ఢిల్లీ యాత్ర ముగించుకొని వచ్చిన కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసమే కనిపించింది. మొదటి విడుత చర్చలు సఫలమయ్యాయన్నారు. మరో విడుత చర్చలతో తెలంగాణ వచ్చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రయత్నాలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది ప్రశ్న కాదు. ముందు కూడా సఫలమవుతాయా లేదా అనేది కూడా పక్కన పెడితే... తెలంగాణ వంటి ఒక మైనారిటీ ప్రాంతానికి ద్విముఖ వ్యూహం అవసరమని గుర్తించి ఆ దిశగా పనిచేస్తున్న కేసీఆర్... వ్యూహాత్మకంగానైనా, లేదా స్వీయ అస్తిత్వ బలంతోనైనా తెలంగాణ ను సాధించిపెడతారనే నమ్మకం సగటు తెలంగాణవాదికి వుందనడంలో అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమపార్టీ అధినేత పట్ల అపోహలు, అపార్థాలు సృష్టించి ప్రజల్ని పక్కదారి పట్టించే సీమాంధ్ర కోవర్టు పార్టీల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతాయనుకోలేం.
బక్కపలుచని మనిషి. కానీ మానసిక బలవంతుడు. 12 ఏళ్లుగా బరువైన బాధ్యత మోస్తున్నాడు. ఎగుడు దిగుడులు చూసినోడు. మనోధైర్యం చెదరని వాడు. సహనం, నిబ్బరం, నిబాయింపు, తెగింపు కలగలసిన మనిషి. ఎప్పుడో 1970లో ఇక రాదులే అనుకొని నిరాశలో కూరుకుపోయిన తెలంగాణ సమాజాన్ని 30 ఏళ్ల తర్వాత తట్టి లేపగలిగిన అసలు సిసలైన ఉద్యమ అధినేత ఆయన. అంతా అయిపోయిందనే నిరాశ ఆయన జీవన డైరీలో ఎక్కడా కనిపించదు. నేటి ఓటమిని రేపటి విజయంగా మలుచుకోగల వ్యూహ సంపన్నుడు.
కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టిననాడు ఆయన వెంట పట్టెడుమంది లేరు. ఇవాళ పుట్టె డు మందయ్యారు. జై తెలంగాణ నినాదం పలకని ఊరుగానీ, వాడగానీ, మనిషిగానీ వున్నాడా? నేను తెలంగాణ ప్రాంతం వాడినని చెప్పుకుంటే బతకలేనేనేమోననే ఆత్మన్యూనతా భావ స్థితి నుంచి, నేను తెలంగాణ వాడినేనని సగర్వంగా తలెత్తుకొని బతికే స్థాయికి తెలంగాణ సమాజాన్ని చేర్చగలిగిన అరుదైన నాయకుడాయన. తెలంగాణ పదం నిషేధింపబడ్డ అసెంబ్లీలో సగర్వంగా చట్టబద్ధంగా తెలంగాణ పదాన్ని పలికించిన తెలంగాణ మొదటి ముద్దుబిడ్డ ఆయన. ఇంటా బయటా తెలంగాణకు ఆత్మగౌరవాన్ని ఇప్పటికే సాధించిపెట్టాడు. ఆయన మాటా-బాటా తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరిస్తాయి. ఏమో.. కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడా అనే అనుమానాలు అప్పుడూ ఇప్పుడూ వున్నాయి. కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా, ఆయన ఉపన్యాసం విన్నా.. అప్పటిదాకా అనుమానంలో వున్నవాడికి సైతం నమ్మకం ఏర్పడాల్సిందే! ఆయన ప్రసంగాలు విన్న ప్రతి తెలంగాణవాడికి కేసీఆర్ తన వాడు, తన ఇంటివాడనే స్ఫురణ తప్పక కలిగిస్తుంది. అందుకే తెలంగాణ ఆత్మకు కేసీఆర్ ప్రతి రూపంగా కనిపిస్తాడు.
కేసీఆర్‌ను పొగిడే వారి సంగతి పక్కన పెడదాం. తెగిడే వారు సైతం అయనలో తెలంగాణ ఆత్మను చూసి గర్వపడతారనడంలో అనుమానం లేదు. ఆయ న భౌతిక స్వరూపం, వ్యవహారిక హావభావాలు, ఆత్మీయ పలకరింపులు, మీడియా తో మాట్లాడే తీరు, ఉపన్యాసాలు.. ఇలా ఆయన యాస, భాషా అన్నీ ప్రజల గుండె ల్లో తెలంగాణకు ప్రతీకలుగా చెరగని ముద్రను వేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ ఏర్పాటును ఆయన ఎప్పుడో అనివార్యం చేయగలిగారు. అది ఇప్పుడా, ఎప్పుడా అనేది మాత్రమే తేలాల్సివుంది. అందరిలాగా ఆయన ఆగమాగం ఎప్పుడూ కాడు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇప్పటిదాకా ఉద్యమాన్ని నడుపుకొస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం వుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టి ఒక రకంగా మోసపోయారు, మరోకంగా ఆ పార్టీల చేత జై తెలంగాణ అని అనిపించాడు. ఇవాళ ఆ రెండు పార్టీల ద్వంద్వ నీతిని ప్రజా కోర్టులో నిలబెట్టగలిగా డు. వ్యూహం ఉన్నవాడు ఎన్నటికీ చెడిపోడంటే ఇదే కావచ్చు! అంతేకాదు రాష్ట్రంలో బలమున్న పార్టీలను, బలంలేని పార్టీలను అన్నిటికీ తెలంగాణ అనివార్యతను సృష్టించగలిగాడు. అంతటి చాణక్యనీతి తెలిసిన ఉత్తమ రాజకీయవేత్త ఢిల్లీకి ఉత్తిత్తిగా పోలేదని సీమాంధ్ర నేతలు గ్రహించారు. ఆయన ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించారనడంలో అనుమానం లేదు. కేసీఆర్ తెస్తారనుకున్న తెలంగాణకు తాత్కాలిక ఆటంకం ఏర్పడి వుంటుందని సగటు తెలంగాణవాదికి అర్థం కానిది కాదు. ఒకవేళ ఢిల్లీ పాలకులు మోసం చేస్తే మరుక్షణమే కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారని కూడా ప్రజలకు తెలుసు.
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఎంత అవసరమో, వ్యూహాత్మకత కూడా అంతే అవసరం. అవసరాన్ని బట్టి రెండింటిని వాడుతూ ముందుకు సాగితేగానీ తెలంగాణ లక్ష్యం నెరవేరదు. అట్లా నడవగలిగిన సమర్థ నాయకుణ్ణి ఇవాళ తెలంగాణ కలిగివుంది. వ్యూహాత్మక ప్రయత్నం చేయడానికి 2012 లోపు వరకు అవకాశం వుంది. అప్పటికీ తేలకపోతే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తదుపరి సాధించుకునే అవకాశం ఎలాగూవుంది. 2012లోపు సాధించే అవకాశాల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. 2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడితే సాధించడం సాధ్యం కాదని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆలోపు తన వ్యూహాత్మక శక్తితో సాధించాలని అనుకుంటున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం కొందరికి అర్థం కాకపోవచ్చు, తెలంగాణ సాధారణ ప్రజలకు మాత్రం అర్థమవుతున్నదనడంలో అనుమానం లేదు. కేసీఆర్ ఢిల్లీ ప్రయత్నాలను ఒక ప్రయత్నంగా స్వీకరించాలే తప్ప, అవి తెలంగాణను తేలేవనే అపశకునం అక్కర లేదు!
