Monday, November 7, 2011

కాంగ్రెస్ జిత్తులకు మాయావతి పైయెత్తు

2004 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఆశగా చూపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 లో కూడా తెలంగాణాలో ఎన్నికలు ముగిసే వరకూ అదేపాట పాడి, ఎన్నికలు పూర్తైన మరుక్షణం వైయెస్ రూపంలో తొండి చేసింది.

ఇక వీలైనంత కాలం సమస్యను నానపెట్టి, వీలుకానప్పుడల్లా కమిటీలు కాకరకాయలూ అంటూ చేయవలసినంత తాత్సారం చేసింది. అన్ని కమిటీలు దాటి అమ్మ గారిదక్కరికి సమస్య వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇది చాలా క్లిష్యమైన సమస్య అనీ, దీంట్లో వేలు పెడితే ఇంకా పదో పరకో రాష్ట్రాల డిమాండ్లు వస్తాయంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టింది. మరి ఈ విషయాలు 2004 లోనో, 2009 లోనో ఎందుకు గుర్తుకు రాలేదంటే సమాధానం వుండదు.

ఇదిలా వుండగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి కంచుకోటను పగలగొట్టడానికి ఎత్తులు వేస్తూ బుందేల్ ఖండ్ పాట పాడసాగింది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో వుండికూడా గత ఏడు సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్న పార్టీ ఇప్పుడు బుందేల్ ఖండ్ విషయంలో ఏదో చేస్తుందనేది హాస్యాస్పదమే అయినా అధికారం కోసం ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. 

కాకపోతే ఇక్కడే ఆ పార్టీ మాయావతి తెలివితేటలను తక్కువగా అంచనా వేసింది. హటాత్తుగా ఇప్పుడు నవంబర్ 21 నాడు ఉత్తరప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా విభజించే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది కాంగ్రెస్ పరిస్థితి.


రాష్ట్ర విభజన అస్త్రంతో మాయావతిని ఇబ్బందులకు గురి చేయాలని కాంగ్రెస్ తలపోసింది. కాని రాష్ట్ర విభజన గురించి ప్రకటించడం ద్వారా, అది తనకే లాభమని మాయావతి ప్రకటించినట్టయింది. రాష్ట్ర విభజన వల్ల BSP నాలుగు రాష్ట్రాల్లో నలుగురు ముఖ్యమంత్రులను తయారు చేసుకోగలదు. పదవుల ఎరతో ఎక్కువమంది నాయకులను సంతృప్తి పరచగలదు. తద్వారా పార్టీని ఎక్కువగా బలోపేతం చేసుకోగలదు. పైగా చిన్న రాష్ట్రాలు దళితులకు అనుకూలం అన్న అంబేద్కర్ సూత్రం ఎలాగూ ఉండనే వుంది.

ఇదివరకే బక్రీద్ పండగ తర్వాత తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని కాంగ్రెస్ కేంద్ర కమిటీ హామీ ఇచ్చింది. మారిన పరిస్థితులలో తన ప్రకటన ఎలా ఉండాలన్న విషయం మీద ఆ పార్టీ పునరాలోచించుకోక తప్పదు. ఒక వేళ తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటన ఇస్తే, అది ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాక ఆ పార్టీ క్రెడిబులిటీ పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుంది.

No comments:

Post a Comment