Tuesday, October 9, 2012

నిజాం మంచోడా చెడ్డోడా?

నిజాం మంచోడా చెడ్డోడా?


కొంతమంది నిజాం మంచోడంటరు, కేసీయార్ లాగా. మరికొంతమంది చెడ్దోడంటరు కమ్యూనిస్టుల్లాగా, స్వయం సేవకుల్లాగా!

మంచోడా చెడ్దోడా అని ఆలోచించే ముందు ఒక్క ముచ్చెట చెప్పుకోవాలె. మంచోడు, చేద్దోడు అని మనుషుల్ల ఎవడూ ఉండదు. వాడు చేసిన పనులే మంచి చెడ్డలు నిర్ణయిస్తయి.

మరి నిజాం  అన్ని చెడ్డ పనులే చేసిండా? కొన్ని మంచి పనులు గూడ చేసిండు. దవాఖానాలు కట్టించిండు. కాలేజీలు కట్టిచ్చిండు. దేశంల మొట్ట మొదటి సారి ప్రభుత్వ బస్సు రవాణా ప్రవేశ పెట్టిండు. రైలు మార్గాలు నిర్మించి రైళ్ళు తిప్పిండు. ప్రాజెక్టులు కట్టిచ్చిండు. హైదరాబాదు నగరాన్ని అద్దం లెక్క పెట్టిండు.


ఇక పోతే చెడ్డపనుల గురించి చెప్పుకుందాం. పన్నులు వేసి ప్రజల్ని పీడించిండు. ఉర్దూను బలంగ రుద్దిండు, అణచివేతకు గురి చేసిండు. చివరి రోజులల్ల రజాకార్లను ఉసిగొల్పిండు.

నిజమే, నిజాం కాలంల తెలంగాణా ప్రజలు అష్ట కష్టాలు పడ్డరు. కాని దానికి కారణం ఎవరు? నిజామా? నిజానికి నిజాం పరిపాలించిన నేల ఎంత? హైదరాబాదు దాటితే ఎక్కడ నిజాం ప్రత్యక్ష పాలన సాగింది? మిగతా భూములన్నీ జమీందారులు, జాగీర్దారులు, దొరలూ, దేశముఖుల కిందనే గదా ఉన్నది? నిజాం పదిపైసల వంతు పీడిస్తే వీళ్ళు తొంభై పైసలు పీడించిన్రు. ప్రజల రక్త మాంసాలు పీక్కుతిన్న వీళ్ళు నిజాం కన్నా క్రూరులు. ఒక విధంగా నిజాం ఇలాంటి వారినుండి ప్రజలను రక్షించలేని అసమర్థుడు.

ఇంక పన్నుల విషయానికి వస్తే, ఆ రోజులల్ల పన్నులు వెయ్యని రాజెవ్వడు? హిందూ ముస్లిం, నిజాం, సుల్తాన్ అని లేకుండా ప్రతి ఒక్కడు పన్నులు వసూలు చేసినోడే... బ్రిటిషోడికి కప్పాలు కట్టినోడే. ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి ఒక్కడూ ఆ తానులోని ముక్కే. స్థన్యానికి టాక్సు కట్టిన ట్రావన్కోరు మహారాజు ఏంతో, నిజామూ అంతే.

నిజాం ఉర్దూ రుద్దిండన్నది నిజమే. మరి బ్రిటిషోడు ఏం జేసిండు? ఇంగ్లీషు రుద్దలేదా? ఇప్పుడు ఆంధ్రోడు భాషే కాదు, సంస్కృతీ బలవంతంగా రుద్దడానికి, తెలంగాణా సంస్కృతి నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్త లేడా? ప్రజాస్వామ్యం లనే గిట్ల జరుగుతుంటే, నియంతలాంటి రాజు అదే పని చేస్తే ఆశ్చర్యమేముంది?

నిజాం తిరుగు బాట్లను అణచి వేసిండు. కాని ఇప్పటి ప్రభుత్వాలు ఏంజేస్తున్నయి? తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నయా? ఒక మీటింగు పెట్టుకోవడానికి, ఒక మార్చి చేసుకోవడానికి అనుమతి దొరకని పరిస్థితి. చివరికి బతుకమ్మ ఆడుకోవడానికి కూడా హైకోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకొనే దుస్థితి!


నిజాం రజాకారులను అచ్చోసిన ఆంబోతుల్లెక్క దేశం మీదికి వదులుడు మాత్రం క్షమించరాని నేరం, అది ఎలాంటి పరిస్తితుల్ల చేసినప్పటికీ! కాని ఆ రజాకారులు ఎవరు? వారి పార్టీ MIM ఇప్పుడు సమైక్యరాగం ఆలపించడం యాదృచ్చికమా? కానే కాదు. అలాగే ఆ కాలంల నిజాంకు తొత్తులుగా వుండి ప్రజలను పీడించిన వారి సంతానమైన ఇప్పటి పాలక వర్గం, పైకి తెలంగాణా మంత్రం జపిస్తూ, లోలోన తెలంగాణ ఏర్పాటుకు శల్య సారధ్యం వహించడం కూడా యాదృచ్చికం కాదు.

అందరు రాజుల మంచి పనులను మెచ్చుకోన్నట్టే నిజాం చేసిన పనులనూ మెచ్చుకోవచ్చు. అట్లనే నిజాం లాంటి దుర్మార్గాలు చేసిన అందరు రాజుల్నీ తెగనాడ వలసిందే.

ఈ నాటి తెలంగాణా బిడ్డ, తరతరాల సంఘర్షణల అగ్ని కీలలల్ల చరిపించ బడ్డ బాకు లాటివాడు. వాడికి ఎవడు ఎలాంటోడు అనే విషయంల పూర్తి అవగాహన వుంది.

3 comments:

  1. నిజాం భజనపరులలో విశాలాంధ్రవాదులు కూడా ఉన్నారు. ఈ వార్తను చూస్తె తెలుస్తుంది.

    "హైదరాబాదు నిజాం గవర్నరుగా ఒకే ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్ కు సమర్పించిన మెమొరాండం లో స్పష్ట పరిచింది. ఈ విషయాన్ని ఆంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు సాయంత్రం పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు": గోలుకొండ పత్రిక 20-06-1954

    ReplyDelete
  2. తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం కంటే తెలంగాణా ప్రత్యెక దేశం ఉద్యమం చేస్తే బాగుంటుంది...
    ఎందుకంటే ప్రత్యెక తెలంగాణా వచ్చిన తర్వాత కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం కింద ఆధారపడాలి, ఇదే పోలీసులు , ఇదే రాజ్యంగం, ఇదే చట్టాలు ,...
    తెలంగాణా ఉద్యమం చేసేవాల్లకి ఈ పోలీస్ వ్యవస్థ , భారత రాజ్యంగా వ్యవస్థ పైన నమ్మకం , గౌరవం లేదు కాబట్టి ప్రత్యెక తెలంగాణా దేశం అయితేనే బాగుంటుంది..
    ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం కూడా భారత దేశం లో కలవకుండా ప్రత్యేకంగా వుండేది..కాబటి నిజాం ఆశయాలు నేరవరాలంటే ప్రత్యేక దేశం గానే కరెక్ట్.

    ReplyDelete
    Replies
    1. @livenews

      చిన్న కరెక్షన్, ప్రత్యేక దేశ ఉద్యమం సమైక్య వాదులు చేయాలి, ప్రత్యేక వాదులు కాదు.

      ప్రత్యేక వాదులు దేశ రాజ్యాంగ సూత్రాలకు లోబడి ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారు. దేశం లోని 38 పార్టీలు అంగీకరించినా, రాష్ట్రంలో ఒక్క CPM తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరించినా, సమైక్య వాదులు రాజ్యాంగ విరుద్ధమైన సూటూకేసు పోరాటాలతో రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నారు. అటువంటి అవినీతి సూట్‌కేస్ సామ్రాట్టులు ఇప్పటికే చాలామంది చంచల్‌గూడాలో వున్నారు, మిగతా వారూ వెళ్ళే సమయం దగ్గరకొచ్చింది.

      సమైక్యవాదుల దురదృష్టమో, మిగతా వారి అదృష్టమో కాని, మన రాజ్యాంగం ప్రాంతీయ దోపిడీతో సహా ఎటువంటి దోపిడీకి అంగీకరించదు. అటువంటి సెటప్ కావల్సిన వారు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవలసిందే. కాని, వారి సంఖ్య కొన్ని డజన్లకు మించి లేక పొవడం వల్ల అది సాధ్యమయ్యే అవకాశం లేదు.

      Delete