Tuesday, January 27, 2015

47 రోనిన్ (సినిమా)



సెలవు రోజున టీవీ ఆన్ చేసేసరికి 47 Ronin అనే ఇంగ్లీషు సినిమా వస్తోంది. ఇదేదో బాగుంది కదా అనుకుని మొత్తం చూశాను. చూశాక అది మీతో పంచుకొవాలనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసం.

అది 18 శతాబ్దం నాటి జపాను జానపద గాధ. జానపదుల గాధల్లో కథ ముక్కు సూటిగా వుంటుంది. ఏ పాత్రను కూడా వెనకేసుకు రావడం కాని, కావాలని భ్రష్టుపట్టించడం కాని జరగదు. ఎవరి మెప్పునో ఆశించి అలాంటి పనులు చేయడం రాజాశ్రయం పొందిన కవులకు ఉంటుంది తప్ప జానపదులకు కాదు. అందువల్లనే జానపదుల గాధలు వాస్తవ పరిస్థితులకు బాగా అద్దం పడతాయి.

కథలోనికి వెళ్లేముందు అప్పటి జపాన్ రాజకీయ పరిస్థితుల గురించి కొంత తెలుసు కోవాలి. అప్పట్లో జపాన్ చక్రవర్తి ఉన్నా ఆయనది నామమాత్రపు పాలనే. ఆయన వద్ద వుండే షోగన్ అనబడే సైనికాదికారులదే  అసలు పెత్తనమంతా.  ఈ షోగన్ లు  ప్రాంతీయ ప్రభువులపై ఆజమాయిషీ చేసేవారు. ప్రతి ప్రభువు వద్దా సమురాయ్ వంశానికి (కులం అంటే సరిగా వుంటుందేమో) చెందిన యోధులు ఆయనకు విశ్వాస పాత్రంగా వుంటూ ఆయన్ని (ఆయనతో పాటు ప్రజలని) కాపాడుతూ వుంటారు. యుద్ధాలు చేస్తే ఈ సమురాయ్ లే చెయ్యాలి. ఇతర రైతు, వృత్తి పనుల వారు యుద్ధాలు కాదుగదా కనీసం కత్తులూ, కవచాలు కూడా ముట్టు కోరాదు.  ఏ కారణంగా నైనా ప్రభువు లేకుండా మిగిలిన  సమురాయ్ లు రోనిన్ లు గా మారతారు. అంటే తమ హక్కులు కోల్పోతారన్న మాట. ఇప్పుడు అర్థమైంది కదా, మన కథ పేరు '47గురు రోనిన్ లు'. వీరి సమాధులు ఇప్పటికీ జపాన్లో పూజించ బడుతున్నాయట!  ఇదీ కదా నేపథ్యం. ఉపోద్గాతం కాస్త ఎక్కువే అయినట్టుంది కదా?

వర్తకం కోసం ఓడ లో వచ్చిన అమెరికా తెల్లవాడికి, జపాన్ వనితకి అక్రమంగా పుట్టిన సంకరజాతి (కులహీనుడు) బిడ్డని ఆ తల్లి పురిట్లోనే విసిరేస్తుంది. ఆ బిడ్డని మామూలు ప్రజల చేత  చీదరించ బడే తంత్రగాళ్ళు చేరదీసి పెంచి, కై(కీను రీవ్స్) అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తారు, శస్త్రవిద్యలతో సహా. హింసించడం పట్ల విరక్తితో కై ఆ తంత్రగాళ్ళ వద్దనుండి పారిపోతాడు. అడవిలో అసహాయంగా పది వున్న కై ని అసానో అనబడే ప్రభువు చేరదీస్తాడు. ఎంత ప్రభువు చేరదీసినా అతని తక్కువ జాతి కారణంగా ఇతర సమురాయ్ ల హోదా అతనికి వుండదు. ఆయుధం పట్టగూడదు, యుద్ధాలు చేయగూడదు. అయితే అసానో కూతురు అకో కై మీద మనసు పారేసుకుంటుంది.  అయితే మరో బలమైన పొరుగు ప్రభువు కీరా, అకోని తనకిచ్చి పెళ్లి చెయ్యమని అసానో పై ఒత్తిడి తెస్తుంటాడు, కాని అసానోకు అది ఏమాత్రం ఇష్టం వుండదు.

ఇదిలా వుండగా అసానో  రాజ్యాన్నితనిఖీ చేయడానికి షోగన్  వచ్చిన సందర్భంగా అసానో, కీరా రాజ్యాల మధ్య యుద్ధ క్రీడలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా కీరా రాజ్యానికి చెందిన యోధుడిని ఎదుర్కోవలసిన అసానో పక్షపు సమురాయ్ కీరా మంతగత్తె ప్రభావంతో  డ్రెస్సింగ్ రూములోమూర్చిల్లుతాడు.  ప్రభువు పరువు నిలపడానికి సంకరజాతి వాడైన కై ఎవరికీ తెలియకుండా సమురాయ్ వేషంలో వచ్చి యుద్ధం చేస్తూ, శిరస్త్రాణం పడిపోవడం వల్ల  దొరికి పోతాడు. జరిగిన తప్పుకు బాధ్యతను తనపై వేసుకుంటాడు అసానో. అదేరాత్రి మంతగత్తె మాయాజాలం చేత కీరా తన కూతుర్ని మానభంగం చేస్తున్నట్టు భ్రాంతికి లోనైన అసానో, కీరా పై దాడి చేసే ప్రయత్నంలో దొరికి పొతాడు. షోగన్ తీర్పు పరిణామంగా అసానో ఆత్మాహుతి చేసుకొని మరణిస్తాడు. తమ వారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం సమురాయ్ ల పధ్ధతి. కాని షోగన్ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అతని 46గురు అనుచరులని రోనిన్ లు గా ప్రకటించడమే కాక ప్రతీకార ప్రయత్నాలు చేయొద్దని శాసిస్తాడు. వారి ఆయుధాలను సంగ్రహించి తరిమేస్తాడు.

ఆ 46గురితొ కలిసిన సంకరజాతి కై ఎలా 47వ రోనిన్ గా మారింది, ఆయుధాలు సంపాదించి దుష్కరులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నదీ, దాని పర్యవసానాలు తరువాతి కథ. ఇందులో అంతర్లీనంగా నడిచేది కై,  అకో ల ప్రేమ కథ. కథాగమనం, నటన, గ్రాఫిక్స్ హాలివుడ్ స్థాయికి తగ్గట్టుగా వున్నాయి. ఈ సినిమాను చూసినప్పుడు జపాన్ లో కూడా ఒకప్పుడు మనలాంటి కుల వ్యవస్థ ఉన్నట్టు తెలియడం ఆశ్చర్య పరుస్తుంది.

No comments:

Post a Comment