Thursday, October 20, 2011

కొత్త ఎత్తుగడలు అవసరం


ఇప్పుడు రాష్ట్రంలో వున్న ప్రభుత్వానికి తెలంగాణా నుండి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. మూకుమ్మడిగా తెలంగాణా ఎమ్మెల్యేలంతా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయడమే దానికి నిదర్శనం. అంతే కాక దాదాపు పాతిక మంది జగన్ వర్గీయులు కూడా రాజీనామాలు చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది?

ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ గరవర్నరుకు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు పంపవచ్చు. మెజారిటీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి మెజారిటీ నిరూపించుకోవడానికి అసెంబ్లీని సమావేశ పరచవలసిందిగా కోరవచ్చు. కాని తెలుగుదేశం పార్టీ అలా చేయలేదు.

సీమాంధ్ర పెట్టుబడుల బలంతో చంద్రభాబు దర్శకత్వంలోని ఆంధ్రా సిండికేట్ మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదన్న విషయం బహిరంగమైన రహస్యం. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలంగాణా వాదం పట్ల కాని, తెలంగాణా ప్రజల పట్ల కాని ఎలాంటి సానుభూతి లేదన్న విషయం ఇప్పటికే నిరూపించబడ్డది. 

నెల రోజులు సకల జనుల సమ్మె జరిగి తెలంగాణా మొత్తం అట్టుడికిపోతే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ, కేంద్రానికి all is well అని నివేదికలు పంపడమే అందుకు నిదర్శనం. కేంద్రం ముఖ్యమంత్రిని, బొత్సాని డిల్లీకి పిలిపించి మొట్టికాయలు వేస్తే తప్ప ప్రభుత్వంలో ఎంతో కొంత చలనం రాలేదు. దీన్ని బట్టి తెలుస్తున్నదేమంటే సమైక్యవాదులచేత ప్రాయోజితమౌతున్న ఈ ప్రభుత్వం తెలంగాణా ఉద్యమాల పైన పూర్తి నిర్లిప్తతతో వుంది. అంతే కాక, ఈ సమ్మె వేడి కేంద్రానికి వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా అక్కడ తెలంగాణాకు ఎలాంటి అనుకూల నిర్ణయం రాకుండా వుండడానికి అది శాయశక్తులా కృషి చేస్తుంది.

ఉద్యమాలు చేయడం వల్ల తెలంగాణా ప్రజలు మాత్రం రకరకాల నష్టాలు అనుభవించవలసి వస్తుంది. అదే సమయంలో సీమాంధ్రలో అంతా సజావుగానే వుండడం వల్ల వారికి పరిస్థితిలో మార్పు రావలసిన అవసరం కనిపించడం లేదు. సమస్యకు పరిష్కారం రావలసిన అవసరం అంతకన్నా అనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో ఉద్యమకారుల వ్యూహాలు ఎలా ఉండాలన్న విషయం పునస్సమీక్షించు కోవలసిన అవసరముంది. గతంలో సకలజనులసమ్మె ప్రారభమైన మొదటి రోజుల్లోనే ఈ విషయం గురించి ఉద్యమం రూపం మార్చవలసిన సమయం వచ్చింది అన్న టపాలో ఇదివరకే చర్చించడం జరిగింది.

సమైక్యవాదుల, వారు నడిపే ప్రభుత్వాలు ఉద్యమం పైన నిర్లిప్తత వహిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయక పోవడానికి ముఖ్యకారణాలు ఇవి:


  1. ఇప్పుడు సమైక్య రాష్ట్రమే వుంది కాబట్టి తెలంగాణా ఉద్యమాలు ఎన్ని జరిగినా వారికి వచ్చే నష్టం లేదు. ఈ రాష్ట్రం ఇలాగే ఉన్నంత కాలం, వారి దోపిడీకి ఆటంకం కలగనంత కాలం వారికి ఎలాంటి బాధ లేదు. 
  2. ఈ ఉద్యమాల కారణంగా కేంద్రం ఏదైనా చర్యలు తీసుకుంటుందని అనుకుంటే తప్ప ఇలాంటి ఉద్యమాల వల్ల వారికి నష్టం లేదు.  అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగూ సూట్కేసులు రంగంలోకి దిగుతాయి కాబట్టి ఫరవాలేదు.
  3. వారి అక్రమ ఆస్థులకు గాని, అక్రమ వ్యాపారాలకు గాని ఎలాంటి ఆటంకాలు జరగడం లేదు.

అలాంటప్పుడు సమస్యకు పరిష్కారం ఎందుకు? ఒకవేళ పరిష్కారం తెలంగాణాకు అనుకూలంగా వస్తే వారికి నష్టమేగాని లాభం వుండదు. అందుకని ఎలాంటి పరిస్థితి రాకుండా యధాతథ పరిస్థితి కొనసాగడమే వారికి ఎక్కువ ఇష్టం. 

