Sunday, December 8, 2013

తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ స్వార్థం?

సమైక్యవాద దోపిడీ శక్తులు మరొక్క సారి తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ముప్పేట దాడిని మొదలు పెట్టాయి. ఆ దోపిడీ భూతానికి గల మూడుచతుర్ముఖాలు చంద్రబాబు, జగన్, కిరణ్ రెడ్డి మరియు జయప్రకాశ్ నారాయణ్. దాని చేతిలో వున్నా ముళ్ళగద సీమాంధ్ర మీడియా. దానికి గల చోదక శక్తి సీమాంధ్ర పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్ల నల్ల ధనం.

వీరందరూ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏమంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి మాత్రమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొడుతుంది అని.

కాంగ్రెస్ ఇంతవరకు వారి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. బహుశా రాహులే అనుకుందాం. ఏ పార్టీ అయినా తన అభ్యర్థి ప్రధానో, ముఖ్యమంత్రో కాకూడదని ఎందుకు అనుకుంటుంది? ప్రజాస్వామ్య మూల సూత్రం అదే కదా?
అధికారం లోనికి రావాలంటే ప్రజోపయోగమైన పనులు చేయాలి. అవి చేస్తేనే వోట్లు పడతాయి. వోట్లు పడితేనే అధికారం లోనికి వస్తారు ఎవరైనా. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.

చంద్రబాబుకు , జగన్ కు ఆ విషయం తెలియదా? జగన్ సంగతేమో కాని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ అధికారానికి అర్రులు చాచే కదా 2008లో తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రణబ్ కి లేఖ పంపింది? కాని చివరి నిముషంలో (తెలంగాణలో ఎన్నికలు అయ్యాక) 'వీసా సిద్ధాంతం' బయటికి తెచ్చి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నెత్తిమీద నీళ్ళు కుమ్మరించాడు, అది వేరే సంగతి.

జగన్ మాత్రం ఈ విషయంలో ఏం తక్కువ తిన్నాడు? ప్లీనరీలో తెలంగాణా ఉద్యమం మీద సానుభూతి ప్రకటించ లేదా? ఆర్టికల్ మూడు అనుసరించి రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇవ్వలేదా? ఇవన్నీ వోట్లకోసం కాదా? ఒక వేళ వోట్లకోసం కాకుంటే అందులో న్యాయం వుండడం వల్ల అయ్యుండాలి. అది వోట్ల కొసమైతే అదే పని కాంగ్రెస్ చేస్తే తప్పేమిటి? అలా కాక తెదేపా, వైకాపా ఆయా సమయాలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు హేతుబద్ధమైనవే అయినట్టయితే మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పేమిటి? ఇవి వారివద్ద సమాధానం దొరకని ప్రశ్నలు.

జగన్ అయినా, చంద్రబాబు అయినా తమ కుహనా తెలంగాణా అనుకూల వాదంతో ఆ ప్రాంత ప్రజలను మోసం చేయాలనున్నరన్నది ఇప్పుడు బయట పడ్డ వాస్తవం! వారికి ఏ సమయంలోనూ రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచన లేదు. తెలంగాణా ప్రజలను మోసం చేసి ఎలా వోట్లు దండుకుందామన్న ఆలోచన తప్ప!

ఈ మోసగాళ్ళకు గుణపాఠం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్భజన నిర్ణయం తీసుకుంది! తాము తీసుకోలేక పొతే బిజెపి ఎలాగైనా తెలంగాణా ఇస్తామంటుంది. ఆ క్రెడిట్ దానికి దక్క కుండా చేయడం కూడా కారణం కావచ్చు. కారణాలు ఏవైనా ఈ కుట్రబాజీ నాయకులకు సోనియాని గాని, కాంగ్రెస్ ను గాని విమర్శించే అర్హత లేదు!

తెలంగాణాను ఇవ్వడం ద్వారా 25 సీట్ల ఆంధ్రాను కాదని 19 సీట్ల తెలంగాణాను ఎంచుకోవడం వల్ల కాంగ్రెస్ పెద్ద రిస్కే చేసింది. నిజానికి ఇన్ని రోజులు, సమైక్య వాదులు చెపుతున్న వోట్లు, సీట్లు చూసే తెలంగాణా వాదంలో ఎంత నిజాయితీ వున్నా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెనుకాడింది. ఎప్పుడైతే తెలంగాణా వాదంపై సానుభూతి ప్రకటించిన లంచగొండి జగన్ ను ఆంద్ర ప్రాంత ప్రజలు గెలిపిస్తూ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేశారో, అప్పుడే తెలంగాణా ఏర్పాటుకు బీజం పడింది. అది ఆంధ్ర ప్రజలు చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధం! అప్పుడే సమైక్యవాదంపై ఆంధ్ర ప్రజలకి ఎంత నిబద్ధత వుందో అధిష్టానానికి అర్థమైంది!

