Thursday, June 30, 2011

మన సమైక్యవాది పోస్టు ఉపసంహరించిన విధంబెట్టిదనిన

ఎనకటికి ఇద్దరన్నదమ్ములు ఉండే వాళ్ళట. ఇద్దరూ కలిసి ఒక దగ్గరే ఉండే వాళ్ళట. అన్న ఒంటెద్దు పోకడ నచ్చక అప్పుడప్పుడు తమ్ముడు విడిపోతనని చెప్పే వాడట. అంతే, ఇంక అన్న బూతులు లంకించు కునే వాడట! అన్నకు భయపడి తమ్ముడు నోరు మూసుకునే వాడట.

ఇలా కొంత కాలం జరిగినంక తమ్ముడు అన్న పెత్తనం సహించలేని పరిస్థితికి వచ్చిండు. అప్పుడు విడిపోతనంటే అన్న తిట్టే బూతులకు భయపడే దశ వెళ్లి పోయింది. అన్న రెండు తిడితే, తమ్ముడు నాలుగు తిట్టిండు. అప్పుడు బుద్దొచ్చింది అన్నకు, కలిపి ఉంచాలంటే తిట్టి చిన్న పిల్లలను కలిపి ఉంచొచ్చేమో కానీ, పెద్దవాళ్ళను కలిపి ఉంచలేమని.

కాని ఈ సంగతి తెలువక మన సోదరుడొకడు 'విశాలాంధ్ర మహాసభ' అని ఒక బ్లాగు పెట్టుకొని తెలంగాణా వారి మీద తిట్ల పురాణం లంకించు కున్నడు. ఈయన తిట్లు చూసిన వాళ్ళు కలల కూడా మళ్ళీ కలిసి ఉంటామని అనుకోరు. ఈయన ఒక విధంగా విడిపోదామనే వాళ్ళకు మేలే చేస్తుండు. మల్ల కలిసే ఆలోచన కూడ రాకుండ చేస్తుండు. అట్లనే ఎవరన్న సమైక్యత,  చట్టుబండలు అనుకుంట ఊగిసలాడుతుంటే వాల్లగ్గూడ సరైన నిర్ణయం తీసుకొనేటందుకు చాతనైనంత సహాయపడుతుండు. 

ఈ మధ్య్యన పైత్యం ఎక్కువై చనిపోయినోల్ల మీద కూడ తిట్లు లంకించు కునుడు మొదలు పెట్టిండు. అందులో ఒకరు జయశంకర్. ఇంకొకరు బుర్ర రాములు. వీళ్ళు చీమకు కూడా అపకారం తలపెట్టే వాళ్ళు కాదు. కాకపొతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద నిలబడ్డ వారు. అదే సదరు పెద్దమనిషికి పెద్ద నేరం లెక్క కనిపిచ్చింది. వాళ్ళు ప్రలలను తప్పు దోవ పట్టించి పబ్బం గడుపుకున్నరట! ఎవరు పబ్బాలు గడుపుకుంటున్నరో, ఎవరు పస్తులుంటున్నరో ఇక్కడ తెలువనోడు ఎవడు. తెలిసి తెలువనట్టు నటించే వోడు ఉంటె ఉండొచ్చు.

ఇంకా ఆవాకులు చవాకులు చాలనే పేలిండు. అవ్వన్నీ ఇక్కడ వివరించడానికి చనిపోయిన వారికి, మనకు కూడ గౌరవం కాదు.

ఈయన రాతలు చూసి సాటి సీమాంధ్ర సోదరులే రోత రాతలను అసహ్యించు కున్నరు. ఇటువంటి పోస్తులేసి సాధించేది ఏమిటని ఈయనకు ఫుల్లుగా గడ్డి పెట్టిన్రు. దెబ్బకి మనోడు పోస్టు ఉపసంహరించు కున్నడు. చివరగా చెప్పేదేమంటే, ఇటువంటివారా, సమైక్యత కోసం పాటు పడేది? వీళ్ళు పాటుపడేది రాష్ట్ర సమైక్యత కోసం కాదు, తప్పుడు ప్రచారాలతో కొంతమంది దోపిడీదారుల కొమ్ముకాసి తమ పబ్బం గడుపుకోవడం కోసం.

ఇంక తన్నులు తినుడు బంద్

అన్ని డేడ్ లైన్లూ ముగిసి పోయినై. కేంద్రం తెలంగాణాకి మొండి చెయ్యి చూపుతుందని  అర్థమైతుంది. రాజకీయ నాయకులు జోరుగ మంతనాలు జరుపుతున్రు. కాని రాజీనామా చేయ్యాలె నంటే ఒక్కడు కూడా ముందుకు రాడు. ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చెయ్యమంటే 'సీమాంధ్ర వాళ్ళు గూడ చేస్తరు, అప్పుడు మా రాజీనామాలకు విలువ ఉండదని' మాట్లాడుతరు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు చెయ్యక పొతే పోయిన్రు, కనీసం రాష్ట్ర మంత్రులన్న చేయ్యున్రి. ఈ ప్రభుత్వంల తెలంగాణా భాగస్వామ్యం లేదు అని చెప్పుతందుకైనా చెయ్యున్రి. ఇప్పుడు గూడ మీరు చెయ్యలేక పొతే 2014 ల మీరు భూస్థాపితం కాక తప్పదు.

రాజీనామాలు చేయ్యున్రా అని ఒకవైపు నుంచి చెప్పుతుంటే ఒకడు పొయ్యి ఉప ముఖ్యమంత్రికి పైరవీలు చేసుకుంటడు. ఇంకోడు మండలి ఇస్తమంటే తల ఊపి వస్తడు. ఇట్లాంటి చెడబుట్టిన చీడ పురుగుల్ని ఇకనైనా ఏరి వెయ్యకపోతే తెలంగాణా మొత్తాన్ని నాశనం బట్టిస్తరు వీళ్ళు.

ఇంకో ఇద్దరు మంత్రులున్నరు. మాట మాట్లాడితే హైదరాబాదు మేం హైదరాబాదు బిడ్డలమంటరు. హైదరాబాదు ప్రజలకు రావలసిన పోలీసు ఉద్యోగాలు ఫ్రీజోన్ పేరు మీద ఎగిరి పోతుంటే వీళ్ళకు పట్టదు. హైదరాబాదుకు మంచినీల్లోచ్చే ప్రాజెక్టుల గురించి వీళ్ళకు పట్టదు. మెట్రో రైలు పేరు జెప్పి హైదరాబాదు మొత్తం రూపం మార్చేస్తుంటే వీళ్ళకు చీమ కుట్టదు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తనే ఉన్నార్రా నాయనా! ఎగిరి పడకున్రి. తొందర లోనే మీరు కిందబడే రోజొస్తది.

ఇంక పొతే రకరకాల జాకులారా, మీరు బందులు పెట్టించి ధర్నాలు జేసి తెలంగాణా ప్రజలకు నష్టాలు కలిగిచ్చుడు, మీరు తన్నులు తినుడు తప్ప అసలు వలసవాది కులాసగానే ఉంటున్నడు. ఇంక మీరు తన్నులు తినుడు, మీ జనాన్ని ఇబ్బంది పెట్టుడు బందు జేయ్యున్రి. మీరు ఇబ్బందులు పెట్టగలిగితే వలస శత్రువును ఇబ్బంది పెట్టున్రి. 

లాంకోహిల్స్ మీద జెండా పాతిన విమలక్కని ఆదర్శం చేసుకొని పోరాటాలు చేయ్యున్రి. అక్రమాలు చేసే కబ్జాకోర్లు ఇకపై ఆటలు సాగవనే గుణపాఠం నేర్వాలే. అంతే గని మీరు దెబ్బలు తిని దవాఖానల మూలుగుతుంటే చూసి నవ్వుడు గాదు.         


Tuesday, June 28, 2011

గుడ్డు పెడితే నాకు, రెట్ట వేస్తే నీకు

ఇప్పుడు రాష్ట్రంలో రెండు పెద్ద ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. ఒకటి చేవెల్ల-ప్రాణహిత, రెండోది పోలవరం. ఈ రెండు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అయితే రెండు ప్రాజెక్టులు ఇవ్వడం కుదరదు, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టే వీలవుతుంది అని కేంద్రం చెపుతుంది.

పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే దీనికి అనుమతులు లేవు. పైగా కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి ఇప్పట్లో తేలేలా లేవు. అనుమతులు లేకుండా జాతీయ హోదా ఇవ్వడం కుదరదు. పైగా ఈ ప్రాంతంలో ఇప్పటికే రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాంతం కరువు కాటకాలలో ఉందని ఏ సర్వే లోనూ ఇంతవరకు చెప్ప బడలేదు. 

ఇక ప్రాణహిత విషయానికి వస్తే, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. దీనివల్ల కరువుతో అల్లల్లాడుతున్న అనేక తెలంగాణా జిల్లాలకు నీల్లందుతాయి. భూగర్భ జలాలు విషపూరితమై తాగే నీరు లేక అలమటిస్తున్న నల్లగొండ జిల్లాకు ఎంతో మేలు చేకూరుతుంది. హైదరాబాదు నగరానికి తాగునీరు సమస్య తీరుతుంది. 

ఈ పరిస్థితిలో నిజమైన సమైక్యవాదాన్ని బలపరచే వారైతే నీటి అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును బలపరుస్తారు. అంతే గాని అది గ్రావిటీ అని, ఇది లిఫ్టు అని, దీనికి కర్చెక్కువ అని (కర్చు పెట్టేది కేంద్రమైనప్పుడు కూడా), కేంద్ర ప్రభుత్వానికి కూడా రాణి సందేహాలు వీరు లేవదీయరు. కాని విచిత్రంగా కొంతమంది సమైక్య జపం చేసేవారు మాత్రం సరిగ్గా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు. 

ఇలాంటి 'గుడ్డు పెడితే నాకు, రెట్ట వేస్తే నీకు' అనే పద్ధతిలో మాట్లాడే వారు సమైక్యవాదులమని చెప్పుకోవడానికి ఎంతమాత్రం అర్హులు కారు. అంతగా ప్రాంతీయ భావాలు కలిగి ప్రాంతీయాభివ్రుద్ధిని మాత్రమె కోరుకునే వారు తమ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉండడాన్ని ఎందుకు ఊహించ లేక పోతున్నారో అర్థం కాదు. విడిపోతే అభివృద్ధి తమ ప్రాంతాన్ని స్వశక్తితో చేసుకోలేమన్న భయమా? ఇతర ప్రాంతాలకొచ్చి 'అభివృద్ధి' చేసే వారు అదేదో తమ ప్రాంతంలోనే చేసుకోవచ్చుగా? 

చక్కగా విడిపోతే రెండు రాష్ట్రాలవుతాయి. రెండు రాష్ట్రాలకు రెండు ప్రాజెక్టులు కేంద్రం ఎలాగూ ఇస్తుంది. అలా కాక కలిసే ఉందాం, మీ ప్రాజెక్టు మాత్రం పక్కన బెడదాం, మా ప్రాజెక్టుకు ఇంకా ఏ క్లియరెన్సు రాకపోయినా వేల కోట్లు తగలేద్దాం అనేది ఏ రకమైన వాదనో విజ్ఞులు గ్రహించాలి.

మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఏంజేస్తున్నరు?

మాట మాట్లాడితే మన సమెక్కుడు వాదులు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఏమ్జేస్తున్నరు అని అడుగు తుంటరు. కొంత మంది ఇంకా ముందుకు పోయి మీ ప్రజా ప్రతినిధులు ఏమ్పీలాడ్స్ నిధులు ఏంజేస్తున్నరు అని కూడా అడుగుతరు.

లక్షా ఇరవై కోట్ల బడ్జెటు తో నడిచే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణా పనులు కావల్నంటే ఏమ్పీలాడ్స్, ఎమ్మెల్యే లాడ్స్ మాత్రమె దిక్కన్న మాట! అంతేగని ప్రభుత్వం నుంచి పైసా రాలదని వీళ్ళు చెప్పకనే చెప్పుతున్నరు. ఈ ఆంద్రప్రదేశ్  రాష్ట్రం ఉన్నంత వరకు ఈ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమిష్టి బాధ్యత. అంతేగని కుర్చీమీద నేను కూర్చుంట, పెత్తనం నెంజేస్త, పైసలు నేను మింగుత, నీ అభివృద్ధి నువ్వు జేసుకో అన్నంక ఇంక సమైక్య రాష్ట్రం ఎందుకు?

మా ప్రాంతంల అభివృద్ధి జరుగుతలేదు మొర్రో అనంగనే మీ ప్రాంతం నాయకులు ఏంజేస్తున్నరు అని అడుగుతరు. మీ ప్రాంతం నాయకులు సన్నాసులు అని అంటరు. నిజమే, మా ప్రాంతం నాయకులు సన్నాసులే, కాదనం. ఎందుకంటే వాళ్ళు మీతోని కొట్లాడి గెలువలేరు, మిమ్ముల కాదని నిధులు కేటాయింప జేసుకోనుడు వాళ్ళ తోని అయ్యే పని గాదు. వాళ్ళను బలోపేతం జెయ్యడానికే మాకు ప్రత్యేక రాష్ట్రం గావాలె.

మా ప్రాంతం నాయకులు సన్నాసులే. అందుకని మా ప్రాంతంల సమస్యలు అట్లనే మూలుగుతున్నయ్. మరి మా సమస్యలు చెప్పంగనే, మీరు మాగ్గూడ సమస్యలున్నయ్ అని ఎందుకు జెప్తరు? అంటె మీ నాయకులు గూడ సన్నాసులే నా? అందరూ సన్నాసులే అయినపుడు విడిపోయి ఎవని బతుకు వాడు బతుకుదాం. కనీసం రాష్ట్రం చిన్నగ ఉంటె ఈ సన్నాసుల పనితీరు కొంత మెరుగ్గ ఉంటది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రి నడుప లేక పొతే కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటె నయమే కదా?


Monday, June 27, 2011

సమైక్య వాదుల మానవత్వం

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసి ప్రజలను జీవచ్చవాలు చేస్తున్నది. రోజు రోజుకు మరింత అడుగంటి పోతున్న భూగర్భ జలాలు. వాటిలో మరింత ఎక్కువ ఫ్లోరీన్ విషం. జీవనదులున్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు కరువు.





ఈ మనుషుల్ని చూస్తే పగ వాడికి కూడా అయ్యో అనిపిస్తది. మన దేశంల తాగేందుకు కనీసం విషం లేని గుక్కెడు నీళ్ళు ఇవ్వలేమా అన్న ప్రశ్న ఉదయిస్తది. కాని కొన్ని సమైక్యవాదం పేరు జెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పే కొన్ని భుజంగాలు మాత్రం కోరలిప్పి వెకిలి నవ్వులు నవ్వుతై. వాటికి అన్నింటా లాభం, నష్టం మాత్రమే కనిపిస్తయి, మనుషులు, మనుషుల బతుకులు కనిపించవు.

నీటిని పంపు చేసి పారించుడు పాపమట! నీరు పల్లమెరుగుతది కాబట్టి కాబట్టి పల్లానికే పంపాలె నట. మెట్ట ప్రాంతంల పొలాలు గాలిలో చెమ్మకే పండుతయట. వాళ్ళ బాబు పండించే పంటకు మాత్రం మూడోకారుకు నికర జలాలు తేవడానికి లక్షలాది మందిని, వేలాది గ్రామాలను, కోట్లాది పశు పక్ష్యాదులను, చెట్లను నీట ముంచ వలసిందే నట! ఇదే మన సమైక్యాంధ్ర నీతి.

Saturday, June 25, 2011

ఇక్కడ జీడీపీలు పెంచబడును


"అన్నా మా తెలంగాణా ప్రాజెక్టుల కన్నిటికి తెగులు బట్టిచ్చిన్రు. ఉన్న నీళ్ళు సాలవని ఇప్పుడు పోలవరం గడుతున్రు. ఇదేమన్న న్యాయంగ కనపడుతున్నాదే?"

"అరె తమ్ముడూ, ప్రపంచంల ఎక్కడన్నా వ్యవసాయం జేస్తే లాభాలోచ్చాయారా? కావాలంటే ఫలానా బ్లాగు జూడు, తెలుస్తది. అందుకనే ప్రాజెక్టులు కట్టుకొని నష్టాలోచ్చే వ్యవసాయం మేం జేస్తామన్నట్టు! మంచిగా లాభాలోచ్చే పరిశ్రమలు మీ దగ్గెర పెడుతున్న మన్న మాట!"

"అట్లనార బై? ఐతే గిది బాగనే ఉన్నది. ఎక్కడున్నై పరిశ్రమలు? పొయ్యి కొలువుకన్న కుదురుత!"

"మీ ఇంటిముందు నుంచి పోతున్న మురిక్కాలువ ఏడనించి వస్తుందనుకున్నావ్. మేం బెట్టిన పరిశ్రమల నించే".

"థూ, గా కాలువా? సరే తియ్యి, మరి ఉద్యోగాలు?"

"మొత్తం మా పోరగాళ్ళను పట్టుకొచ్చినం. ఒక్క స్వీపరు పోస్టు ఖాళీగా ఉంది. చేస్తానంటే చెప్పు."

"మరి మీరు ఇక్కడికొచ్చి మాతాన పరిశ్రమలు పెట్టి, మాకు మురికి నీళ్ళు పెట్టి, వాటిల ఉద్యోగాలు మీరే చేసి మమ్మల్ని ఉద్ధరించింది ఏందన్నా?"

"ఏంటలా మాట్లాడుతావు? మీ జీడీపీ పెంచలేదా? అమెరికా, యూరప్ లాంటి దేశాలే జీడీపీ పెంచడానికి నానా గడ్డి కరుస్తున్నారు. అట్లాంటిది రాత్రికి రాత్రి మీ జీడీపీ అమాంతం పెంచేసాం. సంతోషపడు."

"నీ బుద్ధి బాగా అర్థమైందన్నా! ఇక్కడ పారే నీళ్ళతోని ఇక్కడ ప్రాజెక్టులు కట్టక, ఇక్కడి చెరువులు కుంటలు తెగ్గొట్టి అక్కడికి మలుపుకుంటవు. అక్కడ ప్రాజెక్టులు కట్టి పంటలు పండించు కుంటవు. అక్కడ వచ్చిన పైసల తోని ఇక్కడ వ్యాపారాలు పెట్టి మల్లా అక్కడోల్లనే పిలుసుకొచ్చి ఉద్యోగాలల్ల పెట్టుకుంటవు. మాలాంటోల్లం నీ మాటలు గుడ్డిగా నమ్మి ఉన్నపోలాలు తాకట్టు పెట్టి కూలోల్లమై పోతున్నం. అసలు నిన్ను మొదలు ఇక్కడికి రానిచ్చుడే పెద్ద తప్పయింది. నీ సంగతి బాగా అర్థమైనంక ఇంకా నువ్వు నేను కలిసి ఉండుడేంది? నీ దారి నీది. నా దారి నాది!"

"#$#$#%#@#@$#%%###@$*#)$#$@"    

Friday, June 24, 2011

లోక్‌పాల్, తెలంగాణా ఉద్యమాలకు గల సారూప్యతలు



1 లోక్ పాల్ బిల్లు 1969 ల మొదటిసారి పార్లమెంటుకు వచ్చింది. కాని రాజ్యసభలో పాస్ కానందువల్ల ఆగి పొయ్యింది. ఆ తర్వాత ఎన్నో సార్లు పార్లమెంటుకు రావడం, తిరిగి బుట్ట దాఖలా కావడం మామూలుగా జరుగుతున్న విషయం.

తెలంగాణా ఉద్యమం 1969 లో ఉధృతంగా మొదలయ్యింది. అప్పటినుండి ఆటు పోటులు ఉన్నా ఉద్యమం మాత్రం అలాగే నడుస్తుంది.
2 లోక్ పాల్ ఉద్యమానికి 2011 లో అన్నా హజారే  ఆమరణ నిరాహార దీక్షతో ఊపు వచ్చింది.తెలంగాణా ఉద్యమానికి 2009 లో KCR ఆమరణ నిరాహార దీక్షతో ఊపు వచ్చింది.

3 లోక్ పాల్ బిల్లును నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని అవినీతి నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందినా అవనీతి సౌధాలమీద రాజకీయ వ్యాపారాలు చేస్తున్న రాజకీయ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు.
  
4 ఇష్టం లేకపోయినా ప్రజల వత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రజాసంఘాల నేతలతో అన్నా డిమాండ్లకు ఒప్పుకున్నట్టు నటించి ఆయన్ను దీక్ష విరమింప జేసింది. తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఉద్యమ ఉధృతి చూసి 2009 డిసెంబరులో తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చి కేసీయార్ దీక్షను విరమింప జేసింది.

5 అన్నా హజారే దీక్ష విరమించినంక చర్చల సందర్భంలో మళ్ళీ పాత పాటే పాడడం మొదలు పెట్టింది. శ్రీకృష్ణ కమిటీ అని నాటకం మొదలు పెట్టి, ఉద్యమం తగ్గు ముఖం పట్టుతుందని భావించగానే తెలంగాణా ఏర్పాటు కష్టం అనే పాట ఎత్తుకుంది.

6 లోక్ పాల్ బిల్లు వస్తే అవినీతి పరులైన రాజకీయ నాయకుల అక్రమ ఆస్తులు ప్రమాదంలో పడతయి. తెలంగాణా వస్తే కబ్జాకోర్లైన కొందరు రాజకీయ నాయకుల అక్రమ ఆస్తులు ప్రమాదంలో పడతయి.

7 హాజారే దీక్ష తర్వాత జనంలో అవినీతికి బాగా ప్రచారం వచ్చింది. KCR దీక్ష తర్వాత తెలంగాణా ప్రజలు అనతకు ముందుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చైతన్యవంతు లైన్రు.

8 ఉద్యమాలు ఎక్కువగా సామాన్య ప్రజలు చేస్తుంటరు. రాజకీయ నాయకులు వారికి నాయకత్వం వహిస్తుంటరు. కాని లోక్ పాల్ ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించిన్రు. తెలంగాణా ఉద్యమంల తామూ ఉన్నమని రాజకీయ నాయకులు చెప్తున్నా, మేధావులు విద్యార్థులు ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపిస్తున్నరు. వీరివల్ల రాజకీయ నాయకులు కూడా తెప్ప దాటేసే పరిస్థితి లేదు.

9 లోక్ పాల్ పై నిర్ణయం ఇప్పుడు సోనియా చేతిలో ఉంది. సోనియా అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు. తెలంగాణా పై నిర్ణయం కూడా సోనియా చేతుల్లోనే ఉంది. సోనియా గనుక  తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆపగలిగే శక్తి రాష్ట్ర రాజకీయ నాయకులకు లేదు.

10 లోక్ పాల్ ని మరోసారి తుంగలో తొక్కుతందుకు ప్రయత్నం చేస్తే జనం ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం ఉన్నది.   తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ఆపివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి తెలంగాణా మేధావులు, విద్యార్థులు ప్రజలు సంసిద్ధంగా ఉన్నరు.

రెండున్నర జిల్లాల భాష


ఎడిటర్ ఎన్ని సార్లు చెప్పాలయ్యా? ఏంది ఈ చెత్త రాతలు? ఏదో మా ప్రాంతం వాడివి కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చాం. తెలియక పొతే నేర్చుకోవాలయ్యా. అంతే గాని ఇష్టమొచ్చినట్టు రాసెయ్యడమే!

జర్నలిస్టు సార్, సరిగ్గాన్నే రాసాను సార్.

ఎడిటర్  అంతే నేను పనిలేక తిడుతున్నా ననుకున్నావా?

ఏంటయ్యా ఇది? దీపావళికి ప్రజలు సంతోషంగా పటాకులు కాల్చుకున్నారా? పటాకులేంటయ్యా అర్థం పర్థం లేకుండా?

జర్నలిస్టు  పటాకులంటే దీపావళీ క్రాకర్సు సార్. ప్రజలంతా క్రాకర్సు బాగా కాల్చుకున్నారని రాసిన సార్.

ఎడిటర్  ఓరినీ! టపాకాయల కొచ్చిన బాధటోయ్! టపాకాయలని స్పష్టంగా రాయలేవూ? పటాకులేందయ్యా  పట్టాకత్తి లాగా? ఎక్కడా వినని కనని పదాలు రాస్తావు. ప్రజలందరికి అర్థమయ్యే పదాలు రాయాలి. మొన్నకూడా అలాగే ఏదో తింగర పదం 'మూజుబానీ' అని రాసావు.

జర్నలిస్టు  అదేంటి సార్! మన జాతీయభాషలో 'పటాకే' అంటారు. తెలంగాణా మొత్తం పటాకులనే అంటారు. కొన్ని ఆంద్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా అలాగే పలకడం చూసాను. అయినా కొత్త పదాలను వెలికి తీయాలని మీరే చెప్పారుగా సార్!

అన్నట్టు అసలు పదం మూజుబానీయే సార్, ఉర్దూను అపభ్రంశం చేసిన పదమే మూజువాణీ. మూ అంటే నోరు, జుబాన్ ఆంటే నాలుక.

ఎడిటర్  ఎక్కడో ఎవడో పలికితే నాకేంటయ్యా ! మా డెల్టాలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా సరిగ్గా మాట్లాడరు. వెలికి తీస్తే ఆ డెల్టాలో మరుగు పడిన పదాలు వెలికి తియ్యి.

జర్నలిస్టు  అదేంటి సార్ మన ఆంద్ర ప్రదేశ్ మొత్తం తెలుగుభాషే కదా? అన్ని ప్రాంతాల పదాలు వ్యాప్తిలోకి రానక్కర లేదా? మొన్న కోనసీమ జాలర్లు వాడే పదమొకటి రాసినా తిట్టారు. ఏం రాయాలో ఏం రాయొద్దో అంతా కన్ఫ్యూజింగ్ గా వుంది సార్.

ఎడిటర్ నీకు ఇంకా కుర్రతనం పోలేదయ్యా. మా ప్రాంతం అంటే మొత్తంగా కాదయ్యా. మా ప్రాంతంలో ఏ వర్గాలు ఉత్తమమైన తెలుగు మాట్లాడుతున్నారో నీకు ప్రత్యేకంగా విడమరచి చెప్పాలా? నువ్వుగూడా అదే భాష రాయాలి. తెలుగు పేరు జెప్పి భాష మొత్తం కలగా పులగం చేస్తానంటే ఒప్పుకునేది లేదు. నువ్వు ఇలాగే మారాం చేస్తుంటే ఉద్యోగం పీకేయాల్సి వస్తుంది జాగ్రత్త.

జర్నలిస్టు  ఆ తెలుసు సార్, మీ రెండున్నర జిల్లాల్లో ఉత్తమమైన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరో.

ఏది సార్ ఉత్తమమైన తెలుగు ఆంటే? ఉర్దూ పదాలు వద్దంటారు, మరి మూజువాణీ, దస్తావేజు లాంటివి ఎందుకున్నాయి సార్?

అచ్చ తెలుగు పదాలు పెడితే అవీ వద్దంటారు? తెలుగుభాష ఆంటే ఓ రెండుమూడు జిల్లాల్లో చదువుకున్న వాళ్ళు మాట్లాడే సంస్కృతం కలిసిన భాషేనా, అది తప్ప వేరే తెలుగు లేదా సార్?

అన్ని భాషల వారు తమ భాషను పరిపుష్టి చేసుకోవడానికి వీలయినన్ని ఎక్కువ పదాలు కలుపుకుంటున్నారు సార్. మనమేంటి సార్, ఇలా మన ప్రాంతాల భాషలనే తోక్కేస్తూ, భాషను మరీ జిల్లాలకే పరిమితం చేస్తున్నాం?

ఏ భాషల నైనా ఎన్ని ఎక్కువ పదాలు ఉంటే భాష గొప్పదనం అంతగా పెరుగుతుంది సార్. ఇంగ్లీషునే చూడండి. తెలుగుతో సహా అన్ని భాషల పదాలు ఇమిడ్చేసు కున్నారు. మనమేంటి సార్, ఇలా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఫిల్టర్ చేసి భాష విలువను తగ్గిస్తున్నాం?

జీవ భాష సాధారణ ప్రజల్లోంచి వస్తది సార్. ఇలా కృత్రిమంగా భాషను కట్టడి చేసినంత మాత్రాన అది సమసి పోదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వెలుగు చూడని పదాలను వ్యాప్తిలోకి తేవడం మన జర్నలిస్టుల బాధ్యత సార్. కేవలం రెండున్నర జిల్లాల భాష వాడడం కాదు.

ఎడిటర్  ##$$!@(&$@*^()%#%#($#$%###

Thursday, June 23, 2011

మీరు గడ్డ మీద, మేం గడ్డ కిందున్నమన్న మాట


తెలంగాణా వాది నీటి పంపకాలల్ల మాకు అన్యాయం జరుగుతుంది. మేం విడిపోతేనే మా బతుకులు బాగైతయి.

సమైక్య వాదిలేదు. మీకు అన్యాయం అస్సలే జరుగుత లేదు. సమైక్య రాష్ట్రం ఏర్పడ్డంక మీదగ్గర్నే ఎక్కువ ప్రాజెక్టులు కట్టిన్రు.

తెలంగాణా వాది ఎక్కడ కట్టిన్రో జెర చూపెట్టక పోతివి! కృష్ణా కుడికాలువ రాష్ట్రం దాటి పాయె, ఎడమ కాలువ అడ్రస్ లేకుండా వాయె. గోదావరి సూద్దామంటే పోచంపాడు అన్నేల్లయినా పూర్తి గాక పాయె. అనుమతులు లేకున్నా పోలవరం పరుగులెట్ట వట్టె.

సమైక్య వాదిమీరు గడ్డ మీద ఉన్నారు కదన్నా. మేం గడ్డ కిందున్నమన్న మాట. అంటే నీళ్లన్నీ మాకే వస్తాయి. అది దేవుడిచ్చిన వరం. మీరు గాని, మేం గాని అది ఆపలేం. నీళ్ళు కిందికి వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. దానికి నువ్వు మాత్రం ఏం జేస్తవు చెప్పు? గడ్డమీద ఉన్నోనివి కాబట్టి నీళ్ళు నీకు రావు. గద్దమీదున్నోల్లు గడ్డ కింద ఉన్న మాకు నీళ్ళు వదలాలి. అది దైవ నిర్ణయం.

తెలంగాణా వాదిఅట్లనా? మరి తెల్వకడుగుత. గడ్డ కిందున్న మీరు, మీకన్నా కిందున్న బంగాళాఖాతంలకి నీళ్ళు వదలక ప్రాజెక్ట్లు ఎందుకు కట్టుకుంటున్నరు? అయినా గవన్ని మాకెందుకు? నీళ్ళు మాకాడ ఆగవంటున్నరు గద! మరి భయమెందుకు మీకు? మా రాష్ట్రం మాకిస్తే గా నీళ్ళ సంగతేదో మేం జూసుకుంటం గద!

సమైక్య వాది##$$*&&*&&*$$##

తెలుగోడి గోస

ఈ కేసీయారు ఉన్నతాన ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కిరికిరి పెట్టుట్ల మొనగాడు. మొత్తానికి అప్పుడప్పుడు గాలికి పొయ్యే కంపను దోటికి తగిలిచ్చుక వస్తుంటడు.

గట్లనే ఒకసారి ఇఫ్తారు విందుకు పోయ్యిండట. అక్కడికి పొయ్యి 'ఆంధ్ర బిర్యాని పెండ పెండ ఉంటది' అని చెప్పిందట. తెలంగాణా మాండలికంల రుచి లేక పొతే పెండ పెండ ఉంది అనడం మామూలే. కాని గా విషయం ఆంధ్రోల్లకు తెలవదు గదా! మస్తు బాధ పడ్డరట! రుచి ఉండనంత మాత్రాన పెండ తో పోలుస్తరా అని ఒకటే ఇదైన్రు.

అక్కడికి తెలంగాణా మేధావులు చాలామంది కేసీయార్ మాటలను ఖండించడమో మరొకటో చేసిన్రు. అయినా గూడ ఊరుకోక 'మీరెక్కడ తిన్నారో గని మేం పార్సిల్లు పంపుతున్నం, గియ్యి తిని సూడున్రి' అను కుంట బిర్యాని పొట్లాలు పంపిన్రట. గా పొట్లాలు ఇక్కడికొచ్చినంక తెరువంగనే గబ్బు వాసన కొట్టి జనం ముక్కు మూసుకున్నరంట. వాసన భరించలేక తీస్కపొయ్యి టాయిలెట్ల కొట్టి ఫ్లష్ చేసిన్రట! ఎంత మంచి బిర్యాని అయినా పాశిపొయ్యినంక వాసన గొట్టకుంటే  పరిమళం వస్తదా? ఏందో ఈ ఆంధ్రోల్ల గోసే అర్థం గాదు!

ఏదో అయింది అయిపొయింది, అంత సద్దుమణిగింది అనే టప్పటికి ఒక తెలుగోన్నని చెప్పుకొనే ఆంధ్రాయిన ఆయిన బ్లాగుల అసలు విషయం బయట పెట్టిండట. గా పెండ అసుంటి బిర్యాని కేసీయార్ ఏ సందర్భంల తిని ఉంటాడో తన పద్ధతిల వివరించిండు. ఇంతకీ అసలు విషయం ఏందంటే ఆంధ్రకు పోయినప్పుడు కరెంటు పొయ్యి, చట్నీ అనుకోని పెండ కలుపుకొని ఉంటడు కేసీయార్ అని ఆయన కవి హృదయమట!

గాయిన కవిహృదయం సంగతి పక్కకు పెడితే, వంటింట్ల పెంట పెట్టుకుంటరన్న సంగతి కొత్తగ బయిటి కొచ్చింది. వంట -  పెంట ఒక్కతాన పెట్టుకుంటే పెంట లెక్క ఉండకుంటే ఇంకెట్ల ఉంటది మరి వంట? మరి గీ సంగతి గా తెలుగాయినకు ఎవరు జెప్పాలె? 

గా పెంట పోస్టుకు జెర శాన కామెంట్లే వచ్చినట్టున్నయి. అందుకే తెలంగాణా వాదమంటే ఒంటి కాలు మీద లేచే పెద్దన్న ఈ మధ్య ఇంకో పోస్టు పెట్టిండు. అది రోడ్లమీద సండాసు జేసే కార్య క్రమమట! గట్లాటి కార్యక్రమాలు ఆంద్ర సైడు రోజు జేస్తనే ఉంటరు. కొత్తేముంది? పోద్దటి పూట నేషనల్ హైవే మీద కోదాడ దాటి తూర్పు దిక్కు పొయ్యినమంటే సూడలేక  కండ్లు ముక్కు రెండు మూసుకోవాలే. ఆడ మొగ అని తేడా లేకుంట, లుంగీలు, చీరలు లేపి మరీ కూసుంటరు. అటుసైడు పొయిన ప్రతి ఒక్కనికి  ఎరుకున్న విషయమే ఇది! 

అయినా అట్లాంటివి మీ పేటెంటు కార్యక్రమాలు. అయ్యి మేరే జేసుకోన్రి. మేం ఏంజేయ్యాల్నో, తెలంగాణా ఎట్ల తెచ్చుకోవ్వాల్నో మాకు ఎరికే. ఉత్తగనే తెలంగానోళ్ళను ఏతిరించబోయ్యి మీరే గోతిల బడతరు.    

అయినా కేసీయారూ, నువ్వుగూడ మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త పడాలె. అసలే ఈ సమైక్యవాదులు మాట మాటకు ఈకలు తోకలు పీకేటోల్లు.

Wednesday, June 22, 2011

తెలంగాణా ప్రజలు స్నేహశీలురా? కొట్లాడుతరా?

తెలంగాణా వాళ్ళు మాట్లాడరు, కొట్లాడుతరు అన్నడు ఒక పెద్దమనిషి. ఇదే కాదు ఇలాంటి అసత్య ప్రచారాలు పుంఖాను పుంఖంగా ఎన్నో చేస్తనే ఉన్నరు తెలంగాణా ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి రోజూ. 

నిజానిజాలు పరిశీలిద్దాం. 

హైదరాబాదు సంగతి పక్కకు పెట్టితే, తెలంగాణా లో ఉన్న దాదాపు అన్ని పెద్ద ఊర్లల్ల కనీసం ఊరికి ఒక్క కుతుమ్బమన్నా ఆంధ్రా వాళ్ళది ఉంటది. వాళ్ళు వ్యవసాయమో, దుకానమో, ఉద్యోగమో చేసుకుంట బతుకుతరు. వాళ్ళల్ల ఒక్కరికి కూడా నామనీసమంత హాని కలిగినట్టు ఎక్కడా బయటికి రాలేదు. అట్లా కలిగితే వాళ్ళు ఎందుకుంటరు?  తెల్లారే తట్ట బుట్ట సదురుకుంటరు. అదీ తెలంగాణా ప్రజల కలుపుగోలు తనమంటే. ఇక్కడికి మరాఠీలు, పంజాబీలు, సింధీలు, పార్సీలు, జైనులు ఒక్కలేమిటి? అన్ని రకాల ప్రజలు వచ్చిన్రు. ఇక్కడి జనంల కలిసి బతుకుతున్నరు. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు కాబట్టే వాళ్ళంత ఇక్కడ సంతోషంగ ఉండగలుగు తున్నరు.

మరి తెలంగాణా ప్రజలను తిట్టే మహానుభావులు ఒక్క సారి తమ ఊళ్ళకెళ్ళి చూసుకుంటే వాళ్ళకే విషయం తెలుస్తది. ఊరికి గాడు, కనీసం మండలానికి ఒక్కడన్న తెలంగాణా మనిషి అక్కడ కనపడితే ఒట్టు! ఎందుకో వేరే చెప్పాల్నా? అది బహిరంగ రహస్యం. అప్రకటిత సామాజిక బహిష్కరణ. సమాజం కలుపుకోక పొతే మనిషి ఒక్క రోజు గూడ ఉండలేడు. ఎందుకంటే మనిషి సంఘజీవి. కాబట్టే ఎవరన్న అక్కడికి బతుకు తెరువు కోసం వెళ్దమని ప్రయత్నం జేసినా గోడగ్గోట్టిన బంతి లెక్క తిరిగి రాక తప్పదు.

మరి ఈ విషయం హైదరాబాదుల 23 ఏండ్లనించి నివసిస్తున్న మనిషికి తెల్వదా? తెలుసు. కాకపొతే అసత్య ప్రచారాలకు ఒడిగట్టినోనికి నిజాన్ని దాచిపెట్టే కోరిక తప్ప ఒప్పుకొనే తీరిక ఎక్కడుంటది?

వంటావార్పు, నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు


హైదరాబాదుల వంటావార్పు కార్యక్రమం గొప్పగ విజయవంతం అయ్యింది. ఆడ, మగ, పిల్లలు అని తేడా లేకుండా హైదరాబాదు జనం బయటికి వచ్చి హైదరాబాదు మాది అని చాటి చెప్పిన్రు. పోద్దటి నించి గుమి గూడిన ప్రజలు సాయంత్రం వరకు రోడ్లమీడనే ఉన్నరు. ఆడుకున్నారు, పాడుకున్నరు, ముచ్చట్లు చెప్పుకున్నారు, వంటలు చేసుకున్నరు, తిన్నరు. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందంటే ఎప్పుడూ నొసటితో వెక్కిరించే సీమాంధ్ర మీడియా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయిన తీరుపై ఏమీ మాట్లాడలేక పొయ్యింది.


వంటావార్పు కార్యక్రమం రూపొందించేటప్పుడు తెలంగాణా JAC బాగనే కసరత్ జేసింది. ఈ సారి పోలీసులను పర్మీషన్లు అడుగలేదు. వాళ్ళు ఇయ్యలేదు. కాబట్టి ఉభయతారకంగా ఇది ఎవరికీ ఇబ్బంది లేకుంట జరిగింది. ఇదివరకు ప్రతి సారి ఉద్యమకారులు ముందుగ పర్మిషన్లు అడుగుడు, వాళ్ళు ఇవ్వకపోవుడు మామూలై పొయ్యింది. పర్మిషన్ లేకుండ కార్యక్రమం జేస్తే 'మేం పర్మిషన్ ఇయ్యలేదు గద' అనుకుంట లాఠీచార్జీలు జేసుడు. ఇప్పుడు గియ్యన్ని ఏమీ లేవు. పోలీసులు వచ్చిన్రు, పక్కకు నిలబడిన్రు. మేం ఇచ్చిన టిఫిన్లు కాఫీలు తాగిన్రు. కాబట్టి ఇంకముందు  ఉద్యమంల భాగంగ ఏ కార్యక్రమం జేసినా పర్మిషన్లు అడుగుడు బంద్. 

ఈసారి జరిగిన కార్యక్రమంల చాలా ప్రత్యేకతలు ఉన్నయ్. తెలంగాణా వాళ్ళతోటి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన హైదరాబాదీలు కూడ సంతోషంగ వంటావార్పుల పాల్గొన్నరు. మనకు సంఘీభావం తెల్పిన్రు.


అంతేగాదు ఈకార్యక్రమంల ఆబాల గోపాలంగా పిల్లా పాపలతోటి కుటుంబాలు కుటుంబాలే బయటికి వచ్చినై. ఆడవాళ్ళు, పిల్లలు, కేరింతల తోటి హైదరాబాదు మొత్తం కళకళ లాడింది. వీళ్ళని చూస్తుంటే తెలంగాణా మొత్తం గొప్ప, పేద అని అభిజాత్యాలు వదిలి రాష్ట్రం కోసం రోడ్లమీడికి వచ్చే రోజు ఎంతోదూరంల లేదు అని అనిపించింది.

హైటెక్ సిటీ కార్యక్రమానికి సినీనటుడు సుమన్ రావడం అందరినీ ఆకర్షించింది. ఆయన వచ్చి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బహిరంగంగా సంఘీభావం తెలిపిన్రు. తానూ ఎన్నో ప్రాంతాలు తిరిగిన్నని, తెలంగాణాను మించిన ప్రాంతం కందపదలేదని అందుకే ఇక్కడే స్థిరపడ్డనని చెప్పిండు. తనను ఇక్కడ ఉంటున్నందుకు ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదని, రేపు తెలంగాణా వచ్చినంక గూడ ఇక్కడనే ఉంటానని చెప్పిండు. ఆయనకు తెలంగాణా ఉద్యమ వందనాలు.


వంటావార్పూ కార్యక్రమం విజయవంతం కావడం తో ఉద్యమకారులు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. డబ్బులు కుమ్మరించి నిముషాల మీద విధ్వంసం సృష్టించే సమైక్యాంద్ర వంటి బూటకపు ఉద్యమాలు మనకొద్దు. మనకు ప్రజాబలం ఉంది. ప్రజలను ఎక్కువగా ఉద్యమాలలో మమేకం చేద్దాం. ప్రశాంతంగ, పటిష్టంగ మన నిరసనలు తెలుపుదాం. తెలంగాణా రాష్ట్రం దానంతట అదే వచ్చి తీరుతది.   

Tuesday, June 21, 2011

ఆంధ్రావాలే భాగో అన్నారు కదా, కాబట్టి మేం ఒప్పుకోం


సమైక్య వాది మనం కలిసే ఉండొచ్చు గదా? విడిపోవడం ఎందుకు?

తెలంగాణా వాది మనం వేరు వేరు రాష్ట్రాలుగా ఉండి, ఒక చోట కలిసినం. కలిసేటప్పుడు మనం రాసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్క బడ్డయి.

సమైక్య వాది అప్పుడెప్పుడో రాసుకున్న ఒప్పందాలు ఇప్పుడెందుకు? ఇప్పుడు సుఖంగనే ఉన్నాం గద?

తెలంగాణా వాది మీరు సుఖంగానే ఉన్నరు. మాకు ఈ సమైక్య రాష్ట్రంల అన్యాయం జరుగుతుంది.

సమైక్య వాది ఏం అన్యాయం?

తెలంగాణా వాది కృష్ణా గోదావరి మీదగ్గర ఎక్కువ పారుతుందా, మాదగ్గరా?

సమైక్య వాది సరిగ్గా తెలువదు కాని మ్యాపు చూసినప్పుడు తెలంగాణాలోనే ఎక్కువ పారినట్టు అనిపించింది.

తెలంగాణా వాది మరి నీళ్ళు తెలంగాణలో తక్కువ, ఆంధ్రలో ఎక్కువ వాడు కుంటున్నరు. అది అన్యాయమేగదా? అలానే మా వాళ్లకు చెందాల్సిన లోకల్ ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు తెచ్చి మీరు దూరి పోతున్నరు. ఇది నేను చెప్పింది కాదు. గిర్ గ్లానీ కమీషన్ వేస్తే తెలిసింది.

సమైక్య వాది దానికి 610 GO వేసినారు గదా?

తెలంగాణా వాదిఅవును, GO వచ్చి పాతికేళ్ళయింది. ఇంతవరకు ఒక్క ఉద్యోగిని గూడ ట్రాన్స్ఫర్ జెయ్యలే. దొంగ ఉద్యోగులు రిటైర్ గూడ అయిపోతున్నరు. అంటే కాదు తెలంగాణా చరిత్రను, సంస్కృతిని పూర్తిగా అణగ దొక్కే ప్రయత్నాలు చేస్తున్నరు.

బడి పిల్లల పుస్తకాల్ల మా తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. సీమాంధ్రుల చరిత్ర మాత్రం కథలు కథలు గా ఉంటది. పుస్తకాలలో రాసే భాష శిష్ట వ్యావహారికం అనుకున్నా, దానిలో తెలంగాణా వారు వాడే పదాలుండవు. ఉర్దూ పదాలైనా సరే అవి ఆంధ్రాలో వాడితే ఉంటయి. సహజంగా మా అస్తిత్వాన్ని నిలుపుకునే మార్గంలో ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నం.

సమైక్య వాది దానికి ప్రత్యేక రాష్ట్రమే ఎందుకు? ఈ రాష్ట్రంలోనే వాటికోసం పాటు పడండి.

తెలంగాణా వాది ఇన్నాళ్ళూ ఆ ప్రయత్నాలే చేసినం. కాని సీమాన్ధ్రులు మెజార్టీ గా ఉన్న ఈ సమైక్య రాష్ట్రంలో మా ఆకాంక్షలు ఎన్నటికీ తీరవు. యాభై ఆరు సంవత్సరాల్లో కేవలం ఆరేళ్ళే తెలంగాణా ప్రధాని ఎన్నికైండు. అదీ ఆయన నిలదొక్కుకొని ఏదో చేసేలోపే దిగి పోయిండు. అందుకే ఈ రాష్త్రంల మాకు న్యాయం జరగదు.

సమైక్య వాది అయినా సరే, మేం ఒప్పుకోం.

తెలంగాణా వాది ఎందుకు?

సమైక్య వాది అప్పుడెప్పుడో ఎవరో తెలంగాణా వాలే జాగో, ఆంధ్రావాలే భాగో అన్నారు కదా! దానికి మా మనోభావాలు దెబ్బ తిన్నై. అందుకని ప్రత్యేక తెలంగాణా ఇస్తే మాకేం అభ్యంతరం లేకపోయినా, మా మనోభావాలు మీరు దెబ్బతీసినందుకు మిమ్మల్ని శిక్షించాలి కాబట్టి మేం ఒప్పుకోం.

తెలంగాణా వాది మీ మనోభావాలు దెబ్బ తింటేనే మమ్మల్ని శిక్షిస్తే, మా బతుకులే మీవల్ల దెబ్బ తింటే, మరి మేమేం  చెయ్యాలి?

సమైక్య వాది ##**$%%!@!$#**##

జయశంకర్ అమర్ రహే

జయశంకర్ సారు ఇంక లేరు అనే మాటే నమ్మబుద్ధి అయితలేదు. జీవిత కాలం తెలంగాణా ఆత్మగౌరవ భావజాల వ్యాప్తికి కృషి చసిన ఆ మహనీయుడు తుది శ్వాస విడిచిండు. భౌతికంగా ఆయన మనని వీడినా, ప్రతి తెలంగాణా పౌరుని గుండెల్లో అమరుడై నిలుస్తాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఆయన చిరకాల వాంఛ ఐన తెలంగాణా రాష్ట్ర సాధనే. అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన సరైన నివాళి.



Monday, June 20, 2011

వాళ్ళకు కావలసింది ఇక్కడి మనుషులు కాదు

కోవెల సంతోష్ కుమార్ గారు వారి బ్లాగులో తెలంగాణ హుళక్కే...హ్యాట్సాఫ్‌ టు ఎస్‌ఏ అనే టపా పెట్టినరు. దానికి వ్యాఖ్య రాస్తూ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం అనే ఒక లబ్ద ప్రతిష్ట బ్లాగరు గారు ఈ క్రింది విధంగా వ్రాసినరు.

తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది.



పై వ్యాఖ్యలు రెండో తరగతి చదువుకున్న వాడికి కూడా ఎంత నిందార్థకంగా ఉన్నయో తెలుస్తయి. సహజంగా తెలంగాణా ప్రజలను అభిమానించే బ్లాగుల్లో దీనికి సమాధానాలు వచ్చినై.

కోవెల సంతోష్ కుమార్ గారు కూడా మేధావులకు వందనం అనే పోస్టులో దానికి సమాధానం వ్రాసిన్రు. దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ప్రతి వాక్యానికి సమాధానం వ్రాసిన్రు. వారి సమాధానానికి సమాధానం వ్రాసే ప్రయత్నంల అచంగ అనే ఇంకో బ్లాగరు (పూర్తిపేరు తెలియదు) ఆనందిని బ్లాగు టపాపై స్పందన అని ఇంకో పోస్టు రాసిన్రు. ఎవరి భావాలు వాళ్ళు ప్రకటించు కోవటానికి బ్లాగు పోస్టులు వ్రాసుకునుడు మంచిదే. అయితే ఒకరి సమాధానాన్ని విమర్శించేటప్పుడు ఆ సమాధానం ఎవరికి ఏ సందర్భంలో ఇచ్చిందో విస్మరించి కేవలం ఆ సమాదానంలోని కొన్ని వాక్యాలను పట్టుకొని తనకు తోచిన విధంగా సదరు అచంగ గారు తన బ్లాగులో వ్రాసుకొన్నరు. మచ్చుకు కొన్ని వాక్యాలు చూద్దాం.

అచంగ గారు వ్రాసింది.

/గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు/
గొడ్డు చాకిరీ ఎవరు ఎవరికి చేశారు? తెలంగాణలోనే పుట్టిన దేశ్ముఖ్లకు, వెలమ దొరలకు.


దీని చరిత్ర చూద్దాం.

మొదట బాలసుబ్రహ్మణ్యంగారు వ్రాసింది.

వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం.

అంటే తెలంగాణా మొత్తంగా అసలు పని సంస్కృతీ లేదన్నట్టు, ఆంధ్రాలో మాత్రం ఉన్నట్టు అన్యాపదేశంగా వ్రాసిన వ్యాఖ్యానం అది. నిజాయితీగల మనుషులేవ్వరైనా దీంట్లోని నిందార్థం విడమరిచి చెప్పుతరు. కాకపొతే కొంతమంది కరడు గట్టిన సమైక్యాంధ్ర వాదులకు మాత్రం ఇది వీనులకు ఇంపుగా కనిపిస్తుందేమో నాకు తెలవదు.

సరే, దీనికి సమాధానంగా సంతోష్ కుమార్ గారు వ్రాసింది...

ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు..

తెలంగాణా జనులకు మొత్తంగా పని సంస్కృతీ లేదని ప్రవచించిన ఒక పెద్దమనిషికి పైన ఇచ్చిన సమాధానం నాకైతే ఏ లోపం కనపడలేదు. చివరి వాక్యం కొంత అభ్యంతర కరమని ఎవరైనా చెప్పా  వచ్చేమో? ఇప్పుడు హైదరాబాదులో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, ప్రాంతాలలో ఉన్న అన్ని బంగళాలకు పాచిపని, బట్టలుతకడం, ఇస్త్రీ చేయడం, కార్లు నడపడం వగైరా ఎవరు చేస్తున్నరో తెలిసిన వారికి దాంట్లో అభ్యంతరం కనిపించదు.

మరి దీనికి అచంగ గారు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.

గొడ్డు చాకిరీ ఎవరు ఎవరికి చేశారు? తెలంగాణలోనే పుట్టిన దేశ్ముఖ్లకు, వెలమ దొరలకు. ఆనాటి గడీల్లో అరాచకాలు ఎవరికి తెలియనివి? చాకలి అయిలమ్మని అడగండి గొడ్దు చాకిరీ ఎవరు చేయించుకున్నారో తెలుస్తుంది. ఇప్పటి సీమాంధ్ర ప్రాంతీయులు మాత్రం కాదు. దాష్టీకం చేసింది తెలంగాణవారే,చేయించుకున్నదీ తెలంగాణవారే.


మరి కోవెల గారు ఇచ్చిన సమాధానానికి సమాధానంగా ఉందా, ఇంకే రకంగా నైనా ఉందా పై వ్యాఖ్య అన్న విషయం చదువరులు తెలుసుకోగలరు.

తెలంగాణాలో పని సంస్కృతి లేదు అన్న అన్యాయమైన ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఒకటైతే, తెలంగాణా చరిత్రను, ఆ చరిత్రలో తెలంగాణా ప్రజలు పడిన బాధలను అపహాస్యం చేసుకుంట మాట్లాడే మాటలు ఇంకోటి. ఇక్కడ నిజాంకు ఊడిగం చేసిన దొరలుంటే, అక్కడ బ్రిటీష్ వాడికి దాసోహం అన్న రాజాలు, జమీందార్లు లేక పోలేదు. వాళ్లకు అక్కడి దళిత బహుజనులు ఊడిగం చేసిన మాట వాస్తవం కాకుండా ఉంటదా? మరి ఎందుకు ఈ పనికిరాని మాటలు?

ఈ మాటలు ఎట్లా ఉంటయంటే... వెనకటికొకాయన యాపిల్ తియ్యగా ఉంటది అని చెప్పిండట. దానికి ఇంకొకాయన కాదు కాదు ఆరెంజే పుల్లగా ఉంటది అని బదులు చెప్పిండట. పైన రాసిన ఉదంతం సమైక్యాంధ్ర వాదులు పొంతన లేని మాటలు ఎట్ల మాట్లడుతరో కేవలం ఉదాహరణ మాత్రమే. మొత్తం వివరించే ఓపిక, తీరిక నాకు లేదు. మిగతా విషయాలు కావాలంటే మీరు ఆ బ్లాగునే చూడండి.

తెలంగాణా మీద ఇంత చులకన భావం, తెలంగాణా వాళ్ళ మీద అసహ్యం మాట మాటకూ బయట పెట్టుకొనే వాళ్ళు సమైక్యాంధ్ర ఉండాలే అని ఎందుకు అంటరో అంత  ఊహించ లేనిదేమీ కాదు. వాళ్ళకు ఇక్కడి మట్టి మనుషులు కాదు కావలసింది, ఇక్కడి మట్టి, ఇక్కడి మట్టిపైన ఉండే సంపద, ఇక్కడి మట్టిలోన ఉండే సంపద, ఇక్కడి నీళ్ళు, ఒక్కప్పుడు నిజాం మోచేతినీళ్ళు తాగుతూ జనాన్ని వంచించి ఇప్పుడు సీమాంధ్రుల మోచేతి నీళ్ళు తాగుతూ అదే జనాన్ని వంచిస్తున్న దగుల్బాజీ రాజకీయ దొరలు, వీళ్ళు మాత్రమే కావాలి వాళ్లకు.

Friday, June 17, 2011

జయప్రకాశ్ నారాయణ్ వ్యవహార శైలి

జయప్రకాశ్ నారాయణ్ అసుంటి ఒక మేధావి రాజకీయాలకు వచ్చినప్పుడు ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలోని నిజాయితీగల ప్రజలు ఎంతో సంతోషించిన్రు. ఆయన కూకట్ పల్లి నుండి పోటీ చేసినప్పుడు ఆయన్ను స్వాగతించి వోట్లు వేసి గెలిపించిన్రు. కాని ఆయన తెలంగాణా సమస్య మీద చూపెట్టిన ద్వంద్వవైఖరి ఆయనమీద తెలంగాణా ప్రజల కోపానికి కారణమైంది.

ఆయన శ్రీకృష్ణ కమిటీకి అసత్యాలతో వండివార్చిన రిపోర్టు, 8వ చాప్టర్ లో పొందుపరచిన అప్రజాస్వామిక సూచనలపై ఆయన అర్ధాంగీకార మౌనం, ఉస్మానియా విద్యార్థులపై మానవ హక్కులను హరిస్తూ పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని ఆయన ఖండించక పోవడం, ప్రజాస్వవమికంగా జరుప తలపెట్టిన మిలియన్ మార్చిని ఆపడానికి పోలీసు యంత్రాంగం జరిపిన అక్రమ ముందస్తు అరెస్టులపై ఆయన మౌనం, సీమాంధ్రలో జరిపిన కుహనా ఉద్యమంలో కోట్లాది రూపాయల సంపద ధ్వసం చేసినప్పుడు కరువైన ఆయన స్పందన, మిగతా అన్నీ వదిలేసి కేవలం తెలంగాణా ఉద్యమ కారులపైనే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండడం వంటి ఆయన వ్యవహార శైలితో ఆయన తెలంగాణా ప్రజలను తీవ్రమైన నిరాశకు గురి చేసిన్రు.

అంతే కాక ఆయన విచ్చలవిడి అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులను కూడగట్టిన జగన్, చంద్రబాబులను ఎప్పుడూ సూటిగా విమర్శించిన పాపాన పోలేదు. కాని ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన తెలంగాణా ఉద్యమం పైన కాని, తెలంగాణా రాష్ట్ర సమితి పైన కాని నిప్పులు కక్కుతనే ఉంటరు.

ఆయన నిష్పక్ష పాతంగా అందరినీ ఒకే రకంగా తప్పులు జరిగినప్పుడు విమర్శిస్తే తెలంగాణా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని కేవలం తెలంగాణా ఉద్యమ నిర్వహణలో జరిగే లోటుపాట్లను మాత్రమే విమర్శిస్తనంటే  విని ఊరుకోవడానికి తెలంగాణా ప్రజలు సిద్ధంగా లేరు.

కాంగ్రెస్ నాయకులూ, ఇంక మీ పప్పులుడుకవ్

మీరు మాయల మరాటీని మించినోల్లని మాకు మొదటినుంచి ఎరికే. అయినా ఓపిక పట్టినం. ఏంజేస్తరా  అని చూస్తున్నం. మీరు ఎన్నెన్ని నాటకాలాడుతరో చూసుకుంట వస్తున్నం. 

శ్రీకృష్ణ కమిటీ అంటిరి. అది వచ్చే, చిత్తుకాగితాలు ఇచ్చే! పార్లమెంటు సమావేశాలు అంటిరి. అవి గూడ ఐపాయే! ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పోడుస్తం, నరుకుతాం అంటిరి. అవీ అయిపాయే! జూన్ పదిహేను డెడ్ లైన్ అన్నరు. అది ఐపోయింది, ఇప్పుడు జూలై ఒకటి, ఇంకో కొత్త డెడ్ లైన్!

ఇన్నాళ్ళు రెండుకండ్ల బాబును అడ్డం పెట్టుకొని బాగనే నటించిన్రు, ఉద్యమకారుల్లెక్క. ఇప్పుడు అగుపడుతది మీ అసలు స్వరూపం. పైకి తెలంగాణా మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తరు. కాని ప్రాణమైనా వదులుతరు గాని పదవులను వదులుకోమ్మంటే వదులుకోరు. మీ బలహీనత బాగనే కనిపెట్టిన్రు డిల్లీవోల్లు. అందుకే మీకు నయాపైస అంత విలువ గూడ అక్కడ దొరుకుత లేదు.    

జూలై ఒకటి తర్వాత మీకున్నది నిర్ణయాత్మక సమయం. మీరు తీసుకొనే నిర్ణయంమీద తెలంగాణాల మీ భవిష్యత్తు నిర్ణయమైతది.  మీరు జీవితాంతం అమ్మ కాళ్ళు మొక్కుకుంట ఆంధ్రా దొరలకు ఊడిగం జేస్తరో, మీక్కూడ వెన్నెముకలు ఉన్నయని యాది తెచ్చుకొని ఉద్యమంల జేరుతరో మీ ఇష్టం.

ఇంకా మేం ఉద్యమాలు జేస్తం, దీక్షలు జేస్తం అని తెలంగాణా జానానికి నమ్మబలికే ప్రయత్నం జేయకున్రి. మీఎరు ఈ ప్రభుత్వం పదవులు అనుభవించుకుంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తమంటే ఇక్కడ నమ్మేటోల్లు ఎవరూ లేరు. మీకున్నది ఒకటే మార్గం. డిల్లీల అనుకున్నది సాధిస్తరా? లేకుంటే పదవులకు రాజీనామాలిచ్చి ప్రజలల్లకొచ్చి ఉద్యమాలు జేస్తరా? మీరే తేల్చుకోన్రి. 

