Friday, November 28, 2014

భాషకు సంబంధించిన చర్చ భాషావేత్తలే చేయాలా?


ఈ విషయంపై శ్యామలీయం గారి అభిప్రాయం చూశాక ఈ పోస్టు రాయాలనిపించింది. వారి వ్యాసాన్ని, వ్యాఖ్యలను ఇక్కడ చదవొచ్చు. అందులో వారు 'భాషా సంబంధిత చర్చలు భాషావేత్తలు మాత్రమే చర్చించాలి' అని సిద్దాంతీకరించారు.

ఆ విషయం చెపుతూ వారొక దృష్టాంతాన్ని సెలవిచ్చారు. రోగికి చికిత్స చేసే విషయంలో కేవలం డాక్టర్లు మాత్రమే చర్చించాలి, ఇతరులు కనీసం ఆ వైపుకు కూడా రాకూడదు అని. మరి డాక్టర్లంటే కేవలం స్పెషలిస్ట్ లేనా, ఇతరులు కూడానా అన్న విషయం వారు వాకృచ్చ లేదు. సరే, వారూ వీరూ కూడా అనుకుందాం. ఈ విషయం బోధించారంటే వారొక పెద్ద వైద్య నిపుణులు కూడా అయి వుండాలి!

నేను వైద్యుడిని కాదు. కనీసం వైద్య సహాయకుడిని కూడా కాదు. కాకపొతే పేషెంటుగా బోలెడంత అనుభవం ఉన్న వాడినే. ఆ అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలు ప్రస్తావిస్తాను. వైద్య చికిత్సకు రకరకాల మార్గాలుంటాయి. ఆ విషయం వారే చెప్పారు. చికిత్స కేవలం డాక్టర్లే చెయ్యరు, ఫిజియోలు, నర్సులు కూడా అందులో భాగస్వాములే. వాటికి సంబంధించిన ఏయే సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయో చెప్పగలిగేది వారే. అలాగే డయాగ్నొస్టిక్స్ విషయం సరేసరి. ఇక పొతే అందించ వలసిన పరిశుభ్రత, ఉంచ వలసిన ప్రదేశం, ఇవ్వవలసిన ఆహారం... ఇల్లా అన్నీ పరిగణనలోనికి తీసుకొవలసిన అంశాలే. వీటన్నిటికి మించి వైద్యానికి కర్చు ఎంత అవుతుంది? అది పేషెంటు కుటుంబానికి అందుబాటులో ఉందా లేదా అన్న విషయం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయించ గలిగే విషయం. ఇవన్నీ వదిలేసి కేవలం నిపుణులే చర్చించుకుని అలవికాని పద్ధతిని ప్రిస్క్రైబ్ చేస్తే ఎలా వుంటుంది?

ఇక భాష విషయం లోకి వద్దాం. భాషను భాషావేత్తలు తయారు చెయ్యలేదు, చేసింది ప్రజలే. కాకపొతే భాషావేత్తలు వాటికి నియమ నిబంధనలు సృష్టించి ఉండవచ్చు. అంత మాత్రాన భాషావేత్తలు అలవికాని కొన్ని నియమాలు పెట్టి జనం మీదకి వదిలేసి, "మేం ఈ నిబంధనలు పెట్టాం, కాబట్టి చచ్చినట్టు ఫాలో చెయ్యండి" అంటే ఎలా వుంటుంది? ఎవరు ఏ నిబంధనలు పెట్టినా చివరకు పాటించ వలసినది ప్రజలే కదా! ప్రజలకు తాము ఏమి కోరుకుంటున్నారో, తాము వాడే భాష ఎలా వుండాలో కూడా చెప్పుకునే హక్కు లేదా? భాష ఏ విధంగా వుంటే అది మరింత ప్రజల్లోకి వెళ్లి వృద్ధి చెందగలుగుతుందనే విషయం ప్రజలకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? 'నీవు నిష్ణాతుడివి కాకుంటే చర్చించడానికి కూడా పనికిరావు' అన్నది ఏవిధమైన న్యాయం? 

తెలుగులో పదాలు తయారు చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి సంస్కృతం పైనే ఆధార పడదామా? లేక తెలుగులో కూడా అలాంటి వెసులుబాటు ఏర్పాటు చేసుకుందామా? అటువంటి వెసులుబాటు చేసుకోవడానికి వీలేలేదని తీర్పు చెప్పేవారు ఏవిధమైన సాధికారతతో చెప్తున్నారు? ప్రస్తుత భాషలో కొత్త పదాలు తయారు చేసే సుళువు లేదని ఒప్పుకుంటూనే, దిగుమతి చేసుకున్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా ఉన్నాయంటూనే, అటువంటి సుళువు కోసం తెలుగుభాషలో ప్రయత్నం కూడా చేయకూడదని శాసించడం ఏమిటో? ప్రయత్నమంటూ చేయకుండానే అసలు వీలే కాదని ఎలా తీర్మానం చేయగలరు?

