Tuesday, October 18, 2011

ఆంధ్ర రాష్ట్ర సాధన (పద్య కవిత)



ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును
కేరళుల్, తమిళులు దూరుచుండ,
ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల
అరవ దేశంబె ముందడుగు వేయ,
పండించి తిండికై పరులకు చేజాచి
ఎండుచు తెలుగులు మండుచుండ,
తమ పట్టణమునందె తాము పరాయిలై
దెస తోప కాంధ్రులు దేవురింప,

ఆంధ్ర రాష్ట్రము కావలె ననుట తప్పె?
తెలుగు పంట, తెలుగు సొమ్ము, తెలుగు కండ
తెలుగు వారికి గాని ఈ దీన దశను
ఎంత కాలము నలిగి పోయెదము మేము?

మన యింట పరుల పెత్తన మేమియని కాదె
సత్యాగ్రహంబులు సల్పినాము?
మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె
ఉపవాస దీక్షల నూనినాము?
మన కధికారముల్ పొనరలేదని కాదె
సహకార నిరసన సలిపినాము?
మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె
కారాగృహమ్ముల జేరినాము?

తలలు కలుపక రండని పలికినపుడు
బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి
పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!
మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!

మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!
ఆంధ్ర రాష్ట్ర మొకరి నడుగ నేల?
దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,
చీది, ఒక్కడేదొ చేయి విదుప!

ఢంకాపై గొట్టి నిరా
తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్
అంకించుకొందు మంతే!
ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?


ఇది 1952 లో ఆంద్ర రాష్ట్ర పోరాటంలో భాగంగా శ్రీనివాస సోదర కవులు వ్రాసిన పద్యభాగం. పై ఖండికలో ఆంధ్ర అన్న పదం వద్ద తెలంగాణా అనే పదం పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు తమ హక్కులను సాధించుకోవడంలో భాగంగా రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆంధ్రులు, ఇప్పుడు అవే హక్కులను సాధించుకోవడం కోసం తమ సోదర తెలంగాణీయులు చేసే ఆందోళనలను నిరసించ బూనడం అత్యంత విచారకరం.

Credits: Poetry content is taken from Dr.Sri Acharya Phaneendra's Blog.

5 comments:

  1. సోదరా, అంతా బానే వుంది. ఇంతవరకూ వచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గటమెందుకు. బడులు తెరుస్తున్నారు. బస్సులు తిరుగుతున్నాయి. రాజధాని లో బందే లేదు. అసలు తెరాస వారికి తెలంగాణ ఇప్పుడే తెచ్చే వుద్దేశ్యం లేదేమోననిపిస్తోంది.

    ReplyDelete
  2. ఏ సమ్మె కలకాలం జరగదు. అసలు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్, ప్రైవేటు రంగం, రైతులు, కులవృత్తులు, లాయర్లు, డాక్టర్లు, నెలరోజులు సమ్మె చేయడం భారత దేశంలొ ఇప్పటివరకు కనీ వినీ ఎరగనిది. తమ సమ్మె ద్వారా తెలంగాణాపై తమ ఆకాంక్షను ఢిల్లీ వరకు తీసుకు వెళ్ళడంలో వారు విజయం సాధించారు. ప్రజలు నిజాయితీగా చేస్తున్న సమ్మె వల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రక్రియలో వేగం పెరిగింది. ప్రజలను పట్టించుకోవడం మాని వేసిన ఈ ప్రభుత్వాలకు ప్రజల కష్టనష్టాలు ఎలాగు పట్టవ్. అవి కూడా ఉద్యమనాయకత్వమే పట్టించుకొవలసిన పరిస్థితి.

    సకలజనుల సమ్మె కూడా ఏదో ఒక దశలో ముగియవలసిందే. కాక పోతే ఉద్యమ రూపాలు మారతాయి. మరో కొత్త రూపాలు వస్తాయి. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఉద్యమాలు రకరకాల రూపాలు తీసుకోవడం, మధ్యలో విరామాలు కూడా తీసుకోవడాలు మనం చూశాం.

    ReplyDelete
  3. సకలజనసమ్మెతో తెలంగాణావారు సాధించింది ఏమిటి? సినిమాల్లో చివరి సీన్లో అన్ని పాత్రలు ప్రవేశించి డిషుం డిషుం అని.. క్లైమాక్స్ సీనుతో శుభం కార్డ్ పడుతుంది. కనీసం తెలుగు సినిమా దర్శకుల కున్న వ్యూహం కూడా కోదండరాం కి లేదనిపిస్తుంది. పాపం! పొద్దస్తమానం కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చెయ్యమని అడుక్కోవటమే సరిపోయింది. జానారెడ్డి వంటి అవకాశవాద కాంగీయులని నమ్ముకుంటే ఉద్యమాలు ఇలాగే నడుస్తాయ్. నేను తెలంగాణా ఉద్యమం పట్ల సానుభూతితోనే ఇదంతా రాస్తున్నాను. అర్ధం చేసుకోగలరు.

    ReplyDelete
  4. రమణ గారు,

    ఉద్యమాలన్న తర్వాత వ్యాపారాల లాగా, ఏ ఉద్యమం ఎప్పుడు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు వుండవు. ఉద్యమకారులు ఎన్ని వ్యూహాలు రచించినా చివరగా స్పందించాల్సింది కేంద్ర ప్రభుత్వం.

    అలా అని సకల జనుల సమ్మె వల్ల ఎలాంటి లాభం జరుగలేదనడం పొరపాటు. ఈ ఉద్యమం వల్ల సెగ కేంద్రం వరకు ఎగబ్రాకింది. సెంట్రల్ కోర్ గ్రూప్ ఏర్పడింది. ఉప కోర్ గ్రూప్ నియమించారు. ఉప కోర్ గ్రూప్ నాయకుడు ప్రనభ్ రాష్ట్ర నాయకులతో విస్త్రుత చర్చలు జరిపి రిపోర్టు సోనియాకి సమర్పించారు.

    ఇప్పుడు బంతి సోనియా కోర్టులో వుంది. కాబట్టి సమస్య పరిష్కారానికి కొంత దగ్గరకు వెళ్ళినట్టే. వీరు ఆడే దొంగనాటకాల్లో అన్ని అంకాలు ఇప్పటికి ముగిసి పోయాయి. ఇక తెలంగాణా కాంగ్రేస్ నాయకులకు ప్రజలవద్ద చెప్పుకోవడానికేమీ లేదు, సోనియాతో ప్రకటన చేయించడం తప్ప.

    ఏ ఉద్యమమైనా ఎకాయెకి ఫలితాలు సాధించలేవు. కార్మిక, రైతాంగ పోరాటాలు స్వాతంత్ర్యం ముందే ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే వున్నాయి. కొన్ని పెట్టుబడిదారీ ప్రాయోజిత మిధ్యా ఉద్యమాలకు మాత్రం మినహాయింపు వుంది. ఎందుకంటే అవి ప్రభుత్వం ముందే చేయదల్చుకున్న పనికి "ప్రజాకాంక్ష" అనే ముద్ర వేయడానికి ఉద్దేశించినవి.

    ఉద్యమంలో ఇంకా చివరి సీను రాలేదని తెలుస్తూనే వుందిగా? చివరిసీను అంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడడమే. 1969 లాగా మధ్యలో ఆగిపోయే వుద్యమం కాదు ఇది. అందుకే డిష్యూం డిష్యూంలు వుండవు. ఆ విషయంలో కోదండరాం వ్యూహ రచనా చాతుర్యం అద్భుతంగా వుంది. అందుకే ఈ సమైక్యవాద ప్రభుత్వం ఎంత కోపం వున్నా ఒక్క ఉద్యమ నాయకుణ్ణి కూడా మూసివేయలేక పోతుంది. వారు ఎంత రెచ్చగొట్టినా డిష్యూం డిష్యూంలు లేక పోవడమే అందుకు కారణం.

    ReplyDelete
  5. Telangana Raashtra Saadhana !

    ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును
    సీమ ఆంధ్రు లె దూకుడుగ దూరుచుండ,
    ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల
    సీమ ఆంద్ర నే ముందడుగు వేయ,
    పండించి తిండికై పరులకు చేజాచి
    ఎండుచు తెలంగాణా జనులు మండుచుండ,
    తమ పట్టణమునందె తాము పరాయిలై
    దెస తోప క తెలంగాణ దేవురింప,

    ప్రత్యెక తెలంగాణ కావలె ననుట తప్పె?
    తెలంగాణ పంట, తెలంగాణ సొమ్ము, తెలంగాణ కండ
    తెలంగాణ వారికి గాని ఈ దీన దశను
    ఎంత కాలము నలిగి పోయెదము మేము?

    మన యింట పరుల పెత్తన మేమియని కాదె
    సత్యాగ్రహంబులు సల్పినాము?
    మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె
    ఉపవాస దీక్షల నూనినాము?
    మన కధికారముల్ పొనరలేదని కాదె
    సహకార నిరసన సలిపినాము?
    మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె
    కారాగృహమ్ముల జేరినాము?

    తలలు కలుపక రండని పలికినపుడు
    బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి
    పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!
    మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!

    మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!
    తెలంగాణ రాష్ట్ర మొకరి నడుగ నేల?
    దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,
    చీది, ఒక్కడేదొ చేయి విదుప!

    ఢంకాపై గొట్టి నిరా
    తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్
    అంకించుకొందు మంతే!
    ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?
    జయము నా వీర తెలంగాణకు,నా పోరు తెలంగాణకు జయము జయము

    ReplyDelete