Tuesday, October 30, 2012

చంద్రబాబే ఎందుకు పెద్ద శత్రువు?


తెలంగాణా ఏర్పాటుకు మొదటినుండి బద్ధ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు. తాను ముఖ్య మంత్రిగా ఉన్నన్నాళ్ళూ తెలంగాణా పేరు కూడా వినపడ నీయలేదు చంద్రబాబు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కూడా అంతకన్నా ఎక్కువే చేశాడన్న మాట నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా వుంది. అదేమంటే, రాజశేఖర్ రెడ్డి అధికారం కేవలం ఈ రాష్ట్రం వరకే ఉండేది. కేంద్రాన్ని కొంతవరకు ప్రభావితం చేయగలిగినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నకేంద్ర ప్రభుత్వం తెలంగాణాపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఎప్పుడూ చూప లేదు. నిజానికి ఆ సమయంలోనే రాష్ట్రపతి ప్రసంగం, ప్రధాని హామీ, ప్రణబ్ కమిటీ మొదలైన పరిణామాలు వచ్చాయి.

కాని చంద్రబాబు విషయం అలా కాదు. చంద్రబాబే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు. కాబట్టి తెలంగాణా అయినా మరోటయినా చంద్రబాబు ఆలోచనలమీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. మరి ఈ చంద్రబాబు ఆలోచనా సరళి గత దశాబ్ద కాలంగా ఎలా వుందో చూద్దాం.

తన హయాంలో తన పార్టీ ఎమ్మెల్యేలు రాజోలిబండ తూములు పగుల గోడితే నిమ్మకు నీరెత్తిన వ్యక్తి చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర పేరుతో అదే రాజోలిబండ వద్ద తెలంగాణాలో ప్రవేశించి, తనకు సిగ్గూ శరం లాంటి పదాలకు అర్థాలు తెలియవని మరొక్క సారి నిరూపించుకున్నాడు చంద్రబాబు.

NTR హయాంలో వచ్చిన 610 GO అమలు కాకుండా తూట్లు పొడిచిన చంద్రబాబు. తాను నిజంగా తలుచుకుని వుంటే ఆ GO ను పూర్తిగా అమలు చేయగల సమర్థుడే ఆయన. కానీ అలా చేయలేదు. కారణం, ప్రాంతీయ దుర్విచక్షణ, పక్షపాతం మాత్రమే.

అలాగే తెలంగాణా ప్రాజెక్టులకు నిదులివ్వక, ఉన్న చెరువులను, కుంటలను కూడా నిర్లక్ష్యం చేసి తెలంగాణాను ఎడారిగా మార్చాడు. పైగా బోర్లు వేసుకుని వ్యవసాయం చేసే రైతులపై అధికమైన కరెంటు బిల్లులు వేసి వారి ఆత్మహత్యలకు కారణ మయ్యాడు.

అతని హాయాంలో వ్యాపారానికి భూమి కావాలని అడగని ఆంధ్రా ప్రాంతపు ఫలానా కులంవాడు పాపాత్ముడు. అంతగా కొమ్ము కాశాడు ఒక సామాజిక వర్గానికి. వారే ఇప్పుడు కుహనా సమైక్యవాదాన్ని కరెన్సీ నోట్లమీద ప్రాణ ప్రతిష్ట చేయడం కాకతాళీయం కాదేమో!

ఇతని కాలంలో తెలంగాణలో అభివృద్ధి చెందినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి జూబ్లీహిల్సు, బంజారా హిల్సు, హైటెక్ సిటీలు మాత్రమే. అక్కడ వుండేదేవరో వేరే చెప్ప నవసరం లేదు.

కరడుగట్టిన సమైక్యవాది అయి కూడా 2009లో వోట్లకోసం తెరాస పార్టీతో జత కట్టాడు. తెలంగాణా వస్తే అది తనవల్లే అని ప్రజలను నమ్మ బలికాడు. ఆంధ్రా ప్రాంతం కన్నా ఎక్కువ దామాషాలో తెలంగాణాలో సీట్లు గెలుచుకున్నాడు. కాని ఆంధ్రాలో తక్కువ సీట్లు రావడం వలన అందికారంలోనికి రాలేక పోయాడు.

నిజమైన నాయకుడైతే అధికారంలోనికి రాలేక పోయినా ఏంచేయాలి? ప్రజల కిచ్చిన వాగ్దానాల అమలు కోసం అసెంబ్లీలో బయటా పోరాటాలు చేయాలి. కాని ఎన్నికల తర్వాత తెలంగాణాకోసం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. అయితే KCR నిరశన దీక్ష ఫలితంగా డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే, తన ఎన్నికల వాగ్దానాలను, పదిహేను నెలల పాటు రాష్ట్రమంతా కమిటీని కలియదిప్పి తెలంగాణా ఏర్పాటుపై చేసుకున్న  పాలసీని తుంగలో తొక్కాడు. కుహనా ఉద్యమాన్ని నారూ, నీరు అంతా నారావారే అన్న రీతిలో నడిపించాడు. ఆ సంగతి ఆయన పాత భ్రుత్యులే ఇప్పుడు గుట్టు విప్పుతున్నారు.

మొన్నటి ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో చావుదెబ్బ తిన్న తరుణంలో ఆయనకీ మరొకసారి తెలంగాణా గుర్తుకొచ్చింది. నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాణి ఉత్తరాన్నొక దాన్ని అతి జాగ్రత్తగా తయారు చేసి ప్రధానికి పంపించాడు. ఆ ఉత్తరంలో ఆయన తెలంగాణా శాతమెంతో ఆ పార్టీ లోని తెలంగాణా వాదులే చెప్పలేక పోతున్నారు. ఇక బయటి వాళ్ళయితే మండి  పడుతున్నారు.   

ఇప్పుడు అక్కడా ఇక్కడా అరువుతెచ్చుకున్న మనుషులతో పాదయాత్ర తూతూ మంత్రిస్తూ, నంగి నంగి మాటలతో దొంగ కబుర్లు చెప్తున్నాడు. తెలంగాణలో తనకింకా పలుకుబడి తగ్గలేదని జనానికి భ్రమ కల్పించే పనిలో ఉన్నాడు. ఆయన తెలంగాణాకు వ్యతిరేకం కాదట! మరి అనుకూలమా? అది మాత్రం చెప్పడట అధికారం లోకి వచ్చే వరకూ! మరి నమ్ముదామా?



Sunday, October 28, 2012

నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు



బాబు పాదయాత్రలకు అడ్డు రాకుండా తెలంగాణా వాదులని అరెస్టులు చేస్తూ ప్రభుత్వం ఇతోధికంగా ఆయన యాత్రకు మద్దతు తెలుపుతున్నా వెళ్ళిన ప్రతి చోటా తెలంగాణా పైన ఆయన అభిప్రాయం తెలపాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల వద్దకు వచ్చాక తప్పుతుందా? తప్పదు కాబట్టి 'రాష్ట్రం ఇవ్వాల్సింది కాంగ్రేసు, నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అని చెప్పి తప్పించు కుంటున్నారు.

'నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అన్న ఒక్క మాట విన్న ప్రజలు ఆనందంగా ఆయన చెప్పే మిగతా ఊక దంపుడు భరిస్తున్నారు. ఆ మాటలు ఒక్క సారి పరిశీలిస్తే ప్రజలను మభ్య పెట్టడంలో ఈయన ఎంతగా అరి తేరాడో ఇట్టే అర్థం అవుతుంది.

ఎంతసేపూ తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్తాడు తప్ప, 'తెలంగాణాకు అనుకూలం' అనే మాట మాత్రం ఆయన నోటివెంట రాదు. మరి అనుకూలం కానప్పుడు వ్యతిరేకం కాదా? తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతున్నారు. దానికి అనుకూలం కాదు అంటే అర్థ మేమిటి? వ్యతిరేక మనేగా? కాని చంద్రబాబు ఆమాట తెలివిగా దాటేస్తున్నాడు. తన మనసులో ఉన్న అసలు మాట దాచి వేసి, విషానికి మిఠాయి పూసినట్టుగా, సొల్లు మాటలు చెప్తున్నాడు.

సరే, ఆయన మాటల సారాశం 'అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదు' అనుకుందాం. అంటే తటస్తమన్న మాట. అదే ఆయన డిసెంబరు తొమ్మిది తర్వాత చెప్తూ వస్తున్న రెండుకళ్ళ సిద్ధాంతం! మరి ఆయనలో వచ్చిన మార్పేంటీ? కొత్త లేఖతో అదనంగా ఇచ్చిన క్లారిటీ ఏంటి? గజం మిధ్య, పలాయనం మిధ్య అన్నట్టుగా లేదూ?

ఎంతసేపు అడిగినా తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకం కాడంటాడే కానీ అనుకూలం అవునో కాదో చెప్పడు. 'అశ్వత్థామ హతః కుంజరః' అన్నట్టన్న మాట.

స్థూలంగా బాబు పథకం ఇదీ! తెలంగాణాకి వ్యతిరేకం కాదని తెలంగాణా పర్యటన మొత్తం బాకా ఊది తెలంగాణా వోట్లు కొల్ల గొట్టాలి. రేపు గెలిస్తే, 'నేను కాంగ్రేసు తెలంగాణా ఇస్తే వ్యతిరేకం కాదు అని మాత్రమే చెప్పాను, అనుకూలం అని ఎక్కడ చెప్పానూ?' అంటూ దీర్ఘాలు తియ్యొచ్చు. ఒక వేళ ఇప్పుడే కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి పూనుకున్నా, 'మహారాష్ట్ర షిండే ఎవడూ, కేరళ వాయలార్ ఎవడు, ఇటలీ సోనియా ఎవతీ, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదీ?' అనే మొండి కూతలు ఆయన దగ్గర ఎప్పుడూ రడీ గానే ఉంటాయి కదా?


Wednesday, October 24, 2012

ఆంధ్ర బాబూ, నీ దగ్గెర మాటల్లేవు


చచ్చిన రెడ్డి కానుండి
ఉద్దెరకు తెచ్చుకున్న
పొల్లు మాటలు
ఉచితాలు
వాగ్దానాలు

గద్దెమీది రెడ్డి కానుంచి
అడిగి తెచ్చుకున్న
పొలీసు మంద
తుపాకులు
గన్ మెన్లు

పక్క ప్రాంతం నించి
పట్టుకొచ్చు కున్న
మందీ మార్బలం
గూండాలు
రౌడీలు

ప్రజల కానించి
పట్టుకొచ్చిన
నమాజు టోపీలు
తలపాగాలు

కుల సంఘాల
రైతు సంఘాల
దగ్గెర నించి
అద్దెకు తెచ్చిన
కండువాలు

అన్నీ
బాగనే ఉన్నై
కానీ...

తెలంగాణా
ఏర్పాటు గురించి
ఒక్క ముచ్చెట
చెప్పనీకి మాత్రం
నీ దగ్గెర
మాటల్లేవు

ఆంధ్ర బాబూ
గిదీ
నీ
పాదయాత్ర

కింద పడ్డా నేనే మిర్రు... గిదీ, సమైక్య వాదం.

ఆంధ్రోళ్ల దాష్టీకం తెలంగాణ బాక్సర్లపై దాడి 



- నలుగురు క్రీడాకారులకు గాయాలు
- అంతర్ జిల్లా చాంపియన్‌షిప్‌లో ఘటన
హైదరాబాద్, టీ మీడియా ఖేల్ ప్రతినిధి: క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాల్సిన క్రీడాకారులు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ప్రాంతీయ తత్వంతో రెచ్చిపోయి దాడులకు దిగారు. తోటి క్రీడాకారులను విచక్షణా రహితంగా చావబాది గాయపరిచారు. ఇది జరిగింది విశాఖపట్నంలో. దాడి చేసింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాక్సర్లు కాగా, దాడికి గురైన బాధితులు తెలంగాణకు చెందినవారు. వివరాల్లోకెళితే విశాఖ మురళీనగరంలోని వైశాఖి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 19న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల క్వార్టర్‌ఫైనల్స్‌లో ఆంధ్ర బాక్సర్‌పై హైదరాబాద్ బాక్సర్ విజయం సాధించాడు.

దీంతో ఓటమిని భరించలేకపోయిన ఆంధ్ర బాక్సర్లు స్టేడియంలోనే అంతా చూస్తుండగానే తెలంగాణ బాక్సర్లపై గూండాల్లా విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో హైదరాబాద్ చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన విక్టోరియా ప్లే గ్రౌండ్ బాక్సర్ ఆదిత్య తల పగలగా, మహేష్‌చారి, లోకేష్, నరేష్, విక్రమ్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొం దుతున్నారు. అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడు స్టేడియంలోనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించగా, ఏపీ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు మౌనం దాల్చడం గమనార్హం.

