Thursday, October 31, 2013

పోలీస్ కమిటీకి తప్పుడు లెక్కలు

విజయకుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న పోలీస్ కమిటీకి సదరు విభాగం వారు భారీ ఎత్తున తప్పుడు లెక్కలు ఇస్తున్నట్టు వార్త. ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్, డీజీపీ ఆఫీస్ మదలైన రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో పని చేస్తున్న సిబ్బందిలో 80% వరకు ఆంధ్రా ఉద్యోగులు ఉండగా దాన్ని తగ్గించి 60%, 40% గా చూపెడున్నట్టు సమాచారం అందింది.

ప్రాంతీయ పక్షపాతంతో మొదటినుండి తెలంగాణా ప్రాంతానికి ద్రోహం చేస్తున్నవారు తప్పుడు లెక్కల సహాయంతో రాష్ట్ర విభజనలో వీలైనంత లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇది ఒక్క పోలీస్ విభాగానికే పరిమితం కాబోవడం లేదు.  అన్ని కార్యాలయాలలోనూ ఆంద్ర ప్రాంతానికి చెందిన అధికారులను, ఏవోలనే ముందస్తుగా నియమించుకొవడం ద్వారా ఇటువంటి తప్పుడు లెక్కలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది.

అయినా కరడు గట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం, దానికి పనిచేసే అధికారుల కార్యాచరణ ఇంతకన్నా అద్భుతంగా వుంటుందని ఊహించలేం. వీళ్ళు ఏం చేసినా రేపు తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఉద్యోగి సర్వీస్ రికార్డులు పునస్సమీక్షించడం జరుగుతుంది. అప్పుడైనా వీరు చేసే ఘోరాలు బయట పడక మానవు. మరి ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేయడం అంటారా? మోసాలు చేసే వాడికి మరో రకంగా ప్రవర్తించడం రాదుగా? అందుకని!

Monday, October 21, 2013

బ్రహ్మాస్త్రం


చాలా కాలం కింది మాట. ఆ వూర్లో నీటి ఎద్దడి ఉండేది. మంచి నీళ్ళకు మరింత కొరత. ఊరి సర్పంచి ట్యాంకరు ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీటి పంపిణీ చేయించాడు. ఆ పంపిణీ ఇంటిలో ఉన్న జనాభా ప్రాతిపదికన జరిగేది. అలా సాగుతుండగా ఒక రోజు ఒక ఇంటి నుంచి పేచీ వచ్చింది.

వారిదో ఉమ్మడి కుటుంబం. అన్న, తమ్ముడి కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి వుంటున్నారు. సర్పంచి తమ్మున్నడిగాడు, "ఏమిటి యాదగిరి, ఎందుకు పంచాయితీలో పేచీ పెట్టావ్?"

"ఏం చెప్పేదయ్యా? మీరుండగా ఈ వూళ్ళో అన్యాయం జరగదనుకున్నాను. కాని పరిస్థితి వేరుగా వుంది. ఎవరిపైనా ఆరోపణలు చేయ దలుచుకొలేదు. మా అన్నదమ్ములను వేరుపాటు చేయండి, చాలు".

సర్పంచి సాలోచనగా తల పంకించాడు. "కారణం చెప్పకుండా వేరుపాటు ఎలా కుదురుతుంది? ఎందుకు వేరు పడాలను కుంటున్నావు?"

యాదగిరి చెప్ప సాగాడు, "కారణాల కేం చాలానే వున్నాయి. మచ్చుకు ఒకటి చెప్తాను, వినండి... మీరు ఊరి బాగుకోసం మంచి నీటి ఏర్పాటు చేశారు, బాగానే వుంది. కాని దానివల్ల నా కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు జనాభా ప్రాతిపదికన మా ఇంటికి ఐదు బిందెల నీరు కేటాయించారు. కాని నా కుటుంబానికి మాత్రం దాంట్లో ఐదు గ్లాసుల నీళ్ళు కూడా మిగలటం లేదు. నీళ్ళు మొత్తం మా అన్నగారి కుటుంబానికే సరిపోవటం లేదు", విషయం చెప్పాడు యాదగిరి.

సర్పంచి అన్న వైపు ప్రశ్నార్థకంగా చూశాడు, "ఏం సుబ్బయ్యా? మీ ఇంట్లో ఉన్న పది మందికి ఐదు బిందెలని నేనే లెక్క గట్టాను. మరి ఎందుకు సరిపోవడం లేదు?"

