Friday, November 4, 2011

చంద్రబాబు నోట చరిత్ర మాట!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నోట చరిత్ర అనే మాట వెలువడడమా? ఎంత అపచారం! నవంబర్ 1న ఎన్‌టిఆర్ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ పతాకావిష్కరణ తర్వాత ఆయన చరిత్ర చెప్పడానికి ప్రయత్నించారట. మూడు వేల సంవత్సరాల తెలుగు వారి చరిత్రలో తెలుగు ప్రజలు విడిపోయి ఉన్నది 150 ఏళ్లేనని అన్నారట. తెలుగువారి ఐక్యత కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు పదవీత్యాగం చేశారని అన్నారట. అసలు చరిత్రే అక్కర లేదన్న ఘనచరిత్ర గల మహానేత! ఈ చరిత్ర పాఠాలు ఏ పాఠశాలలో నేర్చుకున్నారో తెలియదు.

సరిగ్గా పన్నెండు సంవత్సరాల కింద 1999 నవంబర్‌లో హైదరాబాద్ జరిగిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పటి డిగ్రీ కాలేజీల దుస్థితి గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించే ప్రసక్తే లేదని, చరిత్ర, అర్థశాస్త్రం, ఆర్ట్ కోర్సులకు కాలం చెల్లిందని, ఆ డిగ్రీలన్నీ వృథా అని, కంప్యూటర్లు, వైద్యం, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యలు చాలునని అన్నారు. అప్పుడు పత్రికలన్నిటిలో ఆ వార్త హోరెత్తింది. చరిత్ర అధ్యాపకులు నిరసన ప్రకటనలు కూడా చేశారు.

(అప్పుడు ఆంధ్రవూపభలో రాస్తుండిన వారం వారం శీర్షికలో నవంబర్ 30న ప్రపంచ బ్యాంకు పాఠాలు చాలు, చరిత్ర ఎందుకు? అనే వ్యాసంలో ఆ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ రాశాను.) ఆ తర్వాత కూడ ఆయన ఆ అభిప్రాయాన్ని ఎన్నోసార్లు పునరుద్ఘాటించారు. చరిత్ర అక్కరలేదని అనుకునేవారు తప్పుడు చరిత్రను చెప్పడంలో, తమ ఇష్టారాజ్యంగా చరిత్రను వక్రీకరించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారు, చరిత్ర కావాలనుకునేవారు నిజాయితీగా నిజమైన చరిత్రను తెలుసుకోవలసి ఉంటుంది.

చంద్రబాబు చేసిన రెండు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. చరివూతలో జరగని, చరిత్రతో సంబంధంలేని విషయాలు. మూడు వేల ఏళ్ల తెలుగువారి చరిత్రలో తెలుగు ప్రజలు కలిసి ఉన్నది ఎక్కువలో ఎక్కువ నాలుగువందల యాభై సంవత్సరాలు మాత్రమే. చంద్రబాబు చెప్పినట్టు విడిపోయి ఉన్నది 150 ఏళ్లు కాదు, రెండువేల ఐదువందల సంవత్సరాలకు పైగా. తెలుగువారి చరిత్ర గురించి ఏ ప్రామాణిక గ్రంథం చూసినా ఈ వాస్తవం తెలుస్తుంది. కళింగ, వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు, సబ్బినాడు మొదలై న నాడులేర్పడి ప్రతి నాడులోను స్వతంత్ర రాజ్యం వెలసి రాజకీయైక్యానికి భంగం వాటిల్లింది. రాజకీయంగానేగాక, ప్రతివర్ణం లోను నాడీభేదం ఏర్పడి సాంఘిక అనైక్యానికి కారణమై జాతీయభావం దుర్బలమయింది. రేనాడు, తెలంగాణ ప్రాంతాలు చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనలోనే ఉండ డం జరిగింది. సుదీర్ఘమైన తమ చరిత్రలో ఆంధ్రులు అత్యల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగినారు అని స్వయం గా గుంటూరు జిల్లాకు చెందిన, నాగార్జున విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేసిన బి.ఎస్.ఎల్ హనుమంతరావు రాశారు.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రాంతం మొత్తంగా గాని, తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాలు అన్నీగాని 1956కు ముందు ఒకే పాలనలో ఎప్పుడూ లేవు. ఈ భూభాగంలో అతి ఎక్కువ ప్రాంతాలను ఏకచ్ఛత్రాధిప త్యం కింద పాలించిన రాజవంశాలు శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు మాత్రమే. క్రీ.పూ. మూడో శతాబ్దం మధ్య నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం తొలిరోజుల దాకా నాలుగు శతాబ్దాల పాటు పాలించిన శాతవాహనులు ఎక్కువగా ఇవాళ్టి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి పాలించారు. వారు ఆ నాలుగు శతాబ్దాల కాలంలో తూర్పు సముద్రాన్ని చేరిన ఆధారాలున్నాయి గనుక కోస్తాంధ్రలో కొంతభాగం వారి ఏలుబడిలోకి వచ్చిందని అనుకోవచ్చుగాని మిగిలిన తెలుగు ప్రాంతాలు వారి పాలనకు బైటనే ఉండిపోయాయి.

శాతవాహనుల తర్వాత కాకతీయుల వరకు తెలుగు వారు వేరువేరు చిన్న రాజ్యాల పాలనలలోనే ఉన్నారు. ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, కళింగ రాజ్యాలు, విష్ణుకుండినులు, పల్లవులు, రేనాటి చోడులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, హైహయులు, వగైరా ఎన్నో వంశాలకు చెందిన రాజులు ఈ ఎనిమిది తొమ్మిది శతాబ్దాలలో తెలుగువారిని పాలించారు. వీరిలో అతి పెద్ద భూభాగాన్ని పాలించినవారు కూడా ఇవాళ్టి నాలుగు జిల్లాలకు మించి పాలించలేదు. పైగా ఈ రాజుల మధ్య, వారి సామంతుల మధ్య నిత్యం యుద్ధాలు, ఘర్షణలు జరిగాయి గనుక, ఆనాటి రవాణా సంబంధాలు అత్యల్పం గనుక ఆయా ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఐక్యత ఉండిందని కూడ చెప్పడానికి వీలులేదు. ఆతర్వాత 950 నుంచి 1323 వరకు నాలుగు వందల సంవత్సరాలు హనుమకొండ, వరంగల్లు రాజధానులుగా పాలన నడిపిన కాకతీయుల కాలంలో, ముఖ్యంగా 1199 నుంచి 1262 వరకు పాలించిన గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అలా చూసినా మొత్తంమీద కాకతీయుల కాలంలో తెలుగువారందరూ ఒకేపాలనలో ఉన్న కాలం నూటయాభై ఏళ్లకు మించదు.

కాకతీయుల పతనం నుంచి కుతుబ్ షాహీల పాలన మొదలయ్యేదాకా, పదహారో శతాబ్ది మధ్య దాకా, మళ్లీ తెలుగు ప్రజలు వేరువేరు పాలనల కింద నే కొనసాగారు. ఎక్కడికక్కడ రెడ్డి రాజులు, నాయక రాజులు తలెత్తి ప్రస్తుత జిల్లా కన్నా తక్కువ భాగాన్ని మాత్రమే పాలించారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం విశాలమైనదే గాని, మహాఘనత వహించిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడ ఆ పాలన కృష్ణానదిని దాటి తెలంగాణలో అడుగుపెట్టలేదు. తెలుగు ప్రజలను ఏకం చేయలేదు. రాచకొండ, ఖమ్మం, కొండపల్లి వంటి దుర్గాల మీద శ్రీకృష్ణదేవరాయల దాడి ఆ దుర్గాలను దోచుకోవడానికే గాని తెలుగు ప్రజలను ఏకం చేయడానికి కాదు!

విజయనగర పతనానంతరం గోల్కొండ రాజధానిగా తలెత్తిన కుతుబ్ షాహీల కాలంలో, దాదాపు 1670 ప్రాంతంలో దాదాపు ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే పాలన కిందికి వచ్చింది. కానీ అప్పుడు కూడ కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని గణనీయమైన భాగాలు ఆ పాలనలో భాగం కాలేదు. మొఘల్ చక్రవర్తుల సామంతులుగా ఉండి 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అసఫ్ జాహీలు దాదాపు కుతుబ్ షాహి రాజ్యాన్నే పాలించారు కాని 1766 నుంచి 1802 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలను బ్రిటిష్ పాలకులకు ఇచ్చేశారు. మొత్తంగా తేలేదేమంటే, చంద్రబాబు తెలుసుకోవలసినదేమంటే, తెలుగువారు ఒకే పాలన కింద ఉన్న సమయాలు శాతవాహనుల పాలనలో దాదాపు 200 సంవత్సరాలు, కాకతీయుల కాలంలో దాదాపు150 సంవత్సరాలు, కుతుబ్ షాహి అసఫ్ జాహీ పాలనలో దాదాపు వంద సంవత్సరాలు, వెరసి మొత్తం 450 సంవత్సరాలు మాత్రమే.ఇంతకూ ఎంతకాలం కలిసి ఉన్నారు, లేదా విడిగా ఉన్నారు అనేది ప్రశ్న కాదు, ఒకరితో ఒకరు ఎట్లా ఉన్నారు అనేది ప్రశ్న. మొత్తానికి మొత్తం మూడువేల ఏళ్లూ కలిసే ఉన్నప్పటికీ కూడా,జరిగిన అన్యాయాలు, వివక్ష, ద్రోహాలు, వాగ్దానాల ఉల్లంఘనల తర్వాత విడిపోక తప్పని స్థితి ఏర్పడింది. విడిపోవాలనే కోరిక సమంజసమైనదే, న్యాయమైనదే. ఆ కోరికను తప్పుడు చరిత్ర సాయంతో కాదనడం అవివేకం, అజ్ఞానం, అన్యాయం, అమానవీయం.

ఇక పొట్టి శ్రీరాములు తెలుగువారి ఐక్యత కోసం ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు నోట పలికిన రెండో అబద్ధం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాషా ప్రాంతాలను వేరు చేసి రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాత్రమే, కొత్త రాష్ట్రానికి రాజధాని గా మద్రాసు ఉండాలని మాత్రమే. నిరాహారదీక్ష సాగుతుండగానే 1952 డిసెంబర్ 8న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని, కాని ఆంధ్ర రాష్ట్రవాదులు అడుగుతున్నట్టుగా వారికి మద్రాసు ఇవ్వడం కుదరదని ప్రధాని నెహ్రూ అన్నారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత కూడ శ్రీరాములు నిరాహారదీక్ష విరమించలేదు, ఆ తర్వాత వారానికి మరణించారు. అంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కన్నా, మద్రాసును ఆంధ్రకు ఇవ్వడమే ప్రధానమైందన్నమాట. అప్పటికే కొందరి మనసుల్లో విశాలాంధ్ర భావన ఉండవచ్చుగానీ పొట్టి శ్రీరాములు ప్రకటించిన డిమాండ్లలో మాత్రం ఆ ప్రస్తావన లేదు. ఆయన కోరని డిమాండ్‌ను ఆయన నోట పెట్టడం చంద్రబాబు వంటి చరిత్ర వద్దనే వారికి మాత్రమే చెల్లుతుంది.
అబద్ధాలతో, వక్రీకరణలతో పాలన సాగించవచ్చుగాని, చరివూతను పునర్నిర్మించలేమని, ప్రజా ఉద్యమాల మీద బురద చల్లలేమని చంద్రబాబుకు తెలిస్తే బాగుండును!

1 comment:

  1. శాతవాహనుల కాలంలో కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో మాహరాష్ట్రి భాష మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు మాట్లాడలేదు. అప్పటికి ఇంకా తెలుగు పూర్తిగా వృద్ధి చెందలేదు. కడప ప్రాంతాన్ని పరిపాలించిన రేనాటి చోళులు, కావేరీ తీర ప్రాంతాన్ని పరిపాలించిన తంజావూరు రాజులు తెలుగు మాట్లాడారనడానికి ఆధారాలు ఉన్నాయి కానీ శాతవాహనుల కాలంలో కృష్ణా నదికి ఉత్తరాన తెలుగు మాట్లాడేవాళ్ళనడానికి ఆధారాలు లేవు.

    ReplyDelete