చావబాదారు
‘లైట్ ఫ్లై వెయిట్ విభాగం బౌట్‌లో పాయింట్లపరంగా హైదరాబాద్ బాక్సర్ సిద్దార్థ్ ముందంజలో నిలిచినా, ప్రత్యర్థి, స్థానిక బాక్సర్ ఎల్లారి గెలిచినట్లుగా రిఫరీ ప్రకటించారు. దీంతో ఇదెక్కడి న్యాయమంటూ మేం ప్రశ్నించడం వాళ్లకు నచ్చలేదు. అంతే ఒక్కసారిగా అక్కడున్న లోకల్ బాక్సర్లంతా గుమికూడి మాపై మూకుమ్మడిగా దాడి చేశారు. రౌడీల్లా ప్రవర్తించి రక్తం చిందేట్లు చావగొట్టారు. ఈ సమయంలో వాళ్లను వారించాల్సిన నిర్వాహకులు చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప, ఏమీ చేయలేకపోయారు. దీంతో మేం టోర్నీని బాయ్‌కాట్ చేసి హైదరాబాద్ వచ్చేశాం. కానీ వాళ్లు మాత్రం హైదరాబాద్ జట్టు వాకోవర్ ప్రకటించిందంటూ ప్రత్యర్థులను తర్వాతి రౌండ్లకు పంపించారు’.


Tuesday, October 23, 2012

రాంబాబుని మించిన బాబులు



వలస వాదుల బలహీనత ఎట్ల వుంటదో రాంబాబు సినిమా తోటి బయట పడ్డది. ఇదే రాంబాబు సీనిమాల సీన్లను కట్ చేయించుడు కోసం తెలంగాణా బందు చేసినా, సకల జనుల సమ్మె చేసినా, ఇంకో మిలియన్ మార్చి చేసినా, మల్లొక సకలజనుల సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం గాని, సినిమా యాజమాన్యం గాని దిగోచ్చేవి కావు. బందులు చేస్తే, సమ్మెలు చేస్తే వాళ్ళ కడుపులే మాడుతయి, ఇదీ మన సమేక్కుడు ప్రభుత్వాలా ఆలోచన.

వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడు మనం ప్రజాస్వామ్య యుతంగ ఎన్ని నిరసనలు తెలిపినా, అది చెవులకు సంగీతం వినిపించినట్టే వుంటది. వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్నంటే రాంబాబు మార్కు ట్రీట్ మెంటే సరైనది. ఒక్క రోజు థియేటర్లకు తాళం పడంగనే దెబ్బకు దయ్యం దిగోచ్చినట్టయింది. ఒక్కొక్కడు అడుగక ముందే క్షమాపణలు చెప్పుడు శురూ చేసిన్రు. వాళ్ళంతా వాళ్ళే సినిమాను సెన్సారు చేసుడు మొదలు వెట్టిన్రు. కుంభకర్ణుని లెక్క నిద్ర బొయ్యే రాష్ట్ర ప్రభుత్వం దిగ్గున లేచి APSFTDC తోటి కమిటీ ఏసి మరో మూడు నాలుగు కోతలు పెట్టింది.

గిదంత చూస్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళకు మాటలతోటి కాదు, చేతల తోటి సమాదానమియ్యలె అనిపిస్త లేదూ? సంగీతానికి చింతకాయలు రాలనట్టే, మెక్కుడు మరిగిన వలసవాదులు ఉత్తగనే పోరు. తేరగ తినేటోన్ని, 'రేపన్నించి కష్టపడి పనిచెయ్యర బాబు' అంటే ఇంటడా? సెగ తగిలిస్తే గని పొయ్యిల కూసున్న పిల్లి బయటికి లేవదు. ఒక్క పూరీ జగన్నాధ్ సినిమా తోనే అయిపోలేదు. పూరీని మించిన మహమ్మద్ ఘోరీలు ఇక్కడనే ఉన్నరు. మన నెత్తిమీది కెక్కి ఊరేగు తున్నరు.


ఏ సెగ తగులకుంటే, తెలంగాణా వనరులను తినుకుంట ఇరుగ బలిసిన లగడపాటికి ఉస్మానియా యూనివర్సిటీని మూసెయ్యాల్నని అనిపిస్తది. అందుకే సెగ తగిలిస్తానే ఉండాలే. ఉస్మానియా మూయించాలే ననుకుంట అవాకులు పేలిన లగడపాటి కబ్జా ఆస్తులను ఎందుకు మూయించ కూడదు? సెగ ఎక్కువై ఒక్కొక్క బందిపోటు తెలంగాణా పొలిమేరలు దాటి పారి పోయ్యేదాంక కాక తగులుతనే ఉండాలే. మనం రూపొందించే ఉద్యమరూపాలు కూడా అట్లనే ఉండాలే. గాంధీ లాంటోడే దోపిడీ దారుల ఆధిపత్యాన్ని దెబ్బతీసే టందుకు విదేశీ బహిష్కరణ చేసిండు. ఇప్పుడు మనం స్వదేశీ దోపిడీ దారుల ఆస్తులను ముట్టడిస్తే చాలు, తట్ట బుట్ట వాళ్ళే సర్దుకుంటరు.

ఒక లాంకో హిల్స్, ఒక రామోజీ సిటీ... ఇట్లా ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకున్తున్నడో మొత్తం బయటకు తియ్యాలే. దీనికోసం Right to information act ను కూడా ఉపయోగించు కోవాలె. ఒకవైపు సమాచారం, రెండొక వైపు ప్రచారం, మూడొక వైపు ప్రత్యక్ష కార్యాచరణ... ఈ త్రిసూత్ర ప్రణాళిక అమలు పరచాలె. పొలాన్ని కబళిస్తున్న పంది కొక్కులను తరుమాల్నంటే ఊపిరాడ కుండ పొగబెట్టి నట్టు, ఈ సీమాంధ్ర దోపిడీ దారులకు కాళ్ళు చేతులు ఆడకుండా చేస్తే చాలు, తెలంగాణా దానంతట అదే ఉరుకోస్తది.



Tuesday, October 16, 2012

సాటుంగ సాటుంగ...

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రధానికి, కాప్ సదస్సుకు పోనీకి దొంగలెక్క దొడ్డిదారి కావలిసి వచ్చింది. దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చి ఒక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే టందుకు సాటుంగ సాటుంగ రావలసి వస్తుందంటే అంతకన్నా అవమాన మేముంటది? దీన్ని బట్టి తెలుస్త లేదూ, తెలంగాణా ప్రజల ఆగ్రహ, ఆవేశా లెట్లున్నయో? తెలంగాణా మనిషి అనేటోన్ని, చివరికి ప్రెస్ వాళ్ళను కూడా అక్కడ ఉండనియ్యకుండ తరిమేసినరంటే, ఇక్కడ ఉన్నది నిజాం లని మించిన నాజీల రాజ్యం లెక్క అనిపిస్త లేదూ? రాజ్యం చేస్తున్న దోపిడీ వర్గాలు తెలంగాణా ప్రజల కోపాగ్నిని చూసి ఎట్ల గజగజ వణుకుతున్నయో కళ్ళకు కట్టినట్టు కనపడుత లేదూ?

తుపాకులు ధరించిన మిలిటరీ మధ్య దాసుకొని ఎన్నాళ్ళు ప్రజలను అణచివెయ్య గలుగతరో వాళ్ళే ఆలోచించు కోవాలె. ప్రజల కోపం చూసి గుండె గుభేలు మంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పూటకో మాట మాట్లాడుకుంట, ఒకని మీద ఒకడు చాడీలు చెప్పుకుంట బాగనే నాటకాలు వేస్తున్నరు. వీళ్ళ నాటకాలను నమ్మి ప్రజలు వోట్లేసే రోజులు పోయినయి. మీరు సక్కగ ఉంటె ఎప్పుడో తెలంగాణ వచ్చేదని అందరికి అర్థమైంది.

ఇంక పోతే గులాం, వాయలార్లు గంటకోటి, పొంటెకోటి పొంతన లేని మాటలు మాట్లాడుతుంటరు. జీతం కోసం తెలంగాణా మాట, గీతం కోసం ఆంధ్ర మాట అన్నట్టు వుంటది వాళ్ళ మాటల తీరు! అవును మరి! తెలంగాణా రాదు అని చెప్తే ఏ లాంకో హిల్సు లోనో నాలుగు ప్లాట్లమ్ముడు పోతయి. ఏంతో కొంత కమీషన్ రాకపోతదా అన్న తపన వాళ్ళది. తెలంగాణా వస్తది అని చెప్తే వచ్చేది ఏమన్నా ఉన్నదా వాళ్ళకు, బూడిద తప్ప? ఎప్పుడో తెలంగాణా మీద ఇరుకున పడ్డప్పుడు అమ్మ గదమాయిస్తే  తప్ప తెలంగాణ పాట పాడే అవసరమేంది వాళ్లకు? పైస రాలని పాట పాడితే ఎంత, పాడక పొతే ఎంత?

వ్యాపారి ఎవ్వడైనా తన ఉత్పత్తి గొప్పదనాన్ని చెప్పుకొని సరుకు అమ్ముకోవాల్నని అనుకుంటడు. కాని కొంతమంది వ్యాపారులుగా మారిన బ్రోకర్లు మాత్రం సమైక్య వాదం ఉందని నమ్మించి పబ్బం గడుపుకోవాల్నని చూస్తరు. వాళ్లకు వ్యాపారం అంటే కులం, వర్గం, ప్రాంతం, అది కాకపొతే అవినీతి రాజకీయం! ఆ స్థాయిని మించని అరడజను దద్దమ్మలకు, వారి మోచేతి నీళ్ళకు ఆశపడే కొందరు రాజకీయ శిఖండులకు తప్ప ఎవ్వరికీ సమైక్యవాదం యొక్క అవసరం ఉన్నట్టు కనిపిస్త లేదు. ప్రత్యేక రాయలసీమ వాదంతోని బైరెడ్డి దూసుక పోగలిగినా, TRS తో చేయి కలిపిండని ప్రచారం చేసిన జగన్ ఒంటి చేత్తో కాంగ్రెస్, TDP లను మట్టి కరిపించినా, కోస్తాలో జై ఆంధ్రా ఉద్యమం ఊపందు కుంటున్నా అవి ఆంధ్రా ప్రాంతపు సామాన్యులు తెలంగాణా ప్రజలకు ప్రకటిస్తున్న సంఘీభావం తప్ప వేరే కాదు.


కోర్టు మొట్టికాయలు తినుకుంట కబ్జా భూముల్ల ఇండ్లు కట్టుకొనే లగడపాటి, తెలంగాణా మార్చి పైన నోరు చేసుకుంటున్నడు అంటే, అది తెలంగాణా ప్రజల మెతకదనం కాక ఇంకేంది? గిసుమంటోల్లకు బుద్ధి చెప్పాలంటే ఈసారి మార్చి ట్యాంకుబండు మీద గాదు, ల్యాంకో హిల్సుకు చెయ్యాలె. వీళ్ళు కూడ బెట్టిన దోపిడీ ఆస్తులు కాపాడుకునే టందుకు వీళ్ళకు నిద్రలు పట్టకుండ చెయ్యాలె. గప్పుడు తెలంగాణా దానంతట అదే వస్తది.   

Tuesday, October 9, 2012

నిజాం మంచోడా చెడ్డోడా?

నిజాం మంచోడా చెడ్డోడా?


కొంతమంది నిజాం మంచోడంటరు, కేసీయార్ లాగా. మరికొంతమంది చెడ్దోడంటరు కమ్యూనిస్టుల్లాగా, స్వయం సేవకుల్లాగా!

మంచోడా చెడ్దోడా అని ఆలోచించే ముందు ఒక్క ముచ్చెట చెప్పుకోవాలె. మంచోడు, చేద్దోడు అని మనుషుల్ల ఎవడూ ఉండదు. వాడు చేసిన పనులే మంచి చెడ్డలు నిర్ణయిస్తయి.

మరి నిజాం  అన్ని చెడ్డ పనులే చేసిండా? కొన్ని మంచి పనులు గూడ చేసిండు. దవాఖానాలు కట్టించిండు. కాలేజీలు కట్టిచ్చిండు. దేశంల మొట్ట మొదటి సారి ప్రభుత్వ బస్సు రవాణా ప్రవేశ పెట్టిండు. రైలు మార్గాలు నిర్మించి రైళ్ళు తిప్పిండు. ప్రాజెక్టులు కట్టిచ్చిండు. హైదరాబాదు నగరాన్ని అద్దం లెక్క పెట్టిండు.


ఇక పోతే చెడ్డపనుల గురించి చెప్పుకుందాం. పన్నులు వేసి ప్రజల్ని పీడించిండు. ఉర్దూను బలంగ రుద్దిండు, అణచివేతకు గురి చేసిండు. చివరి రోజులల్ల రజాకార్లను ఉసిగొల్పిండు.

నిజమే, నిజాం కాలంల తెలంగాణా ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు. కాని దానికి కారణం ఎవరు? నిజామా? నిజానికి నిజాం పరిపాలించిన నేల ఎంత? హైదరాబాదు దాటితే ఎక్కడ నిజాం ప్రత్యక్ష పాలన సాగింది? మిగతా భూములన్నీ జమీందారులు, జాగీర్దారులు, దొరలూ, దేశముఖుల కిందనే గదా ఉన్నది? నిజాం పదిపైసల వంతు పీడిస్తే వీళ్ళు తొంభై పైసలు పీడించిన్రు. ప్రజల రక్త మాంసాలు పీక్కుతిన్న వీళ్ళు నిజాం కన్నా క్రూరులు. ఒక విధంగా నిజాం ఇలాంటి వారినుండి ప్రజలను రక్షించలేని అసమర్థుడు.