సుబ్బయ్య సర్పంచికి వంగి దండం పెట్టుకున్నాడు, "అయ్యా, ధర్మ ప్రభువులు, మీరు సరిగానే నిర్ణయించారయ్యా, దాంట్లో తప్పులేదు. కాని ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకున్నాక ఇంటి అవసరాలకు తగ్గట్టు పంచుకుంటాం కాని ఇలా వీధిన పడతామేవిటండీ? మీరే మా తమ్ముడికి గట్టిగా బుద్ధి చెప్పండయ్యా."

సర్పంచి చిరాగ్గా మందలించాడు. "సుబ్బయ్యా, ఊకదంపుడు మానేసి అడిగిన దానికి సమాధానం చెప్పు. నీరు ఎందుకు సరిపోవడం లేదు?"

"ఎం చెప్పమంటారయ్యా? మా కుటుంబానికి అవసరాలు ఎక్కువ. మా చంటి దానికి మంచి నీళ్ళతోనే స్నానం చేపించాలి. నాకేమో కాళ్ళ తిమ్మిర్లు... వేడి చేసిన మంచి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొమ్మని నాటు వైద్యుడు చెప్పాడు. మా ఆవిడకి ఉప్పునీళ్ళ తో స్నానం చేస్తే దుద్దుర్లు వస్తాయి, కాబట్టి మంచి నీళ్ళే కావాలి. ఇవికాక మిగిలిన నీళ్ళు మా వంటకు సరిగ్గా సరిపోతాయి. అయినా కూడా మేం కొంచం తగ్గించుకుని అప్పటికీ అర బిందె నీళ్ళు మా తమ్ముని కుటుంబానికి ఇస్తున్నాం. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఎలాగోలా సద్దుకోవాలి కాని, ఇలా పేచీలు పెడితే ఎలాగయ్యా?"

సర్పంచికి విషయం అర్థమయ్యింది. "దీంట్లో నా తప్పు కూడా వుంది. ఇంటి అవసారాలకు తగ్గట్టు నీటి సరఫరా చేస్తున్నాననుకున్నాను కాని, ఇంటిలోని కుటుంబాలకు అవి సరిగా చేరుతున్నాయో లేదో అని చూడలేదు. గుమస్తాగారూ, సుబ్బయ్య కుటుంబానికి స్పెషల్ గా మన పంచాయితీ నియమాల పుస్తకంలో ఒక పేరా చేర్చండి... దాని ప్రకారం సుబ్బయ్య భార్యకు మూడు బిందెలు, అయన తమ్ముని భార్యకు రెండు బిందెలూ సపరేట్ గా నీళ్ళు అందించాలి."

గుమస్తా గ్రామ పెద్ద చెప్పినట్టు చేశాడు, "నియమాల పుస్తకం పేజీ నంబరు 371, ఐటం D ప్రకారం సభ్యుల సంఖ్య ప్రాతిపదికన సుబ్బయ్య భార్యకు 3 బిందెలు, యాదగిరి భార్యకు 2 బిందెలు అందించ వలసినదిగా ట్యాంకర్ డ్రైవరుకు ఆదేశాలు జారీ చేయడమైనది."

*****

కట్  చేస్తే ...

*****

నలభై సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయ్. తీర్పు చెప్పిన సర్పంచి, నమోదు చేసిన గుమస్తా గాల్లో కలిసి పోయారు. ఈసారి సుబ్బయ్య, యాదగిరి మధ్యన సర్దుకోలేనంతగా విభేదాలు పెరిగాయి. యాదగిరి విదిపోతానన్నాడు. సుబ్బయ్య కలిసి ఉండాల్సిందే అని మొండికేశాడు. వాదనలు విన్న పంచాయితీ యాదగిరి వాదనలో న్యాయం వున్నట్టు గ్రహించి, విభజన వైపు మొగ్గింది.

"సుబ్బయ్యా, ఇక మీ కుటుంబాలు కలిపి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయితీ సభ్యులం మీ కుటుంబం విడిపోవాలని నిర్ణయించాం, ఇక నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా?", సర్పంచి అడిగాడు.

