Tuesday, June 7, 2011

ఉద్యమంల సమైక్యవాదులే ఎందుకు గెలుస్తున్నరు?

ఉద్యమంల సమైక్యవాదులే ఎందుకు గెలుస్తున్నరు?  ఇది ప్రతి తెలంగాణా వాడిని తొలుస్తున్న ప్రశ్న. అవును, 1956ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ మరుక్షణం నుంచి ఏదోఒక విధంగా పోరాటాలు రగులుతనే ఉన్నయి. అవి అణచి వేయబడుతనే ఉన్నయి. లేదా, కొత్త జీవోలో, కొత్త ఒప్పందాలో తెచ్చి కొత్తఆశలు రేకెత్తించ బడుతున్నయి. ప్రజలు మళ్ళా కొన్నిరోజులు నోర్మూసుక కూర్చుంటున్నరు. సమైక్యవాదపు అసలురంగు మల్లొకసారి బయటపడుతది. మళ్ళా పోరాటాలు మొదలుపెడుతరు. ఇదీ గడిచిన యాభై ఐదేళ్ళ తెలంగాణా ప్రత్యేకవాద చరిత్ర.

ఈ క్రమంల ప్రతీసారీ సమైక్యాంధ్ర వాదులు తెలంగాణా ఉద్యమం పై పైచెయ్యి సాధిస్తున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా నోటివద్దకు వచ్చిన కూడు గుంజుకున్నట్టు మొన్న డిసెంబరు పది నాడు సమైక్యవాదులు ఆడిన దొంగాట, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కితీసుకునేటట్టు చేసిన విధం తెలంగాణా ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఫలితం వందలాది ఆత్మహత్యలు.

పుండుమీద కారం జల్లినట్టు పదేపదే మీనాయకులు చేతగాని వాళ్ళని, వాజమ్మలని సమైక్యవాదులు దెప్పడం మొదలయ్యింది. వీళ్ళ మాటలు ఎట్ల ఉంటయంటే, అక్కడికి సీమాంధ్ర నాయకులు చాలా గొప్పవాళ్ళని, నిజాయితీ పరులని, ప్రజాసేవయే వాళ్ళకు తెలిసిన విద్య అని. అది నిజం కాదని అందరికీ తెలుసు. అదే నిజమైతే ఒక్కొక్కరి సీటు కింద వేలకోట్ల రూపాయలు కుప్పలుబడి ఉండవు.

పైనించి చూసినప్పుడు తెలంగాణా ఉద్యమం మీద సమైక్యాంధ్ర వాదులు పైచెయ్యి సాధిస్తున్నట్టు కనిపించొచ్చు. అయితే తెలంగాణా ఉద్యమం ఒక ప్రజాఉద్యమం. ప్రజాఉద్యమాలు ఒక్క రాత్రిలో పుట్టుక రావు. ఒక్క రాత్రిలో ఫలితాలు రావు. ఐతే ఉద్యమం సాధించిన విజయాలు లేక పోలేదు. 2009 డిసెంబరు 9 రోజున చిదంబరం చేసిన ప్రకటన వాటిల ఒకటి. 

కాని 1990ల చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినంక పరిస్థితి కొంత మారింది. కొన్ని ఆటుపోట్లు ఉన్నా, నిలకడగా ఉద్యమం ముందుకు సాగుడు మొదలు పెట్టింది. చంద్రశేఖరరావు 2004ల కరడు గట్టిన సమైక్యవాది రాజశేఖర్ రెడ్డి తోటి, 2009ల మరో సమైక్యవాది చంద్రబాబు తోటి జట్టు కట్టి ప్రజల కోపానికి గురయ్యిండు. ఆ కోపం ఎన్నికల ఫలితాల రూపంలో బయటపడ్డది. పార్టీపరంగా నష్టపోయినా ఒకవిషయంలో మాత్రం ఆయన విజయం సాధించిండు. రాష్ట్రంలోని రెండు అతిపెద్ద పార్టీలతోని తెలంగాణాపాట పాడించిండు. ముఖ్యంగా ఎన్నడూ తన పార్టీల తెలంగాణా పేరుకూడా ఎత్తనియ్యని చంద్రబాబుతోని జైతెలంగాణా అనిపిచ్చిండు. ఇవి తెలంగాణా ఉద్యమం సాధించిన విజయాలే.

