలను పెంచుకునైనా కావచ్చు. తగ్గించుకోనైనా కావచ్చు. దీనికంటే ముందు జరగాల్సినది. తెలుగులో పదాల సంఖ్యను పెంచడం వాటిని మనమంతా పట్టుదలగా అందరిచేత వాడించడం చేయాలి.

      Delete
    6. కొండలరావు గారు,

      నేనిచ్చిన ఉదాహరణలు కేవలం విషయాన్ని వివరించడానికి మాత్రమే. ఇచ్చిన ఉదాహరణలు కూడా కేవలం వివరించడానికోసం మాత్రమే భావించాలి తప్ప వాటిపై సూక్ష్మ పరిశీలన అనవసరం. అలాగే ఏ అక్షరాలు వుంచాలి, ఏవి తీసెయ్యాలి అన్న విషయంలో మీ అభిప్రాయాలు కూదా అంతిమం కాకపోవచ్చు.

      ఏ అక్షరాలు తీసెయ్యాలి, ఏ అక్షరాలు వుంచాలి అన్నది భాషావేత్తలకు వదిలెయ్యాలి. అయితే ఆ భాషావేత్తలు కూడా మార్పును, పురోభివృద్ధిని కాంక్షించే వారై వుండాలి తప్ప చాదస్తులు కాకూడదు.

      సూక్ష్మ పరిశీలనలకు వెళ్ళకుండా స్థూలంగా చూసినపుడు, భాషను మరింత సరళతరం చేయవలసిన అవసరం వుంది. కొత్తపదాలను సృష్టించే విషయంలోనూ, భావ వ్యక్తీకరణలో మరింత స్పష్టత చేకూర్చే విషయంలోనూ భాషలో మరింత ఫ్లెక్సిబిలిటీని పెంచవలసిన విషయంలోనూ కృషి చేయవలసిన అవసరం వుంది.

      Delete
    7. నా అభిప్రాయాలు చెప్పే హక్కుతో మాత్రమే చెప్పాను తప్ప అధికారప్రకటన కాదది. నాకా అధికారమూ లేదు. నేను కేవలం తెలుగు భాష అభివృద్ధి కావాలనుకునేవాడిని మాత్రమే. మీరెందుకలా భావించారో తెలీదు. నావే కావండీ, భాషావేత్తలతో సహా ఎవరి అభిప్రాయాలూ శాశ్వతం కావు. మీరిచ్చిన ఉదాహరణలలో నాకు తెలిసిన లోపాలను మాత్రమే చెప్పాను. ఆ లోపాలు నేను భాషావేత్తల వద్ద నేర్చుకుని నిర్ధారించుకున్నవే తప్ప నేను కనిపెట్టినవి కావు. ఆచరణలో సులువుగా ఉంటూనే నియమ ఉల్లంఘన జరగనిది అయి ఉన్నది కొత్త నియమంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతుంది. ఇందుకు పండితులు - ప్రజలూ అందరూ చర్చలద్వారా ఉపయోగపడతారు. చర్చ అంటే నియమ నిర్ధారణ కాదు. నియమ నిర్ధారణకు ఓ అవకాశం మరియూ మార్గదర్శి మాత్రమే. నియమాలు భాషావేత్తలే చేసినా వారికి అన్ని చర్చలూ రిఫరెన్స్ గా ఉపయోగపడతాయి. ఎవరి చర్చనూ అడ్డుకోకూడదు. చర్చలో మేలైన సూచన సకారణంగా వివరించినప్పుడు ఆహ్వానించడం తెలియనిది ప్రశ్నించడం చేయాలి తప్ప వ్యక్తిగత భేషజాలు తప్పు. భాషా వేత్తలు చేసిన నియమాలు ప్రజల ఆచరణకు అంటే వాడుక భాషకు కాకున్నా గ్రాంధికానికైనా గతం కంటే మెరుగ్గా సులువుగా ఉంటేనే భాషాభివృద్ధి జరుగుతుంది. జరిగినట్లు లెక్క కూడా. సులువు - మెరుగు తేల్చేది భాషను వాడే, ఉపయోగించే ప్రజలే తప్ప పండితులు కాదు. అలాంటప్పుడు చర్చ కు నియమాల నిర్ధారణకు తేడాను గుర్తించాలి. చర్చ వేరు - నియమనిర్ధారణ వేరు. కనుక చర్చలో భాషను వాడే ఇష్టపడే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. నియమాలు మాత్రం భాషావేత్తలే చేస్తుంటారు. అవి ఎప్పటికప్పుడు అవసరం మేరకు వృద్ధినొందుతాయి.

      Delete
    8. మీరు "కుళ్ళు వాడాలంటే ళ ఉండాల్సిందే" అని నొక్కి చెప్పడం వల్ల అలా రాయవలసి వచ్చిందండీ. మీరు ధ్వనిలో స్వల్ప తేడా వున్నా అది వుండాల్సిందే అన్న భావంలో వున్నారు. నేను స్వల్ప తేడాలను పరిహరించాలి అంటాను. అది కేవలం ఉదాహరణ మాత్రమే, అలాంటివి అనేకం వున్నాయి. ఙ, ఞ లను సరిగా పలికే వారు చాలా తక్కువ. భావ ప్రకటనకు ఆ అవసరం కూడా లేదు. ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే వుండాలో లేదో ఒక నిర్ణయానికి రావచ్చు, అలా కాకుండా ఇవన్నీ ఉండాల్సిందే అని అనుకున్న తర్వాత ఎటువంటి పురోగతి వుండదు.

      Delete
    9. ప్రబంధ కాలంలో అద్భుతమైన ఛందస్సుతో అమోఘమైన పద్యాలు రాసేవారు. ఆ కాలంలో ఇప్పటి కవితలు కనీసం ఊహించి కూడా వుండరు. కవిత్వమంటే పద్యాలూ ఛందస్సూ "ఉండాల్సిందే" అనుకుని వుంటారు. కాని గురజాడ, శ్రీశ్రీ లాంటివారు కవిత్వాన్ని భూమార్గం పట్టించారు. ఇప్పుడు కవితం ఎన్ని మార్పులకు గురవుతుందో మనం చూస్తూనే వున్నాం.

      అలాగే మనం వర్తమానంలోంచి ఆలోచిస్తే ఇప్పుడున్నవి ఉండాలనే అనిపిస్తుంది. అందుకే వుందాలి, ఉండకూడదు అని కాక "ఎందుకు" అని ప్రశ్నించుకోవాలి.

      Delete
    10. ఇంకో విషయం. మనం ౙ, ౘ అనే అక్షరాలను పాఠ్య పుస్తకాలలోంచే తీసివేశాం. కాని ఆ శబ్దాలను ఇప్పటికీ పలుకుతున్నాం. జ కి, ౙ కి స్పష్టమైన తేడా వున్నా రెండింటికీ ఒకే అక్షరాన్ని వాడుతున్నాం. ఎందుకో వేరే చెప్పనవసరం లేదు, భాషని సరళీకరించడం కోసమే. అటువంటి మార్పులే మరిన్ని రావాలంటున్నాను. యాభై ఏళ్ళకింద ఏ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ అక్షరాలను పరిహరించారో, అదే స్పూర్తిని కొనసాగించాలని అంటున్నాను.

      Delete
    11. "ఢంకా"లో సున్నా స్వరం "ఙ"లాగ వినిపిస్తుంది, "పంచ"లో సున్నా స్వరం "ఞ"లాగ వినిపిస్తుంది. కనుక తెలుగు నుంచి "ఙ & ఞ"లని తొలిగించడం సాధ్యం కాదు. తెలుగు స్కూల్ పుస్తకాల్లోంచి "ఱ" తొలిగించారు కానీ కాలేజ్ పుస్తకాలలో ఇప్పటికీ అది వాడుతున్నారు.

      Delete
    12. >>> "ఢంకా"లో సున్నా స్వరం "ఙ"లాగ వినిపిస్తుంది, "పంచ"లో సున్నా స్వరం "ఞ"లాగ వినిపిస్తుంది. కనుక తెలుగు నుంచి "ఙ & ఞ"లని తొలిగించడం సాధ్యం కాదు.

      మీరన్నదేమిటో నాకు అర్థం కాలేదు. ఢంకా లో సున్నా ఙ లాగా వినిపిస్తే ఢఙకా అని రాయడంలేదు కదా. మరి దాని అవసరం ఏమొచ్చింది?

      Delete
    13. ఒడియాలో ఇప్పుడు కూడా అనుస్వరం స్థానంలో అక్షరాన్ని ఉపయోగిస్తారు. ఒరిస్సాలోని కంటాబంజి రైల్వే స్తేషన్ మీద పేరు "కణ్టాబఞ్జి" అని వ్రాసి ఉంటుంది. తెలుగువాళ్ళకి అనుస్వరం (సున్నా) వాడడం అలవాటు కనుక తెలుగువాళ్ళు ఆ ఊరి పేరుని "కంటాబంజి" అని వ్రాస్తారు.

