Tuesday, January 29, 2013

ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?


కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేట తెల్లమైన ఈ సమయంలో 2014 లోపల తెలంగాణా వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్టే. ఈలోపు ఏదన్నా జరిగి ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతర ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తే తప్ప తిరిగి తెలంగాణా ఏర్పాటు వైపు  అడుగులు పడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?

ఇక ఎన్నికల్లోపు తెలంగాణా రాదనీ ఊరుకుందామా? సీమాంధ్ర మీడియా విజృంభిస్తుంది. ఉద్యమమే లేదు, అంతా చల్లబడి పోయింది అని ఊదర గొడుతుంది. చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వం ముందు ఎన్ని ఉద్యమాలు చేస్తే మాత్రం ఏం లాభం? అనే ప్రశ్న వస్తుంది.

ఉద్యమం పేరుతో బందులు, స్కూళ్ళు, కాలేజీల మూసివేత, రవాణా ఇబ్బందులు మొదలైన వాటితో ప్రజలు విసిగి పోయే అవకాశం వుంది. సకల జనుల సమ్మెతో సహా ఇప్పటివరకు జరిగిన అన్ని ఉద్యమాలలో తెలంగాణా ప్రజలే బాధలు పడుతున్నారు తప్ప సీమాంధ్ర దోపిడీ దారులపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఇక ప్రభుత్వమేమో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని తెలంగాణా ప్రజలు, విద్యార్థులు చేసే ఉద్యమాలను అత్యంత నీచమైన అప్రజాస్వామికమైన పద్ధతుల్లో అణచి వేస్తుంది.

ఇంతటి ఉద్యమం వేడిలోనూ పోలీసు రిక్రూట్ మెంటు, గవర్నమెంటు స్కూళ్ళ అప్ గ్రేడేషన్, హంద్రీ నీవా, పోలవరం మొదలైన రూపాల్లో తెలంగాణపై దోపిడీ యధేచ్చగా సాగుతూనే వుంది. దోపిడీ శక్తులు తెలంగాణా ప్రజలు చేసే ప్రజాస్వామిక ఉద్యమాలను చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తమ పోలీసు బలగాలతో ఉద్యమాలను అణచి వేస్తూ, తాము ఎలాగైనా బరితెగించ గలమని, ఏమైనా చేయగలమన్న భరోసాను కలిగి ఉన్నాయి. దోపిదీలో భాగం దొరుకుతుంది కాబట్టి  కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి దోపిడీ శక్తులకే వత్తాసు పలుకుతుంది.

ఇటువంటి పరిస్థితులలో తెలంగాణా ఉద్యమం తన దిశను మార్చుకోన వలసిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పద్ధతులను వీడకుండానే ఉద్యమ విధానాలలో కొద్ది పాటి మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డిల్లీలో జరిగిన  అన్నా హజారే, రేప్ కేసు ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి.

మీడియాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఉద్యమ వార్తలు ప్రచారం ప్రచారం చేయవలసిన అనివార్య పరిస్థితులను కల్పించాలి. ఉద్యమ కార్యాచరణను రూపొందించడంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఉద్యమం వల్ల తెలంగాణా, ఆంద్ర ప్రజలకు కాక, సీమాంధ్ర దోపిడీ శక్తులకు, సమైక్య వాదులకు, నాన్పుడు ధోరణితో కాలం వెళ్ళదీస్తున్న రాజకీయులకు ఎక్కువ నష్టం కలిగించేవిగా ఉండాలి. ఆ నష్టం భౌతిక మైనదే కావలసిన అవసరం లేదు.
సీమాంధ్ర దోపిడీ, అక్రమాల గురించి ప్రతి రొజూ ప్రచారం జరుగుతున్నా, వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరగడం లేదు. ఉదాహరణకు సాగర్ నీళ్ళు, పోతిరెడ్డి పాడు జలాల తరలింపు. రాజోలి బండ, రిక్రూట్ మెంట్లు, నిధుల మళ్లింపు మొదలైనవి. తెలంగాణా ఉద్యమంలో భాగంగా వీటిపై కూడా ఉద్యమించాలి. తమ దోపిడీకి అడ్డంకులు వస్తున్నాయని భావించినప్పుడు దోపిడీ దారుడు కూడా భద్రమైన ప్రదేశాలు (సీమాంధ్ర) వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. 

ఉద్యమాల సంఖ్య తగ్గించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించే ముందే, దాని స్వరూప స్వభావాలను, ఫలితాలను, శత్రువుకు కలిగించే నష్టాలను గురించి సమగ్రమైన విశ్లేషణ చేసుకోవాలి.

తెలంగాణా కనుచూపు మేరలో కనిపించని ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమ కార్యాచరణపై పునఃపరిశీలన జరుపుకోవడం అత్యవసరం.
   

Sunday, January 27, 2013

ఉండవల్లి అరుపులకు కారణాలేమిటి?