ఉద్యమాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే సాధనాలు. అయినా రాజకీయ ప్రక్రియ అనివార్యం. నేటి అవకాశవాద రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారి అవసరాలను సొమ్ము చేసుకొని లక్ష్యాన్ని సాధించడం కూడా రాజకీయ ప్రక్రియలో ఒక భాగమే. కేసీఆర్ 12 ఏళ్లు అలాంటి ప్రయత్నాలు చేశారు. అంతమాత్రాన వాటిని విఫల ప్రయత్నాలుగా తేల్చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మైనారిటీ ప్రాంతం. చట్టసభల్లో సీమాంధ్ర పైచేయిలో వుంది. దేశంలో అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మైనారిటీ ప్రాంత ఆకాంక్షలను కాలరాసి కేంద్రం మెజారిటీ ప్రాంతానికి కొమ్ముకాస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాంటపుడు మైనారిటీ ప్రాంత నాయకుడికి వ్యూహాత్మకత అవసరం. సమయాన్ని బట్టి ప్రయత్నం చేయాలన్నా, కుదరకపోతే వాతలు పెట్టాలన్నా.. తెలంగాణ వంటి మైనారిటీ ప్రాంత నేతకు అదును చూసి చేయాల్సిన పనులు పనులవి! కేసీఆర్ ఆదిశగానే పని చేస్తున్నారనడంలో సందేహంలేదు.
64 ఏళ్ల నుంచి తెలంగాణలో బతుకుతూ వస్తున్న రాజకీయ పార్టీలు ఈ ప్రాంతానికి న్యాయం చేసే వుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనగలిగేదేనా? ఏర్పడినా.. ఉల్లంఘనలు, అన్యాయాలు జరుగుతుంటే ఊరుకునేవేనా? అందుకే కదా మంటికైనా ఇంటోడు కావాలన్నట్లు తెలంగాణకు టీఆర్‌ఎస్ రూపంలో ఓ ఇంటిపార్టీ పుట్టక తప్పింది కాదు. మంచైనా చెడైనా తెలంగాణకు ఓ ఇంటిపార్టీ వుందనే భరోసా ప్రజల్లో ఏర్పడ్డది. దానికి సమర్థుడైన వ్యూహాత్మక నాయకుడున్నాడు. రాష్ట్రంలో మైనారిటీ ప్రాంత నేతగా తెలంగాణ సాధించడానికి అనేక అవరోధాలు తప్పవు. వాటిని మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న నాయకుడి అవసరం అనివార్యం. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డారని వార్త. నిజమే 56 ఏళ్ల నిర్బంధ తెలంగాణ కు విముక్తి కల్పించేందుకు తన పార్టీని కూడా త్యాగం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని చెప్పొచ్చు. అది తన ప్రాంతం కోసం కేసీఆర్‌లోని రాజకీయ త్యాగశీలతను చాటిచెపుతోంది. మనం ఏరంకంగా చూసినా కేసీఆర్ తెలంగాణకు ఒక ఐకాన్! కంప్యూటర్‌లో ఐకాన్ నొక్కనిదే ఏదీ ఓపెన్ కాదు! అలాగే కేసీఆర్ లేని తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా జై తెలంగాణ అంటుందని మనం ఆశించగలమా? ఎన్ని పార్టీలు జైతెలంగాణ అన్నా, అవి కేసీఆర్ అనేవాడు ఒకడున్నాడు అనే భయంతో మాత్రమే అనగలుగుతున్నాయనడంలో ఎంత నిజముందో... తెలంగాణ ఎప్పుడు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలాంటి కేసీఆర్ వ్యూహ సమర్థతతోనైనా రావాలి లేదా ఆయన నాయకత్వంలోనే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తర్వాతనైనా రావాలి అనడంలో కూడా అంతే నిజం వుంది. ఇంకా చెప్పాలంటే ఆయన తెలంగాణకు తిరుగులేని సంతకం.
-కల్లూరి శ్రీనివాస్‌డ్డి
Taken from Namaste Telangana
No comments:
Post a Comment