      "క, ఖ, గ & ఘ" కంఠ్యములు (గొంతుతో పలికేవి). వాటికి ముందు కంఠ్య నాసిక్యం (గొంతు & ముక్కుతో పలికేది) అయిన "ఙ" వినిపిస్తుంది.

      "చ, ఛ, జ & ఝ" తాలవ్యములు (articulated with roof of the mouth). వాటికి ముందు తాలవ్య నాసిక్యం అయిన "ఞ" వినిపిస్తుంది.

      "ట, ఠ, డ & ఢ" మూర్ధన్యములు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి తిప్పి పలికేవి). వాటికి ముందు మూర్ధన్య నాసిక్యం అయిన "ణ" వినిపిస్తుంది.

      "త, థ, ద & ధ" దంత్యములు (నాలుక ముందు భాగాన్ని దంతాలకి తగిలించి పలికేవి). వాటికి ముందు దంత్య నాసిక్యం అయిన "న" వినిపిస్తుంది.

      "ప, ఫ, బ & భ" ఓష్ఠ్యములు (పెదవులతో పలికేవి). వాటికి ముందు ఓష్ఠ్య నాసిక్యం అయిన "మ" వినిపిస్తుంది.

      ఒడియావాళ్ళు వేరువేరు నాసిక్యములకి వేరువేరు అక్షరాలు ఉపయోగిస్తారు కనుక కొత్తగా ఒడియా నేర్చుకున్న ఒక non-native speaker "సఞ్జయ"ని "సమ్జయ" అని పలకడం జరగదు. అనుస్వరం (సున్నా) కాకుండా విడి అక్షరాలు వాడడం వల్ల కలిగే సౌకర్యం అది.

      Delete
    14. ఓ, ఇప్పుడు అర్థమయ్యింది. మీరు "ఢంక" కి బదులు "ఢఙ్క" అని కూడా రాయవచ్చని చెపుతున్నారు. నేను "ఢంక" అని అని వ్రాయగలిగినప్పుడు, దాన్నే తిరిగి వేరే రకంగా రాసే పద్ధతి అనవసరమూ, పైగా కన్‌ఫ్యూజింగ్ అంటున్నాను.

      Delete
    15. మరో విషయం. ఒరిస్సా వారు ఢఙ్క, బఞ్జి అని రాస్తున్నారు కాబట్టి వారికి అవి ముఖ్యం కావచ్చు. కాని తెలుగులో అలా రాయడం లేదు, కాబట్టి వాటికి ఇక్కడ ప్రాధాన్యత లేదు.

      Delete
    16. తెలుగువాళ్ళు "శ" కూడా పలకలేరు. అలాగని "శాసనసభ"ని "సాసనసభ" అని వ్రాయడం లేదు కదా. తమిళులు "శ్రీనివాసన్"ని "సీనివాసన్" అని పలుకుతారు కానీ వ్రాసేటప్పుడు "శ్రీనివాసన్" అనే వ్రాస్తారు.

      Delete
    17. >>> తెలుగువాళ్ళు "శ" కూడా పలకలేరు. అలాగని "శాసనసభ"ని "సాసనసభ" అని వ్రాయడం లేదు కదా.

      మీ వాక్యంలోనే సమాధానం కూడా వుంది. పలకలేని అక్షరాలను ఎందుకు గుదిబండలాగా మెడకు చుట్టుకోవడం అనే నా ప్రశ్న. ఫలానా సమస్యకు తమిళులు ఏం చేస్తున్నారు, ఒరిస్సా వారు ఏంచేస్తున్నారు, ఇంగ్లీషు వారు ఏం చేస్తున్నారు అన్నది criteria కాదు. మనం ఎలా మెరుగుపరచుకోవాలని మాత్రమే ఆలోచించాలి.

      Delete
    18. హిందీవాళ్ళు "శ, ష, స"లని వేరువేరుగా పలుకుతారు. మనం "శ" పలకలేకపోతే హిందీ నేర్చుకునేటప్పుడు సమస్య వస్తుంది కాబట్టి తెలుగు నుంచి "శ" తొలిగించాల్సిన అవసరం లేదు. "ఱ" హిందీలో గానీ సంస్కృతంలో గానీ ఉండదు కాబట్టి దాన్ని తెలుగు నుంచి తొలిగించారు. మరి సంస్కృతంలో ఇప్పటికీ వాడుతోన్న "ళ"ని కూడా తెలుగు నుంచి తొలిగించడం ఎలా సాధ్యం?

      Delete
    19. ప్రపంచంలోని అనేక భాషల్లో మనం పలకలేని అనేక అక్షరాలున్నాయి. అవి నేర్చుకోవడానికి అవసరం అనే కారణం చేత తెలుగులో అవసరం లేకపోయినా ఆ అక్షరాలు పెట్టుకోవడం జరగదు.

      ఒక వేళ మీ సిద్ధాంతమే సరియైనది అనుకుంటే, సంస్కృతంలో వున్న ఋ, ౠ, ఌ, ౡ లను ఎందుకు తీసివేశారు?

      Delete
    20. "ఋ, ౠ" తెలుగు పుస్తకాలలో ఇప్పటికీ ఉన్నాయి. "ఱ"ని స్కూల్ పుస్తకాల నుంచి తీసేసారు కానీ కాలేజ్ పుస్తకాలలో అది ఇప్పటికీ వాడుతున్నారు. నేను నా B.A. పరీక్షల్లో "మఱ్ఱిచెట్టు" అనే వ్రాసాను కానీ "మర్రిచెట్టు" అని వ్రాయలేదు.

      Delete
    21. ఇందియాలో day-to-day lifeలో ఎవడూ మాట్లాడని ఇంగ్లిష్‌ని medium of instructionగా స్కూల్ పుస్తకాలలో ఉపయోగించగా లేనిది ఇందియాలో ఎక్కువ మంది మాట్లాడే హిందీనీ, కొంత మంది మాట్లాడే సంస్కృతాన్నీ పిల్లలకి నేర్పిస్తే తప్పా?

      Delete
    22. >>> ఇందియాలో day-to-day lifeలో ఎవడూ మాట్లాడని ఇంగ్లిష్‌ని medium of instructionగా స్కూల్ పుస్తకాలలో ఉపయోగించగా లేనిది ఇందియాలో ఎక్కువ మంది మాట్లాడే హిందీనీ, కొంత మంది మాట్లాడే సంస్కృతాన్నీ పిల్లలకి నేర్పిస్తే తప్పా?

      ఇక్కడ చర్చ అది కాదు. తప్పా ఒప్పా అనేది ఆ చర్చ వచ్చినప్పుడు చర్చించొచ్చు.

      హిందీయో సంస్కృతమో నేర్పాలంటే ఆ భాష అక్షరాలే నేర్పాలి తప్ప వాటి అక్షరాలను తెలుగులోకి దిగుమతి చేసుకొని కాదు. మన భాషకు అవసరం అనుకుంటే తప్ప ఆ భాషలు నేర్చుకోవాలి కాబట్టి అక్షరాలను కొనసాగించాలనుకోవడం సరికాదు.

      Delete
    23. తెలుగులో "W"కి corresponding letter ఉండదు కాబట్టి తెలుగులో "W"కి కూడా "వ" ఉపయోగిస్తాం. ఇంగ్లిష్‌లో "ళ"కి corresponding letter ఉండదు కాబట్టి ఇంగ్లిష్‌లో "ళ"కి కూడా "L" ఉపయోగిస్తాం. తెలుగు లిపి బ్రాహ్మి లిపి నుంచి వచ్చింది కాబట్టి అన్ని సంస్కృత ధ్వనులకీ తెలుగులో corresponding letters ఉంటాయి. వాటిని ఎందుకు తొలిగించాలి? "ఱ" తమిళంలో ఉంటుంది కానీ ఉత్తరాది భాషలలో ఉండదు, కేవలం తమిళం కోసం "ఱ"ని తెలుగులో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని తెలుగు నుంచి తొలిగించారు. సంస్కృత ధ్వనులని అలా ఎలా తొలిగిస్తారు?

      Delete
    24. ఎందుకు తొలగించాలో ఇప్పటికే సమాధానం చెప్పాను. అనవసరమైన అక్షరాలను ఎందుకు తొలగించకూడదో పోనీ మీరు చెప్పండి. (ఇతర భాషలు నేర్చుకోవాడానికి అనే కారణం తప్ప)

      Delete
  7. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నది తెలుగు ఫోనాలజీ కాదు, సంస్కృత ఫోనాలజీ. ఒకప్పుడు తెలుగులో "ర" ధ్వని లేదు, "ఱ" ధ్వని ఉండేది. "చెఱువు" అనేది తెలుగు పదం కనుక అందులో "ఱ" ఉపయోగించేవాళ్ళు. "ఊరు" అనేది "పురం" అనే సంస్కృత పదం నుంచి వచ్చినది కనుక అందులో "ర" ఉపయోగించేవాళ్ళు. ఇంగ్లిష్‌లో "R" ధ్వని సంస్కృతంలోని "ర" ధ్వనిని పోలి ఉంటుంది కానీ తెలుగులోని "ఱ" ధ్వనిని కాదు. అందువల్ల తెలుగులోని ఇంగ్లిష్ పదాల్లో "ర" ఉపయోగిస్తారు కానీ "ఱ" కాదు. తెలుగుపై సంస్కృతం, ఇంగ్లిష్‌ల ప్రభావాలు పెరగడం వల్ల మనం ఇప్పుడు "ఱ" ఉపయోగించాల్సిన చోట కూడా "ర" ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు అందరూ "బఱ్ఱె"ని "బర్రె" అనే అంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారు,

      రకరకాల భాషల ప్రభావం వల్లనో, అప్పటి పండితులు ఆ అక్షరాలను తీసుకు రావడం వల్లనో తెలుగులో రకరకాల అక్షరాలు వచ్చి చేరాయి. అప్పుడు వారు పెట్టారు కదా అని మనం అనవసరంగా అవసరానికి మించి అక్షరాలను మోయవలసిన పని లేదు.

      కాకతీయుల కాలంలో "ధర్మ" అని రాయడానికి "ధమ౯" అని రాసే వారు. కాని ఇప్పుడు "౯" ఎవరూ వాడడం లేదు. ఇలా ఎన్నో అనవసరమైన అక్షరాలు కాల క్రమేణా తీసివేయ బడుతుంటాయి. అది అవసరం కూడా.

      Delete
    2. ఏదీ యధాతధంగా ఉండదు. నిరంతరం మారుతుంటుంది. మార్పుకు ముందు సంఘర్షణ అనివార్యం. అయితే మార్పు ద్వారా వచెచే కొత్తది పాతదానికంటే అభివృద్ధికరంగా ఉంటుంది. మారనిది మార్పు ఒక్కటే. ఎవరి ఇష్టాలకో , భావోద్వాగాలకో పరిమితమై మార్పు ఆగదు. మార్పు అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు ఉన్నత రూపం తీసుకుంటూ ప్రగతి పథంలో దూసుకు పోతుంది. అది భాష విషయంలోనూ అంతే. గతంలోని అనుభవాలూ అవే చెపుతున్నాయి.

      Delete
  8. "ఌ, ౡ"లు సంస్కృత ధ్వనులు అన్నారు కాబట్టి నేను నిజం చెప్పాను. మహాప్రాణములు (ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, శ, ష, స, హ) కూడా తెలుగు ధ్వనులు కావు. ఇవి సంస్కృత, ప్రాకృతాల నుంచి తెలుగులోకి వచ్చిన పదాల్లో మాత్రమే ఉంటాయి.

    ReplyDelete
  9. Indian English మాట్లాడేవాళ్ళు "W"ని "V"లాగ పలుకుతున్నారని ఇందియాలోని స్కూల్ పుస్తకాల నుంచి "W"ని తొలిగించగలమా? ఇందియాలో అందరూ "Wall"ని "Vall" అని పలుకుతారు. అలాగని ఇందియాలోని స్కూల్ పుస్తకాలలో స్పెలింగ్ అలా మార్చగలమా? "ళ" విషయంలోనే ఈ వివాదం ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. అంటే ళ, ల అక్షరాలను కూడా ఒకే లాగ పలుకుతారని ఒప్పుకుంటున్నారా?

      Delete
    2. అంటే ళ, ల అక్షరాలను కూడా ఒకే లాగ పలుకుతారని ఒప్పుకుంటున్నారా?
      >>
      అంటే ళ, ల అక్షరాలను కూడా ఒకే లాగ పలుకుతుండగా మీరెప్పుడయినా విన్నారా?!

      Delete
    3. >>> అంటే ళ, ల అక్షరాలను కూడా ఒకే లాగ పలుకుతుండగా మీరెప్పుడయినా విన్నారా?!

      అనేక సార్లు విన్నాను.


      మీకో చిన్న ప్రయోగం ఇస్తాను.
      "కాళీయ మర్థనం, కాలీయ మర్థనం" అని పది పది సార్లు పలుకుతూ రికార్డు చేయండి. మెల్లగానే సుమా, గబగబా పలక వలసిన అవసరం లేదు. తర్వాత దాన్ని ప్లే చేసుకుని వినండి. వీలైతే ఆ ఫైలుని "telangaanaa@gmail.com" కి మెయిల్ చెయ్యండి. మీరెలా పలికారో మేమూ నేర్చుకుంటాం.

      Delete
    4. ప్రయోగం చేసేదాకా యెక్కడ, కాలేయ మర్దనం లా అనిపించి దడుచుకుంటున్నా ఇక్కడ?!

      Delete
    5. అంటే చేతులెత్తారన్న మాట!

      Delete
    6. చిత్తూరు జిల్లాలో అందరూ "ళ"ని "ల"గానే పలుకుతారు. వాళ్ళు "కాళహస్తి"ని "కాలాస్త్రి" అంటారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి "కళ"ని "కల" అనేవాడు.

      Delete
  10. ఈ రెండు రాష్ట్రాల్లో హిందీ వచ్చినవాడు ఒక్కడు కూడా లేకపోతే "శ, ష"లని తెలుగు నుంచి తొలిగించొచ్చు. కానీ పరిస్థితి అలా లేదు కదా. తమిళంలో ఇప్పుడు కూడా "హైదరాబాద్"ని "హైతరాపాత్" అనే వ్రాస్తారు. మన తెలుగు లిపిని కూడా అలాగే క్లుప్తీకరిద్దామా?

    ReplyDelete
    Replies
    1. "హైతరాపాత్" లెవెల్ కి తీసుకు రానవసరం లేదు. కాని అనవసరమైన అక్షరాలు మాత్రం తీయాలని నా అభిప్రాయం.

      Delete
  11. Native language తప్ప ఏదీ రాని తమిళుల కోసమైతే మీ వాదన సరిపోతుంది. తమిళంలో 18 హల్లులు మాత్రమే ఉంటాయి, సంస్కృతంలో లేని "ఱ" లాంటి హల్లులతో సహా. అందుకే తమిళం నుండి హిందీ నేర్చుకోవడం కష్టం. ఆంధ్రా, తెలంగాణాల్లో హిందీ, సంస్కృతం నేర్చుకునేవాళ్ళు ఎక్కువే కనుక తెలుగు లిపిని కుదించడం సాధ్యం కాదు.

    ReplyDelete
    Replies
    1. >>> ఈ రెండు రాష్ట్రాల్లో హిందీ వచ్చినవాడు ఒక్కడు కూడా లేకపోతే "శ, ష"లని తెలుగు నుంచి తొలిగించొచ్చు.
      >>> Native language తప్ప ఏదీ రాని తమిళుల కోసమైతే మీ వాదన సరిపోతుంది.

      రెండో రాష్ట్రంలోనూ, తమిళనాడులోనూ హిందీ మాట్లాడగలిగిన వాళ్ళ సంఖ్యలో పెద్ద తేడా ఉండదనుకుంటానే! ఇక మొదటి రాష్ట్రంలోని వారు హిందీ నేర్చుకోవడానికి మాత్రం అక్షరాలు ఎన్నున్నాయన్న విషయంతో సంబంధం వుండదని చెప్పగలను. ఎందుకంటే అక్కడ అక్షరమ్ముక్క రానివాళ్ళు సహితం హిందీ మాట్లాడగలరు!

      Delete
    2. ఒక native Hindi speakerకి అక్షరం ముక్క రాకపోయినా అతను "శ" & "ష"లని వేరువేరు ధ్వనులతో పలకగలడు. మరి మీరు ఆ రెండిటినీ తొలిగించాలని అంటున్నారే. "మధ్య ప్రదేశ్ ప్రశాసన్"ని "మధ్య ప్రదేస్ ప్రసాసన్" అని ఒక native Hindi speaker ముందు అనండి చూద్దాం, విన్నవానికి తేడా తెలుసో లేదో అడగొచ్చు.

      తమిళ నాడుతో పోలిస్తే ఆంధ్రాలో హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువే. తమిళులు "ర"ని పదం మొదట్లో పలకలేరు. వాళ్ళు "రాజు"ని "అరాసు" అంటారు. ఆ ఫోనాలజీతో హిందీ మాట్లాడి "అరాజు" అని హిందీవాళ్ళ దగ్గర పలిక్తే హిందీవాళ్ళు విచిత్రంగా చూస్తారు. అందుకే తమిళనాడులో ఎవరూ హిందీ మాట్లాడరు. మా శ్రీకాకుళం జిల్లాలో రాయ్‌పుర్, భిలాయి వెళ్ళి వచ్చినవాళ్ళు మాత్రమే హిందీ మాట్లాడుతారు. వాళ్ళకి చదువు వచ్చినా, రాకపోయినా పెద్ద తేడా రాదు.

      Delete
    3. >>> మరి మీరు ఆ రెండిటినీ తొలిగించాలని అంటున్నారే.

      నేను రెండింటినీ తొలగించాలని ఎక్కడ అన్నాను? నిజానికి నా పోస్టులో ఒక్క అక్షరాన్ని కూడా ఉదహరించలేదు.

      ల, ళ ల మధ్య పలకడంలో తేడా లేదని మీరే ఒకచోట ఒప్పుకున్నారు. అప్పుడు రెండిటి అవసరం ఏముంది?

