Friday, July 29, 2011

యెడ్యారప్ప రాజీనామా, జన్‌లోక్‌పాల్ బిల్లు, తెలంగాణా ఉద్యమం

యెడ్యారప్ప రాజీనామా చేయకుండా మొరాయించడానికి, కేంద్రప్రభుత్వం జన్‌లోక్‌పాల్ కాకుండా జోక్‌పాల్ బిల్లు ఆమోదించడానికి, రాజగోపాల్ & కో తెలంగాణా వ్యతిరేకించడానికి గల సారూప్యత ఏమిటి?

మొదట చదవగానే ఏంటీ అర్థం లేని ప్రశ్న అనిపించొచ్చు. కాని అలోచించి చూస్తే మూడు విషయాలకు కూడా అంతర్గతంగా వుండే కారణం ఒక్కటే అని ఇట్టే తెలిసిపోతుంది.

యెడ్యారప్ప పై కర్నాటక రాష్ట్ర లోకాయుక్త హెగ్డే అత్యంత అవినీతి పరుడుగా సాక్ష్యాధారలతో నిరూపిస్తూ ఇచ్చిన రిపోర్టుతో అతని, గాలి సోదరులు అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టిన వైనం బయట పడింది. ఒక రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానం అంతటి నేరారోపక తీర్పు ఇచ్చినపుడు ఏమాత్రం నిజాయితీ గలవారైనా వెంటనే రాజీనామా చేయాలి.

కాని యెడ్యారప్ప, గాలి సోదరుల దన్నుతో ససేమిరా అన్నారు. బయటికి ఏమి చెప్పినా, అసలు కారణం మాత్రం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ ఆరోపణలపై రాజీనామా అంటూ చేస్తే చాలా కాలం పదవులకు దూరంగా వుండవలసి వస్తుంది. పదవులను ఆధారంగా చేసుకుని ఇప్పటిదాకా సాగించిన దోపిడీకి గండి పడుతుంది. పాత చరిత్ర కూడా తిరగదోడ బడొచ్చు. జైళ్ళకు కూడా వెళ్ళవలసి రావచ్చు.

యెడ్యారప్పే కాదు, ఏ దోపిడీ దారుడైనా తన దోపిడీ శకం ముగుస్తుందని భావించినపుడు తనకు అడ్డొచ్చే వారిపై తీవ్రంగా పోరాడుతాడు. అంతే కానీ, "నేను ఇప్పటిదాకా అన్యాయాలు చేస్తున్నాను, ఇకనుండి బుద్ధిగా వుంటాను" అని చెప్పి దిగిపోడు.   

ఇకపోతే కేంద్ర కేబినెట్. ఎంటటి అవినీతిలో కూరుకు పోయినా, ప్రజలందరూ ఛీకొడుతున్నా కూడా తన పాపాలను కడుక్కోవాలని ఏమాత్రం అనుకోవడం లేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రంగా అణచివేయాలని చూస్తుందే తప్ప జన్‌లోక్‌పాల్‌బిల్లు ఆమోదించాలని ఏమాత్రం ప్రయత్నించడం లేదు. పైగా దాన్న్ని అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. కారణం ప్రతి ఒక్కరు ఊహించగలిగేదే. ఏమంటే ప్రభుత్వం నడిపిస్తున్నది దోపిడీ శక్తులు. ముందే అనుకున్నట్టుగా దోపిడీ శక్తులు అంత సులభంగా దొపిడీపై తమకు సంక్రమించిన హక్కు(?)లను వదులుకోవు. తమ హక్కులను కాపాడుకోవడానికి ఏ పరిణామాలకైనా సిద్ధంగా వుంటాయి. ఎంతటి అణచివేతకైనా పాల్పడతాయి. అనుకే ఏమాత్రం సిగ్గులేకుండా కేంద్ర కాబినెట్ ఒక తూతూ మంత్రం బిల్లు తయారు చేసుకొని ఆమోదించుకుంది, ఏం చేయడం లేదని ఎవ్వరూ అనకుండా.

యెడ్యారప్పకి చివరికి రాజీనామా చేయక తప్పలేదు. కాని కేంద్ర కేబినెట్ అంత సులభంగా తలొగ్గే పరిస్థితి కనపడటం లేదు. దేశవ్యాప్తంగా అవినీతిపై తెలంగాణా ఉద్యమం వంటి మహోద్యమం వస్తే తప్ప అది తలవంచదు.

పై రెండు దృష్టాంతాలు చూసినప్పుడు తెలంగాణా ఎవరు ఎందుకు అడ్డుకుంటున్నారో సులభంగా అర్థమౌతుంది. రష్యన్ బోల్షెవిక్ విప్లవాన్ని భూస్వామ్య శక్తుల ప్రతినిధులైన తెల్ల సైన్యాలు ఎలా చివరిదాకా అడ్డగిస్తూ పోరాడాయో, అవే భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తులు తెలంగాణా ఏర్పాటును అడ్డగిస్తూ అంతిమ పోరాటం చేస్తున్నాయి. ఈ శక్తులు తమ దోపిడీలు అక్రమాలు నిరంతరాయంగా కొనసాగించడానికి ఎలాంటి కుట్రలైనా పన్నగలుగు తాయి. ఎంతమందినైనా కొనడానికి సాహసిస్తాయి. వారు న్యాయ నిపుణులు కావచ్చు, ప్రధాన సచివులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు.

ఇలాంటి నిర్ణయాత్మక సమయంలో తెలంగాణా ప్రజలు తమ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న దోపిడీ శక్తుల కుట్రలను, కుతంత్రాలను వేయి కళ్ళతో కనిపెడుతూ అప్రమత్తంగా ముందుకు సాగవలసిన అవసరం వుంది. 


No comments:

Post a Comment