Sunday, October 28, 2012

నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు



బాబు పాదయాత్రలకు అడ్డు రాకుండా తెలంగాణా వాదులని అరెస్టులు చేస్తూ ప్రభుత్వం ఇతోధికంగా ఆయన యాత్రకు మద్దతు తెలుపుతున్నా వెళ్ళిన ప్రతి చోటా తెలంగాణా పైన ఆయన అభిప్రాయం తెలపాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల వద్దకు వచ్చాక తప్పుతుందా? తప్పదు కాబట్టి 'రాష్ట్రం ఇవ్వాల్సింది కాంగ్రేసు, నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అని చెప్పి తప్పించు కుంటున్నారు.

'నేను తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు' అన్న ఒక్క మాట విన్న ప్రజలు ఆనందంగా ఆయన చెప్పే మిగతా ఊక దంపుడు భరిస్తున్నారు. ఆ మాటలు ఒక్క సారి పరిశీలిస్తే ప్రజలను మభ్య పెట్టడంలో ఈయన ఎంతగా అరి తేరాడో ఇట్టే అర్థం అవుతుంది.

ఎంతసేపూ తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్తాడు తప్ప, 'తెలంగాణాకు అనుకూలం' అనే మాట మాత్రం ఆయన నోటివెంట రాదు. మరి అనుకూలం కానప్పుడు వ్యతిరేకం కాదా? తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతున్నారు. దానికి అనుకూలం కాదు అంటే అర్థ మేమిటి? వ్యతిరేక మనేగా? కాని చంద్రబాబు ఆమాట తెలివిగా దాటేస్తున్నాడు. తన మనసులో ఉన్న అసలు మాట దాచి వేసి, విషానికి మిఠాయి పూసినట్టుగా, సొల్లు మాటలు చెప్తున్నాడు.

సరే, ఆయన మాటల సారాశం 'అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదు' అనుకుందాం. అంటే తటస్తమన్న మాట. అదే ఆయన డిసెంబరు తొమ్మిది తర్వాత చెప్తూ వస్తున్న రెండుకళ్ళ సిద్ధాంతం! మరి ఆయనలో వచ్చిన మార్పేంటీ? కొత్త లేఖతో అదనంగా ఇచ్చిన క్లారిటీ ఏంటి? గజం మిధ్య, పలాయనం మిధ్య అన్నట్టుగా లేదూ?

ఎంతసేపు అడిగినా తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకం కాడంటాడే కానీ అనుకూలం అవునో కాదో చెప్పడు. 'అశ్వత్థామ హతః కుంజరః' అన్నట్టన్న మాట.

స్థూలంగా బాబు పథకం ఇదీ! తెలంగాణాకి వ్యతిరేకం కాదని తెలంగాణా పర్యటన మొత్తం బాకా ఊది తెలంగాణా వోట్లు కొల్ల గొట్టాలి. రేపు గెలిస్తే, 'నేను కాంగ్రేసు తెలంగాణా ఇస్తే వ్యతిరేకం కాదు అని మాత్రమే చెప్పాను, అనుకూలం అని ఎక్కడ చెప్పానూ?' అంటూ దీర్ఘాలు తియ్యొచ్చు. ఒక వేళ ఇప్పుడే కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి పూనుకున్నా, 'మహారాష్ట్ర షిండే ఎవడూ, కేరళ వాయలార్ ఎవడు, ఇటలీ సోనియా ఎవతీ, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదీ?' అనే మొండి కూతలు ఆయన దగ్గర ఎప్పుడూ రడీ గానే ఉంటాయి కదా?


No comments:

Post a Comment