Sunday, October 9, 2011

పేరు మార్చితే సమస్య పరిష్కార మౌతుందా?

వేరొక బ్లాగులో ఒక బ్లాగరు తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపే ఉద్దేశంతో, ప్రస్తుతం వున్న ఆంద్ర్హప్రదేశ్ కి తెలంగాణా అనే పేరు పెడితే సరిపోతుందని ప్రస్తావించారు.ఆ బ్లాగరే కాక మరికొంతమంది బ్లాగర్లు, కొందరు సీమాంధ్ర నాయకులు కూడా ఇదే రకమైన భావాన్ని వ్యక్త పరుస్తూ, 'అప్పుడే ఆంధ్రప్రదేశ్ కాక తెలుగునాడు అనో, తెలంగాణా అనో పేరు పెడితే సరిపోయేది' అనడం పలు సందర్భాలలో చూడడం జరిగింది. వాటికి నేనిచ్చే సమాధానం ఇది.

రాష్ట్రం పేరు మారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. గత యాభై సంవత్సరాలుగా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. దానికి రాష్ట్ర విభజన మాత్రమే పరిష్కారమని కూడా నమ్ముతున్నారు.

ఈమాటలు చెప్పేటప్పుడు ఆంధ్రా ప్రాంతం వారు అన్యాయాలు చేసేవారనో, లేక తెలంగాణా ప్రాంతం వారు అమాయకులనో నేను చెప్పడం లేదు. అమాయకులు, అన్యాయాలు చేసేవారు రెండు వైపులా వుంటారు. మనం స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై మహత్తరమైన పోరాటం చేశాం. అంత మాత్రాన సగటు బ్రిటీష్ పౌరుడు దుర్మార్గుడని కాదు. సగటు బ్రిటీషు పౌరుడు స్నేహశీలి, ప్రజాస్వామిక భావాలు కలిగిన వాడు అయినప్పటికీ మనకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం వల్ల అన్యాయం జరిగిందన్న విషయం వాస్తవం.

అలాగే సగటు ఆంధ్రుడు మంచివాడు, స్నేహశీలి అయినప్పటికీ తెలంగాణా వారికి అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకున్న వ్యవస్థ వంద శాతం ప్రజల అభీష్టాల మేరకు పనిచేసే వ్యవస్థ కాదు. మన వ్యవస్థకు అంతటి పరిణతి లేదు, ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పరిణతి సాధించడానికి కేవలం తెలంగాణా ప్రజలు పోరాటం చేస్తే సరిపోదు. యావత్తు భారతదేశం దీర్ఘకాలం కలిసికట్టుగా పోరాడవలసి వుంటుంది. కాని అంతవరకు తెలంగాణా ప్రజలు ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గం చేత నిర్మించబడ్డ వలసపాలనా చట్రంలో మగ్గవలసిన అవసరం లేదు.

రాష్ట్ర విభజనకు దారితీసిన విషయాల్లో మూల కారణం ఆంధ్రా తెలంగాణా ప్రజల శాతంలో గల తేడా. నలభై రెండు శాతం తెలంగాణా వారుంటే యాభై ఎనిమిది శాతం మంది ప్రజా ప్రతినిధులు ఆంధ్రా ప్రాంతం నించి వుంటారు. కాబట్టి ఒక ప్రాంతంగా తెలంగాణా ఈ వ్యవస్థలో ఎప్పటికీ పైచేయి సాధించ లేదు. నిర్ణయాత్మకంగా శక్తిగా ఎదగలేదు. ఒక వేల ఎవరైనా తెలంగాణా ప్రాంతం నించి ముఖ్యమంత్రిగా ఎంపికైనా (అది గత పాతికేళ్ళుగా అసలే జరుగలేదు) వారు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బలమైన లాబీ ఆదేశాల మేరకే పనిచేయాల్సి వుంటుంది.

అలాగని తెలంగాణా ఒక చిన్న ప్రాంతం కూడా కాదు. చిన్న ప్రాంతం అయితే విడిగా మనగలిగే శక్తి వుండదు కాబట్టి పెద్ద భూభాగంలో వున్న ప్రాంతీయుల నిర్ణయాలకు లోబడి, వారి ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూ వారి ఆధిక్యాన్ని అంగీకరించి అనుసరించేవారు.

తెలంగాణా నాలుగు కోట్ల జనాభా కలిగిన ఒక పెద్ద ప్రాంతం. రాష్త్రంగా ఏర్పడ్డా, ఇప్పుడు దేశంలో వున్న పద్ధెనిమిది రాష్ట్రాల కన్నా పెద్దదే అవుతుంది. ఇది జీవనదులు పారుతున్న, గనులు నిక్షిప్తమై వున్న ప్రాంతం. ఒక రాష్ట్రంగా మనగాలిగేందుకు కావలసిన అన్ని హంగులు కలిగిన ప్రాంతం. కాని వనరులు వున్నా అవకాశాలు కొల్లగొట్ట బడ్దాయి. దానికి మరలా సగటు ఆంధ్రా పౌరుడు కారణం అని అనడం లేదని గ్రహించాలి. అది వ్యవస్థలోనే వున్న లోపం.

ఈ లోపాన్ని సవరించడానికి వున్న తక్షణ మార్గం రాష్ట్ర విభజన. రాష్ట్రం విభజింప బడితే రాష్ట్రాలు స్వపరిపాలన చేసుకుంటాయి కాబట్టి ఏ ప్రాంతం వనరులపై ఆ ప్రాంతానికే ఆధిపత్యం వుంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించిన వనరులపై రెండో ప్రాంతానికి హక్కు వుండదు. అలాగే తమ ప్రాంతానికి చెందిన వనరులపై రాజ్యాంగం ప్రసాదించిన మేరకు పూర్తి హక్కు కలిగి వుంటుంది. కాబట్టి రెండు ప్రాంతాలకు సహజ సిద్ధమైన న్యాయం లభిస్తుంది.

పేరు మార్పిడి వలన ప్రాంతాల జనాభా దామాషాలో ఎలాంటి మార్పు వుండదు. కాబట్టి పేరు ఏదైనా పరిపాలించే వర్గం ఆంధ్రాప్రాంతం నించే ఐవుంటుంది. కాబట్టి తెలంగాణా ప్రజలకు దానివల్ల ఎలాంటి న్యాయం చేకూరదు.

నిజంగా తెలంగాణా ప్రజలకు రాజకీయంగా న్యాయం చేయాలనుకుంటే మనకున్న 42 పార్లమెంటు స్థానాలు, 294 అసెంబ్లీ స్థానాలు తెలంగాణాకు, ఆంధ్రాకు సమానంగా పంచమని చెప్పొచ్చు. అప్పుడు కనీసం రాజకీయంగా నైనా తెలంగాణా, ఆంధ్రాకి సమవుజ్జీగా మారుతుంది. పోటీ పడగలుగుతుంది. కానీ అలా చేయడం మన రాజ్యాంగం స్పూర్తి దృష్ట్యా కాని, రాజకీయంగా కాని సాధ్య పడే విషయం కాదు.

కాబట్టి ఈ అసహజమైన, అసమానమైన ప్రాంతాల మధ్య పోటీని నివారించడానికి విభజన మాత్రమే సరయిన పరిష్కారం.

4 comments:

  1. ఇదేమాట అనుకు౦టు బ్లాగులు చూసాను. మీ శీర్షిక చాలు సమాధానం

    హైదరాబాదు లో ఉన్న వారెవరైనా, మిగిలిన ఆ౦ధ్ర మరియు తెల౦గాణ ప్రజల అభిప్రాయాలు కలుపుకొని పోలేరు. పరిస్థితి అటువ౦టిది

    ReplyDelete
  2. intha manchigaa aalochisthee samasya eppudooo parishkaaram ayipoyedi.

    Meeru vraasina vaatillo idhi okkatee chaala arthavanthamainadi.

    ReplyDelete
  3. ఆంద్ర రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి తెలంగాణ అని, ఏదో ఒక నగరానికి హైదరాబాద్ అని 1953 లో పేరు పెట్టుకుని ఉంటె సరిపోయేది LOL!

    ReplyDelete
  4. ఇప్పతి వారకు నెను చూసిన తెలంగన అనుకూల బ్లగుల్లొ ఇది నాకు చలబవుంది ఎందుకనతె ఒక సమస్య మీద విస్లెషనత్మకం గా సాగిది.సీ మందులను సత్రువులు అన్నత్తుగ కాకుంద ఉన్న ప్రబ్లెం ఎంతొ చొర్రెచ్త్ గ చెప్పరు హత్స్ ఒఫ్ఫ్ తొ యౌ

    ReplyDelete