Thursday, October 27, 2011

తెలంగాణాకి అడ్డుపడుతున్నదెవరు?


తెలంగాణా సమస్యపై ఇంత జాప్యం ఎందుకు? సమస్య ఎందుకు ఇంత చిక్కుముడిగా మారింది?

ఈ సమస్య పరిష్కారానికి రెండే మార్గాలు. ఒకటి తెలంగాణా ఇచ్చెయ్యడం. రెండోది ఇవ్వక పోవడం.

ప్రజల్లోకి తీవ్రంగా చొచ్చుకు పోయిన ఉద్యమాన్ని తెలంగాణా ఇవ్వకుండా చల్లార్చడానికి ఇవి 1969 నాటి చీకటి రోజులు కావు. సమాచార విప్లవంతో ప్రతివిషయం మారుమూలలక్కూడా నిముషాల మీద పాకుతున్న రోజులు. ఈ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి వారి న్యాయమైన కోర్కెలను నిరాకరించే దమ్ము నాయకులకు లేదు. అలా నిరాకరిస్తే రేపు ప్రజాకోర్టులో దోషులుగా నిలబడక తప్పదు.

ప్రజలు కూడా ఇంతకాలం సహనంతో రాజకీయులు చెప్పిన మాటనల్లా విన్నారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా అన్నిటినీ సహించారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా అన్నిటినీ ఓపికతో విన్నారు. ఎన్ని కమిటీలు వేసినా అన్నిటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణా ప్రజల కోర్కెను నిరాకరించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అన్నదే సమస్య. అలాంటి దమ్మే గనక వుంటే అది ఎప్పుడో నిరాకరించేది. కాని అలా జరగలేదు. కేవలం తాత్సారం మాత్రమే జరుగుతుంది. ఈ తాత్సారం కూడా ఎన్నాళ్ళో జరపడానికి వీలు కాదు. 2014 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరి! అప్పటిదాకా ఇలాగే తాత్సారం చేస్తే ప్రజలు అందుకు కారణమైన వారికి తప్పకుండా బుద్ధి చెపుతారు. 

ఇక మిగిలింది తెలంగాణా 2014 లోపే ఇవ్వడం.

దీనికి అడ్డుపడుతున్నదెవరు? 

సమైక్యాంధ్రవల్ల లాభ పడుతున్న కాంట్రాక్టర్లు, భూస్వాములు అని తెలంగాణా వాదుల ఆరోపణ.  కాదు సీమాంధ్ర ప్రజలంతా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు అని అవతలి వారి వాదన. ఇందులో నిజమేదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. 

ఒకవేళ హైదరాబాదు గనుక సీమాంధ్ర ప్రాంతంలో వుండి వుంటే అసలు వారికి అడ్డు చెప్పవలసిన అవసరమే ఉండేది కాదు. ఈ విషయం వారే పలుమార్లు ఒప్పుకున్నారు కూడా.

వారి ఖర్మానికి హైదరాబాదు కనీసం తెలంగాణా, ఆంధ్రా సరిహద్దుల్లో కూడా లేదు, చెరిసగం పంచుకోవడమో, పూర్తిగా మాదే అని అనడమో చేయడానికి. అది ఎటునుండి చూసినా సీమాంధ్ర ప్రాంతానికి రెండొందల కిలోమీటర్ల పైనే ఉంది. వారు తెలంగాణా గనక ఇస్తే హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అదే అసలు కారణం. మరి హైదరాబాదు కేంద్రపాలితం కావడానికి హైదరాబాదు ప్రజలు ఒప్పుకోరు. కారణం కేంద్రపాలిత ప్రాంతం అంటే మరో తరహా వలస పాలనే కనుక. ఇక తెలంగాణా వారు సరే సరి.

ఇక సమైక్యతా నినాదాన్ని పక్కకు పెట్టి హైదరాబాదు గురించి మాట్లాడినప్పుడే ఇలాంటివారి రంగు బయట పడింది. కోరుకునేది వారు చెప్పుతున్నట్టు సమైక్యాంధ్రో, లేక విశాలాంధ్రో కాదనీ, వీరి ఆలోచన మొత్తం హైదరాబాదు మీదనే ననీ.

సామాన్య ప్రజలకు హైదరాబాదుతో పనేం వుంటుంది? ప్రైవేటు ఉద్యోగాలో, వ్యాపారాలో ఐతే ఈ రాష్ట్రం ఏర్పడక ముందైనా వారికి ఎలాంటి అడ్డంకి లేదు. రేపు రాష్ట్రం విడిపోయినా కూడా అలాంటి అడ్డంకి వుండదు. ఇక్కడి ప్రాంతీయ ప్రభుత్వ ఉద్యోగాలపై వారికి ఎప్పుడూ హక్కు లేదు, కాబట్టి వాటిపై చర్చ అనవసరం. ఇవి కాక మిగిలిన విషయాలు ఏం వున్నా, అవి అంత ప్రధానమైనవి కావు. ఒకసారి రాష్ట్ర విభజనకంటూ అంగీకరిస్తే అవన్నీ చర్చించి పరిష్కరించుకోగల విషయాలే.

కాని అలా జరగడం లేదు. కారణం ఇవి కాక ఏవో విషయాలున్నాయి కాబట్టి. అవి అత్యంత బలీయమైనవి, వ్యతిరేకించేవారు బయటికి చెప్పలేనివీ.