ఉండవల్లి జై ఆంధ్ర ఉద్యమానికి నలభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా రాజమండ్రిలొ ఒక మీటింగు పెట్టాడు. దానికి జై ఆంధ్ర అని కాకుండా జై ఆంధ్ర ప్రదేశ్ అని పేరు పెట్టినప్పుడే దాని దివాళాఖోరు తనం అర్థమయ్యింది. ఇక ఆయన జై ఆంధ్ర ఉద్యమ వివరాలను చెప్పకుండా దాటవేసి, వేదికను తెలంగాణాను తిట్టడానికి వాడుకున్నాడు. తెలంగాణా వాదులను రజాకార్లతో పోలుస్తూ, అన్యాపదేశంగా వారికీ రజాకార్ల గతే పడుతుందని బెదిరింపులకు దిగాడు. నిజానికి, ఒకప్పుడు తెలంగాణా ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షకు  కాశీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డు పడ్డట్టే, ఇప్పుడు సీమాంధ్ర పెత్తందార్లు లగడపాటి నాయకత్వంలో అడ్డు పడుతున్న విషయం పరిశీలిస్తే ఎవరు రజాకార్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఉండవల్లి అరుణ్ కుమార్, మధ్యే వాదిగా పేరుపడ్డ వాడు. అంతో ఇంతో తర్కం ఉపయోగించి మాట్లాడే వానిగా పేరు పొందాడు. ఇదివరలో ఎప్పుడూ తెలంగాణా ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పుడప్పుడూ కరడు గట్టిన సమైక్య వాదులను మందలించిన సందర్భాలూ చూశాం. మరి ఇప్పుడు హటాత్తుగా తెలంగాణా వాదులపై విరుచుకు పడడానికి కారణమేమిటి?

ఈ విషయం తెలుసు కొవాలంటే మొదట ఉండవల్లి ఎవరో తెలుసుకోవాలి. ఆయన పెద్దగా ప్రజాబలం లేని, తెలివితేటలే పెట్టుబడిగా కలిగిన రాజకీయ వేత్త. సోనియా గాంధీ ఉపన్యాసాలు అనువదించడం ద్వారా ప్రచారం పొందాడు. సోనియా గాంధీకి వీర విధేయతతో పదవులు పొందేవాడు. సోనియా అనుఙ్ఞ లేకుండా నోరు తెరిచి ఆవులించడానికి కూడా వెనుకాడే వాడు. మరి అలాంటి వాడు ఎందుకు రాజమండ్రిలో అదీ తెలంగాణా పై కేంద్రం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇలా తన నిజ స్వభావానికి విరుద్ధంగా మూర్ఖ వాదనలకు దిగాడు?

ఇదంతా చూస్తే సోనియా అనుమతి లేకుండా ఉండవల్లి ఇలా పెట్రేగడం ఊహించలేం. కచ్చితంగా రాజమండ్రి సమావేశం సోనియా దర్శకత్వం లోనే జరిగిందని భావించ వలసి వస్తుంది. మరి జనవరి 28న నిర్ణయం తీసుకోవలసిన సమయంలో సోనియా ఇలాంటి మీటింగు పెట్టుకోమని ఎందుకు పురిగొల్పుతుంది?

షిండే సమావేశం నుండి చింతన్ శివిర్ చివరి వరకు కూడా కాంగ్రేస్ కదలికల్లో తెలంగాణా ఏర్పాటుకు అనుకూలత కనిపించింది. మధ్యలో సమైక్య వాదుల లాబీకి కూడా రవి, అజాద్ల దూషణ, తిరస్కారాలు ఎదురయ్యాయి. కాని, KVP రామచంద్ర రావు ఆధ్వర్యంలో సీమాంధ్ర లాబీ ఢిల్లీలోని పెద్ద నాయకులను కలిసిన తర్వాత పరిస్థితులు మారాయి.

KVP ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం సమైక్యంగా వుంచితే కాంగ్రేస్‌కు కలిగే ప్రయోజనాలను వివరించినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రం కలిపి వుంచితే 2014 వరకు జగన్‌ను కాంగ్రేసులో చేరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. 2014లొపు కలిస్తే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తుంది. జగన్ అవినీతి పై పెద్ద పెట్టున ప్రచారం చేసి TDP లబ్ది పొందుతుంది. కాబట్టి ఎన్నికల లోగా ఇవి రెండు కలిసే అవకాశం లేదు.

కాంగ్రెస్ వ్యూహం ఇలా కనిపిస్తుంది. ఎన్నికల వరకూ జగన్‌తో పోరాడినట్టు నటించడం. పైగా జగన్, TDPతో సహా అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలించినా, తాము సమైక్యత కోసం నిలబడ్డట్టు సీమాంధ్రలో బిల్డప్ ఇవ్వడం. ఇక తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ పంథాను వ్యతిరేకిస్తూ బయటికి వస్తారు. వారు TRSలో చేరకుండా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు చేసి వీలయినన్ని తెలంగాణా వాదంపై పోరాడే సంస్థలను కలుపుకుంటారు. వాటి సహకారంతో ఎన్నికల్లో పోటీ చేసి వీలయినన్ని సీట్లు గెలుస్తారు. ఇక TDP తాను కూడా తెలంగాణా ఏర్పాటుకు లేఖ ఇచ్చానని ప్రచారం చేసుకొని కొన్ని సీట్లు తెచ్చుకుంటుంది. BJP ముందునుంచీ తెలంగాణా వాదాన్ని వినిపించే పార్టీ కాబట్టీ అది కూడా కొన్ని సీట్లు గెలుస్తుంది.

ఇలా 2014 ఎన్నికల్లో బహుముఖ పోటీ ఏర్పడ్డం వల్ల  పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా ఒంటరిగా మారి, TRS గత ఎన్నికల మాదిరిగానే అతి తక్కువ సీట్లకు పరిమిత మవుతుంది. తెలంగాణా వాదం మరొకసారి నీరు గారుతుంది. ఇదీ స్థూలంగా KVP ప్లాన్. దానికి నాందీ వచనమే రాజమండ్రి మీటింగ్. దానికి స్క్రిప్టు  KVPది అయితే, దర్శకత్వం సోనియాది, నటుడు ఉండవల్లి.

తెలంగాణా ఏర్పడే వరకూ ఇలాంటి కుట్రలు ఎన్ని ఎదురవుతాయో చెప్పలేం. 2014 ఎన్నికల వరకూ తెలంగాణా వచ్చే అవకాశం ఎలాగూ కనిపించడం లేదు. కాబట్టి తెలంగాణా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా వుండి ఆ ఎన్నికల్లొ తెలంగాణా వాదం కొసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ అయిన TRSని మాత్రమే పూర్తి మెజారిటీతో 17 లోక్‌సభ సీట్లలో గెలిపించాలి. అదోక్కటే ప్రస్థుతానికి సీమాంధ్ర కుట్రలను ఎదుర్కొనే తరుణోపాయం.

Friday, January 25, 2013

సమైక్యత


అమ్మా, అన్న కొడుతున్నడమ్మా... నేను వానితోటి ఆడుకోను... పక్క రూంలో ఆడుకుంట.

ఒరే పెద్దోడా. వాణ్ని మళ్ళా కొట్టినవా? ఒక్క నిముషమన్నా నిమ్మలంగ ఉండవు కదా!

లేదమ్మా, నేను కొట్టలేదు. తమ్ముడే నన్ను కొట్టిండు, గిచ్చిండు.

నువ్వు కొట్టక పోతే వాడెందు కేడుస్తడు?

వాడివన్నీ దొంగేడుపులు. నా వాటరు బాటిలు అడుక్కొని నీళ్ళు తాగుతడు. నేను తినే చాక్లేట్టులో వాటా అడుగుతాడు. మళ్ళీ నన్నే కొడుతుంటడు. వాడు చెప్పేవన్నీ నూటొక్క అబద్ధాలు.

అవునా? అయితే వాణ్ని పక్క రూములో ఆడుకోనియ్యి. నువ్వు ఈ రూములో ఆడుకో.

అస్సలు కుదరదు. వాడూ, నేనూ ఒక్క దగ్గరే ఆడు కోవాలి!

ఎందుకురా? నువ్వు చెప్పే మాటల ప్రకారం వాడు లేక పోతే నీకే మంచిదిగా?

ఇప్పుడు వాడు పక్క రూములో ఆడుకుంటే... రేపు పక్కింట్లో పిల్లలు వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. మరుసటిరోజు పొరుగూరు పిల్లలు కూడా వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. ఎల్లుండి దేశం మొత్తం అలాగే ఆడుకుంటారు. అప్పుడు దేశం లోని అన్నల సంగతేం కావాలి?

ఏమవుతుంది? ఎవరి మానాన వాళ్ళుంటారు...

కాదు. పక్క రూములో ఆడుకునే తమ్ముడు నాకు వేలకు వాటర్ బాటిలు నింపుకొచ్చి ఇస్తాడా? వాడి వంతు చాక్లెట్లు కూడా నేను తినగలనా? వాడు లేక పోతే నాకు కాళ్ళు ఎవరు వత్తుతారు?

అమ్మ దొంగా! ఇదా నీ సంగతి!!


 

Sunday, January 20, 2013

సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం తీవ్రతరం చేస్తాం!


"సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం తీవ్రతరం చేస్తాం."

తరచుగా సమైక్యవాదులు వినిపించే మాట ఇది. గత రెండు మూడు రోజులుగా మరింత ఎక్కువగా వినబడుతుంది. కేవలం సీమాంధ్రలో ఉద్యమం చేస్తే అది సమైక్యవాదం ఎలా అవుతుంది? గీతకు రెండువైపులా ఉంటేనే అది సమైక్యవాదం అవుతుంది. కేవలం ఒక ప్రాంతం వారు రెండో ప్రాంత భవిష్యత్తు పై ప్రభావం చూపాలనుకుంటే అది దౌర్జన్యం అవుతుంది తప్ప సమైక్యవాదం కాదు.

బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తుంటే బ్రిటిషర్లు ఎలా వుంటుందో అలా వుంటుంది. కనీసం బ్రిటిష్ వారు మనకు పాలకులు, మనం బానిసలం. అయినా వారు అలాంటి ఉద్యమాలు చేయలేదు. కాని కొన్ని సమైక్యవాద ముఠాలు సామ్రాజ్యవాదుల కన్నా హీనం. వీరు కనీసం తాము వలసగా మార్చుకున్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారడం కూడా సహించలేరు.

వీరికి తెలంగాణా ప్రాంతం కూడా స్వతంత్ర భారత దేశంలో ఒక భాగమని, ఈ దేశంలో వీరికి ఎన్ని హక్కులు ఉన్నాయో వారికి కూడా అన్ని హక్కులే ఉన్నాయని ఏమాత్రం గుర్తించరు. పైగా తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉండాలో, ఉండకూడదో తామే నిర్ణయించ గలమన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలమీద ఏమాత్రం గౌరవం ఉన్నవారైనా ఇలాంటి ఫాసిస్టు ఆలోచనలు చేయరు.

సీమలో, ఆంధ్రలో ఉన్న అనేకులైన సహృదయులు తెలంగాణా ఉద్యమానికి అడ్డు చెప్పడం లేదు. వారు తెలంగాణా ప్రజలయోక్క న్యాయబద్ధమైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆమోదిస్తున్నారు. కాని కొంతమంది వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన పెట్టుబడి దారులు మాత్రం సమైక్య మంత్రం జపిస్తున్నారు. వీరిని పెట్టుబడి దారులు అనడం కంటే, 'న్యాయం నాలుగు పాదాల నడిస్తే, జగన్ తో చంచల్ గూడా జైలులో షటిల్ ఆడవలసిన వారు' అంటే బాగుంటుంది. వీరికి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల కంటే తాము చేస్తున్న అక్రమ వ్యాపారాలు, భూకబ్జాల పైనే ఎక్కువ మక్కువ. రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వారు సమైక్యవాదం పేరు చెపుతూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికి డబ్బులు వెచ్చిస్తూ శాయ శక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

వివేచనా పరులైన ఆంద్ర ప్రజలు మాత్రం సమైక్యవాదుల మాటల గారడీ ప్రభావానికి లోను కావడం లేదు. కాని వీరి చెప్పు చేతల్లో ఉండే మీడియా మాత్రం వీరు చేసే చిన్నా చితకా ఉడత చప్పుళ్ళను సింహ గర్జనలుగా చూపడానికి తమ శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఈరోజు విజయవాడలో జరిగిన  NGO సమైక్యవాద మీటింగును ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ చానెళ్ళు ఒక్క సారి కూడా కెమెరాను ప్రేక్షకుల వైపు తిప్పిన పాపాన పోలేదు. అలా తిప్పితే అసలు స్టేజి మీది హుంకారాలకు, స్టేజి కింది సభికుల సంఖ్యకు పొంతన కుదరదని వారికి తెలుసు.

