బ్రహ్మయ్య గారూ, మీరు మీ వ్యాసం ('సామాన్యుల మాట ఏం టి?' ఆంద్ర జ్యోతి ఏప్రిల్ 26)లో సామాన్యులమీద జాలి చూపించి, మొసలి కన్నీరు కార్చారు. గణాంకాలతో పాటు మీరు ప్రస్తావించిన అన్ని విషయాలు ఎంత సత్యదూరాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని ఒక్క వారం రోజులు ప్రత్యక్షంగా పరిశీలిస్తే, మీరు వాస్తవాలను ఎంత వక్రీకరించారో, ఉద్యమాన్ని ఎంత చులకన చేసి చూపదలుచుకున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి మీ వ్యాసానికి బదులివ్వడం అనవసరం.
ఎవ్వరు చెప్పకుండానే ఒక సామాన్య పాఠకుడు కూడా మీరు చెప్పినవన్నీ అసత్యాలేనని చెప్పగలడు. ఎవరూ మీ వక్రీకరణను ఖండించక పోతే, కొన్ని రోజులకు మీ అసత్య ప్రచారాలనే నిజాలనుకునే ప్రమాదముంది. అటువంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ ప్రతిస్పందన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2011 జనాభా లెక్కల్లో హైదరాబాద్ జనాభా ఎంతో మీకు తెలియదు అనుకోవడం కష్టం. కాబట్టి కావాలనే తప్పుడు లెక్కలు చూపించారని అనుకొనేందుకు అవకాశం ఉంది.
మొత్తం హైదరాబాద్ జిల్లా జనాభా 40,10,238. అలాగే రంగారెడ్డి జిల్లా జనాభా 52,96,386 (రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, కాప్రా, అల్వాల్, ఉప్పల్, ఎల్‌బి నగర్, రాజేంద్రనగర్ లాంటి మునిసిపాలిటీలను కలుపుకొనే ఈ సంఖ్య). హైదరాబాద్ జిల్లాను చాలా విస్తరించి గ్రేటర్‌హైదరాబాద్‌గా చెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని కలిపితే హైదరాబాద్ జనాభా 70-75 లక్షలకు మించదు. హైదరాబాద్ పాత సిటీలో కనీసం వెయ్యిమంది కూడా సీమాంధ్రులు ఉండరు. అక్కడ నూటికి నూరుశాతం తెలంగాణ ముస్లింలు, హిందువులే ఉన్నారు.
అలాగే ఎల్‌బి నగర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్ మొదలైన ప్రాంతాల్లో కొంత శాతం మంది కూలీలు, మధ్యతరగతి సీమాంధ్రులూ ఉన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి గత ఇరవై, ముప్పై ఏళ్లుగా తెలంగాణ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున వలస వచ్చిన వ్యవసాయ కూలీలు లక్ష ల సంఖ్యలో ఉన్నారు. వీరు జగద్గిరిగుట్ట, బోరబండ, అడ్డగుట్ట, కుత్బు ల్లాపూర్, ఇంకా నగరంలో విస్తృతంగా ఉన్నటువంటి మురికివాడలలో నివశిస్తున్నారు. హైదరాబాద్ నగర పూర్వీకులు పాతనగరంతో పాటు కవాడి గూడ, నారాయణ గూడ, హియాయత్ నగర్ లాంటి కాలనీల్లో నివశిస్తున్నారు. వీరిలో మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ.
బ్రహ్మయ్యగారు చెప్పిన సామాన్యులు కాని సీమాంధ్రులు 1000, 1500, 2000 చదరపు గజాలలో విశాలమైన భవంతులు కట్టుకున్నవారు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాలలో చాలామందే ఉన్నా రు. ఈ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఉండే మొత్తం సీమాంధ్రుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు మించదు. కానీ మీ వ్యాసాల్లో సీమాంధ్రులు 40 లక్షల వరకు ఉన్నట్టు లెక్కలు చెప్పారు.
ఈ కాకి లెక్కల సంఖ్య ఎందుకు చెప్పారో మీకే తెలియాలి. అంటే హైదరాబాద్ నగరంలో 70-75 లక్షల జనాభా ఉంటే వారిలో 40 లక్షల మంది సీమాంధ్రులేనా? లేక హైదరాబాద్‌లో తెలంగాణ వారు మైనార్టీ సంఖ్యలో ఉన్నారని చెప్పే ప్రయత్నమా? ఎవరైనా వాస్తవ గణాంకాలను పరిశీలించి దానికి అనుగుణంగా ఏమైనా చెబుతారు. కాని మీరు మాత్రం మీరు చెప్పదల్చుకున్న దానికి అనుగుణం గా గణాంకాలను మార్చారు. ఇది సీమాంధ్రుల తరహా పద్ధతే అనుకోండి.
మీరు చెప్పిన 40 లక్షల సీమాంధ్రుల లెక్క ఐటి., ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్లలో పనిచేసే అత్యధిక సీమాంధ్రులను చూసి చెప్పారేమో! అధిక ధనవంతులు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ సీమాంధ్రులే కదా? అంతే కాదు, హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, సికిందరాబాద్ పార్లమెంట్ స్థానా లు పూర్తిగాను, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో కొంత భాగం ఉన్నాయి. అదే ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నగరాల్లో సుమారు కోటి జనాభా ఉన్నచోట ఒకొక్క దగ్గర 6 లేదా 7 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ రకంగా చూసినా మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పే కదా.
మీరు మీ వ్యాసంలో ఒక దగ్గర సామాన్యుల మీద దాడులు జరిగాయని చెప్పారు. మరో దగ్గర భౌతిక దాడి కాదు మానసిక దాడి అన్నారు. ఏ సామాన్యుడి మీద దాడి జరిగిందో చెబితే బాగుండును. తెలంగాణ ఉద్యమం ప్రజల్లో లేదు అని పరాకాష్ఠ (బాయిలింగ్) స్థాయికి చేరుకున్నది అనేది మీడియా ద్వారా తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రచారమని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో మీడియా అంతా సీమాంధ్రులదేనని చెప్పారు. మరి సీమ్రాంధ్ర మీడియా తెలంగాణను సమర్థిస్తుందా? వాళ్లు ఎంతో తక్కువ చేసి చూపెడుతున్నారు.
అయినా మీరు ఇంత ఉలిక్కి పడుతున్నారు అంటేనే ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో మీరే చెప్పకనే చెప్పారు. అయినా ఒక వారం రోజులు తెలంగాణలో ఎక్కడ తిరిగినా, ఎవ్వరిని పలకరించినా తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో కండ్లు మూసుకొని చూసే వాళ్ళకు, చెవులు మూసుకొని వినేవాళ్ళకు తప్ప ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ ఉద్యమ నాయకులు పదే పదే చెబుతున్నారు- 'మా ఉద్యమం పొట్ట కొట్టే వాళ్ళకు వ్యతిరేకంగానే కానీ పొట్ట చేత పట్టుకొని వచ్చినవాళ్ళకు వ్యతిరేకం కాదని'.
అయినా మీరు ఇలాంటి అబద్ధాలను మీకు చేతనైనంత స్థాయిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పిన ఆ అసామాన్య సీమాంధ్రులకు ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయే, ఎలా వచ్చాయో,హైదరాబాద్‌కి మొదటగా వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చెబితే ఇంకా బాగుండేది. రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలో చెప్పుకొచ్చారు. కాని రాజ్యాంగంలోని అధికరణ 3-ఎ లో రాష్ట్ర విభజనలు జరిగితే ఎలా జరగాలో స్పష్టంగా చెప్పారు.
అంతే కాదు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు 38 కోట్లు ఉన్న దేశ జనాభా 120 కోట్లకు చేరుకున్నప్పుడు రాష్ట్ర విభజన ఎంత అవసరమో డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ప్రత్యేక తెలంగాణను మొండిగా వ్యతిరేకించే క్రమంలో కనీసం అంబేద్కర్ లాంటి మహనీయుడిని అవమానం చేసే ప్రయత్నం చేయకండి.
మాజీ ఎంపి; టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు
(Andhra Jyothi Friday, April 29th, 2011 Editorial page)