      స, శ, ష ల లో ఎంత పలికినా రెండు శబ్దాలే వస్తాయి తప్ప మూడు రావు. అటువంటప్పుడు మూడోది అనవసరం.

      ఋ, ఱు, రు ఈ మూడింటిని మూడు రకాలుగా పలకడం మామూలుగా అసాధ్యం.

      Delete
    4. హిందీవాళ్ళు "ఖ" పలికేటప్పుడు గాలి బలంగా ఊదుతారు. తెలుగువాళ్ళు అలా ఊదరు. అందుకే తెలుగువాళ్ళకి "క" & "ఖ" ఒకేలా వినిపిస్తాయి. "శ" పలికేటప్పుడు dorsum (నాలుక వెనుకభాగం)ని hard palate (roof of the mouth) వైపు నొక్కుతారు. "ష" పలికేటప్పుడు నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచుతారు. Retroflexion అంటేనే వెనక్కి వంచడం అని అర్థం. అందుకే హిందీవాళ్ళు పలికే "ష"ని ఆంగ్లేయులు retroflex consonant అంటారు. ఆంగ్లంలో post-alveolar fricative అయిన "sh" ఉంటుంది. ఆంగ్లంలో retroflex consonants ఉండవు కనుక ఆంగ్లేయులు సంస్కృత పదాలని ఆంగ్లంలో వ్రాసేటప్పుడు "ష"కి counterpartగా "sh" ఉపయోగిస్తారు. మీరు తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండే హైదరాబాదీ ఉర్దూ మాట్లాడి, మీ ప్రాంతంలో అక్షరం ముక్క రానివాడు కూడా హిందీ మాట్లాడుతాడని చెప్పుకుంటే ఎలా? నేను కె.సి.ఆర్. యాస స్వయంగా విన్నాను. అతను "శ" ఉపయోగించాల్సిన ప్రతి చోటా "స" ఉపయోగిస్తాడు. కోస్తా ఆంధ్రలో కూడా చాలా మంది "శ" పలకలేరు. Native accent మాట్లాడుతూ దానికి ఒక non-native language అయిన హిందీ పేరు చెప్పుకోవడం ఎందుకు?

      Delete
    5. "ఱ" తమిళ ధ్వని, "ర" సంస్కృత ధ్వని. తమిళులు "ర"ని పదం మధ్యలో పలకగలరు కానీ పదం మొదట్లో పలకలేరు. హిందీవాళ్ళు "ఱ" పలకలేరు. తెలుగులో "ఱ" "ర"గా మారి కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. తెలుగు నుంచి "ఱ" తొలిగించినది అందువల్లే. మీరు వేర్వేరు భాషలకి చెందిన వేర్వేరు ధ్వనుల మధ్య పోలిక పెడుతున్నారే.

      "ళ"ని పంజాబీ, ఒడియా, మరాఠీ భాషల్లో ఇప్పటికీ వాడుతున్నారు. అదేమీ "ఱ"లాగ archaic phoneme కాదు. తమిళ, మలయాల భాషల్లో "ల"ని మూడు రకాలుగా పలుకుతారు. పంజాబీ, ఒడియా, మరాఠీ, తెలుగు, కన్నడలలో రెండు "ల"కారాలే ఉంటాయి. అయినా ప్రస్తుతం వాడుకలో ఉన్న phonemesకి archaic phonemesతో పోలిక పెట్టడం అనవసరం.

      Delete
    6. >>> మీరు తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండే హైదరాబాదీ ఉర్దూ మాట్లాడి, మీ ప్రాంతంలో అక్షరం ముక్క రానివాడు కూడా హిందీ మాట్లాడుతాడని చెప్పుకుంటే ఎలా?

      మీరే కదా తెలుగువాళ్ళు హిందీ మాట్లాడుతారు, తమిళులు మాట్లాడరని వాకృచ్చింది? దానికేమంటారు? హిందీ మాట్లాడం కాబట్టి ఆ అక్షరాలు తీసెయ్యొచ్చా?

      >>> అందుకే తెలుగువాళ్ళకి "క" & "ఖ" ఒకేలా వినిపిస్తాయి.
      >>> తెలుగు నుంచి "ఱ" తొలిగించినది అందువల్లే.
      >>> నేను కె.సి.ఆర్. యాస స్వయంగా విన్నాను. అతను "శ" ఉపయోగించాల్సిన ప్రతి చోటా "స" ఉపయోగిస్తాడు.
      >>> కోస్తా ఆంధ్రలో కూడా చాలా మంది "శ" పలకలేరు.

      మీరు మీకు తెలిసిన విషయాలను తెచ్చి డంప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది తప్ప ఒక వాదనకు కట్టుబడి వినిపిస్తున్నట్టు కనిపించడం లేదు. కొన్ని అక్షరాలు మనవాళ్ళు పలకడం లేదు అని మీరే అంటున్నారు. మళ్ళీ అన్నీ వుండాలని మీరే అంటున్నారు.

      >>> "ళ"ని పంజాబీ, ఒడియా, మరాఠీ భాషల్లో ఇప్పటికీ వాడుతున్నారు.
      >>> హిందీవాళ్ళు "ఖ" పలికేటప్పుడు గాలి బలంగా ఊదుతారు.
      >>> అందుకే హిందీవాళ్ళు పలికే "ష"ని ఆంగ్లేయులు రెత్రొఫ్లెక్ష్ చొన్సొనంత్ అంటారు.
      >>> "ఱ" తమిళ ధ్వని, "ర" సంస్కృత ధ్వని.

      ఈ విషయాలు ఇక్కడ పూర్తిగా అనవసరం. మన పలుకుబడికి, మన భాషకు ఏమి అవసరం అని ఆలోచించాలి తప్ప, వికీపీడియానుంచి విడి విడి విషయాలను ఏరుకొని చూడ్డం వల్ల ఉపయోగం వుండదు.

      Delete
    7. కేవలం వికీపీదియా చదివితే phonetics అర్థం కావు. నేను చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ వెళ్ళి native Hindi speakers యాస స్వయంగా విన్నాను. నేను అదే యాసతో హిందీ మాట్లాడగలను కూడా. నేను native English speakers యాస వినలేదు కానీ లైబ్రరీలో phonologyకి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళ యాస ఎలా ఉంటుందో తెలిసింది. అంతే కానీ వికీపీదియా నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం నాకులేదు.

      నిజాం పాలన వల్ల 1766 నుంచి 1948 వరకు తెలంగాణా, కోస్తా ఆంధ్రల మధ్య పెద్ద సంపర్కం లేదు. అందుకే తెలంగాణా, ఆంధ్రా యాసల మధ్య తేడా కనిపిస్తుంది. ఈ నిజం ఒప్పుకోవడానికి సంకోచం అవసరమా?

      Delete
  12. తమిళ లిపిలో "పువ్వు" అని రాయాలంటే "పవువవవు" అని రాయాలి.మనం పువ్వు అనేదాన్ని వళ్ళు పూ అంటారు నాకు తెలుసు,కానీ నిక్కచ్చిగా నేను "అడా పావియా" అన్నట్టు "పువ్వు" అనే మాటని మాత్రం తమిళంలో అలాగే రాయాలి:-)

    ReplyDelete
  13. ఉర్దూలో "ళ" ఉండదు. నిజాం ప్రజలపై రుద్దిన ఉర్దూ మీదియం విద్య వల్ల తెలంగాణలో చదువుకున్నవాళ్ళు కూడా "ళ" పలకలేకపోతున్నారని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. మా శ్రీకాకుళం జిల్లాలో పట్టణ ప్రాంతాలవాళ్ళు మాత్రమే "ళ" పలుకుతారు, సంస్కృత వాసన వల్ల.

    ReplyDelete
    Replies
    1. >>> మా శ్రీకాకుళం జిల్లాలో పట్టణ ప్రాంతాలవాళ్ళు మాత్రమే "ళ" పలుకుతారు, సంస్కృత వాసన వల్ల.

      నిజాం ప్రజలు సరే, మరి మీ శ్రీకాకుళంలోని పల్లెటూరి వారు ఏ వాసన వల్ల 'ళ' పలకలేక పోతున్నారు? Just తెలుసుకుందామని అడిగాను.

      Delete
  14. ఇన్నేళ్ళ బ్లాగు సహవాసములో మనిద్దరికీ కూడా ఏకాభిప్రాయమున్న అంశాలున్నాయంటే చాలా ఆశ్చర్యముగా ఉంది!

    ఇప్పటికే తెలుగులో చేరి, జనాల నోళ్ళలో నానుతున్న పదాలను ఏమీ చెయ్యలేము. అసలు చెయ్యవలసిన అవసరమూ లేదు. ఐతే ఇకపై తయారు చేసే ప్రతీ పదాన్నీ తెలుగు ఆధారంగానే తయారు చెయ్యాలి. అప్పుడే తెలుగులో ఏమన్నా తెలుగు మిగిలేది. తెలుగు ఆధారంగా పదాలను తయారు చెయ్యటం కష్టమన్న వాదన కేవలం తెలుగువారి బద్ధకం.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నాకూ అలాగే వుంది సార్!ప్రవీణ్ వాదన చాలా అధ్బుతంగా వుంది సుమా?

