Sunday, August 25, 2013

సమైక్యతకి ఎవరి కావాలి?


జూలై ముప్పైన దిగ్విజయ్ తెలంగాణా ప్రకటన చేయగానే మరోసారి ఆంధ్రాలో దానికి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు కాకున్నా కొన్ని వర్గాలు ఈ ఉద్యమంలో బాగానే పాల్గొంటున్నాయి. అసలు ఈ ఉద్యమం ఏమిటి? దేనికోసం చేస్తున్నారు అన్నదానికి ఎవరివద్దా సరైన సమాధానం లేదు. కాని గత ఇరవై రోజులుగా ప్రతిరోజూ మీడియాలో చూపెడుతున్నది చూసినప్పుడు కనపడేది ఇది. 'మేం సమైక్యత కోసమే ఉద్యమిస్తున్నాం. సమైక్యత తప్ప దేనికి మేం ఒప్పుకోం'. 

అసలు సమైక్యత అంటే ఏమిటి? ఇద్దరు సమైక్యంగా ఉండాలంటే అందులో ఒకరు సమైక్యంగా ఉండాలని అనుకుంటే అది సాధ్య పడుతుందా? ఒకవేళ అలా సాధ్యపడాలంటే సమైక్యత కోరేవాడు ఏం చేయాలి?

ఇవి సమాధానం చెప్పలేని ప్రశ్నలు కావు. వీటికి ఆంధ్రా ప్రాంతపు ప్రజలకు సమాధానాలు తెలియవని కావు. కాని వారు మాట్లాడే మాటలు, చేసే చేతలు చూసినప్పుడు సమాధానాలు తెలియవా అన్న అనుమానం వస్తుంది. వారికి సమాధానాలు తెలుసు. ఒక్క సమైక్యత అన్న పదం తప్ప వారు చేస్తున్న ఉద్యమంలో సమైక్యతా భావాన్ని ప్రతిబింబించేది మరేదీ కానరాదు!

తెలుగు తల్లి వేషధారణ తో పాటు శ్రీకృష్ణ దేవరాయల వేషధారణ వారి ఉద్యమ వైవిధ్యాలలో ఒకటి. కాని విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ దేవరాయలు ప్రస్తుత తెలంగాణా ప్రాంతాన్ని ఎప్పుడూ  పరిపాలించి ఉండక పోవడం! ఆయన ఆంధ్రా ప్రాంతం తోపాటు కన్నడ, తమిళ రాజ్యాలను కూడా పరిపాలించాడు. ఆ రెండు రాష్ట్రాలను కూడా కలిపి సమైక్య దక్షిణ దేశ రాష్ట్రాన్ని (తెలంగాణా కాకుండా) ఏర్పాటు చేయాలని వారి అభిమతమా? కనీసం ఆంద్ర రాష్ట్రాన్ని మొత్తంగా పరిపాలించిన రుద్రమదేవి వేషధారణ చేసినా వారి నినానాదానికి సరైన ప్రతీకగా వుండేది. కాని ఒక తెలంగాణా ప్రాంతానికి చెందినా రాణిని తమ ప్రతీకగా వారు ఒప్పుకోవడమన్నది సందేహాస్పదమే. 

ఇక పొతే సమ్మె ఎవరు చేస్తున్నారన్నది కూడా దగ్గరగా పరిశీలిస్తే, సమ్మె స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు టీవీల్లో కనిపిస్తున్న దాని ప్రకారం సమ్మెలో పాల్గొంటున్నది NGO లు, RTC వర్కర్లు. వీరు కాకుండా స్కూలు పిల్లలు. 

NGO లు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందు తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి జనాభాను మించి అత్యధిక దామాషాలో ఆంధ్రా ఉద్యోగులు ఉన్నవిషయం అందరికీ తెలిసినదే. రాష్ట్రం విడిపోతే అదనపు ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారి భయం. అంతే కాకుండా తెలంగాణలో ఉన్న మిగులు ఆంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతానికి తిరిగి వస్తే, ఆంధ్రా ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వారికి రావలసిన ప్రమోషన్లకు, ఇతర అవకాశాలకు గండి పడుతుందనేది కూడా ఒక కారణం కావచ్చు. వారి ఆందోళనలో అర్థం వుంది, కాని వారు చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ లేదు. వారు నిజంగా తమ హక్కుల కొరకు పోరాడితే తెలంగాణా ప్రాంత NGO లు కూడా వారికి మద్దతు పలుకుతారు. కాని అది వదిలేసి సమైక్యత, హైదరాబాదు అనే నినాదాలు పట్టుకుంటే వారు సాధించేది శూన్యం. 

అలాగే RTC ఉద్యోగులు చేసే సమ్మెకు కూడా ఇటువంటి కారణాలే ఉన్నాయి. ఆ సంస్థకు వచ్చే ఆదాయంలో సింహభాగం తెలంగాణా నుండే వస్తుంది. ఆంద్ర ప్రాంతంలో రైల్వేను, ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తారు, కాబట్టి అక్కడ వచ్చే రెవెన్యూ తక్కువ. కాని విచిత్రంగా ఎక్కువ ఆదాయం వచ్చె తెలంగాణలో తక్కువ బస్ డిపోలు ఉంటాయి. తక్కువ ఆదాయం వచ్చే ఆంధ్రాలో ఎక్కువ డిపోలు ఉంటాయి. ఆంధ్రా లోని అన్ని డిపోలలో ఆంధ్రా కి చెందిన ఉద్యోగులు మాత్రమే ఉంటారు. అదే తెలంగాణలో మాత్రం ప్రతి డిపో లోనూ కనీసం పది నుండి ఇరవై శాతం వరకూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటారు. అదీగాక హైదరాబాదులో వున్న RTC కేంద్ర కార్యాలయంలో ఉన్న వెయ్యి మంది ఉద్యోగులలో ఎనభై శాతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే!

దీన్ని బట్టి ఆంధ్రా ప్రాంత RTC ఉద్యోగులు చేసే సమ్మె లోని హేతుబద్ధత కనిపిస్తుంది. CPI అనుబంధ సంస్థ అయిన ఎంప్లాయిస్ యునియన్ కూడా సమ్మెలో పాల్గొంటుందంటే వారు ఎంతటి భయాందోళన లో ఉన్నారో అర్థమవుతుంది. వీరు నిజంగా సమైక్యతను కొరుతున్నారు. ఎందుకంటే సమైక్యంగా ఉండకపోతే, తెలంగాణా నుండి వచ్చే అదనపు రెవెన్యూ లేకపోతే ఆంధ్రా RTC కి మనుగడ లేదు మరి! కాని గత కాలపు పాపాలకు ఎవరో ఒకరు శిక్ష అనుభవించక తప్పదు మరి. కాని వారు నిజాయితీగా తమకు జరుగబోయే నష్టాలు వివరిస్తూ ఉద్యమిస్తే, ఏదో తగు పరిష్కారం దొరక్క పోదు. కాని నెల విడిచి సాము చేసినట్టు సమైక్యతా ఉద్యమాన్ని తలకెత్తుకుంటే ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిందన్న సామెతగా మారుతుంది. ఆ విషయం వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. 

ఇక పొతే విద్యార్థుల సమ్మె. పిల్లవాడు పుట్టగానే అమెరికా వీసా గురించి ఆలోచించే ఆంధ్రా పౌరులు, తమ పిల్లలను సమ్మె లోనికి దింపుతారంటే ఆశ్చర్యమే! అయితే దీంట్లో ఉన్న అసలు రహస్యం మీడియా మిత్రుల ద్వారా బట్టబయలయింది. స్కూలు పిల్లలకు రోజూ ఒక గంట సమ్మె ఆటవిడుపు ప్రకటించారు. ఆ గంటలో పిల్లలు అందరూ ప్రధాన కూడలికి వచ్చి రోడ్డు మీద నిలబడాలి. పిల్లలను వరుసలలో నిలబెట్టడం, గంట పూర్తికాగానే తిరిగి క్లాసు రూములకి తీసుకెళ్లడం టీచర్ల బాధ్యత. ఆ తర్వాత క్లాసులు యధావిధిగా నడుస్తాయి. ఈ ఉద్యమంలో మీడియా కూడా ప్రధాన పాత్రధారి కావడం వల్ల, ఆ గంటలోనే మీడియా వారు వచ్చి తమ వీడియో ఫూటేజీలను తీసుకొని వెళ్తారు. ఫాషన్ పరేడ్ లను తలపిస్తున్న ఈ సమ్మెల అసలు రహస్యం  కొంచెం జాగ్రత్తగా టీవీలో చూస్తె వెంటనే అర్థమవుతుంది. 

ఆంధ్రా సోదరులారా! ఇలాంటి ఉద్యమాల వలన మీరు సాధించ గలిగేది శూన్యం. చేవ వుంటే మీకు రాబోయే సమస్యలను ధైర్యంగా వివరించి, సరైన రక్షణల కొరకు పోరాడండి. మేం కూడా మీకు మద్దతు పలుకుతాం. కేంద్రంలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిపొయింది. ఇప్పుడు మీరెంత గింజుకున్నా అది మారదు. మిధ్యా సమైక్య నినాదంతో మీరు కాలయాపన చేయడం వాళ్ళ మీ అసలు సమస్యలు బయటికి రాక, వాటికి పరిష్కారాలు కూడా కనుగొన బడవు. దానివల్ల చివరికి నష్ట పోయేది మీరే!

No comments:

Post a Comment