మొత్తానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి గూబ గుయ్యిమనే దెబ్బ తలిగింది. ఎన్ని ఫోన్లు చేసినా ఎన్నిసార్లు రమ్మని పిలిచినా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పెడచెవిన పెట్టినరు. అధిష్టానం పిలుపులను ఏమాత్రం లెక్క చెయ్యలేదు. రాజీనామాలు చేసినంక గాని మేము చర్చలకు రాం అని తెగేసి చెప్పిన్రు తెలంగాణా నాయకులు.
హటాత్తుగా తెలంగాణా కాంగ్రెస్ వారికి ఇంత తెగింపు ఎక్కడినిచి వచ్చింది? పిల్లి నైనా గదిలో వేసి అదే పనిగ కొడుతుంటే అది తప్పక ఎదురు తిరుగుతది. అలాంటిది సీమాంధ్ర డబ్బు సంచుల మాయలో మైమరచి పోయిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణా ప్రతినిధులు ఎన్ని సార్లు పోయి తమ బాధలు విన్నవించు కోవాలని ప్రయత్నం చేసినా పెడచెవిన పెట్టింది.
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతపు ప్రజల మనోగతాలను చెప్పుకోవాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వినకుండా ఏదో ఒక మాయమాట చెప్పి పంపించడం అధిష్టానానికి రివాజుగా మారింది. ఒకసారి తెలంగాణా, సీమాంధ్ర ఎంపీ లందరూ ప్రణభ్ దగ్గరికి వెళ్ళితే, పొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ సీమాంధ్ర ప్రతినిధులో మంతనాలు జరిపి, సాయంత్రం దాకా ఓపిగ్గా వేచి ఉన్న తెలంగాణా ప్రతినిధులతో పదంటే పది నిముషాలు మాట్లాడిన ఉదంతం సూట్ కేసుల మహిమ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది.
వెన్నెముక లేని వారిని ఏరేరి టికెట్లిచ్చినారు కనుక ఎలా చెప్తే అలా పడిఉంటరని కాంగ్రెస్ చాలా భారోసాగనే ఉంది. కాని పరిస్థితులు అలాగ లేవు. తెలంగాణా కాంగ్రెస్ ప్రతినిధులు తాము చెప్పిన చివరి డేడ్ లైను కూడా ముగిసిన తర్వాత, ఇంకేమాత్రం వాయిదాలు వేసే పస్థితి లేదు. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు ప్రజల్లోకి రాలేని పరిస్థితి. తెలుగుదేశం వారికి జరుగుతున్న సామాజిక బహిష్కరణ చూసిన తర్వాత తమకు కూడా అదే పరిస్థితి తప్పదని గ్రహించలేని వారు కాదు కాంగ్రెస్ నాయకులు.
అందుకే ఇక పార్టీ ప్రయోజనాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించ వలసిన అవసరాన్ని గుర్తించిన్రు. దాని పర్యవసానమే ఈ రాజీనామాల పర్వం. ఈ నిర్ణయం తీసుకునే ముందు కేసీయార్ తో మాట్లాడి, ఎన్నికలు వస్తే పోటీ చేయం అనే మాట తీసుకొనే ఉంటారు. వారు ఏం చేసినా అది మాత్రం తెలంగాణా ప్రయోజనాలకు అనుకూలమే. అందుకే తెలంగాణా ప్రజలు వారిని ఈరోజు సమర్థిస్తున్నరు.
ఇంకా పొతే తెలుగుదేశం వారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాల సంగతి ప్రకటించ గానే పోలో మని ఉరికొచ్చి వారికంటే ముందే రాజీనామాలు చేసిన్రు. సొంత విధానాలు లేక కాంగ్రెస్ చేస్తే రాజీనామా చేయడం, కాంగ్రెస్ మానితే మానడం చేసే వారికి మరి ఓట్లు వేసి గెలిపించడం ఎందుకు? ఈ విధంగా నైనా ప్రజల్లోకి రావచ్చోనే యావ తప్ప తెలంగాణా తెలుగు దేశం వారి రాజీనామాల్లో ఏమాత్రం నిజాయితీ కనపడుత లేదు.
తెలంగాణా తెలుగుదేశం వారు చేయ వలసినది రాజీనామాలు కాదు. వారు చేయవలసింది రెండు కళ్ళ ఆంద్రబాబుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టమైన ప్రకటన చేయించడం. అలా చేయించ కుండా, 'మా నాయకుడు తెలంగాణాకు అనుకూలం' అని దొంగ మాటలు చెప్తే ప్రజలు నమ్మి ఆదరించే పరిస్థితిల లేరు.
ఏదేమైనా, ఇప్పటికైనా సీమాంధ్ర ఎత్తులకు తెలంగాణా వారు చిత్తు కాకూడదని ఆశిద్దాం.
జై తెలంగాణా.
No comments:
Post a Comment