అవి ఏమిటో తెలుసుకోవాలంటే గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించాలి. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అని వేర్వేరుగా లేవు. రెండూ కలగలిసి పోయాయి. రాజకీయనాయకుడే వ్యాపారి. కాదంటే ఆయన వ్యాపారం బినామీగా నడుస్తుంది. విధాన నిర్ణయాలు వ్యాపారులకు అనుకూలంగా వుండి తీరుతాయి. టెండర్లు, అంచనాలు వాటికి అనుగుణంగానే వుంటాయి. ప్రజా దానం విచ్చల విడిగా కొల్లగొట్ట బడుతుంది.

ఇక ఎంత పెద్ద రాష్ట్రం అయితే అంత ఎక్కువ ప్రజాధనం. అంత పెద్ద కాంట్రాక్టులు. డబ్బు ఎక్కువ, ప్రభావితం చేయవలసిన మనుషులు తక్కువ. వ్యాపారులకు, సారీ వ్యాపారాజకీయులకు ఇంతకన్నా ఏం కావాలి? అందుకే వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎంతమాత్రం ఇష్టం లేదు.

ఇలాంటి రాజకీయులు ఒక ప్రాంతం వారేనని చెప్పబోవడం లేదు. వారు రెండు ప్రాంతాల్లోనూ వున్నారు. కాకపోతే ఒకప్రాంతం వారే ఎక్కువ సంఖ్యలో, అదీ రాస్త్ర ప్రభుత్వాన్ని శాసించగల స్థాయిలో వున్నారు. ఎందుకంటే శాసన సభలో మెజారిటీ సభ్యులు వారే కాబట్టి. ఒక ప్రాంతం వారు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తుంటే, రెండో ప్రాంతం వారికి అంత సదుపాయం లేదు. ఎందుకంటే రేప్పొద్దున వారు అక్కడినుండే ఎన్నుకోబడాల్సిన వారు కాబట్టి. అందుకే వారు బయటికి మాత్రం తామే సిసలైన తెలంగాణా వాదులమని చెపుతూనే, రెండోవైపు తెలంగాణా ఉద్యమానికి పొడవాల్సినన్ని వెన్నుపోట్లు పొడుస్తూనే వున్నారు. ప్రజలు వీరి ఉష్ట్రపక్షి తెలివితేటల్ని గమనిచడం లేదని వీరి ఆలోచన. అయితే ఈ సమైక్యాంధ్రలో బడా కాంట్రాక్టర్లతో పోటీ పడలేని చిన్నకారు కాంట్రాక్టర్లు మాత్రం నిజాయితీగానే ప్రత్యేక రాష్ట్రం కోసం నిజాయితీగానే పోరాడుతున్నారు, అప్పుడైనా వారికి అవకాశాలు వస్తాయనే ఆశతో.

ఇప్పటి తెలంగాణా పోరాటం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించింది మాత్రమే. ఇది ఒక ప్రాంతంమీద మూకుమ్మడిగా ఇంకో ప్రాంతం చెలాయిస్తున్న పెత్తనానికి, వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం. పెట్టుబడిదారుల పైనో, అగ్రకులాధిపత్యానికి వ్యతిరేకంగానో చేసే పోరాటం కాదు. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రయోజనాలు ఇమిడివున్నాయి. కాబట్టి దీనిలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ ఉద్యమం కూడా అందరినీ కలుపుకొని పోతుంది. మిగతా అస్తిత్వవాద, దోపిడీ వ్యతిరేక పోరాటాలు దీనికి సమాంతరంగా కొనసాగుతూనే వుంటాయి. అవి ఇక్కడే కాదు మిగతా దేశమంతా కూడా కొనసాగుతూనే వుంటాయి. వాటి సాఫల్యతా వైఫల్యాలు కూడా దేనికవే విడివిడిగా వుంటాయి. వీటన్నిటినీ ఒకదానికొకటి ముడిపెట్టి చూడలేం.

తెలంగాణా వ్యతిరేకులు ఎవరు అనే విషయంలో తెలంగాణా ప్రజలు స్పష్టంగా వున్నారు. ఇక మిగతాది కాలమే నిర్ణయిస్తుంది.



9 comments:

  1. పాలు పంచుకుంటున్నారో, పైసల్, మందు పంచుకుంటున్నారో కాలమే నిర్ణయిస్తుంది.

    ReplyDelete
  2. అవి పంచుకోవడంలో మిమ్మల్ని మించిందెవరు? వెళ్ళి statistics చూడు,తెలుస్తుంది.

    ReplyDelete
  3. ha statics chusina emundi akkkada , telangana ki minchi andharlo anta goppdevelopment emi ledu mr so call intellectual

    ReplyDelete
  4. అన్నీ ఎందుకులే, మందు, వసూళ్ళు చూస్తే చాలు. ఏ జిల్లాల్లో ఎక్కువ మందు తాగుతారో. ఇక వసూళ్ళు చేసి తెగ బలిసిందెవరో తెలుసుకోవడానికి statistics అవసరమా?

    ReplyDelete
  5. mandulo highest karim nagar

    ReplyDelete
  6. http://hridayam.wordpress.com/2010/02/05/tadepalli-liquor-stories/

    ReplyDelete
  7. Srikanth,
    U done a good job,
    Good,
    Go ahead,

    Sridhar

    ReplyDelete
  8. Dear Srikanth

    I really wonder how u alone handle above kind of rouge comments

    I appreciate your work

    Ali

    ReplyDelete