బ్రాహ్మి లిపిలోని పత్రాలను పరిశోధించాలంటే బ్రాహ్మి లిపి కూడా నేర్చుకోవాలి కాని ఆ అక్షరాలను కూడా తెలుగులో చేరుస్తామంటే ఎలా వుంటుంది? అలాగే కొన్ని లుప్తమైన అక్షరాలు పాతకాలం తెలుగులో ఉంటే ఉండొచ్చు కాక, ఇప్పటి అవసరాలకు పనికి రాకపోయినా అందరికీ వాటిని ఒకటో క్లాసు నుండే నేర్పాల్సిన అవసరం ఏమిటి? పలకడానికి అలవికాని అక్షరాలను మొదటినుండి ఉన్నాయి కాబట్టి కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? ఎన్ని సార్లు పలికినా వాటి మధ్య తేడా కనపడని అక్షరాలను రెండింటికి బదులు ఒకటే వాడితే వచ్చె నష్టమేమిటి? 

ప్రజల్లోనుండి భాష పుడుతుంది. కాని భాషావేత్తల వల్ల దానికి నియమాలు ఏర్పడతాయి. ఆ నియమాలకు వీలైనంత సార్వజనీనత ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు భాషావేత్తలు. లేకపోతె అది మరొక మృతభాషగా మారే ప్రమాదం వుంటుంది. ప్రజలు కాక పండితులే రాసిన వ్యాకరణాన్ని ప్రజల అవసరాలకోసం అదే పండితులు మరింత సరళతరం చేసి రాయడం ఎందుకు సాధ్యం కాదు? అదే సమయంలో కొత్త పదాలు తయారు చేయడానికి  సంస్కృత భాషలో, లేదా ఆంగ్ల భాషలో ఉన్న వెసులు బాట్లను పరిశీలించి, తగు మార్పులను తెలుగులొ కూడా ఎందుకు చేయలేక పోతున్నాం? తమిళం, ఆంగ్లం ఇంకా అనేక భాషలు తమ పదాలు తామే చేసుకుంటున్నప్పుడు, మన భాషలు ఆ శక్తి లేదని ఒప్పుకుని మనం పక్కకు తప్పుకోవాలా?

ఇటువంటి ధోరణి అవలంబించే వేల సంవత్సరాలపాటు మన దేశంలో భాషను, సారస్వతాన్ని తొంబై శాతం ప్రజలకు అందకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. దాని ఫలితంగానే అనేక విషయాల్లో పాశ్చాత్యుల కన్నా మనం వెనుకపడి పోవడమూ జరిగింది.  ప్రజాస్వామ్యం వచ్చి అరవై ఏళ్లైనా ఇప్పటికీ కొందరు ఇంకా అటువంటి భావజాలాన్నే ప్రదర్శించడం శోచనీయమైన విషయం. 


Tuesday, November 4, 2014

తెలంగాణలో ప్రతిపక్షాలు


ప్రతిపక్షాలన్న తర్వాత అవి అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవాలి. వేలు కాదంటే కాలికి కాలు కాదంటే వెలికీ వేస్తూ అధికార పక్షానికి ఊపిరి సలపనీయకుండా చేయాలి. అదీ ప్రతిపక్షాలకు ప్రజలు ఇచ్చిన డ్యూటీ.

మరి తెలంగాణలో ప్రతిపక్షాలు ఈ పని సక్రమంగా చేస్తున్నాయా? అంటే బుక్కులో రాసిన దానికి పదింతలు ఎక్కువే చేస్తున్నాయి అని కచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణాలో అధికార పార్టీ ఒక్కటి ఉంటే కనీసం మూడు పార్టీలు వైభవోపేతంగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నాయి. కాంగ్రెసుకు ఎలాగూ ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఇక మిగిలిన బిజెపి, తెదేపాలు ఏమాత్రం తక్కువ తినలేదు.  

అయితే బుక్కులో రాయని విషయం ఇంకొకటి వుంది. అదేమంటే... అధికార పక్షానికి బట్టలూడ దీస్తూనే, ప్రతిపక్షం తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ మాటకొస్తే కేవలం అస్తిత్వం నిలుపుకోవడమే కాదు, తర్వాత్తర్వాత ఎన్నికల్లో నెగ్గేలా దాని ప్రయత్నాలు ఉండాలి. 

ఉన్న మూడు ప్రతిపక్షాల్లో కనీసం ఒక్కటన్నా ఈ దిశలో ప్రయత్నిస్తుందా అన్న విషయం విశ్లేషించడానికి ముందు, సదరు పార్టీలు రాష్ట్రంలో తమ ఉనికిని బలవత్తరం చేసుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. 

ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రాన్ని గనక తీసుకుంటే అక్కడ జాతీయ పార్టీలకు ఉనికే లేదు. ఉన్న రెండు మూడు పార్టీలు ఒకదాన్నొకటి విమర్శించు కుంటాయి. కాని విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్యన ఉన్నది అంటే అన్ని పార్టీలూ ఒక్క గొంతై తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాయి. ఇంకా చెప్పాలంటే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో నువ్వా నేనా అంటూ పోటీ పడతాయి. ఆ పోరాటంలో వెనుక బడితే ప్రజలు శాశ్వతంగా తమని వెనక్కు నెట్టి వేస్తారని వాటికి బాగా తెలుసు. 

పోనీ తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే వున్నాయి, వాటికి జాతీయ ఎజెండా వుండదు కాబట్టి అలా ప్రవర్తిస్తాయి అనుకొవచ్చు. మరి కర్ణాటకలో ఉన్నవి జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ లే. కాని అవి కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గవు. విషయం తమ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం మధ్య అయినపుడు అవి తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఢంకా బజాయిస్తాయి తప్ప పొరుగురాష్ట్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా దానికి వంట పాడవు. 

ఆ రెండు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రంలో నైనా పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. లేక పొతే భవిష్యత్తు ఉండదని వాటికి బాగా తెలుసు. అంతెందుకు? పొరుగు రాష్ట్రమైన ఆంద్ర ప్రదేశ్ ని తీసుకుందాం. అధికారం లో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న వైసిపికి తెలంగాణాలో బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. అయినా సరే అవి రెండూ శ్రీశైలం జలవిద్యుత్తు వివాదంలో తమ రాష్ట్ర వాదనకే వంత పాడాయి. 

ఒక వైపు తీవ్రమైన విద్యుత్ కొరత. ఇంకో వైపు ఆంద్ర ప్రభుత్వం విభజన బిల్లులోని అంశాలను తుంగలోకి తొక్కుతూ ఇవ్వాల్సిన కరెంటు కూడా ఇవ్వడం లేదు. పైగా తెలంగాణా శ్రీశైలంలో తన వాటా విద్యుత్తూ కూడా తయారు చేయకుండా అడ్డు పడుతోంది. అటువంటి సమయంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అధికార పార్టీకి అండగా వుంది రాష్ట్ర ప్రయోజనాలు కాపాదాలి. అప్పుడే వాటికి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. 

ఉద్యమం నడిచినన్నాళ్ళు దాన్ని తక్కువ అంచనా వేసి, పొరుగు ప్రాంత నాయకత్వానికే వంత పాడి తీరా ఎన్నికలు వచ్చఎసరికి అవి బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఆ పార్టీలకు బుద్ధి రావడం లేదు. ఇప్పుడూ తిరిగి ఆ పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి. 

వార్తాప్రసార సాధనాల పుణ్యమా అని ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయం ప్రజలు గమనిస్తూనే వున్నారు. సమయం వచ్చినప్పుడు తీర్పులు కూడా అందుకు అనుగుణంగానే ఇచ్చి తీరతారు. మరి ప్రతిపక్షాలకు అంత చిన్న విషయం తెలియదా? అవి తెలంగాణా ప్రజల అభిమానం చూరగొనడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు?

తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలంగాణలో స్వాతంత్ర్యం లేదు. ఆంధ్రలో కొలువైన అధినేతని కాదని పెదవి విప్పలేరు. కాని కాంగ్రెస్, బిజెపి లకు ఏమైంది? ఆ రెండు పార్టీలు కూడా కేవలం కెసిఆర్ ను తిట్టడం తప్ప ఎందుకు తెలంగాణా ప్రయోజనాలకు అనుకూలంగా స్పందించ లేక పోతున్నాయి? వాటిని ఎవరు ఆపుతున్నారు?

ఈ పార్టీలు ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదేమో అన్న అనుమానం కలుగుతోంది. ఒకటి తెలంగాణా బిల్లు పాస్ చేసి తమకు తెలంగాణాలో ధీమా ఉండదని భ్రమించిన పార్టీ. రెండోది తెలంగాణా కోసం పార్లమెంటులో బయటా పోరాడాం, ఇక మాకు తిరుగులేదు అని అనుకున్న పార్టీ. తీరా ఫలితాలోచ్చాక అవి నిజంగానే షాక్ తిన్నాయి. ఎన్నికల్లో సింగిల్ పార్టీగా గెలిచిన తెరాస మీద అవి విపరీతమైన అక్కసు పెంచుకున్నాయి. రోజో టీవీల ముందుకు వచ్చి అధికార పార్టీని తిట్టడం తప్ప వాటికి మరే ఎజెండా కనిపించడం లేదు. కాని అవి తమ పధ్ధతి మార్చుకుని, ఇప్పటికైనా తెలంగాణా వాదాన్ని నెత్తికి ఎత్తుకోక పొతే డైనోసార్ల మాదిరిగా అవి తెలంగాణలో పూర్తిగా అంతరించి పోవడం ఖాయం.