Friday, August 16, 2013

వికృత సమైక్యం

పేరుకు సమైక్యవాద ఉద్యమమంటారు.. కానీ గుంటూరులో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారిని ఓర్వరు. కులం, ప్రాంతం పేరుతో దూషిస్తూ.. బెదిరింపులకు దిగుతారు. మీది తెలుగే.. మాది తెలుగే కలిసుండాలంటారు. కానీ పొట్టచేత పట్టుకొని వైజాగ్‌కొచ్చిన ఇందూరు బిడ్డను చావగొట్టి పంపుతారు. బజారు గూండాల కన్నా హీన స్థాయికి దిగజారి నిలువుదోపిడీ చేస్తారు. ఇక మా సమైక్యవాదం ప్రపంచంలోనే గొప్పదనే డాంబికాలు పోతారు. తీరా చూస్తే దీక్ష చేస్తున్న వ్యక్తికి సహకరించడానికి వచ్చిన సొంత ప్రాంత అధికారిణిపైనే అత్యంత అరాచకంగా దాడికి పాల్పడతారు. రోజురోజుకు వికృత పోకడలకు, అరాచక స్థితికి దిగజారుతున్న సీమాంధ్ర లోని సమైక్య ఉద్యమానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

-ఆందోళన ముసుగులో అరాచకాలు
-తెలంగాణ ఉద్యోగిపై గుంటూరులో.. ఇందూరు ఇంజినీర్‌పై విశాఖలో దాడి
-కాకినాడలో మహిళావైద్యాధికారిపై పెండ
-సంక్షేమ శాఖ అధికారి హనుమంతునాయక్‌ను బెదిరించిన ఏపీ ఎన్జీవోలు.. కులం పేరుతో దూషణలు
-ఆంధ్రలో ఉద్యోగం చేయొద్దంటూ బూతుపురాణం
-కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన హనుమంతునాయక్
-ఇందూరు బిడ్డపై వైజాగ్‌లో దాడి
-కాకినాడలో వైద్యాధికారిపై అరాచకం
-తోట వాణికి వైద్యసాయం కోసం వచ్చిన మహిళ అధికారిపై పెండతో దాడి

విజయవాడ, ఆగస్టు 15 (టీ మీడియా ప్రతినిధి):గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను ఏపీ ఎన్జీవోలు కులం పేరుతో దూషించారు. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు దిగారు.

విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు నవీన్‌పై అక్కడి ‘సమైక్య’ గూండాలు దాడికి దిగి.. చితకబాదారు. అతని వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును నిలువుదోపిడీ చేశారు. సమైక్య ఉద్యమంలోని వికృత కోణాలను ఎత్తిచూపుతున్న ఈ ఘటనలు గురువారం జరిగాయి. మరోవైపు సొంత జిల్లా అధికారులను సైతం సహించ లేని స్థితిలో సమైక్య ఆందోళనలు దారితప్పుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి.. ఆమెకు

వైద్య సహాయం అందించేందుకు వచ్చిన జిల్లా వైద్యాధికారిణి పద్మావతిపై మంత్రి అనుచరులు దాడికి దిగి.. ఆమెపై చెత్త, పెండ విసిరి తమ అరాచకాన్ని చాటుకున్నారు. ఆందోళనల పేరిట వికృత స్వభావం సీమాంధ్రలో గంగ సమైక్య ముసుగులో సీమాంవూధలో అసాంఘిక శక్తులు బరితెగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడం మొదలు.. ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి సీమాంధ్ర నాయకులు రోడ్లమీదకి తెచ్చిపడేయడం.. ఉద్యమకారుల ముసుగులో అరాచక శక్తులు రంగంలోకి దిగడం.. సీమాంధ్ర పాలకులు, నాయకుల కనుసన్నలలో ఉద్యమం నడుస్తుడటంతో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం.. నియంవూతణ, నిర్బంధం, స్వీయ అస్తిత్వం అంటూలేని భయాలు, అపోహాలు, ఉద్రేకాలతో ఆందోళనలు కొనసాగుతుండటంతో.. రోజురోజుకు సీమాంధ్ర ఉద్యమంలో ఒక మూఢత్వం, మూర్ఖత్వం కలగలిసిన ఉన్మాద పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సమైక్య ఉద్యమాల పేరిట జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఆయన తనయుడు రాహుల్‌గాంధీకి పెళ్లి చేయడం, జాతీయ నేతలైన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను విశృంఖలంగా పగలగొట్టడం, తెలంగాణ ఉద్యమ నేతలైన కేసీఆర్, కోదండరాం బొమ్మలను జుగుప్స కలిగించేవిధంగా, అమానుష పద్ధతిలో చిత్రీకరించి ఊరేగించడం, పుర్రెకు తొచ్చిన ప్రతి అడ్డమైన దాష్టీకాన్ని ఉద్యమంగా చిత్రీకరించడం సీమాంధ్ర ఉద్యమంలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పెట్టుబడిదారులు, కొన్ని స్వార్థరాజకీయ శక్తులు ఎగదోసిన కృత్రిమ ఉద్యమం ఇదని, దీనిని సీమాంధ్ర మీడియా చిలువలుపలువలుగా ప్రచారం చేస్తోందని సామాజిక మేధావి వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న సీమాంధ్ర ప్రజలు కూడా ఈ ఉద్యమానుల చూసి ఏవగించుకుంటున్నారు. ఇప్పటికే అగ్రకుల, ఆధిపత్య, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతున్న ఈ ఉద్యమంలో మమేకం కాలేక దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ తదితర వర్గాల ప్రజలు తాము సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే హైదరాబాద్‌లోని సీమాంధ్రలకు భద్రత ఉండదు, వారిపై దాడులు జరుగుతున్నాయనే కుంటి సాకులు చెబుతున్న సమైక్యవాదులు.. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులు, ప్రజలపై దాడులకు దిగుతుండటం తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సమైక్యవాదం పేరిట అందరూ కలిసి ఉండాలని చెబుతున్న సీమాంధ్ర ప్రాంత నాయకులు.. ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని, ఇదేనా వారు కోరుతున్న సమైక్యవాదమని నిలదీస్తున్నారు.

తెలంగాణ ప్రాంత అధికారిపై ఏపీ ఎన్జీవోల విషం!
సమైక్యాంధ్ర పేరిట నానాయాగీ చేస్తున్న ఏపీ ఎన్జీవోలు కూడా తెలంగాణ ప్రాంత అధికారులపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యోగులను బెదిరిస్తూ.. తిడుతూ అక్కసు ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర అరాచక ఉద్యమకారులకు తామేమీ తీసిపోమనే స్థాయిలో వికృత స్వభావాన్ని ప్రదర్శించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతు నాయక్‌ను కులం పేరుతో దూషించి.. అంతు చూస్తామనే రీతిలో బెదిరింపులకు, దూషణలకు దిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సాక్షాత్తు జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఎదుటే హనుమంత్ నాయక్‌ను ఏపీ ఎన్జీవో ఉద్యోగులు బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. కుల ప్రస్తావన తెచ్చి అవమానించారు. బుధవారం గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. గిరిజన విద్యార్థుల రెసిడెన్షియల్ అడ్మిషన్లను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు జరిగిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యానారాయణ, డీటీడబ్ల్యూవో విజయ్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుమంతునాయక్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు రెసిడెన్షిల్ స్కూల్‌లో అత్యుత్తమ చదువును అందించేందుకు విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు.

ఈ సమయంలో ఏపీఎన్జీవో గుంటూరు పట్ణణ శాఖ అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్‌తోపాటు మరికొందరు ఉద్యోగులు సమావేశ మందిరం వద్దకు వచ్చి లాటరీ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు హనుంత్‌నాయక్ వద్దకు వచ్చిన ఎన్జీవో నేతలు ‘తెలంగాణ వాడివి ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నావ్, ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ అహంకారాన్ని ప్రదర్శించారు. అక్కడే పలువురు ఉన్నతాధికారులు ఉన్నప్పటీకీ ఎన్జీవో నేతలు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి హనుమంత్‌నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని దూషణలకు పాల్పడ్డారు. అధికారులు ఎంత వారించినా వినిపించుకోని వారు.. మరింత రెచ్చిపోయి ‘కులం పేరుతో దూషించారు’. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా పనిచేస్తున్న దయానందరాజు అనే వ్యక్తి వేలెత్తి చూపిస్తూ మరి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై హనుమంత్‌నాయక్ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘నేను జిల్లా స్థాయి అధికారిని. ప్రభుత్వం ఎక్కడ నియమిస్తే.. అక్కడ పనిచేసే అధికారం ఉంది. కానీ ఏపీఎన్జీవో నేతలు నా కులం, ప్రాంతం పేరిట దూషించారు. నా ఆత్మభిమానం దెబ్బతిశారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ ఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలి:
టీ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్
గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రూప్-1 ఆఫీసర్ హనుమంతు నాయక్‌పై ఏపీ ఎన్జీవో నేతలు దుర్భాషాలడటం, కులం పేరుతో దూషించడాన్ని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ ఖండించారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏపీఎన్జీవో నేతలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్రుల ఆధిపత్యం, వారు చేస్తున్న అవమానాలను భరించలేకనే తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హనుమంతు నాయక్‌ను దూషించిన ఏపీ ఎన్జీవో నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇందూరు ఇంజినీర్‌పై వైజాగ్‌లో దాడి
పొట్టకూటికోసం విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇందూరు బిడ్డపై సీమాంవూధులు అమానుషంగా దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో మదమెక్కిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న కొన్ని అసాంఘిక శక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన వివరాలివి.. డిచ్‌పల్లికి చెందిన నవీన్ బీటెక్ పూర్తి చేశాడు. ప్రతిభ ఆధారంగా ఆయన ఆంధ్రాకు చెందిన జేఎంసీ ఇన్‌వూఫాస్ట్రక్చర్ కంపెనీలో ఇంజినీర్ ఉద్యోగం వచ్చింది. 20వేల వేతనంతో కూడిన గౌరవవూపదమైన ఉద్యోగమని కోటి ఆశలతో వారం రోజుల కిందట నవీన్ వైజాగ్‌లోని జేఎంసీలో సైట్ ఇంజినీర్‌గా చేరాడు.

తెలంగాణ ప్రకటన రాగానే వైజాగ్‌లో పనిచేస్తున్న తెలంగాణ యువకులను అక్కడి సమైక్య గూండాలు టార్గెట్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నవీన్ పనిచేస్తున్న చోటుకే వచ్చిన ఆరుగురు ఆంధ్రా యువకులు.. పాశవికంగా అతనిపై దాడిచేశారు. అపస్మారక స్థితికి చేరేవరకు కొట్టారు. అంతటితో ఆగకుండా నవీన్ జేబులో నుంచి రూ. 8వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ను కొట్టేశారు. తీవ్ర గాయాలపాలైన నవీన్ తేరుకొని..తెలిసిన స్నేహితుల సాయంతో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వైజాగ్‌లోని ఇదే కంపెనీలో పనిచేస్తున్న దోమకొండకు చెందిన భూపాల్ రాహుల్ సైతం అక్కడి ఆంధ్ర గూండాల దాష్టీకానికి భయటపడి ఉద్యోగం మానివేసి ఇంటికి చేరుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర సీమాంధ్ర ప్రాంతాల నుంచి బతకడానికి వచ్చిన సెటిలర్లను నిజామాబాద్ జిల్లాలో 60 ఏళ్లుగా నివసిస్తున్నారు. వారిని ఇందూరు బిడ్డలు కూడా ఆదరిస్తున్నారు. అదే తమ పిల్లలు ఉద్యోగాల కోసం సీమాంధ్రకు వెళితే.. బతకలేని దయనీయ పరిస్థితి ఎదురవుతుండటంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాకినాడలో వైద్యాధికారిణిపై పెండతో దాడి
సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల్లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. నిన్న కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి దీక్షా శిబిరం వద్ద అల్లరిమూకలు వేసిన వీరంగం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహిళ అని కూడా చూడకుండా సాక్షాతూ జిల్లా వైద్యాధికారిణిపైనే దాడికి దిగారు మంత్రి అనుచరులు. అంతేకాకుండా బుధవారం రాత్రి కాకినాడ వీధుల్లో వారు అరాచకం సృష్టించారు. వారి దౌర్జన్యంతో దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. దారినపోయేవారిని కూడా మంత్రి అనుచరులు చితకబాదారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గత ఐదురోజులుగా మంత్రి భార్య తోట వాణి సమైక్యాంధ్ర కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు.

బుధవారం వాణి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా వైద్యాధికారి పద్మావతి వచ్చారు. వాణి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే వైద్య సహాయం అందించాలని ఆమె చెప్పారు. అంతే ఆగ్రహించిన మంత్రి అనుచరులు జిల్లా వైద్యాదికారి మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆమె మీద చెత్త, పెండను కుమ్మరించారు. ఈ హఠాత్ దాడితో నివ్వెరపోయిన జిల్లా వైద్యాధికారి పద్మావతి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పోలీసులు అతికష్టం మీద ఆమె రక్షించి అక్కడినుండి తప్పించారు. ఆ తరువాత కూడా మంత్రి అనుచరుల వీరంగం కొనసాగింది. ఒక కుర్చీని రోడ్డు మీదకు విసరగా అటుగా బైక్ మీద వెళ్తున్న ఒక జంటకు గాయాలయ్యాయి. భానుగుడి సెంటర్, పిఠాపురం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులను దిగ్బంధించిన మంత్రి అనుచరులు రోడ్డునపోయే వాహనదారులు, పాదచారుల మీద కూడా దాడికి తెగబడ్డారు. స్థానికంగా ఉన్న సోడా హబ్ షాపు మీదపడి దాన్ని ధ్వంసం చేశారు. సాయం చేయడానికి జిల్లా వైద్యాధికారి వస్తే ఇట్లా అవమానించడం ఏమి సంస్కృతి అని అక్కడున్న పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యమం పేరిట అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారు.
  

2 comments:

  1. the so called united Andhra agitation is like injecting a slow poison there were only mild protests in the region and majority people welcomed it after the CWC decision came out. Enter the media the whole scene was changed they started propogating that people of Andhra will doomed after bifurcation this lead to instill fears in their minds which ultimately lead to this turmoil.

    the only solution to this problem is the need of a leader who can lead the people to a righteous path but unfortunately all political leaders are busy in trying to grab the political vaccum.

    ReplyDelete
  2. media is not for us.Not for democracy.Reduce the timings of news channels.Reduce no.of pages in News papers.Save trees.

    ReplyDelete