Tuesday, September 3, 2013

హైదరాబాదును UT చెయ్యాలెనట



చిరంజీవి, మరికొంతమంది నాయకులు హైదరాబాదును UT చేయాలనే వాదన మొదలు పెట్టిన్రు. పైకి చెప్పక పోయినా సమైక్య నినాదం తీసుకొన్న ప్రతి ఒక్కరిదీ ఇదే ఆలోచన. అట్ల కాకపొతే సమైక్యత గురించి ఆలోచించే వారు తెలంగాణా వారి అభిప్రాయాలను విసుమంత అయినా గౌరవ మిస్తరు.

హైదరాబాదు UT గా మారితే వాళ్ళు చెపుతున్న సమస్యలు... నీటి సమస్య, కరెంటు సమస్య, ఉద్యోగాల సమస్య ఎట్ల పరిష్కార మైతయో మాత్రం చెప్పరు. హైదరాబాదును UT చెయ్యాలె అనే డిమాండు లోనే ఈ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నరో అర్థమైతది. 

మొదటినుండి తెలంగాణా వాదులు చెపుతున్నట్టుగా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టిన బడా సీమాంధ్ర క్యాపిటలిస్టులకు తప్ప ఇంకెవరికీ ఈ ఉద్యమంతో పనిలేదు. సీమాంధ్ర వారికంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఎన్నో కంపెనీలు హైదరాబాదులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, IBM, విప్రో, ఇన్ఫోసిస్ కొన్ని ఉదాహరణలు మాత్రమే.  వారికెవరికీ ఈ విభజనపై భయాందోళనలు లేవు.

కారణాలు సుస్పష్టం. పైన చెప్పిన కంపెనీలు ఎవరి భూములు అప్పనంగా కబ్జా చేయలేదు. ఫైళ్ళలో ఒకటి రాసుకొని ప్రభుత్వ జాగాలు కేటాయించుకొని తప్పుడు వ్యాపారాలు చేయడం లేదు. ఫాక్షనిస్తులను ఉసిగొల్పి అక్రమంగా భూములు ఆక్రమించలేదు. కాని ఇవన్నీ చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం తెలంగాణా పేరు వినగానే గుండెల్లో గుబులు మొదలైతుంది. 

అందుకే ఇక విభజన ఎటూ తప్పదని తెలిసిన తర్వాత నీళ్ళు, ఉద్యోగాలు, వాళ్ళు చెప్పే మిగతా సవాలక్ష కారణాలు అట్లనే ఉన్నా సరే, హైదరాబాదు UT అయితే చాలు అన్న కాళ్ళబేరానికి వస్తున్నరు. 

వాళ్ళ అత్యాశ అటువంటి డిమాండ్లు చేస్తందుకు ఉసిగొల్పు తుండొచ్చు. కాని మూసుకున్న వాళ్ళ కండ్లకు అది అత్యంత అప్రజాస్వామిక డిమాండు అన్నది అర్థం కాదు. ప్రపంచం నియంతృత్వం ప్రజాస్వామ్యం నుండి ప్రజాస్వామ్యం వైపు నడుస్తది తప్ప, దానికి విరుద్ధంగా కాదు. సమైక్య ఉన్మాదంతో ఆలోచనా శక్తి కోల్పోయిన వారు తప్ప బుద్ధున్న ఎవడూ అటువంటి డిమాండ్లను చెవిన పెట్టడు.  

No comments:

Post a Comment