      Delete
  15. ఇక్కడ ళ పలకడం రానివాళ్ళందరినీ, పిల్లజమీందార్ సినిమాలో ఎమ్మెస్ నారాయణ లాంటి తెలుగు ఉపాధ్యాయుడి దగ్గరకు పంపిస్తే సరి.
    :-)

    ReplyDelete
  16. వైద్య చికిత్సకు రకరకాల మార్గాలుంటాయి. ఆ విషయం వారే చెప్పారు. చికిత్స కేవలం డాక్టర్లే చెయ్యరు, ఫిజియోలు, నర్సులు కూడా అందులో భాగస్వాములే.
    --------------------------------------------
    ఇండియాలో సంగతి నాకు తెలియదు గానీ అమెరికాలో డాక్టర్ ఆర్డర్ చెయ్యందే మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏమీ చెయ్యటానికి వీల్లేదు. కనీసం మందులు కూడా కొనుక్కో లేము. అందుకని మీ వాదన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ వర్తించాలంటే కొంచెం మార్చండి.

    ReplyDelete
    Replies
    1. డాక్టరుదే చివరి నిర్ణయమైనా ట్రీట్మెంట్ డిస్కషన్లు అమెరికాలో కూడా వుంటాయనుకుంటా. ఈ లింకులు చూడండి.

      http://depts.washington.edu/oncotalk/learn/modules/Modules_05.pdf
      http://courseweb.edteched.uottawa.ca/nsg6533/gafchepa.pdf

      Delete
    2. డాక్టర్ వెళ్ళి "ఈ పేషంట్ కి చికిత్స ఏమి చేద్దామని" ప్రపంచములో ఎక్కడా నర్సు ని అడగరు. మీరు అదికాదు అంటే నేను చెప్పేది ఏమీ లేదు.

      Delete
    3. >>> డాక్టర్ వెళ్ళి "ఈ పేషంట్ కి చికిత్స ఏమి చేద్దామని" ప్రపంచములో ఎక్కడా నర్సు ని అడగరు.

      ఒప్పుకుంటానండీ. కాని అవసరమైన చికిత్స చేసేందుకు కావాలసిన పరికరాలు ఆస్పత్రిలో వున్నాయా లేవా అన్న సంగతి కూడా చర్చించ కూడదా? అన్ని వివరాలూ డాక్టరుకు తెలిసి వుండాల్సిన అవసరం లేదు కదా?

      Delete
  17. కామెంట్లన్నీ పరిశీలించిన తర్వాత నా అభిప్రాయాలు మరోసారి స్పష్టంగా చెప్పాలని అనిపించింది. ఈ పోస్టు వెలిబుచ్చుతున్న భావాలు ఇవి.

    1. భాషపై భాషావేత్తలే కాదు, భాషను వాడే సామాన్యులు కూడా చర్చించ వచ్చు.
    2. భాషను ఇలాగే వుంచితే రోజు రోజుకీ దిగజారి పోతుందన్నది మనం చూస్తున్న వాస్తవం.
    3. భాషలో నిర్మాణాత్మకమైన మార్పులు తేకుండా కేవలం మానవ పట్టుదలపై ఆధారపడి భాష అభివృద్ధి చెందదు.
    4. పదాల వృద్ధికి సంస్కృతం పై ఆధారపడి తెలుగు భాషను అభివృద్ధి చెందించలేం. అందుకు కావలసిన వెసులుబాట్లను తెలుగులోనే సృష్టించు కోవాలి.
    5. గుడ్డిగా అన్ని అక్షరాలూ ఉండాలని పంతం పట్టకుండా ఏవి అవసరం, ఏవి అనవసరం అన్న చర్చ జరగాలి.
    6. భాష నా తల్లి అని ఎవైనా అనుకుంటే తప్పులేదు కాని తల్లిలో ఏ మార్పులు కోరం కాబట్టి భాషలో కూడా ఎలాంటి మార్పులు చేయకూడదు, కనీసం ప్రయత్నించ కూడదు అన్న మొండి వాదన పనికి రాదు.

    వీటిపై భవిష్యత్తులో వివరంగా మరొక పోస్టు రాయడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  18. మిత్రులు శ్రీకాంత్ చారిగారికి నమస్కారాలు!

    పైన జరిగిన చర్చ అంతా చదివాను. చివరన ఇచ్చిన మీ అభిప్రాయాలు "వ్యావహారిక భాష"కు వర్తిస్తాయి గానీ "గ్రాంథిక భాష"కు వర్తించవు. వ్యాకరణ బద్ధమైన శబ్దస్వరూపాన్ని మన ఇష్టానుసారం మార్చడం వ్యావహారికంలో కుదిరినా, గ్రాంథికంలో కుదురనిపని. అలా చేస్తే శబ్ద సౌష్ఠవం మారి అర్థానికి విఘాతం ఏర్పడుతుంది. కాలానుగుణంగా మార్పురావాల్సిందేననే వాదం వ్యాకరణానికి కట్టుబడి వుండేంతవరకే నిలుస్తుంది. వ్యాకరణానికి కట్టుబడనట్లయితే అది వ్యావహారికానికి తప్ప గ్రాంథికానికి పనికిరాదు. అంతేకాక, పదాలకు నిర్దిష్ట, నిర్దుష్ట స్వరూపాలు ఉండడంవల్లనే నిఘంటువులో పదాలకు అర్థాలు తెలుసుకోవడం సులభతరమవుతోంది. ఇది ఏ భాషకైనా వర్తిస్తుంది. ఉదాహరణకి...colour, color అనే పదాలలో మొదటిదానికి ఉన్న సమగ్రత రెండవదానికి లేదు. అలాగే ఉచ్చారణకు దగ్గరగా ఉన్నదని దానిని kalar అనిగానీ, kolor అనిగానీ రాస్తానంటే కుదురని పనికదా! కాబట్టి మీరనే మార్పు వ్యావహారికం వరకే అంగీకరించి, గ్రాంథికానికి వ్యాకరణబద్ధతకు వ్యాఘాతం కలుగనంతవరకే మార్పును అంగీకరిస్తే సరిపోతుంది. భాషలో చాలా మార్పులొచ్చాయని మీరు వాదించినా...అది వ్యావహారికం వరకే గానీ, ఆదినుంచీ ఇప్పటివరకూ ఉన్న గ్రాంథిక భాషకు ఏ మార్పూ రాలేదు. భాషాప్రయోగ విషయంలో సాధురూపాలు తెలియనివారు ప్రయోగించినంతమాత్రాన భాషలో మార్పువచ్చినట్లుకాదు. అసాధురూపాలు కావ్యానికి పనికిరావు. వ్యవహారానికి పనికివస్తాయి. భాష మన సంస్కృతికి నిలువుటద్దం వంటిది. అది నిర్దుష్టంగా వుండాలే తప్ప, దుష్టంగా వుండకూడదు.

    మరో విషయం...తెలుగుభాషను అభివృద్ధిచెందించడం అంటే మీ ఉద్దేశం గ్రాంథిక తెలుగునా, వ్యావహారిక తెలుగునా? గ్రాంథికతెలుగు మనం వృద్ధిపొందించడానికి ముందే వృద్ధిపొంది ఒక నిర్దిష్ట, నిర్దుష్ట రూపాన్ని సంతరించుకొను వున్నది. దాన్ని మనం వృద్ధిపొందించనవసరంలేదు. అయితే భాషను వృద్ధిపొందించాలనుకుంటే వ్యావహారిక పదకోశాలను తయారుచేసుకోవాలి. గ్రాంథిక పదకోశాలను తయారుచేసుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అవి ఇప్పటికే తయారుచేయబడి మనకు ఉపయోగంలో వున్నాయి. మనం చేసే భాషా వృద్ధి మన ప్రయోగానికి తగిన భాషలేనప్పుడే కావాల్సివస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న భాష పత్రికాభాష, పుస్తకభాషలకు మార్పుచేయాల్సినంత అవసరాన్ని కలిగిస్తున్నదా, లేదా? అన్నది మనం ఆలోచించాలి. అయితే ఎన్ని మార్పులు చేసినా పదం యొక్క అసలు స్వరూపం కూడా తెలిసివుండాలి...తెలియబడాలి. కాబట్టి విద్యార్థులు చిన్నతనంలోనే అక్షరమాలలోని అన్ని అక్షరాలనూ నేర్చుకోవాల్సిన అవసరం వుంది. వాళ్లల్లో కొందరు పద్యకవులు కావచ్చు, భాషావేత్తలు కావచ్చు, గ్రాంథికభాషావాదులు కావచ్చు. భాషపై సమగ్ర పరిశోధనచేసే అవసరం రావాల్సినవారుకావచ్చు. మొదలే మనం వాళ్ళకు నేర్పాల్సిన భాషాక్షరాలను నేర్పకపోతే...ఇవన్నీ వారు పొందలేరు. కాబట్టి అక్షరమాలలోని 57 అక్షరాల్నీ వాళ్ళు నేర్చితీరాల్సిందే. చిన్నతనంలో నేర్చితేనే పెద్దయింతర్వాత దానిపై వాళ్ళు సరైన అవగాహన ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన అభిప్రాయాల్ని చిన్నవారైన పసిబాలకులపై రుద్ది వాళ్ళు సరైన అక్షరమాలను నేర్చుకొనేవీలును దూరం చేయరాదనేది నా అభిప్రాయం.