Thursday, June 16, 2011

నాడు సైమన్ కమీషన్ నేడు శ్రీకుట్ర కమీషన్

నాడు సైమన్ కమీషన్
నేడు శ్రీకుట్ర కమీషన్ 
నాడు జలియన్ వాలాబాగ్
నేడు ఉస్మానియా యూనివర్సిటీ 

రోజులు మారినయి 
తెల్లదొరలు మారిన్రు
నల్లదొరలు వచ్చిన్రు 
పద్ధతులు మారలేదు 

తెల్లదొరలు నయం 
డిల్లీ  అడుగలే 
ముంబాయి అడుగలే 
కోల్కతా అడుగలే 
చెన్నై అడుగలే 

నల్లదొరలు అట్లకాదు 
తెల్లదొరల నీతి లేదు
కంటికి నదరుగ ఉంటే 
కావాలంటరు అంతా

తెల్లదొరలు చేసింది 
దేశాంతర దోపిడీ
నల్లదొరలు జేసేది 
నల్లి కుట్ల దోపిడీ 

సోదరులం అనుకుంటా
సల్లటి మాటలు జెప్పి 
సదువూ నీళ్ళూ కొలువూ 
అన్నింటా దోపిడీ 

సల్లని మనుషులకు గూడ 
తప్పవు దీవెనలు తిట్లు
నల్లులు జేరిన మంచం
దెబ్బల పాలైనట్టు 

ఆంధ్రా అన్నల్లారా 
అందుకే చెప్తున్నా
రాష్ట్రాలుగ విడిపోదాం 
సోదరులై కలిసుందాం 

జేపీగారూ ఒక్క దానికి జవాబు చెప్పున్రి


జేపీ గారూ, మీరంటే మొదటి నుంచి మాకు శానా గౌరవం. ఎప్పుడు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతరు. మాకు తెల్వని ఎన్నో విషయాలు చెప్పుతుంటరు. ప్రజల కష్టాల గురించి ఆవేదన తోటి మీరు మాట్లాడుతుంటే కండ్లల్ల నీళ్ళు తిరుగు తుంటయి.

మాట మాట్లాడితే రాజ్యాంగం అనే మీరు రాజ్యాంగ బద్ధంగా మేం తెలంగాణా రాష్ట్రం అడిగినప్పుడు మనస్పూర్తిగా సహకారం ఇస్తరని ఆశపడ్డం. మీరు మాత్రం మొఖం చాటేసిన్రు. పాత్రికేయులు మొఖం పట్టుకొని అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పలే.

చిన్న రాష్ట్రాలకు మీ పార్టీ అనుకూలం అని చెప్పుతరు. చిన్న రాష్ట్రాలతోటే అధికార వికేంద్రీకరణ వలన అభివృద్ధి జరుగుతది అని చెప్తరు. మరి తెలంగాణా విషయం వచ్చేసరికి అభివృద్ధికి రాష్ట్ర విభజనకి సంబంధం లేదంటరు. తెలంగాణా విషయం వచ్చే సరికి మీరు చెప్పే విషయాలు అర్థం గావు. తెలంగాణా గురించి మాట్లాడాలంటే రూజ్ వెల్ట్ గుర్తుకొస్తడు మీకు. కనీసం మీరు జెప్పే విషయాలు మీకయినా అర్థమైతున్నయా అని మాకు అనుమాన మైతుంది.

మొన్న అసెంబ్లీల ఇద్దరు ముగ్గురు తెలంగాణా ఎమ్మెల్యేలు రెచ్చి పోంగనే మీకు ప్రజాస్వామ్య సూత్రాలు గుర్తొచ్చినై. నిమిషాల మీద అసెంబ్లీ మీడియా పాయింటు దగ్గరికొచ్చి ఆవేశంగ ప్రసంగించిన్రు. ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు బాధ పడ్డరు, ఆవేదన పడ్డరు. సరే, మీ ఆవేదనకు అర్థం ఉందనుకుందాం. 

మరి శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టరు మీద హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ చాప్టర్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఎన్నో విషయాలు బయట పెట్టింది. ప్రభుత్వం మీడియా మేనేజిమెంటు చెయ్యాలె అనుడు  మీరు సమర్థిస్తరా? ప్రభుత్వం రాజకీయులకు పదవులు ఆశ పెట్టి ప్రజా ఉద్యమం నీరు గార్చాలె అని చెప్పుడు సమర్థిస్తరా? ఇంతవరకు దీనిమీద ఏమీ మాట్లాడక పోతిరి.

8వ అధ్యాయం ఆధికారికంగ బయట పెట్టినంక మాట్లాడుత అంటరేమో? రహస్యం గాబట్టి అది ఎప్పటికీ బయటకు రాదు, మీరు ఎప్పటికీ మాట్లాడరు. కాని హైకోర్టు తీర్పు ఇచ్చినంక, బయటికొచ్చే విషయాల మీద మీరు మాట్లాడితే తప్పుగాదు. న్యాయకోవిదుడు ప్రశాంతభూషణ్ అంతటివాడు ఆ చాప్టర్ మీద స్పందించిండు. అంతకన్నా మీకు ఎక్కువ న్యాయసూత్రాలు తెలుస్తయని అనుకోను.

మీరు ఐదు నిమిషాలు మాట్లాడితే దాంట్లే పదిసార్లు 'ప్రజాస్వామ్యం' అని పలుకుతరు. మరి ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద సమస్య మీద నలభై కోట్ల ప్రజాధనం కర్చుపెట్టి శ్రీకృష్ణ కమిటీ అని ఒకటి పెట్టి, ఆ నివేదికల ఒక దరిద్రపు చాప్టరు పెట్టి, దాన్ని అమలు జరుపాలని చూస్తుంటే, ఒక ప్రజాస్వామ్య వాదిగ మీరు స్పందించ వలసిన బాధ్యతా లేదా? మీరు చాలా పెద్ద సార్లు, ఏదో, మాకు అర్థం గాక అడిగినం. కోపం దెచ్చుకోకుంట జర వివరంగ జెప్పున్రి సారూ.
    

Wednesday, June 15, 2011

తెలంగాణా ప్రజలమీద ఒక సమైక్యవాది అభిప్రాయం

కోవెల సంతోష్ కుమార్ గారి బ్లాగు చూస్తుంటే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు వ్రాసిన ఈ క్రింది వ్యాఖ్య కనపడ్డది.

"తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."



ఎంత దారుణమైన ఆరోపణలో చూడున్రి. ఈ వ్యాఖ్యలు సదరు వ్యాఖ్యాత అభిప్రాయాలే కాదు దాదాపు అందరు సమైక్యవాదుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నయి. వాల్లేందో చాలా గొప్ప వాళ్ళని, తెలంగాణా పౌరులు రెండో జాతికి చెందిన వాళ్ళని, విడిపోతే వీళ్ళకి పరిపాలించుకోవడం రాదనీ, ప్రజాస్వామిక భావాలు లేవని, మొబిలిటీ లేదని, వగైరా వగైరా...

ఇవన్నీ ఎంతవరకు నిజాలో పరిశీలించి చూద్దం.

విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదట! ఏంది మారేది? కులతత్వం నేర్చుకోవల్నా, ఫాక్షనిజం నేర్చుకోవల్నా? ఏం నేర్చుకోవాలె  మీలెక్క మారుతందుకు?

ఇక్కడ పని సంస్కృతి లేదట! ఒక వైపు వీళ్ళే చెప్పుతారు, తెలంగాణాల వ్యసాయం పెరిగింది, జీడీపీ పెరిగింది అని. మరి ఆయకట్టు ప్రాంతాలు లేక, బోర్లకిండా అష్ట కష్టాలు పడుకుంట కూడా వ్యవసాయం ఎట్ల పెరిగింది సారూ పని సంస్కృతి లేక పొతే? డబ్బులున్నోడు AC రూముల కూచొని వ్యాపారం చేసుడేనా పని సంస్కృతి అంటే? పాలమూరు కార్మికులు చూపెట్టేది పని సంస్కృతి కాదా? ఫ్లోరీన్ విషాన్ని తాగుతూ నరనరాన నిస్సత్తువని నింపుకొని కూడా జీవన్మరణ యుద్ధం చేస్తున్న నల్లగొండ జిల్లా ప్రజలల్ల పని సంస్కృతి కనిపించ లేదా? రాష్ట్రానికే రైస్ బౌల్ గా మారిన కరీంనగర్ బిడ్డలది పని సంస్కృతి అనిపించా లేదా? వివక్ష గురించి మాట్లాడితే మీరే అభివృద్ధి చెందిన్రంటరు. మా ఉద్యోగాలు కబలిస్తున్నారంటే మీకు పని సంస్కృతి లేదంటరు.

ప్రైవేట్ ఇనీషియేటివ్ ఎక్కడికెళ్ళి పెరుగుతది? ప్రైవేట్ వ్యాపారాలకి డబ్బులు కావాలె. తేరగా వస్తున్న నీల్లతోటి మూడు పంటలు పండుతలేవు మాకు డబ్బులు ఇండ్లల్ల మూలిగేటందుకు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే బతుకుదెరువు, వచ్చే కారుకు పంట. ఉన్న ప్రాజెక్టులు పూర్తిగాక పాయె, రావలసిన ప్రాజెక్టులు రాకపాయె, ఇంకా వ్యాపారాలు ఎక్కడ పెట్టక పోతిమి సామీ?

అక్షరాస్యత గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. తిండికి లేకపోయినా, సదువులు బాగనే సదివించు కుంటున్నరు వావాళ్ళు. కాకపొతే మీలెక్క కార్పోరేట్ స్కూళ్ళల్ల చదివే స్తోమత లేకపోవచ్చు.

తెలంగాణాల ప్రజాస్వామిక భావాలు లేవా? TRS గెలిస్తే ప్రజాస్వామిక భావాలు లేనట్టు, తెలుగుదేశం, కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామిక భావాలు ఉన్నట్టా? వారసత్వం పేరు జెప్పి కడపల అవినీతి సామ్రాట్టును గెలిపిచ్చుడు ప్రజాస్వామ్య భావాలా? కులానికో పార్టీ పెట్టుకొని రాష్ట్రాన్ని రెండు మూడు కులాల కుమ్ములాట కింద మార్చుడు ప్రజాస్వామ్యమా? గదేందో సరింగ చెప్పితే అర్థం చేసుకుంటం సారూ. ప్రజాస్వామ్యం కోసం ఆనాడే నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన గడ్డ ఇది, మరువకండి.

అయితే కొందరు నాయకులు ప్రజా ప్రయోజనాలను అటక ఎక్కించి ఆంధ్రా పాలకుల తొత్తుల లెక్క మారింది మాత్రం నిజమే. దానికి కారణం అధికారబలం, సూట్ కేసుల బలంతో సిసలైన నాయకులను తొక్కేసి, మీ మోచేతి నీళ్ళు తాగే చెంచాలకు పదవులు ఇచ్చి కృత్రిమ నాయకత్వాన్ని పెంచి పోషించుడు. అప్పుడు KCR ని తోక్కిపట్టినా, ఇప్పుడు నాగం ని ఈడ్చి తన్నినా అదే కారణం. కాని ఇప్పుడు రోజులు మారినాయి అని గుర్తు పెట్టుకోండి. మీరు తొక్కిన నాయకులే రేపు చండ్రనిప్పు లైతరు.

అవతలి వాళ్ళ అభిప్రాయాలను వినిపించుకోవాలెనా? 'నాయింటికొస్తే నాకేమిస్తావ్, నీయింటికోస్తే నువ్వేమిస్తవ్' అనే అభిప్రాయాలా? మేం ఎందుకు విడిపొవాలను కుంటున్నాం, మా బాధలు ఏంటివి అని ఒక్క సారి గూడ వినిపిచుకోరు మీరు. పైనించి 'మీరు చాల బాగా ఉన్నరు మా పాలనల, మీకు ఇష్టం ఉన్నా లేక పోయినా మిమ్ముల మాత్రం వదలం' అని మాట్లాడుతరు. న్యాయమేందో ఒకసారి ఆలోచించండి. ఇక మీదపడి కొట్టుడు మాట మీకే తెల్వాలె. ఇది ఒకసారి చూసి ఎవరు ప్రశ్నిస్తే కొడుతరో తెలుసుకోండి.

అయ్యా తెలంగాణా ప్రజల మొబిలిటీ గురించి మీరు అస్సలు దిగులు పడే అవసరం లేదు. రెండు మూడు భాషలు మాట్లాడ గలిగినోల్లు తెలంగానోళ్ళు. పాలకుల పుణ్యమా అని గవర్నమెంటు ఉద్యోగాలు మాత్రం వాళ్లకు దొరుకవు గని ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంట లక్షలాది మంది వేరే రాష్ట్రాలల్ల బతుకుతున్రు. ఒక్క మహారాష్ట్రలనే యాభై లక్షల మంది తెలుగోళ్ళు ఉంటె వాళ్ళల్ల ఎక్కువ శాతం మంది తెలంగాణా వాళ్ళే. ఇంకా గుజరాత్ సంగతి సరేసరి. సాఫ్టువేరు పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంల వాళ్ళు తిరుగని జాగలేదు. ఒక్క సీమాంధ్ర తప్ప. ఎందుకో మరి తోటి తెలుగోళ్ళ దగ్గరికి పోవ్వాలే నంటే మావోల్లకు అంత అదురు, మీరే జెప్పాలె.

మీరు రాసిన మూడు నాలుగు వ్యాక్యాలల్ల తెలంగాణా మీద మీకున్న అభిప్రాయాన్ని దాపరికం లేకుండ చెప్పినందుకు చాలా సంతోషం సారూ. మీలాంటి వాళ్ళ మాటలు విని మాకు ఉద్యమావేశం మరింత ఎక్కువైతది. మా మీద ఇటువంటి అభిప్రాయాలు ఏర్పరచు కున్నోల్ల తోటి ఎందుకు కలిసుండాలే అని ప్రశ్న ఉదయిస్తది. రాష్ట్రం కోసం మా ఆరాటం పోరాటం లెక్క రూపు దిద్దుకుంటది.

Tuesday, June 14, 2011

జయప్రకాష్, ఏమైంది నీ గొంతు?

జయప్రకాష్ నారాయణ్ సార్! ఇన్ని దినాలు నువ్వే అవినీతిని ఎండగట్టే టందుకు ఉన్న ఒకే ఒక హీరోవి అనుకున్నం. ప్రతిచిన్న విషయం మీద కూడా దేశంల ఉన్న అవినీతి గురించి మొదలు పెట్టి పెద్ద పెద్ద లెక్చర్లు దంచుతుంటవు. నీతి నిజాయితీలకి, ప్రజాస్వామ్యానికి పర్యాయపదం నీవే నన్నంత హంగామా జేస్తవు.

అసెంబ్లీల చిన్న గలభా కాంగనే అసువులు బాసినంత పని జేసినవు. భారత ప్రాజాస్వామ్యాన్ని రక్షించేటందుకే పుట్టిన పరమాత్ముని లెక్క పోజు పెట్టినవు. ఇప్పుడు దేశమంత అవినీతి, అక్రమ సంపాదనలకు వ్యతిరేకంగా అట్టుడికి పోతుంటె, అనర్ఘళంగా మాట్లాడే నీ గొంతు మాత్రం ఎక్కడ వినొస్తలేదు. ఏంది ఈ మాయ సామీ?

నేనయితే హజారే దీక్ష మొదలు కాంగనే నువ్వు డిల్లీలనే  కూసుంట వనుకున్న. లోక్ పాల్ పెట్టేదాంక నిద్రపోవను కుంటినే! మరి నీజాడ భూతద్దం పెట్టినా ఎక్కడ కనపడక పాయె. మన జయప్రకాష్ సారు కాకుండా ఇంతమంది వేరేవాళ్ళు అవినీతి మీద పోరాటం జేస్తున్నరా అని ఒక్కటే పరేశానైతి!

ఒకవైపు హజారే, కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ అరిచి గోలగోల చేస్తున్రు. ప్రభుత్వం నోట్లె మాట ఎల్లకుండా గోస పెడుతున్నరు. ఇంకో వైపు దేశభక్తి కోసమో, సొంత లాభం కోసమో తెలవదు గని మన యోగాసనాల బాబా రాందేవ్ కూడా దీక్షలు చేసుకుంట ప్రభుత్వానికి నిద్రబట్టకుంట చేయబట్టే. 