సుబ్బయ్య కోపంతో ఊగి పోయాడు, "బయటివాళ్ళు మీరు ఎలా విడదీస్తారండీ, పచ్చని కుటుంబాన్ని? మీ తీర్పు చెల్లుబాటు కాదు."

"చూడు సుబ్బయ్యా గ్రామ నియమాలు మూడో పేజీలో కుటుంబాలు విడదీసే తీర్పులు చెప్పే హక్కు పంచాయితీకి ఉంటుందని స్పష్టంగా వుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొనే హక్కు మాకుంది, పైగా మీ తమ్ముడు విభజన కోరుతున్నాడు. ఆయన్ని ఒప్పించ లెంత వరకు నువ్వు విభజనను అడ్డుకోలేవు".

"మీకు తెలియని బ్రహ్మాస్త్రం నాదగ్గరొకటి వుంది!" కొంటె నవ్వొకటి నవ్వాడు సుబ్బయ్య. "నియమాలు 371 వ పేజీలో పేరా D చదవండి మీకే తెలుస్తుంది!! దాంట్లో సుబ్బయ్య ఉమ్మడి కుటుంబానికి 3:2 బిందెలు విడిగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన బడింది".

"ఐతే?"

"అది ఉన్న తర్వాత మూడో పేజీలోని నియమం చెల్లదు".

సర్పంచికి చిర్రెత్తు కొచ్చింది "నీ నక్క జిత్తులు నా వద్ద కాదు సుబ్బయ్యా! గతంలో నువ్వు చేసిన నీటి దోపిడీ ఆపడానికే ఆ నియమం చేర్చ బడింది. అయినా నీ దోపిడీలు ఆగక పోగా మరింత పెరిగినందుకే ఇప్పుడు విభజన చేస్తున్నది. ఆ నియమం చూపించి విభజన ఎలా ఆపగలవు? మీ కుటుంబం విడిపోగానే ఆ నియమం దానంత అదే రద్దై పోతుంది".

యాదగిరి పంచాయితీకి దండం పెట్టుకున్నాడు. సుబ్బయ్య ముఖం తెల్ల బోయింది!

Thursday, October 17, 2013

సమైక్య వాదుల చొప్పదంటు ప్రశ్నలు, సమాధానాలు



Sunday, October 13, 2013

RTC వారు విలీనం ఎందుకు కోరుతున్నారు?






సమైక్యత కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన సమ్మెలో RTC ఉద్యోగులు ముందునుంచీ పాల్గొన్నారు. సాధారణంగా RTC ఉద్యోగులు రాష్ట్ర ఇతర ఉద్యోగులతో కలిసి సమ్మెల్లో పాల్గొనడం బహు అరుదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారి సమస్యలే వారికి బోలెడన్ని వుంటాయి. వారి పని పరిస్థితులు (working conditions), వేతనాలకోసం చేసే సమ్మెలతోనే వారికి సరిపోతుంది. తెలంగాణాలో సకల జనులు సమ్మె చేసినా, RTC వారు ఏ కొద్ది రోజులో తప్ప ఆ సమ్మెలో పాల్గొనలేదన్న విషయం ఇక్కడ గుర్తించాలి.

అటువంటిది APNGOలతో భుజం కలిపి వారితో సమానంగా విధులను బహిష్కరించి సమ్మెలో RTC వారు పాల్గొనడం మొదటినుండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే వుంది. అయితే అందుకు గల కారణాన్ని RTC కార్మిక నాయకులు LB స్టేడియంలో జరిగిన మీటింగులోనే వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో RTC ఒక్క రోజులో మూత పడుతుందని వారు చెప్పారు. అక్కడి ప్రాంతంలో EPK (Earnings per Kilometer) తక్కువగా వుండడం దానికి కారణంగా వారు వివరించారు.

రాష్త్రం మొత్తం RTC ఒకటే సంస్థ అయినపుడు ఆ ప్రాంతంలో EPK తక్కువగా ఎందుకు వుంటుంది? ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే ప్రశ్న. దీనిపై అధ్యయనం జరిపినప్పుడు కొన్ని పాలకుల సీమాంధ్ర పక్షపాతానికి సంబంధించిన వికృత వాస్తవాలు బయటికి వచ్చాయి.

తెలంగాణా ప్రాంతంలో RTC బస్సుల వినియోగం ఎక్కువ. ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఆదరిస్తారు. రైల్వే నెట్‌వర్కు ఎక్కువగా వుంటుంది. నౌకా ప్రయాణాలు కూడా ఎక్కువే. కాబట్టి అక్కడ RTC బస్సుల వినియోగం తక్కువ. వ్యాపారి ఎక్కువ ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువ పెట్టుబడి పెడతాడు. కాని RTC వారు మాత్రం ఈ చిన్న వ్యాప్రార సూత్రాన్ని విస్మరించారు. ఆదాయానికి మించిన బస్సులు, డిపోలు సీమాంధ్రకు కేటాయించారు. దాని ఫలితమే నేటి సమస్య. ఆదాయానికి తగిన దామాషాలో పెట్టుబడులు వుండాలన్న విషయం RTC మేధావులకు తెలియదా?

ఎందుకు తెలియదు? కాని అంతటా జరుగుతున్న తంతే RTCలోనూ జరిగింది. నిర్ణయాలు తీసుకునే అధికారుల్లో సింహభాగం తస్మదీయులు కావడమే అందుకు కారణం. లాభాలను ఇస్తున్న తెలంగాణాను గాలికి వదిలేసారు. కొత్త బస్సులు, లగ్జరీ బస్సులు, వోల్వో బస్సులు ఎక్కువ భాగం ఆంధ్రా ప్రాంతానికి కేటాయించడం మొదలు పెట్టారు.

దీనికి కారణాలు లేక పోలేదు. ఎక్కువ బస్సులు వుంటే తమ ప్రాంత జనానికి ఎక్కువ సౌకర్యవంతంగా వుంటుంది. తెలంగాణాలో మాదిరిగా top service చేయాల్సిన అవసరం లేదు. హాయిగా సీట్లలో కూర్చుని ప్రయాణించ వచ్చు. ఎక్కువ బస్సులుంటే ఎక్కువ డిపోలు వేసుకోవచ్చు. ఎక్కువ సిబ్బందిని నియమించుకోవచ్చు. తద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మరి వీరందరికీ జీతాలు ఎక్కడినుండి వస్తాయి? ఇంకెక్కడినుండి? తెలంగాణా వారు బస్సు టాపు మీద ప్రయాణించి సమర్పించుకున్న డబ్బులనుంచి. సంస్థను సపోర్టు చేసేది ఒకడైతే భోగాలు అనుభవించేది ఇంకోడన్న మాట!

కథ ఇక్కడితో ముగిసి పోలేదు. ఆదాయానికి మించి బస్సులను, డిపోలను, ఉద్యోగాలను సీమాంధ్రకు కేటాయించడం ఒక ఎత్తయితే, బస్ సర్వీసులను కూడా సమన్యాయం పాటించకుండా కేటాయించడం మరో ఎత్తు.

ఉదాహరణకి హైదరాబాదు - మచిలీపట్నం మధ్యన రోజుకు నాలుగు సర్వీసులు ప్రయాణిస్తాయనుకుందాం. అప్పుడు న్యాయప్రకారంగా హైదరాబాదుకు రెండు, మచిలీపట్నానికి రెండు సర్వీసులు (లేదా వాటికి అవసరమైన బస్సులు) కేటాయించాలి. కాని కేటాయింపులు అలా జరగలేదు. మీరు హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషనుకు వెళ్ళి పరిశిస్తే ఇట్టే అర్థమవుతుంది, అన్ని బస్సులూ ఆంధ్రాకే కేటాయించిన విషయం. విమర్శలు రాకుండా అక్కడక్కడా ఒకటీ, అరా మాత్రం తెలంగాణాకి కేటాయించారు.

ఇప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారు, తమకు ఎన్ని బస్సులు వస్తాయో, అన్ని బస్సులూ తమ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి తిప్పుతామని అంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు వారు చెప్పుకుంటున్న EPK కన్నా కూడా వారి EPK మరింత తక్కువకు పడిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆంధ్రా ప్రాంతపు EPKలో వారు అక్రమంగా తిప్పుకుంటున్న, న్యాయంగా తెలంగాణాకు చెదవలసిన EPK కూడా కలిసివుంది.

అదనంగా అనుభవిస్తున్న బస్సులు, డిపోలు, ఉద్యోగాలు ఎలాగూ వదులుకోలేరు కాబట్టి సీమాంధ్రకు చెందిన RTC నాయకులు ప్రభుత్వంలో RTCని merge చేయమని కోరుతున్నారు. అలా విలీనం చేయడం వల్ల ఆ నష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది, తాము జవాబుదారీ కావలసీ అవసరం లేదని వారి వ్యూహంగా కనపడుతుంది. కాని వరల్డ్ బ్యాంక్ చేత శాసించ బడుతున్న ఈ ప్రపంచీకరణ రోజుల్లొ వారి కోరిక ఎంత వరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

Friday, October 11, 2013

ఏది సమన్యాయం?


ఎన్నొ అడ్డంకులను ఎదుర్కున్న తెలంగాణా ఉద్యమం చివరికి సాకారం కాబోతున్న దశలో కొన్ని విష సర్పాలు పడగలెత్తి విషం చిమ్ముతూ తమ చివరి ప్రయత్నంలో భాగంగా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఆ సర్పాల్లో ఒకటి జగన్ అయితే రెండోది చంద్రబాబు నాయుడు.

తెలంగాణా విషయంలో డజన్ల సార్లు 'U' టర్న్‌లు తీసుకున్న చంద్రబాబు ఢిల్లీలో దీక్ష డ్రామాలు ఆడుతూ, రాబోతున్న తెలంగాణాను ఆపడానికి కొంతమంది మూడో ఫ్రంట్ నాయకులతొ తెరవెనుక మంతనాలు చేస్తూ బిజీగా వున్నారు. ప్రజలను ప్రభావితం చేయగల నాయకత్వ పటిమ లేనటువంటి చంద్రబాబు, మొదటి నుండి తన రాజకీయ మనుగడకు కుట్రలను, కుతంత్రాలను ఆసరా చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.

కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు దాన్ని సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ, కొత్త రాజధానికి ప్యాకేజీని కోరుతూ ప్రకటన ఇచ్చారు. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లో విఫలం చెంది, చివరకు సమ న్యాయం అంటూ దొంగనాటకాలు ఆడడం మొదలు పెట్టారు. రాజ్‌దీప్ సర్ సర్దేశాయ్ అనే CNN-IBNకి చెందిన జర్నలిస్టు తెలంగాణా విషయంలో చంద్రబాబు భావ దారిద్ర్యాన్ని నగ్నంగా బహిర్గత పరచారు. ఆయన చేసిన ఇంటర్వూలో తన వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదని, తాను తెలంగాణా ఏర్పాటును కాని, సమైక్యవాదాన్ని కాని బలపరచ లేనని ఒప్పుకున్నారు. పైగా ఈ నిర్ణయం వల్ల తన పార్టీ దెబ్బతింటుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగానే సెలవిచ్చారు.

తెలంగాణా పార్టీ నష్టపోతుంది కాంగ్రెస్ నిర్ణయం వల్ల కాదు, కేవలం ఆ పార్టీ రాజకీయ జడత్వం వల్ల. సమస్యను గుర్తించి రాజకీయ పరిష్కారాన్ని అన్వేషించే విషయంలో అది ఘోరంగా విఫలమైంది. అటువంటి పరిస్థితిలొ పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఇంకో పార్టీని వ్యతిరేకించే నైతిక హక్కు అది ఎప్పుడో కోల్పోయింది. ఈ దీక్ష వల్ల తెలుగు దేశం పార్టీకి అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు మరోసారి తన రాజకీయ దివాళాఖోరు తనాన్ని బయట పెట్టుకోవడం తప్ప.

సమన్యాయం కావాలని కోరుతున్న చంద్రబాబు ఆ సమన్యాయం అంటే ఏమిటో నిర్వచించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. కారణాలు సుస్పష్టం. అందుకోసం తర్కించినకొద్దీ నిర్ణయాలు తెలంగాణాకు అనుకూలంగా మారుతాయే తప్ప సీమాంధ్రకు కాదు. అది చంద్రబాబుకు బొత్తిగా ఇష్టం లేని విషయం. ఏదో ఒక వంక చెప్పి రాష్ట్ర విభజనను ఆపడమే ఆయన ధ్యేయంగా కనపడుతుంది.

ఇంతకీ సమన్యాయం అంటే ఏమిటి? ఐదు దశాబ్దాలుగా అన్ని రకాలుగా దోచుకున్న తెలంగాణాకు ఏ విధంగా సమన్యాయం చేస్తారు? కేటాయింపులు లేక పోయినా లక్షల ఎకరాల్లో క్రిష్ణా జలాలను పారించుకుంటున్న విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు. వాటికై ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పక్కనే కృష్ణా పారుతున్నా తమ ప్రాంతీయ పక్షపాతంతో నల్లగోండ ప్రజలను దశాబ్దాలుగా ఫ్లోరీన్ వాతకు గురి చేసిన నేరానికి ఎంత పరిహారం చెల్లిస్తారు? తెలంగాణా ప్రాంతానికి చెందిన వేలాది ఉద్యోగాలను అక్రమంగా అనుభవిస్తూ, ఇక్కడి ప్రజలను అన్యాయానికి గురిచేసినందుకు ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పైగా ఇక్కడే తిష్ట వేస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారే!

చంద్రబాబుకు కానీ మరో సీమాంధ్ర నాయకునికి గానీ తెలంగాణాని ఆపాలని ఎంత కోరిక ఉన్నా, 'సమన్యాయం' అన్న వాదనను పట్టుకుంటే అది చివరికి తెలంగాణాకు ప్రయోజనం చేకూరుస్తుందే తప్ప సీమాంధ్రకు కాదు. కారణం న్యాయం తెలంగాణా వైపు వుంది కాబట్టి. సమైక్య వాదులు కోరుతున్నది ప్రాంతీయ దోపీడీని స్థిరీకరించడం కాబట్టి వారి కోరికలో న్యాయం లేదు. అంతకన్నా విభజనానంతరం సీమాంధ్రకు చేకూర వలసిన నిర్దిష్ట ప్రయోజనాలకోసం పోరాటం చేస్తే భవిష్యత్తులోనైనా వారు ఆ ప్రాంత ప్రజల మనస్సులను గెలుచుకో గలుగుతారు.


Tuesday, October 8, 2013

మనుషులైతె గిది చూసి బుద్ధి తెచ్చుకోండ్రి

గాయిన పేరు చెంద్రబాబు...

2008ల లెటరిచ్చిన నంటడు.

ఇప్పుడు తెలంగాణ ఇయ్యాల్నంటవా అనడిగితె "నో" అంటడు.

అసెంబ్లీల బిల్లు పెడితె సపోర్టు చేస్తవా అనడిగితె "నో" అంటడు.

పార్లమెంటుల బిల్లు పెడితె వోటేస్తవా అంటె "నో" అంటడు.

జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇర్వై తీర్ల అడిగినా గూడ, ఒక్క తీర్గ గూడ తెలంగాణాకు అనుకూలమని చెప్పడు.

గీ బాబునా మీరు పట్టుకొని తిరిగేడిది?

తెలంగాణ తెలుగు తమ్ముళ్ళూ, గిది చూసినంక గూడ మీకు బుద్ధి రాకపోతె మిమ్ముల నేమని పిలువాలె?

Friday, October 4, 2013

దొపిడీలొ ఎలాంటి మార్పూ వుండదా?

తెలంగాణా ఏర్పాటుపై సింపతీ వున్న కొందరు ఆంధ్రా ప్రాంతపు మధ్యేవాదులు కొత్త వాదనను లేవనెత్తుతున్నారు. అదేమంటే తెలంగాణా ఏర్పడిననంత మాత్రాన దోపిడీ పోదట! కేవలం ఆంధ్రా వారు చేసే దోపిడీని తెలంగాణా వారే చేస్తారట. అది నిజమే కావచ్చు. కాని దోపిడీలలో కూడా రకరకాల రూపాలుంటాయి. అన్నింటినీ కలగలిపి ఒకే గాటన కట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఇటువంటి వారు తాము కంఫ్యూజ్ అవుతూ ఇతరులను కన్‌ఫ్యూజ్ చేయడనికి ప్రయత్నిస్తుంటారు.

SC, ST వర్గాలు తమకు దామాషా ప్రకారం నిధులు వెచ్చించ బడడం లేదని సమ్మె చేశాయి. సబ్-ప్లాన్ సాధించుకున్నాయి అనుకుందాం. అంతటితో దోపిడీ ఆగుతుందా? ఆ సబ్-ప్లాన్ నిధులు మళ్ళీ కాంట్రాక్టర్లకే సమర్పించబడతాయి. అందులో సింహభాగం భోంచేయ బడతాయి. ఏ కొద్ది భాగమో కర్చు చేయ బడతాయి.

దోపిడీ ఆగలేదు కాబట్టి అసలు సమ్మేలే చేయొద్దంటారా? మొదటిది నిమ్న కుల/వర్గాలపై జరిగే దోపిడి. రెండోది అందరిపైనా ఏకమొత్తంగా జరిగే అవినీతి దోపిడీ. ఇక్కడ దోపిడీ అంటం కాకపోయినా రూపం మారిందని గమనించండి. అప్పుడూ దళితుడు తనపై మాత్రమే జరుగుతున్న దోపిడీని అరికట్ట గలిగాడు కాబట్టి, సకల జనులతో కలిసి అవినీతి పై పోరాడ గలుగుతాడు. అప్పుడు అవినీతిపై పోరాడే వారి సంఖ్య పెరుగుతుంది. అవినీతి కన్నా బలమైన దోపిడీ తనపైనే జరుగుతున్నప్పుడు ఆ దళితుడు తనకు మాలిన ధర్మంగా అవినీతిపై పోరాడడమనేది కల్ల.

అలాగే మహిళలపై అత్యాచారాలు, గృహహింస విపరీతంగా వున్నాయనుకుందాం. అదీ ఒకరకమైన దోపిడీయే. అప్పుడు మహిళలను "ముందు మీరు అవినీతిపై పోరాడండి, తర్వాత మీ సమస్యలు చూద్దాం" అంటే ఎలా వుటుంది? అది ఎంతవరకు సమంజసం?

మనసమాజంలో ఇప్పుడు మీరు చెప్టున్న ఆర్థిక దోపిడీయే కాక అంతకన్నా కౄరమైన అనేక దోపిడీ రూపాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక దోపిడీని అంతమొందించడం ఎంత అవసరమో, మిగతా రకాల దోపిడీలను అంతమొందించడం అంతకన్నా ఎక్కువ అవసరం. మీరు గమనించే వుంటారు... అన్నా హజారే మీటింగులకు ఇతరేతర దోపిడీలకు అతీతంగా వున్న వారే హాజరవుతుంటారు.

తెలంగాణా పై జరిగిన ప్రాంతీయ దోపిడీ కూడా అటువంటిదే. ఒకప్పుడు నీరు పల్లమెరిగి, ఆంధ్రాకు వస్తే మేమేం చేయాలి? అంటూ వగలు పోయినవారు, నేడు తెలంగాణా ఏర్పడితే తమప్రాంతం ఎడారిగా మారుతుందంటున్నారు.

ఒకప్పుడు కమీషన్లు లెక్కతేల్చిన వేలాది అక్రమ ఉద్యోగ నియామకలు బూటకాలని బుకాయించినవారు, నేడు, వేలకొద్దీ ఉద్యోగాలకు ప్రమాదం వస్తుందని గాభరా పడుతున్నారు.

తెలంగాణా సంస్కృతి పై దాడి, తెలంగాణా పండగలకు సెలవులుండవు. తెలంగాణా చరిత్ర text పుస్తకాల్లో వుండదు. తెలంగాణా యాసను విలన్లకు కమేడియన్లకు పెట్టి రాక్షసానందం పొండడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! ఇవాన్నీ కూడా దోపిడీకి రూపాలే!! ఒక ప్రాంతం మొత్తంగా మరో ప్రాంతం పై కొనసాగిస్తున్న దోపిడీ.

అధ్రా ప్రజలకు అర్థం కాకపోవచ్చు. వారు అనుభవించడం లేదు కాబట్టి. కాని తెలంగాణా ప్రజలకు ఈ ప్రాంతీయ దోపిడీ నుంచి విముక్తి పొందడం అత్యవసరం. అంతవరకూ వారు మిగతా రకాలైన దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఇతరులతో మమేకం కాలేరు.

Thursday, October 3, 2013

జయహో తెలంగాణ!

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పథంలో ఈరోజు రెండొ కీలకమైన మైలు రాయి దాటిన సందర్భంగా తెలంగాణా వాదులందరికీ అభినందనలు.

1969 ఉద్యమంలో తీవ్ర అణచివేతకు గురైన దరిమిలా, తెలంగాణా రాష్ట్రం అసలు ఎప్పటికైనా ఏర్పడుతుందా? అన్న శంకతో ఉన్న ప్రజలను తట్టిలేపి తన మార్గంలోకి రప్పించిన ఘనత మాత్రం KCRదే. అందుకే రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించే ప్రతి ఒక్కడూ ఆయన్ను తిట్టని తిట్టు లేదు.

KCR స్థాపించిన TRS పార్టీ ఇచ్చిన ప్రేరణ వల్ల అనేక ఇతర ప్రజా సంఘాలు JACలు, కవులు, కళాకారులు, నెటిజన్లు, బ్లాగర్లు ఇలా ఒకరేమిటి? ప్రతి ఒక్కరు నదులు, ఏర్లు, పిల్ల కాలువలై తెలంగాణా పోరాట స్రవంతిలో భాగంగా మారారు. తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. వారందరికీ నా ఉద్యమాభివాదాలు.

ఒకవైపు బలమైన శతృవులను నిర్భీతిగా ఎదుర్కుంటూ KCR అభిమన్యునిలా పోరాడుతుంటే, మరో వైపు ధర్మరాజులా తొణకని కుండలాంటి మూర్తిమత్వంతో కోదండరాం తెలాంగాణా పోరాటానికి వెలకట్టలేని నాయకత్వాన్ని అందించారు. వీరందరినీ మించి ఉద్యమంలో స్తబ్దత నెలకొన్న ప్రతీసారీ, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, పణంగా పెట్టి ఉద్యమ స్పూర్తిని రగిలించిన అమరవీరులది వెలకట్టలేని పాత్ర.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకై ఇప్పటివరకూ జరిగిందానితో పోలిస్తే ఇకముందు జరగాల్సింది నల్లేరు మీద బండి నడక. అయినా మనం అప్రమత్తంగానే వుందాం, సీమాంధ్ర నాయకుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కుందాం!

ఈ సందర్భంలో తలుచుకోవలసిన మరొక పేరు సోనియా గాంధీ. సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తొణక్కుండా ధీరవనిత అనిపించుకున్నారు! తెలంగాణా ఏర్పాటులో తన ప్రయోజనాలు తనకుండొచ్చు, కాని ప్రయోజనాలు లేకుండా ఎవరూ ఏమీ చేయరు. తెలంగాణా రాష్ట్రం సాకారమైన తర్వాత ఈ ప్రాంతపు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన పేరు ఆమెది.

ఇక పోతే సీమాంధ్ర ప్రజలకు ఒక విఙ్ఞప్తి. ఇప్పటికైనా కలవడానికి ఇష్టం లేని ప్రాంతాన్ని కలపుకోవడానికి చేసే దొంగ సమైక్యతా ఉద్యమాలు గుర్తింపుకు నోచుకోవని, ఉన్మాదంగా భావించబడతాయని తెలుసుకోండి. అలాగే, పరాయి ప్రాంత భూభాగాలను కబళించడం తప్పని ఇకనైనా గుర్తించి సొంత రాజధాని ఏర్పాటు కోసమై గట్టి ప్రయత్నం చేయండి. అందుకై కేంద్రంపై పోరాడండి. అందుకోసం తెలంగాణా వాదులం పూర్తి సంఘీభావం తెలుపుతాం.


Tuesday, October 1, 2013

స్టేజ్‌షోలా, ఉద్యమాలా? ఒక ప్రత్యక్ష అనుభవం!! పోస్టుకు కొనసాగింపు..


ఇది గత 26-సెప్టెంబర్ నాడు రాజమండ్రి లో జరిగిన ఒక APNGOల సమైక్యాంధ్ర రాల్లీ. కనిపించే పిల్లలంతా ఇక్కడ హైదరాబాదు నుంచి పోయిన తెలంగాణా కాలేజి పిల్లలు. ఎడ్యుకేషన్ టూర్ కు పోతున్న వాళ్ళను బలవంతంగా దింపి రాల్లీలో కొద్ది సేపు నడిపించిన్రు. మనోళ్ళను తీసేస్తే మిగిలింది పది పదిహేను మందే ఆ రాల్లీలో. అదీ మీడియా ఒస్తున్నదని తెలిసి అప్పటికప్పుడు చేసింది. మీడియా షూటింగ్ ఐపోగానే ఎక్కడివాళ్ళు అక్కడే గప్ చుప్.