ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణా అసాధ్యమని గులాంనబీ ఆజాద్ చెప్పడం ఒట్టి దివాళాఖోరు వాదన. రాష్ట్రాలలో ఏకాభిప్రాయాలు రావు కనుకనే విభజనాధికారాలు పార్లమెంటుకు దఖలు పర్చారు రాజ్యాంగ నిపుణులు. ఒకరు విడిపోతాం అని, ఇంకొకరు కలిసుంటాం అని అన్నప్పుడు విడిపోతామన్న ప్రాంతం వారి అభిప్రాయాలు తీసుకోవాలి తప్పితే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంతంతో సంబంధం లేని ప్రక్క ప్రాంతం వారి అభిప్రాయాలు కాదు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా అది రాష్ట్ర ఏర్పాటుకు ఏవిధంగానూ అడ్డంకి కాదు.
మరి ఈ సంగతి గులాంనబీ ఆజాదుకు తెలియదనుకోవాలా? తెలుసు. మరి అతని వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది?
రాష్ట్రం ఏర్పాటు కష్టం అని రాజీనామా చేసిన నాయకులను భయపెట్టి, "రాష్ట్రం ఎలాగూ రాదు, కనీసం పదవులన్నా కాపాడుకుందాం" అని అనుకునేలా ప్రేరేపించడానికి అయివుంటుంది. లేదా తెలంగాణా వారిని ఇలాంటి మాటలతో రెచ్చగొట్టి భయపెట్టి వారి లక్ష్యసిద్ధిని పరీక్షించి ఉద్యమ తీవ్రతని అంచనా వేయడం.
తెలంగాణా ప్రజా ప్రతినిధులు అంత సులభంగా తమ రాజీనామాలు వెనక్కు తీసుకునే పరిస్థితి లేదు. ఇంత జరిగాక తెలంగాణా process మొదలు కాకుండా రాజీనామాలు వెనక్కు తీసుకుంటే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అసలు ప్రజలు చీత్కరిస్తేనే కదా వీరు రాజీనామాలు చేసింది? ఇప్పుడు దాన్ని ఉత్తుత్తి కార్యక్రమంగా ముగించే ధైర్యం వారు చేసే అవకాశం లేదు.
రెండోది సామ దాన బేధ దండోపాయాలలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేయడం కేంద్రం ఉద్దేశం కావచ్చు. తల్లి కూడా తాయిలం అడిగిన కుర్రాడికి వెంటనే ఇవ్వకుండా కాసేపు మారాం చేయించడం ద్వారా పిల్లవాడి కమిట్మెంటును పరీక్షిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రజాప్రతినిధుల కమిట్మెంటును పరీక్షిస్తుండవచ్చు. తెలంగాణా ప్రజలకమిట్మెంటునుఇప్పుడు కొత్తగా పరీక్షించాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఎందుకంటే వారు ఇప్పటికే వారు పలుసార్లు పలు సందర్భాలలో తమ స్వరాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చారు. ఊగిసలాడే మనస్తత్వం ఉండే నాయకుల మీద వారు కొంత ఆశ పెట్టుకొని ఉండవచ్చు.
కానీ ముందే అనుకున్నట్టుగా పరిస్థితి నాయకులు ఏమాత్రం తోక ఝాడించేందుకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఝాడిస్తే తెలంగాణా ప్రజలు వారి వీపు ఝాడించేందుకు సిద్ధంగా ఉన్నారు.
నిజానికి ఇలాంటి పరీక్షలు చేయాలనుకుంటే ఆజాద్ ఆంధ్రా ప్రజల సమైక్య రాష్ట్ర ఆకాంక్ష మీద పరీక్షలు చేస్తే బాగుంటుంది. తెలంగాణాలో ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అదే సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి అలా లేదు.
కొందరు హైదరాబాదు విడదీస్తే విడిపోయినా ఫరవాలేదంటారు. మరి ఇది ఏ రకమైన సమైక్యత?
ఇంకొందరు కలిసి ఉంటే ఫరవా లేదు, కాని విడి పోతే ఉత్తరాంధ్రకి లక్ష కోట్లు ఇవ్వాలి అంటారు. మరి కలిసి ఉంటే ఏ ప్యాకేజీ లేకపోయినా ఫరవాలేదా?ఇన్నాళ్ళూ కలిసి ఉన్నా ఇప్పుడు ప్యాకేజీల అవసరం వచ్చిందంటే కలిసి ఉండడంవల్ల ఉపయోగం లేనట్టే కదా?
ఇక కొంతమంది రాయలసీమ వారు రాయల-తెలంగాణా కావాలంటారు. అంటే ఇప్పుడున్న సమైక్య రాష్ట్రం అవసరం లేదనే కదా?
వీటన్నిటికి తోడు సీమాంధ్రలోని దళిత బహుజనులు రాష్ట్ర విభజనతోనే తమ బతుకులు బాగు పడతాయని గట్టిగా నమ్ముతున్నారు. గుంటూరు సభే దానికి నిదర్శనం.
ఇవన్నీ కాక చలసాని శ్రీనివాస్, వగైరాల నాయకత్వంలో ఆంధ్రరాష్ట్ర ఉద్యమం కూడా ఉండనే ఉంది.
కాబట్టి తెలంగాణాలో ప్రజలంతా ముక్త కంఠంతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నా, ఆంధ్రాలో మాత్రం అందరూ సమైక్యరాష్ట్రం కావాలనే అభిప్రాయంతో లేరనే విషయం అర్థమౌతుంది.
రాజకీయ దృష్టితో చూసినా, తెలంగాణా ఇవ్వకుంటే తెలంగాణాలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు గెలవడం కాదుకదా, డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమే. అదే తెలంగాణా ఇస్తే మటుకు TRSతో పొత్తు పెట్టుకొని కొన్నైనా సీట్లు గెలుచుకునే అవకాశం దానికి ఉంది. మైనారిటీల భయంతో KCR కాంగ్రేస్ తో కలవ గలడు కాని, NDA తో కలవడానికి అంతగా ఇష్ట పడడు. కాని 2014లోపు తెలంగాణా ఇవ్వక పోతే మటుకు KCR NDA తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కాంగ్రేస్ పని తెలంగాణాలో కుక్కలు చింపిన విస్తరే.
ఇకపోతే తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్రాలో మాత్రం మిశ్రమ ఫలితాలే వుంటాయి. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబులతో కాంగ్రెస్ సీట్లను పంచుకోవలసిందే. గోడమీది పిల్లి వాటంగా వున్న చంద్రబాబు, జగన్‌లు కేంద్రం నిర్ణయం ప్రకటించాక "మేం సమైక్యవాదులం" అని అరిచి మొత్తుకున్నా నమ్మేటంత విఙ్ఞత లేనివారు కారు సీమాంధ్రులు. కాబట్టి తెలంగాణా ప్రకటించి నంత మాత్రాన కాంగ్రెస్ ఆ ప్రాంతంలో కొత్తగా కోల్పోయేదీ, ఇవ్వక పోతే బావుకునేదీ ఏమీ వుండదు. పైగా ఆ ప్రాంతంలో ఎన్నికల్లో కుల రాజకీయాలదే పెద్దపీట అన్నది అందరికీ తెలిసిన విషయమే.
వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం కన్నా కేంద్రంలో వున్న కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేదు.