తెలంగాణా ఉద్యమంలో తెలుగు తమ్ముళ్ళ పాత్ర ఏమిటి? అని ప్రశ్నించుకుంటే, అది శల్య పాత్రకు ఎక్కువ సైంధవ పాత్రకు తక్కువ అనిపిస్తుంది.
2009లో తెలంగాణా ఏర్పాటుకు సైంధవుడిలా అడ్డు పడ్డాడు చంద్రబాబు. అప్పుడు తెలంగాణాకు చెందినా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడూ నోరు మెదపలేదు. నోరు మెదపడానికి సాహసించిన నాగం లాంటి వారు పార్టీ వీడి పోవాల్సి వచ్చింది.
అదే సమయంలో ఆంధ్రాకు చెందిన ఆ పార్టీ నాయకులు పార్లమెంటులో సమైక్య ప్లకార్డులతో ధర్నా చేశారు. ఇలాంటి ధర్నాలు చంద్రబాబు కనుసన్నలలో జరిగేవి అయినప్పటికీ, వాటిని ప్రశ్నించగల, తెలంగాణా వాణిని వినిపించగల నాయకుడు ఆ పార్టీ తెలంగాణా శిబిరంలో కనిపించ లేదు.
ఆ తర్వాత మరోసారి చంద్రబాబు తెలంగాణాకు అనుగుణంగా ఉత్తరం ఇచ్చాడు అంటే, అందులో తెలంగాణా ప్రాంత నాయకుల వత్తిడి శూన్యమే అని చెప్పొచ్చు. చంద్రబాబు తన పాదయాత్రకు మార్గం సుగమం చేసుకోవడానికి మాత్రమె ఆ ఉత్తరం ఇచ్చాడు తప్ప మరో కారణం లేదు.
కాంగ్రెస్ ఎలాగూ తెలంగాణా ఇవ్వదు, మరోసారి ఆ పార్టీని ఇరుకున పెడదాం అనుకున్న చంద్రబాబుకు మరోసారి కాంగ్రెస్ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీమాంధ్ర నాయకుల చేత రాజీడ్రామాలు, సమైక్య ఉద్యమాలు చేయించడం మొదలు పెట్టాడు.
తెలంగాణాను మోసం చేయడం బాబు నైజం, ఆ ప్రాంతపు నాయకుల నైజం. మరి ఇక్కడ పుట్టి ఈ ప్రాంతపు నీళ్ళు తాగిన నాయకులకు కొంతైనా చీము నెత్తురు లేక పోవడం, బాబును ధిక్కరించె కలేజా లేకపోవడం విస్మయ పరుస్తుంది. అలాంటి నాయకులు రేపు ప్రజలవద్దకు ఎలా వద్దామనుకుంటున్నారో వారే ఆలోచించు కోవాలి.
ప్రజా వ్యతిరేక పంథాలో వెళ్లి 2004లో చావు దెబ్బ తిన్నారు. 2009లో తెరాస తో పొత్తు పెట్టుకొని ఎలాగో ఊళ్లలో తిరగ్గలిగారు. కాని ఈసారి ఇలాగే వుంటే మాత్రం, రాజకీయంగా తమ సమాధి తాము తవ్వుకోన్నట్టే.
ఒకపక్క సీమాంధ్ర ఎంపీలు ధర్నాలు చేసి సస్పెండ్ అవుతున్నారు. చంద్రబాబు మరో సమైక్య యాత్ర మొదలు పెడుతున్నాడు. వాళ్ళందరికీ లేని మొహమాటం మరి వీరికెందుకో. అది మొహమాటం కాదని చేతకాని తనమని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇక మిగిలింది రేపటి ఎన్నికల్లో తేలుస్తారు.
No comments:
Post a Comment