Friday, January 18, 2013

కాంగ్రెస్ పురిటి నొప్పులు


కాంగ్రెస్ పార్టీ తెలంగాణా మీద నిర్ణయం తీసుకోవడానికి పురిటి నొప్పులు పడుతున్నట్టు తెలుస్తుంది. మిన్ను విరిగి మీద పడితే కాని నిర్ణయాలు తీసుకొని ఆ పార్టీకి ఇప్పుడు నిజంగానే ఆ పరిస్థితి వచ్చిందా?

కాంగ్రెస్ ప్రజాభీష్టం మేరకు కాక, తన ప్రయోజనాల ప్రాతిపదిక మీద మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం జగమెరిగిన సత్యం. మరి ఆ నిర్ణయం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.

తెలంగాణా ఇవ్వకుండా దాటవేస్తే...

మరికొన్నాళ్ళు దాట వేయడానికి ప్రయత్నించవచ్చు. 2014 ఎన్నికల్లోగా తెలంగాణా ఇవ్వకపోతే అది తెలంగాణా ప్రాంతంలో తుడిచి పెట్టుకొని పోతుంది. ఆ విధంగా చేసినందుకు దానికి ఆంధ్ర ప్రాంతంలో కలిసొచ్చే దేమీ వుండదు. జగన్ ప్రభంజనంలో అక్కడ మార్పు ఉండదు.

తెలంగాణా ఇవ్వము అని కరాఖండీగా చెప్తే...

తెలంగాణా ఉద్యమం హింసాయుతం అయ్యే అవకాశం వుంది. పరిస్థితి BJP కి అనుకూలం అయ్యే అవకాశం వుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తెలంగాణా ఇవ్వ వలసిన అనివార్య పరిస్థితులు ఎదురు కావచ్చు. అప్పుడు తెలంగాణా ఇచ్చినా ఉపయోగం వుండదు.

TRS, BJP ఒక్కటవుతాయి. తెలంగాణలో 19 ఎంపీ సీట్లు అవి క్లీన్ స్వీప్ చేస్తాయి. అనవసరం గా ప్రత్యర్ధి BJP కి సీట్లు పెంచినట్టు అవుతుంది. ఆంధ్రలో ఒరిగేది ఏమీ వుండదు. జగన్ ప్రభావం యధావిధిగా వుంటుంది. చంద్రబాబు కూడా పుంజుకునే అవకాశం వుంది. గత ఉప ఎన్నికల్లో సమైక్య వాదాన్ని ప్రచారం చేసుకున్నా కాంగ్రెస్ పెద్దగా సాధించిందేమీ లేదన్న విషయం గమనించాలి.

తెలంగాణా ఇస్తే...

TRS విలీనమయ్యే అవకాశం, తద్వారా తెలంగాణలో 19కి 19 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం (మారిన MIM రాజకీయాల వల్ల). ఆంద్ర పరిస్థితి యధావిధి.

ఈ నెలాఖరు లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇవ్వము అని చెప్పడం, దాటవేయడం కాన్నా ఆత్మహత్యా సదృశం. కాబట్టి ప్రకటన అంటూ ఇస్తే ఇవ్వదానికిఅఎ మొగ్గు చూపే అవకాశం వుంది.

హైదరాబాదు సమస్య.

తెలంగాణా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆంద్ర సీట్లపై ఆశ వదులుకునే వుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రను మెప్పించడం కన్నా తెలంగాణా ప్రజలను మెప్పించడం దానికి అవసరం. లేక పొతే తెలంగాణా ఇచ్చినా పెద్దగా రాజకీయ ప్రయోజనం లభించదు. ఉద్యమం చల్లారదు. కాబట్టి తప్పని సరిగా తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకు హైదరాబాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణా మాత్రమె ఇవ్వ వలసిన పరిస్థితి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణా ప్రజలు, JACలు నిరంతరం అప్రమత్తంగా ఉండ వలసిన అవసరం వుంది. ప్రజాభీష్టం తెలంగాణా వైపు ఉన్నా, పెట్టుబడి దారుల ఆలోచనలు విరుద్ధంగా ఉండడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పరిస్థితులు తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. 

గిదీ సమైక్యాంధ్ర


రాష్ట్రం ఇస్తే
విధ్వంసం సృష్టిస్తా నన్నవాడు
విచ్చలవిడిగా
తిరుగుతనే ఉన్నడు

రాష్ట్ర ప్రభుత్వ
యంత్రాంగం
గాంధారి పాత్ర
పోషిస్తుంది

జై తెలంగాణా
అన్న పుణ్యానికి
వైద్యం చేసుకునే డాక్టర్ ని
గుంజుక పోయి
జైల్లో పెట్టిన్రు

గిదీ సమైక్యాంధ్ర!
మనకు అవసరమా!

Wednesday, January 16, 2013

తెలంగాణ ఏర్పడితె



సమైక్య వాదులు...