ఇలాంటి పరిస్థితిలో ఉద్యమగతిని నిర్ణయించే వ్యూహంలో భాగంగా ఈ క్రింది అంశాలను దృష్టిలో వుంచుకోవాలి.

  1. ఉద్యమ క్రమంలో తెలంగాణా ప్రజలకు నష్టం తక్కువగా వుండాలి. 
  2. అదే సమయంలో ఉద్యమం కొనసాగినంత కాలం తమకు నష్టాలే తప్ప లాభాలు వుండవన్న భావన సమైక్యవాద పెట్టుబడిదారులకు కలిగించాలి.
  3. అక్రమ ఆస్థులను కూడబెట్టిన బడాబాబులు, ఇక ఏమాత్రం వాటిని రక్షించుకోలేమని గ్రహించాలి. అక్రమ ఆస్తులు ఎప్పుడైనా అక్రమమే, తెలంగాణా వచ్చినా, రాకపోయినా. వీరిని వదిలి వేయడం వల్ల సమైక్యవాదుల వద్ద మంచిపేరు సంపాయించు కోవడమనేది ఎండమావిలో నీళ్ళు ఆశించడమే. నిజానికి ఇలాంటి అక్రమార్కుల భరతం పడితే సగటు సీమాంధ్ర పౌరులు కూడా సంతోషిస్తారు.
  4. నిరసన కార్యక్రమాల సంఖ్య తగ్గించుకోవాలి. ఏ కార్యక్రమం జరిగినా కూడా జనసమీకరణ ఎక్కువగావుండి విజయవంతం కావడానికి పక్కా వ్యూహాలు రచించుకోవాలి. రోజువారీ నిరవధికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలు విసిగి పోయి ఉదాసీనత, తద్వారా నిరాశ పెరిగే అవకాశం వుంటుంది. మధ్య మధ్య స్వల్ప విరామాలు అనివార్యం.
  5. నిరసన కార్యక్రమాలు గాల్లో బాణాలు వదిలినట్టుగా వుండకూడదు, అవి తెలంగాణా వ్యతిరేక శక్తులపై కేంద్రీకరించ బడి వుండాలి. అప్పుడుగాని వారిలో చలనం రాదు. వారిలో చలనం తెప్పించ గలిగితే సమస్య పరిష్కరించమని వారే కేంద్రాన్ని కోరుతారు.
  6. ఏ కార్యక్రమం జరిపినా అహింసా మార్గంలోనే జరపాలి. కాని ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వహించి పెద్ద ఎత్తున బలగాలను మొహరించి నిరసన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసు బలగాల సంఖ్యకు వందల రెట్లు ఎక్కువగా జనాన్ని సమీకరించుకోవాలి. లేకపోతే అవి విజయవంతం కావు.
ప్రజాస్వామ్యయుత ఉద్యమాలను దోపిడీ శక్తులకు దాసోహం పలికే ఈ ప్రభుత్వాలు పట్టించుకోని ప్రస్థుత పరిస్థితిలో తదుపరి దశ ఉద్యమంలో పైన చెప్పిన వ్యూహంలో ఎత్తుగడలు వేస్తే తప్ప ఫలితాలు సాధించడం కష్టం. 

4 comments:

  1. అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలలు కంటే వ్యవధి ఉండకూడదనే నిబంధన ఉంది. ఇది డిసెంబర్ 15 వరకు ముగిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం రాజీనామా చేసి అసెంబ్లీ రద్దు చేయడం తప్పదు. ప్రభుత్వం పడిపోతే మంత్రి పదువులు, MLA హోదాలు గాలిలో కలిసిపోతాయి. ఆ తరువాత (ఆరు నెలల లోపల) జరిగే ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా నూకలు చెల్లిపోవడం ఖాయం.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ఆర్నెళ్ళ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినా తెలుగుదేశం తప్ప ఇతర పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టలేవు. ఎందుకంటే వాటి సీట్ల సంఖ్య పది శాతం కన్నా తక్కువగా వుంది. ఇక తెలుగుదేశం సరేసరి. ఎన్నికలు ఎంత లేటుగా వస్తే దానికి అంత మంచిది. అందుకని కాంగ్రెస్, TDPలు ఏవో నాటకాలు ఆడతాయి తప్ప, అవిశ్వాసం మాత్రం రాకుండా చూసుకుంటాయి.

    ReplyDelete
  4. ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకునే కాంగ్రెస్ & తెలుగు దేశం నాయకులు సమైక్యవాదం విషయంలోనే ఏకమయ్యారు. హైదరాబాద్‌లో వాళ్ళ ఆస్తుల విలువ కోట్లు ఉండగా కేవలం పార్టీ ప్రయోజనాలని ఏమి చూడగలరు?

    ReplyDelete