ఇంత మంది ఇన్ని చేస్తుంటే అవినీతి పేటెంటు మీద అసలు హక్కు దారునివి నువ్వేందన్న, గిట్ల మాట ముచ్చెట లేకుండ గమ్మునున్నవు? నువ్వు డిల్లీకి  పోవాలె, దీక్షకు కూసోవాలే, ధూంధాం జెయ్యాలె. అదను మీద ఉన్నప్పుడు పంట ఎయ్యాలె, గప్పుడే లాభాలోస్తాయి. గిది అవినీతి పై పోరాటాలు జేసే సీజన్. మరి నువ్వు ఇంట్ల కూసుంటే ఎట్ల?

పోరాటం చేస్తే సోనియమ్మా ఏమనుకుంటదో, మన్మోహన్ ఏమనుకుంటదో  అని పరేషాన్ అయితున్నవా? ఎవ్వరిని పరేషాన్ పెట్టకుంటే పార్టీ ఎట్ల పెద్దయితదన్నా? ఎప్పుడు జూడు తెలంగానోల్లని పరేషాన్ జేసుడు దప్ప ఇంకెవ్వల్ని పరేషాన్ జేసుడు ఇష్టం లేదా ఏంది?

చూడు మరి, నీ ఉన్న ఒక్క పేటెంటు హజారేగుంపు కొట్కపొతే వచ్చే ఎలక్షన్ల నీకు ఒక్క సీటు గూడ రాదు. అందుకే చెప్పుతున్న, 'సందుల మందాయే సన్నాసి పెండ్లాయే' అన్నట్టు నువ్వుగూడ డిల్లీకి పొయ్యి ఒక టెంటు ఏసుకొని దీక్ష చెయ్యరాదే! ఇక్కడ కొంపలు మునిగే రాజకీయాలేమున్నయి గనుక!

తెలంగాణా కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త

ఇంకో మోసానికి తేరలేస్తుంది.తెలంగాణాకు గూడ గూర్ఖాలాండ్ మాదిరి పరిష్కారం జూపిస్తరని వార్తలోస్తున్నై. రేపు జరిగే మీటింగుల ఇదే విషయాన్ని చెప్పి తెలంగాణా కాంగ్రేసు నాయకులను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నయట.

ఇది ఎంతవరకు నిజమో తెలువదు. అయితే మరి తెలంగాణాల చిన్న పోరగాడు కూడ దీన్ని ఒప్పుకోడు. మరి కాంగ్రెస్ నాయకులు ఎప్పటిలేక్కనే తలకాయలు వంచుకొని, అధిష్టానం చెప్పింది విని, ఇటలీ అమ్మ దగ్గర తెలంగాణా తాకట్టు పెట్టి వస్తారా, ఈసారైనా గట్టిగ తెలంగాణా వాదం వినిపిస్తారా అనేది కొన్ని గంటలు అయిన తర్వాత తెలుస్తది.

కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటిదాకా మీరు వేసిన వేషాలు తెలంగాణా ప్రజలు సహించిన్రు. తెలంగాణా ఉద్యమానికి ఏదో కొంత మీ వంతు కూడ సాయపడుతరేమో అని చిన్న ఆశ ఉండేది, అధికారంల ఉన్నరు గాబట్టి. రేపటి దినం మాగ్గాదు, మీకు పరీక్ష. ఈ పరీక్షల పాసైతరా, మరికొన్ని రోజులైనా రాజకీయాలల్ల ఉంటరు. లేకపోతే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకుంటరు.

మీకు డబ్బు సంచులు దొరుకొచ్చు. వాటికి ఆశపడి మీరు తలకాయలు ఊపి రావచ్చు. కాని మీరు తిరిగి తెలంగాణా ప్రజలమధ్యకు మాత్రం రాలేరు. యాదివెట్టుకోండి. మీరు ప్రజలను మోసం జేసుకుంట మహా అయితే 2014 దాంక అదికారంల ఉండొచ్చు. ఆ తర్వాత మీరు ఎన్నికల్ల గెలువాలనంటే ఆంధ్రాకో, ఇంకెక్కడికో పోవాలె. ఇక్కడ మాత్రం గెలువ లేరు.

మిమ్ముల మీరు తాకట్టు పెట్టుకోగాలరేమోకని తెలంగాణాను మీరు తాకట్టు పెట్టలేరు. కణకణ మండే అగ్నిగోళం ఇప్పటి తెలంగాణా. రాష్ట్రాన్ని ఎట్లా సాధించు కోవాల్నో మాకు తెల్సు. దానికి మీరు ఊతమిస్తే మంచిదే. లేక పొతే చరిత్రల తెలంగాణా ద్రోహులుగా మిగిలిపోతరు.     

హైదరాబాదుల కరెంటుంటే ఆదిలాబాదుల లైటు వెలుగుతదా?

మన సమైక్యవాదం జేసే సీమాంధ్ర సోదరులు మాట మాట్లాడితే హైదరాబాదును హైదరాబాదును మేమే డెవలప్ జేసినం, హైదరాబాదును మాత్రం వదిలేది లేదు పిచ్చి వాదనలు చేస్తుంటరు, అదేదో హైదరాబాదు వాళ్ళ తాత జాగీరైనట్టు.

దీని మీద మనం హైదరాబాదు పై అత్యాశ అనే పేరు తోని ఒక టపా రాయడం జరిగింది. దాంట్ల హైదరాబాదు ముందు నుండి పెద్ద నగరమే నని, కొత్తగా పనిగట్టుకుని డెవలప్ జేసిందేమీ లేదని, ఆంద్రాల కరెంట్ తెల్వక ముందే హైదరాబాదుల పవర్ ప్లాంటు పెట్టిన్రని రాయడం జరిగింది.

ఇది జూసి విశాలాంధ్ర మహాసభ అని ఒక బ్లాగు పెట్టుకొని ప్రతి దినం తెలంగాణా జనాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఒక పెద్దమనిషి కింది కామెంటు పెట్టిండు.

Chaitanya said...

"ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. "

KCR చెప్పినదాని గురించి కాపీ కొట్టారా ఏమిటి? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. నిజాం మీరు డప్పు కొట్టినంత విధంగా ఏమి చేసినా అది బ్రిటిష్ దేశస్థుల సాంకేతిక సహాయాన్ని తీసుకునే కదా? మరి అటువంటిది వారి పాలనా లో ఉన్న ప్రెసిడెన్సి లో జనాలకు కరెంటు తెలియదా? మీరు చెప్పిన దాని నుండి ఎంత కరెంటు ఉత్పత్తి అయ్యేది ఎన్ని ఇండ్లకు సరఫరా జరిగేది (నిజాం భవనాలు మినహాయించి)?

From state electricity board's administrative report under rule no 59 APSEB supply rules 1958

Electrified cities/towns and villages as on 31-3-1956

Mahbubnagar 0
Medak 1
Nizamabad 0
Adilabad 0
Karimnagar 2
Warangal 0
Nalgonda 1
Hyderabad 2
Khammam 4
Srikakulam 37
Visakhapatnam 45
East Godavari 107
West Godavari 73
Krishna 77
Guntur 33
Nellore 26
Chittor 63
Kadapa 16
Anatapur 39
Kurnool 29


April 18, 2011 8:06 PM

నేను వ్రాసినదానికి, ఈయన జెప్పుతున్న దానికి ఏమన్నా పొంతన కనిపిస్తుందా. నేను మాట్లాడింది హైదరాబాదుల మొట్ట మొదటి పవర్ ప్లాంటు పెట్టిన్రని. అది తప్పైతే నిరూపించాలే. నేను రాసిన దానికి ఆధారం ఇక్కడ ఉన్నది. మరి సదరు బ్లాగరు బ్రిటిష్ వాడే ముందు పెట్టిండనే థర్మల్ ప్లాంటు ఎక్కడ ఉన్నదో తన బ్లాగులనే చెప్తే బాగుండేది. అంతే గని ఈ పెద్దమనిషి ఆ విషయాన్ని కన్వీనియెంట్ గ వదిలేసి 1956 ల ఎన్ని ఊర్లల్ల కరెంటు ఉన్నదన్న సంగతి మాట్లాడుతడు. పైనించి హైదరాబాదు మొత్తం ఒక యూనిట్ గ తీసుకుంటడట. హైదరాబాదు విధ్యుద్దీకరణ ఎన్ని ఊర్లకు సమానం అనుకోవాలె?

ఈ బ్లాగరు వ్రాసిన దాంట్ల రెండు విషయాలు కనపడుతున్నై. ఒకటి, తెలంగాణాల ఏదైనా తమకంటే మొదట జరిగిందంటే సహించ లేక పోవడం. రెండు, తమ దగ్గర దామాషాలో ఎక్కువ ఊర్లు అప్పటికే electrify అయినై కాబట్టి ఇప్పుడు గూడ అట్లనే ఉండాలే అనుడు. వీరి ప్రతి వాదనలో ఇదే కనపడుతది. అప్పుడు తెలంగాణాకి, ఆంధ్రాకి ముప్పై రెట్లు తేడా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అనుడు.

ఈ దామాషాల కపట నాటకం ఎట్లా ఉంటదంటే, స్వాతంత్ర్యం రాకముందు బ్రిటన్ కి ౧౦౦౦ విమానాలుంటే, మన దేశానికి ఒకటి గూడ లేదు. అంటె ఇప్పుడు గూడ మన దేశానికి అదే దామాషాల విమానాలు ఉండాలెనని వీరి ఉద్దేశమా?

ఒకప్పుడు తెలంగాణాల అభివృద్ధి జరుగలేదు, నిజమే, కాదని ఎవరన్నరు? నిజాం నవాబు ప్రజలను పీడించి కేవలం హైదరాబాదు నగరాన్నే అభివృద్ధి చేసిండని మేం మొదటినుంచి మొత్తుకుంటనే ఉన్నాం. కాని హైదరాబాదు మాత్రం అప్పుడు నిజాం అభివృద్ధి చేసిండు అతని స్వార్థం కోసం. ఇప్పుడు సమైక్య పాలకులు చేస్తున్నది కూడా వాళ్ళ వ్యాపారాల స్వార్థం కోసం మాత్రమె. హైదరాబాదుల ఉన్న బడుగు జీవికి అప్పుడూ ఒరిగింది లేదు, ఇప్పుడూ ఒరిగింది లేదు.

కలిసేటప్పుడు సమానంగా అభివృద్ధి చెందుతం అనుకున్నం. దామాషా పద్ధతిల అభివృద్ధి చేస్తమని ముందే చెప్పి వుంటే అప్పుడే మేల్కునే వాళ్ళం. తెలంగాణలో, ఆంధ్రలో అసమతుల్యత ఉంది కాబట్టే షరతులతోటి కూడిన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ షరతులు వమ్మైనై కాబట్టే ఇప్పుడు విడిపోతమంటున్నాం.

సదరు బ్లాగరు వ్రాసిన మరికొన్ని వ్యాఖ్యలు.

>>>రైతులకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ సరఫరా ద్వారా ఎక్కువ లాభబడుతున్నది తెలంగాణా ప్రాంతమేనని అందరికి తెలుసు.31-3-2010 నాటికి వ్యవసాయ కనెక్షన్లు 27.34 లక్షలకు చేరుకొన్నాయి.వీటిలో 17 లక్షల వరకు తెలంగాణలో ఉన్నాయి.

మొత్తం ప్రాజెక్టులు కట్టుకొని కాలువల కింద నీళ్ళు పారిచ్చుకుంట వుంటే ఇంక కనెక్షన్ల తోటి పనేముంది? అక్కడ ఉచిత నీటి సౌకర్యం ఉన్నప్పుడు, ఇక్కడ ఉచిత కరెంటు సౌకర్యం ఉంటె తప్పేంది? అసలు కరెంతోక్కటి ఉచితమైనా, బోర్లు వేసుడు, బోర్లు ఏందీ పోవుడు, మోటార్లు కాలి పోవుడు ఇట్లా లక్ష నరకాలుంటయి బోరు వ్యవసాయం జేసే రైతుకి. ఇక్కడ కట్ట వలసిన ప్రాజెక్టులు తిమ్మీద కట్టితే ఇన్ని మోటార్లు, ఇంట కరెంటు అవససరం ఏముంది?

>>>తెలంగాణా ప్రాంత డిస్కంలకు ట్రాన్స్కో విద్యుత్తును తక్కువ ధరకు అమ్ముతుంది. అయినా తెలంగాణా జిల్లాలలో అక్రమ వాడకం ఎక్కువ కాగా, బిల్లింగ్, మీటర్డ్ అమ్మకాలు తక్కువ. ఉదాహరణకు 2006 సంవత్సరంలో Current Theft cases in districts లో తెలంగాణా జిల్లాలే ముందు ఉన్నాయి.

ఎంత దుర్మార్గమైన వాదనో చూడున్రి. తెలంగాణా వాళ్ళు కరెంటు దోపిడీ చేస్తరట! ఆంధ్రా వాళ్ళు మాత్రం న్యాయంగా బిల్లు కడుతరట! వ్యవసాయానికి కాలిన కరెంటుకి మీటర్లే లేనప్పుడు మీటర్ల మీద అమ్మకం ఎట్లా ఉంటది? ఉచిత కరెంటు ఇచ్చినపుడు దాని మీద వసూళ్లు ఎట్లా ఉంటయి?

>>>పారిశ్రామికంగా 1961లో కోస్తాలో 58.5% విద్యుత్ వినియోగం అవుతూ ఉంటే తెలంగాణలో అది కేవలం 28.1%. నేడు అది తెలంగాణాలో 58.77 % ఉండగా కోస్తాలో 29.35 కి పడిపోయింది.రాయలసీమలో 15.6 నుండి 11.86 కి తగ్గింది.1961 నాటి భారత గణాంక వివరాల ప్రకారం చూస్తే కేవలం కృష్ణా జిల్లా వినియోగం ఆనాటి హైదరాబాద్ జిల్లా (రంగారెడ్డి, హైదరాబాద్) మొత్తం వినియోగం కంటే 45 % ఎక్కువ.

ఈ లెక్కలు ఎంతవరకు సరైనవో నాకు తెలవదు. సరైనవే అనుకుందాం. కాని ఈ వాడకంల హైదరాబాదు నగరంల ఎంత, మిగతా తెలంగాణాల ఎంత అని గూడ చెప్పితే బాగుండేది. కచ్చితంగా ఈ వాడకం హైదరాబాదుల తప్ప ఇంకో చోట ఉండదు, పరిశ్రమలు అక్కడ దప్ప ఇంకెక్కడున్నయి తెలంగాణాల? మరి తెలంగాణా ల ఉన్న పరిశ్రమలు ఎక్కువ సీమాంధ్రులవే గద! అట్లా అని మీరే చెప్పుకుంటారు. మరి ఆ కరెంటు వాడేది ఎవరు? పోనీ ఆ పరిశ్రమల్ల ఉద్యోగాలు చేసేది ఎవరు?

ఒక్కటి మాత్రం నిజం. అప్పటి నిజామైనా, ఇప్పటి సీమాంధ్ర పాలకులైనా ఎంతో కొంత అభివృద్ధి చేసింది హైదరాబాదు మాత్రమే. అదీ వారి వారి అవసరాల మేరకో, స్వార్థాలకోసమో తప్ప ఇంకోటి గాదు. కనీసం అప్పటి నిజాము ప్రజలకు ఉపయోగ పడే కళాశాలలు, దావఖానాలు, నీటి వసతులు కట్టిచ్చిండు. ఇప్పటి వలస పాలకులు హైటెక్ సిటీ, జూబిలీ హిల్స్ తప్ప ఇంకోటి అభివృద్ధి చేసిన పాపాన పోలే. కానీ హైదరాబాదు సంపదను మాత్రం బాగానే కొల్లగొట్టిన్రు.