ఒకనికి హైదరాబాదు కావాలె
ఇంకోనికి హైదరాబాదు కేంద్ర పాలితం కావాలె

మరొకని మాతలు ఇంకా విచిత్రం
తెలంగాణ విడిపోతే, ఆంధ్ర, సీమ కూడా విడిపోవాలె!
వాడు కూడా సమైక్య వాదే మరి!

ఆంధ్ర మేధావిని అని చెప్పుకొనే
మరొకని వాదన మహా వికారం!

కలిసి వుండి నష్టపోయినమంటడు...
విడిపోతె ఇంకా నష్టపోతమంటడు.
రెండింట్ల ఏది నిజం?
రెండు విధాల నష్టపోతె
ఇంక లాభపడే దెప్పుడు?

ఒకడు తెలంగాణ వస్తే
అవినీతి పెరుగుతది అంటడు...
అయ్యా... పోయినోడి హయాంలోని
అవినీతిని మించడం
ఎవరికైనా సాధ్యమా?
వాడు పక్కా సమైక్యవాది కాదా?

తెలంగాణ ఏర్పడితె
మతకల్లోలాలు చెలరేగుతయట!
మతం చిచ్చు రేపిన అసద్
సమైక్యవాదా, ప్రత్యేకవాదా?
మత కల్లోలాలకు
ఎవరు బాధ్యులో
సచ్చినోడికన్నా
ఎవరికెక్కు వెరుక?


Tuesday, January 1, 2013

విజయవాడలో తెలంగాణ బస్సుపై దాడి


- డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు ..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
- మద్యం మత్తులో నానా బీభత్సం.. తెలంగాణవాళ్లనే దాడి: టీఎంయూ 

తొర్రూరు, డిసెంబర్ 30 (టీ మీడియా): ఆంధ్రా ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ తెలంగాణ బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో నానా బీభత్సం సృష్టించారు. వస్తూనే.. డ్రైవర్, కండక్టర్లపై దాడికి దిగారు. అంతా ‘‘వరంగల్ వాళ్లే.. చితకబాదండి’’ అంటూ అడ్డువచ్చిన ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. వరంగల్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన ఏపీ 36 జెడ్ 146 నెంబర్ బస్సుపై విజయవాడ సమీపంలో కొంతమంది వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. అడ్డువచ్చిన డ్రైవర్, కండక్టర్‌ను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం రాత్రి విజయవాడ సమీపంలోని భవానీనగర్‌లో చోటుచేసుకుంది. కండక్టర్ కృష్ణయ్య ‘టీ మీడియా’కు ఫోన్‌లో వివరాలు తెలిపారు. తొర్రూరు డిపో నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుపతికి బస్సు బయల్దేరింది. విజయవాడ మరో మూడు కిలోమీటర్లు ఉందనగా.. భవానీపురం వద్ద ఏపీ 16 బీసీ 8177 వాహనంలో వచ్చిన ఐదుగురు, ద్విచక్షికవాహనంపై వచ్చిన మరో ఇద్దరు కలిసి తమ వెంట తెచ్చుకున్న కర్రలు, బస్సులోని రాడ్లను తీసుకొని డ్రైవర్ జనార్దన్, కండక్టర్ కృష్ణయ్యలపై దాడి చేశారు.

అడ్డువచ్చిన ప్రయాణికులపై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులు విపరీతంగా మద్యం తాగి ఉండటం, క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఎవరూ అడ్డుకోలేకపోయారు. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. కొద్దిదూరం వెళ్లాక స్థానికులకు విషయం చెప్పి.. పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విజయవాడ వన్‌టౌన్ సీఐ ఘటనాస్థలికి చేరుకుని బస్సును స్టేషన్‌కు తరలించి, గాయపడిన కండక్టర్ కృష్ణయ్య, డ్రైవర్ జనార్దన్‌ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


ఘటనకు బాధ్యులైన నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్, కండక్టర్ టీఎంయూకు చెందినవారు కావడం, విజయవాడలో ఘటన జరగడంతో తెలంగాణ వ్యక్తులపై కావాలనే దాడులకు పాల్పడ్డారని తెలుస్తోందని, దీనిపై విచారణ జరపాలని టీఎంయూ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున్, గౌరవాధ్యక్షుడు సోమయ్య, డిపో కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు.

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం?



తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో ఇంకోసారి తేలిపోయింది. పాదయాత్ర
ల్లో వైఎస్‌ఆర్ పార్టీ తెలంగాణ పట్ల ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో కూడా తేటతెల్ల మయింది. తెలంగాణలో తిరుగుతూ వాగ్దానాలు చేస్తూ ఓట్లకోసం గాలం వేస్తున్న రాజకీయ పార్టీల అసలు సిసలు రంగులు తేలిపోవడానికి డిసెంబర్ 28, 2012 అఖిలపక్షసమావేశం ఉపయోగపడింది. తెలంగాణ కావాలనుకునే వారికి ఏ పార్టీ అండగా ఉందో తెలుసుకోవడానికి ఈ సమావేశం లో బయటపడిన రాజకీయపార్టీల నిజస్వరూపం ఒక సాధనం. 


తెలంగాణ ఎంపీలు చాలా కష్టపడి సాధించిన చిన్న ముందడుగు డిసెంబర్ 28 అఖిలపక్ష సమావేశం. తెలంగాణ ఇవ్వాలా వద్దా ఒక అభిప్రాయం చెప్పండి అని అడగకుండా, ఇద్దరు రండి అని ఆహ్వానం పంపడం ద్వారా 2009 డిసెంబర్ 9 నాటి కమిట్‌మెంట్ తనకు ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. అన్ని పార్టీలు ఇద్దరు ప్రతినిధులను పంపినప్పడికీ ఒకే అభిప్రాయం చెప్పిన పార్టీలు అయిదు. అందులో మూడు (టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి) తెలంగాణకు స్పష్టంగా అనుకూలత ప్రకటించాయి.సిపిఎం, మజ్లిస్ తెలంగాణకు స్పష్టంగా వ్యతిరేకం కాదు. స్పష్టంగా సమైక్యతకు అనుకూలం కూడా కాదు. ఆ రెండు పార్టీలు విభజనకు అనుకూలం అని వారేచెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండగానే 9 డిసెంబర్ 2009న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రకటనను స్పష్టంగా విడుదల చేసింది. అదే వరసలో అఖిలపక్ష సమావేశం పెట్టానని కేంద్రం ఇటీవలే మరో సారి చెప్పింది. నిజమైనా కాకపోయినా చెప్పిన విషయం అది.

