Thursday, August 1, 2013

జయహో తెలంగాణా



తెలంగాణా సోదర సోదరీమణులకు శుభాభినందనలు. చిరకాల పోరాటాల అనంతరం ఊహించని సాఫల్యత లభించింది. తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత కాంగ్రెస్ పార్టీని నిర్ణయం దిశగా పురి కొల్పింది. తెలంగాణా వాదులు మొదటి నుండి విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ వ్యూహాలు నిజమని నిరూపించ బడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పని అనివార్య పరిస్థితులను కల్పించాయి.

అయితే మనం అప్పుడే పండగ చేసుకోవలసిన అవసరం లేదు. సీమాంధ్ర పెట్టుబడి దారుల కుట్రల తీవ్రత మనకు తెలియనిది కాదు. పది జిల్లాలతో కూడిన రాష్ట్ర ఏర్పాటు పైన కేంద్ర కాబినెట్ నిర్ణయం వచ్చేంత వరకూ, పార్లమెంటులో బిల్లు పాసయ్యేటంత వరకూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి.

పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ప్రకటించి హైదరాబాదుపై మరో సందిగ్ధత లేవ నెత్తారు. గతంలో రాష్ట్రాలుగా ఏర్పడ్డ చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ లాంటి రాష్ట్రాలకు రాజధాని ఏర్పాటుకు ఎంత సమయం పట్టిందో ఉదాహరణ లున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతటి వనరులైనా సమకూర్చడానికి ఒకటి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం అవసరం లేదు. అప్పటివరకూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు తెలంగాణా రాష్ట్రంతో పాటు హైదరాబాదులోని వసతులను ఉపయోగించుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు.

కాని అప్పుడే కొన్ని నోళ్ళు కేంద్ర పాలిత ప్రాంతమని, నగరంపై ఉమ్మడి అధికారమని నోళ్ళు పారవేసుకోవడం మొదలు పెట్టాయి. తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా వుండవచ్చు. అంత మాత్రాన అది ఉమ్మడి నగరం ఎంతమాత్రం కాదు. హైదరాబాదు తెలంగాణా సొత్తు. తెలంగాణలో అంతర్భాగం. దాన్ని తెలంగాణా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు.

ఐదు లక్షల కోట్లతో హైదరాబాదు లాంటి కొత్త నగరం కట్టివ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డిమాండు చేస్తున్నారు. పిర్రలు నావి కాకపోతే కంప మీదనుండి దేకుతానన్నాడట వెనకటికి ఎవడో. అలా వున్నాయి బాబు మాటలు. అలవి కాని కోరికలు కోరి ఇక్కడే తిష్ట వేయాలనే దురాలోచనలు కనబడుతున్నాయి వారి మాటల్లో.

ప్రకటన వెలువడగానే కృత్రిమ ఉద్యమాలు మళ్ళీ మొదలు పెట్టారు కుహనా సమైక్య వాదులు. యునిఫారం లోని విద్యార్థులు, కొన్ని రౌడీ మూకలు తప్ప ప్రజలే కనపడడం లేదు వాటిలో. దానికి తోడూ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫ్యాక్సు రాజీనామాలు నవ్వు తెప్పిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజలారా, ఇలాంటి ఉద్యమాల పట్ల, నాయకుల పట్ల అప్రమత్తంగా వుండండి. వీళ్ళని నమ్మితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

కాసుల గలగలలు తప్ప మరేదీ పట్టని సీమాంధ్ర పెట్టుబడి దారులు, యూ టర్న్ తీసుకోవడానికి ఎంతో  సమయం పట్టదు. రాష్ట్ర ప్రకటన వెలువడి కొత్త రాజధాని ఏర్పాటుకు టెండర్లు మొదలవగానే, వీళ్ళ ప్రాధాన్యతలు అనూహ్యంగా మారిపొతాయి. కాని అప్పటిదాకా జాగ్రత్తగా వచ్చిన రాష్ట్రాన్ని పసిబిడ్డ లాగా గద్దలు ఎత్తుకు పోకుండా కాపాడు కోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలదే.

జై తెలంగాణా!
         

1 comment: