ఒకటి: ఏటా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఉత్సవాలు జరుపుతున్నది. ముఖ్యమంత్రి, ప్రముఖులు ఆ రోజు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన త్యాగనిరతిని కీర్తిస్తుంటారు. సమైక్యరాష్ట్రం అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే సాధ్యమైందని తమ ప్రసంగాల్లో చెప్తుంటారు.
1911లో గుంటూరు పట్టణంలోని ఒక న్యాయస్థానంలో అరవ(తమిళ) వ్యక్తి జడ్జీగా ఉండేవారు. ఆ కోర్టులో ఒక చప్రాసీ (ఆంద్ర్హ భాషలో బంట్రోతు) ఉద్యోగం ఖాళీ ఉంటే తన ప్రాంతీయుడైన అరవ వ్యక్తిని జడ్జీగారు నియమించారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆంధ్ర ప్రాంతీయులు మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేయాలని ఆందోళన ప్రారంభించారు.
1936లో దేశంలో మొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. దీనితో ఉమ్మడి మదరాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు మరింత ప్రోత్సాహం లభించినట్లయింది.
అనంతపురంలో పెట్టాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించారనే కోపం రాయలసీమ ప్రజలకు కోస్తా ప్రాంత ఆంధ్రులపై వున్నందున సీమ ప్రాంతం మదరాసు రాష్ట్రంలోనే వుంటుందని ఆ ప్రాంత నేతలు కోస్తాంధ్రులతో విభేదించారు. వారిని శాంతింప చేయడానికి 16 నవంబర్ 1937న ఇరు ప్రాంతాల పెద్దలు కూర్చొని ‘శ్రీభాగ్’ ఒప్పందం చేసుకున్నారు.
కాగా, 1937లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభ ఆంధ్ర రాష్ట్రానికై సిఫార్సు చేసింది. దీన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించారు. ‘ఆటవిక కోర్కె’గా రాజాజీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ నియమించిన ధార్ కమిటీ (లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమీషన్) భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆమోదం తెలపలేదు.
1948లో ఏర్పాటైన జె.వి.పి (జవహర్‌లాల్, వల్లభ్‌భాయ్ పటేల్, పట్టాభి) కమిటీ మాత్రం దేశంలో కొత్త రాష్ట్రాలు అవసరం లేదంటూనే కేవలం (మదరాసు మినహా) ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 1949 ఏప్రిల్‌లోనే ఆమోదం తెలిపింది. అయితే, దీనికి రాయలసీమ నేతలు అడ్డుపడటంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వెంటనే సాధ్యపడలేదు. మదరాసును తమకే వదిలేయాలని ఆంధ్రులు పట్టుబట్టడంతో ‘‘ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి ఉద్యమం అవసరం లేదని, ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలనే దానికి తాను బద్ధుడనై ఉన్నానని, కానీ మదరాసు సంగతే ముందు తేల్చుకోవాలని’’ నెహ్రూ అన్నారు.
ఇక విషయానికి వస్తే, మదరాసు లేని ఆంధ్రరాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నెహ్రూ ప్రకటించిన తర్వాత పొట్టి శ్రీరాములుకు ఆమరణ దీక్ష అవసరమేమొచ్చింది?
పొట్టి శ్రీరాములు ఎందుకోసం దీక్ష చేపట్టారు?ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని నెహ్రూ ప్రకటించినా సంతృప్తి చెందని కొందరు పెద్దలు మదరాసును ఆంధ్రకు రాజధానిగా చేసుకోవాలనే దుర్బుద్ధితో పొట్టి శ్రీరాములుచేత 19 అక్టోబర్ 1952 నుండి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష చేయించారు. అదీ మదరాసు నగరంలోనే. ఆయన ఏకైక డిమాండ్ ‘మదరాసు’ కోసమే.
పొట్టి శ్రీరాములు ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకున్న నెహ్రూ 1952 డిసెంబర్ 9న మదరాసు లేని ఆంధ్రరాష్ట్రాన్నివ్వడానికి తాము సిద్ధమేనని పార్లమెంట్‌లో మరోసారి స్పష్టం చేసారు. అయినా ఆంధ్ర పెద్ద మనుషులు పొట్టి శ్రీరాములుచే దీక్షను విరమింపజేయలేదు. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకుపోలేదు. ఆయనకు నెత్తురు వాంతులయినా, మాట పడిపోతున్నా పట్టించుకోలేదు. చివరికి కోమాలోకి పోయినా వారికి చీమ కుట్టినట్లయినా కాలేదు. ఆనాటి మదరాసు రాష్ట్ర కమ్యూనిస్టు లెజిస్లేచర్ పార్టీ నాయకులు తరిమెల నాగిడ్డి కూడా దీక్ష విరమించాలని పొట్టి శ్రీరాములును కోరినారు. మదరాసు లేకుండానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే చాలునన్నారు. ఎవరిమాటను శ్రీరాములు చుట్టూ వున్న పెద్దలు విన్పించుకోలేదు. అంతా కలిసి శ్రీరాములు చావు కోసం ఎదిరి చూసారే గానీ ఆయనను బతికించుకునే ఏ ప్రయత్నమూ చేయలేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే, మదరాసు కావాలనే మొండి వాదనతో, పంతానికి పోయి పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆంధ్ర నేతలది. 1952 డిసెంబర్ 15 నాటి రాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. అయినా మదరాసు ఆంధ్రకు దక్కలేదు. ఆయన అమరత్వం వల్ల ఆంధ్రులకు ఏ ప్రయోజనమూ కలగలేదు. నిష్ఫల త్యాగమే పొట్టి శ్రీరాములు చేసింది. ఆయన దీక్ష చేయకున్నా, మధ్యలో వదిలేసినా ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఉండేదే (నెహ్రూ మాటల్లోనే అది స్పష్టమైంది). ఇప్పుడేమో సమైక్య రాష్ట్రం పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమని ఆంధ్ర నేతలు, పాలకులు చరివూతను వక్రీకరిస్తున్నారు.
పొట్టి శ్రీరాములుకు తెలంగాణకు ఏమిటి సంబంధం?
తమకేమీ కాని పొట్టి శ్రీరాములు పట్ల తెలంగాణ ప్రజలకేవిధమైన వ్యతిరేకతా లేదు. ఆయనంటే జాలి, సానుభూతి తప్ప. చిత్రమేమిటంటే, తెలంగాణకేమి చేసారని ఆయన విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం? అసలు నవంబర్ ఒకటికి
పొట్టి శ్రీరాములుకు ఏమిటి సంబంధం? పొట్టి శ్రీరాములు మరణానంతరం కనీ వినీ ఎరుగనంతటి విధ్వంసాన్ని ఆంధ్రనేతలు సృష్టించినా వారికి మదరాసును రాజధానిగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మదరాసు లేకుండానే కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ ఒకటిన ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఏ పార్టీకి చెందని ప్రకాశం పంతులు బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బులేని ఆర్థిక దుస్థితి. వందేళ్ళ క్రితం నిర్మించిన ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలు శిథిలమై ఉండటం, వీటి పునర్నిర్మాణానికీ డబ్బుల్లేకపోవడం... ఏం చేయాలో అర్థం కాని గడ్డు పరిస్థితి!
తెలంగాణను కబ్జా చేయడానికి ‘విశాలాంధ్ర’ నినాదం
ఆంధ్రలో ఆనాటికే అమల్లో వున్న మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేయాలని రామ్మూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను ప్రకాశం పంతులు అంగీకరించలేదు. దీనితో పాలకులలో విభేదాలు మొదలై ప్రభుత్వం రద్దయి రాష్ట్రపతి పాలన ఏర్పడింది. రెండు నెలల తర్వాత బెజవాడ గోపాలడ్డి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవడ్డి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. కర్నూలులో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవు. గుడారాల కింద ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసారు. అప్పటికే అన్ని హంగులతో దేశంలోనే ఐదవ పెద్ద పట్టణంగా ఉన్న హైదరాబాద్‌పై ఆంధ్ర పాలకుల కన్ను పడింది.
హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాల సర్కారు భూమి ఉన్నది. పాకిస్తాన్ పారిపోయిన కాందిశీకుల భూములున్నవి. తెలంగాణ నుండే ప్రవహించే కృష్ణా, గోదావరి నదులున్నయి. రాజధానికి సరిపోయే విశాలమైన భవనాలున్నాయి. అప్పటికే హైదరాబాద్ సర్కారు వద్ద మిగులు బడ్జెట్ ఉన్నది. తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలు ఉన్నవి. పెద్ద పరిక్షిశమలున్నవి. వీటిపై కన్నేసిన ఆంధ్ర నేతలు తెలంగాణను కబ్జా చేయడానికి తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలంటూ ‘విశాలాంధ్ర’ నినాదం ముందుకు తెచ్చారు . తమ అవసరం కోసం కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమం నిర్వహించారు.
తెలంగాణ ప్రాంత చారిత్రక నేపథ్యం
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. 224 ఏళ్ళు నిజాం నవాబుల పాలన కొనసాగింది. తెలంగాణలోని 8 జిల్లాలు, మరట్వాడాలోని 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలోని 3 జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి.
1948 సెప్టెంబర్ 12న స్వంతంత్ర దేశమైన హైదరాబాద్ సంస్థానం పైకి భారత ప్రభుత్వం తన సైన్యాన్ని పంపి, 17న విలీనం చేసుకున్నది. ఆ తర్వాత జనరల్ చౌదరి నేతృత్వంలో మిలిటరీ పాలన కొనసాగింది.
1949లో సివిల్ సర్వీసెస్‌కు చెందిన వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952లో ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలనే కుట్రలు ‘విశాలాంధ్ర’ నినాదం రూపంలో మొదలయ్యాయి. తెలంగాణ ప్రజలు ఆంధ్రతో విలీనానికి అంగీకరించలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం నెహ్రూకు ఇష్టం లేదు. ఆయన అభిప్రాయం ఇలా ఉండింది: ‘‘విశాలాంధ్ర డిమాండ్ కళంకిత సామ్రాజ్యవాదానికి సంబంధించింది. ఖచ్చితంగా సామ్రాజ్యవాదమని కాదు, దాని వెనుక గల ప్రియమైన మనఃప్రవృత్తికి చెందింది అది.’’ (సెపూక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ, 6వ సంపుటం: పేజీ, పేరా 68)తెలంగాణ ప్రాంతంలోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ‘విశాలాంధ్ర’ నినాదాన్ని వ్యతిరేకించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్.ఆర్.సి) ఇరు ప్రాంతాల వాదనలు విన్నది. చివరికి తమ నివేదికలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే 1961 దాకా కొనసాగించాలని, అప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో గెల్చిన శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయాలని తీర్మానిస్తే అప్పుడు సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని ఎస్.ఆర్.సి. స్పష్టంచేసింది.
పెద్ద మనుషుల ఒప్పందం-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎస్.ఆర్.సి. పై ఆశలు పెట్టుకున్న సీమాంధ్ర నేతలకు తెలంగాణ విడిగా ఉండాలన్న సిఫారసు మింగుడు పడలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. నెహ్రూ చుట్టూ ఉన్న జాతీయ నేతల్లో కొందరిని డబ్బుతో కొన్నారు. మరి కొందరితో స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి తమకున్న సాన్నిహిత్యాన్ని వాడుకున్నరు. తెలంగాణ విడిగా ఉంటే ప్రమాదమని కొత్త వాదనలు ముందుకు తెచ్చారు. 1948 సెప్టెంబర్ 13న ఐక్యరాజ్యసమితిలో అప్పటి హైదరాబాద్ ప్రధాని ‘లాయక్ అలీ’ ప్రభుత్వం తరఫున ఒక పిటిషన్‌ను దాఖలు చేయించాడు. భారతదేశం తమ హైదరాబాద్ రాజ్యంపై దురాక్రమణ చేసిందని, హైదరాబాద్ సంస్థానాన్ని స్వంతంత్ర దేశంగానే కొనసాగనివ్వాలని, భారత దురాక్రమణను నివారించాలన్నది ఆ పిటీషన్ సారాంశం.
1956 నాటికి కూడా ఆ పిటీషన్ ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్నది. 1978లో ఆ పిటీషన్ కొట్టివేయబడింది. హైదరాబాద్‌తో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగిస్తే ఎప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని ఒక స్వతంత్ర దేశపు హోదా తెలంగాణకిచ్చే ప్రమాదం పొంచి వుంటుందని అనుమానాలు రేకెత్తించారు. ఏ పాచిక పారిందో ఏమో చివరికి కేంద్ర ప్రభుత్వం ఎస్.ఆర్.సి.సిఫార్సులను పక్కన పెట్టి సమైక్య రాష్ట్ర ఏర్పాటుకు మొగ్గు చూపింది. తెలంగాణ కోరుతున్న నేతలను (బూర్గుల, కె.వి.రంగాడ్డి, చెన్నాడ్డి) ఢిల్లీ పిలిచి ఒత్తిడి పెంచింది. ఇరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది నేతలతో ఒక ‘పెద్ద మనుషుల ఒప్పందం’ పై 20 ఫిబ్రవరి 1956న సంతకాలు పెట్టించింది కాంగ్రెస్ అధిష్టానం.
నిధులు, వనరులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, మంత్రివర్గ హోదాలు, వ్యవసాయం తదితర అంశాలతో ఉన్న ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు అనేక హక్కులు కల్పించబడినాయి. ఈ హక్కుల అమలుకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.
ఈ ఒప్పందం, హామీల వల్ల తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలుగలేదు. ఇటువంటి హామీల వల్ల, ప్రాంతీయ సంఘాల వల్ల తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చడం సాధ్యం కాదని ఫజల్ అలీ కమీషన్ (ఎస్.ఆర్.సి) తన నివేదికలోనే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని 21 ఏప్రిల్ 1954న ‘ఆంధ్ర పత్రిక’ కూడా ఇలా స్పష్టం చేసింది: ‘‘హామీలివ్వ గలవారు, ఇచ్చిన హామీలను చెల్లింప శక్తి గలవారు తెలంగాణ వారు మాత్రమే కాని ఆంధ్రరాష్ట్ర నాయకులు ఎన్నటికీ కారు. తెలంగాణ వారి ఆహ్వానం, ఆదరణ లేకుండా, వారి ఒడంబడికల ద్వారా సాధించగలమని భావించే వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. మన ప్రవర్తన ముఖ్యం కాని, ప్రకటనలు కావు.’’
ఏక పక్షంగా, ఆంధ్రనేతల ఒత్తిళ్ళకు లొంగి నెహ్రూ తనకే మాత్రం ఇష్టం లేకున్నా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ను 1 నవంబర్ 1956న ఏర్పాటు చేసారు. అదీ జరిగిన అసలు కథ.
అదే రోజు హైదరాబాద్‌లో కొత్త రాష్ట్రాన్ని ప్రారంభిస్తూ నెహ్రూ ఇలా వ్యాఖ్యానించారు: ‘‘ఈ రోజు నుంచి ఆంధ్రులకు తెలంగాణ వారితో వ్యవహరించే పద్ధతికి పరీక్ష ప్రారంభమైంది. ఒకవేళ తెలంగాణ వారిని గనుక వారు నిరాదరణకు గురిచేస్తే, తిరిగి వారికి వేరుపడే హక్కు ఉంది.’’ (దక్కన్ క్రానికల్, 2-11-1956)
ఈ మాటలు అక్షరసత్యాలే అయ్యాయి. తెలంగాణను నిరాదరణకు గురిచేయడమే కాదు, సమైక్య రాష్ట్రంలో ఉన్న ఖర్మానికి తెలంగాణ ప్రజలు తమ సొంత గడ్డపైనే రెండవ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఏ హామీ అమలు కాలేదు. ఆ హామీల అమలు కోసం ఏర్పడ్డ ప్రాంతీయ సంఘమూ రద్దయింది. గత యాభై ఏళ్ళుగా తెలంగాణలో చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల ఫలితంగా చేసిన రాజ్యాంగ సవరణలు, కల్పించిన రక్షణలు, విడుదలైన జీవోలు, ఆదేశాలు ఏవీ కూడా అమల్లోకి రాలేదు. 55 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో 49 ఏళ్ళు సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు పాలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రులైన వారంతా కలిసి పాలించింది కేవలం ఆరేళ్ళే. పి.వి, అంజయ్య, చెన్నాడ్డి.. వీరిలో ఏ ఒక్కరినీ రెండేళ్ళయినా పదవిలో ఉండనివ్వలేదు.
షరతుల ఉల్లంఘనసమైక్య రాష్ట్రంలో సీమాంధ్రుల దోపిడీకి అడ్డూ అదుపూ లేదు. వనరుల దోపిడీ నిరాటంకంగా నేటికీ (ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నా) జరుగుతూనే ఉన్నది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మంట గలిసింది. ప్రతి రంగంలో తెలంగాణ బిడ్డలు ఆంధ్రుల వల్ల నిత్యం అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణా భాషా, సంస్కృతి, సంప్రదాయాలు ఆంధ్రులచే అవహేళన చేయబడుతున్నవి. ఈ అవమానాలు, అవహేళనలు, అహంభావపు మాటలను తట్టుకోలేక వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని కన్న తల్లిదంవూడులకు, తెలంగాణ వాదులకు శోకాన్ని కలిగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది ఒక షరతులతో కూడిన ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఒప్పందంలోని ఏ ఒక్క షరతు అమలు కాకున్నా చట్టరీత్యా ఆ ఒప్పందం చెల్లదు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అన్ని షరతులూ ఉల్లంఘించబడినపుడు ఇక ఈ రాష్ట్రం ఎలా కొనసాగుతుంది? ఒప్పందానికి ముందున్న స్థితిని తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలకు కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.
అందుకే 55 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యమాలు సాగిస్తున్నరు. 1969లో 369 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. చరిత్రలో అంతటి గొప్ప ఉద్యమం లేదు. ఇప్పటి సకలజనుల సమ్మె ఈ ఉద్యమాలకు పరాకాష్ట. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఇంతటి ఐక్యత మున్నెన్నడూ కానరాలేదు. అంతటి చారిత్రక ఉద్యమ సందర్భంలో మనం ఉన్నం.
భిన్న దృశ్యాలు అందుకే...
సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నేతలు, సంపన్నులు తెలంగాణను నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నరు. తెలంగాణ ప్రజలు ఆంధ్రులచే అడుగడుగునా మోసగింపబడి ఆకలి చావులతో, ఆత్మహత్యలతో తమ జీవితాలను అంతం చేసుకుంటున్నరు. లక్షలాదిగా సుదూర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయి అనేక కష్టాలు పడుతున్నరు. ఈ గోసకంతా కారణం సమైక్య రాష్ట్రమే. సకల వనరులున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వుంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా విరాజిల్లుతుంది.