మరి సీమాంధ్ర ఉద్యమం మాటేమిటి? నిజానికి ఎంతోమంది సీమంధ్ర మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దళిత నాయకులు ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికే మద్దతు ఇస్తున్నరు. ఎందుకంటే వాళ్లకు ప్రజావ్యతిరేకత భయం లేదు. ఎందుకంటే సీమాంధ్ర ప్రజలల్ల రాష్ట్రవిభజన మీద వ్యతిరేకత లేదు కాబట్టి. 

సమైక్యవాదులుగా పేరుపడ్డ చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలకు మద్దతిచ్చే తెలంగాణా నాయకులు కూడా ఒకవైపు వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటనే, ఇంకోవైపు తెలంగాణా వాదులమని చెప్పుకుంటరు. ఇది హాస్యాస్పదంగ కనిపిచ్చినా, వారికి అది తప్పని అవసరం. ఎందుకంటే వాళ్ళ మనసులల్ల సమైక్య వాదం ఉన్నా బయటికి మాత్రం చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే ప్రజాగ్రహాన్ని చూడవలసి వస్తది. రాజకీయులకు ప్రజలతోటే పనికదా? అందుకనే ప్రజా వ్యతిరేకమైన సమైక్యరాగాన్ని బహిరంగంగ ఆలపించలేరు.

ఇంకపొతే అసలు విషయం, చిదంబరం ప్రకటన తర్వాత సమైక్యవాదుల గెలుపు. ముందే అనుకున్నట్టు ప్రజా ఉద్యమం ఒక రూపానికి రావాల్నంటే సమయం తీసుకుంటది. కాని డిసెంబరు తొమ్మిది రాత్రి పదకొండు గంటలకు చిదంబరం ప్రకటన చేస్తే ఆర్థరాత్రి సీమాంధ్ర ప్రజలు ఇంకా నిద్రకూడా లేవకముందే సదరు సమైక్యవాద నాయకులు రాజీనామాలు చేస్తరు. ఉదయం పదిగంటలలోపు ఫ్లెక్సీలు, టెంట్లు, స్టేజీలు, కార్లు, జీపులు, పగటి వేషాలు రడీగా తయారయినై. ఇది ఎట్ల సాధ్యమో చిన్నపిలగానికి కూడా అర్థమయ్యేదే. 

ప్రజలు చాల నిదానంగ పనిచేస్తే, వ్యాపార వర్గాలు మాత్రం చాల వేగంగా పావులు కదుపుతయి. సిండికేట్లు ఏర్పాటు చేసుకుంటయి. ఎవరు ఏపని చేయ్యాల్నో నిర్ణయించబడుతది. ఒక వైపునుండి లాబీయింగు జోరందుకుంటది. ప్రత్యర్థికి విషయం అర్థమయ్యే లోపల జరిగే నష్టం జరిగిపోతది. మొత్తంగచూస్తే పదిహేనురోజుల సమైక్యాంధ్ర ఉద్యమం అదేవిధంగ జరిగిందని వేరే చెప్పవలసిన అవసరం లేదు.     

నిర్ణయాలు తెలంగాణాకు అనుకూలంగా వచ్చినప్పుడు ఇట్లాంటి వ్యాపార ఉద్యమాలు ముందుముందు కూడా వస్తయి. వాటిని ఎదుర్కోవడానికి తెలంగాణా ప్రజలు సంసిద్ధులై అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ప్రజలు ఐకమత్యం తోటి, ఉద్యమం ఆపకుండ ఉధృతం చెయ్యడమే ఈ వర్తక ఉద్యమాలకు సరయిన మందు.  

సమైక్యవాదం గెలిచినట్టు కనబడుడుకు ఇంకొక కారణం కూడ ఉన్నది. సమైక్య వాదులు కోరుతున్నది సమైక్య రాష్ట్రం. అది ఇప్పుడు ఉన్నదే. దానికోసం వాళ్ళు ఏమీ చేసుడు అవసరం లేదు. అదే తెలంగాణా వాదులు కోరుతున్నది రాష్ట్ర విభజన. అంటే రాష్ట్రాన్ని విభజించాలె. రాష్ట్రాన్ని విభజించే వరకు తెలంగాణా వాదులు గెలిచినట్టు కాదు. కాని రాష్ట్రం కలిసి ఉన్నంత వరకు సమైక్య వాదులు గెలుస్తున్నట్టే. అది పైకి కనిపించేది. కాని సమైక్య వాదుల నిజమైన గెలుపు అంటే తెలంగాణా ప్రజల మనసుల నుండి విభజన వాదాన్ని పోగొట్టుడు. ఆ విషయంల మాత్రం సమైక్య వాదులు ఎప్పటికీ గెలువలేరు.

11 comments:

  1. మీరు ఈ వ్యాఖ్యని ప్రచురిస్తారో లేడో నాకు తెలియదు. మీ విశ్లేషణ సరికాదు. మీరు కోస్తా-సీమల్ని ఎప్పుడూ సందర్శించలేదని స్పష్టమవుతోంది. అక్కడ గత వందేళ్ళుగా పాతుకుపోయిన తెలుగుజాతి సమైక్య సెంటిమెంటు మీకు తెలియదు, సమైక్యవాదం కొద్దిమంది పెట్టుబడిదార్లదేననీ, తెలంగాణవాదం ఒక్కటే ప్రజా-ఉద్యమం అనీ, రాష్ట్రం ముక్కలవుతుంటే కోస్తా-రాయలసీమల ప్రజల బీడీలు కాల్చుకుంటూ చోద్యం చూస్తారనీ అనుకోవడం తెలంగాణవాదుల అమాయకత్వం. అదే నిజమైతే రెండేళ్ళ క్రితం హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టి.ఆర్.ఎస్. ఎందుకు జంకిందనే ప్రశ్నకు సమాధానం కావాలి. ఈనాటికీ తెలంగాణ పేరు చెప్పి హైదరాబాదీల వోట్లు అడిగేంత ధైర్యం ఏ పార్టీకీ లేదు. సమైక్యానికి ఇంతకాలమూ ఉద్యమం అవసరం లేకపోయింది. కారణం - ఉనికిలో ఉన్నది సమైక్యరాష్ట్రమే కనుక. సమైక్యం ఆధికారికం (official) కనుక. తెలంగాణవాదం అనాధికారికం.

    రాష్ట్ర సమైక్యానికి తెలంగాణవాదం నుంచి నిజమైన ప్రమాదం (Real threat) ఉందని కోస్తా-సీమల ప్రజలు అనుకోలేదు 2009 డిసెంబరు 9 దాకా ! చిదంబరం ప్రకటనతో "అది నిజమైన ప్రమాదం" అని ఎప్పుడైతే గ్రహించారో, ఆ ప్రజల ఆలోచనల్లో చాలా మార్పొచ్చింది. వాళ్ళంతా విభేదాలన్నీ పక్కన బెట్టి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. సమైక్య ఉద్యమాన్ని ప్రారంభించినది నాయకులే అయినప్పటికీ కోస్తా-సీమ ప్రజల్లో దానికి గట్టి మద్దతుంది. ఈ సత్యాన్ని మీరు విస్మరించలేరు. అయితే ఈ హఠాత్‌పరిణామాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోతున్నారన్నదీ, వాళ్ళ మేధస్సులలో ఇది రిజిస్టర్ కావడం లేదన్నదీ వాస్తవం. 09-12-2009 కి ముందున్నట్లే మన్నుదిన్న పాముల్లా ఎందుకుండరు ఈ కోస్తా-సీమల ప్రజలు ? అని వాళ్ళు వాపోతున్నారు.

    ఇహపోతే "ఎప్పుడూ సమైక్యవాదమే ఎందుకు గెలుస్తోంది ?" అనే మీ ప్రశ్నకు ఏ ప్రజాస్వామ్యంలో నైనా లభించగల ప్లెయిన్ సమాధానం ఒక్కటే - సమైక్యవాదులు (హైదరాబాదు మెట్రోపాలిటన్ ఏరియాతో కలిపి) అయిదున్నర కోట్లమంది ఉన్నారు. వేర్పాటువాదులు మాత్రం మూడుకోట్లమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి తెలంగాణవాదపు ఓటమి ఒక అనివార్య పరిణామం, ఇప్పుడైనా ఇంకో యాభయ్యేళ్ళ తరువాతైనా !