    భాషలో ఏ మార్పయినా వచ్చిందంటే అది వ్యావహారికభాషలోనేగానీ, గ్రాంథికంలో మాత్రం రాలేదు. వచ్చినా అతిస్వల్పం మాత్రమే. అవికూడా "పొంటె"లాంటి వ్యావహారికాలే తప్ప గ్రాంథికాలుకావు. వ్యాకరణబద్ధమైన భాషకు మార్పురాదు, రాబోదు. వ్యావహారికం నిత్యం మారుతూనేవుంటుంది. దానికోసం మనలాంటివాళ్ళు వాదించాల్సిన అవసరంలేదు. ఇప్పుడున్న సారస్వతంలో దేన్ని ఆదరించేవాళ్ళు దాన్ని ఆదరిస్తారు. కాబట్టి గ్రాంథిక సంబంధమైన పదప్రయోగాల్లో మార్పు తేవాలనుకోవడం పనికిరానిపని. వ్యావహారికం నదీప్రవాహంలాంటిది. కొత్తపదాలు వస్తుంటాయి...పాతపదాలు పోతుంటాయి. గ్రాంథికం అలాకాదు. కాబట్టి విద్యార్థులు అన్ని అక్షరాలూ నేర్చుకొనితీరాలి. కాదు కొన్ని అక్షరాలు నేర్చుకుంటే చాలు అనడం భాషకు విఘాతాన్ని కలిగించడమే. మన తాతలు, తండ్రులు నేర్చుకున్నారు. మనమూ నేర్చుకున్నాం. మరి..మన పిల్లలు నేర్చుకోవద్దా? మనం భాషా శాసకులం కాముకదా! ఏ మార్పయినా వ్యావహారికానికే పరిమితం...గ్రాంథికానికి మార్పు అంటదు. మన పిల్లలూ మనలాగే వ్యావహారికంతోపాటు గ్రాంథికాన్నికూడా నేర్చుకునే అవకాశాన్ని మనం కలిగించాలి. మన సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీనాధునిక కావ్యప్రపంచాన్ని వారికి అందుబాటులోకి తేవాలి. ఇది నా అభిప్రాయంకాదు. పిల్లల అభివృద్ధిని కోరుకొనే ప్రతివ్యక్తీ ఏర్పరచుకొనే అభిప్రాయం. చిన్నప్పుడు అర్థంకాని పద్యాల్ని వల్లెవేసిన మనం ఇప్పుడు ఆ పద్యాల్ని గుర్తుకు తెచ్చుకుని అందులోని సారాన్ని మన నిత్యజీవితంలో వాడుకొనడంలేదా? అలాగే మన పిల్లలుకూడానూ! ఇందులో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. ఎవరినీ కించపరచాల్సిన అవసరంలేదు. మార్పు రావాల్సింది ఎందులోనో స్పష్టంగా తెలిస్తే చాలు!

    స్వస్తి

    జై తెలంగాణ!

    భవదీయ మిత్రుడు
    గుండు మధుసూదన్

    ReplyDelete
    Replies
    1. మధుసూధన్ గారు,

      మీ సుదీర్ఘమైన వివరణకు ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు గమనికలో వుంచుకుంటాను.

      ఇక పోతే గ్రాంధికంలో నేను ఎలాంటి మార్పులు కోరడం లేదు. కాని గ్రాంధికానికి, వ్యావహారానికి మధ్య శిష్ట వ్యావహారికం అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆంగ్లంలో ఎంతో అభివృద్ధి చెందిన వైఙ్ఞానిక శాస్త్రాలను తెలుగీకరించాలన్నా, అందుకు సంబంధించిన పద సముదాయాన్ని, సరళతను, సాగుతత్వాన్ని (Flexibility) సాధించాలన్నా మనకు శిష్ట వ్యావహారికం మాత్రమే ఉపయోగపడుతుంది. కాని దురదృష్టవశాత్తు ఆ శిష్టవ్యావహారికం కూడా అందుకు తగ్గ పూర్తి సౌలభ్యాలను కలిగి లేదు. దాని పరిణామమే "పౌనఃపున్యము", "రశ్మ్యుద్గారత" వంటి కొరుకుడుపడని పదబంధాలు.

      దురదృష్ట వశాత్తు పైన జరిగిన చర్చలో నేనన్న అనవసరమైన అక్షరాల పాయింటు పైనే వ్యాఖ్యానించారు. నా దృష్టిలో అది అంత ముఖ్యమూ కాదు, నేను అనవసరమైనవి అనుకున్న అక్షరాలు కూడా అంత ఎక్కువా కాదు. అసలు ఏ అక్షరాలు తీసివేయాలో నేను చెప్పనే లేదు, కేవలం చర్చ జరగాలన్నాను అంతే.

      నా అసలు కోరిక తెలుగు కూడా కావలసిన ఆధునికతను, సమృద్ధిని సంతరించుకుని విఙ్ఞాన భండాగారం కావాలనే. మన భవిష్యత్తు తరాలు విఙ్ఞాన శాస్త్రాలు, టెక్నాలజీ నేర్చుకోవడానికి ఆంగ్లం పైన ఆధారపడకూడదనే. అలా కాక తెలుగును ఇప్పుడు వాడుతున్నట్టు కేవలం కథలకు, పత్రికలకు, పాటలకు, పద్యాలకు వాడాలంటే ఎలాంటి మార్పులు అవసరం లేదు.

      Delete
  19. మిత్రులు శ్రీకాంత్ చారిగారికి,

    మీ ఆశయం నాకర్థమయింది. అయితే మీరన్నట్లు శిష్టవ్యావహారికంలోనే మనం ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటున్నాం. విజ్ఞాన శాస్త్రాలకూ, సాంకేతికశాస్త్రాలకూ సరిపోయే పారిభాషికపదాల అవసరం ఈ కాలంలో చాలా వుంది. దానికి సంస్కృతభాషే ఆధారం. మీరు పైన చెప్పినట్లు రశ్మ్యుద్గారత, పౌనఃపున్యం వంటి పదాలు...కఠినమైనవైనా...ఎంతో గొప్పదైన, చాలా పదాలతో వివరింపదగిన అర్థాన్ని ఇముడ్చుకున్న ప్రభావవంతమైన సమాసాలు! ఎంతో గొప్పభావాన్ని నింపుకొన్న ఇలాంటి సమాసాల రూపకల్పన చేసిన మన పూర్వులు అభినందనీయులు. ఇలాంటి పదాలకు మనం పారిభాషికపదకోశాలను తయారుచేసుకోవాలే తప్ప, సరళంగా వుండాలనడం సబబుకాదు. ఇలాంటి పారిభాషిక పదాలను సిద్ధపరచడానికి అనువైనట్లుండడం సంస్కృతభాష గొప్పతనం. దానిని సర్వదా మనం ఆహ్వానించాలి.

    పుస్తకములందు విద్యార్థులకై ప్రారంభమునుండి సరళ గ్రాంథికమునుఁ బరిచయము చేయుట వలన నిటువంటి కఠినమగు పారిభాషికపదములనుఁ జూచి భయపడవలసిన బాధ తప్పఁగలదుకదా!(ఇదే సరళగ్రాంథికం!)

    తెలుగు వర్ణమాలనుండి కొన్ని వర్ణాలను తొలగించాలనడం తగదు. ఒక్క అక్షరమును కూడా తొలగించవద్దు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రయోజనముంటుంది. ఈ విషయం తెలియని తెలుగు పాఠ్యపుస్తక రచయితలు ప్రాథమిక తరగతుల పుస్తకాలలో కొన్ని అక్షరాల్ని తొలగించడం దురదృష్టకరం. ఇక ముందైనా మన భాషలోని అన్ని అక్షరాల్ని విద్యార్థులకు నేర్పేలా ప్రణాళికలుండాలని ఆశిద్దాం.

    స్వస్తి.

    ReplyDelete
  20. "ೞ" (శాసన "ళ")ని తెలుగు నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం తొలిగించారు. "ೞ" ఇప్పుడు "డ" లేదా "ర"గా పలకబడుతోంది. అయినా దీన్ని తెలుగు యూనికోద్‌లో చేర్చారు. నేను ఉన్న అక్షరాలని తొలిగించొద్దన్నాను కానీ కొత్త అక్షరాలని చేర్చమనలేదు కదా.

    ReplyDelete
  21. శ్రీకాంత్ చారి గారూ,
    తెలుగు భాషని ఆధునికం చెయ్యాలనే మీ ఉద్దేశం మంచిదే.నాకు కూడా అతిగా సంస్కృతంతోనూ ఇంగ్లీషుతోనూ అంటకాగడం నుంచి విదగొట్టేసి అసలైన అచ్చ తెలుగు యెలా వుంటుందో తెలుసుకోవాలనే మోజు ఒకటి వుంది.గుండు మధుసూదన్ గారు చాలా మంచి విషయం చెప్పారు.తెలుగులో గ్రాంధికం వ్యవహారికం రెండూ వున్నాయి(మళ్ళీ ఇందులో రెండు రకాలు శిష్ట వ్యావహారికం శుధ్ధ వ్యావహారికం ), వుండాలి.ఆయన చెప్పినట్టు మనం నేర్చుకున్నవి మన పిల్లలు కూడా నేర్చుకోవాలి!ఆసక్తి లేక వాళ్ళు వొదిలేస్తే మనం చెయ్యగలిగింది లేదు కానీ అసలు పరిచయం చెయ్యటం మన బాధ్యత.

    ఆ అన్ని విభాగాల్లో ఇప్పటికే వాడి వుండతం వల్ల వర్ణమాలలో అక్షరాల్ని తగ్గించడం కుదరక పోవచ్చు.అవి లేకుండా కూడా భావ ప్రకటన చెయ్యగలిగిన వాళ్ళకి అవి అక్కడ వున్నా నష్టం లేదు కదా?ఆలోచించండి!

    ఇక మీరు నాకు ఒక పరీక్ష పెట్టారు.అందులో కొంచెం గందరగోళం వుండటం వల్లనే వెనక్కి తగ్గాను.మీరు నేను చేతులెత్తేసి వెనక్కి తగ్గాననుకున్నారు.మొదట్లో నా ఇబ్బంది నాకూ స్పష్టంగా తెలియలేదు.ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి విపులంగా చెప్తున్నాను.మీరు "ళ","ల" అనే అక్షరాలు ఒక్కలాగే పలికేచోట యేదో ఒకటి వాడినా ఫరవా లేదు అనే వాదనకి దాన్ని వుపయోగించాలనుకున్నారు,అవునా?కానీ కాళియుడు అనేది ఒక వ్యక్తి లేక ఒక కావ్యం లోని పాత్ర పేరు.దాన్ని కాలియుడు అని వుచ్చరిస్తే అది తప్పుగా పలకటం అవుతుందే తప్ప మీ వాదనని సమర్ధించే అవకాశం లేదు!సరి చేసుకోవలసిన తప్పుని అది పలకదానికి సంబంధించిన పోలికగా యెలా తీసుకుంటాం?!

    మిమ్మల్ని సరి చూసుకోమనే సూచన తప్ప విమర్శించడానికి కాదు నేనిది చెప్పటం.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు,

      మనందరి ఆశయం దాదాపు ఒకటే అయినా, వేరు వేరు దృక్పథాలతో వాదిస్తుంటాం. మన వాదనలన్నీ ప్రహరీకి చెందిన ఒక్కో గోడ అనుకుంటే వాస్తవం ఈ గోడలలోనే ఎక్కడో ఒకచోట వుంటుంది తప్ప వాటి వెలుపల కాదని నా విశ్వాసం.

      శ్యామలీయం గారి తెలుగు వ్యాకరణం బ్లాగు చూశాక, సంబంధిత అధ్యాయం చిన్నయసూరి బాలవ్యాకరణంలో కోడా చదివాక నాక్కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు అనించింది. తెలుగు లిపి వేరు, వర్ణమాల వేరు. తెలుగు లిపి లోనే సంస్కృత వర్ణమాలకు 50 అక్షరాలు, ప్రాకృతానికి 40, తెలుగుకు 36 మాత్రమే వున్నాయి. అన్నీ కలగలిపి 56 అక్షరాలుగా తేల్చేశారు.

      ప్రవీణ్ గారు చెప్తున్న "ೞ" (శాసన "ళ") తో సహా, ప్రతి అక్షరాన్ని మన లిపిలో వుంచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని అన్నీ LKG నుండే నేర్పాలని నేను ఇప్పటికీ అనుకోవడం లేదు. అలా చేస్తే ఉఛ్ఛారణ విషయంలో వారు తికమక పడే అవకాశం వుంది. గందరగోళం ఎంత తగ్గితే నేర్చుకోవడం అంత సుళువని నా ఉద్దేశం.

      రోజువారీ ఉపయోగంలో వుండే ఎంట్రీ లెవెల్ వర్ణమాల ఒకటి, భాషను అధ్యయనం చేసే వారికి పూర్తి స్థాయి వర్ణమాలను, ఇలా చేసుకోవచ్చనుకుంటాను.

      Delete
  22. "ೞ"ని తెలుగు నుంచి తొలిగించడానికి బలమైన కారణమే ఉంది. ఇప్పుడు అందరూ "ೞ" పలకాల్సిన చోట "డ" లేదా "ర" పలుకుతున్నారు. "ೞ" ధ్వని స్థానంలో "డ" & "ర" ధ్వనులు చేరి కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. అందుకే తెలుగు వర్ణమాల నుంచి దాన్ని తొలిగించారు.

    హిందీవాళ్ళలో చదువుకున్నవాళ్ళు మాత్రమే "ణ" & "న"లని వేర్వేరు ధ్వనులతో పలుకుతారు. తూర్పు హిందీ (ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్‌గడ్, బిహార్, ఝార్ఖండ్‌లలో మాట్లాడే హిందీ)లో ఎక్కువగా "న" ధ్వని ఉపయోగిస్తారు, పశ్చిమ హిందీలో ఎక్కువగా "ణ" ధ్వని ఉపయోగిస్తారు. చదువురానివాళ్ళు "ణ" & "న"ల మధ్య తేడా పాటించరు. అయినప్పటికీ ఈ రెండు ధ్వనులకీ హిందీలో వేర్వేరు అక్షరాలని ఉంచారు. హిందీలోని హర్యాణవీ, రాజస్థానీ యాసల్లో "ళ" కూడా వాడుతారు కానీ హిందీ TV చానెల్‌లు, పత్రికల్లో అది ఉపయోగించరు. Phoneme (individual unit of sound) and letter are not same.

    ReplyDelete
    Replies
    1. >>> "ೞ"ని తెలుగు నుంచి తొలిగించడానికి బలమైన కారణమే ఉంది.

      బలమైన కారణాలుంటే కొన్ని అక్షరాలు తొలగించొచ్చని తెలుస్తోంది కదా. నేను చెప్పేదీ అదే! ఆ కాలంలో వారు భాషని సమీక్షించుకుని ఎలా సదరు అక్షరాన్ని తొలగించారో, అటువంటి సమీక్షలు ఇప్పుడూ, ఇకముందూ జరగాలంటాను.

      Delete
    2. నేను చెప్పింది మీకి అర్థమైనట్టు లేదు. ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటకల్లో "ೞ" (శాసన "ళ") పలకగలిగేవాడు ఒక్కడు కూడా లేడు. అందుకే దాన్ని తెలుగు, కన్నడ లిపుల నుంచి తొలిగించారు. తమిళ, మలయాళ భాషల్లో అది ఇప్పటికీ వాడుతున్నారు. ఒక ధ్వని పలికేవాడు ఒక్కడు కూడా లేకపోతే అది automaticగా మాయమైపోతుంది. దాన్ని తొలిగించాలని ప్రత్యేకంగా కోరక్కరలేదు.

      Delete
    3. >>> ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటకల్లో "ೞ" (శాసన "ళ") పలకగలిగేవాడు ఒక్కడు కూడా లేడు.

      ఎలా తెలిసింది? ఎవరు సర్వే చేశారు? వివరాలు చెపుతారా?

      పలకడమే గీటురాయి అయితే తెలుగునాట "oi" అనే అచ్చును విరివిగా పలుకుతారు. మరి అది ఎందుకు లేదు? అదే కాదు "ae" అనే అచ్చు కూడా.

      Delete
    4. మీరు వీర తెలంగాణావాది అయినంతమాత్రాన తెలుగు భాషని కావాలని ఖూనీ చెయ్యక్కరలేదు. సమైక్యవాదానికి తెలుగు భాషతో సంబంధం లేదు, చాలా మంది తెలంగాణావాదులకి ఉర్దూ రాదు. తెలంగాణా చచ్చినా రాదని అందరినీ నమ్మించిన కిరణ్ కుమార్ రెడ్డి "కళ"ని "కల" అనేవాడు. మొదట్లో నేను అతను చిత్తూరు యాస ఉపయోగిస్తున్నాడనుకున్నాను కానీ చిత్తూరు జిల్లా ప్రజలు "ళ" సరిగానే పలుకుతారని ఒక తిరుపతివాసి నాకు చెప్పాడు. తమ ప్రాంతంలో ఉపయోగించే యాస కూడా సరిగా రానివాళ్ళు తాము సమైక్యవాదులమని చెప్పుకుంటే తెలంగాణావాళ్ళు తెలుగంటే అసహ్యం పెంచుకోనక్కరలేదు.

