Thursday, November 1, 2012

సీమాంధ్ర బ్రాహ్మణులారా, మేల్కోండి


తాజాగా విడుదలైన మంచు విష్ణు సినిమా, దానిలో బ్రాహ్మణ కులాన్ని కించ పరచిన విధానం, దరిమిలా బ్రాహ్మణులపై మోహన్ బాబు గూండాలచే జరపబడిన దాడి, అవి కేవలం యాధృచ్చికమైన విషయాలు కావు.

ఈ సమైక్యరాష్ట్రం సీమాంధ్రకు చెందిన రెండు అగ్ర కులాల వారికి ఆడ్డాగా మారింది. అధికారాన్ని, ప్రాంతీయ, కుల తత్త్వాలను, ధనాన్ని జోడించి ఈ వర్గాలు మరింత బలంగా వేళ్ళూను కుంటున్నాయి. వీరికి కాంట్రాక్టులు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు రావు. వీరు పదవులు, ప్రమోషన్లు ఇవ్వడానికి రూల్సు అడ్డు రావు. వీరి అడ్డగోలు సినిమాలకి సెన్సార్లు అడ్డురావు. పైగా ఇదేమని అడిగిన వాడికి లాఠీ దెబ్బలతో వీపు వాచి పోతుంది.

ఇక్కడ వీరి రాతే చట్టం, వీరు చేసేదే ఆలోచన, వీరి మాటే వేదవాక్కు. దశాబ్దాలుగా అధికారం కొందరి చేతుల్లో కెంద్రీకరింప బడడం వల్ల జరిగిన పర్యవసానం ఇది.

ఇంత పెద్ద రాష్ట్రంలో వీరు తప్ప ఇతర బలహీన వర్గాలు ఎన్నటికైనా అధికారంలోకి రావడమనేది కలలోని మాట. ఇక్కడ బలహీన వర్గాలంటే మరికొంత ఎక్కువ వివరించాలి. పైన చెప్పిన సీమాంధ్ర ఆధిక్య వర్గాలతో పోల్చినప్పుడు, తెలంగాణా అగ్రకులాల వారిని, బ్రాహ్మణులు మొదలైన ఇతర అగ్ర కులాల వారిని కూడా బలహీన వర్గాలు గానే పరిగణించాలి. ఎందుకంటే ఈ 'ప్రత్యేక ఆధిక్య వర్గాలతో' పోటీ పడి మిగతా వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరు.రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాలుగా కేవలం రెండు కులాల పరిపాలనలోనే ఉండడమే అందుకు నిదర్శనం.

తెలంగాణా ఉద్యమం జరుగుతున్నది కూడా ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల పైనే అని గుర్తించాలి. ఆ విషయం మొదటినుండి తెలంగాణా వాదులు చెప్తూనే వస్తున్నారు. రాష్ట్ర విభజన మాత్రమే వీరి అధికారానికి గండి కొట్టగలదని తెలంగాణా వాదులు భావించారు. తెలంగాణా వాదాన్ని బలంగా అడ్డుకుంటున్నది కూడా ఈ ఆధిపత్య వర్గాలే అన్న విషయం కూడా గుర్తించ వలసి ఉన్నది.

ఇక విషయానికి వస్తే, ఈ ఆధిపత్య వర్గాలు తమకు లభిచిన ఆధిక్యతతో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించడం మొదలు పెట్టాయి. తాము ఏది చెప్పితే, అదే చట్టం, తాము ఏది చేస్తే అదే న్యాయం అన్న ధోరణి అవలంబించ సాగాయి. చుండూరు, కారంచేడులలో మానవ హననాలైనా, ప్రజలకు ఇష్టంలేని యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకుని తెలంగాణా వీరు చేస్తున్న వీరంగాలైనా ఈ కోవలోకే వస్తాయి.

ఇప్పుడు తాజాగా వచ్చిన బ్రాహ్మణ వివాదం కూడా కొత్తదేమీ కాదు. ఈ వర్గాల వారు చేసే సాంస్కృతిక దాడులలో ఇది ఒకటి. బలహీన వర్గాలను, తెలంగాణా వారిని, బ్రాహ్మణులను వీరి సినిమాలలో నవ్వులాట వస్తువులుగా మార్చుకోవడం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మంత్రాలకు బదులు బ్రాహ్మణులు బూతులు చెప్పినట్టు చూపిస్తారు. సీమాంధ్ర కళాకారులతో కృతకమైన తెలంగాణా భాష మాట్లాడిస్తూ ఇదే తెలంగాణా సంస్కృతి అని భ్రమింప జేస్తూ కామెడీ చేయిస్తారు. కమెడియన్లు ఎప్పుడూ బ్రహ్మణులో, లేదా నిమ్న కులాల వారో మాత్రమే ఉంటారు. ఇక తెలంగాణాకు చెందినా బీసీలే వారి సినిమాలలో రౌడీ షీటర్లు, నిజాలు ఎలా వున్నా.

ఈ ప్రత్యేక ఆధిక్య వర్గాల వల్ల ప్రస్తుతం తెలంగాణా ప్రజలు ఎక్కువ నష్ట పోతున్నప్పటికీ, వీరిని ఇలాగే వదిలేస్తే రేపు సీమాంధ్ర లోని మిగతా వర్గాలను కూడా అదే పద్ధతిన కబలించ గలరనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఎవరో పెద్దాయన చెప్పినట్టు, దాడి చేయబడ్డది పోరుగువాడి పైనే అని ఉపేక్షిస్తే, రేపు ఆ దాడి మనమీదే కావొచ్చు. అందుకే, సీమాంధ్ర పాలిత వర్గాలు త్వరగా మేల్కొవాల్సిన అవసరం వుంది.


ఇప్పటికే సీమాంధ్రకు చెందిన ST, SC, BC లు రాష్ట్ర విభజనకు బహిరంగ మద్దతు ఇస్తున్నారు. మిగతా అగ్రవర్గాలు, బ్రాహ్మణులు కూడా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే, దోపిడీ శక్తులకు ఊతం కల్పించిన వారే అవుతారు. ఈ దాడి మంచు మోహాన్ బాబు బ్రాహ్మణులపై చేసిన దాడి కాదు, ఆంధ్రప్రదేశ్ పాలక వర్గాలు పాలితులపై చేసిన దాడి.

1 comment:

  1. http://kvsv.wordpress.com/2012/11/01/%E0%B0%AE%E0%B0%A6%E0%B0%AE%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/

    ReplyDelete