తెలంగాణ ఏర్పాటుకు అనుకూ లం అని రెండు ప్రధాన పార్టీలు ఇదివరకే చెప్పాయి. తెరాసతో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ పొత్తుపెట్టుకోవడం, మానిఫెస్టోలో ఆవిషయం చెప్పడం, కలిసిపోటీ చేయడం దానికి సాక్ష్యాలు. అబద్ధాలు ఆడడమే రాజకీయమైతే దానికి రుజువులు చెప్పి ప్రయోజనం లేదు. ఈ లెక్కన సి పి ఎం, మజ్లిస్ తప్ప ఏపార్టీ కూడా సమైక్య రాష్ట్రానికి అనుకూలమని, తెలంగాణకు ప్రతికూలమని చెప్పలేదు. సిపిఎం సైద్ధాంతికంగా విభజనకు వ్యతిరేకమన్నా కేంద్రం నిర్ణయిస్తే అడ్డుకోబోమనడం ద్వారా షరతుతో కూడిన అంగీకారం తెలిపినట్టే. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని చెప్పినా మజ్లిస్ పార్టీ రాయల-తెలంగాణా ఏర్పాటు చేయాలని అనడం ద్వారా సమైక్యంగా ఉంచడానికి వ్యతిరేకం అని విభజనకు అనుకూలం అని వెల్లడించింది. వైఎస్‌ఆర్ పార్టీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయాధికారం కేంద్రానికి ఉంది కనుక తీసుకొమ్మని చెప్పింది. ఏకాభి
ప్రాయం లేకపోయినా, అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానించినా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం, కొత్త రాష్ట్ర ఏర్పాటు చేయవ చ్చు. కనుక తెలంగాణకు అనుకూలం అనలేకపోయినా సమైక్యతకు వ్యతిరేకం అనలేము. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలు తెలంగాణకు అనుకూలం అనడానికి వారి చరిత్ర, వర్తమానాలలో ఏమాత్రం అనుకూలమైన వాతావరణం లేదు.

కేంద్రంలో రాష్ట్రంలో ఏలుతున్న కాంగ్రెస్ నెలరోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. ఎన్నికలలో ఉపయోగపడుతుందనే అవకాశ వాదం తప్ప ఆ పార్టీకి మరో విధానం కనిపించదు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని వారు నిర్ణయిస్తే అందుకు ఏకాభి
ప్రాయం ఉన్నట్టే. రాజ్యాంగం ఆర్టికిల్ 3 కింద అధికారాన్ని వినియోగించడానికి పూర్తిగా అవకాశం ఉంది. రాజకీయంగా, రాజ్యాంగపరంగా అనుకూల నియమాలు ఉన్నాయి. అయి నా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి విచక్షణకు సంబంధించిన విషయం కనుక ఇవ్వకుండా కూడా పోవచ్చు. ప్రవర్తన, ప్రకటన, పరిస్థితుల ఆధారంగా నిజానిజాలను నిర్ణయించాలి. అయితే బయటకు కనిపించే పరిస్థితులన్నిటి కన్న కనిపించే రాజకీయ అవసరాలతోపాటు, కనిపించని రాజకీయ లక్ష్యాలు, రహస్యంగా ఉండే రాజ్యాంగ వ్యతిరేక, రాజకీయాతీతం, అవకాశవాద పూరితం, సంపద, అధికారం, వ్యాపార ప్రయోజనాలు అనేవే కీలకాంశాలవుతాయి. కనుక ఏ లెక్కలూ నియమా లూ పనిచేయకుండా కేవలం కనపడని అవకాశవాదం ఆధారంగా తీసుకు న్న నిర్ణయాలే పైకి కనిపిస్తాయి.

కనుక చర్చించవలసింది అవకాశ వాదం గురించి. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కాంగ్రెస్‌లో అవకాశ వాదం ఉంది. గెలుపోటముల సమీకరణాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారేగాని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఎవరికీ లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తెలంగాణను వ్యతిరేకించే కోస్తా, సీమ నేతలు కలిసి కట్టుగా ఉన్నా జాతీయస్థాయిలో తెలంగాణ వ్యతిరేకతలేని వారు ఉన్నారు కనుక, తెలంగాణకు న్యాయం చేయాలని అడిగేందుకు, న్యాయం కలిగేందుకు ఏదో ఓ మూల అవకాశం ఉంది. ప్రాంతీయ అవకాశవాద పార్టీలో ఆ ఆశలు ఉండవు.

టీడీపీ మరో అవకాశ వాద పార్టీ. కోస్తా, సీమ నాయకుల ఆధిపత్యం ఉన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడానికి తెలంగాణకు ఏ కారణాలున్నాయో టీడీపీలోంచి బయటపడడానికి తెలంగాణ నాయకులకు కూడా ఆ పార్టీలో అవే కారణాలు ఉన్నాయి. పదవులపై కోరిక వల్ల బయటకు రారు. అవేవీ మిగలవన్నప్పుడు వస్తారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం నా బాధ్యత అన్న చంద్రబాబు మాట ఒక్కటే నిజం. మిగతా మాటలన్నీ ఆ ఇరుసుమీద ఆధారపడినవి మాత్రమే. తెలంగాణ విడిరాష్ట్రం అనే సమస్య టీడీపీకి లేనే లేదు. విడి రాష్ట్రం కాకుండా తెలంగాణ అనే పేరు, అంశం కూడా ఆ పార్టీకి ప్రాధాన్య తా క్రమంలో ఎక్కడ ఉందో వారు చెప్పలేరు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కోస్తాంధ్ర టీడీపీ నేతల వ్యతిరేకత స్పష్టం. బాబు సీల్డ్ కవర్‌లో లేఖను కోస్తాంధ్ర నేత యనమల రామకృష్ణుడు ద్వారా ఇప్పించారు. తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి ద్వారా రెండో స్థాయి బాధ్యతగా మౌఖిక సందేశం ఇప్పించారు. ఆ రహస్యాన్ని వీలైనంత కాలం దాచిపెట్టారు. ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం గురించి తప్ప అనేక విషయాలు ఉటంకించారు. రాజకీయ అస్థిరత, భారీ అవినీతి, అసమర్థ సర్కారు, భిన్న రంగాలలో రాష్ట్రం దెబ్బతినడం, ప్రగతి వెనకపడడం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి దారుణంగా ఉండడం, అద్భుతమైన ఆర్థిక ప్రగతితో అలరారే రాష్ట్రాన్ని కాంగ్రెస్ వారు పతనం చేయించడం, పేదలకు ఉపాధి లేకుండా పోవడం, వగైరా గొప్పగొప్పవిషయాలు ప్రస్తావించారు. తాను 18.10.2008 నాటి లేఖను ఉటంకిస్తూ ప్రధానికి 26.9.2012 నాడు రాసిన లేఖను మళ్లీ ఉటంకించడం గురించి రాసారు. మేం 18.10.2008 నాటి మాటకు కట్టుబడి ఉన్నాం.

ఆ లేఖను వాపస్ తీసుకోలేదు అంటూ మీరో నిర్ణయం తీసుకొని అస్థిరతను దూరం చేయండి అని రాశారు. 28 అక్టోబర్ 2008 నాటి లేఖకు ఆధారం టీడీపీ కోర్ కమిటీ తీర్మానం. ఈ లేఖలో అంతకుముందు రాసిన లేఖగురించి చెప్పారు. తెదేపా కోర్ కమిటీ చాలా సమగ్రంగా చర్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానించిందని, ఆ తీర్మానం ప్రతిని జతచేసామని రాశారు. ఇది టీఆర్ ఎస్ 2009 ఎన్నికల్లో పొత్తు కోసం షరతు విధించడం వల్ల తెలుగుదేశం ప్రణబ్ ముఖర్జీకి తెదేపా నేత విధిలేక రాసిన ఉత్తరం. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఎటూ తేలని అయోమయం ఉంది. ఈ లేఖలోనిది తెలంగాణ పట్ల తెదేపా చేసిన తొలి సానుకూల ప్రకటన.

రెండోది 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఆతరువాత 2009 డిసెంబర్ 8న అసెంబ్లీలో మీరు తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తాం. మీకు ధైర్యం ఉందా అని స్వయంగా తెదేపా అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. తమ పార్టీలోని కోస్తాంధ్రులు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా తెదేపా ఎందుకు ప్రకటన చేసింది? తెలంగాణకు అనుకూలంగా ఉంటే కోస్తాలో తుడిచిపెట్టుకు పోతామేమోననే భయం తనకు ఉన్నట్టే కాంగ్రెస్ కు కూడా ఉందని కనుక తెలంగాణ ఇవ్వబోదనే నమ్మకంతో ఇచ్చింది. కాని టీడీపీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ కు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం, కేసిఆర్ నిరశన విరమించడం జరిగింది.

కన్నడరాష్ట్రానికి చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన మరొకరు కలిసి ఆంధ్రకు ద్రోహం చేసారని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రణబ్‌కు రాసిన లేఖలో, పొత్తు ద్వారా, మానిఫెస్టోలో, డిసెంబర్ 7, 8 ప్రకటనల ద్వారా చేసిన అయిదు కమిట్‌మెంట్‌లను కాలరాసిన ఘనత టీడీపీది. ఉత్తుత్తి రాజీనామాల వ్యూహాన్ని రచించి, కోస్తాంధ్ర కాంగీయుల తో చేతులు కలిపి, తెలంగాణ వ్యతిరేకతకు మనసా కర్మణా కట్టుబడి పకటనలు వేరే రకంగా ఉన్నాయి కనుక వాచా అనలేము) వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణాను ఆపిన ఘనత వారిదని తెరాస అధ్యక్షుడు విమర్శించడంలో అతిశయోక్తి లేదు.

త్రికరణ శుద్ధిలో ద్వికరణ శుద్ధిని రద్దు చేసుకుని రెండు వైపుల చూసే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తెదేపా పాతిపట్టిన ఆ 18.10.2008 నాటి కమిట్‌మెంట్ ను, ఆ పొత్తు కమిట్‌మెంట్‌ను, ఆ డిసెంబర్ 7, 8 నాటి కమిట్‌మెంట్‌లను వదిలేయడం వల్లనే వచ్చే తెలంగాణ రాష్ట్రం రాకుండాపోయిందని కళ్లు తెరిచి ఉన్న సగటుమనిషి ఎవరికైనా అర్థం అవుతుంది. తాను ఇవ్వలేకపోయినా వచ్చిన రాష్ట్రాన్ని ఆపడానికి గాను వదిలేసిన ఉత్తరాన్ని, నీళ్లొదిలిన పాత పనికి రాని ఉత్తరాన్ని, వాపస్ తీసుకోకపోయినా నిర్వీర్యం చేసిన ఉత్తరాన్ని, ఆ ఉత్తరంలో చెప్పిన పాత కమిట్‌మెంట్‌ను పాటిస్తానని ధైర్యంగా చెప్పలేక రహస్యంగా సీల్డ్ కవర్ లో పెట్టి తెలంగాణ వ్యతిరేక నాయకుడి ద్వారా ఇప్పించిన పార్టీకి కమిట్ మెంట్ అంటే ఏమిటో తెలుసా? యనమల స్పీకర్‌గా ఉన్నపుడు తెలంగాణ ప్రతిని ధి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి మాట్లాడితే ఆ పదం వద్దని దాని బదులు వెనుకబడిన ప్రాంతం అనాలని పట్టుబట్టి రికార్డు నుంచి తొలగించాలని సూచించిన సభానాయకుడు చంద్రబాబు,

ఆయన ఆదేశం పాటించిన సభాపతి యనమల గార్లే, పాత లేఖలో ఉన్నదే మా కొత్త కమిట్‌మెంట్ అని చెప్పడం ఒక ఎత్తయితే, 2008 నాటి ప్రభుత్వం ఇప్పుడు లేదు కనుక ఆనాడు ప్రణబ్‌కు ఇచ్చిన లేఖ చెల్లదని చెప్పి తెలంగాణా వ్యతిరేకతను పదేపదే చాటిన యనమల తన మాట తానే దిగమింగి, ఆ పాత లేఖనే ప్రాణం ఉన్న లేఖ అంటూ హోంమంవూతికి కొత్తగా ఇవ్వడం మరొక ఎత్తు. 2008లో ప్రభుత్వం ఇప్పడి ప్రభుత్వం వేరయితే లేని ప్రభుత్వానికిచ్చిన చెల్లని ఉత్తరాన్ని ఇప్పడి ప్రభుత్వానికి ఇచ్చిన పార్టీ, ఏ కమిట్ మెంట్‌ను పూర్తిగా వదిలేసిందో అదే కమిట్‌మెంట్ చాలని కొత్తగా ఏమీ చెప్పబోమని చెప్పిన పార్టీ కమిట్‌మెంటును ఎవరు ఎందుకు నమ్మాల్నో ఎవరైనా చెప్పగలరా?


కొత్తగా ఇచ్చిన ఉత్తరంలో ఏవో సమస్యలు చెప్పిన టీడీపీ తెలంగాణ అంశం అని హోం మంత్రి లేఖలో భాగంగా ఉటంకించి ఇంకెక్కడా తెలంగాణ రాష్ట్రం అన్న మాట కూడా అనని టీడీపీ, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రె స్ సిధ్ధంగా లేదని తెలిసిన తరువాత ఉండీ లేనట్టు రాసీ రాయనట్టు రాసిన ఓ లేఖ ఆధారంగా తెలంగాణ ప్రజల్ని మభ్య పెడుతున్నట్టే, తాను తెలంగాణకు అనుకూలం అన్నది లేఖ వరసే మాటవరసే కాని పనివరస కాదని కోస్తాంవూధులకు రహస్యంగా హామీలు ఇవ్వలేదా, ఆ అస్పష్టతను కోస్తాలో వాడుకోరా? పాదయాత్ర సందర్భంగా ఒక బోనం కుండను ఎత్తి జైతెలంగాణ అని రాసి ఉన్నందుకు దించేసి జై తెలుగుదేశం అని రాసిన బోనంను ఎత్తుకున్న చంద్రబాబుకు తెలంగాణ కన్నా టీడీపీ ఎక్కువ అని రెండు కళ్లలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర లేవని, ఒక కంట్లో కోస్తాంధ్ర మరోకంట్లో తెలుగుదేశం ఉన్నాయని తెలంగాణ ఎక్కడా లేదని తెలంగాణ ప్రజ లు ఎందుకుభావించకూడదు? 2008న ఇచ్చిన మాటను డిసెంబర్ 10, 2009న తప్పడానికి యూ టర్న్ తీసుకున్న తెదేపా, డిసెంబర్ 27న తెలంగాణా గడ్డ (కరీంనగర్ పొత్కపల్లి) మీదనుంచి రాసిన లేఖ ద్వారా మరొక యు టర్న్ తీసుకుని తెలంగాణకు గుండుసున్నా పూర్తి చేసారు. దీన్ని సర్క్యులర్ రెఫన్స్ అంటారు. ప్రతిసారి ఎడమవైపు తిరుగు అని నేత ఒకే మాట చెప్తూ ఉంటాడు, ఆ మాట ప్రకారం ఎడమకే తిరుగుతున్న వ్యక్తి చివరకు మొదలుపెట్టిన చోటికే వస్తాడు. అదీ తెలంగాణకు టీడీపీ ఇచ్చిన నిండుసున్న.

బంగ్లా యుద్ధవిజేత అయిన ఇందిరాగాంధీకి 1971లో మొత్తం దేశం విపరీతమైన మెజారిటీతో ఓట్లు గుమ్మరించి, సీట్లు సంపాదించి పెడితే ఇక్క డి ప్రజలు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను పదకొండు స్థానాల్లో గెలిపించి తెలంగాణ రాష్ట్ర వాంఛను చాటి చెప్పారు. అయినా మోసం చేశారు. మోసం చేయడానికి వీల్లేనంత మెజారిటీతో తెలంగాణలో తెలంగాణ పార్టీని గెలిపించడం.. మిగిలినవారిని మట్టిగరిపించడం ఒక్కటే కాంగ్రెస్ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ అవకాశవాదాలను అంతం చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోసగాళ్లనుంచి రక్షించుకోవలసిన అవసరం ఉన్నది. 
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త