Saturday, August 10, 2013

కుట్ర పర్వం పరిపూర్ణం


చంద్రబాబు లేఖతో సీమాంధ్ర పార్టీల కుట్ర పర్వం పరిపూర్ణం అయింది. విభజన గురించి కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చిన వైకాపా ప్రకటన వెలువడ్డ మొదటి రోజే తోక ఝాడించింది. లగడపాటి, కావూరి, కిరణ్ రెడ్డి మొదలైన ఘనాపాటీలు తోక ఝాడించారు (ఇది పూర్తి చేసే సమయానికి జగన్ కూడా రాజీనామా చేశాడని తెలిసింది). ఇప్పుడు చంద్రబాబు కూడా యూ టర్న్ తీసుకొని సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజన మాట ఎత్తాలని చెప్పడం ద్వారా మోసాల డ్రామా పునరావృతమైంది.

కాని గతానికి ఇప్పటికి వున్న చిన్న తేడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ సారి కొంత చిత్తశుద్ధితో వున్నట్టుగా కనిపిస్తోంది. అది చిత్తశుద్దా, ఉత్త డ్రామాయేనా అనే విషయం కాలమే నిర్నయించాలి.

వైకాపా, ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల మోసాల కన్నా చంద్రబాబు మోసం మరీ నికృష్ట మైనది. వైకాపాకి తెలంగాణలో ఎక్కడా బలం లేదు.  సమైక్యవాదం ఎత్తుకోవడం ద్వారా కనీసం ఆంధ్రలో నిలదొక్కు కోవాలనుకుంది. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆడే డ్రామాలు కూడా తమ ప్రాంతంలో ఇతర పార్టీల డ్రామాలతో పోటీ పడుతూ తమ వ్యక్తిగత అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలుగా భావించొచ్చు.

కాని చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఆయన అటు ఆంధ్ర లోను ఇటు తెలంగాణా లోను బలంగా వున్న పార్టీకి అధినేత. కాని ఆయన చేసే పనులు చూసినప్పుడు ఆయన్ను కరడుగట్టిన ఆంధ్రా పక్షపాతిగా, తెలంగాణా వ్యతిరేకిగా మనం అర్థం చేసుకోవలసి వుంటుంది.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణా పేరు ఉచ్ఛరించ నీయలేదు. 2004 ఎన్నికల్లోనూ అతని తీరు మారలేదు. తెలంగాణా ప్రజల ఆకాక్షలను 2008 వరకూ ఆయన ఏనాడూ గుర్తించ లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కోవడానికి వేరే మార్గం లేక తప్పని పరిస్థితిలో ఆయన తెలంగాణాకు మద్దతు ప్రకటిస్తూ ప్రనభ్ కమిటీకి ఉత్తరం ఇచ్చాడు. కాని ఎలక్షన్లు అయిపోయిన మరునాటి నుండీ ఆయనకు తెలంగాణపై అన్య మనస్కతే. తాను  మానిఫెస్టోలో పెట్టిన ముఖ్యమైన అంశాన్ని గురించి ఏనాడూ అసెంబ్లీలోనూ బయటా ఆయన మాట్లాడిన పాపాన పోలేదు.

తీరా 2009లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసేసరికి, కాంగ్రెస్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని తెలంగాణాకు మద్దతు ప్రకటించినట్టు నటించాడు. తీరా 2009 డిసెంబర్ 9న తెలంగాణా ప్రకటించే సరికి, తాను ప్రకటించిన మూడోరోజే తన మాటలకు, పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలాడు.

అప్పటి నుండి తెలంగాణా కోసం వెయ్యి బలిదానాలు జరిగినా అయ్యవారికి చలనం రాలేదు. ఏనాడూ తెలంగాణాపై ఒక చిన్న ఉత్తరం కూడా రాయలేదు. తీరా పాదయాత్ర దగ్గర పడేసరికి, తన మోసపూరిత వ్యవహారాలను చూసి భగ్గుమంటున్న తెలంగాణా ప్రజలను శాంత పరచవలసిన అవసరం కలిగింది.

దరిమిలా తెలంగాణాపై అఖిల పక్షాన్ని పిలవాలని, అక్కడ తన అభిప్రాయాన్ని చెపుతానని మరో లేఖ ప్రధానమంత్రికి పంపాడు. అనుకోని విధంగా షిండే అఖిలపక్షం ఏర్పాటు చేసేసరికి చంద్రబాబు మరోసారి ఖంగు తిన్నాడు. ఆ సమావేశంలో తాము ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో అంతా చెప్పామని, ఇప్పుడు తాజాగా చెప్పేదేమీ లేదని తనకు అలవాటైన బుకాయింపు మాటలే చెప్పించాడు. బయట పాదయాత్రలో మాత్రం తానూ తెలంగాణాకు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకున్నాడు.

ఇపుడు కేంద్రం మరోసారి తెలంగాణా ప్రకటనతో ముందుకు వచ్చేసరికి అయ్యగారికి దిక్కు తోచలేదు. మొదట పార్టీ వారితో రరాజీడ్రామాలు యధావిధిగా జరిపించాడు. తన పార్టీ తెలంగాణా ఎంపీలను పార్లమెంటులో ఏనాడూ అనుమతించని చంద్రబాబు, సీమాంధ్ర ఎంపీలను మాత్రం ప్లకార్డులు పట్టుకొని పోడియంలో ప్రదర్శనలు ఇచ్చేందుకు పురికోల్పాడు. అంతటితో ఊరుకోకుండా తాజాగా ప్రధాన మంత్రికి మరో లేఖ రాశాడు. తెలంగాణాపై అన్ని వర్గాలను ఒప్పించే దాకా రాష్ట్ర విభజన ఆపాలని ఆ లేఖ సారాంశం.

ఈ విధంగా ఆయన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తన మనసులో దాచుకున్న కుళ్ళు మరోసారి బయట పడింది. ఇదంతా చూస్తుంటే చంద్రబాబే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నాయకులకు రింగ్ లీడర్ గా వ్యవహరిస్తూ రాజీ డ్రామాలను చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు కిరణ్ తో ఉన్న అనైతిక బాంధవ్యం గత అవిశ్వాస తీర్మాన సమయంలోనే అందరికీ తెలిసి పోయింది. తాజా లేఖతో ఈ గుంపు అంతా పార్టీలకు అతీతంగా తెలంగాణాపై కత్తి గట్టారని స్పష్టం అవుతోంది. తెలంగాణా తెలుగు తమ్ముళ్ళూ, జర జాగ్రత్త, మీరింకా బాబుతోనే వుంటే మీకు తెలంగాణలో నీళ్ళు ముట్టవు. తెలంగాణా వైకాపా నాయకుల మాదిరిగా మీరు కూడా ఆ సీమాంధ్ర పార్టీని వదిలి రాక పొతే ఆ తర్వాత మీరు ఇక్కడ రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదు.

1 comment:


  1. ఈ కుట్ర క్షమించ రాని కుట్ర ! దీన్ని మనందరం వ్యతిరేకించాలి తప్పనిసరిగా

    జిలేబి

    ReplyDelete