Saturday, October 29, 2011

చైతన్యం వెలిగించిన సకల జనుల సమ్మె


ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా కబళించే క్రమంలో జరిగిన నష్టంలో, ట్రేడ్ యూనియన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతాబ్దపు 1970 దశకంలో దేశ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో, ముఖ్యంగా రైల్వే సమ్మె మొత్తం దేశాన్ని కుదిపేసింది.ఆ కాలంలో ఉద్యోగులు, రవాణా, ఉపాధ్యాయులు పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేస్తే సమాజం దాదాపు స్తంభించిపోయేది. ఆ క్రమం 1980 దశకం వరకు చాలా మారింది. కార్మిక సంఘాల నాయకత్వ రాజీ ధోరణి, అమ్ముడుపోయే ధోరణి పెరిగి కార్మికవర్గ పాత్ర కుంచించుకుపోయింది. 80 దశకంలో దాదాపు సమ్మెలు జరగడం ఆగిపోయింది. 90 దశకంలో ఊపందుకున్న ప్రపంచీకరణ వల్లా, సర్వీస్ రంగాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేటీకరించడం వల్లా, పబ్లిక్ రంగ ఉద్యోగులు సమ్మె చేసినా అన్ని రంగాలలో సమాంతరంగా ప్రైవేట్ రంగం పెరగడం వల్లా - మధ్య తరగతికి, ప్రత్యేకించి పాలకవర్గాలకు సమ్మె ఒక సమస్యే కాకుండాపోయింది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా గత మూడు దశాబ్దాలుగా సమ్మెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు కార్మిక రంగ సంస్థలలో పోటీ సంస్థలు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు బలం గా ఉండడం వలన, రాజకీయాలు ఎలా దిగజారాయో అదే క్రమంలో ట్రేడ్ యూనియన్లు కూడా దిగజారుతూ, ఒక సంఘం సమ్మె పిలుపు ఇస్తే మరో సంఘం దానిని వ్యతిరేకించడంతో సమ్మె విఫలం కావడం దాదాపు సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మె, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు తమ మాతృ సంస్థలతో సంబంధం లేకుండా సంఘటితంగా ఉద్యమాలు చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది.

సకల జనుల సమ్మె తెలంగాణలో ఉధృతంగా జరుగుతున్న కాలంలోనే వాల్‌ స్ట్రీట్‌కు వ్యతిరేకంగా 80 దేశాలలో నిరుద్యోగులు, సాధారణ పేద ప్రజ లు రాజ్య వ్యవహార పద్ధతిని, అక్రమ సంపదకు అవినీతి రాజకీయాలకు మధ్య ఏర్పడిన అనైతిక సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రధానంగా లేవదీసిన ప్రశ్న: సామాజిక ఆర్థిక జీవితంలో రాజకీయాల పాత్ర ఏమిటి? రాజకీయాలు ప్రజల ఓట్లతో, లేదా మద్దతుతో గెలిచి, ప్రజాస్వామ్యం పేరు మీద, సార్వభౌమ అధికారం పేరుమీద పాలిస్తూ, దేశం లో సంపదను లూటీ చేస్తున్న వాళ్లకు అనుకూలం గా ఎందుకు పనిచేస్తున్నట్టు-అంటూ, ప్రజాస్వామ్యమంటే దోపిడీదారులు, రాజకీయ నాయకులు కూడబలుక్కుని, రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల రక్తం తాగడమేనా అనే ఒక మౌలిక ప్రశ్న లేవదీశారు. ఈ ఉద్యమాలకు స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘ప్రపంచవ్యాప్తంగా సంపద మీద తిష్ఠ వేసి కూర్చున్న వాళ్లు సామాజిక శ్రేయస్సును గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించాడు. ఈ తిరుగుబాటు అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పాకింది. అమెరికా అధ్యక్షుడు కూడా ‘ఈ తిరుగుబాటుదారుల ఆవేదనను అర్థం చేసుకోవాల’ని సంపన్నులకు సలహా ఇచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తిరుగుబాటులో ఒక గమనించదగ్గ అంశం, ఏ సాంకేతిక విజ్ఞానాల ద్వారా సంపన్నులు ప్రపంచాన్ని నియంత్రిస్తున్నారో, ఆ సాంకేతిక మార్గాల ద్వారానే ప్రపంచవ్యాప్త తిరుగుబాట్ల మధ్య ఒక సంబంధం ఏర్పడింది. ఉత్పత్తి శక్తులు పెరుగుతున్న క్రమంలోనే ఏర్పడే వైరుధ్యాలు, సంపదకు ఎలా సవాలుగా మారుతాయో ఇదొక చక్కటి ఉదాహరణ. పెట్టుబడిదారీ వ్యవస్థకు శ్రమకు మధ్య ఏర్పడ్డ రాజీయే కార్మికుల హక్కులు అనే ఒక సూత్రీకరణ కూడా ఉంది. హక్కులు ఒక చారిత్రక సంధి నుంచి బలీయమైనవన్న ఒక అవగాహన కూడా ఉంది. కార్మికులు రెండు శతాబ్దాల పోరాటాల ద్వారా హక్కులు సాధించుకున్నారు. ఈ మొత్తం చారిత్రక అభివృద్ధిని అడ్డుకుంటూ, హక్కులను హరించుకుంటూ నయా ఆర్థిక విధానం ప్రపంచ సంపదను కొల్లగొట్టాలనుకుంటోంది. కొల్లగొడుతున్నది. దీనికి పర్యవసానంగానే సాధించుకున్న హక్కులు పోగొట్టుకుంటూ, పని దొరికితే చాలు అనే దీన స్థితికి ప్రజలను నెట్టబడ్డారు. ఒకవైపు ఐఎల్‌ఓ (అంతర్జాతీయ లేబర్ సంస్థ) ‘పని అంటే ‘డీసెంట్ పని’ అని, అది గౌరవప్రదంగా ఉండాల’ని నిర్వచించినా, ఆ మాట వినేవాళ్లే కరువయ్యారు. దీనికి తోడు మదనూరు భారతి గారు ప్రస్తావిస్తూ వచ్చిన ‘అదనపు మనుషుల’ సంఖ్య పెరుగుతూ వస్తున్నది. పనిచేయడానికి చేతులుండి, ఆలోచించే శక్తి ఉన్న మనుషులకు పని ఎందుకు దొరకదు? అనేది చాలా మౌలికమైన ప్రశ్న. ఆహార సేకరణ దశలో ఏ మనిషికామనిషి తమ ఆహారాన్ని తామే సేకరించే పనిలో ఉన్నారు. అందరికి ప్రకృతి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఆ దశ నుంచి అత్యంత ఆధునిక దశకు చేరుకున్నామని భ్రమించే వ్యవస్థలు మనిషి జీవితాన్ని ఉన్నతీకరించే బదులు పనిలేని, పని దొరకని మనుషులను చేశాయి. మనిషికి చేతినిండా పని కల్పించని ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అది అమానవీయ దోపిడీ వ్యవస్థే. ఈ వక్ర అభివృద్ధికి వ్యతిరేకంగా భిన్న దేశాలలో ‘మాకు పని ఎందుకు లేదు, మేం పేద వాళ్లుగా ఎందుకున్నాం?’ అంటూ ‘సంపద మీకు పేదరికం మాకా?’ అన్న నినాదాలతో ఉద్యమిస్తున్నా రు. తెలంగాణ సకల జనుల సమ్మెలో ఈ మౌలిక ఆకాంక్ష ఎక్కడో దాగుంది అని అనిపిస్తున్నది.

తెలంగాణ ప్రాంతంలో చారిత్రకంగా ప్రపంచ మార్పులకు ప్రతిస్పందించే ఒక గుణముంది. దేశమంతా స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్నప్పుడు, అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చైనాలో జరుగుతున్న పోరాటంతో పోల్చగల సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంత అనుభవంలో ఉంది. ఆ పోరాటం ఎంత అర్ధాంతరంగా ముగిసినా ఆ దారిలో అనుభవం తెలంగాణకు గొప్ప వారసత్వాన్ని ఇచ్చింది. ఆ పోరాటాన్ని అణచివేసి, అదే నినాదాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకుంది. అప్పటికి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్వభావంలో అలాగే ఉంది. అప్పుడు సోషలిజం పేరు చెప్పి, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలలో గెలవాలని తప్పించి నిజాయితీగా న్యాయమైన పరిష్కారమేమిటా అని ఆలోచించే స్థితి లో లేకపోవడం ఎంతో అప్రజాస్వామికం. ఇది మోసపు చరిత్ర కొనసాగింపు.

అలాగే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రపంచం ఉద్రిక్త, ఉద్వేగ వాతావరణంలో ఉంది. చైనాలో సాంస్కృతిక విప్లవం, అమెరికాలో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమం, ఫ్రాన్స్‌లో యువత తిరుగుబాటు, దేశంలో నక్సల్‌బరీ పోరా టం పుంజుకుంటున్న సందర్భమది. అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు జరుగుతున్న ఉద్య మం సకల జనుల ఉద్యమంగా ఎదగగలిగింది. ఈ సమ్మె సఫలమైందా, విఫలమైందా, సరియైన సమయంలోనే జరిగిందా? లేదా? నాయకత్వంలో రాజీపడ్డారా? సమర్థవంతమైన నాయకత్వం లేదా? వంటి ప్రశ్నలు చాలానే అడగవచ్చు. వీటిని చాలాకాలం చర్చించుకోవచ్చు. ఒక ప్రజా ఉద్యమం విజయవంతమైందా?, విఫలమైందా? అనడానికి మనం ఉపయోగించే ప్రమాణాలు ఏమి టి? అనేది కూడా ప్రశ్నే. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం లేదా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనేదే ప్రమాణమైతే సమ్మె తన లక్ష్యాన్ని సాధించలేదు అని అనవచ్చు. ప్రజా ఉద్యమాలను అలా చూడకుండా, ఉద్యమ ప్రక్రియ ఎలా ఉంది, సమీకరణ ఎలా సాగింది, సంఘటిత శక్తి ఎలా వ్యక్తీకరింపబడింది, సామాజిక సంబంధాలను ఎలా ప్రభావితం చేసింది, కొత్త విలువలు , ప్రజల చైతన్యంలో ఎదిగాయా? ఇలాంటి ప్రశ్నలు అడగకపోవడం వలన అనుకున్నది సాధించలేదన్న నిరాశ కలుగుతుంది. ఈ కోణం నుంచి సకల జనుల సమ్మెను చూస్తే పెట్టబడిదారులకు, రాజకీయాలకు ఏర్పడ్డ అనైతిక సంబంధాన్ని సమ్మె ఎండగట్టింది. అక్రమ సంపాదన కలిగిన వారు రాజకీయాలను ఎలా నిర్దేశిస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలిసినంత స్పష్టంగా బహుశా ఇతర ఏ ప్రాంతం వారికి తెలిసి ఉండదు. అలాగే భిన్నరంగాలకు చెందిన సమస్త వృత్తుల వాళ్లు, విద్యార్థులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోలు నడుపుకునే వాళ్లతో సహా... ఒక్కరు కాదు ప్రతిరంగం ఉద్యమానికి స్పందించింది. తన స్థాయిలో పొల్గొన్నది. సింగరేణి కార్మికుల్లో వ్యక్తమయిన ఐక్యత సాధారణమైన సంఘటన కాదు. అలాగే గ్రామ గ్రామంలో నిరసన ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ రూపాలలోని వైవిధ్యంలో ప్రజల సృజనాత్మకత కనిపించింది. అంటే ఉద్యమాలకు నిర్దిష్టమైన గమ్యాలు ఉండడమే కాదు, వాటికి ఒక గమనం కూడా ఉంటుంది. ఆ గమనాన్ని గమనిస్తే సకల జనుల సమ్మె ఒక గొప్ప సామాజిక అనుభవమే. అయితే సమ్మె విఫలమైందన్న నిరాశకు గురికాకుండా సమ్మె సృష్టించిన చైతన్యాన్ని మరలా ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేలా ఉద్యమకారులు కృషి చేయడమే నిజమైన సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది.

- పొఫెసర్ హరగోపాల్

1 comment: