Tuesday, November 4, 2014

తెలంగాణలో ప్రతిపక్షాలు


ప్రతిపక్షాలన్న తర్వాత అవి అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవాలి. వేలు కాదంటే కాలికి కాలు కాదంటే వెలికీ వేస్తూ అధికార పక్షానికి ఊపిరి సలపనీయకుండా చేయాలి. అదీ ప్రతిపక్షాలకు ప్రజలు ఇచ్చిన డ్యూటీ.

మరి తెలంగాణలో ప్రతిపక్షాలు ఈ పని సక్రమంగా చేస్తున్నాయా? అంటే బుక్కులో రాసిన దానికి పదింతలు ఎక్కువే చేస్తున్నాయి అని కచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణాలో అధికార పార్టీ ఒక్కటి ఉంటే కనీసం మూడు పార్టీలు వైభవోపేతంగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నాయి. కాంగ్రెసుకు ఎలాగూ ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఇక మిగిలిన బిజెపి, తెదేపాలు ఏమాత్రం తక్కువ తినలేదు.  

అయితే బుక్కులో రాయని విషయం ఇంకొకటి వుంది. అదేమంటే... అధికార పక్షానికి బట్టలూడ దీస్తూనే, ప్రతిపక్షం తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ మాటకొస్తే కేవలం అస్తిత్వం నిలుపుకోవడమే కాదు, తర్వాత్తర్వాత ఎన్నికల్లో నెగ్గేలా దాని ప్రయత్నాలు ఉండాలి. 

ఉన్న మూడు ప్రతిపక్షాల్లో కనీసం ఒక్కటన్నా ఈ దిశలో ప్రయత్నిస్తుందా అన్న విషయం విశ్లేషించడానికి ముందు, సదరు పార్టీలు రాష్ట్రంలో తమ ఉనికిని బలవత్తరం చేసుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. 

ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రాన్ని గనక తీసుకుంటే అక్కడ జాతీయ పార్టీలకు ఉనికే లేదు. ఉన్న రెండు మూడు పార్టీలు ఒకదాన్నొకటి విమర్శించు కుంటాయి. కాని విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్యన ఉన్నది అంటే అన్ని పార్టీలూ ఒక్క గొంతై తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాయి. ఇంకా చెప్పాలంటే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో నువ్వా నేనా అంటూ పోటీ పడతాయి. ఆ పోరాటంలో వెనుక బడితే ప్రజలు శాశ్వతంగా తమని వెనక్కు నెట్టి వేస్తారని వాటికి బాగా తెలుసు. 

పోనీ తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే వున్నాయి, వాటికి జాతీయ ఎజెండా వుండదు కాబట్టి అలా ప్రవర్తిస్తాయి అనుకొవచ్చు. మరి కర్ణాటకలో ఉన్నవి జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ లే. కాని అవి కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గవు. విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్య అయినపుడు అవి తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఢంకా బజాయిస్తాయి తప్ప పొరుగురాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా దానికి వంట పాడవు. 

ఆ రెండు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రంలో నైనా పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. లేక పొతే భవిష్యత్తు ఉండదని వాటికి బాగా తెలుసు. అంతెందుకు? పొరుగు రాష్ట్రమైన ఆంద్ర ప్రదేశ్ ని తీసుకుందాం. అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న వైసిపికి తెలంగాణాలో బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. అయినా సరే అవి రెండూ శ్రీశైలం జలవిద్యుత్తు వివాదంలో తమ రాష్ట్ర వాదనకే వంత పాడాయి. 

ఒక వైపు తీవ్రమైన విద్యుత్ కొరత. ఇంకో వైపు ఆంద్ర ప్రభుత్వం విభజన బిల్లులోని అంశాలను తుంగలోకి తొక్కుతూ ఇవ్వాల్సిన కరెంటు కూడా ఇవ్వడం లేదు. పైగా తెలంగాణా శ్రీశైలంలో తన వాటా విద్యుత్తూ కూడా తయారు చేయకుండా అడ్డు పడుతోంది. అటువంటి సమయంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అధికార పార్టీకి అండగా వుంది రాష్ట్ర ప్రయోజనాలు కాపాదాలి. అప్పుడే వాటికి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. 

ఉద్యమం నడిచినన్నాళ్ళు దాన్ని తక్కువ అంచనా వేసి, పొరుగు ప్రాంత నాయకత్వానికే వంత పాడి తీరా ఎన్నికలు వచ్చఎసరికి అవి బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఆ పార్టీలకు బుద్ధి రావడం లేదు. ఇప్పుడూ తిరిగి ఆ పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి. 

వార్తాప్రసార సాధనాల పుణ్యమా అని ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయం ప్రజలు గమనిస్తూనే వున్నారు. సమయం వచ్చినప్పుడు తీర్పులు కూడా అందుకు అనుగుణంగానే ఇచ్చి తీరతారు. మరి ప్రతిపక్షాలకు అంత చిన్న విషయం తెలియదా? అవి తెలంగాణా ప్రజల అభిమానం చూరగొనడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు?

తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలంగాణలో స్వాతంత్ర్యం లేదు. ఆంధ్రలో కొలువైన అధినేతని కాదని పెదవి విప్పలేరు. కాని కాంగ్రెస్, బిజెపి లకు ఏమైంది? ఆ రెండు పార్టీలు కూడా కేవలం కెసిఆర్ ను తిట్టడం తప్ప ఎందుకు తెలంగాణా ప్రయోజనాలకు అనుకూలంగా స్పందించ లేక పోతున్నాయి? వాటిని ఎవరు ఆపుతున్నారు?

ఈ పార్టీలు ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదేమో అన్న అనుమానం కలుగుతోంది. ఒకటి తెలంగాణా బిల్లు పాస్ చేసి తమకు తెలంగాణాలో ధీమా ఉండదని భ్రమించిన పార్టీ. రెండోది తెలంగాణా కోసం పార్లమెంటులో బయటా పోరాడాం, ఇక మాకు తిరుగులేదు అని అనుకున్న పార్టీ. తీరా ఫలితాలోచ్చాక అవి నిజంగానే షాక్ తిన్నాయి. ఎన్నికల్లో సింగిల్ పార్టీగా గెలిచిన తెరాస మీద అవి విపరీతమైన అక్కసు పెంచుకున్నాయి. రోజో టీవీల ముందుకు వచ్చి అధికార పార్టీని తిట్టడం తప్ప వాటికి మరే ఎజెండా కనిపించడం లేదు. కాని అవి తమ పధ్ధతి మార్చుకుని, ఇప్పటికైనా తెలంగాణా వాదాన్ని నెత్తికి ఎత్తుకోక పొతే డైనోసార్ల మాదిరిగా అవి తెలంగాణలో పూర్తిగా అంతరించి పోవడం ఖాయం.  



No comments:

Post a Comment