      "ೞ" (శాసన "ళ") ఉపయోగించేవాళ్ళు కొందరైనా ఉంటే దాన్ని వర్ణమాల నుంచి తొలిగించడం జరగదు. ఉనికిలో ఉన్న ధ్వనులే వర్ణమాలలో ఉంటాయి.

      Delete
    5. >>> మీరు వీర తెలంగాణావాది అయినంతమాత్రాన తెలుగు భాషని కావాలని ఖూనీ చెయ్యక్కరలేదు.

      ఇక్కడ తెలంగాణా వాదం ఎందుకు తీసుకురావలసి వచ్చింది? మీకు అక్షరాలపై ప్రేమ వుండొచ్చు. నాకు భాషను బ్రతికించుకోవాలనే ప్రేమ వుంది. 56 అక్షరాలు బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడా మార్పులు చేర్పులు చేయకుండా వుండడానికి? ఒక అక్షరం తగ్గితేనో పెరిగితేనో భాష ఖూనీ ఎలా అవుతుంది?

      >>> కానీ చిత్తూరు జిల్లా ప్రజలు "ళ" సరిగానే పలుకుతారని ఒక తిరుపతివాసి నాకు చెప్పాడు.

      ఒక తిరుపతి వాసి చెప్పగానే మొత్తం విషయం మారిపోతుందా? ఇదేం వాదన? ఐతే ఇంకొకాయన వచ్చి తెలుగు రాష్ట్రాల్లో "ೞ" 75% మంది అద్భుతంగా పలుకుతారు అంటే నమ్మేస్తారా?

      >>> తమ ప్రాంతంలో ఉపయోగించే యాస కూడా సరిగా రానివాళ్ళు తాము సమైక్యవాదులమని చెప్పుకుంటే తెలంగాణావాళ్ళు తెలుగంటే అసహ్యం పెంచుకోనక్కరలేదు.

      సమైక్యవాదం, తెలంగాణా వాదం ఇక్కడ చర్చలోని విషయాలు కావు. ఇలా మాట్లాడ్డం మీ ఫ్రస్ట్రేషన్‌ని మాత్రమే చూపెడుతోంది! దయచేసి వాటిని ఇక్కడికి లాక్కండి. తెలుగుభాష పై తెలంగాణావారికి ప్రేమ వుండదనుకోవడం పొరపాటు. ఇక అసహ్యం సరే సరి.

      >>> "ೞ" (శాసన "ళ") ఉపయోగించేవాళ్ళు కొందరైనా ఉంటే దాన్ని వర్ణమాల నుంచి తొలిగించడం జరగదు.

      దానికే ఋజువులేమిటి అని అడిగాను. మీరు అది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు "ఒక్కరైనా" అన్నారు, ఇప్పుడు "కొందరైనా" అంటున్నారు. మీ ఉద్దేశంలో ఒక ఒకషరం ఉండాలంటే కనీసం ఎంతమంది పలకాలి? ఒక్కరు పలికితే చాలా? లేకపోతే ఎంత శాతం మంది?

      Delete
    6. ఇప్పుడు వర్ణమాలలో వున్న "ఌ ౡ" ఎంతమంది ఉపయోగిస్తున్నారో చెప్పగలరా?

      Delete
    7. వినేవాడు వెర్రివాడైతే పంది పురాణం చెపుతుంది కానీ ఇక్కడ వెర్రివాళ్ళు లేరు కదా. వాడుకలో ఉన్న ధ్వనుల్నే వర్ణమాల నుంచి తేసేసారు అని చెప్పుకోవడం మీలాంటివాళ్ళకే సాధ్యంలే!

      Delete
    8. >>> వాడుకలో ఉన్న ధ్వనుల్నే వర్ణమాల నుంచి తేసేసారు అని చెప్పుకోవడం మీలాంటివాళ్ళకే సాధ్యంలే!

      "వాడుకలో ఉన్న ధ్వనుల్నే వర్ణమాల నుంచి తేసేసారు" అని నేనెక్కడ అన్నాను? మీ ఉద్దేశంలో నేనెలాంటి వాణ్ణి?

      అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమౌతుందా? "ೞ" అనే అక్ష్రం ఒక్కరు కూడా వాడడం లేదని చెప్పారు. ఆధారం అడిగితే చెప్పడం లేదు. ఒక్కరూ వాడని అక్షరాలను తీసివేస్తారని మీరే సిద్ధాంతీకరించారు. మరి "ఌ ౡ" ఎంతమంది వాడుతున్నారు అని అడిగితే మీవద్ద మౌనమే సమాధానం.

      మీ సిద్ధాంతం ప్రకారం చూసినా ఎవరూ వాడని "ೞ" తీసేసినపుడు ఎవరూ వాడని "ఌ ౡ" కూడా తీసివేయాలి గదా? దీనికైనా సమాధానం చెపుతారా?

      నేనడిగిన వాటికి సమాధానలు దాటవేసి ఏదేదో వ్యాఖ్యానిస్తున్నారు. దయచేసి విషయమ్మీద మాట్లాడగలిగితేనే తరువాతి కామెంటు పెట్టండి.

      Delete
    9. >>> వినేవాడు వెర్రివాడైతే పంది పురాణం చెపుతుంది

      అదే మాట నేనంటే? "ೞ" నుంది మొదలుపెట్టి ఇక్కడ పురాణం చెప్తున్నది ఎవరు? నేను వెర్రివాడిలా ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నా కదా!

      Delete
    10. ఫోనాలజీ అంటేనే విడివిడి ధ్వనులని పరిశీలించడం. "ల" దంతములతో పలికేది, "ళ" నాలుకని వెనక్కి మడిచి పలికేది. "ళ"కీ, "ల"కీ ఒకే అక్షరం పెట్టాలని చెపితే ఏ ఫోనాలజిస్త్ అయినా ఎలా ఒప్పుకుంటాడు? Psychiatric disorderకి ఏ చికిత్స చెయ్యాలో dermatologist సూచించినట్టు ఉంది మీ సలహా.

      Delete
    11. "ళ"కీ, "ల"కీ ఒకే అక్షరం పెట్టాలని నేనెప్పుడు చెప్పాను?

      "కాళీయ మర్థనం, కాలీయ మర్థనం" అని ఒక పది సార్లు అంటూ రికార్డు చేసి డ్రాప్‌బాక్సులో షేర్ చేయమని చెప్పాను. హరిబాబు గారు చేయలేదు. మీరైనా చేస్తే రెండింటికీ మధ్య ఎంత తేడా వుందో చూద్దామని వుంది. నేనడిగిన ప్రశ్నలకు ఎలాగూ జవాబివ్వలేక పోయారు. కనీసం ఇదైనా చేసి చూపుతారా?

      Delete
    12. >>> ఫోనాలజీ అంటేనే విడివిడి ధ్వనులని పరిశీలించడం.

      So what? ఇక్కడికి ఫోనాలజీ ఎందుకొచ్చింది? "ళ", "ల" రెండూ లేని భాషల వారికి ఫోనాలజీ తెలియదా? తెలుగు లోని 56 అక్షరాలు కాక ఇక విడివిడి ధ్వనులు లేనే లేవా?

      Delete
  23. ప్రవీణ్ గారూ! మీరు టైపుచేసిన ’ೞ’ను నేను ఎలా టైపుచేయాలి? నేను barahaను, lekhini.org/inscriptను వాడుతుంటాను. అందులో మీరు టైపుచేసిన అక్షరం ೞ లేదు. కాబట్టి copy, paste చేశాను. ೞ ను టైపుచేయడం ఎలాగో చెప్పగలరు.

    ReplyDelete
    Replies
    1. బర్హలో ఐతే rxa (ఱ) కొట్టండి

      Delete
    2. "ೞ" ని కన్నడం వాళ్ళు unicodeలోకి update చేసారు. నాకు ఫేస్‌బుక్‌లో అది దొరికితే దానీ కాపీ చేసి నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నాను,

      Delete
    3. శర్మ గారు, "ఱ" (శకట రేఫం) వేరు, "ೞ" (శాసనాలలో మాత్రమే కనిపించే "ళ"కారం) వేరు.

      Delete
  24. బర్హలో వర్ణమాల ఒక గుణింతం. ఇంగ్లీషు తెనుగులలో.

    a A i I u U Ru RU e E o O ou aM aH
    ka Ka ga Ga ~ga
    ca Ca ja Ja ~ja
    Ta Tha Da Dha Na
    ta tha da dha na
    pa Pa ba Ba ma
    ya ra la va Sa Sha sa ha kSha rxa
    ka kA ki kI ku kU kRu kRU ke kE kai ko kO kou kaM kaH
    Ka KA Ki KI Ku KU KRu KRU Ke KE Kai Ko KO Kou KaM KaH


    అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఒ ఓ ఔ అం అః
    క ఖ గ ఘ ఙ
    చ ఛ జ ఝ ఞ
    ట ఠ డ ఢ ణ
    త థ ద ధ న
    ప ఫ బ భ మ
    య ర ల వ శ ష స హ క్ష ఱ
    క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః
    ఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః

    బర్హ డాక్యు మెంటు రాయండి.





    ReplyDelete