    ReplyDelete
  2. Dear Anonymous

    ఉద్యోగ రీత్యా నేను కోస్తా, సీమలకు పలుమార్లు వెళ్తూనే ఉంటాను. ఎంతో మంది మిత్రులు కూడా ఉన్నారు. అది వేరే విషయం.

    ఎన్నికలు అన్నిమార్లు ప్రజాభుప్రాయాన్ని ప్రతిఫలించవు. ఒక వేళ ప్రతిఫలిస్తాయని మీరంటే, 2004లో కాంగ్రెస్‌ని, 2009లో తెలుగుదేశానికి ఆంధ్రాలో అన్నిసీట్లు ఎట్లా లభించాయని నేను అడగవలసి ఉంటుంది.

    >>>రాష్ట్ర సమైక్యానికి తెలంగాణవాదం నుంచి నిజమైన ప్రమాదం (Real threat) ఉందని కోస్తా-సీమల ప్రజలు అనుకోలేదు 2009 డిసెంబరు 9 దాకా !

    అన్ని పార్టీలు తెలంగాణా వాదాన్ని తలకెత్తుకున్నా అలా అనుకోలేదంటే తెలంగాణా ప్రజలని బాగానే మోసం చేస్తున్నామని సంతోషించి ఉండాలి బహుషా! అంతేనంటారా? అయినా లగడ పాటికి రాత్రి రెండు గంటలకే ఎలా చెప్పగలిగారు మీరంతా ఉద్యమాలు చేయబోతున్నారని? Really great!

    >>>09-12-2009 కి ముందున్నట్లే మన్నుదిన్న పాముల్లా ఎందుకుండరు ఈ కోస్తా-సీమల ప్రజలు ?

    అబ్బే! మన్ను తిన్న పాముల్లా ఎప్పుడున్నారు మీరు? 1969లో కేవలం ముల్కీ రూల్స్ వస్తేనే ప్రత్యేక ఉద్యమాలు చేసి పుణ్యం గట్టుకున్నారుగా!

    >>>వేర్పాటువాదులు మాత్రం మూడుకోట్లమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి...

    మూడు కోట్ల మంది వేర్పాటు కోరుకుంటున్నారని ఒప్పుకున్నందుకు సంతొషం. ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రం ప్రకారమైనా, విభజన కోరేటప్పుడు, విభజన కోరుతున్న ప్రాంతంలో మెజారిటీ చూస్తారు తప్ప, రెండు ప్రాంతాలా మెజారిటీ చూడరు. మీ వాదన ఎలా వుందంటే India, China కలిసి ఉండాలని China వారు కోరితే రెండింటినీ కలిపి వేయాలన్నట్టు!

    ReplyDelete
  3. మీ విశ్లేషణ బాగానే ఉంది . కానీ .. వాస్తవ ద్రుక్పధంతో లేదు . ప్రపంచవ్యాప్తంగా బలవంతుడితే పైచేయి . అందువల్లనే అమెరికా తన ప్రజా వ్యతిరేక విధానాలతో అనేక దేశాలని దోచుకుంటుంది . సీమాంధ్రులకి తెలంగాణాలో తమ పెట్టుబడి ప్రయోజనాలు ఇమిడి ఉన్నంత కాలం .. లక్షల మంది తెలంగాణా వాదులు చచ్చినా ప్రయోజనం లేదు . ఎందుకంటే ఢిల్లీ పెద్దలు కూడా సీమాంధ్ర జాతివారే . వారు సీమాంధ్రుల ప్రయోజనాలని కాదని రాష్ట్ర విభజన చేస్తారని అనుకోవటం తెలంగాణా వారి అమాయకత్వం .

    ReplyDelete
  4. రమణ గారు

    మీరు చెప్పినట్టు కర్ర ఉన్నవారిదే బర్రె. అయితే ప్రజాస్వామ్యంలొ కర్ర ఎవరిచేతికి వెల్తదో ఎవ్వరు చెప్పలేరు. ఏమో, రెపు తెలంగాణా పార్టీ అత్యధిక సీట్లు అసెంబ్లీలో పార్లమెంటులో గెలవొచ్చు. అప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతదిగా?

    ReplyDelete
  5. శ్రీకాంత్‌గారూ (ఇది మీ అసలుపేరు అవునో కాదో తెలియదు,. కాకపోతే మన్నించండి) నేను ఇక్కడ మొదట వ్యాఖ్య వ్రాసిన అనానిమస్‌ని ! మీతో వాదించడం కొరకు నేనిది వ్రాయడం లేదు, నా మనసులో మాట చెబుదామని వ్రాస్తున్నానంతే.

    మీరు చెప్పిన అంతర్జాతీయ న్యాయసూత్రాలు బావున్నాయి. కానీ రాజధాని నగరం నెలకొని ఉన్న ప్రాంతం వాళ్ళు విడిపోతామనడం ఇప్పటి వఱకు చరిత్రలో ఎప్పుడూ ఏ దేశంలోనూ జఱగని ఒక అపూర్వ, అద్భుత అరుదైన విషయం. ఈ విడ్డూరపు సిచ్యువేషన్ ని ఆ అంతర్జాతీయ న్యాయసూత్రాల రూపకర్తలే ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టి అందుచేత అవి మన కేసుకు వర్తించవు.

    ఇహపోతే ఇండియా - చైనా అంటున్నారు. మన మధ్య అంత తేడాలుంటే తప్పకుండా విడిపోవాల్సిందే. కానీ మనం ఒకే భాష, ఒకే మతం ఒకే కులాలూ, ఒకే రకమైన గోత్రాలూ గల అన్నదమ్ములం. కనీసం ఇరుగుపొరుగు జిల్లాలవాళ్ళం. ఒక రెండుగంటలు ప్రయాణం చేస్తే ఇటు హైదరాబాదో, అటు విజయవాడో చేరుకునేంత దగ్గరివాళ్ళం. మనం ఉండాల్సినంత పోలికతో లేని మాట నిజమే, కానీ విడిపోవాల్సినంత లేదా కొట్టుకుచావాల్సినంత తేడాలు కూడా మన మధ్య ఏమీ లేవు. తెలంగాణ సమస్యలు సమైక్యరాష్టంలో పరిష్కరించడం నిండా సాధ్యమే అని నమ్మేవాళ్ళల్లో నేనొకణ్ణి. అందుచేత ఒకవేళ మనం విడిపోతే మనకేమీ అనిపించకపోవచ్చు గానీ నాన్-తెలుగు జనానికి అదొక భేదించలేని చారిత్రిక మిస్టరీ అయి కూర్చుంటుంది.

    మరోపక్క తెలుగువాళ్ళం బలహీనులం అనేక రకాలుగా ! హిందీ తతిమ్మా పెద్ద జాతులకున్నంత వసతీ, భూమీ, జనాభా, బలం మనకు లేవు. మన నాయకులు దేశంలో అందరికంటే వరస్ట్. బలహీనులకు కొట్టుకు చచ్చే హక్కు ఆటోమేటిగ్గా రద్దవుతుంది. మనకంత లగ్జరీ లేదేమో ననిపిస్తోంది. తెలంగాణవాదులు అర్థం చేసుకోగలిగితే - వాస్తవానికి మనం ఇతర రాష్ట్రాల చేతుల్లో అడుగడుగునా దోపిడికి గుఱవుతున్నాం. మనం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతరులతో హోరాహోరీ పోరాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం.

    ReplyDelete
  6. Anonymous గారు,

    న్యాయ సూత్రాలు రాజధాని ఉంటే ఒకలాగ, ఓడరేవు ఉంటే ఒకలాగ మారవు. అప్పుడే వాటిని న్యాయసూత్రాలు అంటరు. పైగా ఆ రాజధాని మీరు వెంట తీసుక వచ్చిందీ కాదు, రేపు తీసుక వెళ్ళగలిగేదీ కాదు.

    హైదరాబాదులో కొంత అభివృద్ధి జరగి ఉండొచ్చు. కాని అది అన్ని ప్రధాన నగరాల్లో ఎట్ల జరిగిందో ఇక్కడ కూడ అట్లనే జరిగింది. హైదరాబాదు మొదటినుండీ దేశంల అయిదో పెద్ద నగరమే అన్నది మరువకండి.

    హైదరాబాదుకు సమైక్య రాష్ట్ర్మ్ పెట్టిండేం లేదు. పైగా సమైక్య రాష్ట్రాన్నికి హైదరాబాదే మొదటినుంచీ ఇంతో అంతో పెడుతుంది. హైదరాబాదు రెవెన్యూని రాష్ట్రం వాడుకుందే తప్ప రాష్ట్రం రెవెన్యూని హైదరాబాదు ఎప్పుడూ వాడలేదు. అందులో కూడ హైదరాబాదు వళ్ళ ఎక్కువ లాభ పడింది ఆంధ్ర ప్రాంతమే. అయితే ఇప్పటిదాకా జరిగింది కాబట్టి కలకాలం ఇలాగే సాగాలంటే కుదరదు.

    పోనీ మీమాట ప్రకారం హైదరాబాదు ఒక్కటే మీరు వ్యతిరేకతకు కారణమనుకుంటె అదే విషయం మీ మేధావులు, నాయకులు నిజాయితీగ చెప్పితె బాగుంటది. అప్పుడు దానికి ఒక సహేతుకమైన పరిష్కారం లభించొచ్చు.

    ఈ రాష్ట్రం ఒక ఒప్పందం మేరకు ఏర్పరచబడ్డది. ఆ ఒప్పందం సరిగ్గ అమలు జరుపాలని మా తెలంగాణా వాల్లం గత 55 ఏళ్ళల్లో అనేక సార్లు రక రకాల రూపాల్లో ఉద్యమాలు చేసినం. ఫలితంగా రకరాకాల GOలు వచ్చినై. కానీ ఏవీ అమలుకు నోచలేదు. పైగా మరిన్ని విషయల్లో తెలంగాణాపై వంచన కొనసాగుతనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ సమస్యకు సమైక్యాంధ్రల పరిష్కారం లభించడం కల్ల. విభజనే దీనికి కలిగిన ఏకైక పరిష్కారం.

    మనం విడిపోవడం వల్ల భూమి, ఆకాశం ఏకం కావు. మీ ఆంధ్రులు మాకంటే తెలివైన వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతది. మీ ప్రాంతంల ఒక గొప్ప రాజధాని ఏర్పడుతది. మీవాళ్ళు చెప్పుకుంటున్నట్టు తెలంగాణా అబివృద్ధి కోసం మీరు త్యాగాలు చెయ్య నవసరం లే.

    ఇంక పోతే మా అవసరాలేంటివో, మా ప్రాధాన్యత లేంటివో మీకన్నా మాకు బాగా తెలుసు. మా పాంతాన్ని మేం బాగు చేసుకుంటమనే విశ్వాసం మాకుంది. కాబట్టి కలసి కలహించుకునే కన్నా విడిపోయి ఇద్దరం సుఖంగా ఉందాం.

    రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన సంబంధాలు, బాంధవ్యాలు మారి పోవు. అవి కొనసాగుతనే ఉంటయి. ఇప్పుడు కూడ ఉత్తర తెలంగాణ వారికి మహారాష్ట్ర తోటి, అనంతపూర్ వాళ్ళకు కర్నాటక తోటి, చిత్తూరు వాళ్ళకు తమిళనాడు తోటి, ఉత్తరాంధ్ర వాళ్ళకు ఒరిస్సా తోటి సంబంధాలున్నయి. రేపు కూడ అట్లనే ఉంటయి. రాష్ట్రాల ఏర్పాటు సంబంధ బాంధవ్యాలకు అడ్డు కాదు.

    విడిపోతే మనం బలహీనమయితం అన్నది పసలేని వాదన. విడిపోతే మనకు ఇద్దరు CMలు ఉంటరు. ఇద్దరిల కనీసం ఒక్కరైనా కేంద్రంల అధికార పార్టీల ఉంటరు. ఆ విధంగ తెలుగు జాతికి అంతొ ఇంతొ మేలే జరుగుతది. ఇప్పుడు కలిసి ఉండి కూడా రెండు మార్లు కేంద్రంల అధికారంల ఉన్న పార్టీని 33 సీట్లిచ్చి గెలిపించి కూడ మనకు ఏం ఒరిగిందో తెల్వనిది కాదు.

    చివరిగా ఇంకో విషయం. జరుగబొయే ఊహాజనిత భయాల గురించి మీరు వాదిస్తున్నరు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి మేం మాట్లాడుతున్నం. తేడా గ్రహించండి.

    ReplyDelete
  7. ఎప్పుడూ మాకు ప్రత్యేక హామీలు కావాలి, ముల్కి రూళ్ళు కావాలి అది కావాలి ఇదికావాలి అనే ఏడుపే. అందరితో సమానంగా ఎందుకు ఉండరు. ఎప్పుడు చూసినా island మనస్తత్వంతో ఏడుస్తుంటారు. దిక్కుమాలిన పిచ్చి ఉద్యమం చూసి చూసి యాసటకొచ్చి ఈ మాటలు రాస్తున్నాను.

    ReplyDelete
  8. మీరు అట్ల ఏడ్చే కదనే మద్రాసు నుండి విడిపొయ్యింది? ఇప్పుడు మా ఏదుపు చూసి అంత యాష్ట కొస్తుందా?

    మరి అప్పుడు హామీలు ఎందుకిచ్చినట్టు. తర్వాత ఎందుకు తుంగల తొక్కినట్టు?

    మీకు మెజారిటీ ఉంది కాబట్టి మమ్ముల నమ్మబలికెటందుకు మీవోల్లే అప్పుడు హామీలు ఇచ్చిన్రు. తీరా నమ్మి కలిసినంక ఆ హామీలను తుంగల తొక్కిన్రు. ఆ హామీలు తుంగలో తొక్కిన్రు కాబట్టే ఇప్పుడు కొత్త హామీలు ఇస్తమంటె ఒద్దంటున్నం. మా రాష్ట్రం మాకు కావాలె నంటున్నం. సమజైందా Anon?

    ReplyDelete
  9. తెలంగాణా వాళ్ళలో లేనిది సీమాన్ద్రులలో ఉన్నది సమైక్యతా. వీధికొక జే.ఏ.సి. ఉంది ఇక్కడ. ఎక్కడ క్రెడిట్ పక్కవాడికి వెళ్ళిపోతుందో అని ఉద్యమం మీదకన్నా పక్కవాడి ప్రయత్నాలను ఆపడం మీదే దృష్టి ఉన్నప్పుడు ఇంక లక్ష్యం సాధించేది ఎప్పుడు?

    ReplyDelete
  10. Let us not fight with each other. 8 crore Telugus must live in peace. So I suggest the following.
    (1) Hyderabad city should made into a Union Territory.
    (2)Hyderabad will be THE PERMANENT CAPITAL of Telangana.
    (3)Hyderabad will be THE TEMPORARY CAPITAL of the remaining State, till new capital is constructed.
    (4) The Central Govt. must bear the cost of theNew Capital.
    LET 8 CRORE TELUGUS LIVE IN PEACE.
    --------A Telugu Loving Mam.

    ReplyDelete
  11. Mam,

    One more time the typical andhraite style of thought process displayed. When you are ready to be a separate state, why do you worry about Hyderabad?

    All the time you people keep telling that if separated
    1. we will not be developed as we did now
    2. Naxalism will prevail in Telangana
    3. Communalism will thrive
    4. No sea port for Telangana
    etc, etc.

    All the time you try to talk about ourselves. Infact it is none of your business. We will take care of ourselves, and you take care of your people.

    Again Hyderabad, not only andhra people are living in Hyderabad. In fact andhra people are a minority considering other people. The people who live in Hyderabad are not bothered at all. Only the people who live other side is worried so much.

    I accept with your proposal, except for the first point, where our clear stand is Hyderabad will remain as an integral part of Telangana.

    ReplyDelete