తెలంగాణను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి స్వార్థం ఉంటే ఉండవచ్చు, ఆ స్వార్థం మిగతా పార్టీలకి ఉన్న లాంటిదే తప్ప వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని స్వార్థంతో ప్రకటించినా, మరోలా ప్రకటించినా, అది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందే తప్ప వేరు కాదు.

Tuesday, December 3, 2013

హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా?

శ్యామలీయం గారి బ్లాగు పోస్టుకు నా సమాధానం :)



వ. ఓ సీమాంధ్రప్రజలారా,

మీరిక హైదరాబాదును గూర్చి విచారించి ప్రయోజనము గలదా?

మన మందరము తెలుగువారము, అయినను మీరు మమ్ము చిన్న చూపు జూసి తెగనాడితిరి. మా భూముల, ఉద్యోగాల, నీళ్ళను కాజెసితిరి. మీరు మా సోదరులు, యీ రాజధాని మన తెలుగువా రందరిది యని నేటి వరకు భావించి మోసపోతిమి గదా! మించినది లేదు, ఇపుడైనను మీరు స్వార్థ చింతనను వీడి ఆంధ్ర రాష్ట్రమును అభివృద్ధి చేసికొనుట యుత్తమము గదా!

సీ. రాజభోగములకే రాజధాని యటంచు
     భావించు కొనుటయే తమరి తప్పు
ఆంధ్రదే యూరని యతినమ్మకంబున
     పీల్చివేయగ జూడ పెద్దతప్పు
ఇటురమ్ము యనగనే నీ‌ భాగ్యనగరమ్ము
      మన దను భ్రాంతితో మనుట తప్పు
ఇచట చేరిన వార లెల్లరి వలెకాక
     కబ్జాల కొడిగట్ట గాంచ తప్పు

తే.ఇన్ని తప్పులు చేయుట యెందువలన
ఇన్ని నిందలు మోయుట యెందువలన
ఇన్ని నాళులు తెలియలే దెందువలన
అసలు తెలగాణ్యు లుదారు లందువలన!

సీ. మన యైకమత్యంబు మహనీయ మనిచెప్పి
     మా  నోళ్ళలో మీరు మన్ను గొట్టి
మా యతి నమ్మక మను బలహీనత
     మా భూములను దోచి మహలు గట్టి
దుర్భుద్ధితో యూరు దోచుకొనగ నెంచి
     ప్రాంతీయ ప్రజలపై పగనుబట్టి
మన నీరు మన నిధుల్ మనభూము లనుదోచి
     మా నోళ్ళలో మీరు మన్ను గొట్ట

తే. అకట కర్నూలులో మీర లమర లేక
దక్షిణాదిలో నత్యంత దండి యైన
పట్టణం బని హైదరాబాదు మీద
మరులు గొని వచ్చి రాంధ్రులు మట్టు బెట్ట

తే. హైదరాబాదుపై మీకు హక్కు లేదు
హైదరాబాదు మీ కొక యద్దెకొంప
గెలిచి మిముమేము బయటికి గెదమ లేదె?
గడుపు డిచటనే మీయూరు కట్టు వరకు!

కం. తగునే యూటీ చేయుట
తగునే యీ యూరిపైన తమ పెత్తన మ
ట్లగుచో కబ్జా భూములు
మిగిలించను పైరవీలు మిక్కిలి జేయన్

కం. కాలము జడమది కాదుర
చాలును మీనాటకములు చాలించుడికన్
మేలగు మీకిపుడైనను
కాలముతో నడచుటెల్ల గౌరవముకదా!
 
కం. నమ్ముట కైనను జాలదు
హమ్మా, తెచ్చితిరె మీరు హైదర బాదున్
ఉమ్మడి యూరది యెట్టుల?
ఇమ్మని మీ రిట్టు లడుగు టేమి యుచితమౌ?

కం. ఇచ్చెడు వారలు గలిగిన
ముచ్చటగా భూమి నెల్ల మోమోటము లే
కచ్చముగా మా కిండని
హెచ్చిన గరువమున గోర నెంచెదరు గదా!

కం. దినదినమును సీమాంధ్రులు
పనిగొని నిందించి యిట్లు పరమానందం
బును బొందుచుండి నందుట
నొనగూరెడు లాభ మొక్కటి గలదే?

కం. ఇక దేనికి మీ వగపులు
ప్రకటంబుగ కాలమహిమ వలనన్ రాష్ట్రం
బిక చీలుటయే తథ్యం
బకటా పగ లుడిగి శాంతులై యుండదగున్

Sunday, December 1, 2013

రాయల తెలంగాణా, సరికొత్త రాగం


రాష్ట్ర విభజన చివరి దశలో ఉన్న సమయంలో రాయల తెలంగాణా అంశం ముందుకొచ్చింది. కర్నూలు, అనంతపూరు జిల్లాల్లోని రాజకీయ నాయకులు అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ ఇది ఎప్పటి నుండో కోరుతున్నారు. కేంద్ర కాంగ్రేస్  నాయకత్వం కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అందుకు ఒప్పిస్తున్నట్టే కనిపిస్తుంది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ రెండు జిల్లాల లోని ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం ఇంకా తెలియడం లేదు. ఆ ప్రాంతపు నాయకులు మాత్రం తాము ప్రజల ఆకాంక్షలనె ప్రతిబింబిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణా ప్రాంతపు ప్రజాసంఘాలు, JAC లు మాత్రం తాము పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప దేనికి ఒప్పుకోమని నిర్ద్వందంగా చెప్తున్నయి. 

ఒప్పుకోక పొతే హైదరాబాద్ ను UT చేస్తామనే బూచిని చూపి కేంద్రం తెలంగాణా వాదులను ఒప్పించ వచ్చు. సీమలోని ఆ రెండు జిల్లాలు కలవడం వలన శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే నీటిని, కరెంటును వేరొక రాష్ట్రంతో పంచుకో వలసిన పరిస్థితి తప్పి పోతుంది. ఆ ప్రాజెక్టుపై, పరిసర కృష్ణ, తుంగభద్రా బేసిన్ పై పూర్తీ హక్కులు తెలంగాణా ప్రభుత్వానికి దాఖలు అవుతాయి. అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా పేరొందింది. ఇక తెలంగాణా మొత్తం మెరక ప్రాంతమే. కాబట్టి ఇతర తెలంగాణా జిల్లాలతోబాటు అనంతపురం అభివృద్ధి బాధ్యతలు కూడా తీసుకోవడం దానికి శక్తికి మించిన బాధ్యత అవుతుంది. సస్య శ్యామల ప్రాంతమైన సీమాంధ్రకు అనంతపురం బాధ్యత తీసుకోవడం పెద్ద కష్టం కాక పోవచ్చు. కాని ఆ జిల్లా ఆంధ్రలో కలిపితే  మరింత అనాధ అయ్యే ప్రమాదం వుంది. గత అనుభవాల ప్రకారం చూస్తినట్టైతే ప్రాబల్యం కలిగిన కోస్తావారు తనకు మాలిన ధర్మంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ జిల్లాని అభివృద్ధి పరుస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఆ రెండు జిల్లాలు తమను తాము ఆంధ్రరాష్ట్రంతో మమేకం చేసుకోలేక పోతున్నాయి!

గడిచిన ఐదు దశాబ్దాలుగా, అధిక జనాభా కలిగి, 175 అసెంబ్లీస్థానాలతో సీమాంధ్ర ప్రాంతం తెలంగాణాపై రాజకీయ ఆధిపత్యం సాధించి, తెలంగాణను ఒక వలస ప్రాంతంగా మార్చ గలిగింది. తెలంగాణా రాజకీయ మనుగడ కష్ట సాధ్యం అయింది. కాని కేవలం రెండు జిల్లాలను కలుపుకోవడం వల్ల తెలంగాణా రాజకీయ అస్తిత్వానికి కలిగే చేటు ఏమీ ఉండక పోవచ్చు. కేవలం రెండు జిల్లాల వారు పది జిల్లాల ప్రాంతంపై రాజకీయ ఆధిపత్యం సాధించే అవకాశం చాలా తక్కువ, వారి ఫ్యాక్షనిస్టు మూలాలను పరిగణ లోనికి తీసుకున్నప్పటికీ. 

కాని ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణా సంస్కృతి, వ్యవహారాలలో ఏవిధంగా మమేకం కాగలరు? అది ఆ రెండు జిల్లాల వారు వేసుకోవలసిన ప్రశ్న. వారు కలిసినంత మాత్రాన తమ సంస్కృతీ చిహ్నమైన 'తెలంగాణా' పదాన్ని 'రాయల తెలంగాణా' గా మార్చుకోవడానికి తెలంగాణా ప్రజలు ఏమాత్రం ఇష్టపడరు. కలిస్తే, గిలిస్తే వారు తెలంగాణా రాష్ట్రంలో భాగంగా కలవ వలసిందే, రాయల తెలంగాణాగా కాదు.  

ఇప్పుడు తెలంగాణలో కలుద్దామనుకుంటున్న రెండు జిల్లాల వారు, గడిచిన  కొన్ని దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు స్వరాష్ట్రం కోసం చేస్తున్న పోరాటాలపై ఏమాత్రం సానుభూతితో ప్రవర్తించ లేదు. పైగా వారి నాయకులు తెలంగాణా వాదులను అనేక మార్లు తూలనాడారు, హేళన చేశారు. ప్రతి సందర్భంలోనూ కోస్తా ప్రాంత పెట్టుబడి దార్లకు వంతపాడారు తప్ప, తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో దారుణంగా విఫలం చెందారు. అటువంటి వారు, ఇప్పుడు తెలంగాణాలో కలుస్తామని అడగడం ఎంతవరకు సమర్థనీయం? తెలంగాణా సమాజం ఏవిధంగా ఆదరించ గలదు?