Monday, June 13, 2011

లక్ష బర్రెలు తిన్న రాబందు

లక్ష బర్రెలు తిన్న రాబందు
కోటి బర్రెలకు ఆశ పడింది
ఆశపడుడు ఆలస్యం
రైతుబంధు వేషం గట్టింది
వేషం బాగనే కుదిరింది 
భాష బాగనే అమిరింది 
భజనవర్గాలు గుమికూడినై

రాబందు రైతుల జమచేసింది 
నేనే దిక్కని నమ్మ బలికింది 
నీ గొర్రెల బర్రెల కాపాడేది 
నేను గాక ఎవరని అడిగింది 
నమ్ముడు మొదలు పెట్టిండు రైతు 
నమ్మక ఇంకేం జేస్తడు రైతు?

బర్రెల కాసేటోడు గొర్రెల కాసేటోడు
మందల దగ్గర జాడ పత్తా లేరు
ఇమాన్‌దారీ  ఇడిచి పెట్టి
జవాబ్‌దారీ జాడ మరిచి    
మూడు రంగుల రంగమెక్కి  
కుర్చీ ఆటలు ఆడబట్టిన్రు 

మందలిస్త డనుకున్న పెద్దకాపు 
మందల గాలికొదిలేసి 
పచ్చదుప్పటి కప్పుకొని 
పగటికలలు కనబట్టిండు 
రణభేరి మొగిస్తున్నట్టు
రాబందుల నరికేస్తున్నట్టు...

జాతీయవాదం అంటే ఏంటి?

అసలు జాతీయవాదం అంటే ఏంటిది? మన జాతి అంత ఒక్కటి అని గుర్తించుడు. మన జాతి మొత్తం గొప్పదే అని భావిస్తూ జాతి మీద అభిమానం కలిగి ఉండుడు. ఇక్కడ జాతి అంటే భారత జాతి  అని గుర్తించాలే. 

ఆవిధంగ కాక, మాది తెలుగు జాతి అని తమిళుల నుంచి విడిపొయ్యి వచ్చినోల్లది ఏరకమైన జాతీయవాదం? అదే విధంగా తెలుగుజాతి పేరు చెప్పి రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న వాళ్ళది ఏరకమైన జాతీయవాదం? భారత జాతి మొత్తం ఒకటే అయినప్పుడు, మరి తెలుగుజాతి అన్న విభజన ఎందుకు. పాలానా సౌలభ్యం కొరకు ఒక భాష మాట్లాడే వాళ్ళను ఒక రాష్ట్రం కింద చేసి ఉండొచ్చు. కాని ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకే రాష్ట్రం కింద ఉండాలే అనుడు సంకుచిత ప్రాంతీయ వాదమా, జాతీయవాదమా?

మరి ఇంత సంకుచితంగా తమ ప్రాంతీయ విషాన్ని వేలిగాక్కే వాళ్ళు జైపాల్ రెడ్డి వ్యాఖ్యలకు ఎందుకు పరవశించి పోతున్రో వాళ్ళకే అర్థం కావాలె. ఎందుకో వేరే చెప్పా నవసరం లేదు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును అడ్డుకునే ఏ చిన్న వ్యాఖ్య ఏవరి నోటినుండి విన్నా వీళ్ళకు వీనుల విందుగనే ఉంటది. కాని నిజానికి కరడుగట్టిన ప్రాంతీయ వాదులారా, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను సరిగ్గా విశ్లేషించు కొండి. వాటిలో మీరు పరవశించి పొయ్యేటందుకు ఏమీ లేదు.

నిజంగా జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు మీరు నమ్మినట్టయితే, మీ ప్రాంతీయ దురహంకారాన్ని, తద్వారా అంటుకున్న సమైక్య వాద జాడ్యాన్ని వదిలెయ్యండి.     మనం ఒక్క జాతిగా ఉందాం, ఒక్క రాష్ట్రంగ ఉండే అవసరం లేదు. ఒక్క దేశంల పౌరులుగ బతుకుదాం.

Sunday, June 12, 2011

ఇక్కడ ఉద్యమాలు చేయబడును

తెలంగాణా ప్రజలారా రండి

మీకోసం మేం ఉద్యమాలు జేస్తం. ఆ ముతకబారిన గులాబి బట్టలు, ఎర్రబట్టలు, కాషాయ బట్టలోల్ల దగ్గరికి బోకున్రి. మేం వేసుకున్న ధగధగలాడే పచ్చబట్టలు చూడున్రి. మా ఆంధ్రబాబు మొన్ననే కొనిచ్చిండు మాకందరికీ. ఎంత ప్రేమలేక పొతే మాకు అయిన కొత్తబట్టలు కొని, ఇస్త్రీ చేయించి మరీ ఇస్తడు? మాదగ్గరికొస్తే మీకందరికీ పచ్చ రంగు పట్టుకండువాలు ఫ్రీగ పంచిపెడ్తం.

కండువలే కాదు మా మీటింగులకొస్తే మీకు తలా ఒక బిర్యాని పొట్లం, దినసరి బత్తా ఫ్రీగ ఇస్తాం. రాను పోను మేమే దారి కర్చులు చూసుకుంటం. లేకపోతే డీలక్సు బస్సులు, టాటా సూమోలు పెడ్తం. ఇంకా కావాల్నంటే మా బాబునదిగి క్వార్టరు కూడ ఇప్పిస్తం. ఇయ్యన్ని పెట్టినా కూడ మాదగ్గరికి రాకుండ వేరే వాళ్ళ దగ్గరికి పోతమంటరు! ఏమున్నయి వాళ్ళ దగ్గర? వాళ్ళ మీటింగులకి పొతే మీకు ఇమ్మడి కర్చు, ఆదాయం లేదు. 

వాళ్ళ ధర్నాలకు పొతే మీరు ఎండల ఎండాలే, వానల తడువాలే. అంత జేసినా మీకు లాఠిచార్జుల తోని వీపు విమానం మోతమోస్తది. మా ధర్నాలకొస్తే మీమీద ఈగ వాలకుండ మా కిరణ్ సారుకు చెప్పి మూన్నాలుగు వేలమంది పోలీసులతోని కాపలా పెట్టిస్తం. మీకు మా ఆంధ్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం వివరంగా విన్నవిస్తం. 

మా పార్టీవాళ్లు అక్కడ జైసమైక్యాంధ్ర అంటున్నరని సొంచాయించ కున్రి. గదే మా బాబు రెండు కళ్ళ సిద్ధాంతం. అక్కడ వాళ్ళు సమైక్యాంధ్ర అంటారు. ఇక్కడ మేం తెలంగాణా అనాలే. కేంద్రం ఇప్పుడున్నడానికి భిన్నంగా ఏ నిర్ణయం దీసుకున్నా మోకాలు అడ్డంబెట్టాలే. గోలగోల చేపియ్యాలే. గియ్యన్ని మీకు అర్థంకావు గని, మా మీటింగుల వచ్చి మాత్రం కూర్చోండ్రి. ఎందుకంటే ఇంత సపోర్టు ఇచ్చి, ఇన్ని కోట్లు కార్చి పెట్టి మీటింగు పెట్టినాకూడ ఒక్కడు కూడ వస్తలేడని మా ఆంధ్రబాబు చిన్నబోతుండు. ఆ పైసలన్ని మేమేదో తింటున్నమని అనుమానిస్తుండు.

మీకు మీటింగు మొత్తం వినుడు ఇష్టం లేకపోయినా ఫర్వాలేదు. కుర్చీల్ల జేరసేపు కూచోని ఫోటోలు దిగి వెల్లిపొండ్రి. గా ఫొటోలన్న మేం ఆంధ్రబాబుకు చూపెట్టుకొని మొకం నిలబెట్టు కుంటం. 
      

జాతీయవాది అసలురంగు

జాతీయవాదినని అసందర్భ ప్రేలాపన చేసి తన అసలురంగు బయటేసుకున్న జైపాల్ రెడ్డి, సర్వత్రా నిరసనలు వెల్లువెత్తే సరికి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుండు. నేనసలు తెలంగాణా గురించి ఏమీ మాట్లాడ లేదు అని, ఒక కాంగ్రెస్ వాడి ఎట్లా ఉండాలేనో మాట్లాడిన అని సమర్థించుకుండు.

పైనించి ఆయిన ఇంకొన్ని ముచ్చట్లు గూడ చెప్పిండు. అధిష్టానం ఇప్పటిదాంక తెలంగాణా మీద నిర్ణయం తీసుకోలేదట. ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయం తీసుకుంటదట. అప్పటిదాంక ఈయన ఏమీ మాట్లాడాడట. అధిష్టానం నిర్ణయం తీసుకున్నంక ఈయన నిర్ణయం చెప్పుతడట. అధిష్టానం నిర్ణయం తీసుకున్నంక ఈయన నిర్ణయం ఎవనిగ్గావాలె?

ఇన్నాళ్ళూ ఏదో పెద్దమనిషి అని ఏమీ మాట్లాడకపోయినా గౌరవం పొందుతున్న పెద్దమనిషి నిన్నటితోటి తెలంగాణాల పరపతి మొత్తం పోగొట్టుకున్నడు. ఇంత దివాలాఖోరు మనిషా అని జనం ఛీకొడుతున్నరు ఈయన మాటలు జూసి.  

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకునిగా జైపాల్ రెడ్డికి తెలంగాణా కోసం పోరాడవలసిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా వున్నది. సమైక్యరాష్ట్రం చేతగాని తనం వాళ్ళ రైతులు బికారులుగా మారిన జిల్లా మహబూబ్ నగరు. రాజోలిబండ ప్రాజెక్టు తూములు సీమాంధ్ర ఫాక్షనిష్టులు బద్దలుగొట్టి నేఎల్లు కొల్లగోట్టినప్పుడు దాని ఆయకట్టు కింద బతికిన వేలాది మంది రైతులు పొలాలు వదిలిపెట్టి కూలీలై దేశ దిమ్మర్లుగా తిరుగబట్టిన్రు. ఈ నాయకునికి ఆ విషయం ఎన్నటికీ పట్టదు. పట్టించుకున్న పాపాన పోడు.

కృష్ణానది మహబూబ్ నగర్ నడిబొడ్డు నుండి 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తున్గాబద్రానది 80 కిలోమీటర్లు ఈ జిల్లా నించి ప్రయాణిస్తుంది. అయినా కూడా అన్నపూర్ణగా ఉండవలసిన జిల్లా కరువు కాటకాలతోటి కునారిల్లు తున్నదంటే ఎంతటి అన్యాయం జరుగుతున్నదో ఊహించొచ్చు. పాతిక పైబడి ఏళ్ళు గడిచినా శ్రీశైలం కాలువ పూర్తి కాదు. ట్రిబ్యునళ్ళు నికరజలాలు ఇచ్చినా కొత్త ప్రాజెక్టులు రావు. ఉన్న రాజోలిబండ దౌర్జన్యంగా గండికోడితే అడిగే దిక్కుండదు. 

ఇంతటి అన్యాయాలు జిల్లాకు జరుగుతుంటే ముప్పై ఐదేల్లనుండి నాయకత్వం వెలగబెడుతున్న ఈ మనిషి సీమాంధ్ర నాయకులకు వంతపాడుడు తప్ప చేసిందేమీ లేదు. జాతీయవాదమంటే తను పుట్టి పెరిగిన, తనను గెలిపించి పార్లమెంటుకు పంపి, తన అభివృద్ధికి దోహద పడిన ప్రాంతాన్ని పట్టించు కోక పోవడమా? అది ఆయనకే తెలువాలె.

ప్రజలమీద పది దోపిడీ చేసే దొరల వారసత్వం పుణికి పుచ్చుకున్నఇలాంటి నాయకులు ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ ఉండదని ఇప్పుడు ప్రజలు బాగానే గ్రహించిన్రు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాగానే బుద్ధి చెప్పుతరు. అటో ఇటో చేసి 2014 వరకు జరుపుదే ఇప్పుడు మీరు వీళ్ళు గలిగేది. ఆ తర్వాత తెలంగాణా ఇట్లాంటి ద్రోహులందరి అడ్రసులు లెక్కతోటి గాయబై పోతై. 

Saturday, June 11, 2011

జైపాల్ రెడ్డీ, నువ్వు జాతీయవాదివి కావు, అవకాశవాదివి

ఎంత గొప్ప వాక్యం సెలవిచ్చినవ్ జైపాల్ రెడ్డీ! మీరు గొప్ప జాతీయ వాదులని తెలువక ఇన్ని రోజులు మీకు ఈ ప్రాంతం మీద, ఇక్కడి ప్రజలు పడే బాధల మీద ఎంతో కొంత ఆరాట పడుతున్రని అనుకున్నం. మూగనోము పట్టిన నీ నోరు కనీసం సమయం వచ్చినప్పుడైన మాటలు మాట్లాడుతదని, నీ ప్రాంతం, నీ జిల్లా ప్రజల బాధలు ఎలుగెత్తి చాటుతదని ఆశగ ఎదురు చూసినం.

కాని తప్పు మాదేలే! ముప్పై ఐదేళ్ళ నీ సుదీర్ఘ రాజకీయ జీవితంల ఎన్నడూ నీ స్వార్థం నువ్వు చూసుకునుడు తప్ప నీ ప్రాంతం ప్రజలకు కానీ, నీ జిల్లా ప్రజలకు గానీ నువ్వు ఒరగబెట్టిందేముందని? ఎందుకు నీమీద ఆశలు పెట్టుకోవాలె? ఆశలు పెట్టుకునుడు మేం జేసిన తప్పని చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టు చెప్పినవ్! మొత్తానికి మా కండ్లు తెరిపించినవ్.

నీ ప్రాంతం నడిబొడ్డునుంచి రెండు జీవనదుల జీవనదులు పారుతున్నాకూడ, నీ ప్రజలు నీటికి అల్లల్లాడుతుంటే, అది నీ కండ్లకు ఎప్పుడూ కనబడలే. ఎప్పుడూ నీకు పదవులే కనపడ్డాయి, ప్రజలు కాదు. స్వార్థం కోసం నువ్వు జాతీయవాదం పలుకుతుంటే నీ ప్రజలు తిండిలేక అంతర్జాతీయవాదం పలుకుతున్రు. అవును, భూములు వదిలేసి ఉప్పర పని చెయ్యనీకి దుబాయ్, ఆఫ్గనిస్తాన్, సింగపూర్ లాంటి దేశాలకు వలస బోతున్రు. పోలేనోల్లు దేశంల ఉన్న అన్ని నగరాలకు పొయ్యి తట్టలెత్తుకుంటనో, బాసండ్లు తోముకున్తనో బతుకుతున్రు. అవునులే, నీ అసుంటి లీడర్లను ఎన్నుకున్నంక ఎవరు మాత్రం ఏంజేస్తరు? 

ప్రాంతాన్ని పణంగా పెట్టి సిగ్గులేకుంట పదవి కోసం పరదేశి మహిళ కాళ్ళ పంచన చేరే నువ్వు నీ ప్రాంతం ప్రజలు కూడ నీలాంటి బానిస బతుకు బతకాలె అని కోరుకుంటే మాత్రం ఆశ్చర్య మేముంది? కాని నువ్వు తెలుసుకోవలసిన నిజం ఒకటుంది. నీలాగ బానిస బతుకీడ్చేటందుకు మాత్రం ఇక్కడి ప్రజలు సిద్ధంగ లేరు. తెలంగాణా ఏర్పాటును బలపరుస్తూ ఓట్లడిగిన నువ్వు నిజంగా మనిషివైతే రాజీనామా చేసి, జాతీయవాదిని అని చెప్పుకుంట ఎన్నికల్ల నిలబడి చూడు. అప్పుడు తెలుస్తది నీ జాతీయవాదం పస ఏందో!

ప్రాంతం పక్కన నిలబడే సమయం వచ్చినప్పుడు జాతీయవాదినని చెప్పుకున్న నువ్వు, రేపు జాతి తరఫున నిలబడే సమయం వచ్చినప్పుడు అంతర్జాతీయవాదినని చెప్పుకున్నా చెప్పుకోగల సమర్దునివి. తన పుట్టినూరు మీద అభిమానం లేనోడు ప్రాంతీయాభిమానం ప్రకటించలేడు. ప్రాంతీయాభిమానం లేనోడు జాతియాభిమానం కూడా ప్రకటించ లేడు.  అందుకే జెప్తున్న విను, నువ్వు జాతీయవాదివి కాదు, పచ్చి అవకాశవాదివి.
  

ఇండియా ఓడి పాకిస్తాన్ గెలిస్తే పండగ చేసుకుంటే?

ఈ మధ్య తగ్గిన యనుకోండి, అయినా అప్పుడప్పుడూ ఏ టౌర్నమెంటులనో ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచులు జరుగుతుంటయి. ఒకోసారి ఇండియా కూడా ఓడిపోవచ్చు. అప్పుడు భారత పౌరుడు ఎవరైనా పండగ చేసుకుంటే ఎట్ల ఉంటది? మరికొంతమంది భారత్, పాక్ మధ్యన యుద్ధం వస్తె, పాక్ గెలవాలని కొరుకునే వాళ్ళు గూడ ఉంటరు. 

ఇటువంటి వాళ్ళు పుట్టి పెరుగుతరు తప్ప పుట్టిన గడ్డమీద ప్రేమ కాని అభిమానం కాని ఉండవు. తమచుట్టూ ఉన్న ప్రజలమీద అసలే అభిమానం ఉండదు. పైగా వాళ్ళు నాశనం కావాలని, ఇంకెక్కడనో ఉన్నోళ్ళు బాగుపడాలని కోరుతరు.

ఇదే విషయాన్ని ప్రాంతాలకు అన్వయించి చూసినప్పుడు, ఒక ప్రాంతానికి వలస వచ్చి, ఆ ప్రాంతంల ఇమడలేక, ఆ ప్రాంతప్రజలను అనుక్షణం ద్వేషించుకుంట, తాము వలస రాకముందు ఉన్న ప్రాంతాన్నే ప్రేమించుకుంట గడుపుతరు కొంతమంది. సరే వాళ్ళిష్టమొచ్చినట్టు గడపనీయండి. కని అలాంటి వాళ్ళు మేమే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నమని చెప్పితె ఎట్ల ఉంటది?

సరిగ్గ కొంతమంది వలసాంధ్ర హైదరాబాదీల ప్రవర్తన ఇట్లనే ఉంటది. మాట్లాడితే మేం ఇక్కడనే పుట్టిన మంటరు. ఇక్కడి వాళ్ళమంటరు. కాని ఇక్కడి ప్రజల వెతలు మాత్రం పట్టవు. వీరి ఉద్దేశం ఒకటే. ఆంధ్రా పెత్తందార్లకు కొమ్ము కాసుడు. వలసవాదుల దోపిడీకి వీలయినంత సహాయం జేసుడు.  

వీళ్ళు కృష్ణా పక్కనే ఉండి మహబూబ్‌నగర్ ఎందుకు కరువుతోటి తల్లడిల్లుతుందో ఆలోచించరు. నల్లగొండ జనం ఫ్లోరొసిస్ బారిన పడి ఎట్ల జీవఛ్ఛవాల మాదిరి గడుపుతున్నరో వీళ్ళకు అవసరం లేదు. హైదరాబాదీలం అని చెప్పుకునే వీళ్ళకు కనీసం ఫ్రీజోను వలన హైదరాబాదీలకు పోతున్న అవకాశాల గురించి కూడా పట్టదు. 

ప్రత్యేక రాష్ట్రం విషయం వచ్చేసరికి మాత్రం ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రం కావాలె అంటరు. లేక పోతే కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలె అంటరు. అదీ కాకపోతె ఉమ్మడి రాజధాని చెయ్యాలె నంట! ఇన్ని రకాలుగ మాట్లాడే ప్రబుద్ధులు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నరో ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు.

కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఆ ప్రాంతంల ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చుడే అని వీళ్ళకు తెలువదా? తెలుసు. మేం ఈ ప్రాంతం మనుషులం అని భావించే వాళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యం మంటగలిసి, కేంద్రం పెత్తనం చేలాయిమ్చాలే అనుకోరు. కాని ఇక్కడ ఉండుకుంట వేరొకరి ఏజెంట్ల లెక్క పనిజేసేటోల్లు సరిగ్గ ఇట్లనే ఆలోచిస్తరు.

వీళ్ళు తెలుసుకోవలసింది ఒకటుంది. హైదరాబాదు తెలంగాణాల అంతర్భాగం. వీళ్ళు, వీళ్ళని ఆడించే పాములోళ్ళు ఎంత ప్రయత్నించినా తెలంగాణా ప్రజలని విడదియ్య లేరు. కాబట్టి తెలంగాణా వ్యతిరేక వలసాంధ్రులకు చేసే విఙ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడివారని భావిస్తె, ఇక్కడివారిలాగ ఉండండి. When in Rome, act like a Roman.  

Friday, June 10, 2011

ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడకి పంపిస్తున్నరా? ఆలోచించండి

తెలంగాణా వాదులారా, మీ పిల్లవాడిని ఇంటర్ మీడియట్ కొరకు విజయవాడ గాని మరో సీమాంధ్ర ప్రదేశానికి గాని పంపిస్తున్నరా? అయితే మీరు మరోసారి ఆలోచించండి. 

నా మిత్రుడి కొడుకు పదోతరగతిలో హైదరాబాద్ లోని ఒక కార్పోరేట్ పాఠశాలలో మొదటి ర్యాంకుతో ఉత్తీర్నుడైండు. విజయవాడలోని ఒక ప్రముఖ ఇంటర్మీడియట్ కళాశాల వాళ్ళు వీడి పర్సెంటేజీ చూసి సీట్ ఆఫర్ చేసిన్రు. ఆ కాలేజీకి మంచి పేరుండడంతో మనవాడు వాళ్ళబ్బాయిని అక్కడే చేరిపించిండు. తీరా మొన్న రిజల్ట్సు వచ్చే సరికి వాడు IIT AIEEE వగైరా అన్ని పరీక్షల్లో సఫలీకృతం కాలేక పోయిండు. ఏదో ఒకలాగా EAMCET లో మాత్రం ర్యాంకు తెచ్చుకున్నడు. ఆ అబ్బాయి తెలివితేటలకి IIT వస్తదని అనుకున్నాం అంతా. కాని జరిగింది మరొకటి.

ఆరా తీస్తే తెలిసింది, వాడు పడ్డ మానసిక క్షోభ. ఇంకా చదువేం చదువుతాడు? ఆంధ్రాకు  చెందిన విద్యార్థులు వీడిని ప్రత్యేకంగా చూసేవారట! గుంపులుగా చేరి మాట్లాడుతూ కేసీయార్ ని, కోదండరాం ని బండబూతులు తిట్టే వారట. తెలంగాణా వాదం బలంగా మాట్లాడే ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి ఇది భరించ గలిగే వాడు కాదు. అలా అని స్థానబలం, సంఖ్యాబలం ఉన్నవారితో గొడవ పడ్డానికి కూడా సాహసించే వాడు కాదు. దాంతో మనసులోనే బాధ పడే వాడు. ఈ మానసిక వ్యధతోటి చదువులో కూడా ఏకాగ్రత చూపలేక పోయాడు.

దీనికి తోడు ఫ్యాకల్టీలు పెట్టే రంపపుకోత మరోటి. లెక్చర్లు చెప్పుతూ మధ్య మధ్యలో తెలంగాణా ప్రజల మీద, నాయకుల మీద అసభ్యకరంగా జోకులు వెసేవారట! వీరి కుళ్ళు జోకులు విని నవ్వుతూ అందరూ మనోడికేసి తిరిగి అదోలా చూసే వారట. వింటూ  ఉంటేనే నాకు తేళ్ళూ జేర్రులూ పాకినట్టనిపించింది. ఇక వాడికి ఎలా ఉండేదో ఊహించడానికి కూడా మనసొప్పలేదు. 

ఇది ఎవరూ కావాలని చేయిస్తున్నది కాక పోవచ్చు. కాకతాలీయంగానే కొందరు విద్యార్థులో, లెక్చరర్లో ఆ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ మనపిల్లలకు జరిగే హాని జరక్క మానదు కదా!   

కాబట్టి తెలంగాణా బిడ్డల తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను ఆ ప్రాంతానికి పంపే ముందు మరోసారి ఆలోచించండి. మీ వాడు వీటన్నిటికీ తట్టుకుంటాడని అనుకుంటే మాత్రమే పంపండి. లేకపోతే మాత్రం మీ వాడి చదువు సంగతి అటుంచి, మానసిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

హైదరాబాదును అభివృద్ధి చేసిన్రా, దోచుకున్రా?

మాట మాట్లాడితే హైదరాబాదుని మేమే అభివృద్ధి జేసినం అంటరు సమైక్యాంధ్ర వాదులు. ఇప్పటిదాకా డెవలప్ జేసినం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా మీకే ఇచ్చేసి పోవాల్నంటే ఎట్లా పోతం అనేది వీళ్ళ వాదనలల్ల ఒకటి. ఇంతకీ విల్లు హైదరాబాదుని ఏమన్న అభివృద్ధి చేసిండ్రా అంటే వాస్తవాలు మాత్రం దానికి విరుద్ధంగ ఉన్నయి.

గడిచిన ఆరు సంవత్సరాల నుండి లెక్క జూస్తే హైదరాబాదు భూమి 635 ఎకరాలు తెగనమ్మిన్రు. ఇది అమ్మి సంపాదించిన మొత్తం 4090 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ భూములు అమ్మే హక్కు ఉండదు. కేవలం అసిన్ మాత్రమే చేయ గలుగుతది. కాని మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మే హక్కు ఎక్కడినుంచి  వచ్చింది?

హైదరాబాదు నిజాం కింద ఉన్నప్పుడు లక్ష ఎకరాలు ఎందుకైనా మంచిదని హైదరాబాదు చుట్టుపక్కల లక్ష ఎకరాల భూమి తన పేర రిజిస్టరు చేసుకున్నడు. ఆ భూములన్నీ హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డంక హైదరాబాదు రాష్ట్రానికి దఖలు పడ్డయి. ఆ భూములు తర్వాత సమైక్య రాష్ట్రం పెత్తనం కిందికి వచ్చినై. దేశంల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేని విధంగ తెలంగాణాలో ప్రభుత్వానికి విలువైన భూములు రిజిస్టరై ఉన్నయి.

గడిచిన ఆరేల్లల్ల అమ్మిన ప్రభుత్వం అమ్మిన భూముల వివరాలకు క్రింది పట్టిక చూడున్రి.
PlaceYearAcresAmount (in Cr)
Yapral20061.143.24
Uppal20061.272.34
Rajendra Nagar20060.361.8
Tellapur2006224925
Kokapet200667703
Nadargul20061.2364
Neknampur20061.054.1
Sheikpet20065.77334
Kokapet200725300.25
Kokapet200775751.5
Jawahar Nagar200750250
Lakshmiguda200811.318.5
Budwel2009165663
Khanamet2010550
Khanamet2010220
Khanamet201088 (sq yrd)10

సమైక్యాంధ్ర పేరు జెప్పి తెలంగాణాను ఆక్రమించుకున్న సీమాంధ్ర పాలకులు వచ్చినప్పటినుండి మొదలు  వాళ్ళ కన్లు  హైదరాబాదులోని విలువైన భూముల మీదనే ఉన్నయి. సమైక్య రాష్ట్రం ఏర్పద్దప్పటి నుంచి వీళ్ళు పాలకులుగా మారి హైదరాబాదులోని విలువైన భూములు వాళ్ళ తొత్తులకు హడ్డీకి పావుసేరు లెక్కన రిజిస్టరు చేసుడు, వాళ్ళ తైనాతీలు కబ్జా చేస్తుంటే కండ్లు మూసుకొని ఊకునుడు మాత్రమే చేసిన్రు. ఇంకా మిగిలిన భూములు ఉంటె వాటిని తెగనమ్మి ఆ నిధులు అంధ్రాల కర్చు పెట్టిన్రు. గత ఆరు సంవత్సరాల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాల, ఇడుపులపాయల వేల కోట్లు అదనంగా కర్చు పెట్టింది. అవన్నీ హైదరాబాదు భూములు తెగనమ్మితే వచ్చిన పైసలే.

ఒకవైపునుండి హైదరాబాదు నిధులను లెక్క లేకుండా సీమాంధ్రకు తరలించుకుంట ఇంకొక వైపు హైదరాబాదు అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిన్రు. హైదరాబాదుల నాలుగు ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీల నాలుగు రోడ్లు వేసుడు తప్ప వీళ్ళు హైదరాబాదుకు చేసిందేమీ లేదు. హైదరాబాదు సంపాదన హైదరాబాదు మునిసిపాలిటీకే వదిలితే ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెంది ఉండేదంటే అతిశయోక్తి కాదు.

నిజాం కట్టించిన డ్రైనేజీ వ్యవస్థ ఆ తర్వాత కొంచం కూడా అభివృద్ధి చెందలేదు. ఉన్న నాళాలు కబ్జా జేసుడు తప్ప. రోడ్లు చూస్తె అడుగడుగునా గుంటలు, ప్రత్యక్ష నరకం చూపించే ట్రాఫిక్ వ్యవస్థ, పొంగిపొర్లే మాన్ హోల్లు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఏమాత్రం అభివృద్ధి కాలేదు. 

సరైన ప్రణాళిక లేక, మూసీ నదిని, హుస్సేన్ సాగర్ ని మురికి కూపాలుగా మార్చిన్రు. పటాన్ చెరువుల మందుల ఫాక్టరీలు పెట్టి హైదరాబాదు భూగర్భ జలాలను విషంగా మార్చిన్రు. హైదరాబాదు సిరిసంపదలను దోచుకొనే యావ తప్ప, హైదరాబాదును తమ సొంతనగరంగా భావించని వాళ్ళు చేసే పనులు ఇట్లనే ఉంటయి.

సీమాన్ద్రులారా, మీరు హైదరాబాదు నగరాన్ని పెద్దచేసిందేమీ లేదు. ఇది మీతో కలవక ముందు దేశంల ఐదో పెద్ద నగరంగా వుంది. ఇన్నేళ్ళ మీ పాలన తర్వాత ఆ స్థానాన్ని బెంగుళూరుకు సమర్పించుకొనే దశ ప్రాప్తించింది. కాకపొతే ఇక్కడికొచ్చి మీరు మాత్రం బాగనే అభివృద్ధి చెందిన్రు. ఇక్కడి ప్రభుత్వ భూములను రూపాయికి ఎకరం చొప్పున కొనుక్కొని ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు వారసులైన్రు. కాబట్టి మీరు హైదరాబాదు అభివృద్ధి  రాగాన్ని మానెయ్యండి. ఇప్పటిదాంక హైదరాబాదు మీద మీరు పొందిన లబ్దికి సంతోషించండి. ఇంకా అత్యాశకు పొతే మాత్రం పాత చరిత్రంతా బయటకు గుంజవలసి వస్తది.