Tuesday, October 30, 2012

చంద్రబాబే ఎందుకు పెద్ద శత్రువు?


తెలంగాణా ఏర్పాటుకు మొదటినుండి బద్ధ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు. తాను ముఖ్య మంత్రిగా ఉన్నన్నాళ్ళూ తెలంగాణా పేరు కూడా వినపడ నీయలేదు చంద్రబాబు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూడా అంతకన్నా ఎక్కువే చేశాడన్న మాట నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా వుంది. అదేమంటే, రాజశేఖర్ రెడ్డి అధికారం కేవలం ఈ రాష్ట్రం వరకే ఉండేది. కేంద్రాన్ని కొంతవరకు ప్రభావితం చేయగలిగినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నకేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఎప్పుడూ చూప లేదు. నిజానికి ఆ సమయంలోనే రాష్ట్రపతి ప్రసంగం, ప్రధాని హామీ, ప్రణబ్ కమిటీ మొదలైన పరిణామాలు వచ్చాయి.

కాని చంద్రబాబు విషయం అలా కాదు. చంద్రబాబే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు. కాబట్టి తెలంగాణా అయినా మరోటయినా చంద్రబాబు ఆలోచనలమీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. మరి ఈ చంద్రబాబు ఆలోచనా సరళి గత దశాబ్ద కాలంగా ఎలా వుందో చూద్దాం.

తన హయాంలో తన పార్టీ ఎమ్మెల్యేలు రాజోలిబండ తూములు పగుల గోడితే నిమ్మకు నీరెత్తిన వ్యక్తి చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర పేరుతో అదే రాజోలిబండ వద్ద తెలంగాణాలో ప్రవేశించి, తనకు సిగ్గూ శరం లాంటి పదాలకు అర్థాలు తెలియవని మరొక్క సారి నిరూపించుకున్నాడు చంద్రబాబు.

NTR హయాంలో వచ్చిన 610 GO అమలు కాకుండా తూట్లు పొడిచిన చంద్రబాబు. తాను నిజంగా తలుచుకుని వుంటే ఆ GO ను పూర్తిగా అమలు చేయగల సమర్థుడే ఆయన. కానీ అలా చేయలేదు. కారణం, ప్రాంతీయ దుర్విచక్షణ, పక్షపాతం మాత్రమే.

అలాగే తెలంగాణా ప్రాజెక్టులకు నిదులివ్వక, ఉన్న చెరువులను, కుంటలను కూడా నిర్లక్ష్యం చేసి తెలంగాణాను ఎడారిగా మార్చాడు. పైగా బోర్లు వేసుకుని వ్యవసాయం చేసే రైతులపై అధికమైన కరెంటు బిల్లులు వేసి వారి ఆత్మహత్యలకు కారణ మయ్యాడు.

అతని హాయాంలో వ్యాపారానికి భూమి కావాలని అడగని ఆంధ్రా ప్రాంతపు ఫలానా కులంవాడు పాపాత్ముడు. అంతగా కొమ్ము కాశాడు ఒక సామాజిక వర్గానికి. వారే ఇప్పుడు కుహనా సమైక్యవాదాన్ని కరెన్సీ నోట్లమీద ప్రాణ ప్రతిష్ట చేయడం కాకతాళీయం కాదేమో!

ఇతని కాలంలో తెలంగాణలో అభివృద్ధి చెందినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి జూబ్లీహిల్సు, బంజారా హిల్సు, హైటెక్ సిటీలు మాత్రమే. అక్కడ వుండేదేవరో వేరే చెప్ప నవసరం లేదు.

కరడుగట్టిన సమైక్యవాది అయి కూడా 2009లో వోట్లకోసం తెరాస పార్టీతో జత కట్టాడు. తెలంగాణా వస్తే అది తనవల్లే అని ప్రజలను నమ్మ బలికాడు. ఆంధ్రా ప్రాంతం కన్నా ఎక్కువ దామాషాలో తెలంగాణాలో సీట్లు గెలుచుకున్నాడు. కాని ఆంధ్రాలో తక్కువ సీట్లు రావడం వలన అందికారంలోనికి రాలేక పోయాడు.

నిజమైన నాయకుడైతే అధికారంలోనికి రాలేక పోయినా ఏంచేయాలి? ప్రజల కిచ్చిన వాగ్దానాల అమలు కోసం అసెంబ్లీలో బయటా పోరాటాలు చేయాలి. కాని ఎన్నికల తర్వాత తెలంగాణాకోసం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అయితే KCR నిరశన దీక్ష ఫలితంగా డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే, తన ఎన్నికల వాగ్దానాలను, పదిహేను నెలల పాటు రాష్ట్రమంతా కమిటీని కలియదిప్పి తెలంగాణా ఏర్పాటుపై చేసుకున్న  పాలసీని తుంగలో తొక్కాడు. కుహనా ఉద్యమాన్ని నారూ, నీరు అంతా నారావారే అన్న రీతిలో నడిపించాడు. ఆ సంగతి ఆయన పాత భ్రుత్యులే ఇప్పుడు గుట్టు విప్పుతున్నారు.

మొన్నటి ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో చావుదెబ్బ తిన్న తరుణంలో ఆయనకీ మరొకసారి తెలంగాణా గుర్తుకొచ్చింది. నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాణి ఉత్తరాన్నొక దాన్ని అతి జాగ్రత్తగా తయారు చేసి ప్రధానికి పంపించాడు. ఆ ఉత్తరంలో ఆయన తెలంగాణా శాతమెంతో ఆ పార్టీ లోని తెలంగాణా వాదులే చెప్పలేక పోతున్నారు. ఇక బయటి వాళ్ళయితే మండి  పడుతున్నారు.   

ఇప్పుడు అక్కడా ఇక్కడా అరువుతెచ్చుకున్న మనుషులతో పాదయాత్ర తూతూ మంత్రిస్తూ, నంగి నంగి మాటలతో దొంగ కబుర్లు చెప్తున్నాడు. తెలంగాణలో తనకింకా పలుకుబడి తగ్గలేదని జనానికి భ్రమ కల్పించే పనిలో ఉన్నాడు. ఆయన తెలంగాణాకు వ్యతిరేకం కాదట! మరి అనుకూలమా? అది మాత్రం చెప్పడట అధికారం లోకి వచ్చే వరకూ! మరి నమ్ముదామా?



No comments:

Post a Comment