ఇంక పన్నుల విషయానికి వస్తే, ఆ రోజులల్ల పన్నులు వెయ్యని రాజెవ్వడు? హిందూ ముస్లిం, నిజాం, సుల్తాన్ అని లేకుండా ప్రతి ఒక్కడు పన్నులు వసూలు చేసినోడే... బ్రిటిషోడికి కప్పాలు కట్టినోడే. ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి ఒక్కడూ ఆ తానులోని ముక్కే. స్థన్యానికి టాక్సు కట్టిన ట్రావన్కోరు మహారాజు ఏంతో, నిజామూ అంతే.

నిజాం ఉర్దూ రుద్దిండన్నది నిజమే. మరి బ్రిటిషోడు ఏం జేసిండు? ఇంగ్లీషు రుద్దలేదా? ఇప్పుడు ఆంధ్రోడు భాషే కాదు, సంస్కృతీ బలవంతంగా రుద్దడానికి, తెలంగాణా సంస్కృతి నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్త లేడా? ప్రజాస్వామ్యం లనే గిట్ల జరుగుతుంటే, నియంతలాంటి రాజు అదే పని చేస్తే ఆశ్చర్యమేముంది?

నిజాం తిరుగు బాట్లను అణచి వేసిండు. కాని ఇప్పటి ప్రభుత్వాలు ఏంజేస్తున్నయి? తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నయా? ఒక మీటింగు పెట్టుకోవడానికి, ఒక మార్చి చేసుకోవడానికి అనుమతి దొరకని పరిస్థితి. చివరికి బతుకమ్మ ఆడుకోవడానికి కూడా హైకోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకొనే దుస్థితి!


నిజాం రజాకారులను అచ్చోసిన ఆంబోతుల్లెక్క దేశం మీదికి వదులుడు మాత్రం క్షమించరాని నేరం, అది ఎలాంటి పరిస్తితుల్ల చేసినప్పటికీ! కాని ఆ రజాకారులు ఎవరు? వారి పార్టీ MIM ఇప్పుడు సమైక్యరాగం ఆలపించడం యాదృచ్చికమా? కానే కాదు. అలాగే ఆ కాలంల నిజాంకు తొత్తులుగా వుండి ప్రజలను పీడించిన వారి సంతానమైన ఇప్పటి పాలక వర్గం, పైకి తెలంగాణా మంత్రం జపిస్తూ, లోలోన తెలంగాణ ఏర్పాటుకు శల్య సారధ్యం వహించడం కూడా యాదృచ్చికం కాదు.

అందరు రాజుల మంచి పనులను మెచ్చుకోన్నట్టే నిజాం చేసిన పనులనూ మెచ్చుకోవచ్చు. అట్లనే నిజాం లాంటి దుర్మార్గాలు చేసిన అందరు రాజుల్నీ తెగనాడ వలసిందే.

ఈ నాటి తెలంగాణా బిడ్డ, తరతరాల సంఘర్షణల అగ్ని కీలలల్ల చరిపించ బడ్డ బాకు లాటివాడు. వాడికి ఎవడు ఎలాంటోడు అనే విషయంల పూర్తి అవగాహన వుంది.

Sunday, October 7, 2012

దారులు ఏవైనా గమ్యమొక్కటే


తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో నెలరోజులపాటు బైటాయించి తనదైన శైలిలో లాబీయింగ్ చేయడం, మరోవైపు, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగరహారం చోటుచేసుకోవడం ఆ మలుపులో కీలక ఘట్టాలు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న, లాబీయింగ్ జరుపుతున్న నేతల మాటేమో కానీ, ప్రజల మాట మాత్రం ఒకటే! వారికి కావలసిందల్లా తమ రాష్ట్రం తమకు కావాలి అంతే! ఈ నేపథ్యంలోనే లాబీయింగైనా, సాగరహారమైనా విశ్లేషించుకోవాలి.

ఐతే, సాగరహారానికి ఎదురైన అడ్డంకులు ఇన్నీ అన్నీ కావు. ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను,వ్యక్తులను, ఉద్యమకారులను కలుపుకుపోవడానికి ఐకాస నాయకులు చేసిన కృషి అభినందనీయం. నిర్వహణ మరో వారం రోజులుందనగా ప్రభు త్వం రకరకాల పద్ధతులతో తనదైన శైలిలో మోకాలడ్డడం ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సు ఆరంభానికి, వినాయక నిమజ్జనానికి మధ్యన, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారాన్ని వాయిదా వేసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్న ప్రచారాన్నీ లేవదీసింది. శాంతి-భద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానాన్నీ బయట పెట్టింది. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాస నాయకులకు నచ్చచెప్పే బాధ్యతను తెలంగాణ ప్రాంత మంత్రుల పై పెట్టాడు ముఖ్యమంత్రి. ససేమిరా అన్న ఐకాస నాయకులు సాగరహారం నిర్వహణకే కట్టుబడి ఉన్నారు. పోలీస్ కమిషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసి మార్చ్ నిర్వహణకు అనుమతి కోసం ప్రయత్నం చేశారు. అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు పెద్దలు, తమదైన శైలిలో ఒక అనుమానాన్ని కూడా బయటపెట్టారు. నగరంలోని సీమాంధ్రుల ఆస్తులపై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ మంత్రులను తెర పైకి తెచ్చారు ఐకాస నాయకులు. అనుమతి ఇప్పించే బాధ్యతను వారికి అప్పజెప్పారు.

ఏదేమైతేనేం....మంత్రుల కృషి ఫలించింది. పోలీసు అధికారులు సాగర హారానికి అనుమతి ఇచ్చారు. అది షరతులతో కూడిన అనుమతి. కాని.. చివరకు జరిగిందేమిటి? ఆంధ్రప్రదేశ్ చరివూతలో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల అరాచకం చోటు చేసుకున్నది. నిర్బంధకాండ రాజ్యమేలింది.


ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు వెలిశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో యుద్ధకాండ చోటుచేసుకున్నది. సాగరహారం జరిగే చోటుకు ర్యాలీగా వెళ్లకూడదన్న ఆంక్షలు విధించిన పోలీసులు, ఎక్కడివారిని అక్కడే నిలిపివేశారు. ఒక్కరొక్కరే సాగరహారం నిర్వహించే స్థలానికి చేరుకోవాలన్న అసంబద్ధ నిబంధనను విధించి దారుణంగా ప్రవర్తించారు. మార్చ్ జరపాల్సిన స్థలాన్ని జలియన్ వాలాబాగ్ చేశారు. అన్ని వైపుల నుంచీ అక్కడకు చేరే మార్గాలను మూసేశారు. ఐనప్పటికీ, పోలీసు కంచెలను ఛేదించుకుం టూ, బారికేడ్లను అధిగమించుకుంటూ వేలసంఖ్యలో తెలంగాణవాదులు, ఉద్యమకారులు సాగర తీరానికి చేరుకున్నారు. లక్షలాది మంది సమక్షంలో మార్చ్ విజయవంతంగా నిర్వహించబడింది. చివరకు పోలీసుల భాష్పవాయువు ప్రయోగం, లాఠీ చార్జ్ సాగరహార స్థలానికి కూడా చేరుకునే దాకా పరిస్థితి వచ్చింది. నేతల ఉపన్యాసాల అనంతరం, రాత్రిపొద్దుపోయిన తర్వాత మార్చ్ ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.


మొత్తం మీద ఐకాస నాయకుల పరంగా శాంతియుతంగాను, పోలీసులపరంగా అశాంతియుతంగాను సాగరహారం సమాప్తమైంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతంగా నిర్వహించిన మార్చ్ లాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాగర హారం పిలుపు ఇచ్చినప్పటి నుంచి ఆరోజున ఏదో జరగబోతోందన్న ఆశ చాలామంది తెలంగాణవాదులలో మొలకెత్తింది. తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మార్చ్ మొదపూట్టకముందే వెలువడుతుందన్న ఆశ కలిగింది. కానీ ఇవేవీ జరగలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యమకారులు పీవీ ఘాట్ వద్ద గుమికూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. కానీ ఎడతెగకుండా కురిసిన భారీ వర్షం, భాష్పవాయు ప్రయోగాలు, లాఠీచార్జీలో వందలాదిగా గాయపడిన ఉద్యమకారుల పరిస్థితి కారణంగా..వ్యూహం మార్చుకున్న ఐకాస నాయకులు అర్ధరాత్రి సమయానికి మార్చ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కథ సుఖాంతమయ్యేటప్పటికి నిర్వాహకులతో సహా, పోలీసు వర్గాల వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతే లభించకపోయినట్లయితే, పరిస్థితి మరోవిధంగా వుండే అవకాశాలుండేవి. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు మార్చ్ ప్రశాంతంగానే ముగిసిందనాలి. పోలీసులు తెలంగాణ వాదుల మీద కనబర్చిన అతి ఉత్సాహం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది.



హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఢిల్లీలో వున్న చంద్రశేఖరరావు కాలికి బలపం కట్టుకుని తన లాబీయింగ్ కొనసాగించాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో లాబీయింగ్ చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడులు తేవడం సహజం. అదే పని చంద్రశేఖరరావు చేస్తే తప్పేంటి? వాస్తవానికి చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటి నుంచీ లాబీయింగ్ చేస్తూనే వున్నారు.

ఒకవైపు పన్నెండేళ్లు ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో నడుపుతూనే, మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో రకరకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయస్థాయిలోని అత్యధిక రాజకీయ పార్టీల మద్దతును రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడగట్టగలిగారు.ఆ మాటకొస్తే భారతీయ జనతాపార్టీ కాని, భారత కమ్యూనిస్ట్‌పార్టీ కాని ఈ రోజున పూర్తిస్థాయిలో తెలంగాణ ఉద్యమంలో దూకిందంటే అది కేసీఆర్ లాబీయింగే అనాలి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2004లో కాంగ్రెస్ పార్టీతోను, 2009లో టీడీపీ తోను ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కాని, టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే లు కాని తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారంటే అది కేసీఆర్ పన్నిన ఎత్తుగడల ఫలితంగానే అనాలి. ఆ లాబీయింగ్‌లో భాగంగానే ఆయన వయలార్ రవిని, ఆజాద్ ను, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసి ఉండాలి.

ఈ నేపథ్యంలో ఒక్కసారి గతం నెమరేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను, తమ ప్రాంత ప్రజలను తెలంగాణేతరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల తెలుగువారు ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు(ఆనాడే) అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ప్రాంతవాసులందరికి విడిపోయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ముల్లాగా మెలిగితే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. నాటి నుంచి నేటికీ తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదం లాగా రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.

రాష్ట్రం కావాలని కేవలం భావించడం మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్టరీత్యా కలిగించ డం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజల్‌అలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాల ద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన కొందరు తెలంగాణేతరులు పరోక్ష దోపిడీ విధానాన్ని ప్రత్యక్ష దోపిడీ విధానంగా మార్చడం మొదలయిందో,అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో దోపిడీకి ఎదురు తిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పు చెందింది. మర్రి చెన్నాడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి పేరుతో బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. నాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించబడుతున్నా, అధికసంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కోసం ఎదురుచూశారు.

కె. చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ను స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకునిపోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పథాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుం టూ, ఒక రకంగా ఏకాభివూపాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ ఎవరూ సాధించని విజయాన్ని సాధించారు. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో కాంగ్రె స్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ,అటు పార్లమెంటులోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగారు. టీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తేగలిగారు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేశారు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్నిసార్లు అయినా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. బహుశా ఈ నేపథ్యంలో ఒకవైపు కేసీఆర్ లాబీయింగ్, మరోవైపు ఐకాస లాంటి ప్రజా సంఘాల ప్రత్యక్ష ఉద్యమాలు రాష్ట్ర సాధనకు దోహదపడతాయని భావించవచ్చు. వేరీజ్ తెలంగాణ అనే వారికి ఇదే సమాధానం! హియర్ ఈజ్ తెలంగాణ!

-వనం జ్వాలా నరసింహారావు
Re-posted from Namaste Telangana

Saturday, October 6, 2012

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఏంపని చేసింది?

ట్యాంకు బండు మీద విగ్రహాలు పెట్టింది.

ఎవరివి?

గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి, అన్నమాచార్య, ఆర్థర్ కాటన్.

మరిదొంగల్లెక్క అర్థరాత్రెందుకు? పట్టపగలే పెట్టొచ్చుగా?

వాళ్ళు మహనీయులే. పెట్టే పనే దొంగ పని. పట్టపగలు పెడితే వారి ప్రాంతీయ వివక్ష మరోసారి బయట పడుతది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటది. రాత్రికి రాత్రి వాటిని నిలబెట్టినంక అంత ప్రభావం ఉండదు కదా?

ఒక ప్రాంతం వారివే ఎందుకు పెడుతరు?

ఎందుకంటే ఒక ప్రాంతాన్ని తర తరాలుగ దోచుకోవాలంటే ఆ పంతం వారి సంస్కృతీ చరిత్రా నాశనం చేయాలి. అందులో భాగమే తెలంగాణా వైతాలికులు తరగతి పుస్తకాల్ల్లో కనుమరుగు కావడం. మహత్తరమైన తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మన పిలగాల్లకు అస్సలే తెలియక పోవడం. కనీసం హైదరాబాదు మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామక్రిష్ణారావని కూడా వారికి తెలియక పోవడం. ఫలితంగా ఆంధ్రా ప్రాంతానికి ఇక్కడి ప్రజలు శాశ్వతంగ బానిసలుగా పడి  వుండడం.

కొమురం భీం విగ్రహ ప్రతిష్ఠాపన 
అలా జరుగుతుందా?







ఇప్పటికే అలా జరుగుతుంది. ముఖ్యమంత్రి, PCC ప్రెసిడెంటు, ప్రతిపక్ష నేత, DGP, స్పీకరు, హైదరాబాదు పోలీసు కమీషనరు ఇలా అడుగడుగునా వాళ్ళే ఉంటరు. తెలంగాణా ప్రాంతం వారు తమ చరిత్ర, సంస్కృతి ఎరిగి వుండి, ఆత్మా విశ్వాసం కలిగిన వారైతే తప్పక ఎదురు తిరుగుతరు. న్యాయం అడుగుతరు. అది వారికి ఇష్టం ఉండదు. తెలంగాణా వారు ఆత్మన్యూనతతో అణగి మణగి ఉన్నట్టైతే, యధేచ్చగా అన్ని రంగాల్లో తమ దోపిడీ కొనసాగించ వచ్చు.


మరి తెలంగాణా వాదులు ఊరుకున్నరా?

ఊరుకోలేదు. తీవ్రమైన నిరసనలు వెలువడ్డ నేపథ్యంలో శుక్రవారం పగలు కొమురం భీం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. పాపం ఆ మహానుభావులేం పాపం చేశారో కాని, ఈ మహానుభావుల పాపాల వల్ల అర్థరాత్రులు ప్రత్రిష్టించుకోవలసిన గతి పట్టింది. అదే కొమురం భీం పట్టపగలు ప్రత్రిష్టించ బడ్డ కొమురం భీం విగ్రహం గర్వంగా నవ్వుతూ నిలుచుంది!


తెలంగాణకు తిరుగులేని సంతకం



ఢిల్లీ యాత్ర ముగించుకొని వచ్చిన కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసమే కనిపించింది. మొదటి విడుత చర్చలు సఫలమయ్యాయన్నారు. మరో విడుత చర్చలతో తెలంగాణ వచ్చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రయత్నాలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది ప్రశ్న కాదు. ముందు కూడా సఫలమవుతాయా లేదా అనేది కూడా పక్కన పెడితే... తెలంగాణ వంటి ఒక మైనారిటీ ప్రాంతానికి ద్విముఖ వ్యూహం అవసరమని గుర్తించి ఆ దిశగా పనిచేస్తున్న కేసీఆర్... వ్యూహాత్మకంగానైనా, లేదా స్వీయ అస్తిత్వ బలంతోనైనా తెలంగాణ ను సాధించిపెడతారనే నమ్మకం సగటు తెలంగాణవాదికి వుందనడంలో అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమపార్టీ అధినేత పట్ల అపోహలు, అపార్థాలు సృష్టించి ప్రజల్ని పక్కదారి పట్టించే సీమాంధ్ర కోవర్టు పార్టీల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతాయనుకోలేం.

బక్కపలుచని మనిషి. కానీ మానసిక బలవంతుడు. 12 ఏళ్లుగా బరువైన బాధ్యత మోస్తున్నాడు. ఎగుడు దిగుడులు చూసినోడు. మనోధైర్యం చెదరని వాడు. సహనం, నిబ్బరం, నిబాయింపు, తెగింపు కలగలసిన మనిషి. ఎప్పుడో 1970లో ఇక రాదులే అనుకొని నిరాశలో కూరుకుపోయిన తెలంగాణ సమాజాన్ని 30 ఏళ్ల తర్వాత తట్టి లేపగలిగిన అసలు సిసలైన ఉద్యమ అధినేత ఆయన. అంతా అయిపోయిందనే నిరాశ ఆయన జీవన డైరీలో ఎక్కడా కనిపించదు. నేటి ఓటమిని రేపటి విజయంగా మలుచుకోగల వ్యూహ సంపన్నుడు.

కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టిననాడు ఆయన వెంట పట్టెడుమంది లేరు. ఇవాళ పుట్టె డు మందయ్యారు. జై తెలంగాణ నినాదం పలకని ఊరుగానీ, వాడగానీ, మనిషిగానీ వున్నాడా? నేను తెలంగాణ ప్రాంతం వాడినని చెప్పుకుంటే బతకలేనేనేమోననే ఆత్మన్యూనతా భావ స్థితి నుంచి, నేను తెలంగాణ వాడినేనని సగర్వంగా తలెత్తుకొని బతికే స్థాయికి తెలంగాణ సమాజాన్ని చేర్చగలిగిన అరుదైన నాయకుడాయన. తెలంగాణ పదం నిషేధింపబడ్డ అసెంబ్లీలో సగర్వంగా చట్టబద్ధంగా తెలంగాణ పదాన్ని పలికించిన తెలంగాణ మొదటి ముద్దుబిడ్డ ఆయన. ఇంటా బయటా తెలంగాణకు ఆత్మగౌరవాన్ని ఇప్పటికే సాధించిపెట్టాడు. ఆయన మాటా-బాటా తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరిస్తాయి. ఏమో.. కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడా అనే అనుమానాలు అప్పుడూ ఇప్పుడూ వున్నాయి. కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా, ఆయన ఉపన్యాసం విన్నా.. అప్పటిదాకా అనుమానంలో వున్నవాడికి సైతం నమ్మకం ఏర్పడాల్సిందే! ఆయన ప్రసంగాలు విన్న ప్రతి తెలంగాణవాడికి కేసీఆర్ తన వాడు, తన ఇంటివాడనే స్ఫురణ తప్పక కలిగిస్తుంది. అందుకే తెలంగాణ ఆత్మకు కేసీఆర్ ప్రతి రూపంగా కనిపిస్తాడు.

కేసీఆర్‌ను పొగిడే వారి సంగతి పక్కన పెడదాం. తెగిడే వారు సైతం అయనలో తెలంగాణ ఆత్మను చూసి గర్వపడతారనడంలో అనుమానం లేదు. ఆయ న భౌతిక స్వరూపం, వ్యవహారిక హావభావాలు, ఆత్మీయ పలకరింపులు, మీడియా తో మాట్లాడే తీరు, ఉపన్యాసాలు.. ఇలా ఆయన యాస, భాషా అన్నీ ప్రజల గుండె ల్లో తెలంగాణకు ప్రతీకలుగా చెరగని ముద్రను వేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

తెలంగాణ ఏర్పాటును ఆయన ఎప్పుడో అనివార్యం చేయగలిగారు. అది ఇప్పుడా, ఎప్పుడా అనేది మాత్రమే తేలాల్సివుంది. అందరిలాగా ఆయన ఆగమాగం ఎప్పుడూ కాడు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇప్పటిదాకా ఉద్యమాన్ని నడుపుకొస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం వుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టి ఒక రకంగా మోసపోయారు, మరోకంగా ఆ పార్టీల చేత జై తెలంగాణ అని అనిపించాడు. ఇవాళ ఆ రెండు పార్టీల ద్వంద్వ నీతిని ప్రజా కోర్టులో నిలబెట్టగలిగా డు. వ్యూహం ఉన్నవాడు ఎన్నటికీ చెడిపోడంటే ఇదే కావచ్చు! అంతేకాదు రాష్ట్రంలో బలమున్న పార్టీలను, బలంలేని పార్టీలను అన్నిటికీ తెలంగాణ అనివార్యతను సృష్టించగలిగాడు. అంతటి చాణక్యనీతి తెలిసిన ఉత్తమ రాజకీయవేత్త ఢిల్లీకి ఉత్తిత్తిగా పోలేదని సీమాంధ్ర నేతలు గ్రహించారు. ఆయన ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించారనడంలో అనుమానం లేదు. కేసీఆర్ తెస్తారనుకున్న తెలంగాణకు తాత్కాలిక ఆటంకం ఏర్పడి వుంటుందని సగటు తెలంగాణవాదికి అర్థం కానిది కాదు. ఒకవేళ ఢిల్లీ పాలకులు మోసం చేస్తే మరుక్షణమే కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారని కూడా ప్రజలకు తెలుసు.

తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఎంత అవసరమో, వ్యూహాత్మకత కూడా అంతే అవసరం. అవసరాన్ని బట్టి రెండింటిని వాడుతూ ముందుకు సాగితేగానీ తెలంగాణ లక్ష్యం నెరవేరదు. అట్లా నడవగలిగిన సమర్థ నాయకుణ్ణి ఇవాళ తెలంగాణ కలిగివుంది. వ్యూహాత్మక ప్రయత్నం చేయడానికి 2012 లోపు వరకు అవకాశం వుంది. అప్పటికీ తేలకపోతే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తదుపరి సాధించుకునే అవకాశం ఎలాగూవుంది. 2012లోపు సాధించే అవకాశాల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. 2014 సాధారణ ఎన్నికలు దగ్గర పడితే సాధించడం సాధ్యం కాదని కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆలోపు తన వ్యూహాత్మక శక్తితో సాధించాలని అనుకుంటున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం కొందరికి అర్థం కాకపోవచ్చు, తెలంగాణ సాధారణ ప్రజలకు మాత్రం అర్థమవుతున్నదనడంలో అనుమానం లేదు. కేసీఆర్ ఢిల్లీ ప్రయత్నాలను ఒక ప్రయత్నంగా స్వీకరించాలే తప్ప, అవి తెలంగాణను తేలేవనే అపశకునం అక్కర లేదు!

ఉద్యమాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే సాధనాలు. అయినా రాజకీయ ప్రక్రియ అనివార్యం. నేటి అవకాశవాద రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారి అవసరాలను సొమ్ము చేసుకొని లక్ష్యాన్ని సాధించడం కూడా రాజకీయ ప్రక్రియలో ఒక భాగమే. కేసీఆర్ 12 ఏళ్లు అలాంటి ప్రయత్నాలు చేశారు. అంతమాత్రాన వాటిని విఫల ప్రయత్నాలుగా తేల్చేస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మైనారిటీ ప్రాంతం. చట్టసభల్లో సీమాంధ్ర పైచేయిలో వుంది. దేశంలో అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మైనారిటీ ప్రాంత ఆకాంక్షలను కాలరాసి కేంద్రం మెజారిటీ ప్రాంతానికి కొమ్ముకాస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాంటపుడు మైనారిటీ ప్రాంత నాయకుడికి వ్యూహాత్మకత అవసరం. సమయాన్ని బట్టి ప్రయత్నం చేయాలన్నా, కుదరకపోతే వాతలు పెట్టాలన్నా.. తెలంగాణ వంటి మైనారిటీ ప్రాంత నేతకు అదును చూసి చేయాల్సిన పనులు పనులవి! కేసీఆర్ ఆదిశగానే పని చేస్తున్నారనడంలో సందేహంలేదు.

64 ఏళ్ల నుంచి తెలంగాణలో బతుకుతూ వస్తున్న రాజకీయ పార్టీలు ఈ ప్రాంతానికి న్యాయం చేసే వుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనగలిగేదేనా? ఏర్పడినా.. ఉల్లంఘనలు, అన్యాయాలు జరుగుతుంటే ఊరుకునేవేనా? అందుకే కదా మంటికైనా ఇంటోడు కావాలన్నట్లు తెలంగాణకు టీఆర్‌ఎస్ రూపంలో ఓ ఇంటిపార్టీ పుట్టక తప్పింది కాదు. మంచైనా చెడైనా తెలంగాణకు ఓ ఇంటిపార్టీ వుందనే భరోసా ప్రజల్లో ఏర్పడ్డది. దానికి సమర్థుడైన వ్యూహాత్మక నాయకుడున్నాడు. రాష్ట్రంలో మైనారిటీ ప్రాంత నేతగా తెలంగాణ సాధించడానికి అనేక అవరోధాలు తప్పవు. వాటిని మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న నాయకుడి అవసరం అనివార్యం. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డారని వార్త. నిజమే 56 ఏళ్ల నిర్బంధ తెలంగాణ కు విముక్తి కల్పించేందుకు తన పార్టీని కూడా త్యాగం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని చెప్పొచ్చు. అది తన ప్రాంతం కోసం కేసీఆర్‌లోని రాజకీయ త్యాగశీలతను చాటిచెపుతోంది. మనం ఏరంకంగా చూసినా కేసీఆర్ తెలంగాణకు ఒక ఐకాన్! కంప్యూటర్‌లో ఐకాన్ నొక్కనిదే ఏదీ ఓపెన్ కాదు! అలాగే కేసీఆర్ లేని తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా జై తెలంగాణ అంటుందని మనం ఆశించగలమా? ఎన్ని పార్టీలు జైతెలంగాణ అన్నా, అవి కేసీఆర్ అనేవాడు ఒకడున్నాడు అనే భయంతో మాత్రమే అనగలుగుతున్నాయనడంలో ఎంత నిజముందో... తెలంగాణ ఎప్పుడు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలాంటి కేసీఆర్ వ్యూహ సమర్థతతోనైనా రావాలి లేదా ఆయన నాయకత్వంలోనే స్వీయ రాజకీయ అస్తిత్వ బలంతో 2014 తర్వాతనైనా రావాలి అనడంలో కూడా అంతే నిజం వుంది. ఇంకా చెప్పాలంటే ఆయన తెలంగాణకు తిరుగులేని సంతకం.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి
Taken from Namaste Telangana